పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అల్లర్లు.. సీపీఎం ఏజెంట్ మృతి

  పశ్చిమ బెంగాల్ లో మూడోదశ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా సిబ్బంది భారీగా మోహరించినా ముర్షిదాబాద్ లో మాత్రం అల్లర్లు జరిగాయి. ముర్షిదాబాద్లో సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు నాటు బాంబును వేయడంతో సీపీఎం పార్టీకి చెందిన ఓ ఏజెంట్ మరణించాడు.మరోవైపు బర్దవాన్ జిల్లాలో కూడా కొంతమంది తుపాకీతో.. ముఖానికి గుడ్డలు కట్టుకొని పోలింగ్ కేంద్రాలవద్ద హల్ చల్ చేయగా పోలీసుల రంగంలోకి దిగి వారిని చెదరగొట్టారు. కాగా పశ్చిమబంగాలో నేడు 62 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.

ర్యాంకులపై అసంతృప్తితో నారాయణ... బుజ్జిగించే పనిలో చంద్రబాబు

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు ర్యాంకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఇచ్చిన ఈ ర్యాంకులతో సొంత పార్టీ నేతలే కాదు.. పక్క పార్టీ నేతలు కూడా ఖంగుతిన్నారు. ఇక మంత్రులైతే ఈ ర్యాంకుల వల్ల తమ సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందో అని తెగ బాధపడుతున్నారట. అంతేకాదు కొంతమంది అలకపాన్పు కూడా ఎక్కారంట. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే మంత్రి నారాయణ అయితే తనకు లాస్ట్ ర్యాంకు వచ్చినందుకు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో చంద్రబాబే స్వయంగా ఆయనకు ఫోన్ చేసి బుజ్జగించే పనిలో పడ్డారంట. ర్యాంకులను పట్టించుకోవద్దని.. సరైన ప్రాతిపదికగా ర్యాంకులు ఇవ్వలేదని.. అది అసమగ్ర సర్వే అని తాను కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే ఈ ర్యాంకులు చూసి బయటకు ఇవ్వవద్దని ఆదేశించానిని, మీడియాకు ఎలా లీకయ్యాయో కూడా విచారణ జరుపుతున్నామని చంద్రబాబు నారాయణను బుజ్జగించినట్లు తెలుస్తోంది. దీనికి నారాయణ కూడా తాను పట్టించుకోవటంలేదని, ఒకవేళ చివరి ర్యాంకు వచ్చినా సవాల్‌గా తీసుకొని మరలా పనిచేస్తానని చెప్పారంట. మొత్తానికి ఈ ర్యాంకులతో మంత్రుల గుండెల్లో గుబులు పడుతున్నట్టు మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.

మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో మోడీ.. ఇంటర్నెట్లో జోకులు

  ప్రధాని నరేంద్ర మోడీ మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో పెట్టిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇటీవలే మోడీ కొలతలు తీసుకెళ్లిన మ్యూజియం సిబ్బంది.. అప్పుడే మోడీ విగ్రహాన్ని తయారు చేసి దానిని మ్యూజియంలో ఉంచారు. మోడీ కూడా తన విగ్రహాన్ని చూసి ఎంతో సంబరపడిపోయారు. ఇక బీజేపీ నేతలు కూడా ప్రపంచంలో ప్రముఖ నాయకుల సరసన మోడీ చేరినందుకు సంతోషపడుతున్నారు. మేడమ్ టుస్సాడ్ మ్యూజియపు సింగపూర్, బ్యాంకాక్, హాంకాంగ్ శాఖలలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటుచేసారు. తెలుపు రంగు కుర్తా పైజామా, క్రీమ్ కలర్ జాకెట్ తో నమస్కార భంగిమలో ఆ విగ్రహం ఉంది. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఇంటర్నెట్లో మాత్రం మోడీ మైనపు విగ్రహంపై పలు జోకులు, సెటైర్లు హల్ చల్ చేస్తున్నాయి. ఆ జోకులేంటే మనం కూడా ఓ లుక్కేద్దాం.. **మోడీని మరింత ఎత్తుగా, తెల్లగా తయారుచేశారు. అంతేకాదు ఇక ఆయన వెళ్లిన చోటల్లా శాశ్వతంగా చేతులు కిందకు దించకుండా నమస్కార భంగిమలోనే ఉండవచ్చని ఒకరు అన్నారు.     **నిజమైన మోడీ మైనపు మోడీతో: హే.. చూసావా.. ఇప్పుడు భారతీయులకు ఇద్దరు మోడీలున్నారు. నువ్వు దేశంలో ఉండూ నేను ప్రపంచ దేశాలను పర్యటనలుగా చుట్టేసి వస్తాను.. మన ఇద్దరి తేడా ఎవరూ కనిపెట్టలేరు.     **యూపీఏ ప్రభుత్వం చేయలేని ఘనకార్యాన్ని మోడీ సాధించారు. ఆయన మోడీని దేశానికి రప్పించారు.   **ఈ ఇద్దరిలో తండ్రెవరూ.. కుమారుడెవరో చెప్పలేక మీడియా బుర్రలు బద్ధలుకొట్టుకుంటోందంటూ ఇంకొక ట్వీట్ వాలా జోక్ చేసాడు.  

పశ్చిమ బెంగాల్.. మూడో దశ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

  పశ్చిమ బెంగాల్ లో కీలకమైన మూడో దశ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్ర 6 గంటల వరకూ ఈ ఎన్నికల ప్రక్రియ సాగుతోంది. ముర్షీదాబాద్‌, నదియా, వర్థమాన్‌, ఉత్తర్‌ కోల్‌కతాలోని 62 నియోజకవర్గాల్లో 9 గంటల వరకూ 18.29 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. కాగా ఎన్నికల్లో 418 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా. వీరిలో 34 మంది మహిళలు కూడా ఉన్నారు. మరోవైపు ఎలాంటి గొడవలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కేంద్ర సాయుధ దళాలకు చెందిన 75వేల మందిని మోహరించింది. మరో 25వేల మంది రాష్ట్ర పోలీసు సిబ్బంది సైతం విధులు నిర్వహిస్తున్నారు. కాగా 1.37కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.

కోలుకోలేక గుర్రం శక్తిమాన్ మృతి..

  బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి శక్తిమాన్ అనే భద్రతా దళానికి చెందిన గుర్రంపై దాడి చేసిన ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ దాడిలో గుర్రం ఒక కాలు విరిగిపోగా వైద్యులు దానిని తీసివేసి కృత్రిమ కాలును అమర్చారు. శక్తిమాన్ కాలు పోగొట్టుకున్నసంగతి తెలుసుకున్న ఒక అమెరికన్ తన సొంత ఖర్చుతో కృత్రిమ కాలు తయారు చేయించాడు. వైద్యులు ఆ కృత్రిమ కాలునే గుర్రానికి అమర్చారు కూడా. అనంతరం అది లేచి నిలబడిందని.. కోలుకుంటుందని వార్తలు కూడా వచ్చాయి. కానీ కోలుకోలేక శక్తిమాన్ ప్రాణాలు విడిచింది. మొత్తానికి రాజకీయ నేతల పనికిరాని ఆందోళనలకు ఒక మూగజీవి తన ప్రాణాలు బలిగొంది.

తమిళనాడు రాజకీయాల్లో వేడి... విజయకాంత్ కార్యలయంపై రాళ్లతో దాడి..

  త్వరలో తమిళనాడులో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వాతావరణం వాడి వేడిక్కింది. ఇప్పటికే నేతలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు తాజాగా అది కాస్త పరస్పర దాడుల వరకూ వెళ్లింది. డీఎండీకే అధినేత విజయకాంత్  పార్టీ కార్యాలయంపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో కార్యాలయం అద్దాలు, కొంత ఫర్నీచర్ ధ్వంసమైనట్టు తెలుస్తోంది. తమ ఆఫీసుపై కొందరు ఆందోళనకారులు దాడికి దిగారని డీఎండీకే కార్యాలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మరి ఈ ఘటనపై విజయ్ కాంత్ ఎలా స్పందింస్తారో చూడాలి.

మరో వివాదంలో చిక్కుకున్న ట్రంప్..

అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కామన్. అలాంటి వ్యాఖ్యలు చేసే ట్రంప్ అప్పుడప్పుడు వివాదంలో చిక్కుకుంటారు. ఇప్పుడు తాజాకా మరో వివాదంలో చిక్కుకున్నారు. తాను తిరుగుతోన్న విమానాన్ని రెన్యూవల్ చేయించుకోక‌పోవ‌డంతో చిక్కుల్లో ప‌డ్డారు. ఆయ‌న ఉప‌యోగిస్తోన్న‌ సెస్నా జెట్ విమానం రిజిస్ట్రేషన్ గడువు జనవరి 31తో ముగిసింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న రిజిస్ట్రేష‌న్ ఫీజు చెల్లించ‌లేదు. దీంతో సంబంధిత అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే ట్రంప్ కి ఈ విమానంతో పాటు మ‌రో నాలుగు హెలికాప్టర్లు ఉన్నాయి. ఒక వేళ నోటీసుల నేప‌థ్యంలో సెస్నా జెట్ విమానాన్ని వినియోగించుకోలేక‌పోతే ఇక‌పై ట్రంప్ త‌న‌ హెలికాఫ్ట‌ర్ల‌లో తిరిగే అవ‌కాశాలున్నాయని భావిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీలో ముసలం.. పొంగులేటి రాజీనామా..

  ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుండి అనేక మంది నేతలు అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. ఇప్పుడు మరో సీనియర్ నేత కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. పొంగులేటి సుధాకర్ రెడ్డి పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేసి తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి పంపించారు. ఈ సందర్బంగా ఆయన పార్టీ వైఖరిపై అసంతృప్తిగా ఉన్నానని.. తమకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ప్రాధానమిస్తూ అందలం ఎక్కించుకుంటుందని.. పనిచేసే వారికి పదవులు ఇవ్వరా అని లేఖలో పేర్కొన్నారు. దీంతో విషయం తెలుసుకున్న టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ నేత షబ్బీర్ అలీలు రంగంలోకి దిగి ఆయనను బుజ్జగించే పనిలో పడ్డారు. సీనియర్లను పక్కన పెట్టమని, అందరికీ అవకాశమిస్తామని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు.

పుట్ పాత్ లపై ఆలయాలేంటీ.. దేవుళ్లే సిగ్గుపడతారు.. సుప్రీంకోర్టు

  అక్రమంగా నిర్మిస్తున్న ఆలయాలపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు అక్షింతలు వేసింది. రోడ్లు,  ఫుత్ పాత్ లు,  పేవ్ మెంట్లపై ఆలయాలు నిర్మించడం ఏంటి.. ఇలా చేయడం వల్ల దేవుళ్లే సిగ్గుపడతారని ఘాటుగా వ్యాఖ్యానించింది. అంతేకాదు దీనిపై గతంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అక్రమంగా నిర్మించిన కట్టడాల తొలగింపునకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని.. దానికి సంబంధించిన అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాలకు ఆదేశించినా ఇప్పటి వరకూ ఎందుకు స్పందిచలేదు అని మండిపడింది. రెండు వారాల్లోగా ప్రభుత్వాలు అఫిడవిట్ దాఖలు చేయాలని.. ఇదే తుది అవకాశం అని హెచ్చరించింది. అలా చేయకపోతే ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు స్వయంగా హాజరై.. ఈ విషయంపై గతంలో పలు పర్యాయాలు తాము ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది.

రాజీవ్ హంతకుల విడుదలకు సహకరించలేం.. కేంద్రం

  తమిళనాడు ప్రభుత్వం ఎప్పటినుండో రాజీవ్ హంతకులను విడుదల చేయాలని చూస్తోంది. అయితే ఇప్పుడు ఈ విషయంలో కేంద్రం కూడా మేం ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని తేల్చి చెప్పేసింది. ముఖ్యమంత్రి జయలలిత  ఈ కేసులో నిందితులుగా ఉన్న మురుగన్‌, చరియవలన్‌, సంతన్‌, జయకుమార్‌, రాబర్ట్‌ పరవీవలన్, రవిచంద్రన్‌తోపాటు నళినిని విడుదల చేయాలంటూ ఇప్పటికే రెండు మూడుసార్లు కేంద్రానికి లేఖలు రాశారు. అయితే దీనిపై స్పందించిన కేంద్రం రాజీవ్‌ హంతకుల విడుదలకు సహకరించలేమని స్పష్టం చేసింది.   కాగా వీరికి గతంలో సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే 20 ఏళ్లుగా జైల్లో ఉన్నందున వారిని విడుదల చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం 2014 అసెంబ్లీలో తీర్మానం చేస్తూ... ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపిన సంగతి తెలిసిందే.

ప్రత్యూష గర్బవతి అని నాకు ముందే తెలుసు...రాహుల్

  బాలిక వధు నటి ప్రత్యూష బెనర్జీ గర్భవతే అని.. అయితే ఆత్మహత్యకు కొద్ది రోజుల ముందు ఆమె అబార్షన్ చేయించుకుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ స్పందించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రత్యూష బెనర్జీ గర్భవతి అనే విషయం తనకు ముందే తెలుసని బాంబు పేల్చాడు.   మరోవైపు పోలీసులు ఇప్పుడు ప్రత్యూష బెనర్జీ అబార్షన్ చేయించుకున్న నేపథ్యంలో ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అసలు ప్రత్యూష ఎందుకు అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది.. తనకు ఇష్టముండే అబార్షన్ చేయించుకుందా.. లేక చేయించుకోవాల్సి వచ్చిందా.. అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.   ఇదిలా ఉండగా ప్రత్యూష తరపు లాయర్ మాత్రం.. రాహుల్ ప్రేరేపించడంవల్లే ప్రత్యూష అబార్షన్ చేసుకుందని.. రాహుల్ మోసం చేశాడనడానికి ఇంతకు మించిన ఆధారాలు ఇంకేం కావాలని నీరజ్ గుప్తా అన్నారు. మరోవైపు ప్రత్యూష కేసులో ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ తరఫున వాదిస్తున్న లాయర్ చీటింగ్ కేసులో అరెస్టైనట్లుగా తెలుస్తోంది. అతనిని ఆజాద్ మైదాన్ పోలీసులు అరెస్టు చేశారని తెలుస్తోంది. రాహుల్ తరఫు లాయర్‌తో పాటు మరో ఇద్దరు అడ్వకేట్లను అరెస్ట్ చేసినట్లు సమాచారం.

మరోసారి బయటపడిన పాక్ పైశాచికం.. క్రిపాల్ సింగ్ గుండె, కాలేయం మాయం

  దేశ సరిహద్దు దాటినందుకు ఉగ్రవాదం.. గూఢాచార్యం మోపి కొన్ని ఏళ్లుగా పాక్ జైల్లో బందీగా గడిపిన క్రిపాల్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇప్పటికే క్రిపాల్ సింగ్ ను పాకిస్థానే చంపిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. మరోసారి పాక్ పైశాచికత్వం బయటపడింది. పాకిస్థాన్ నుండి క్రిపాల్ సింగ్ మృత దేహాన్ని పంజాబ్ కు తరలించారు. అయితే క్రిపాల్ సింగ్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేయగా ఆయన గుండె, కాలేయం తదితర అవయవాలు లేవని తెలిసింది. కాగా, మరోసారి పోస్టు మార్టం చేయాలంటే, శరీరంలోని ప్రధాన అవయవాల అవసరం ఉంటుందని, అందువల్లే అవయవాలు లేని శరీరాన్ని పాక్ పంపిందని వైద్యులు తెలిపారు.   మరోవైపు క్రిపాల్ సింగ్ ను పాక్ ప్రభుత్వమే చంపేసిందని.. ఎందుకంటే సరబ్ జిత్ సింగ్ హత్య కేసులో ఆయనొక్కడే సాక్ష్యమని.. సరబ్ ఎలా మరణించాడో బయటకు తెలియకుండా చేసేందుకే పాక్ ప్రభుత్వం ఆయన్ను చంపించింది' అని క్రిపాల్ కోడలు అశ్వని ఆరోపించారు.

టాప్ లెస్ తో పోలీసు అధికారిణి సెల్ఫీ.. నన్ను నేనే అసహ్యించుకుంటున్నా

  తప్పులు చేయడం ఆ తర్వాత పశ్చాత్తాప పడటం సహజం. ఇక్కడ ఓ పోలీసు అధికారిణి సభ్య సమాజం తలదించుకునే పనిచేసి ఆతరువాత తప్పు చేశానని పశ్చాత్తాప పడింది. ఇంతకీ సంగతేంటంటే.. మెక్సికోలోని ఎస్కోబెడోలో నిదియా కార్సియా అనే పోలీస్ అధికారిణి పెట్రోలింగ్ చేస్తూ ఓ సెల్ఫీ తీసుకుంది. అది కూడా మామూలుగా కాదు టాప్ లెస్ తో సెల్పీ తీసుకొని అక్కడితో ఆగకుండా దానిని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. అంతే ఈ విషయం కాస్త పోలీసు ఉన్నతాధికారుల వరకూ వెళ్లడంతో ఆమెను విచారణకు ఆదేశించారు. అంతేకాదు డ్యూటీలో, యూనిఫాంలో ఉండగానే ఆమె ఆయుధాలను పక్కన పెట్టి సెల్ఫీ దిగిందని గుర్తించి చర్యలు తీసుకున్నారు.   ఇదిలా ఉండగా జరిగిన దాని గురించి నిదియా పశ్చాత్తాపం వ్యక్తం చేయడం గమనార్హం. అలా చేసినందుకు నన్ను నేనే అసహ్యించుకుంటున్నానని, ఇద్దరు పిల్లలకు తల్లి అయినా తాను ఇలా చేయడంపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపిందని తెలుస్తోంది. తాను తన కుటుంబానికి చెడ్డపేరు తెచ్చానంది.

తమ పార్టీపై జోస్యం చెప్పిన కేజ్రీవాల్.. 15 ఏళ్లు మాదే అధికారం

  ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓ జోస్యం చెప్పారు. ఇంతకీ ఆయన ఎవరికి జోస్యం చెప్పారనుకుంటున్నారా..? ఎవరికో కాదు తమ పార్టీ గురించి తానే ఓ జోస్యం చెప్పారు. అసలు సంగతేంటంటే.. సివిల్ సర్వీసెస్ డేను పురస్కరించుకుని అఖిల భారత సర్వీసు అధికారులతో నిన్న కేజ్రీవాల్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన ఓ అసక్తికరమైన ప్రటకన చేశారు. ఢిల్లీలో మరో 10 నుంచి 15 ఏళ్ల పాటు అధికారం తమదేనని ఆయన అన్నారు. అంతేకాదు దానికి కారణం కూడా చెప్పారు ఆయన. తమ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఢిల్లీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని.. మరో రెండు, మూడు ఎన్నికల్లో తమ పార్టీనే విజయం వరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎవరేమన్నా... 45 ఏళ్ల వయసు నిండిన ఢిల్లీ వాసుల అభిప్రాయం ఇదేనని కూడా ఆయన పేర్కొన్నారు.

పనామా పుణ్యమా అమితాబ్ ఔట్..ప్రియాంక చోప్రా ఇన్..!

  అసహనంపై దేశం మీద వ్యాఖ్యలు చేసినందుకో లేక.. పదవీ కాలం ముగియడంతోనో కాని ఇన్ క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ నుండి అమీర్ ఖాన్ తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రాల పేర్లు తెరపైకి వచ్చాయి. వీరిద్దరిలో కూడా దాదాపు అమితాబ్ పేరు ఖరారైనట్టే అన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు అమితాబ్ కాకుండా ప్రియాంక చోప్రా వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా పనామా పేపర్స్ పుణ్యమా అంటూ... ఆ పత్రిక విడుదల చేసిన నల్లకుబేరుల జాబితాలో అమితాబ్ బచ్చన్ పేరు కూడా ఉంది. ఇండియాలో పన్ను చెల్లించకుండా, డబ్బును విదేశాలకు తరలించి దాచుకున్నారన్నది ఆయనపై ఆరోపణ. దీంతో ఆయనను బ్రాండ్ అంబాసిడర్ తీసుకుంటే లేనిపోని విమర్శలు ఎదురవుతాయని భావించి టూరిజం శాఖ చూపు తాజాగా ప్రియాంకా చోప్రా వైపు చూస్తున్నట్టు తెలుస్తొంది. కాగా ప్రస్తుతం ప్రియాంకచోప్రా అటు బాలీవుడ్ లోనూ.. హాలీవుడ్ లోనూ తన సత్తా చూపుతోంది. అంతేకాదు ఇటీవల పీపుల్స్ చాయిస్ అవార్డును ప్రియాంక దక్కించుకుంది. అంతేనా ఆస్కార్ వేదికపై కూడా స్థానం సంపాదించుకుంది. దీంతో ప్రియాంకకు అంతర్జాతీయంగా పేరు ఉంది కాబట్టి ఆమెకే ఆ అవకాశం దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

మమతా బెనర్జీపై ఈసీ మండిపాడు.. మీరే పంపాలి..

ఎన్నికల కోడ్ ఉల్లఘించినందుకుగాను వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మమతా నోటీసులపై ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందించారు. అయితే ఇప్పుడు దీనిపై మమతా బెనర్జీపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా మండిపడింది. దీనిపై మమత వ్యక్తిగతంగా స్పందించాలని స్పష్టం చేస్తూ.. ఈనెల 22లోగా సమాధాన్ని పంపాలని పేర్కొంది.  'సమాధానాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకుండా మీరే పంపాలి' అని స్పష్టంచేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కాకుండా తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలి హోదాలో ఆమెకు నోటీసు జారీ చేశామని తెలిపింది. అంతేకాదు మొదట ఇచ్చిన నోటీసులో మమతను పశ్చిమ్‌ బంగ ముఖ్యమంత్రిగా సంబోధించగా.. తాజా లేఖలో మాత్రం తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఈసీ పేర్కొంది.