రెండు రాష్ట్రాలు రెండు కళ్లు.. పాదాభివందనం చేస్తున్నా.. చంద్రబాబు
నేడు టీడీపీ 35వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంకా పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దివంగత ఎన్టీఆర్ ఆశయాల సాధనకు కృషి చేయాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తనకు రెండు కళ్లని, ఇరు రాష్ట్రాల అభివృద్ధికీ తాను కృషి చేస్తానని వ్యాఖ్యానించారు. ఎన్ని సమస్యలు ఎదురైనా, ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుని పార్టీ నిలబడిందంటే, అందుకు కార్యకర్తల కృషే కారణమని అన్నారు. వారికి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు.
ఇంకా బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవం కోసమే తెలుగు దేశం పార్టీ ఏర్పడిందని వ్యాఖ్యానించారు. విభజన సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూస్తుంటే ప్రతిపక్షం అనవసర రాద్ధాంతం చేస్తోందని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్నివిధాలా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.