కశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రి మెహబూబా!
posted on Mar 25, 2016 @ 1:21PM
ఎట్టకేలకు కశ్మీర్లోని ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. నిన్న పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ముఖ్యులంతా సమావేశమై, మెహబూబాని తన పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో... మెహబూబా ఇక ముఖ్యమంత్రి కావడం ఓ లాఛనంగా మారిపోయింది. దీంతో 77 రోజులుగా సాగుతున్న ఉత్కంఠతకు తెరపడింది. గత జనవరి 7న అప్పటి కశ్మీర్ ముఖ్యమంత్రి మూఫ్తీ మహమ్మద్ మరణించడంతో ఆ పీఠం ఖాళీ అయ్యింది. ఆయన తరువాత, ముఫ్తీ కుమార్తె ముఖ్యమంత్రి కానున్నారని ప్రచారం జరిగినా... మెహబూబా మాత్రం కాలం వెళ్లబుచ్చుతూ వచ్చారు. తమ మిత్రపక్షమైన బీజేపీ నుంచి మరిన్ని స్పష్టమైన హామీలు కావాలని పట్టుపట్టారు.
కానీ రోజులు గడుస్తున్న కొద్దీ, పరిస్థితులు ఆమెకు వ్యతిరేకంగా మారడం మొదలయ్యాయి. మెహబూబాకు మద్దతునిచ్చేందుకు బీజేపీ ఎంత సిద్ధంగా ఉన్నా, ఆమె మరింత బెట్టు చేయడంతో, ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితులు వచ్చాయి. పీడీపీలోకి కొందరు ఎమ్మెల్యేలు ‘మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే, మేమే ఏదో దారి చూసుకుంటాం’ అని తేల్చి చెప్పడంతో మెహబూబా ఓ మెట్టు దిగారు. దానికి తోడు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాని నరేంద్రమోదీతో ఆమె జరిపిన చర్చలు కూడా సఫలం కావడంతో... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెహబూబా సిద్ధపడ్డారు. ఇక నేడో రేపో కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అతివాదులు, వేర్పాటువాదులు ఉన్న సమస్యాత్మక కశ్మీరంలో మెహబూబా తన సత్తాను ఎలా చాటనున్నారోనని దేశమంతా ఎదురు చూస్తోంది.