మరో వివాదానికి జెఎన్యూ విద్యార్ధులు.. దహనం చేస్తే తప్పేంటి..
posted on Mar 22, 2016 @ 1:19PM
జవహర్‌లాల్ విశ్వవిద్యాలయ (జెఎన్యూ) లో జరుగుతున్న ఘటనలను చూస్తుంటే వివాదాలకు అడ్డాగా మారుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తుంది. ఏబీవీపీ తిరుగుబాటు నేతలు, వామపక్ష ఏఐఎస్‌ఏ, ఎన్‌ఎస్‌యూఐ నేతలు ఈనెల 8 వ తేదీన మనుస్మృతి పుస్తకాన్ని దహనం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జేఎన్‌యూ అధికారులు ఐదుగురు విద్యార్థులకు నోటీసులు జారీచేసి, వివరణ కోరారు. అయితే దీనిపై విద్యార్ధులు స్పందిస్తూ ప్రాచీన న్యాయ గ్రంథం మనుస్మృతిని దహనం చేస్తే తప్పేంటని తిరిగి ప్రశ్నిస్తున్నారు. కాగా మనుస్మృతి దహన ఘటన ఆరోపణల సంబంధించి జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ తదితరులపై 'తీసుకున్న చర్యల నివేదిక' (ఏటీఆర్)ను సమర్పించాల్సిందిగా ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. మొత్తానికి జెఎన్యూ విద్యార్ధులు తీరు చూస్తుంటే రోజుకో వివాదం లేనిదే నిద్ర పోయేలా కనిపించడం లేదు.
కాగా మార్చి 8వ తేదీన కన్హయ్య మరికొందరు విద్యార్థులు జేఎన్‌యూ క్యాంపస్‌లో మనుస్మృతి పుస్తకాన్ని దహనం చేసిన వీడియో యూట్యూబ్‌లో ఉన్నది. దీనిని వ్యతిరేకిస్తూ అజయ్‌గౌతమ్ అనే బ్రాహ్మణుడు ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ లవ్లీన్ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదుకు ఢిల్లీ పోలీసులను ఆదేశిస్తూ.. విచారణను జూన్ 1వతేదీకి వాయిదా వేశారు.