భారత్ నుంచి కేజ్రీవాల్ మాత్రమే ఎంపికయ్యారు..!

  ప్రపంచవ్యాప్తంగా, తమ తమ రంగాల్లో ప్రభావం చూపించిన 50 మంది గ్రేట్ లీడర్స్ జాబితాలో, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చోటు దక్కించుకున్నారు. ఫ్యామస్ మ్యాగజీన్ ఫ్యార్చ్యూన్ రూపొందించిన ఈ జాబితాలో ఇండియా నుంచి కేవలం అరవింద్ కేజ్రీవాల్ కు మాత్రమే చోటు దక్కడం విశేషం. పాశ్చాత్య దేశాల్లో బాగానే ఫ్యామస్ అయిన ప్రధాని మోడికి ఇందుల్లో చోటే దక్కలేదు. ప్రభుత్వ, స్వచ్ఛంద సేవా రంగాల్లో స్ఫూర్తిని కలిగిస్తున్న వారు, విశేషంగా రాణిస్తూ చుట్టూ ఉన్న వారిపై ప్రభావాన్ని చూపిస్తున్న వారిని ఈ సర్వే కోసం ఎంపిక చేసినట్టు ఫార్చ్యూన్ చెబుతోంది. ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో వెబ్ సైట్ కంపెనీ అమెజాన్ సిఇవో జెఫ్ బెజోవ్ అగ్రస్థానంలో నిలిస్తే, కేజ్రీవాల్ 42వ స్థానాన్ని సంపాదించారు. ఇండియాలో అత్యంత కాలుష్యం కలిగిన నగరంగా ఉన్న ఢిల్లీని, అందులోంచి బయట పడేయడానికి, సరి బేసి విధానాన్ని ఎంచుకున్న కేజ్రీవాల్ కాలుష్యాన్ని తగ్గించగలిగారని, అదే ఆయన ఈ లిస్ట్ లో చేరడం వెనుక ప్రధానపాత్ర పోషించిందని ఫార్చ్యూన్ వెల్లడించింది. ఈ లిస్ట్ లో రెండో స్థానంలో జర్మనీ ఛాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్, మూడో స్థానంలో మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీ ఉన్నారు.

రోహిత్ వేముల మృతిపై స్పందించిన కేసీఆర్

  హైదరాబాద్ యూనివర్సిటీల్లో జరుగుతున్న ఘటనలపై తెలంగాణా సిఎం కేసీఆర్ స్పందించారు. ఉస్మానియా, సెంట్రల్ యూనివర్సటీల్లో జరుగుతున్న ఘటనలు బాధాకరమన్నారాయన. ఈరోజు శాసనసభలో ఆయన ఈ ఘటనలపై మాట్లాడారు. ఓయూలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కారుపై జరిగిన దాడిని సిఎం కేసీఆర్ ఖండించారు. ఈ సమస్యలపై ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని, సమగ్ర విచారణ జరిపిస్తామని సభకు హామీ ఇచ్చారు. కేసీఆర్ మాట్లాడుతుండగా కాంగ్రెస్, ఎంఐఎం సభ్యులు నినాదాలతో అడ్డుకునే ప్రయత్నం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో పక్క వాయిదా తీర్మానం చేపట్టాలని కాంగ్రెస్ ఆందోళన చేస్తుండటంతో, శాసనసభ రెండుసార్లు వాయిదా పడింది.

ఫ్రీడం 251/- ఫోన్ పై మరో కేసు నమోదైంది..!

  251 రూపాయలకే స్మార్ట ఫోన్ అంటూ ఊరించిన రింగింగ్‌ బెల్స్ కంపెనీ మీద ఇప్పుడు నోయిడాలో ఒక కేసు నమోదైంది. కిరీట్‌ సోమయా అనే ఓ బీజేపీ నేత, ఈ కేసుని నమోదు చేశారు. రింగింగ్‌ బెల్స్ కంపెనీ నమ్మశక్యం కాని కబుర్లు చెబుతోందన్నది ఫిర్యాది ఆరోపణ. కేవలం 251 రూపాయలకి 4 అంగుళాల డిస్‌ప్లే, 1జిబి రామ్‌, 8జిబి మెమరీ ఎలా సాధ్యమంటూ కిరీట్ ప్రశ్నిస్తున్నారు. కిరీటి ఫిర్యాదుని పరిశీలించిన నోయిడా పోలీసులు సెక్షన్‌ 420 కింద కేసుని నమోదు చేశారు. ఇందులో నిందితులుగా రింగింగ్ బెల్స్‌ యజమాని ‘మొహిత్ గోయల్‌’, సంస్థ అధ్యక్షుడు ‘అశోక్ ఛద్దా’లను పేర్కొన్నారు. ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ అధికారులు ‘ఫోనుని ఇంత చవగ్గా ఎలా అమ్మగలుగుతున్నారంటూ’ రింగింగ్ బెల్స్ అధికారులని ప్రశ్నించారు. ఇక ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్‌ కూడా ఈ ఫోనులో ఏదో మతలబు ఉందంటూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. తాజాగా ఈ కేసు కూడా తోడవడంతో ఇక ఫ్రీడం 251/- తన ఖచ్చితత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంస్థ అధికారులు మాత్రం ఏ ప్రభుత్వ సంస్థ చేసే ఎలాంటి విచారణకైనా తాము సిద్ధం అంటున్నారు.  

ప్రేమించలేదని వాలీబాల్ ప్లేయర్ దారుణ హత్య..!

  మనం ప్రేమించిన వాళ్లు సుఖంగా ఉండాలని కోరుకునేది నిజమైన ప్రేమ. మనల్ని ప్రేమించలేదని చంపేస్తే అది రాక్షసత్వమే గానీ ప్రేమ కాదు. ఈ మధ్య బాగా ఈ రాక్షసత్వపు హత్యలు బాగా పెరిగిపోతున్నాయి. తాజాగా, తనను ప్రేమించలేదని ఒక ఉన్మాది ఒక జాతీయ వాలీబాల్ క్రీడాకారిణిని హత్య చేశాడు. ఈ భయంకర సంఘటన పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. సంగీతా అయిచ్ అలియాస్ టీనా (15) ను ప్రేమించమని గత కొంతకాలంగా వెంటపడుతూ వేధిస్తున్నాడు ఉన్మాది సుబ్రతా సింహా(20). ఆమె ఒప్పుకోలేదన్న కసితో, ఆమె వాలీబాల్ ఆడుతున్న చోటికి వచ్చి పట్టపగలు దారుణంగా పొడిచి హత్య చేశాడు. దాదాపు 25 మంది వాలీబాల్ ప్లేయర్లు, ముగ్గురు కోచ్ లు ఆ సమయంలో అక్కడే ఉన్నా, ఏమీ చేయలేకపోయారు. ఒక కోచ్ అడ్డుకోవడానికి ప్రయత్నించగా, కత్తితో అతని చేతిమీద గాయం చేశాడు. హత్య చేసి నిందితుడు పారిపోయిన తర్వాత గానీ, మిగిలిన వారెవరికీ మెదడు పనిచేయలేదు. వెంటనే టీనా ను హాస్పటల్లో జాయిన్ చేసినా, ఫలితం లేకపోయింది. మార్గ మధ్యంలోనే ఆమె అసువులు బాసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడికోసం పోలీసులు గాలిస్తున్నారు.

తెలంగాణా స్పీకర్ కు వడదెబ్బ తగిలింది

  రెండు తెలుగురాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. వడదెబ్బ ప్రభావానికి ఇప్పటికే 40 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మార్చి నెలలోనే ఇలా ఉంటే, మే వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు బేంబేలెత్తుతున్నారు. తాజాగా తెలంగాణా స్పీకర్ మధుసూదనాచారిని కూడా ఈ వడదెబ్బ ప్రభావం తాకింది. గత రెండు రోజులుగా, ఆయన తన సొంత నియోజకవర్గం భూపాలపల్లిలో అనేక పనుల్లో పాల్గొంటున్నారు. ఒకదాని తర్వాత ఒకటిగా పనులు చేసుకుంటూ వెళ్తున్న ఆయన కళ్లుతిరుగుతున్నాయని చెప్పడంతో హాస్పిటల్లో చేర్పించారు. డాక్టర్లు ఆయనకు బీపీ షుగర్ చెక్ చేసి వడదెబ్బ తగిలిందని గుర్తించారు. విఐపీల పరిస్థితే ఇలా ఉంటే, ఇక ఎండనకా, వాననకా పనిచేసే సామాన్య ప్రజల పరిస్థితి మరింత భయంకరంగా ఉంటుందన్నది వాస్తవం. ఎండ బారిన పడకుండా ప్రజలంతా, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

దొంగతో మూడు డజన్ల అరటిపళ్లు తినిపించిన పోలీసులు

  ముంబైలో జరిగిన సంఘటన ఇది. ముంబైలో వోలీ ఏరియాలో ఓ పెద్దావిడ మెళ్లో చైన్ కొట్టేసి దొరికిపోయాడు సక్పాల్ అనే దొంగ. ఆవిడ గట్టిగా అరిచేసరికి పబ్లిక్ పట్టుకుని దొంగశ్రీ గారిని పోలీసులకు అప్పగించారు. పోలీసుల వచ్చేలోపే ఆ చైన్ ను మింగేసి, తనకేమీ తెలీదని బుకాయించాడు. చాలా సేపు అడిగి విసిగిపోయిన పోలీసులు తమదైన స్ట్రైల్లో ఇంటరాగేట్ చేస్తే, చైన్ మింగేశానని నిజం కక్కాడు దొంగగారు. నిజం కక్కాడు గానీ, చైన్ మాత్రం ఇంకా పొట్టలోనే ఉండిపోయింది. దాంతో మనోడ్ని హాస్పిటల్లో చేర్పించి, మూడు డజన్ల అరటిపళ్లు తినిపించారు పోలీసులు. దాదాపు రెండు రోజుల పాటు ఇలా అరటిపళ్లు తినిపించిన తర్వాత గానీ, చైన్ రికవర్ అవలేదు. సక్పాల్ తో పాటు, దొంగతనం చేయమని ఉసికొల్పిన అతని భార్య కోలీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెక్షన్ 392, సెక్షన్ 34 కింద కేసు బుక్ చేశామని, త్వరలోనే దొంగగారిని కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు చెబుతున్నారు.

పిల్లల్ని బాగా చదివించేందుకు నేరస్తులుగా మారాము!

తిరుపతికి దగ్గరలోని శేషాచలం అడవులు అనగానే ఎర్రచందనం దొంగలు గుర్తుకువస్తారు. ఇక్కడి ఎన్నిసార్లు పోలీసులు దాడిచేసినా, పోలీసుల కాల్పుల్లో ఎందరు చనిపోయినా... ఒకరి తరువాత ఒకరు చెట్లను నరికేందుకు ముందుకు వస్తూనే ఉన్నారు. సాధారణంగా పోలీసులకు పట్టుబడిన వెంటనే ‘తమకే పాపం తెలియదనీ, ఏవో ప్రాజెక్టు కోసం చెట్లని కొట్టాలని చెబితే వచ్చామని’ చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించేవారు. కానీ నిన్న పోలీసుల చేతికి దొరికిపోయిన ఇద్దరు ఎర్రచందనం దొంగలు అసలు విషయాన్ని వెల్లడించారు. తమిళనాడు కృష్ణగిరి జిల్లాకు చెందిన చెల్లప్ప అనే నిందితుడు- తన కూతరు ఇంటర్మీడియట్‌ చదువుతోందనీ, ఆమె కాలేజి ఫీజు కోసం 30,000 రూపాయలను చెల్లించాల్సి ఉందని చెప్పుకొచ్చాడు.   తన రెండో సంతానాన్ని కూడా ప్రైవేటు బడిలో చేర్పించాలని... ఈ ఖర్చులన్నింటిని భరించేందుకు తాను నేరస్తునిగా మారానని వాపోయాడు. ప్రభుత్వ బడిలో చదివిస్తే వాళ్లెందుకూ పనికిరాకుండా పోతారని అన్నాడు. ఇక కుమార్‌ అనే రెండో నేరస్తుడి మాటలు కూడా ఇలాగే ఉన్నాయి. తన పిల్లల్ని ఇంగ్లీష్‌ మీడియంలో చేర్పించడం తండ్రిగా తన బాధ్యత అనీ, ఆ మాత్రం కూడా చేయకపోతే, తన భార్యకి మొహాన్ని చూపించలేనని వాపోయాడు. ప్రభుత్వ పాఠశాలలే సవ్యంగా పనిచేస్తే ఇలాంటి వార్తలు వినాల్సిన అగత్యం వచ్చేది కాదు కదా!

ఆవుకీ ఎద్దుకీ పెళ్లి- 500 అతిథులు- 18 లక్షల ఖర్చు

ఆవుని ఇంటి మహాలక్ష్మిగా భావించి పూజించేవారి గురించి వింటూనే ఉంటాం. గోమాతని పెంచుకునేవారి సంఖ్యా తక్కువేమీ కాదు. కానీ అహ్మదాబాద్‌కి చెందిన విజయ్ పర్సానా మరో అడుగు ముందుకు వేశారు. తను పెంచుకుంటున్నా పూనమ్‌ అనే గోమాతను ఒక ఎద్దయ్య చేతిలో పెట్టాలనుకున్నారు. తన గోవు కోసం తగిన ఎద్దు ఎక్కడి దొరుకుతుందా అని వెతకగా వెతకగా, దాదాపు 300 కిలోమీటర్ల దూరంలోని భావ్‌నగర్‌ జిల్లాలో అర్జున్‌ అనే మంచి ఎద్దు ఉన్నట్లు తేలింది. అక్కడి దత్తాత్రేయ ఆశ్రమంలో పెరుగుతున్న అర్జున్‌తో పూనమ్‌కి వివాహాన్ని నిశ్చయించారు.   అలాగని ఈ పెళ్లి ఏదో తూతూమంత్రంగా జరిగిపోయిందని అనుకోవడానికి లేదు. పెళ్లికి లగ్న పత్రికలను ముద్రించి పంచిపెట్టారు. వరుడిని, వధువుని... పట్టుబట్టలతో, బంగారు ఆభరణాలతో అలంకరించారు. పూనమ్‌ను పల్లకీ మీద కూర్చోపెట్టి, ఒక ట్రక్కుతో ఆ పల్లకీని మోయించారు. వేదమంత్రాల సాక్షిగా విజయ్ పర్సానా కన్యాదాన క్రతువుని నిర్వహించారు. ఆరోగ్యపరంగా, ఆధ్మాత్మిక పరంగా గోవుకి ఉన్న ప్రాధాన్యం అసాధారణమనీ... ఆ ప్రాధాన్యతని ప్రచారం చేసేందుకు ఈ వివాహాన్ని తలపెట్టానని చెప్పుకొస్తున్నారు విజయ్ పర్సానా!

ఆనంద గజపతి రాజు కన్నుమూత

  మాజీ ఎంపీ, కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు సోదరుడైన ఆనంద గజపతిరాజు కన్నుమూశారు. విజయనగర రాజ వంశానికి చెందిన ఆనంద గజపతి రాజు 1983లో తొలిసారి భీముని పట్నం ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మణిపాల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. రెండు సార్లు రాష్ట్రమంత్రిగా పనిచేసిన ఘనత ఆయనకు సొంతం. ఆయన మరణం పట్ల, ఏపీ సిఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సోదరుడి మరణవార్త తెలుసుకున్న కేంద్రమంత్రి అశోక గజపతి రాజు, ప్రత్యేకవిమానంలో వైజాగ్ బయలుదేరారు. ఆధ్యాత్మిక చింతనలో ఉండే ఆనంద గజపతిరాజు దాదాపు 108 దేవాలయాలకు పైగా ధర్మకర్తగా ఉన్నారు. ఆయన మరణంతో విశాఖ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌ మధ్య మాటల యుద్ధం

ఆన్‌లైన్‌ వ్యాపారంలో దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ మధ్య చిత్రమైన మాటల యుద్ధం మొదలైంది. ఒకరి మీద ఒకరు మాటలు విసరుకోవడానికి ఇప్పుడు ట్విట్టర్‌లో కూడా అవకాశం ఉండటంతో, ట్విట్టర్ వేదికగా ఈ గొడవ సాగింది. అంతర్జాతీయ ఆన్‌లైన్ దిగ్గజం ‘ఆలీబాబా’ త్వరలోనే భారత్‌లో తన వ్యాపారాన్ని విస్తరించనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘మన దేశంలో ఆలీబాబా అందించిన పెట్టుబడుల మీద వారికి నమ్మకాలు సన్నగిల్లినట్లున్నాయి.   అందుకే వాళ్లు స్వయంగా రంగంలోకి దిగినట్లున్నారు’ అంటూ ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకుడు సచిన్‌ బన్సల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇంతకీ సదరు ఆలీబాబా పెట్టుబడులు అందించింది ఎవరికో కాదు. స్నాప్‌డీల్‌ సంస్థకే. ఈ ట్వీట్‌ను చదువుకున్న స్నాప్‌డీల్‌ యాజమాన్యానికి ఒళ్లు మండింది. ‘ఏ మీరు మాత్రం మోర్గాన్‌ స్టాన్లీ నుంచి తీసుకున్న నిధులను డ్రైనేజిలోకి పంపించలేదా’ అంటూ ఆ సంస్థ యజమాని కునాల్‌ బెహల్‌ ట్వీటారు. మొత్తానికి వీరిద్దరి ట్వీట్లతో గుట్టుగా ఉండాల్సిన వ్యాపార నష్టాలు కాస్తా రోడ్డున పడ్డట్లున్నాయి.

కేంద్ర మంత్రులకు గుడ్‌ఫ్రైడే అంటే తెలియదా!

గుడ్‌ఫ్రైడే అంటే క్రీస్తుని శిలువ వేసిన రోజు. ఈ విషయం చాలామంది హిందువులకి తెలియకపోవచ్చు. కానీ సాక్షాత్తూ కేంద్ర మంత్రులకే తెలియదంటే ఆశ్చర్యం కలగక మానదు. తెలియకపోతే తెలియకపోయింది. గుడ్‌ఫ్రైడేలో గుడ్ ఉంది కదా అని వారు ట్విట్టర్‌లో అందరికీ శుభాకాంక్షలు తెలియచేసేశారు. క్రైస్తవులెవరూ సాధారణంగా గుడ్‌ఫ్రైడేను ఉల్లాసంగా జరుపుకోరు. క్రీస్తు గురించి ప్రార్థిస్తూ, ఆయన తమ కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ గడుపుతారు. కానీ ఈ విషయాన్ని గమనించని కేంద్ర మంత్రులు కొందరు తప్పులో కాలేశారు. సాంస్కృతిక శాఖా మంత్రి మహేష్‌ శర్మ, రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు, పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ క్రైస్తవ సోదరులందరికీ ‘గుడ్‌ ఫ్రైడే శుభాకాంక్షలను’ అందించారు. అంతేనా నజ్మా హెప్తుల్లా, షానవాజ్‌ హుస్సైన్‌ వంటి బీజేపీ ప్రముఖులు కూడా ఇదే బాట పట్టారు. ఈ విషయమై సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తడంతో తమ ట్వీట్లను చాలామంది డిలీట్‌ చేసేశారు. కానీ ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌గా నిలిచారు. ‘కరుణామయుడైన క్రీస్తు జీవితాన్ని, సందేశాన్ని గుర్తు చేసుకునే రోజే గుడ్‌ఫ్రైడే అని ఆయన పేర్కొన్నారు.’ రక్షించారు!

వీడియో క్యాసెట్‌ తిరిగివ్వనందుకు 14 ఏళ్ల తరువాత అరెస్టు

కోట్లు దోచుకునే బడాబాబులకు రాచమర్యాదలు చేయడం. పరిస్థితులు మరీ విషమిస్తే వారు దేశం వదిలి వెళ్లేదాకా గమ్మున ఉండటం మనం చూస్తున్నదే. కానీ అమెరికాలో జరిగిన ఓ ఘటన గురించి వింటే, ప్రపంచమంతా ఇదే తంతు నడుస్తున్నట్లు తోస్తోంది! అమెరికాలోని నార్త్ కెరోలినాకు చెందిన జేమ్స్‌ మెయర్స్‌, తన కూతురుని బడిలో దింపేందుకని కారులో బయల్దేరాడు. దారిలో పోలీసులు అతన్ని ఆపడంతో బుద్ధిగా తన లైసెన్సుని వారికి చూపించాడు. ఆ లైసెన్సుని కాసేపు పరీక్షించిన పోలీసులు అతని చేతికి బేడీలు వేశారు.   కారణం! జేమ్స్ 14 సంవత్సరాల క్రితం ఒక వీడియో క్యాసెట్‌ను తీసుకుని తిరిగివ్వడం మర్చిపోయాడంట. ప్రస్తుతానికి వీడియో క్యాసెట్లు ఎలాగూ లేవు, జేమ్స్‌కు ఆ క్యాసెట్‌ను అద్దెకు ఇచ్చిన దుకాణం కూడా మూతపడిపోయింది. కానీ సదరు దుకాణదారుడు వేసిన కేసు మాత్రం అలాగే ఉండిపోయింది. పోలీసులు మత్తుపదార్థాలని అమ్మేవారిని వదిలేసి, అద్దె క్యాసెట్ల గురించి సమయాన్ని వృథా చేస్తున్నారంటూ, జేమ్స్ మండిపడుతున్నాడు. ప్రజల సొమ్ముని ఇలా దుర్వినియోగం చేస్తున్నారంటూ తిట్టిపోస్తున్నాడు. తన ఆవేశాన్నంతా వెల్లగక్కుతూ జేమ్స్‌ ఓ వీడియోని రూపొందించి యూట్యూబ్‌లోకి కూడా వదిలాడు. మరి జేమ్స్‌ని న్యాయమూర్తులు మందలించి వదిలిపెడతారో, జరిమానా విధిస్తారో, ఏకంగా జైలు శిక్షే వేస్తారో చూడాలి.

పాకిస్తాన్‌ క్రికెట్‌ పదేళ్లు వెనుకబడి ఉంది- అక్రం

  టి-20 ప్రపంచ కప్‌లో భారత చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్‌ జట్టు విమర్శల జల్లులో తడుస్తోంది. తాజాగా ఆ దేశ మాజీ కేప్టెన్‌ పాకిస్తాన్‌ ఆటతీరు మీదా, అక్కడి క్రికెట్ బోర్డు మీదా నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. పాకిస్తాన్‌ క్రికెట్‌కు సంబంధించిన ఏ సలహా కావాలన్నా, ఏ సాయం చేయాలన్నా తాను సిద్ధంగా ఉన్నాననీ.... కానీ బోర్డులోని కొందరికి ఇది నచ్చదని అక్రం పేర్కొన్నాడు. తాను ఇంతటి వాడినయ్యానంటే దానికి కారణం తన దేశమే కానీ, ఆ దేశంలోని క్రికెట్‌ బోర్డు కాదని వెక్కిరించాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌ ఆటతీరు బాగోకపోవడానికి ఎవరో ఒకరి మీద కారణాన్ని మోపడం సరికాదన్నాడు అక్రం. పాకిస్తాన్‌ ఆట ప్రమాణాలే దారుణంగా ఉన్నాయనీ, ఇతర దేశాలతో పోలిస్తే తమ ఆట పదేళ్లు వెనకబడిపోయిందనీ చెప్పుకొచ్చాడు. ఇందుకోసం దేశవాళీ క్రికెట్‌ నుంచి కూడా మార్పులను తీసుకురావాలని సూచించాడు. మరోవైపు బోర్డు సభ్యులు అక్రం మాటలకు మండిపడుతున్నారు. అక్రం పాకిస్తాన్‌ క్రికెట్‌ వ్యవహారాలలో అనవసరంగా తలదూరుస్తున్నాడనీ, మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదాల్లో ఇరుక్కున్న అక్రం తమకు సలహాలు ఇవ్వడమేమిటనీ విసుక్కుంటున్నారట!

శివాలయంలోకి ప్రవేశించినందుకు అరెస్టు

  మహిళలకు కూడా ఆలయాలలో ప్రవేశించే హక్కు ఉండాలంటూ సాగుతున్న ఉద్యమం, నానాటికీ తీవ్రరూపం దాలుస్తున్నట్లుంది. తాజాగా ప్రసిద్ధ జ్యోతిర్లింగం త్రయంబకేశ్వర ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన తృప్తి దేశాయ్‌ అనే కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. భూమాత బ్రిగేడ్‌ అనే సంస్థకు చెందిన తృప్తి దేశాయ్‌, అంతరాలయాలలో మహిళలకు ప్రవేశం ఉండాలని ఎన్నో రోజులుగా ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. గత జనవరిలో శని సింగనాపూర్‌లో కూడా ఆమె ఇలాంటి ప్రయత్నమే చేసి దేశవ్యాప్తంగా చర్చలకు దారితీశారు.   తృప్తి దేశాయ్‌ లేవనెత్తిన ఈ చర్చకు బీజేపీ అనుబంధ సంస్థ ఆరెస్సెస్ కూడా స్పందించాల్సి వచ్చింది. ఆలయాలలో స్త్రీల ప్రవేశానికి తాము అనుకూలమేనని, అయితే ఇది చర్చల ద్వారానే సాధ్యం కావాలని ఆరెస్సెస్ గత వారం సూచించింది. త్రయంబకేశ్వర ఆలయ కమిటీ మాత్రం, తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని మార్చేదే లేదని తేల్చి చెప్పేసింది. మరోవైపు త్రయంబకంలోని స్థానిక మహిళలు, తృప్తి దేశాయ్‌ అరెస్టు గురించి తీవ్ర నిరసనలను వ్యక్తం చేయడం గమనార్హం. బహుశా మహిళా లోకం ఈ విషయమై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లుంది.

ఒకరు కాదు ఇద్దరు పిల్లల్ని కనండి... చైనా అభ్యర్ధన

  ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం ఏదని అడిగితే ఠక్కున చైనా అని చెప్పేస్తారు. ఆ అపప్రధ పోగొట్టుకునేందుకు చైనా మూడు దశాబ్దాల క్రితం ఓ కఠినమైన చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఒక జంట ఒక బిడ్డనే కనాల్సి ఉంటుంది. ఎవరన్నా ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే వారికి కఠినమైన జరిమానాను విధించడంతోపాటు, కొన్ని ప్రభుత్వ పథాకాలకు అనర్హులుగా కూడా ప్రకటించేవారు. ఈ చట్టానికి భయపడి బలవంతపు అబార్షన్లు చేయించుకునేవారి సంఖ్య లక్షల్లోనే ఉండేది. చైనా చేసిన ఈ చట్టం వల్ల జనాభా అయితే తగ్గింది. కానీ దశాబ్దాలు గడిచిన తరువాత కానీ వారికి అర్థం కాలేదు, ఎంతటి పొరపాటు జరిగిపోయిందో!   ప్రస్తుతానికి చైనాలో యువకుల సంఖ్య తగ్గి, వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఆ దేశంలో 15.5 శాతం ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. చైనా ఎంతటి ముందుచూపు లేని పనిచేసిందో! అందుకని ఈ ఏడాది మొదటి నుంచీ చైనా ప్రభుత్వం ‘ఒక్క బిడ్డతో ఏం ఆగుతారు, రెండో బిడ్డను కూడా కనేయండి’ అంటూ పెద్దరికం ప్రదర్శించడం మొదలుపెట్టింది. అంతేకాదు! రెండో పెళ్లి చేసుకున్నవారు కూడా ఇద్దరు పిల్లల్ని కనవచ్చునంటూ, ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చే ఓ చట్టాన్ని తీసుకువచ్చింది. కానీ జనం మాత్రం ఈ ప్రభుత్వ నిర్ణయం పట్ల పెద్దగా సంతోషం వ్యక్తం చేయడం లేదు. వయసు మీరిపోయిందనో, రెండో బిడ్డను పెంచే స్తోమత లేదనో వారు స్తబ్దుగా ఉండిపోతున్నారట.

హిందు, ముస్లింల కాళ్లు కడిగిన పోప్‌

  ఒక పక్క బెల్జియంలో జరిగిన ఉగ్రదాడితో యూరోప్‌ అంతటా విస్తుపోయి ఉండవచ్చు. ఈ దాడుల తరువాత ముస్లింల మీద అక్కడి ప్రజలలో ద్వేషభావం మరింతగా పెరిగిపోయిందనడంలో ఏమాత్రం సందేహం లేదు! మతాల మధ్య ఇలాంటి ద్వేషభావం పెరిగిపోవడం మంచిది కాదనుకున్నారో ఏమో, పోప్‌ ఒక అసాధారణ నిర్ణయాన్ని తీసుకున్నారు. గుడ్‌ ఫ్రైడేకి ముందు రోజున జరిగే ఓ కార్యక్రమంలో ఆయన వేర్వేరు మతాల వారి కాళ్లు కడిగి, వాటిని ముద్దు పెట్టుకున్నారు. సాధారణంగా తనను శిలువ వేయడానికి ముందర, క్రీస్తు తన 12 మంది శిష్యుల కాళ్లు కడిగారట.   ఆ ఆచారాన్ని కొనసాగిస్తూ, పోప్‌ ఏటా 12 మంది కాళ్లు కడగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే క్యాథలిక్ మతానికి చెందిన పురుషులను మాత్రమే ఇందుకోసం ఎంపిక చేసేవారు. కానీ 2013లో పోప్‌ పదవిని చేపట్టిన తరువాత ఫ్రాన్సిస్‌... స్త్రీలను, అన్యమతస్తులను కూడా ఈ కార్యక్రమంలో చేర్చుకుని పలువురిని ఆశ్చర్యపరిచారు. ఈసారి జరిగిన కార్యక్రమంలో కూడా శరణార్థులను, ఆఫ్రికన్‌లను, ముసల్మానులను, స్త్రీలను, ఒక హిందువును కూడా చేర్చుకున్నారు పోప్‌. ‘మనందరి మతాలు, సంప్రదాయాలు వేరు కావచ్చు. కానీ మనమంతా సోదరులం. శాంతిని కోరుకునేవారం’ అంటూ ఈ సందర్భంగా తన సందేశాన్ని వినిపించారు పోప్‌!

కశ్మీర్‌ తొలి మహిళా ముఖ్యమంత్రి మెహబూబా!

  ఎట్టకేలకు కశ్మీర్లోని ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. నిన్న పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ ముఖ్యులంతా సమావేశమై, మెహబూబాని తన పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో... మెహబూబా ఇక ముఖ్యమంత్రి కావడం ఓ లాఛనంగా మారిపోయింది. దీంతో 77 రోజులుగా సాగుతున్న ఉత్కంఠతకు తెరపడింది. గత జనవరి 7న అప్పటి కశ్మీర్‌ ముఖ్యమంత్రి మూఫ్తీ మహమ్మద్‌ మరణించడంతో ఆ పీఠం ఖాళీ అయ్యింది. ఆయన తరువాత, ముఫ్తీ కుమార్తె ముఖ్యమంత్రి కానున్నారని ప్రచారం జరిగినా... మెహబూబా మాత్రం కాలం వెళ్లబుచ్చుతూ వచ్చారు. తమ మిత్రపక్షమైన బీజేపీ నుంచి మరిన్ని స్పష్టమైన హామీలు కావాలని పట్టుపట్టారు.   కానీ రోజులు గడుస్తున్న కొద్దీ, పరిస్థితులు ఆమెకు వ్యతిరేకంగా మారడం మొదలయ్యాయి. మెహబూబాకు మద్దతునిచ్చేందుకు బీజేపీ ఎంత సిద్ధంగా ఉన్నా, ఆమె మరింత బెట్టు చేయడంతో, ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితులు వచ్చాయి. పీడీపీలోకి కొందరు ఎమ్మెల్యేలు ‘మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే, మేమే ఏదో దారి చూసుకుంటాం’ అని తేల్చి చెప్పడంతో మెహబూబా ఓ మెట్టు దిగారు. దానికి తోడు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాని నరేంద్రమోదీతో ఆమె జరిపిన చర్చలు కూడా సఫలం కావడంతో... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెహబూబా సిద్ధపడ్డారు. ఇక నేడో రేపో కశ్మీర్‌ ముఖ్యమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అతివాదులు, వేర్పాటువాదులు ఉన్న సమస్యాత్మక కశ్మీరంలో మెహబూబా తన సత్తాను ఎలా చాటనున్నారోనని దేశమంతా ఎదురు చూస్తోంది.  

నాకు ఇండియా అంటే పచ్చి ద్వేషం అంటున్న డేవిడ్ హెడ్లీ

  నా చిన్నప్పటి నుంచీ ఇండియా అంటే ద్వేషం. 1971లో ఇండియా యుద్ధ విమానాలు మా స్కూల్ భవనాన్ని కూల్చేశాయి. మా టీచర్లతో సహా అక్కడ పనిచేసే ఎంతో మంది మరణించారు. అప్పటి నుంచే ఇండియాపై నాకు ద్వేషం మొదలైంది. ఆ పగ తోనే లష్కరే తోయిబాలో చేరాను. ముంబై దాడుల్లో, భారతదేశానికి వీలైనంత నష్టం చేకూర్చాలనుకున్నాను అంటూ తన పాపాన్ని ఒప్పుకున్నాడు 26/11 ముంబై దాడుల్లో కీలక పాత్ర పోషించిన డేవిడ్ హెడ్లీ. ప్రస్తుతం అమెరికా జైల్లో 35 ఏళ్ల శిక్షను అనుభవిస్తున్న హెడ్లీని, వీడియో లింక్ ద్వారా ముంబై కోర్టు విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే.  2008 నవంబర్ 26న జరిగిన అప్పటి దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. తన బంధువులు కూడా పాకిస్థాన్ ఇంటిలిజన్స్ ఏజన్సీ ఐఎస్ఐ లో కీలక పాత్ర పోషిస్తున్నారని హెడ్లీ చెబుతున్నాడు. శివసేన అధినేత బాల్ థాక్రేను అంతం చేయడానికి లష్కరే ప్లాన్ చేసిందని, కానీ కుదరలేదని చెప్పుకొచ్చాడు హెడ్లీ. ఈ రోజుతో హెడ్లీ విచారణ ముగుస్తుందని సమాచారం.

కారు రాసుకుంటూ వెళ్లిందని... కొట్టి చంపేశారు

రోడ్డు మీద మొదలయ్యే గొడవలు ఎక్కడి దారితీస్తాయో, ఎలా ముగుస్తాయో చెప్పడం కష్టం. దిల్లీలో జరిగిన ఓ ఉదంతమే దీనికి సాక్ష్యం. దిల్లీలోని వికాస్‌పురిలో ఉండే 40 ఏళ్ల పంకజ్‌ నారంగ్ అనే దంతవైద్యుడు, బుధవారం అర్ధరాత్రి కారులో తన ఇంటికి వెళ్తున్నాడు. ఇంతలో అతని కారుని రాసుకుంటూ ఓ బైక్‌ దూసుకుపోయింది. బైక్‌ మీద ప్రయాణిస్తున్నవారు పంకజ్‌ని నానా తిట్లూ తిట్టి వదిలిపెట్టారు. కానీ గొడవ అంతటితో ముగిసిపోలేదు. వారు మరో 13 మందిని వెంటేసుకుని వైద్యుడి ఇంటికి చేరుకున్నారు. ఆ 15 మందీ కలిసి వైద్యుని చావకొడుతుంటే, ఆపే ధైర్యం కూడా ఎవ్వరూ చేయలేకపోయారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న వైద్యుని సమీపంలోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లినా ఉపయోగం లేకపోయింది. దాడికి పాల్పడినవారిలో ఎనిమిదిమందిని పోలీసులు అరెస్టు చేయగలిగారు. మిగతావారు మాత్రం పరారీలో ఉన్నారు!