సీతయ్య మాట చంద్రబాబు వినడు!

  సాధారణంగా సీతయ్య (నందమూరి హరికృష్ణ) ఎవరిమాటా వినడు. అయితే సీతయ్య మాట చంద్రబాబు నాయుడు వినడు. ఎందుకంటే, అదంతే! తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర అసెంబ్లీ స్థానాలకు విడుదల చేసిన ఐదో జాబితాలో కూడా హరికృష్ణకి మొండిచెయ్యే దక్కింది. బావమరిది హరికృష్ణ బెదిరింపులను, అలకలను బావగారు చంద్రబాబు నాయుడు ఎంతమాత్రం పట్టించుకున్నట్టు లేరు. మొదట హిందూపూర్ టిక్కెట్, ఆ తర్వాత కృష్ణాజిల్లా పెనమలూరు టిక్కెట్ కోరుకున్న హరికృష్ణ ఆ రెండు స్థానాలూ తన చేజారిపోవడంతో లేటెస్ట్ గా నూజివీడు స్థానానికి షిఫ్టయ్యాడు. తనకి టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానన్న బెదిరింపులకు భయపడిపోయి చంద్రబాబు తనకి టిక్కెట్ ఇచ్చేస్తాడని హరికృష్ణ అనుకున్నాడు. అయితే హరికృష్ణ అనుకున్నదొకటి.. చంద్రబాబు చేసిందొకటి. నూజివీడు స్థానాన్ని వెంకటేశ్వరరావుకి ఇచ్చేశాడు. దాంతో హరికృష్ణకి పెద్ద షాక్ తగిలింది. ఇప్పుడు మరో స్థానాన్ని ఇవ్వమని అడగటమా.. లేక ఇండిపెండెంట్‌గా బరిలో దిగడమా అనే మీమాంసలో హరికృష్ణ ఉన్నట్టు సమాచారం.

అంతులేని పొత్తుల కధ

  రెండున్నర నెలల క్రితం మొదలయిన తెదేపా-బీజేపీల మధ్య సీట్ల సర్దుబాట్లు, పొత్తుల సస్పెన్స్ సీరియల్, రేపటితో నామినేషన్లు వేసేందుకు గడువు ముగుస్తున్నా కూడా ఇంకా గంటకో ట్విస్టుతో ఉత్కంఠభరితంగా సాగిపోతూనే ఉంది. నిన్నఅర్ధరాత్రి వరకు తెదేపా-బీజేపీ అగ్ర నేతల మధ్య జరిగిన చర్చల్లో సీట్ల సర్దుబాట్లపై ఉభయుల మధ్య ఎటువంటి అంగీకారం కుదరనట్లు సమాచారం. బీజేపీకి ఇచ్చాపురం, నరసారావుపేట, గుంతకల్లు, తాడేపల్లిగూడెం మరియు సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గాలలో బలమయిన అభ్యర్ధులు లేరు గనుక వాటిని తమకు తిరిగి ఇమ్మని, అందుకు ప్రతిగా గోదావరి జిల్లాలో ఒక యంపీ సీటు ఇస్తామని తెదేపా చేసిన ప్రతిపాదనను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకి౦చినట్లు తెలుస్తోంది. ఈవ్యవహారం ఎంతకూ ముగిసేలా కనబడకపోవడంతో, బీజేపీకి కేటాయించిన సీట్లలో తెదేపా తన అభ్యర్ధులను నిలబెట్టేందుకు సిద్దమవుతోంది. అదేవిధంగా బీజేపీ కూడా ఒకవైపు తెదేపాతో చర్చలు సాగిస్తూనే సీమాంధ్రలో మొత్తం అన్ని స్థానాలలో తన అభ్యర్ధులను పోటీలో నిలబెట్టేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.   ఇక సందట్లో సడేమియా అన్నట్లుగా పొట్లూరి వరప్రసాద్ ఇప్పుడు బీజేపీ చుట్టూ ప్రదక్షిణాలు ప్రారంభించినట్లు సమాచారం. బీజేపీ కూడా ఆయనను విజయవాడ నుండి పోటీకి దింపేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇక రెండు పార్టీలు పొత్తులు రద్దు చేసుకొంటున్నట్లు అధికారికంగా ప్రకటించడమే మిగిలుంది. సీమాంద్రాలో పొత్తులు రద్దు చేసుకొని తెలంగాణాలో కొనసాగడం కష్టం గనుక బహుశః అక్కడ కూడా రద్దయిపోవచ్చును.

తెలుగుదేశం సీమాంధ్ర ఐదో జాబితా

  తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయబోయే తన అభ్యర్థుల ఐదో జాబితా విడుదల చేసింది. 23 మంది అభ్యర్థుల జాబితా ఇలా వుంది.. కురుపాం- జనార్ధన్ థాట్రాజ్, చీపురుపల్లి- కిమిడి మణాళిని, ఆనపర్తి- రామకృష్ణారెడ్డి, కొవ్వూరు- జవహర్, రాజోలు- సూర్యారావు, పాలకొల్లు- నిమ్మల రామానాయుడు, ఉండి- శివరామరాజు, నరసాపురం- బండారు మాధవనాయుడు, చింతలపూడి- పీతల సుజాత, నూజివీడు- వెంకటేశ్వరరావు, విజయవాడ ఈస్ట్- గద్దె రామ్మోహనరావు, మంగళగిరి- తులసి రామచంద్రప్రభు, ప్రత్తిపాడు- రావెల కిషోర్‌బాబు, గుంటూరు ఈస్ట్- మద్దాల గిరి, మాచర్ల- బొనబోయిన శ్రీనివాస్ యాదవ్, గిద్దలూరు- అన్నె రాంబాబు, కొండపి- డా.డోల శ్రీబాల వీరాంజనేయస్వామి, గూడురు- డా.బాతుల జ్యోత్స్నలత, సూళ్లూరుపేట- పరస వెంకటరత్నం, ప్రొద్దుటూరు- వరదరాజులు రెడ్డి, పీలేరు- ఎమ్.డి. ఇక్బాల్, తిరుపతి- వెంకటరమణ, సత్యవేడు- తల్లారి ఆదిత్య.

కేటీఆర్ ఆనారోగ్యం : టీఆర్ఎస్‌లో ఆందోళన

  తెరాస అధినేత కేసీఆర్ తనయుడు కేటీఆర్ తరచుగా అనారోగ్యంపాలు అవుతూ వుండటం పట్ల టీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో వున్నారు. గురువారం ప్రచారంలో వున్న ఆయనకి అకస్మాత్తుగాకడుపునొప్పి రావడంతో బాగా ఇబ్బందిపడ్డారు. ఆయన కడుపునొప్పితో బాధపడుతున్న విషయాన్ని గమనించిన టీఆర్ఎస్ నాయకులు ఆయన్ని వెంటనే సిరిసిల్లలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆయన్ని పరిశీలించిన వైద్యులు కేటీఆర్‌ని తక్షణం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్తే మంచిదని సూచించారు. అంతలోనే కేటీఆర్ కడుపునొప్పి తగ్గుముఖం పట్టడంతో హైదరాబాద్‌కి బయలుదేరలేదు. ప్రస్తుతం ఆయన సిరిసిల్లలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అలాగే ఒక పదిహేను రోజుల క్రితం కేటీఆర్‌కి హైదరాబాద్‌లో వుండగా అర్థరాత్రి సమయంలో భారీగా కడుపునొప్పి వచ్చింది. దాంతో ఆయన్ని హుటాహుటిగా ఆస్పత్రికి తీసుకెళ్ళి చికిత్స చేయించారు. ఆ తర్వాత కొన్నిరోజులు ఆయన బయట కనిపించలేదు. ఇప్పుడు మరోసారి ఆయనకు భారీగా కడుపునొప్పి వచ్చింది. కేటీఆర్‌కి ఇలా చీటికిమాటికి కడుపునొప్పి వస్తూ వుండటం పట్ల టీఆర్‌ఎస్ వర్గాలు ఆందోళనపడుతున్నాయి.

కాంగ్రెస్‌లోనూ చిరంజీవి టిక్కెట్ల బిజినెస్?

      పీఆర్పీ స్థాపించిన సమయంలో భారీగా టిక్కెట్లు అమ్ముకున్న చిరంజీవి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా తన టిక్కెట్ల బిజినెస్ కంటిన్యూ చేస్తున్నారా? ఈ ప్రశ్నకి అవును అని సమాధానం చెబుతున్నారు సీమాంధ్రకి చెందిన కాంగ్రెస్ నాయకుడు నంబూరు శ్రీను. కృష్ణా జిల్లా తిరువూరులో కాంగ్రెస్ పార్టీ రెబల్‌గా నామినేషన్ దాఖలు చేసిన నంబూరు శ్రీను చిరంజీవి మీద ఈ ఆరోపణలు చేశారు.   గతంలో పీఆర్పీ నుంచి టిక్కెట్ ఇస్తానని నమ్మించిన చిరంజీవి హైదరాబాద్‌లో తనకున్న రెండున్నర ఎకరాలనుపార్టీ ఆఫీసు నిర్మాణం కోసం రాయించుకున్నారని నంబూరు శ్రీను ఆరోపిస్తూ ఆ లావాదేవీకి సంబంధించిన దస్తావేజుల కాపీ కూడా చూపించారు. అయితే రెండున్నర ఎకరాలు రాయించుకున్నా తనకు తిరువూరు నుంచి పార్టీ టిక్కెట్ ఇవ్వలేదని ఆయన చెప్పారు. అయితే తన భూమి తనకి ఇవ్వాలని చిరంజీవిని అడిగితే, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి తిరువూరు టిక్కెట్ ఇస్తానని చెప్పారని, ఇప్పుడు కూడా మోసం చేస్తూ తనకు టిక్కెట్ ఇవ్వలేదని ఆయన చెప్పారు. అందుకే తాను తిరువూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ రెబల్‌గా రంగంలోకి దిగానని ఆయన చెప్పారు.  తన భూమి విషయంలో త్వరలో చిరంజీవిని కోర్టుకు లాగనున్నట్టు నంబూరు శ్రీను వెల్లడించారు.

తెదేపాకు పొట్లూరి కొత్త ప్రతిపాదన

  విజయవాడ నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీలో దిగాలని భావిస్తున్న పొట్లూరి వరప్రసాద్, తెదేపా-బీజేపీల పొత్తులు విచ్చినం అయ్యే పరిస్థితిని చూసి, ఇదే అదునుగా తెదేపా అధిష్టానం ముందు ఉభయులకు ఆమోదయోగ్యమయిన ఒక సరికొత్త ప్రతిపాదన పెట్టారు.విజయవాడ నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీలో దిగాలని భావిస్తున్న పొట్లూరి వరప్రసాద్, తెదేపా-బీజేపీల పొత్తులు విచ్చినం అయ్యే పరిస్థితిని చూసి, ఇదే అదునుగా తెదేపా అధిష్టానం ముందు ఉభయులకు ఆమోదయోగ్యమయిన ఒక సరికొత్త ప్రతిపాదన పెట్టారు. ఒకవేళ ఆ రెండు పార్టీల మధ్య పొత్తులు విచ్చినమయినట్లయితే, తనకు టికెట్ ఇస్తే విశాఖ లోక్ సభ స్థానం నుండి వైకాపా అభ్యర్ధి విజయ లక్ష్మిపై పోటీ చేసేందుకు సిద్దమని తెలిపారు. ఆవిధంగా చేస్తే ఆయనను సమర్దిస్తున్న పవన్ కళ్యాణ్ కి తెదేపాకు మధ్య ఎటువంటి అభిప్రాయభేదాలు రాకుండా నివారించవచ్చు, కాని ఆ అవకాశమే ఉంటే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తానే వైజాగ్ నుండి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు కనుక ఈసారి కూడా పొట్లూరి కల నెరవేరేలా లేదు.

తెదేపా-బీజేపీ పొత్తులకు అంతిమ క్షణాలు

  తెదేపా-బీజేపీ పొత్తులు నామినేషన్లకు ముందే ముగిసిపోయేలా ఉన్నాయి. బీజేపీకి కేటాయించిన స్థానాలలో చాల బలహీనమయిన అభ్యర్ధులను నిలబెట్టినందుకు చంద్రబాబు కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. నామినేషన్లు వేయడానికి ఇంకా రెండు రోజులు గడువు ఉంది గనుక, ఈలోగా మరొకసారి సర్వే చేయించుకొని, తగిన అభ్యర్ధులను పోటీలో నిలబెట్టమని ఆయన బీజేపీ అధిష్టానానికి సూచించినట్లు సమాచారం. ఒకవేళ బీజేపీ సానుకూలంగా స్పందించకపోయినట్లయితే, ఆపార్టీకి కేటాయించిన అన్ని స్థానాలలో తమ అభ్యర్ధుల చేత నామినేషన్లు వేయించేందుకు కసరత్తు కూడా ఆరంభించారు.   మొదట విశాఖ నుండి తెదేపా తరపున లోక్ సభకు పోటీ చేయాలనుకొన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, బీజేపీతో పొత్తుల కారణంగా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి నామినేషన్ వేయవలసి వచ్చింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకవేళ బీజేపీతో పొత్తులు తెగతెంపులయ్యే పక్షంలో తనను మళ్ళీ విశాఖ నుండి లోక్ సభకు పోటీ చేసేందుకు సిద్దంగా ఉండమని అధిష్టానం నుండి కబురు వచ్చిందని చెప్పడం చూస్తే, తెదేపా తెగతెంపులకే సిద్దం అవుతున్నట్లు స్పష్టమవుతోంది. అదేవిధంగా నరసాపురం నుండి బీజేపీ తరపున లోక్ సభకు పోటీ చేద్దామనుకొన్న బీజేపీ నేత ఈరోజు ఉదయమే చంద్రబాబుని కలిసి, ఒకవేళ పొత్తులు తెంచుకొన్నట్లయితే తాను తెదేపా టికెట్ పై నరసాపురం నుండి పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నానని తెలియజేసారు.   కానీ, ఈవిషయమే చర్చించదానికి నేడు డిల్లీ నుండి హైదరాబాద్ కు వచ్చిన బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ, తెదేపా-బీజేపీల బంధం చాల బలమయినదని, చిన్న చిన్న సమస్యలకు అది విచ్చినమయిపోయెంత బలహీనమయినది కాదని, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రెండు పార్టీలు కలిసి ముందుకు సాగుతాయని అన్నారు. ఆ పార్టీ నేత వెంకయ్య నాయుడు కూడా ఇంచుమించు అదే అభిప్రాయం వ్యక్తం చేసారు. అయితే ఈరోజు సాయంత్రంలోగా బీజేపీ తన అభ్యర్ధులను మార్చడమో, లేక తెదేపా సూచించిన వారికే టికెట్స్ కేటాయించడమో చేయవచ్చని ఇరు పార్టీలలో కొందరు నేతలు భావిస్తున్నారు. ఒకవేళ సీమాంద్రాలో పొత్తులు పెటాకులయితే, ఇదే అదునుగా తెలంగాణాలో తెదేపాతో పొత్తులు తెంచుకోవాలని తెలంగాణా బీజేపీ నేతలు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు.

దరిద్రం పట్టిన సీమాంధ్ర కాంగ్రెస్!

      సీమాంధ్ర కాంగ్రెస్ దరిద్రంలో మునిగిపోయినట్టుంది. ఎంత దరిద్రంలో మునిగిపోయిందీ అంటే, సీమాంధ్రలో ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ ఎన్నికల ఖర్చు నిమిత్తంపైసా కూడా ఇవ్వదట. చచ్చినట్టు ఎవరి ఖర్చువాళ్ళే పెట్టుకోవాలట. ఈ విషయం చెప్పిందెవరో కాదు.. సీమాంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి.   సీమాంధ్రలో ఐదోతనం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ నిండు ముత్తయిదువగా చూడాలని తపిస్తున్న రఘువీరారెడ్డి మాటల్లోనే తప్ప చేతల్లో అలాంటి ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు కనిపించడంలేదు. ఒకవేళ ప్రయత్నాలు చేసినా వేస్టని తెలిసే ఊరుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా సీమాంధ్ర అభ్యర్థులకు ఎన్నిక ఖర్చు పైసా కూడా పార్టీ చెల్లించదని చెప్పడం దీనికి ఒక ఉదాహరణగా భావించవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సీమాంధ్రలో ఎన్ని తంటాలు పడినా, ఎంత ఖర్చుపెట్టినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో పెట్టే ఖర్చుకూడా దండగఅనే నిర్ణయానికి సీమాంధ్ర కాంగ్రెస్ వచ్చినట్టుంది.

గూగుల్ సెర్చ్... పవన్ కళ్యాణ్ టాప్!

      ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్‌ సంస్థ ప్రస్తుత భారతీయ ఎన్నికలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వున్న సెలబ్రిటీల్లో అత్యంత ప్రభావవంతులైన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలో ఉన్నారని చెప్పింది. పవన్ కళ్యాణ్ తర్వాత సినీ నటి రమ్య, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కుమర్ శ్వాస్ ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు.   ఈ ఎన్నికల్లో చాలా మంది సెలబ్రిటీలు వివిధ పార్టీల నుంచి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. భారత ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవితవ్యాన్ని నిర్ణయించటంలో ఈసారి పలువురు సినీ స్టార్లు కీలకమైన పాత్రను పోషిస్తున్నారడంలో ఎలాంటి సందేహం లేదు. పలువురు సినిమా స్టార్లు రాజకీయ పార్టీల నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఆ పార్టీలకు విజయాన్ని అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని గూగుల్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. తెలుగు సినిమా స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలలో ఫలితాలను శాశించగలిగే స్థాయిలో వున్నారని పేర్కొంది.

చంద్రబాబు చెవిలో హరికృష్ణ జోరీగ!

      ఈ ఎన్నికలలో కనీసం సీమాంధ్రలో అయినా ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కాలని, ఢిల్లీలో చక్రం తిప్పాలని నానా తంటాలూ పడుతున్న చంద్రబాబు అనేక ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్నారు. ఉన్న ఒత్తిళ్ళు చాలవన్నట్టు బావమరిది హరికృష్ణ నుంచి వస్తున్న బెదిరింపులు ఆయనకి చిరాకు పుట్టిస్తున్నాయి. హరికృష్ణ వల్ల పార్టీకి దమ్మిడీ ఉపయోగం లేకపోయినా ఆయన్ని ఇంతకాలం పార్టీ భరిస్తూ వస్తోంది.   ఎన్టీఆర్ నుంచి అధికార బదలాయింపు (దీనిని గిట్టనివాళ్ళు వెన్నుపోటు అంటూ వుంటారు) సమయంలో చంద్రబాబుకు హరికృష్ణ అండగా నిలిచినందుకు ఆయన దానికి తగిన ప్రతిఫలం అప్పుడే రవాణా శాఖ మంత్రి రూపంలో పొందారు. ఆ తర్వాత చాలాసార్లు బావకి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేస్తూ హరికృష్ణ ఏదో ఒక పదవి పొందుతూనే వున్నారు. తనను మాత్రమే కాకుండా తన కొడుకు జూనియర్ ఎన్టీఆర్ని కూడా గౌరవించాలని, తాము చెప్పిన లిస్టుకి టిక్కెట్లు ఇవ్వాలని... ఇలా రకరకాల డిమాండ్లతో విసిగిస్తున్న హరికృష్ణని చంద్రబాబు పట్టించుకోవడం మానేశాడు. అయినా హరికృష్ణ ఏదో ఒక సాకు చెప్పి చంద్రబాబుని విసిగించడానికి ప్రయత్నిస్తూనే వున్నాడు. చంద్రబాబుని సాధించడంలో భాగంగా సమైక్యాంధ్ర ఉద్యమం ముసుగు వేసి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినా చంద్రబాబు నుంచి స్పందన లేకపోవడంతో హరికృష్ణ అల్లాడిపోతున్నాడు. ఇప్పుడు ఎన్నికలు రావడంతో హరికృష్ణ మరోసారి రంగంలోకి దిగారు. తాను ఏదైనా అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వమంటూ చెవిలో ఇల్లు కట్టుకుని పోరినా చంద్రబాబు పట్టించుకోవడం లేదని హరికృష్ణ తన ఆక్రోశం వెళ్ళగక్కుతున్నాడు. ఎక్కడి టిక్కెట్ ఇచ్చినా హరికృష్ణ పొరపాటున కూడా గెలవడన్న ఉద్దేశంలో వున్న చంద్రబాబు హరికృష్ణ డిమాండ్‌ని ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. అయినా వెనుకడుగు వేయని హరికృష్ణ తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతూనే వున్నాడు. తనకి తెలుగుదేశం తరఫున టిక్కెట్ ఇవ్వకపోతే వేరే పార్టీ నుంచి పోటీ చేసి తెలుగుదేశం పరువు తీస్తానని చంద్రబాబును హరికృష్ణ బెదిరిస్తున్నట్టు సమాచారం.  చెప్పులోన రాయి చెవిలోన జోరీగ చాలా ఇబ్బంది పెడతాయి. ప్రస్తుతం చంద్రబాబు విషయంలో హరికృష్ణ కూడా అలాగే వున్నాడు.

పురందేశ్వరి రాజంపేట వెనుక చంద్రబాబు!

      దగ్గుబాటి పురందేశ్వరిని కడప జిల్లా రాజంపేట లోక్‌సభ అభ్యర్థిగా బిజెపి పార్టీ ప్రకటించి౦ది. 2009 ఎన్నికల్లో విశాఖ పట్నం నుంచి ప్రాతినిధ్యం వహించిన పురందేశ్వరి, ఈ ఎన్నికల్లో తిరిగి అదే స్థానం నుంచి టిక్కెట్ కావాలన్న షరతుపైనే బిజెపిలో చేరారు. అయితే విశాఖ లోక్‌సభ సీటు కంభంపాటి హరిబాబుకు దక్కడంతో విజయవాడ లేదా నర్సరావుపేట స్థానాల నుంచైనా పోటీ చేయడానికి సిద్దపడ్డారు. కానీ పురందేశ్వరికి అవికూడా కాకుండా రాజంపేట సీటును బిజెపి కేటాయించింది. అయితే పురందేశ్వరికి ఈ సీటు కేటాయించడం వెనుక టిడిపి అధినేత చంద్రబాబు ప్రభావం తీవ్రంగా వున్నట్లు తెలుస్తోంది.   వాస్తవానికి విశాఖను పురందేశ్వరికి ఇవ్వాలని ఓ దశలో పార్టీ పెద్దలు భావించారు. అయితే, టీడీపీ నేతలు బీజేపీపై ఒత్తిడి తీసుకొచ్చి ఆమెకు విశాఖ దక్కకుండా చేసినట్లు సమాచారం. ఆతరువాత ఆమెకి ఒంగోలు సీటును బీజేపీకి ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది. పురందేశ్వరి కోసమే ఆ సీటును బీజేపీకి కేటాయిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతూ వచ్చాయి. కానీ ఆ సీటును వదులుకోవడానికి టీడీపీ సమ్మతించకపోవడంతో చివరకు బీజేపీకి దక్కిన నాలుగు స్థానాల్లోనే పురందేశ్వరికి సీటు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. ఒంగోలులో కాంగ్రెస్ నుంచి వచ్చిన మాగుంట శ్రీనివాసరెడ్డికి టిడిపి టిక్కెట్ ఇచ్చింది తప్ప, పురందేశ్వరికి మాత్రం అవకాశం కల్పించడానికి ఇష్టపడకపోవడం గమనించదగ్గ విశేషం. మరి విజయావకాశాలు తక్కువగా వుండే రాజంపేట నుంచి పురందేశ్వరి పోటి చేస్తారా? లేదా? అన్నది చూడాలి.

కరీంనగర్‌లో సోనియా ప్రసంగం సారాంశం

      1- కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ ఇచ్చింది. 2- బీజేపీ, తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణకి అడ్డుపడ్డాయి. 3- 60 ఏళ్ళ తెలంగాణ కలను కాంగ్రెస్ పార్టీ నిజం చేసింది. 4- తెలంగాణ బిల్లు విషయంలో టీఆర్ఎస్ పాత్ర ఏమీ లేదు. 5- కాంగ్రెస్ పార్టీకే తెలంగాణ ప్రజలు ఓటు వేయాలి. 6- హైదరాబాద్ ఆదాయం తెలంగాణ ఆదాయం ఇస్తాం. 7- తెలంగాణకి పదేళ్ళు టాక్స్ హాలిడే ఇస్తాం. 8- ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణ ఇచ్చాం. 9- ప్రత్యేక తెలంగాణ పోరాటం ముగిసింది. 10- తెలంగాణ కోసం పోరాడిన ప్రజలకు అభినందనలు 11- సీమాంధ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 12- తెలంగాణ ప్రజలు, సీమాంధ్ర ప్రజలు కలసిమెలసి వుండాలి. 13- టీఆర్ఎస్ కంటే ముందే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించింది. 14- మతతత్వ శక్తులకు మద్దతు ఇవ్వొద్దు.

చెప్పు పట్టుకొంటున్న సినీ నటి హేమ

  ఇంతవరకు తెలుగు సినీ పరిశ్రమ నుండి చాలా మంది నటులు రాజకీయాలలోకి ప్రవేశించారు. ఇప్పుడు వారికి మరో నటి హేమ కోడా తోడవనుంది. ఆమె జై సమైక్యాంధ్ర పార్టీ తరపున మండపేట నియోజకవర్గం నుండి అసెంబ్లీకి పోటీ చేసేందుకు శనివారంనాడు నామినేషన్ వేయబోతున్నారు. ఆ పార్టీ తరపున అమలాపురం నుండి లోక్ సభకు పోటీ చేస్తున్న హర్ష కుమార్, నిన్న బుదవారం నాడు తన నామినేషన్ వేసేందుకు బయలుదేరినప్పుడు ఆ ఊరేగింపులో హేమ కూడా పాల్గొన్నారు. రేపు ఆమె నామినేషన్ వేసేటప్పుడు ఆయన కూడా రావచ్చును.   ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను ఏదో కాలక్షేపం కోసం కాక, నిజంగా ప్రజలకు సేవ చేయాలనే దృడ సంకల్పంతోనే రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నానని అన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిన తీరుతో కడుపు మండి, ఆపార్టీని ఓడించాలనే ఉద్దేశ్యంతోనే తాను రాజకీయాలలోకి వచ్చానని అన్నారు.   కారణాలు ఏవయినా రాజకీయాలలో ప్రవేశించే సినీ నటులు, వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు అందరూ చెప్పినట్లుగానే హేమ కూడా చెపుతున్నారు. అయితే ప్రజాసేవ చేసేందుకే రాజకీయాలలోకి వస్తున్నామని చెప్పుకొనే ఇటువంటి వారందరూ, ఈ సందర్భంగా తమ తమ వృత్తి జీవితాలను పూర్తిగా వదిలిపెడతామని మాత్రం ఎన్నడూ హామీ ఇవ్వబోరు. అందువలన సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉండే ఇటువంటి నటీనటులు చేసే ప్రజాసేవ నేతి బీరకాయలో నెయ్యి వంటిదే.

తెదేపాలో పొట్లూరి ముసలం

  ఈసారి ఎన్నికలలో విజయవాడ నుండి లోక్ సభకు పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న పొట్లూరి వరప్రసాద్, తెదేపా, వైకాపాలు ఆయనకీ టికెట్ నిరాకరించడంతో పవన్ కళ్యాణ్ పంచన చేరి జనసేన పార్టీ స్థాపన కోసం విరివిగా డబ్బు ఖర్చు చేసారు కానీ, అయన కూడా ఈసారి ఎన్నికలలో పోటీ చేయబోమని ప్రకటించడంతో హతాశులయ్యారు. అయితే ఎలాగో ఆయనను ఒప్పించి విజయవాడ నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. అందువలన పొట్లూరి నేడో రేపో ఆయన విజయవాడ నుండి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేయవచ్చును.   పవన్ కళ్యాణ్ తెదేపాకు మద్దతు ప్రకటించి ఈవిధంగా చేస్తుండటం తెదేపా కూడా జీర్ణించుకోలేపోతోంది. ఒకవేళ పొట్లూరి పోటీకి దిగితే, ఆయనకు సన్నిహితుడయిన పవన్ కళ్యాణ్ ఆయన తరపున ప్రచారంలో పాల్గొనవచ్చును. అదే జరిగితే అది పార్టీ అభ్యర్ధి కేశినేని నాని విజయావకాశాలను దెబ్బ తీయవచ్చును గనుక, తెదేపా కూడా ఈ వార్త తెలుసుకొని అప్రమత్తమయింది.   పవన్ కళ్యాణ్ తమ కంటే బీజేపీతోనే ఎక్కువ సన్నిహితంగా మెలుగుతున్నందున, ఆ పార్టీ ద్వారానే ఆయనకు చెప్పించి పొట్లూరిని పోటీ నుండి విరమింపజేయాలని తెదేపా భావిస్తోంది. సందిగ్ధంలో పడిన తెదేపా-బీజేపీ పొత్తుల విషయమై మాట్లాడేందుకు ఈరోజు డిల్లీ నుండి హైదరాబాద్ వస్తున్న బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ తో ఈవిషయాన్ని తెదేపా సీనియర్ నేతలు చర్చించవచ్చును.   అయితే అందుకు బీజేపీ అంగీకరించినా, పవన్ కళ్యాణ్ అంగీకరిస్తారా లేదా అనేది అనుమానమే. ఒకవేళ పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించినా, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ నుండి లోక్ సభకు పోటీ చేయాలని తహతహలాడుతున్న పొట్లూరి వరప్రసాద్ వెనక్కి తగ్గుతారా? అనేది మరొక ప్రశ్న. అంతిమంగా ఈ వ్యవహారంలో ఎవరివో ఒకరివి సంబంధాలు దెబ్బతినడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. అందుకు కారణం ఎన్నికలలో పోటీ చేయాలనే పొట్లూరి పట్టుదలే!   పొట్లూరి ఎన్నికలలో ఏదో ఒక పార్టీ తరపున పోటీ చేయాలనుకోవడంలో తప్పు లేదు, అది నేరమూ కాదు. అయితెహ్ ఆయన పోటీ చేయడం కోసమే పవన్ కళ్యాణ్ పార్టీకి పెట్టుబడి పెట్టడం వ్యాపార లక్షణమే. అయితే ఏ వ్యాపారస్తుడు కూడా తను పెట్టిన పెట్టుబడి నష్టపోవాలనుకోడు గనుకనే ఆయన ఇప్పుడు స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నారు. ఇదే పని ఆయన తెదేపా, వైకాపాలు టికెట్ నిరాకరించిన్నపుడే చేసి ఉండి ఉంటే నేడు ఆయనను ఎవరూ ఈవిధంగా విమర్శించే అవకాశం ఉండేదే కాదు.   అయన ఇప్పుడు స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగుతున్నపటికీ, ఆయనతో పవన్ కళ్యాణ్ కి ఉన్న స్నేహ, (సినీ) వ్యాపార సంబంధాల కారణంగా లేదా ఆయన తన పార్టీ స్థాపనకు భారీగా డబ్బు ఖర్చు చేసినందున ఆయన తరపున ప్రచారం చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడితే అది అందరికీ ఇబ్బందికరమే.

సీమాంధ్ర ఎన్నికల బరిలో ‘జనసేన’

      'జనసేన' తరఫున కొన్ని చోట్ల అభ్యర్థులను బరిలోకి దింపాలని ఆ పార్టీ నిర్ణయించింది. పొట్లూరి వరప్రసాద్‌తోపాటు మరో ఆరుగురిని ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలోకి దింపాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఏడుగురు అభ్యర్థులు పవన్‌తో భేటీ అయి, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం లోగా నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా సమాచారం.   పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇస్తూనే, జనసేన తరఫున స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఏడుగురు అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నారు. మల్కాజ్‌గిరిలోకూడా లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణకు తన మద్దతు ఉండబోతుందని నిన్న బెంగుళూరులో పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే పొట్లూరి ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పేమిటీ, సంవత్సరాలా కొలది జైల్లో ఉన్నవాళ్లు బయటకు వచ్చి పోటీ చేస్తున్నప్పుడు పొట్లూరి ఎందుకు పోటీ చేయకూడదని ఆయన ప్రశ్నించిన విషయం విదితమే. బుధవారం ఉదయం పొట్లూరితో సమా పలువురు జనసేన నేతలు పవన్ కల్యాణ్‌కు కలుసుకుని స్వతంత్ర అభ్యర్థులుగానే ఎన్నికల బరిలోకి దిగుతామని చెప్పినట్లుగా సమాచారం. వారు చెప్పినటువంటి ప్రతిపాధనలన్నింటికి పవన్ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై ఈరోజు పవన్ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.

టిఫిన్ బాక్స్ బాంబుల కలకలం

      ఛత్తీస్‌ఘడ్‌లో మూడు పార్లమెంటు సీట్లకు గురువారం పోలింగ్ జరగనుంది. ఎన్నికల సందర్భంగా కాన్కర్ జిల్లాలో శోధన నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి భారీగా మందుగుండు కూరిన రెండు టిఫిన్ బాక్స్ లు కనిపించాయి. రెండు బాంబులు కలపి పది కిలోల బరువు కలిగి వున్నాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిర్వీర్యం చేశారు.   ఎన్నికల సందర్భంగా విధ్వంసం సృష్టించడానికి మావోయిస్టులు ఈ టిఫిన్ బాక్సు బాంబులను ఏర్పాడు చేశారని పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం ఛత్తీస్‌ఘడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లో కొంతమంది మావోయిస్టులు మరణించారు. దానికి ప్రతీకారంగా మావోయిస్టులు ఈ టిఫిన్ బాక్స్ బాంబులు ఏర్పాటు చేసి వుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. టిఫిన్ బాక్స్ బాంబులు లభించడంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలను ముమ్మరం చేశారు. అనుమానిత వస్తువులు, వ్యక్తుల గురించి సమాచారం ఇవ్వాలని పౌరులకు సూచించారు. టిఫిన్ బాక్స్ బాంబులు పోలీసులకు దొరికాయన్న వార్త ఛత్తీస్‌ఘడ్‌లో సంచలనం సృష్టించింది.

కరీంనగర్ సభలో సోనియాగాంధీ సారీ చెప్పాల్సిందే

      సీమాంధ్రని చావగొట్టి చెవులు మూసి మరీ తెలంగాణ ఇచ్చానని, మీ ఓట్లు మా పార్టీకే వేయండని చెప్పుకోవడాని కరీంనగర్ వస్తున్న సోనియాగాంధీ మీద టీఆర్ఎస్ మాటల దాడి ప్రారంభించింది. తెలంగాణ ఇచ్చామని చెప్పుకోవడానికి ముందు 1200 మంది బలిదానాలకు కారణమైన సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు సారీ చెప్పాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలని నయవంచన చేసిందని, అందువల్లే ఈ ప్రాంత ప్రజలు ఆత్మహత్యలు చేసుకున్నారని కేటీఆర్ విమర్శిస్తున్నాడు. అంచేత కరీంనగర్ సభలో సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు సారీ చెప్పడంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తున్నామని ప్రకటించాలని, పోలవరం డిజైన్ మారుస్తున్నట్టు, ముంపు మండలాలను సీమాంధ్రలో కలిపే ఆర్డినెన్స్ ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించాల్సిందేనని కేటీఆర్ గర్జించాడు.

కాంగ్రెస్‌కి భారమైపోయిన చిరంజీవి!

      పెద్దవాళ్ళు ఏదైనా పని చేస్తుంటే కాళ్ళకి అడ్డం పడే పిల్లలు వుంటారు చూశారా... ప్రస్తుతం సీమాంధ్ర కాంగ్రెస్‌లో చిరంజీవి పరిస్థితి అలాగే వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సీమాంధ్రలో నిండా మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీని చిరంజీవి తన గ్లామర్‌తో పైక తేలుస్తారని కాంగ్రెస్ అధిష్ఠానం భావించింది. అయితే చిరంజీవి నుంచి అలాంటి మేలు కొంత అయినా జరిగిన దాఖలాలు ఇప్పటి వరకూ కనిపించడం లేదు. పార్టీ అంతర్గత మీటింగ్స్ లో ఆవేశంగా మాట్లాడ్డం తప్ప ప్రజలను కాంగ్రెస్ వైపు మళ్ళేలా చిరంజీవి చేయలేకపోతున్నారని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం.   కాంగ్రెస్ పార్టీకి బలంగా వుంటారని చిరంజీవి పార్టీని కాంగ్రెస్ పార్టీ తనలో విలీనం చేసుకుంది. చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంతోపాటు ఆయనతో పాటు పార్టీలో చేరిన ఎమ్మెల్యేలని తగిన రీతిలో గౌరవించింది. అయితే చిరంజీవి వెంట వచ్చిన ఎమ్మెల్యేలలో దాదాపు అందరూ కాంగ్రెస్ పార్టీని  విడిచి వెళ్ళిపోయారు. చిరంజీవి కనీసం వాళ్ళని ఆపే విషయంలో కూడా ఫెయిలైపోయారు. చిరు వర్గం ఎమ్మెల్యేలు పోతే పోయారు చిరంజీవి గ్లామర్ అయినా పార్టీకి ఉపయోగపడుతుందన కాంగ్రెస్ అనుకుంటే, ఆయనగారి మీటింగ్స్ కి జనలే కరువైపోతున్నారు. సరే ఈ విషయంలో కూడా సరిపెట్టుకుందాం. చిరంజీవి పార్టీ అభివృద్ధికి ఏవైనా మంచి సలహాలు ఇస్తారా అంటే, రాజకీయ అనుభవ శూన్యుడైన చిరంజీవి పాలిటిక్స్ ట్రిక్స్ దేనినీ ప్రదర్శించలేకపోతున్నారు. మొత్తమ్మీద సీమాంధ్ర కాంగ్రెస్ ఏర్పాటు చేస్తున్న సమావేశాల్లో పాల్గొని సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ సూపర్‌గా వుందని అనడం తప్ప ఆయన చేస్తున్నదేమీ లేదు. ఇలాంటి చిరంజీవి తమ కాళ్ళకు అడ్డు పడిపోవడం తప్ప పార్టీని బతికించడానికి చేస్తున్న ప్రయత్నాలేవీ లేవని  సీమాంధ్ర కాంగ్రెస్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.  

నాకు టికెట్ ఇవ్వాల్సిందే: హరికృష్ణ

      ఎన్టీఆర్ కుమారుడు, తెలుగుదేశం మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ మరోసారి పార్టీలో హడావిడి సృష్టించడానికి సిద్ధమయ్యారు. హిందూపురం టిక్కెట్ తనకి కేటాయించాలని చంద్రబాబుని ఓ పదిరోజుల క్రితం హరికృష్ణ కోరినప్పటికీ చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందన లేదు. అంతకుముందు కృష్ణాజిల్లాలోని పెనమలూరు స్థానాన్ని కోరినప్పుడు కూడా ఆయన మాటని పట్టించుకునే వారే లేకుండా పోయారు. దాంతో హరికృష్ణ హడావిడి సృష్టించడానికి రంగంలోకి దిగారు. తాను ఏ స్థానం నుంచి టిక్కెట్ అడిగినా ఇవ్వలేదని ఆయన వాపోయారు. తనకు టికెట్ ఇవ్వకపోగా..తాను టికెట్ అడగలేదని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సమైక్యాంధ్ర కోసం తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే పార్టీలో తన త్యాగాన్ని గుర్తించినవారే లేకుండా పోయారని ఆయన బాధపడిపోతున్నారు. హరికృష్ణ వ్యక్తం చేస్తున్న ఈ ఆవేదనని అయినా పట్టించుకునేవారు తెలుగుదేశం పార్టీలో వున్నారో లేరో!