ఒకరు కాదు ఇద్దరు పిల్లల్ని కనండి... చైనా అభ్యర్ధన
posted on Mar 25, 2016 @ 4:25PM
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం ఏదని అడిగితే ఠక్కున చైనా అని చెప్పేస్తారు. ఆ అపప్రధ పోగొట్టుకునేందుకు చైనా మూడు దశాబ్దాల క్రితం ఓ కఠినమైన చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఒక జంట ఒక బిడ్డనే కనాల్సి ఉంటుంది. ఎవరన్నా ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే వారికి కఠినమైన జరిమానాను విధించడంతోపాటు, కొన్ని ప్రభుత్వ పథాకాలకు అనర్హులుగా కూడా ప్రకటించేవారు. ఈ చట్టానికి భయపడి బలవంతపు అబార్షన్లు చేయించుకునేవారి సంఖ్య లక్షల్లోనే ఉండేది. చైనా చేసిన ఈ చట్టం వల్ల జనాభా అయితే తగ్గింది. కానీ దశాబ్దాలు గడిచిన తరువాత కానీ వారికి అర్థం కాలేదు, ఎంతటి పొరపాటు జరిగిపోయిందో!
ప్రస్తుతానికి చైనాలో యువకుల సంఖ్య తగ్గి, వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఆ దేశంలో 15.5 శాతం ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. చైనా ఎంతటి ముందుచూపు లేని పనిచేసిందో! అందుకని ఈ ఏడాది మొదటి నుంచీ చైనా ప్రభుత్వం ‘ఒక్క బిడ్డతో ఏం ఆగుతారు, రెండో బిడ్డను కూడా కనేయండి’ అంటూ పెద్దరికం ప్రదర్శించడం మొదలుపెట్టింది. అంతేకాదు! రెండో పెళ్లి చేసుకున్నవారు కూడా ఇద్దరు పిల్లల్ని కనవచ్చునంటూ, ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చే ఓ చట్టాన్ని తీసుకువచ్చింది. కానీ జనం మాత్రం ఈ ప్రభుత్వ నిర్ణయం పట్ల పెద్దగా సంతోషం వ్యక్తం చేయడం లేదు. వయసు మీరిపోయిందనో, రెండో బిడ్డను పెంచే స్తోమత లేదనో వారు స్తబ్దుగా ఉండిపోతున్నారట.