పాలేరు ఉపఎన్నికపై చంద్రబాబు అసంతృప్తి... అదే కారణమా..?
posted on Apr 23, 2016 @ 6:14PM
పాలేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మరణంతో ఉపఎన్నిక ఖాయమైంది. అయితే ఈ ఉపఎన్నిక బరిలోకి టీఆర్ఎస్ పార్టీ నుండి ఇప్పటికే తుమ్మల నాగేశ్వర్రావును దించనున్నట్టు ఆ పార్టీ ప్రకటించేసింది. ఇక తుమ్మలకు పోటీగా టీడీపీ నుండి నామా నాగేశ్వర్రావును బరిలో దించాలని టీడీపీ కూడా చర్చలు జరుపుతోంది. అయితే అంతా బాగానే ఉన్న టీడీపీ నుండి పాలేరు ఉపఎన్నికకు పోటీచేయడానికి చంద్రబాబు మాత్రం ఆసక్తి చూపించడంలేదనే వార్తలు వస్తున్నాయి. అంతేకాదు అర్థాంతరంగా కన్నుమూసిన ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులకు ఈ సీటును వదిలిపెట్టాలని ఆయన అన్నట్లు చెబుతున్నారు. అయితే, ఏకగ్రీవానికి అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అంగీకరించలేదు. దీంతో పాలేరులో పోటీ చేయాలా, వద్దా అనే విషయంపై నిర్ణయాన్ని ఆయన తెలంగాణ రాష్ట్ర కమిటికే అప్పగించారు. ఈ విషయాన్ని టిడిపిఎల్పీ నాయకుడు రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు.
మరోవైపు చంద్రబాబు ఆసక్తి చూపించకపోవడానికి గల కారణాలు కూడా వేరే ఉన్నాయని అంటున్నారు. కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి చెప్పినట్టు.. నోటుకు ఓటు కేసుకు సంబంధించి కేసులో చంద్రబాబును ప్రాసిక్యూట్ చేయడానికి సంబంధించిన ఫైల్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బల్లపై ఉందని, కెసిఆర్ సంతకం చేస్తే ఎసిబి చంద్రబాబును ప్రాసిక్యూట్ చేస్తుందని అందుకే ఆయన అంతకా ఇంట్రెస్ట్ చూపించడంలేదని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.