ఆరువేల కోట్లతో కొడుకు పెళ్లి.. ఎక్కడ..?

ఒకప్పుడు పెళ్లిళ్లంటే ఏదో తూతూ మంత్రంగా జరిగేవి కానీ.. ఇప్పుడు పరిస్థితి మారింది. పెళ్లిళ్లకి కోట్లకి కోట్లు ఖర్చు పెడుతున్నారు. అలాంటి కుబేరుడే ఇప్పుడు తన కుమారుడి ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6,800 కోట్లు ఖర్చుపెట్టాడు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం.. ఇంతకీ ఎవరా తండ్రి.. ఆ పెళ్లి ఎక్కడ జరిగిందనుకుంటున్నారా.. కజకిస్థాన్ లో మిఖాయిల్ గుత్సరీవ్ అనే వ్యక్తి రష్యా చమురు, మీడియా దిగ్గజంగా ఎదిగారు. ఈయన తన కొడుకు సయీద్ గుత్సరీవ్ (28) విహహానికి 6,800 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. వివాహ వేడుకను మాస్కోలోని లగ్జరీ హోటల్ లోని సఫియా బాంక్వెట్ హాల్ లో ఈ వివాహం నిర్వహించి.. ఆహూతులను అలరించేందుకు జెన్నిఫర్ లోపెజ్, హెన్రిక్ ఇంగ్లేషియస్ వంటి అంతర్జాతీయ పాప్ స్టార్స్ తో కార్యక్రమం ఏర్పాటు చేశారు. వివాహ వేదికను పూలవనంలా తీర్చిదిద్దారు. కాగా, మిఖాయిల్ గుత్సరీవ్ కు 38 వేల కోట్ల రూపాయల ఆస్తులున్నట్టు తెలుస్తోంది.

విమానంలో త్రిశూలం... మరో వివాదంలో రాధేమా

  తనని తాను దేవతగా సన్యాసిని రాధేమా మరో వివాదంలోకి జారుకున్నారు. ఇప్పటికే రాధేమా మీద వరకట్న వేధింపులు, లైంగిక వేధింపులు వంటి రకరకాల ఆరోపణలు ఉన్నాయి. అసభ్య రీతిలో రాధేమా చేసిన నృత్యాలు, చాలీ చాలని దుస్తులలో ఆమె దిగిన ఫొటోలు... ఆమె చెబుతున్న ప్రవచనాలకు విరుద్ధంగా ఇంటర్నెట్‌లో విస్తృత ప్రచారంలో ఉన్నాయి. ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు రాధేమో మీద మరో కేసు నమోదైంది. గత ఏడాది ఆమె ఔరంగాబాదు నుంచి ముంబై వెళ్లే విమానంలో ప్రయాణించే సమయంలో త్రిశూలాన్ని పట్టుకుని ఉన్నారన్నది తాజా ఆరోపణ. విమాన ప్రయాణానికి సంబంధించిన నిబందనల ప్రకారం ఇలా ఏదన్నా ఆయుధాన్ని చేపట్టి, ప్రయాణం చేయడం నేరం. ఈ నేరానికి పాల్పడినందుకు రాధేమా మీద, ఆ పనిని చూసీ చూడనట్లు ఊరుకున్న మరో నలుగురు ఉద్యోగుల మీద ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.

తిట్టినా ట్రంప్ ను ఇష్టపడుతున్న చైనీయులు.. ఎందుకు..?

అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో దిట్ట అని అందరికి తెలిసిందే. అదృష్టం ఏంటంటే.. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబరపడిపోతున్నారంట చైనీయులు. అంతలా ట్రంప్ ఏం వ్యాఖ్యలు చేశాడనుకుంటున్నారా.. సాధారణంగా ట్రంప్ ఎప్పుడూ చైనీయులను తూలనాడుతూ మాట్లాడేవాడు. అమెరికాలో స్థిరపడిన చైనీయుల వల్లే అమెరికాలో నిరుద్యోగం పెరిగిపోతోందని, అమెరికన్ యువకులకు అందాల్సిన చాలా అవకాశాలను చైనీయులు తన్నుకుపోతున్నారని, తాను అధికారంలోకి వస్తే వారందర్నీ స్వదేశాలకు పంపేస్తానంటూ వ్యాఖ్యానించేవారు. అయితే ఆయన చేసిన ఈ వ్యాఖ్యల్లో చైనీయులు చాలా తెలివైనవారని ట్రంప్ చెప్పకనే చెబుతున్నారని.. ఆయన అన్న మాటలకు అర్ధం అదే అని సంబరపడిపోతున్నారట. ఈ విషయాన్ని హువాంగ్ క్వియు.కామ్ సంస్థ తెలిపింది. ఈ సంస్ద ఓ సర్వే నిర్వహించగా అందులో 54 శాతం మంది చైనీయులు డొనాల్డ్ ట్రంప్ అంటే ఇష్టం అని చెప్పడం విశేషం. మొత్తానికి ట్రంప్ కు అదృష్టం బాగానే ఉన్నట్టు ఉంది. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను చైనా పాజిటివ్ గా తీసుకోవడం గ్రేట్..

చంద్రబాబు నన్ను కొట్టారు.. కేసీఆర్ కొట్టే దెబ్బలను కూడా..?

  తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఏపీ సీఎం.. టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నిజాం షుగర్స్ ప్రైవేటీకరణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ..  నిజాం షుగర్స్ ప్రైవేటీకరణపై నాడు నేను చంద్రబాబుతో చర్చించానని.. ఈ పద్దతి వద్దని నేను ప్రతిపాదించగా ఆయన తనపై మండిపడ్డారని.. అక్కడితో ఆగకుండా తన మీద చేయి కూడా చేసుకున్నారని అన్నారు. ఈ విషయాన్ని తాను నాడు బయటపెట్టలేదని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా పోచారం వ్యాఖ్యలపై టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కేసీఆర్ కొట్టే దెబ్బలను కూడా ఆయన చెబుతారని ఎద్దేవా చేశారు. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా పోచారం వ్యాఖ్యలపై స్పందించి.. చంద్రబాబు చేతిలో దెబ్బలు తిని కూడా టీడీపీలోనే ఎలా కొనసాగారని మంత్రిని నిలదీశారు.

ఆత్మహత్య చేసుకుంటే చేసుకో.... రైతుకి ఓ కేంద్ర మంత్రి సూచన

  ఉత్తరాదిన సంజీవ్‌ బాల్యన్‌ అనే పార్లమెంటు సభ్యుని గురించి తెలియనివారుండరు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన సంజీవ్‌ మీద మతహింసను రెచ్చగొట్టాడన్న ఆరోపణలు ఉన్నాయి. అయినా కూడా మోదీ ప్రభుత్వంలో సంజీవ్‌, వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా స్థానాన్ని సాధించారు. ప్రస్తుతం ఓ వివాదాస్పద వ్యాఖ్యను చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. రాజస్థాన్‌లో పర్యటిస్తున్న సంజీవ్‌ దగ్గరకు ఓ రైతు వచ్చి తన గోడుని వినిపిస్తుండగా ఈ ఘటన జరిగింది.   గిరిరాజ్ అనే సదరు రైతు తన గ్రామంలో గత 15 రోజుల నుంచి కరెంటు లేదనీ, దాని వల్ల తన పండ్ల మొక్కలకు నీరు పెట్టలేకపోతున్నానని వాపోయాడు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆత్మహత్య తప్ప తనకు వేరే దిక్కు లేదని మొరపెట్టుకున్నాడు. సాక్షాత్తూ కేంద్ర మంత్రి కదా, ఆయన తల్చుకుంటే తనకు న్యాయం లభిస్తుందని సదరు రైతు భావించి ఉండవచ్చు. కానీ సంజీవ్‌ తీరే వేరుగా ఉండింది. ‘వెళ్లి ఏం చేసుకుంటావో చేసుకో. ఇంకేం మాట్లాడకు’ అంటూ రైతుని కసిరికొట్టారు సంజీవ్‌. సంజీవ్ మాటలతో అక్కడున్నవారంతా విభ్రాంతికి గురయ్యారు. ఆపదలో ఉన్న రైతుని ఓదార్చాల్సింది పోయి, ఇవేం మాటలంటూ ముక్కున వేలేసుకున్నారు. బహుశా ఈ దేశంలో రైతు ప్రాణానికి ఉన్న విలువ ఇంతేనేమో!

జాట్‌ రిజర్వేషన్ బిల్లుతో తృప్తి చెందని నేతలు

  హర్యానాలో జాట్ వర్గానికి రిజర్వేషన్లను కల్పిస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఒక బిల్లును ఆమోదించి ఉండవచ్చుగాక. కానీ తాము ఈ బిల్లుతో తృప్తిగా లేమని ఆ వర్గ నేతలు తెగేసి చెబుతున్నారు. బిల్లు ప్రకారం జాట్‌ వర్గానికి క్లాస్ 1, 2 ఉద్యోగాలలో 6 శాతం, క్లాస్ 3,4 ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. కానీ ఆ శాతం తమకు ఏమాత్రం సరిపోవని మండిపడుతున్నారు జాట్‌ నాయకులు. చిన్న ఉద్యోగాలకు ఎక్కువ శాతం రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా తమను గుమాస్తాలుగా ఉంచాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపిస్తున్నారు. కాబట్టి క్లాస్ 1,2 ఉద్యోగాలలో కనీసం 12 శాతం రిజర్వేషన్ కావాలని పట్టుబడుతున్నారు.   ఇంతేకాదు! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా తమకు రిజర్వేషన్లను కల్పించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. తమ అభ్యంతరాలన్నింటి గురించి చర్చించేందుకు వచ్చే నెల మూడో తేదీన జాట్‌ నేతలు సమావేశం కానున్నారు. మరోవైపు జాట్‌ వర్గం సాగించిన హింసాత్మక ఆందోళనకు ప్రభుత్వం తల ఒగ్గిందని కాంగ్రెస్ నేతలే కాదు, కొందరు బీజేపీ సభ్యులు కూడా విమర్శిస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో హర్యానా ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి!

కేంద్రానికి ఉత్తరాఖండ్‌ హైకోర్టు అక్షింతలు

ఉత్తరాఖండ్‌లో ఆదరాబాదరాగా కేంద్ర ప్రభుత్వం విధించిన రాష్ట్రపతిపాలన మీద ఆ రాష్ట్ర హైకోర్టు మండిపడింది. అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బలనిరూపణ చేసుకునే ప్రయత్నంలో ఉండగానే, హడావుడిగా రాష్ట్రపతి పాలనను విధించాల్సిన అగత్యం ఏమిటని ప్రశ్నించింది. 71 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో, అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు 36 మంది సభ్యుల బలం ఉన్న విషయం తెలిసిందే! అయితే వీరిలో తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధపడటంతో సంఖ్యలు తారుమారయ్యాయి. దీంతో ముఖ్యమంత్రి సోమవారం నాడు తన బలాన్ని నిరూపించుకోవల్సిందిగా గవర్నరు ఆదేశించారు. గవర్నరు ఆదేశం అమలుకాక ముందరే, కేంద్రం అక్కడ రాష్ట్రపతి పాలన విధించడం మీద కోర్టు తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వం స్థిరంగా ఉందో, మైనారటీలో పడిపోయిందో ఎలాగూ బలనిరూపణలో తేలిపోయేది కాబట్టి, కేంద్రం తొందరపడకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. రాష్ట్రపతి పాలనను దుర్వినియోగం కాకుండా చూడటమే తన బాధ్యత అని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఇప్పటికే హైకోర్టు అక్కడి ప్రభుత్వం బలనిరూపణ చేసుకునేందుకు ఈ నెల 31వ తేదీన అసెంబ్లీని పిలిపించవలసిందిగా కోరిన విషయం తెలిసిందే! 

నా కొడుకుని ఏమీ అనవద్దు... విజయ్ మాల్యా

తను చేసిన తప్పులకు తన బిడ్డను నిందించవద్దంటూ విజయ్‌మాల్యా ట్విట్టర్‌లో కోరాడు. 28 ఏళ్ల సిద్ధార్థ మాల్యా కూడా తన తండ్రిలాగానే మంచి జల్సారాయుడని పేరు. అరకొర దుస్తులు ఉన్న మోడల్స్‌తో సిద్ధార్థ మాల్యా దిగిన ఫొటోలు బాగానే ప్రచారం పొందేవి. ఇక దీపికా పదుకొనేతో సిద్ధార్థ సాగించిన స్నేహం కూడా చాలారోజులు వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం లండన్‌లోని డ్రామా స్కూల్‌లో చదువుతున్న సిద్ధార్థ, గత కొన్ని రోజులుగా ట్విట్టర్‌లో తన తండ్రిని వెనకేసుకు వస్తూ కనిపించేవాడు. అందుకు జనం సిద్ధార్థను కూడా తిట్టడం మొదలుపెట్టారు. దీంతో ఇప్పడు విజయ్ మాల్యా తన బిడ్డను రక్షించేందుకు పూనుకున్నారు. ‘మీరు నన్ను ఎంతగా ద్వేషించినా ఫర్వాలేదనీ, కానీ అభంశుభం తెలియన తన బిడ్డ జోలికి మాత్రం వెళ్లవద్దని’ ట్విట్టర్‌ సాక్షిగా కోరాడు. దీనికి సిద్ధార్థ బదులిస్తూ, తనకు వస్తున్న పది ట్విట్టర్‌ సందేశాలలో ఒకటి మాత్రమే సానుకూలంగా ఉంటోందనీ, మిగతా తొమ్మిదీ తనను తిడుతున్నవే అని వాపోయాడు. ఈ తండ్రీకొడుకుల సెంటిమెంటకు జనం పెద్దగా ప్రభావితం అయినట్లు కనిపించడం లేదు. తండ్రి నుంచి వారసత్వంగా దొంగ సొమ్ముని కనుక తీసుకోకపోతే, తాము సిద్ధార్థని క్షమించేందుకు సిద్ధంగా ఉన్నామని కొందరు ప్రకటించారు కూడా! మరికొందరేమో ముందు బిడ్డను వెనకేసుకు రావడం మానేసి, అప్పులు చెల్లించమని మాల్యాను నేరుగా విమర్శించారు.  

హైజాకర్‌తో సెల్ఫీ...

ట్విట్టర్‌లో అభినందనల వెల్లువసునామీ వస్తున్నా సెల్ఫీ తీసుకోవాలని ఆరాటపడే వెర్రి మాలోకం ఇది. రైళ్లు, జలపాతాలు, పాములు, శవాలు... ఇలా సెల్ఫీ తీసుకునేందుకు సందర్భాలు అన్నీ అయిపోయినట్లున్నాయి. ఇప్పుడు హైజాకర్‌తో సెల్ఫీ తీసుకుని సంచలనం సృష్టించాడు ఓ యువకుడు. నిన్న ఈజిప్టులోని ఓ విమానాన్ని మతిచెడిన మనిషొకరు హైజాక్‌ చేసిన విషయం తెలిసిందే! అతను ఏ నిమిషంలో ఎలా ప్రవర్తిస్తాడా, అతని కోరికలు ఏమిటి అని సదరు విమానంలోని ప్రయాణికులంతా భయంతో వణికిపోతుంటే... ఇన్నిస్ అనే బ్రిటన్‌ జాతీయుడు మాత్రం అతనితో ఓ సెల్ఫీ దిగాలని ముచ్చటపడ్డాడు. పైగా దాన్ని అప్పటికప్పుడు ట్విట్టర్‌లో పోస్టు చేసి, తనతో సెల్ఫీలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలంటే న్యూస్‌ ఛానల్‌ చూసుకోమన్నాడు. ఇంకా చిత్రమేమిటంటే ట్విట్టర్లో ఈ చిత్రానికి విపరీతమైన అభినందనలు రావడం! ఒంటి నిండా బాంబులు ఉన్నాయని హైజాకరు చెబుతున్నా, ‘ధైర్యంగా’ అతనితో సెల్ఫీ దిగినందుకు ఇన్నిస్‌ను ట్విట్టర్‌లోకం విపరీతంగా అభినందించింది. సెల్ఫీల చరిత్రలో మరో అరుదైన ఘట్టం చేరింది.

ఆ సింహం అడవిలో ఉండదు.. 

సాధారణంగా సింహం అంటే అడవిలో ఉంటూ.. జంతువులని వేటాడి తింటూ ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే.. ఇక్కడ ఒక సింహం మాత్రం అడవిలో ఉండదు.. అందునా దుప్పటి ఉంటేకానీ నిద్రపోదు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు.. వివరాల ప్రకారం.. అమెరికాలోని ఒక కుటుంబం అడవిలో ఉండే ఒక సింహపు పిల్లని తెచ్చుకొని పెంచుకునేది. దానికి ల్యాంబర్ట్ అని పేరు కూడా పెట్టారు. అయితే సింహపు పెద్దయితే భవిష్యత్ లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని గమనించి.. దానికి ఆహారం పెట్టకుండా మాడ్చి ఆఖరికి బయటకు వదిలిపెట్టారు. అది కాస్త వెటర్నరీ టెక్నీషియన్, ఇన్ సింక్ ఎగ్జోటిక్స్ అనే వన్యప్రాణుల సంరక్షణ, ఎడ్యుకేషనల్ సెంటర్ డైరెక్టర్ గా పనిచేస్తున్న విక్కీ కీహే కంట పడింది. తను దానిని తీసుకువచ్చి వన్యప్రాణుల సంరక్షణా కేంద్రానికి తరలించారు. అయితే ఆయనకు అక్కడ తెలిసిన విషయం ఏంటంటే.. ల్యాంబర్ట్ కు చిన్నప్పటి నుండి పరుపు మీద పడుకోవడం అలవాటని.. అదీ కాక దుప్పటి కప్పుకునే అలవాటు కూడా ఉందని. దీంతో ఆయన దాని కోసం ఒక దుప్పటి తెచ్చి ఇచ్చి ఇచ్చారు. ఆ దుప్పటిని చూసిన ఆనందంతో ల్యాంబర్ట్ దాన్ని చుట్టుసుకుని పడుకునేదని.. పెంపుడు సింహం కాబట్టి అడువుల్లో ఉండలేదని విక్కీ తెలిపారు. 

ప్రియుడిని చంపిన ప్రియురాలు.. గుండె బయటకి తీసి మరీ..

నిజాలు వినడానికి బానే ఉంటాయి. కానీ ఒక్కోసారి.. కొన్ని నిజాలు వింటే మాత్రం భయపడాల్సి వస్తుంది. అలాంటిదే బంగ్లాదేశ్ లో జరిగింది. ఓ యువతి కోర్టుకు చెప్పిన నిజం విని జడ్జి, న్యాయమూర్తులుతో సహా అక్కడున్న వారందరూ ఖంగుతిన్నారు. అసలు సంగతేంటంటే.. బంగ్లాదేశ్‌కు చెందిన ఫతేమా అఖ్తర్ సొనాలీ (21) అనే యువతి షిపాన్ (28) అనే వ్యక్తిని ప్రేమించింది. అయితే షిపాన్ మాత్రం ఆమెతో పాటు ఇంకో యువతితో కూడా సంబంధం పెట్టుకున్నాడు. అంతేకాదు.. ఆమెతో సన్నిహితంగా గడిపిన క్షణాలను వీడియోలుగా తీసి తన ల్యాప్ ట్యాప్‌లో భద్రపరిచాడు. ఇక ఆ వీడియోలు చూసిన సొనాలీ అతనిని హత్య చేయాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగానే వారు కలిసినప్పుడు అతని కూల్ డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిన వెంటనే అతి దారుణంగా పొడిచి చంపింది. అక్కడితో ఆగకుండా తన శరీరం నుండి గుండెను వేరు చేసింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఇక కోర్టుకు హాజరుపరిచిన ఆమెను ఎందుకు చంపావని అడుగగా..తనతో పాటు.. అనేక మందిని ప్రేమించిన అతని గుండె ఎంత విశాలమైనదో చూసేందుకు ప్రియుడిని హత్య చేసి.. శరీరం నుంచి గుండెను వేరు చేసి చూశానని చెప్పింది. దీంతో ఆమెను దోషిగా పరిగణించిన న్యాయస్థానం, మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

బ్యాంకులకు మాల్యా బంపరాఫర్..

  బ్యాంకు బకాయిలు తీర్చేందుకు కింగ్ పిషర్ అధినేత విజయ్ మాల్యా ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన మాల్యా.. బ్యాంకులు ఇచ్చిన రుణాలను తప్పకుండా తీరుస్తానని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా మాల్యా తరపు న్యాయవాది.. బ్యాంకులు ఇచ్చిన రుణాలను తన క్లెయింట్ తీరుస్తారని.. ఇందులో భాగంగా తొలి విడతగా రూ.4 వేల కోట్లను చెల్లించేందుకు మాల్యా సిద్ధంగా ఉన్నారన్నారు. సెప్టెంబర్ లోగా ఈ చెల్లింపులను పూర్తి చేస్తారన్నారు. కాగా బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు టోకరా వేసిన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.   

సహారా గ్రూపు సంస్ఠల ఆస్తులు అమ్మేయండి.. సుప్రీం

వేలాది మంది పెట్టుబడిదారుల డబ్బు తిరిగి ఇచ్చేందుకు గాను సహారా గ్రూపు సంస్ఠల ఆస్తుల అమ్మకానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సెక్యురిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజి బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ)ను సహారా రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులను విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. అంతేకాదు సహారా ఆస్తులను మార్కెట్‌ ధరలో 90 శాతానికి తక్కువ కాకుండా విక్రయించాలని.. ఒకవేళ దానికంటే తక్కువకు అమ్మాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని తెలిపింది. కాగా సహారా గ్రూప్‌ సంస్థల అధినేత సుబ్రతా రాయ్‌ 2014 మార్చిలో అరెస్టయిన సంగతి తెలిసిందే.

అనారోగ్యం బాలేదని స్పీకర్ కు ఎమ్మెల్యేల లేఖలు... అసెంబ్లీ ప్రాంగణంలో ప్రత్యక్షం..

  ద్రవ్య వినిమయ బిల్లు ఓటింగ్ లో పాల్గొనాలని వైసీపీ అధినేత తమ పార్టీ ఎమ్మెల్యేలందరికీ.. వారితో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కూడా విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తమ పార్టీ నుండి టీడీపీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేందుకే జగన్ వారికి కూడా విప్ జారీ చేశారు. ఎందుకంటే విప్ జారీ చేసిన తరువాత అసెంబ్లీకి రాకపోతే వారిపై వేటు వేసే అవకాశం ఉంటుంది. అయితే జగన్ ఎత్తుకు పై ఎత్తుగా వారు స్పీకర్ కు లేఖలు రాశారు. తమకు అనారోగ్యం కారణంగా నేటి సభకు హాజరుకావడంలేదని లేఖలో పేర్కొన్నారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. స్పీకర్ కు లేఖలు రాసిన ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ప్రత్యక్షమయి అందరికీ షాకిచ్చారు. అయితే వారు సభలోపలికి వస్తారా..? లేదా..? అన్నది సందేహం..కాగా.. ఏపీ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై మరికాసేపట్లో ఓటింగ్ జరగనుంది.

ఈజిప్ట్‌ విమానం హైజాకర్ తో సెల్ఫీ.. నడుముకు బాంబులతో హైజాకర్

  స్మార్ట్ ఫోన్ల యూజర్లకు సెల్ఫీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటూ తమ ముచ్చట తీర్చుకుంటున్నారు. ఈ సెల్పీల వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఈమధ్య ఆపిచ్చి మరీ శృతి మించిపోతుంది. నిన్న అలెగ్జాండ్రియా నుంచి కైరో వ‌స్తున్న ఈజిప్ట్‌ విమానాన్ని హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే హైజాక్ అయిన సమయంలో ఏకంగా ఆ దుండగుడితో క‌లిసి ఓ వ్య‌క్తి సెల్ఫీ తీసుకొని సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఇబ్రహీం సమాహా అనే వ్యక్తి విమానాన్ని హైజాక్ చేసిన నేపథ్యంలో ఆ సమయంలో బందీగా ఉన్న బ్రిటన్‌కు చెందిన బెంజిమిన్‌ ఇన్స్‌ అనే యువ ప్రయాణికుడు.. హైజాకర్‌ దగ్గరకు వెళ్లి సెల్ఫీకి ఫోజివ్వ‌మ‌న్నాడు నడుముకు బాంబులు చుట్టుకున్న హైజాకర్‌తో కలిసి సెల్ఫీ తీసుకుని.. దాన్ని ట్విట్టర్‌ ద్వారా స్నేహితులకు పంపాడు. అంతేకాదు చక్కగా నవ్వుకుంటూ ఫొటోకి ఫోజ్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎవ్వ‌రి పిచ్చి వారికానందం క‌దా.. !

ఇసుక విధానంపై చంద్రబాబు.. ప్రతిపక్షానికి బంపరాఫర్

  ఏపీ అసెంబ్లీలో ఇసుక విధానంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య రగడ మొదలైంది. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఉచిత ఇసుక ప్రజల హక్కు.. ఇసుకని ఉచితంగా ఇస్తున్నాం.. దొంగలకి మాత్రం కాదు.. ఇసుక దొంగల్ని పీడియాక్ట్ కింద బుక్ చేస్తాం అని అన్నారు. రెండేళ్లపాటు ఇసుక దోచుకున్నారు.. ఇసుకను అడ్డం పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అంతేకాదు ఈ సందర్భంగా ఆయన విపక్షానికి ఓ బంపరాఫర్ కూడా ఇచ్చారు. విమర్శలు మాని విపక్ష సభ్యులు కూడా ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని.. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని పట్టుకుని అప్పగించాలని సూచించారు.

ఏనుగులు మీద రాళ్లు విసిరారని.... నలుగురి అరెస్టు

  కొంతమందికి మూగజీవాలను చూస్తే చేతులు ఊరుకోవు, తిరిగి దాడి చేయవనో, దాడి చేసినా తప్పించుకోవచ్చుననో... వాటని హింసించి పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. కేరళలో జరిగిన ఒక సంఘటన కూడా ఇలాంటిదే! కాకపోతే, ఈ విషయం సోషల్ మీడియాలో పొక్కడంతో ఈసారి నిందితులు చట్టానికి చిక్కక తప్పలేదు. గత వారం కేరళలోని 212 జాతీయ రహదారి మీద జరిగిన ఈ ఘటనలో నలుగురు యువకులు, దారి పక్కన పిల్లతో కలిసి నిల్చొన్న ఓ ఏనుగు మీద విచక్షణారహితంగా రాళ్లు విసిరారు.   ఈ విషయాన్ని మరో కారులో ఉన్న వ్యక్తి వీడియో తీయడంతో, సోషల్‌ మీడియాలో సంచలనంగా మారింది. దుండగులు రాళ్లు విసురుతున్నంతసేపూ ఏనుగులు రెండూ నిస్సహాయంగా నిల్చొని ఉండటం, ప్రేక్షకులను కలచివేసింది. ఈ వీడియో ఆధారంగా రియాజ్‌, షమల్‌ హషీమ్‌, అబ్దుల్‌ రజాక్, షమీర్‌ అనే వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్లు తేలింది. మీడియా నుంచి పెరుగుతున్న ఒత్తిడికి తల ఒగ్గిన ప్రభుత్వ అధికారులు, వీరిని అదుపులోకి తీసుకున్నారు.

మోత్కుపల్లి భావోద్వేగం.. పసుపుజెండాతోనే సచ్చిపోతాం..

టీడీపీ 35 వ ఆవిర్భావ వేడుకలు ఎన్టీఆర్ భవన్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ ఇంకా పలువురు టీడీపీ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ సీనియర్ మోత్కుపల్లి నరసింహులు కాస్త భావోద్వేగంగా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడే ప్రసక్తే లేదు.. నాకు 27 ఏళ్ల వయసు ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను.. అప్పుడు ఎన్టీఆర్ అవకాశం ఇస్తే ఎమ్మెల్యేలమయ్యాం.. ఆ తరువాత మంత్రి పదవులు కూడా అనుభవించాం..అలాంటి పార్టీని మారే ప్రసక్తి లేదు.. పసుపుజెండా కప్పుకొనే సచ్చిపోతామని ఉద్వేగంతో మాట్లాడారు. అంతేకాదు మాట్లాడుతూనే చంద్రబాబుకి సూచనలు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ పరిస్థితి గురించి కొంచెం ఆలోచించాలని..  తెలంగాణలో మేం అభద్రతకు లోనవుతున్నామని.. కానీ మేం వేరోకచోటికి పోకుండా కాపాడాల్సిన బాధ్యత పార్టీ అధినేతపైనే ఉందని చెప్పారు.   ఇక టీఆర్ఎస్ గురించి కూడా ఆయన మాట్లాడుతూ నాలుగు విమర్శనాస్త్రాలు విసిరారు. 'ఇంటికి కొత్త బర్రె వస్తే ఇంట్లో వాళ్లంతా కలిసి పెంట తీశారన్న సామెత టీఆర్ఎస్ పార్టీకి బాగా సూటవుతుందని.. ప్రస్తుతం ఆ పార్టీపై అందరికి మోజు ఉందని.. ఆ మోజు ఎక్కువ కాలం ఉండదని.. ఎద్దేవ చేశారు.