నేను హిందూ వ్యతిరేకిని- దియా మీర్జా
హోళీ పండుగ గురించి మాట్లాడుతూ దియా మీర్జా చేసిన ఒక ట్వీట్, ఆమెను ఇబ్బందుల్లోకి నెడుతోంది. ‘మీరు నన్ను హిందూ వ్యతిరేకిగా పిలిస్తే పిలవచ్చుగాక, కానీ ఒక పక్క నీళ్లు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, మనం హోళీ పేరుతో నీటిని వృథా చేయడం చాలా దారుణం.’ అంటూ ఆ మధ్య దియా మీర్జా చేసిన ట్వీట్ మీద సోషల్ మీడియా విరుచుకుపడింది. దాంతో దియా మీర్జా తన ఫేస్‌బుక్‌లో సుదీర్ఘ వివరణని ఇవ్వవలసి వచ్చింది. భారతీయ పౌరురాలిగా, తనకు అన్ని వర్గాల వారి సంప్రదాయాల మీద గౌరవం ఉందని చెప్పుకొచ్చారు దియా.
ఒకవేళ తన ట్వీట్ ఎవరి మనసునైనా నొప్పించి ఉంటే క్షమించమంటూ వేడుకున్నారు. ఒక పక్క క్షమాపణ చెబుతూనే, తాను అన్నదానిలో తప్పేమీ లేదని చెప్పేందుకు కూడా దియామీర్జా ప్రయత్నించారు. మహారాష్ట్రలో కరువు విలయతాండవం చేస్తోందనీ, ఇలాంటి సమయంలో నీటిని పొదుపుగా వాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అందుకోసం రంగునీళ్లతో కాకుండా, ఉత్త రంగులతోనే హోళీని జరుపుకోవాలని జనాలకి సూచించారు. మరి దియా మీర్జా క్షమాపణతో, వివరణతో సోషల్ మీడియా శాంతిస్తుందో లేదో చూడాలి. దేశంలోని పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్న సమయంలో, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వివాదాస్పదం అవుతాయని దియా మీర్జాకు తెలియదంటారా!