మోదీ అసలు రంగు బయటపడింది... రాహుల్
ఉత్తరాఖండ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు చెందిన తొమ్మది మంది ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష బీజేపీలో చేరిపోవడంతో రాహుల్ గాంధి కారాలుమిరియాలు నూరుతున్నారు. సదరు తొమ్మది మంది ఎమ్మెల్యేలూ పార్టీ మారడం వల్ల, ఇప్పుడు అక్కడ బీజేపీనే అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. త్వరలోనే ఆ పార్టీ అక్కడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా లేకపోలేదు. మొదట అరుణాచల్ ప్రదేశ్‌లోని అధికారం ఇలాగే కాంగ్రెస్ చేజారిపోగా, ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోనూ అదే చరిత్ర పునరావృతం కావడంతో రాహుల్ గాంధి తీవ్ర విమర్శలకు దిగుతున్నారు.
తన ఆగ్రహాన్ని వెళ్లగక్కేందుకు ఆయన ట్విట్టర్ బాట పట్టారు. ‘డబ్బు, అధికారంతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలని బీజేపీ అన్యాయంగా పడగొడుతోందని’ ఆయన విరుచుకుపడ్డారు. ‘అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని పరిణామాలు, మోదీజీ అసలు రంగుని బయటపెడుతున్నాయ’ని విమర్శించారు. కానీ బీజేపీ వాదన మాత్రం వేరేగా ఉంది. రాష్ట్రాలలో ఉండే కాంగ్రెస్ నేతల వెతలను సోనియా, రాహుల్‌గాంధిలు పట్టించుకోరనీ... అందుకే విసిగివేసారిన రాష్ట్రనేతలు తమ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ గట్టు దాటే గుట్టు మాత్రం పెరుమాళ్లకెరుక!