మహమ్మారి మళ్ళీ కోరలు చాస్తోంది!

చచ్చింది అనుకున్న. కొవిడ్ 19 (కరోనా) మహమ్మారి మళ్ళీ బతికొచ్చింది. రెండు సంవత్సరాలకు పైగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలితీసుకున్న, కరోనా భూతం తిరిగొచ్చింది. అది సృష్టించిన ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న ఆర్థిక వ్యవస్థపై మరోమారు దండయాత్రకు మహమ్మారి సిద్దమవుతోంది.   అవును ఎక్కడో కొవిడ్ పుట్టిల్లు చైనాలో కాదు, మన దేశంలోనే కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను హెచ్చరించింది.  తెలంగాణ సహా ఆరు రాష్ట్రాల్లో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు   అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖ రాసింది. ఈ జాబితాలో తెలంగాణ పొరుగునున్న మహారాష్ట్ర, కర్ణాటక కూడా ఉన్నాయి. వీటితో పాటు తమిళనాడు, కేరళ, గుజరాత్‌కూ గురువారం(మార్చి 16)కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. వైరస్‌ కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కరోనా కేసులు  అకస్మాత్తుగా ఎందుకు పెరుగుతున్నాయో దృష్టిసారించాలని పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లో స్థానిక వ్యాప్తి ద్వారా కేసులు పెరుగుతున్నాయి. ఇలాంటిచోట ముప్పు అంచనాతో ముందు జాగ్రత్త, కట్టడి కీలకం.నియంత్రణ చర్యల్లో ప్రస్తుత పరిస్థితిని కొనసాగించడం అత్యవసరం. ఎక్కడైనా వ్యాప్తి ఆందోళనకరంగా ఉంటే నిరోధానికి ముందస్తు చర్యలు తీసుకోండి. గతంలో విడుదల చేసిన మార్గదర్శకాలను పాటించండి  అని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఆయా రాష్ట్రాలకు రాసిన లేఖలో సూచించారు.  కాగా, తెలంగాణలో చాలారోజుల తర్వాత బుధవారం పాజిటివ్‌ రేటు రెండంకెల గీత దాటింది.  ఒకే రోజున 54 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు గత ఏడాది నవంబరు 12న దేశవ్యాప్తంగా 734 కేసులు వచ్చాయి. నాలుగు నెలల విరామం తర్వాత మళ్లీ గురువారం కేసుల సంఖ్య 700 దాటింది.  బుధవారం( మార్చి 15) ఉదయం నుంచి గురువారం (మార్చి 16) ఉదయం వరకు 24 గంటల  వ్యవధిలో  దేశంలో 754 కొత్త కేసులు నమోదయ్యాయి. గత ఏడాది నవంబర్‌లో తర్వాత కేసులు ఈ స్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి. కరోనా మహమ్మారితో కర్ణాటకలో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 4,633 యాక్టివ్ కరోనా కేసులున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్‌లో లో ఇప్పటివరకు నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య 4,46,92,710కు చేరింది. వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు 5,30,790 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,57,297కి చేరింది.  దేశవ్యాప్తంగా 220.64 కోట్ల వాక్సిన్ డోస్‌లు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. ఇలా ఒక్క సారిగా కేసులు పెరగటానికి  దేశంలో టెస్టులు గణనీయంగా తగ్గడం కూడా కారణం కావచ్చని, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ అన్ని రాష్ట్రాలు/యూటీలను అప్రమత్తం చేస్తూ రాసిన లేఖలో పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు పెరుగుదలపై హెచ్చరిక చేశారు. కొవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకొని.. ఇన్ఫెక్షన్‌ను నివారించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. రాష్ట్రాలు తప్పనిసరిగా జిల్లాల వారీగా పరిస్థితిపై సమీక్షించాలని, కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ సమర్థవంతంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. టెస్ట్ ట్రాక్, ట్రీట్ వ్యాక్సినేషన్ అనుసరించాలని కేంద్రం కోరింది. అయితే, కరోనా గురించి ఇప్పడు అంతగా ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటి వ్యక్తిగత జాగ్రత్తలతో కరోనాను జయించ వచ్చని అంటున్నారు. అయితే, అదే సమయంలో, నిర్లక్ష్యం చేస్తే, మరో మారు మహమ్మారి విజృంభించే ప్రమాదం లేకపోలేదని వైద్యులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పేపర్ లీకేజీ బాధ్యుడు కేటీఆర్.. బండి సంజయ్

టీఎస్పీసీ పేపర్ల లీకేజీ వెనుక ఉన్నది ఐటీ మంత్రి కేటీఆరే అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన సమయమంతా ఢిల్లీ మద్యం కుంభకోణం నుంచి బిడ్డ కవితను, టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీ వ్యవహారం నుంచి కొడుకు కేటీఆర్ ను కాపాడుకేనేందుకే వెచ్చిస్తున్నారన్నారు.  టీఎస్పీఎస్సీ కంప్యూటర్ల నిర్వహణ బాధ్యతంతా ఐటీ శాఖదే అయినందున పేపర్ల లీకేజీకి బాధ్యుడు కేటీఆరే అవుతారని తెలంగాణ   బండి సంజయ్ ఆరోపించారు. ఆయనను వెంటనే కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు.   తప్పు ఎవరు చేసినా… చివరకు నా కొడుకు, బిడ్డనైనా ఊరుకునేది లేదని కేసీఆర్ గతంలో అసెంబ్లీ లో చెప్పిన మాటలకు కట్టుబడి ఉండాలన్నారు.  టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి నిరసనగా జరిగిన ఆందోళనలో అరెస్టై  చంచల్ గూడ జైల్లో ఉంటున్న బీజేవైఎం నాయకులను పరామర్శించిన బండి సంజయ్ ఆ తరువాత పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎస్సీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు ఎస్.కుమార్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు.  టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ తెలంగాణలోని లక్షలాది యువత తీవ్ర ఆందోళనలోకి నెట్టివేసిందన్నారు. ఈ లీకేజీకి నిరసనగా  ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేస్తున్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాశ్ తోపాటు కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసి… జైలుకు పంపడం దుర్మార్గమన్నారు.   లీకేజీపై ప్రశ్నించిన వారిని జైళ్లకు పంపి,    లీకేజీ నేరస్తులకు రాచ మర్యాదలు చేస్తున్నారని బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.   అసలు  టీఎస్పీఎస్సీ ఛైర్మన్ కు తెలియకుండా ఎట్లా లీకైందో తెలియాలనీ, ముందు వాళ్లను ప్రాసిక్యూట్ చేయాలని బండి సంజయ్ అన్నారు. నేరస్తులను కాపాడుకునేందుకే సిట్ వేశారని ఆరోపించారు. మియా పూర్ భూములు, డ్రగ్స్, నయీం కేసులపై వేసిన సిట్ లు ఏమయ్యాయి? సిట్ పరిస్థితి కేసీఆర్ సిట్ అంటే సిట్…. స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్లుతా తయారైందని విమర్శించారు. కేసీఆర్ ఫ్యామిలీ తప్పు చేయకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడానికి అభ్యంతరమేంటని ప్రశ్నించారు.    .

హమ్మయ్య ఓ పనైపోయింది

 ఓ పనై పోయింది. ఒక క్రతువు ముగిసింది. ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  2023- 24 వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టేశారు. మొత్తం రెండు లక్షల 79 వేల 279.27 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను మంత్రి సభ ముందు ఉంచారు. ముందుగా పోతన పద్యంతో బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి మొదలుపెట్టారు. బడ్జెట్ రూపకల్పనలో భాగ్యస్వాములకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. అటు శాసనమండలిలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి సిదిరి అప్పలరాజు మండలి ముందు ఉంచారు.  అంతకు ముందు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం  2023 - 24 వార్షిక బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసింది. అలాగే 2023–24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రిమండలి ఆమోదించింది. అంతుకుముందు 2023 - 24 వార్షిక బడ్జెట్‌తో గురునానక్ కాలనీలోని తన నివాసం నుంచి సెక్రటేరియట్‌కు ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి బయల్దేరి వెళ్లారు. ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ సహా పలువురు అధికారులతో కలిసి బుగ్గన సచివాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్‌లోని తన ఛాంబర్‌లో బడ్జెట్ ప్రతులకు బుగ్గన, అధికారులు ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ...పేద ప్రజలు, బలహీన వర్గాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. పరిపాలనా పరమైన మార్పులు చేసిన వాటికి కేటాయింపులు ఉంటాయన్నారు. ప్రస్తుత పధకాలను బలపరిచేలా మరింత మందికి లబ్ది చేకురేలా  బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.నిజానికి, కేటాయింపుల విషయంలో ఆర్థిక మంత్రి ఎక్కడా  చిన్న చూపు చూడలేదు. చేతికి ఎముక లేదన్న విధంగా, కేటాయింపులు జరిపారు. ముఖ్యంగా సంక్షేమం పేరిట గత మూడు సంవత్సరాలుగా సాగిస్తున్న పందారాం కార్యక్రమం కొనసాగించేందుకు ఆయా శాఖలకు నిధులు దాడిగానే కేటాయించారు. అయితే, ఇందు కు అవసరమైన నిధులు ఎక్కడి నుంచి వస్తాయి.. అనే ప్రశ్నకు విత్త మంత్రి   సమాధానం ఇవ్వలేదు, ఇటు ప్రతిపక్ష పార్టీలు, అటు ఆర్థిక రంగ నిపుణులు కూడా అదే చెబుతున్నారు.     

ఇవేం ఎన్నికలు మాజీ ఐఎఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ధర్మాగ్రహం!

ఆంధ్ర ప్రదేశ్ లో  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి   పాలనలో  పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఎన్నికలు ఎంత ‘చక్క’గా, జరుగుతాయో వేరే చెప్పనక్కరలేదు. గడచిన మూడున్నర సంవత్సరాలలో తిరుపతి లోక్ సభ, రెండు మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత సుందర ముదనష్టంగా జరిగాయో  గుర్తు చేసుకుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరుగుతాయనే విశ్వాసం సన్నగిల్లడం కాదు, చచ్చి పోతుంది అంటున్నారు ప్రజాస్వామ్య వాదులు. అదే విధంగా 2020లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబందించి ఎన్నికల కమిషనర్ (నిమ్మగడ్డ రమేష్ కుమార్ )తో ప్రభుత్వం వ్యవహరించిన తీరు గుర్తుచేసుకుంటే  వైసేపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు, అధికార దుర్వినియోగం జరగని ఎన్నికలు ఆశించను కూడా ఆశించలేమంటే అతిశయోక్తి కాదని కూడా అంటున్నారు. తాజాగా జరిగిన పట్టభద్రులు, ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో  మేథావులు, ప్రజాస్వామ్య ఉద్యమ కార్యకర్తలు, రాష్ట్రంలో  ప్రజాస్వామ్య విలువలు దిగజారుతున్న తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పడు  పెద్దల సభ ఎన్నికలు కూడా, అంతే చక్కగా అదే, ‘అ’క్రమ పద్దతిలో జరిగాయి. ఎన్నికలో గెలవడమే ముఖ్యం,  ఎలా .. అన్నది అప్రధానం. అవును రాజకీయ పార్టీలకు ఎన్నికలలో గెలవడం అవసరమే, అలాగే  విజయం కోసం అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలు అడ్డదారులు తొక్కడం, కొంతవరకు గీత దాటడం కొత్తేమీ కాదు. కానీ  జగన్ రెడ్డి ప్రభుత్వం, జగన్ రెడ్డి పార్టీ పాత రికార్డులు అన్నిటినీ బద్దలు కొట్టేసింది.  ఈ మాట రాజకీయ విశ్లేషకులే కాదు, మాజీ ఐఏఎస్ అధికారులు కూడా ఆరోపిస్తున్నారు.   సహజంగా రాజకీయాలకు దూరంగా ఉండే  రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం  రాష్ట్రంలో  ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజక వర్గాలలో పోలింగ్ జరిగిన తీరు, మొత్తం ఎన్నికల ప్రక్రియ పై తీవ్రంగా స్పందించారు. ఇవేమి ఎన్నికలంటూ ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేశారు.  ఏపీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గాల పోలింగ్ ప్రక్రియ మొత్తం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని విమర్శించారు. 10వ తరగతి కూడా చదవని వారిని పట్టభద్ర ఓటర్లుగా ఓటు హక్కు కల్పించిన విషయం తన దృష్టికి వచ్చిందని అన్నారు. దీనిపై టీవీ ఛానళ్లల్లో కథనాలు కూడా ప్రసారం అయ్యాయని గుర్తు చేశారు. అంతకు ముందే మరో మాజీ ఐఎఎస్ అధికారి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైకృష్ణా రావు కూడా, వైసేపీ పాలనలో ఎన్నికల తీరుపై ఇదే విధంగా వ్యాఖ్యానించారు.   కాగా, రాష్ట్రంలో పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం (మార్చి16) .జరుగుతోంది.  పట్టభద్రులు-3, ఉపాధ్యాయులు- 2, స్థానిక సంస్థల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఎన్నుకోనున్నారు ఓటర్లు. ఇప్పటికే అయిదు స్థానిక సంస్థల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  పోలింగ్ సందర్భంగా తిరుపతిలో భారీగా బోగస్‌ ఓట్లు నమోదయ్యాయంటూ ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. నకిలీ ఓట్లు పెద్ద సంఖ్యలో పోల్ అయ్యాయంటూ తెలుగుదేశం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, భారతీయ జనతా పార్టీ చీఫ్ సోము వీర్రాజు, వామపక్ష నేతలు.. విమర్శించారు. కొన్ని కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలంటూ   డిమాండ్ చేశారు.  క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితాలను పరిశీలించినప్పుడు బోగస్ ఓటర్ల వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు ఆరోపించారు. తిరుపతి నెహ్రూ నగర్‌ లోని వైసీపీ కార్యాలయ అడ్రస్ మీద 30 మంది నకిలీ గ్రాడ్యుయేట్‌ ఓటర్లు ఓటు వేశారంటూ విమర్శించారు. ఖాళీ స్థలాల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లు నివసిస్తున్నట్లు నకిలీ అడ్రస్ లను వైసీపీ నాయకులు సృష్టించారని మండిపడ్డారు. అనంతపురంలో ఇదే పరిస్థితి తలెత్తినట్లు విమర్శించారు.  దీని పైనే ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ఎల్వీ సుభ్రమణ్యం స్పందించారు. ఏపీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజక వర్గాల పోలింగ్ ప్రక్రియ మొత్తం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని విమర్శించారు. 10వ తరగతి కూడా చదవని వారిని పట్టభద్ర ఓటర్లుగా ఓటు హక్కు కల్పించిన విషయం తన దృష్టికి వచ్చిందని అన్నారు. అయినప్పటికీ.. అలాంటి చోట రీపోలింగ్ కు ఆదేశించకపోవడం  తనను ఆశ్చర్యాన్యికి గురి చేసిందని ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. ఆయా పార్టీలు రీపోలింగ్ కు డిమాండ్ చేసినప్పటికీ ఎన్నికల కమిషన్ స్పందించకపోవడం సరికాదని అన్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాకు లేఖ రాశారు.  ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ఒక ప్రహసనంగా ముగిసిందంటూ ఎల్వీ సుబ్రహ్మణ్యం విమర్శించారు. బోగస్ ఓట్లను నమోదు చేస్తున్నట్టు ఆధారాలు కనిపిస్తున్నా, చర్యలు తీసుకోకుండా ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. బోగస్ ఓట్లు, ఎన్నికల నిర్వహణ అవకతవకలపై తక్షణమే విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.   అయితే  అధికారమే పరమావధిగా, పరుగులు తీస్తున్న వైసీపీ ప్రభుత్వం మంచి మాటలు వింటుందా?

కమలంలో ‘కవిత’ కలకలం ?

ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ( బీజీపీ) అంటే, అదొక విభిన్న పార్టీ  కానీ, ఇప్పడు కాదు. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో బీజేపీ, అతర్గత కుమ్ములాటలు, ముఠా తగాదాల విషయంలో కాంగ్రెస్ పార్టీకి నకలుగా తయారైంది. ఈ మాట ఎవరో బయటి వారు అంటున్న మాటే కాదు.. బీజేపీలోని  సీనియర్ నాయకులు,   సీనియర్ కార్యకర్తలూ అంటున్నారు. సరే  ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీకి ఉన్నదీ లేదు పోయేది లేదు కనుక అక్కడ ఎలా ఉన్నా ఎన్ని గ్రూపు తగవులు ఉన్నా పార్టీ అధిష్టానం కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ తెలంగాణలో పరిస్థితి అది కాదు. బీజేపీ జాతీయ నాయకత్వానికి తెలంగాణపై చాలానే ఆశలున్నాయి. అధికారం లక్ష్యగా అడుగులు వేస్తోంది. అధికారంలోకి వచ్చినా రాకున్నా పశ్చిమ బెంగాల్  లో లాగా, ఒక బలమైన శక్తిగా ఎదిగే  అవకాశం ఉందని  పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. నిన్న గాక మొన్న హైదరాబాద్ వచ్చిన కేంద్ర్ర హోం మంత్రి, పార్టీ స్ట్రాటజిస్ట్ (వ్యూహకర్త) అమిత్ షా  పార్టీ నాయకులు విబేధాలు మరిచి కలిసి పనిచేస్తే అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. అదే మాట  ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. త్రిపురలో గెలిచిన బీజీపీ తెలంగాణలో ఎందుకు గెలవదని ప్రశ్నిస్తున్నారు. అయితే  అందరూకలిసి పని చేయాలని చెప్పి  అమిత్ షా అలా వెళ్ళారో లేదో, ఇలా తెలంగాణ రాష్ట్ర బీజేపీలో రుసరుసలు మొదలయ్యాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యల వివాదం కమల దళంలో దుమారం రేపుతోంది. బండి వ్యాఖ్యలను బీజేపీ నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తప్పు పట్టారు. అలాగే ఆర్వింద్‌ వ్యాఖ్యలు వంద శాతం సరైనవేనంటూ బీజేపీ మాజీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, సీనియర్‌ నేత శేఖర్జీ  ( పేరాల శేఖర్‌ రావు) సోషల్‌ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు, విమర్శలు పార్టీ నేతల్లో మరింత కలకలానికి కారణమయ్యాయి.  అరవింద్ అంటే, కాంగ్రెస్ కల్చర్ లో పుట్టి పెరిగిన నాయకుడు. ఆయన పార్టీ ఎంపీ అయినా, భావజాల పునాదుల పరంగా బీజేపీకి బయటి వ్యక్తి. కానీ  శేఖర్జీ ఆలా కాదు. ఆయన పుట్టి పెరిగింది, బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో, సంఘ్ ప్రచారక్ (పూర్తి సమయ కార్యకర్త)గా, అనేక మందికి ఆదర్శంగా నిలిచిన  నాయకుడు.. అయన కూడా క్రమ శిక్షణ ఉల్లంఘించి, సోషల్ మీడియా వేదికగా బండి సంజయ్  మీద విమర్శలు చేయడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. నిజానికి, బండి సంజయ్  పై ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఒకెత్తు అయితే, శేఖర్జీ చేసిన విమర్శలు మరింత డ్యామేజింగ్  గా ఉన్నాయని పార్టీ శ్రేణులే అభిప్రాయపడుతున్నాయి.     కవిత పై సంజయ్ చేసిన వ్యాఖ్యలపై, బీఆర్ఎస్  ఎంతగా రాద్ధాంతం చేసినా, ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. నిజానికి బీఆర్ఎస్ కూడా బండి వ్యాఖ్యలను ముందు లైట్ గానే తీసుకుంది, కానీ  ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపించడంతో  ఇష్యూని డైవెర్ట్ చేసేందుకో ఏమో  ఢిల్లీ నుంచి గల్లీ వరకు ... బండికి వ్యతిరేకంగా వీధుల్లోకొచ్చి బీఆర్ఎస్ ఆందోళన చేసింది. ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకులు కూడా బండి సంజయ్ వ్యాఖ్యలను మరిచి పోయారు. బీజేపీ నాయకులు మాత్రం బండికి అటూ ఇటుగా విడిపోయారు. రాష్ట్ర పార్టీలోని కొందరు నేతలు అర్వింద్, శేఖర్‌జీ వ్యాఖ్యలను సమర్థిస్తుండగా అసెంబ్లీ ఎన్నికల వేళ ఇలాంటివి పార్టీకి నష్టం చేస్తాయని మరికొందరు చెబుతున్నారు.  ఇప్పుడున్న పరిస్థితుల్లో కవితపై సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేకపోయినా అర్వింద్‌ ఖండించడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. అదే సమయంలో సంజయ్‌ వ్యవహారశైలి, రాష్ట్ర అధ్యక్ష పదవి అంటే పవర్‌ సెంటర్‌ కాదని, అందరినీ సమన్వయం చేయాల్సిన బాధ్యత ఉంటుందని అర్వింద్‌ చేసిన వ్యాఖ్యలను మరికొందరు సమర్థిస్తున్నారు. అర్వింద్‌ చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా సంజయ్‌పై శేఖర్జీ మరిన్ని తీవ్ర విమర్శలు, ఆరోపణలు సంధించడంతో పార్టీలో అంతర్గతంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని నేతలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. మరోవైపు వివిధ జిల్లాల్లోనూ పార్టీ ముఖ్య నేతల మధ్య పొసగక గ్రూపుల గందరగోళం కూడా పెరిగినట్లు పార్టీలో చర్చ సాగుతోంది. నిజానికి ఈ వ్యవహారం చినికి చినికి గాలి వానగా మారుతుందా? కేంద్ర పార్టీ ఎలా స్పదిస్తుంది .. చూడాల్సింది చాలా వుంది .. చెప్పాల్సింది మిగిలే వుంది..అంటున్నారు.

ఏపీ అసెంబ్లీలో బుగ్గన బడ్జెట్.. కేటాయింపులు ఇవే!

ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి  గురువారం(మార్చి 16) ఉదయం అసెంబ్లీలో వార్షిక బడ్జెట  ప్రవేశపెట్టారు. మొత్తం రెండు లక్షల 79 వేల 279.27 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను మంత్రి సభ ముందు ఉంచారు. ముందుగా పోతన పద్యంతో బడ్జెట్ ప్రసంగాన్ని  ప్రారంభించిన బుగ్గన బడ్జెట్ రూపకల్పనలో భాగ్యస్వాములకు కృతజ్ఞతలు తెలియజేశారు.అంతకు ముందు జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ బడ్జెట్ ను ఆమమోదించింది.  తన బడ్జెట్ ప్రసంగంలో బుగ్గన అన్ని వర్గాల సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు చెప్పారు. బుగ్గన బడ్జెట్ లో కేటాయింపులు ఇలా ఉన్నాయి.  ఆర్థిక శాఖకు  రూ.72,424 కోట్లు  వైద్య, ఆరోగ్య శాఖకు రూ.15,882 కోట్లు వ్యవసాయ రంగానికి రూ.11,589 కోట్లు పశుసంవర్ధక శాఖకు రూ.1787 కోట్లు బీసీ సంక్షేమ శాఖకు రూ.23,509 కోట్లు పర్యావరణానికి రూ.685 కోట్లు జీఏడీకి రూ.1418 కోట్లు కేటాయింపు హోంశాఖకు రూ.8206 కోట్లు కేటాయింపు గృహనిర్మాణ శాఖకు రూ.6292 కోట్లు గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.3858 కోట్లు నీటిపారుదల రంగానికి రూ.11,908 కోట్లు పరిశ్రమలు, వాణిజ్యం రూ.2602 కోట్లు మౌలిక వసతులు, పెట్టుబడులకు రూ.1295 కోట్లు అగ్రవర్ణ పేదల సంక్షేమానికి రూ. 11,085 కోట్లు సివిల్ సప్లై - రూ. 3725 కోట్లు,  జీఏడీకి రూ.1,148 కోట్లు పబ్లిక్ ఎంటర్‌ ప్రైజెస్ రూ.1.67 కోట్లు,  ప్రణాళిక 809 కోట్లు రెవెన్యూ రూ.5380 కోట్లు,  రియల్ టైం గవర్నెస్ రూ.73 కోట్లు స్కిల్‌డెవలప్‌మెంట్‌కు రూ. 1167 కోట్లు కాపు నేస్తం రూ.550 కోట్లు జగనన్న చేదోడుకు రూ.350 కోట్లు వాహనమిత్ర రూ.275 కోట్లు నేతన్న నేస్తం రూ.200 కోట్లు మత్స్యకార భరోసా రూ.125 కోట్లు మత్స్యకారులకు డీజిల్ సబ్సిడి రూ.50 కోట్లు ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు వైఎస్సార్ కళ్యాణమస్తు రూ.200 కోట్లు వైఎస్సార్ ఆసరా రూ.6700కోట్లు వైఎస్సార్ చేయూత రూ.5000 కోట్లు అమ్మఒడి రూ.6500 కోట్లు సాంఘిక సంక్షేమం రూ.14511 కోట్లు,  ఆర్ అండ్ బికి రూ.9119 కోట్లు స్త్రీ, శిశు సంక్షేమం రూ.3951 కోట్లు యూత్, టూరిజం రూ.291 కోట్లు డీబీటీ స్కీమ్‌లకు రూ.54,228.36 కోట్లు   పెన్షన్లు రూ.21,434 కోట్లు మైనార్టీ సంక్షేమానికి రూ.2240 కోట్లు   నగదు బదిలీ పథకాలకు రూ.54 వేల కోట్లు ఇంధన శాఖకు రూ. 6546 కోట్లు   రైతు భరోసాకు రూ.4020 కోట్లు జగనన్న విద్యా దీవెనకు రూ.2842 కోట్లు వసతి దీవెనకు రూ.2200 కోట్లు వైఎస్సార్ పీఎమ్ బీమా యోజనకు రూ. 700 కోట్లు డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు రూ.300 కోట్లు రైతులకు వడ్డీ లేని రుణాలకు రూ.500 కోట్లు బీసీ కార్పొరేషన్‌కు రూ.22,715 కోట్లు ఎస్పీ కార్పొరేషన్‌కు రూ.8384.93 కోట్లు ఎస్టీ కార్పొరేషన్‌కు రూ.2428 కోట్లు ఈబీసీ కార్పొరేషన్‌కు రూ.6165 కోట్లు కాపు కార్పొరేషన్‌కు రూ.4887 కోట్లు క్రిస్టియన్ కార్పొరేషన్‌కు రూ.115.03 కోట్లు బ్రాహ్మణ కార్పొరేషన్ రూ.346.78 కోట్లు మైనారిటీ కార్పొరేషన్‌కు రూ.1868.25 కోట్లు   కార్మిక శాఖకు రూ.796 కోట్లు, ఐటీ శాఖకు రూ.215 కోట్లు న్యాయశాఖకు రూ.1058 కోట్లు  అసెంబ్లీ, సెక్రటేరియట్‌ రూ.111 కోట్లు పట్టణాభివృద్ధికి రూ.9381 కోట్లు 

విచారణకు రాలేను.. కవిత.. వచ్చి తీరాల్సిందే..ఈడీ!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నేడు మరోసారి కవిత ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉండగా తాను హాజరు కాలేనని కవిత ఈడీకి సమాచారమిచ్చారు. ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఈడీ షెడ్యూలు ఫిక్స్ చేసింది. అయితే తాజాగా కవిత తన ప్రతినిధి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ ద్వారా తాను హాజరు కాలేనన వర్తమానం పంపిన కవిత ఈడీ అడిగిన సమాచారాన్ని ఆయన ద్వారా పంపారు. అయితే సోమ భరత్ ను ఈడీ కార్యాలయంలోనికి అనుమతించలేదు. విచారణకు రాలేనని కవిత చెప్పడాన్ని ఈడీ అభ్యంతరం చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ఆమె విచారణకు హాజరు కాకతప్పని పరిస్థితి ఏర్పడింది. అంతకు ముందు ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో కవిత  న్యాయనిపుణులతో కవిత భేటీ అయ్యారు. ఈడీ విచారణకు కవిత హాజరు అంశం తీవ్ర ఉత్కంఠ రేపిన నేపథ్యంలో కవిత అనూహ్యంగా తన ప్రతినిధిని పంపడంతో ఏం జరగబోతోందోనన్న ఆసక్తి నెలకొంది. మరో వైపు ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా 11 మందిని ఈడీ అరెస్టు చేయడంతో కవిత అరెస్టు కూడా అనివార్యం అన్న భావనతోనే విచారణకు హాజరు కాలేనని వర్తమానం పంపారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అలాగే   సుప్రీంకోర్టులో తన పిటిషన్  పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అనారోగ్యంతో పాటు సుప్రీంలో   తన పిటిషన్ పెండింగ్ అంశాన్ని కూడా కవిత ఈడీకి పంపినట్లు చెబుతున్నారు.   అయితే ఈడీ అధికారులు కవిత విజ్ఞప్తిని అంగీకరించలేదు. 

పంచమర్తి అనురాధకు జగన్ స్కెచ్

ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పంచమర్తి అనురాధను.. ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు బరిలో నిలిపారు. అయితే ఆ ఒక్క స్థానం కూడా సైకిల్ పార్టీ ఖాతాలోకి వెళ్లకుండా ఉండేందుకు ఫ్యాన్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ తనదైన శైలిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో ఎమ్మెల్యే కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాల్లో... ఫ్యాన్ పార్టీ అభ్యర్థులే గెలవాలని.. అందుకోసం కృషి చేయాలంటూ.. మార్చి 14న జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులకు సీఎం వైయస్ జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఓ వేళ ఎమ్మెల్సీగా పంచుమర్తి అనురాధ గెలిస్తే మాత్రం పలువురు మంత్రులు ఇంటికి వెళ్లడం ఖాయమనే స్పష్టమైన సంకేతాలు సైతం వారికి ఈ సందర్భంగా సీఎం జగన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  అంతేకాదు.. పార్టీ ఉంటేనే పదవులు వస్తాయి.. పదవులు దక్కాలంటే ప్రతి ఒక్కరు శ్రమించాలి.. వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు గెలుపొందేందుకు శ్రమిస్తున్నాం.. ఆ లక్ష్య సాధనలో ఎంపీలు, ఎమ్మెల్యేలు భాగస్వామ్యం కావాలి..  అలాగే అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడంలో మంత్రులు కీలక పాత్ర పోషించాలని.. లేని పక్షంలో మరోవిధంగా ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇక మంత్రుల పనితీరు సైతం గమనిస్తున్నానని ఈ సందర్భంగా వారితో ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది.  మరోవైపు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీసీ మహిళ పంచుమర్తి అనురాధను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దింపారు. రాష్ట్రంలో ఏ సమస్యపై స్పందించాలన్నా.. జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక పోకడలపై ప్రెస్‌మీట్ పెట్టి.. తనదైన శైలిలో ఎండగడుతోందీ అనురాధ. అలాంటి మహిళ శాసనమండలిలో ఉంటే.. వాయిస్ బలంగా వినిపిస్తుందని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఓ ఎమ్మెల్సీ గెలవాలంటే.. 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు వేయాల్సి ఉంటుంది.  అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. వారిలో నలుగురు  ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరిధర్, వాసుపల్లి గణేష్ కుమార్.. జగన్ పార్టీలో చేరారు. కానీ వీరిని అధికారికంగా.. ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీ స్పీకర్ పరిగణించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారి ఏళ్లు గడుస్తున్నా... ఇప్పటికి సైకిల్ పార్టీ ఎమ్మెల్యేలుగానే అధికారికంగా కొనసాగుతోండమే కాకుండా... ఆ పార్టీ ఎమ్మెల్యేలుగానే జీతభత్యాలు సైతం అందుకొంటున్నారు. ఈ పరిస్థితుల్లో తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయాలని.. ఈ నలుగురు ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత చంద్రబాబు వీప్ జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ ఈ వీప్‌ను ఈ నలుగురు పట్టించుకునే పరిస్థితి అయితే లేదనే తాజాగా జరిగిన కేబినెట్‌ భేటీలో వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోందని ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది.   మరోవైపు అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల ఓటు ఎవరి ఖాతాలో పడనుందో అనే ఓ చర్చ సైతం జోరందుకొంది. వీరిద్దరు త్వరలో పసుపు కండువా కప్పుకొని.. సైకిల్ పార్టీలో సవారీ చేయనున్నారనే ఊహగానాలు సైతం కొన..సాగుతోన్నాయి. అలాంటి వేళ... వీరు పంచుమర్తి అనురాధకు ఓటు వేసినా.. ఆమె గెలుపునకు మరో రెండు మూడు ఓట్లు అవసరమ్యే అవకాశం ఉందని.. ఇంకోవైపు జగన్ పార్టీలోని పలువురు అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారని .. వారు సైతం సైకిల్ పార్టీ బరిలో దింపిన ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేసినా .. అందులో ఆశ్చర్యం ఏమి లేదని ఓ వాడి వేడి చర్చ అయితే హల్ చల్ చేస్తోంది.   ఇక ఇప్పటికే ఏపీలో ఇటీవల గ్రాడ్యుయేట్, స్థానిక సంస్థలు, ఉపాధ్యాయుల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. హైస్కూల్ స్థాయిని దాటని వారు సైతం పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకొనేందుకు బరిలో నిలబడడం.. అలాగే ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన పలువురు వ్యక్తులు ఓటర్లకు నగదు పంచుతూ అడ్డంగా ప్రతిపక్ష టీడీపీ శ్రేణులకు దొరికిపోవడం.. ఈ అంశంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.. ఆయా జిల్లాల కలెక్టర్లకు ఫోన్ చేసి.. ఈ అంశంపై ఫిర్యాదు చేసినా వారు సరైన రీతిలో స్పందించక పోవడం.. దీంతో ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత కేంద్ర ఎన్నికల సంఘానికి సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేశారు. కానీ ఈ పిర్యాదుపై నేటికి స్పందించకపోవడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ  ఎన్నికల్లో ఏడు స్థానాలు ఫ్యాన్ పార్టీ ఖాతాలో పడినా సందేహమే లేదని... ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ కలగంటున్న 175కి 175 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం ఏమంత కష్టం కాదని ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో కొన.. సాగుతోంది.

వైయస్ అవినాష్ రెడ్డి ఫ్యామిలీ ఎక్కడ..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మార్చి 11వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ ఢిల్లీలోని ఈడీ అధికారులు నోటిసులు జారీ చేశారు. అంతే ఆ రోజుకు ఒక రోజు ముందు.. కేసీఆర్ కేబినెట్‌లోని సగానికి సగం మంది మంత్రులు.. దేశ రాజధాని హస్తినకు క్యూ కట్టేశారు. మరోవైపు కల్వకుంట్ల కవితతోపాటు ఆమె సోదరుడు, మంత్రి కేటీఆర్‌, అలాగే కేసీఆర్ మేనల్లుళ్లైన మంత్రి హరీశ్ రావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమారులు సైతం ఢిల్లీకి తరలి వెళ్లారు. ఓ వేళ నిన్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసినా.. నీకు అండగా మేమంతా ఉన్నాం.. నీ వెనుక తెలంగాణ సమాజం ఉందంటూ ఎమ్మెల్సీ కవితకు ఓ విధమైన భరోసా కల్పించారనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో బాగానే నడిచింది.. నడుస్తోంది కూడా. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి ఈ తరహా మద్దతు.. భరోసాలు కల్పించే ప్రయత్నాలు అయితే జరగలేదనే ఓ చర్చ అయితే సదరు పోలిటికల్ సర్కిల్ జోరుగా... ఊపందుకొంది. అంతేకాదు వైయస్ అవినాష్ రెడ్డికి మద్దతు కరువైందంటూ సదరు సర్కిల్‌లో విశ్లేషణలు సైతం మొదలైనాయి.  వైయస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, ఆతని తండ్రి వైయస్ భాస్కరరెడ్డిలపై సీబీఐ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తోందని.... ఆ క్రమంలో వైయస్ అవినాష్ రెడ్డి.. ఒకటికి నాలుగు సార్లు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి విచారణ నిమిత్తం వెళ్లారని... అయితే తొలిసారి ఆయన ఈ హత్య కేసులో విచారణకు హాజరైనప్పుడు కడప జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు అదే జిల్లాకు చెందిన పలువురు జిల్లా నేతలు, కార్యకర్తలు తరలి వచ్చారని.. కానీ ఆ తర్వాత వరుసగా జరిగిన విచారణలకు మాత్రం వైయస్ అవినాష్ రెడ్డి వెంట ఎవరూ రాలేదని.... మరోవైపు ఆతడికి మద్దతుగా వైయస్ ఫ్యామిలీలోని సభ్యులు కానీ... ఆ పార్టీలోని కీలక నేతలు కానీ కార్యకర్తలు కానీ, చివరకు జగన్ కేబినెట్‌లోని మంత్రులు కానీ వచ్చిందీ లేదు.. మీడియా ముందుకు వచ్చి వైయస్ అవినాష్‌కు మద్దతు పలికిందీ లేదని పోలిటికల్ సర్కిల్‌లో ఓ చర్చ మాత్రం జోరందుకొంది.   మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఆయన సోదరుడు వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా.. వారి పార్టీనే అధికారంలో ఉన్నా.. వైయస్ అవినాష్‌కు అండ.. దండ కరువైందనే విషయం స్పష్టమవుతోందని టాక్ సైతం పోలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది. కొద్దిగా కాకపోయినా.. కనీసం వైయస్ ఫ్యామిలీలోని వారు అయినా.. నీకు మేమున్నామంటూ వైయస్ అవినాష్‌కు ఓ విధమైన భరోసా కల్పించే ప్రయత్నం చేస్తే ఏమైందనే ప్రశ్న సైతం సదరు పోలిటికల్ సర్కిల్‌లో ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది.  ఇంకోవైపు వైయస్ వివేకా హత్య కేసులో తనపై సీబీఐ అధికారులు తీవ్ర చర్యలు తీసుకోకుండా.. ఆదేశాలు ఇవ్వాలంటూ వైయస్ ఆవినాష్ రెడ్డి ఇటీవల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి.. రిట్ పిటిషన్ దాఖలు చేయడం.. ఆ క్రమంలో వైయస్ వివేకా కుమార్తె వైయస్ సునీత.. ఇంప్లీడ్ పిటిషన్ వేయడం.. చకచకా జరిగిపోయాయి. అంతేకాదు తన ఇంప్లీడ్ పిటిషన్‌లో వైయస్ వివేకా హత్య కేసులో వైయస్ అవినాష్‌కు సంబంధించిన పలు కీలక అంశాలను వైయస్ సునీత ప్రస్తావించడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే వైయస్ అవినాష్‌కు అటు వైయస్ ఫ్యామిలీ నుంచి కానీ.. ఇటు పార్టీ నుంచి కానీ కనీస మద్దతు కరువై ఉంటుందనే ఓ అభిప్రాయం పోలిటికల్ సర్కిల్‌లో వ్యక్తమవుతోన్నట్లు తెలుస్తోంది.

రక్తపు మరకకు నాలుగేళ్లు

మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురై... మార్చి15వ తేదీకి సరిగ్గా నాలుగేళ్లు పూర్తయింది. ఈ హత్య జరిగిన తర్వాత.. వివేకా మృతదేహం తాలుక రక్తపు మరకలు అప్పటికప్పుడు ఆగంతకులు చేరిపేసి.... కడిగేసినా.. ఆ హత్య తాలుక ఏర్పడిన మరక మాత్రం పలువురిని నేటికి.. నీను వీడని నీడను నేనే.. అన్నట్లుగా ఓ నీడలా వెంటాడుతూనే ఉంది. మరీ ముఖ్యంగా అందరి వేళ్లు పులివెందుల్లోని వైయస్ ఫ్యామిలీలోని పలువురు కుటుంబ సభ్యుల వైపే చూపిస్తున్నాయన్నది సుస్పష్టం. ఈ హత్య  కేసులో సూత్రదారులు ఎవరో.. ఈ హత్యకు సూపారీ ఎంతకు ఫిక్స్ చేశారో.. ఈ హత్యలో పాత్రదారుల్లో ఒకరైన వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారి సీబీఐ ఎదుట వెల్లడించినా.. ఈ కేసు నేటికి ఓ కొలిక్కి రాకపోవడం గమనార్హం.  మరోవైపు ఈ కేసులో వరుసగా సీబీఐ విచారణకు హాజరవుతోన్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి.. సీబీఐ తనపై తీవ్ర చర్యలు తీసుకోవలదంటూ... తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం.. ఆ వెంటనే వైయస్ వివేకా కుమార్తె వైయస్ సునీత.. ఇంప్లీడ్ పిటిషన్ వేయడం చకచకా జరిగిపోయాయి. ఆ క్రమంలో తన ఇంప్లీడ్ పిటిషన్‌లో పలు కీలక అంశాలను వైయస్ సునీత క్లియర్‌కట్‌గా ప్రస్తావించారు. అవి ఏమిటంటే.. ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ద్వారానే దస్తగిరితోపాటు మిగిలిన నిందితులకు నగదు చేరిందని...వివేకా హత్యకు ముందు వైయస్ అవినాష్ రెడ్డి ఇంట్లోనే సునీల్ యాదవ్ ఉన్నారని... 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన తండ్రి వైయస్ వివేకాను కావాలనే ఓడించారని పేర్కొన్నారు.  అలాగే 2019 ఎన్నికల్లో వైయస్ వివేకాకు కడప లోక్‌సభ టికెట్ ఇస్తారనే ఆయన్ని హత్య చేశారని భావిస్తున్నట్లు వైయస్ సునీత.. తన ఇంప్లిడ్ పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి... వివేకా హత్యకు గురయ్యారని చెప్పినప్పటి కంటే ముందే తన తండ్రి హత్యకు గురయ్యారనే విషయం అవినాష్ రెడ్డికి తెలుసునని... ఈ హత్య చేశాక అందరినీ కాపాడుకుంటాడని.. ఎర్రగంగిరెడ్డి మిగిలిన నిందితులకు అవినాష్ రెడ్డి చెప్పారని..  మా నాన్న మరణంపై అవినాష్‌కు శివప్రకాశ్ రెడ్డి సమాచారం ఇచ్చాడని.. వివేకా ఇంటికి వచ్చిన మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శశికళకి గుండెపోటుతో చనిపోయినట్లు చెప్పారని.. పోలీసులు కూడా వివేకా గుండెపోటుతో పాటు రక్తపు వాంతులతో చనిపోయినట్లు అబద్దం చెప్పారని.. ఇది హత్య కాదు.. సాధారణ మరణమని చిత్రీకరించే ప్రయత్నం చేశారని.. వివేకాను తానే హత్య చేసినట్లు ఒప్పుకొంటే... 10 కోట్ల రూపాయిలు ఇస్తానని అవినాష్ రెడ్డి చెప్పినట్లు గంగాధర్ స్టేట్‌మెంట్ సైతం ఇచ్చారని.. తన ఇంప్లిడ్ పిటిషన్‌లో వైయస్ సునీత వివరించారు. తన తండ్రి హత్య కేసులో విచారణకు సహకరించకుండా.. కోర్టుల్లో వైయస్ అవినాష్ రెడ్డి తప్పుడు కేసులు వేస్తున్నాడని.. నాపై, నా కుటుంబంపైనే కాదు.. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని.... అలాగే ఏపీ ప్రభుత్వ అధికారులు అవినాష్‌ను కాపాడాలని చూస్తున్నారని.. ఆ క్రమంలో పలువురితో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. చేయిస్తున్నారని వైయస్ సునీత తన ఇంప్లీడ్ పిటిషన్‌లో పేర్కొన్నారు.  మరోవైపు.. 2019, మార్చి 14వ తేదీ అర్థరాత్రి వైయస్ వివేకా దారుణ హత్యకు గురైనట్లు వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఘటన జరిగిన దాదాపు ఏడాదికి ఈ హత్య కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టినా... ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకొంటున్నాయి. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. ఈ హత్య కేసు.. బుల్లి తెరలో ప్రసారమవుతోన్న డైలీ సీరియల్‌ను తలపించేలా.... కొ..న..సా..గుతోంది. దీంతో వివేకా హత్య వెనుక ఉన్న అసలు సిసలు సూత్రధారులు ఎవరు.. ఈ హత్యకు గల కారణాలు ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్నవేనా? లేకుంటే.. ఇతరత్రా  ఇంకేమైనా ఉన్నాయా? అని అటు వైయస్ ఫ్యామిలీ అభిమానులే కాదు.. ఇటు ప్రపంచంలోని తెలుగు ప్రజలంతా ఓ విధమైన ఆతృతతో ఎదురు చూస్తున్నారు.

కేసేఆర్ సర్కార్ కు ఢిల్లీ సెగ

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు  కేంద్ర ప్రభుత్వం పై రాజకీయ యుద్ధం ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒకదాని తర్వాత ఒకటిగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనత పార్టీ (బీజేపీ)ని ఇరకాటంలో నెట్టేందుకు, కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. కానీ, కాలం కలిసి రాకపోతే, తాడే ... పామవుతుంది అన్నట్లు, కేసీఆర్ వ్యూహాలు ఎదురు తిరుగుతున్నాయని  బీఆర్ఎస్ నాయకులే ఆందోళన  వ్యక్త పరుస్తున్నారు. ఒకప్పుడు కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి,  నువ్వు గోకినా గోకకపోయినా, నేను మాత్రం నిన్ను గోగుతూనే ఉంటా అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే, కథ రివర్స్ లో నడిస్తున్నట్లుంది.  ఇప్పటికే  ఒక వంక ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కుంటున్నారు. ఆ కేసు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటుందో, ఏ మవుతుందో  తెలియని పరిస్థితి. మరో వంక ఫార్మ్ హౌస్ (ఎమ్మెల్యేల బేర సారాల) కేసులోనూ సుప్రీంలో చుక్కెదురైంది. సీబీఐ విచారణను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సీబీఐ విచారణ జరుపుతుందా లేదా అనేది పక్కన పెడితే, ఫార్మ్ హౌస్  కేసులో  బీజేపీని బద్నాం చేసేందుకు చేసిన ప్రయత్నాలు బూమరాంగ్ అయ్యింది. ఈ కేసులో ముఖ్యమంత్రి అతి  ఉత్సాహాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టింది.  చక్కగా చీవాట్లు పెట్టింది. అంతే కాదు, ఎంతవరకు నిజమో ఏమో కానీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటును ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఓటు బ్యాంకు,  రెడ్డి ఓటు బ్యాంకును చీల్చేందుకు, ముఖ్యమంత్రి కేసేఆర్ వైఎస్ షర్మిలను రంగంలోకి దించారని అంటారు. రాష్ట్రంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ ( వైఎస్సార్ టీపీ) స్థాపించేందుకు, ఆమె సాగిస్తున్న పాద యాత్రకు వెనక నుంచి అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తోంది బీఆర్ఎస్ పెద్దలే అంటారు. అయితే, ఇప్పడు అదే షర్మిల , ఏకుమేకై కూర్చున్నారు.   కేసీఆర్ ప్రభుత్వానికి   వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, దీనిపై సీబీఐ, ఈడీలతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారించాలని కోరారు. ఈ సందర్భంగా  వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.  కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో  అంటూ నినాదాలు చేశారు.  కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ వేల కోట్ల కమిషన్లు దండుకున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. రీ డిజైనింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని  మూడు రెట్లు   పెంచారని చెప్పారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని మరోసారి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రజల సొమ్ము లక్షల కోట్లను కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు. 38 వేల కోట్ల ప్రాజెక్టును  లక్షా 50 వేల కోట్లకు పెంచారని చెప్పారు. మూడు సార్లు ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని పెంచారన్నారు. ప్రాజెక్టు వల్ల చాలా మంది నిరాశ్రుయులయ్యారని, వారికి ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయలేదని వైఎస్ షర్మిల అన్నారు. నాణ్యత లేకుండా ప్రాజెక్టు కట్టారని, ప్రతి ఏటా వేల ఎకరాల పంట పొలాలు మునిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అద్భుతమంటూ కేసీఆర్ తెలంగాణతో పాటు దేశ ప్రజలను సైతం మోసం చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణంలో రూ.70 వేల కోట్ల అవినీతి జరిగిందనీ, 2జీ, బొగ్గు కుంభకోణం కంటే.. ఇది పెద్ద స్కామ్ అని ఆరోపించారు. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్ట్  నిర్మాణంలో అవినితీ చోటు చేసుకుందని కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పడు షర్మిల ధర్నాతో, కేంద్రం కదిలితే, ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ప్రభుత్వం మరో విచారణకు సిద్దం కావలసి ఉంటుందనడంలో సందేహం లేదు.

రాజకీయాలకు కేసీఆర్.. వీ(బీ)ఆర్ఎస్?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  రాష్ట్ర రాజకీయాల నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) తీసుకున్నారా? తీసుకునే ఆలోచన చేస్తున్నారా? లేదా ఆ దిశగా అడుగులు వేస్తున్నారా? అంటే బీఆర్ఎస్ వర్గాలు అవుననే అంటున్నాయి. అవును  టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా పేరు మార్చుకున్న తర్వాత, ముఖ్యమంత్రి కేసీఆర్  రాష్ట్ర రాజకీయాలనే కాదు  పరిపాలన వ్యవహారాలను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని అటు పార్టీ ముఖ్యులు, ఇటు అధికార వర్గాలలో చర్చ జరుగుతోంది. అందుకే, ముఖ్యమంత్రి వద్ద పెండింగ్ ఫైల్స్  కొండలా పెరిగిపోతున్నాయని  అధికారులు ప్రైవేటు సంభాషణల్లో చెపుతున్నారని అంటున్నారు. అలాగే, ముఖ్యమంత్రి కేసీఆర్  పార్టీ  ప్రభుత్వ బాధ్యతలు పూర్తిగా మంత్రి కేటీఆర్ కు అప్పగించి,  ఆయన తెర వెనక సలహాదారు పాత్రకు పరిమితం అయ్యారని  పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.  నిజానికి  ముఖ్యమంత్రి కేసీఆర్  జాతీయ రాజకీయాలపై చర్చించే సమయంలో ఒకానొక సందర్భంలో సరదాగానే కావచ్చును రాష్ట్ర రాజకీయాలపై తనకు ఆసక్తి తగ్గిపోతోందని (బోర్ కొడుతోందని) మీడియా సమావేశంలో అన్నారు.  అలాగే 2018లో రెండవ సారి అధికారంలోకి వచ్చింది మొదలు  పార్టీ ప్రభుత్వ పగ్గాలు వారసుడు మంత్రి కేటీఆర్ కు అప్పగించే ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. అనేక సందర్భాలలో మంత్రులు  ఇతర ముఖ్య నేతలు కేటీఆర్ ను కాబోయే ముఖ్య్మంత్రిగా సంభోదించడమే కాకుండా  ముఖ్యమంత్రితో సమాన గౌరవాన్ని ఇవ్వడం కూడా మీడియా దృష్టికి వస్తూనే వుంది. మీడియా చూపుతూనే వుంది. అయితే  కారాణాలు ఏవైనా కేటీఆర్ పట్టాభిషేకం ముహూర్తం వాయిదాపడుతూ వచ్చింది. వస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ జాతీయ రాజకీయ ఎజెండా తెరపైకి తెచ్చి రాష్ట్ర రాజకీయ, ప్రభుత్వ బాధ్యతల కేతీఆర్ కు అప్పగించి, తాను మెల్లమెల్లగా తెర వెనక్కి తప్పుకుంటున్నారని అంటున్నారు. ఇటీవల చోటు చేసుకున్న రెండు కీలక పరిణామాలను అందుకు ఉదాహరణగా చూపుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో చిక్కుకున్న కవితను ఈడీ విచారించిన సమయంలో  మాములుగా అయితే ముఖ్యమంత్రి కేసీఆర్  స్వయంగా ఢిల్లీ వెళ్లి చక్రం తిప్పుతారని అందరూ అనుకున్నారు. కానీ  ముఖ్యమంత్రి ఆ బాధ్యతను కేటీఆర్ కు అప్పగించారు. కేటీఆర్ ను ఢిల్లీ పంపిచారు.  అఫ్కోర్స్  ఆయన వెంట మాజీ ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావుతో పాటుగా మరి కొందరు మంత్రులను కూడా ఆయన వెంట పంపినా  మెయిన్ టాస్క్ మాత్రం కేటీఆర్ చేతుల మీదగానే కానిచ్చారు. అందుకే ఫైనల్ గా,  ఢిల్లీలో చక్రం తిప్పిన కేటీఆర్  అంటూ మీడియాలో ప్రచారం జరిగింది.  అంతే కాకుండా, ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే బాధ్యతను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కు అప్పగించారని అంటున్నారు. ఢిల్లీ ఎపిసోడ్ తర్వాత  కేటీఆర్ పార్టీ మీద దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడి స్థాయిలో తీసుకోవలసిన కీలక నిర్ణయాలు అయన స్వయంగా తీసుకుంటున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే కొద్ది నెలల్లో విస్తృతంగా కార్యక్రమాల నిర్వహణకు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఎన్నికల్ రోడ్ మ్యాప్  ను సిద్డంచేశారు. ఇటీవల పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుకు కేటీఆర్‌ వివిధ స్థాయి నాయకులు కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. అలాగే, వివిధ స్థాయిల్లో సమన్వయం పై దృష్టి సారించారు. పార్టీలో క్షేత్ర స్థాయి నుంచి పై స్థాయి వరకు సమన్వయం కొనసాగేలా కార్యక్రమాలను రూపొందించారు. అందులో భాగంగా తక్షణమే ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణకు శ్రీకారం చుట్టనున్నారు. అందు కోసం ప్రత్యేకంగా జిల్లాల వారీగా కొత్తగా ఇన్‌చార్జీలను నియమించారు.  అలాగే జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు షెడ్యులు ఖరారు చేశారు. ఈ పరిణామాలను గమనిస్తే కేసీఆర్  పార్టీ, ప్రభుత్వ పగ్గాలను  వారసుడు కీటీఆర్ కు అప్పగించి తాను రాష్ట్ర  రాజకీయాల నుంచి వీఆర్ఎస్ తీసుకునే దిశగా అడుగులు వేస్తున్న వైనం కనిపిస్తోందని అంటున్నారు.

కడప ఎంపీ.. కొత్త కథలు!

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయానా బాబాయ్,  మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. ఇటీవల అంటే మార్చి 10న హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణ అనంతరం మీడియా ఎదుట చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు.. సోషల్ మీడియలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ హత్య కేసులో వివేకా కుమార్తె డాక్టర్ సునీత, ఆమె భర్త ఎన్ రాజశేఖరరెడ్డిపై నిందారోపణలు చేయడం భావ్యం కాదని అంటున్నారు. వివేకా హత్య.. రెండో పెళ్లి.. వారికి పుట్టిన బాబుని రాజకీయ వారసుడిగా ప్రకటించడం.. అలాగే ఆస్తి కోసం.. అంటూ వైఎస్ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వారు మండిపడుతున్నారు.  ఓ వేళ... ఈ హత్య కేసులో వివేకా కుమార్తె, అల్లుడే నిందితులు అయితే.. తన తండ్రిని ఇంత దారుణంగా హత్య చేసిన వారు ఎవరో ప్రపంచానికి తెలియాలంటూ.. తన సోదరుడు, వైఎస్ జగన్ ముఖ్యంమంత్రి పీఠం ఎక్కగానే ఆయన వద్దకు వెళ్లి.... తమకు న్యాయం చేయమని ఎందుకు అడుగుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఈ హత్య కేసు సీబీఐకి అప్పగిస్తేనే కానీ.. సూత్రదారులు, పాత్రదారులు ఎవరో బయటకు రారని భావించడం వల్లే  ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను కలవడమే కాకుండా... న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారని గుర్తు చేస్తున్నారు. అలాగే ఈ కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించినా.. దర్యాప్తు సరిగ్గా జరగకపోవడంతో.. ఈ కేసు మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ.. మరోసారి కోర్టు తలుపు  తట్టింది కూడా సూనీతేనని సమాజిక మాధ్యమంలో ట్రోల్ అవుతోంది.  అలాగే   వివేకా హత్య జరిగిన వెంటనే..  నాటి ప్రతిపక్ష నేత   జగన్..  పులివెందులకు వచ్చి.. ఇది టీడీపీ ప్రభుత్వం చేయించిన హత్య అని ... . ఈ హత్య కేసు సీబీఐకి అప్పగిస్తేనే కానీ.. దోషులు ఎవరో తెలియదని.. అన్నారు.  అంతే కాకుండా సీబీఐ దర్యాప్తుతోనే వివేకా  హత్య వెనుక ఉన్న నిజానిజాలు బయటకు వస్తాయన్నారు. ఈ విషయాన్ని ఆయన   వివేకా కుమార్తె   సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి సమక్షంలోనే మీడియా ఎదుట డిమాండ్ సైతం చేశారని నెటిజన్లు ఈ సందర్భంగా వివరిస్తున్నారు. ఆ తర్వాత ఎన్నికలు రావడం.. ఆ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ఘన విజయం సాధించడం..   జగన్ ముఖ్యమంత్రి కావడం చకచకా జరిగిపోయాయని.. కానీ వైయస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు మాత్రం నడకలో నత్తతో పోటీపడుతోంది. అయినా  వివేకానందరెడ్డిది గుండెపోటు అంటూ నాటి టీడీపీ ప్రభుత్వం చిత్రీకరించిందంటూ వైయస్ అవినాష్ రెడ్డి  చెబుతుండడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ వివేకా గుండెపోటుతో మరణించారంటూ తొలుత ప్రపంచానికి ఎవరు తెలియజేశారో.. మీరు మరిచిపోయారా? అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయాసాయిరెడ్డే..   వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని మీడియా ముందుకు వచ్చి ప్రకటించారని... అలా వివేకానందరెడ్డి మృతి ప్రపంచానికి తెలిసిందని వారు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విజయసాయిరెడ్డి సమీప బందువులు కాబట్టి.. విజయసాయిరెడ్డితో చంద్రబాబు అలా చెప్పించి ఉంటారా? అని నెటిజన్లు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. అయినా కడప జిల్లా అంటే వైఎస్ ఫ్యామిలీ.. వైఎస్ ప్యామిలీ అంటే కడప జిల్లా గుర్తుకు వస్తాయని.. అలాంటిది సొంత చిన్నాన్న   దారుణ హత్యకు గురి అయితే.. ఇంత వరకు దోషులు ఎవరో అతీగతీ లేకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో  వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది...   వివేక హత్య కేసును సాధ్యమైనంత త్వరగా ఛేదించాలంటూ.. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐపై ఒత్తిడి తెచ్చి.. దోషులు ఎవరో.. నిర్దోషులు ఎవరో తేల్చాల్సిన కనీస బాధ్యత.. జగన్ దేననీ స్థానికులు  ఈ సందర్బంగా స్పష్టం చేస్తున్నారు. హత్య జరిగిన తర్వాత.. అరిచి గీ పెట్టి.. ఆ తర్వాత అధికారంలోకి రాగానే. మౌనవ్రతం పాటించడం ఎంత వరకు సబబో , ఏపీ సీఎం వైయస్ జగన్‌తోపాటు కడప ఎంపీ వైఎస్అవినాష్ రెడ్డికి నెటిజన్లు చరకలంటిస్తున్నారు.  

మళ్లీ ఢిల్లీకి కవిత.. అరెస్టేనా?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇప్పుడు అందరి దృష్టీ ఈడీ దర్యాప్తుపైనే కేంద్రీకృతమై ఉంది. మరో రెండు రోజుల్లో (మార్చి 16) ఈడీ కవితను మరోమారు విచారించనుంది. తొలి సారి కవితను విచారించిన సందర్బంగా అటు ఢిల్లీలో, ఇటు తెలంగాణలో హై డ్రామా నడిచింది.   ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో సౌత్ గ్రూపు పాత్రపై కవితను తదుపరి విచారణ సందర్భంగా లోతుగా ప్రశ్నించే అవకాశాలున్నాయని అంటున్నారు.  ఇప్పటికే ఈ కేసులో పలువురి వాంగ్మూలాలు రికార్డు చేసిన ఈడీ ఇక ముందు ముందు దర్యాప్తును మరింత ముమ్మరం చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ కేసు ఒక కొలిక్కి రావాలంటే సౌత్ గ్రూప్ ప్రమేయాన్ని పకడ్బందీగా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుందన్నది ఈడీ భావనగా న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఆ దిశగా ఇప్పటికే కొంత మేర పురోగతి సాధించిన ఈడీ ఈ గ్రూపుతో సంబంధం ఉన్న అరబిందో ఫార్మా ఫుల్‌టైమ్ డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి,  వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవను   అరెస్టు చేసింది. అలాగే ఇప్పటికే ఒక సారి విచారించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రెండో మారు విచారించనుంది.  ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సౌత్ గ్రూపుదే కీలక పాత్ర అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన  ఈడీ.. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు  కిక్‌బ్యాక్ రూపంలో ముడుపులు అందినట్టు కూడా నిర్ధారించుకుందని అంటున్నారు. ఆ సొమ్ము ఎలా చేతులు మారిందన్న విషయంపై ఇప్పుడు దృష్టి కేంద్రీకరించిందని చెబుతున్నారు.  దీంతో మనీ లాండరింగ్   కోణంలో దర్యాప్తు జోరు పెంచింది.   బ్యాంకు స్టేట్‌మెంట్లు, కంపెనీల ఆడిట్ రిపోర్టులు, వ్యక్తిగత ఆస్తుల వివరాలు, ఆదాయపు పన్ను శాఖకు సమర్పించిన ఐటీ రిటర్నులు తదితరాలన్నింటినీ సమర్పించాల్సిందిగా సౌత్ గ్రూప్ సభ్యులకు చెబుతోంది. వాటి ఆధారంగానే విచారణ కొనసాగిస్తోంది.  ఆధారాలను ఒక్కొక్కరి ముందు పెట్టి విడివిడిగా విచారణ తరువాత ఇప్పుడు అందరినీ కూర్చోబెట్టి విచారించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.   అందులో భాగంగానే పిళ్లై కస్టడీని పొడిగించాలని కోరుతూ రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది  సౌత్ గ్రూపులోని వ్యక్తులను మనీ లాండరింగ్ కోణం నుంచి ప్రశ్నించాల్సి ఉన్నదని, ఈ గ్రూపులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు ప్రతినిధిగా ఉన్న ఆడిటర్ బుచ్చిబాబును సైతం ఈ నెల 15న ప్రశ్నించడానికి నోటీసులు ఇచ్చామనీ, అలాగే పిళ్లైని అతనితో కలిసి విచారించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు.   వీటన్నిటినీ బట్టి చూస్తే మద్యం కుంభకోణంలో రానున్న రోజులలో మరిన్ని అరెస్టులు అనివార్యమన్న భావనను న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఆ అరెస్టులలో కవిత అరెస్టు కూడా ఉంటుందని విశ్లేషిస్తున్నారు. 

అవినాష్ నాలుగో సారి! సీబీఐ ఎదుట వైఎస్ అవినాష్ రెడ్డి

తుది తీర్పు ఇచ్చే వరకూ అవినాష్ రెడ్డిపై తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించిన ధైర్యంతో అవినాష్ రెడ్డి సీబీఐని పూచిక పుల్లలా చూస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకే 14వ తేదీన సీబీఐ ముందు హాజరు కావాల్సి ఉంది. కానీ నేటి విచారణలో సీబీఐ ఎదుట హాజరు కావాలా వద్దా అన్నది సీబీఐనే అడగాలని హైకోర్టు చెప్పింది. దీన్నే అడ్వాంటేజ్‌గా తీసుకుని అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. మంగళవారం సీబీఐ విచారణకు హాజరు కాలేనని అవినాష్ రెడ్డి లేఖ రాశారు. . పార్లమెంటు సమావేశాలు ఉన్నందున హాజరుపై మినహాయింపు ఇవ్వాలని కోరారు. అయితే  అవినాష్ లేఖ పై సీబీఐ సానుకూలంగా  స్పందించకపోవడంతో ఆయన మంగళవారం సీబీఐ విచారణకు హాజరయ్యారు.  అరెస్ట్ ఉండదు కాబట్టి ఇక సీబీఐ విచారణకు వెళ్లకపోయినా పర్వాలేదనుకున్న అవినాష్ రెడ్డికి సీబీఐ హాజరు కావాల్సిందేనని స్పష్టం చేయడం ద్వారా షాక్ ఇచ్చింది.   పార్లమెంట్ సమావేశాలున్నాయని చెప్పి విచారణకు డుమ్మా కొట్టాలన్న ఆయన వ్యూహం ఫలించలేదు.   ఇక అవినాష్ రెడ్డి పార్లమెంటు సమావేశాల హాజరు అంటూ సీబీఐ విచారణకు హాజరు కాలేననడం కేవలం సాకు మాత్రమేననీ,  ఎందుకంటే పార్లమెంటులో ఆయన హాజరు శాతం 30 శాతమేనని పరిశీలకులు అంటున్నారు.   కాగా మంగళవారం తాను విచారణకు హాజరు కాలేనంటూ అవినాష్ లేఖ రాసినా సీబీఐ హాజరు కావాల్సిందేనని అల్టిమేటం ఇవ్వడంతో అనివార్యంగా ఆయన సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. తన ఇద్దరు న్యాయవాదులతో కలిసి హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో ఆయన సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు.  వివేకా  హత్య కేసులో సీబీఐ తనను విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని... అలాగే తనను అరెస్టు చేయకుండా  సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్ అవినాష్ రెడ్డి  తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అవినాష్ పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఒక్క అరెస్టు విషయంలో మాత్రం సీబీఐకి ఆదేశాలు జారీ చేస్తూ.. కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. కేసు తుది తీర్పువెలువరించే వరకూ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సీబీఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ వివేకానందర రెడ్డి ఈ రోజు సీబీఐ అవినాష్ ను విచారించి పంపించేస్తుంది. కోర్టు ఆదేశాల కారణంగా అరెస్టు చేసే అవకాశం లేదు. అయితే విచారణ సుదీర్ఘంగా సాగే అవకాశం ఉందని అంటున్నారు. 

ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం.. మూడు రాజధానుల ముచ్చటే లేదు!

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో  మూడు రాజథానుల అంశం ప్రస్తావనే లేకపోవడంపై అందరిలోనూ ఆశ్చర్యం వ్యక్తమౌతోంది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నా ముఖ్యమంత్రి జగన్ కానీ, ఆయన కేబినెట్ సహచరులు కానీ ఖాతరు చేయకుండా అవకాశం ఉన్నా లేకున్నా.. సందర్భం వచ్చినా రాకున్నా అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానులు మా విధానం అంటూ ప్రకటనలు గుప్పిస్తూనే ఉన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ సైతం తాను త్వరలో విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తానంటూ గ్లోబల్ సమ్మిట్ కు ముందూ, సమ్మిట్ వేదికగానూ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగంలో కచ్చితంగా మూడు రాజధానుల ప్రస్తావన ఉంటుందని అంతా భావించారు. జగన్ సర్కార్ కోర్టు ధిక్కరణ అన్న అంశాన్ని ఇసుమంతైనా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తీరు కారణంగానే గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన జొప్పిస్తారని పరిశీలకులు సైతం అంచనా వేశారు. అయితే ఆశ్చర్యకరంగా గవర్నర్ ప్రసంగంలో ఆ ప్రస్తావనకు చోటు లేకుండా పోయింది. గవర్నర్ కు ఇచ్చే ప్రసంగ పాఠంలో ఆ అంశాన్ని జొప్పించే ధైర్యం జగన్ సర్కార్ చేయకపోవడానికి ఆయన సుదీర్ఘ కాలం సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పని చేయడమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక వేళ ఆ అంశాన్ని  జొప్పించినా గవర్నర్ అది చదవడానికి నిరాకరించి ఉండేవారన్న భావనతోనే జగన్ సర్కార్ వెనక్కు తగ్గిందని పరిశీలకులు చెబుతున్నారు. ఆ ఒక్క అంశం వినా గవర్నర్ ప్రసంగం మొత్తం జగన్ పాలనను ఆకాశానికి ఎత్తేస్తూనే కొనసాగింది. ఏపీ సర్కార్ పారదర్శక పాలన అందిస్తోందని అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.   పేదల సంక్షేమమే లక్ష్యంగా   పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అవినీతి రహితంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నట్ల చెప్పారు. అర్హులైన లబ్ధిదారుల ఖాతాలలో పథకాల సొమ్ములు క్రమం తప్పకుండా జమ చేస్తున్నట్లు తెలిపారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో తన సర్కార్ సుపరిపాలన అందిస్తోందన్నారు. అర్థిక రంగంలో ఏపీ పురోగమిస్తోందనీ, వ్యవసాయం, పారిశ్రామిక రంగం సహా అన్ని రంగాలూ అభివృద్ధి పథంలో నడుస్తున్నాయనీ గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. . కాగా గవర్నర్ ప్రసంగంలో వృద్ధి రేటు ప్రస్తావన రాగానే తెలుగుదేశం సభ్యులు అభ్యంతరం తెలిపారు. గవర్నర్ ప్రసంగంలో గణాంకాలన్నీ కల్పితాలేనని విమర్శించారు. గవర్నర్ నోట జగన్ సర్కార్ అబద్ధాలు పలికిస్తోందంటూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగం ముగియగానే సభ వాయిదా పడింది. అనంతరం జరిగిన బీఏసీ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను 9 రోజులు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 16న సభలో విత్త మంత్రి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. 

ముందస్తు లేదంటూనే.. ఎన్నికల మూడ్ లోకి బీఆర్ఎస్!

రాజకీయ నాయకుల వ్యూహాలు చిత్రంగా ఉంటాయి. నోటితో ఒకటి చెబితే.. చేతలలో మరోటి చేస్తుంటారు. నోటితో ఔనన్నదానినే నొసటితో కాదంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇటువంటి వ్యూహాలు, ఎత్తులలో సిద్ధహస్తడని రాజకీయ వర్గాలలో ఒక టాక్ ఉంది. అందుకు తగ్గట్టుగానే ఇటీవలబీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశాలలో ముందస్తు ఎన్నికల ప్రశక్తే లేదని విస్పష్టంగా ప్రకటించారు. ఆ వెంటనే పార్టీని మాత్రం ఎన్నికలకు సమాయత్తం చేయడం ప్రారంభించేశారు. రాష్ట్రంలో మరో సారి అధికారమే లక్ష్యంగా పార్టీని  ఎన్నికల మూడ్ లోకి తీసుకు వెళ్లి  పోయారు. ఎన్నికల వ్యూహరచనలో భాగంగా కేసీఆర్ పలు కార్యక్రమాలను ప్రకటించారు. ఆత్మీయ సమ్మేళనాలు, నియోజకవర్గాలకు ప్రత్యేక ఇన్చార్జీల నిమామకాలతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే కార్యక్రమాలను మొదలెట్టేశారు. షెడ్యూల్ ప్రకారమైతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఆరేడు నెలల సమయం ఉంది. ఇదేం పెద్ద ఎక్కువ సమయం కాదు. సాధారణంగా రాజకీయ పార్టీలన్నీఈ సమయం వచ్చే సరికే ఎన్నికల మూడ్ లోకి వెళ్లి పోతాయి. కానీ కేసీఆర్ మాత్రం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ కంటే రెండు మూడునెలల ముందే వస్తాయా అన్నట్లుగా తన ఎన్నికల సన్నాహకాల వేగాన్ని పెంచేశాయి. గతంలో ఒక సారి సిట్టింగులందరికీ సీట్లు అని ప్రకటించేసి తరువాత తీరిగ్గా నాలుక కరుచుకున్న కేసీఆర్.. తూచ్ అందరికీ కాదు.. గెలుపు గుర్రాలకే అని సవరించుకున్నసంగతి తెలిసిందే. తాజాగా మరోసారి సిట్టింగులకే సీట్లు అంటూ ప్రకటించారు. అదే సమయంలో 99 శాతం మంది సిట్టింగులకు మాత్రమే అని చెప్పారు. ఇది సిట్టింగులలోనే కాకుండా, ఆశావహుల్లో కూడా జోష్ నింపుతుంది. ఇక ఆత్మీయ సమ్మేళనాలకు షెడ్యూల్ ప్రకటించడంతో క్యాడర్ కు విరామం లేని కార్యక్రమాలు ఉంటాయి. జనంలోకి వెళ్లడమే ప్రజాప్రతినిథుల నిత్యకృత్యంగా మారిపోతుంది. ఈ పరిస్థితి ఇటీవలి పరిణామాలతో ఒకింత నైరాశ్యంలోకి వెళ్లిన శ్రేణులను వెంటనే యాక్టివ్ అవ్వడానికి ఆత్మీయ సమ్మేళనాలు దోహదం చేస్తాయనడంలో సందేహం లేదు. మరోవైపు ప్రభుత్వ పథకాలైన దళిత బంధు, గొర్ల పంపిణీ, సొంతింటి జాగా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాల అమలుకూ యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. విరామం లేని కార్యక్రమాలతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా లీడర్లు, క్యాడర్ కు చేతి నిండా పని కల్పించాలన్నది ఆయన ఉద్దేశంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    

విద్యార్థుల ఆత్మహత్యలన్నీ.. వ్యవస్థ చేస్తున్న హత్యలే!

చదువు పేరుతో కళాశాల యాజమాన్యం పెట్టే ఒత్తిడి భరించలేక, తక్కువ మార్కులు వస్తే తోటి విద్యార్థుల ముందు చేసే అవమానం భరించ లేక తరగతి గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడో ఇంటర్ విద్యార్థి.  సరిగా చదవలేకపోతున్నానన్న బాధతో, మార్కులు తక్కువ వస్తాయన్న భయంతో, పరీక్ష తప్పుతానేమోనన్నఅనుమానంతో ఒక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అంతకంటే ముందు సీనియర్ల వేధింపులు భరించ లేక మోడికో ప్రీతి తనువు చాలించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో సంఘటనలు. ప్రతి రోజూ ఆత్మహత్యల వార్తలు మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి.  దేశంలో ఆత్మహత్యల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా విద్యార్థులు, అందులోనూ టీనేజీ పిల్లల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.  నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో గణాంకాల ప్రకారం, దేశంలో చోటు చేసుకుంటున్న ప్రమాద మరణాలు, ఆత్మహత్యల్లో ఎనిమిది శాతానికిపైగా విద్యార్థులే కావడం విషాదం.  అయితే విద్యార్థుల బలవన్మరణాలన్నీ వ్యవస్థ చేసిన హత్యలుగానే భావించాల్సి ఉంటుంది. స్వేచ్ఛగా, స్వచ్ఛంగా జరగాల్సిన విద్యాబోధన.. మార్కులు, ర్యాంకుల వేటగా మార్చేసి..పిల్లలను వాటి వెంట పరుగులెత్తిస్తుండటమే వారిలో ఆత్మవిశ్వాసం లోపించడానికి కారణంగా చెప్పాలి. ఇష్టాయిష్టాలు, శక్తి సామర్ధ్యాలను పరిగణనలోకి  తీసుకోకుండా ర్యాంకులు, మార్కులే జీవితం అంటూ అగమ్య పోటీతత్వాన్ని పెంచేసే విధానమే పిల్లలలో ఆత్మహత్యలు పెరగడానికి కారణమని మానసిక నిపుణులు చెబుతున్నారు. అసలు విద్యా సంస్థల్లో సంస్కరణల కోసం  ప్రభుత్వాలు తీసుకువచ్చిన చట్టాలు ఏ మేరకు అమలవుతున్నాయి? అసలు అమలు అవుతున్నాయా?  అన్న సందేహాలు అందరిలోనూ వ్యక్తమౌతున్నాయి.  ఈ పరిస్థితికి   విద్యాసంస్థలు, అధ్యాపకులు, నిబంధనల రూపకర్తలు,  సమాజం కూడా కారణమనే చెప్పాల్సి ఉంటుంది.  విద్యను, విద్యాబోధనను సంస్కరించాలి. ఈ సంస్కరణల్లో   తల్లితండ్రులు, అధ్యాపకులు, అధికారులు భాగస్వాములు కావాలి.  ప్రధానంగా  విద్యా బోధనను, విద్యా సంస్థలను  వాణిజ్యమయం కాపాడాలి. అలాగే విద్యార్థుల మధ్య కుల, మత, లింగ  వివక్ష లేకుండా చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో ఇప్పటికీ ప్రభుత్వాలు ఒక నిర్దిష్ఠ కార్యాచరణను రూపొందించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోకుండా ముందు ముందు మరింత భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది.  

వైనాట్ 175.. జగన్ ధీమాకు కారణం ఇదేనా?

వైనాట్ 175.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కాన్ఫిడెన్స్ కు కారణమేమిటో తేలిపోయింది. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలిచి తీరుతామంటున్న వైసీపీ భరోసా ఏమిటో అర్ధమైపోయింది. వచ్చే ఎన్నికలలో వైసీపీ ఎలా గెలవబోతోందో.. పట్ట భద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ ట్రయలర్ చూపింది. ఆ ట్రయలర్ లోనే అందరికీ వైసీపీ గెలుపు వ్యూహాలేమిటో తేటతెల్లమయ్యాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏరి కోరి ఏర్పాటు చేసుకున్న వంలంటీర్ల వ్యవస్థ ఏం చేయబోతోందో ఎమ్మెల్సీ ఎన్నికలలో తేలిపోయింది. పేరుకు జరిగినవి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు కానీ పెద్ద సంఖ్యలో అండర్ గ్యాడ్యుయేట్లు ఓటు వేశారు. కేవలం ఆరో తరగతి, ఏడో తరగతి, మహా అయితే టెన్త్ చదివిన వారు పెద్ద సంఖ్యలో ఓట్లు వేశారు. వలంటీర్లు వారికి ఓటింగ్ స్లిప్పులు ఇచ్చారు. అధికారులు దగ్గరుండి ఓట్లు వేయించారు. అడ్డుకున్న వారిపై పోలీసులు కేసులు పెట్టారు. లాఠీ చార్జి చేశారు. మొత్తం మీద ఎమ్మెల్సీ ఎన్నికను ప్రజాస్వామ్మమే నిర్ఘాంతపోయేంత ప్రశాంతంగా జరిపించారు. కనీస విద్యార్హత లేకుండా ఓటు వేయడానికి వచ్చిన వారిని ప్రశ్నిస్తే.. వారి నుంచి వచ్చిన సమాధానాలు వ్యవస్థలను జగన్ సర్కార్ ఈ నాలుగేళ్ల కాలంలో ఎంతగా నిర్వీర్యం చేసిందో అవగతమౌతుంది. ఒక ఓటరేమో తాను చదివించి  ఏడో తరగతేననీ, అయితే తమ వార్డులో ఈ ఎన్నికలలో ఓటు వేయడానికి తనతో పాటు మరో ముగ్గుర్ని ఎన్నుకున్నారనీ తెలిపారు. వారి విద్యార్హత కూడా ఆరు, ఏడు తరగతులేనట. ఓటింగ్ స్లిప్పులు ఎవరిచ్చారంటే ఇక్కడే ఇప్పుడే ఇచ్చారని చెప్పారు. మరి మీకు ఇక్కడకు వచ్చి ఓటేయాలని ఎవరు చెప్పారంటే.. ఫోన్ వచ్చిందన్నది వారి సమాధానం. ఇంతకీ తాను ఓటు వేస్తున్నది ఏ ఎన్నికకు అన్న సంగతి కూడా ఆమెకు తెలియదు. వచ్చి ఓటేయమన్నారట.. అంతే వచ్చి ఓటేశారు. ఇంత బహిరంగంగా వారి విద్యార్హతలపై వాస్తవం నిగ్గు తేలినా.. వారు ఓట్లు వేయకుండా అధికారులు నిలువరించలేదు.  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో  ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ మాత్రమే చదివిన వారిని కూడా ఓటర్లుగా ఓట్లు వేయించిన ఘనత జగన్ సర్కార్ ది. ఇందు కోసం ఆయన ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను ఎంత గొప్పగా ఉపయోగించుకుందో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నిక అద్దంపట్టింది.  ఎమ్మెల్సీ ఎన్నికలలోనే ఇంతకు  తెగించిన వైసీపీ రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఇంకెన్ని జగన్నాటకాలకు తెరతీస్తారో అన్న సందేహాలు సర్వత్రా  వ్యక్తమౌతున్నాయి.  ఎంత నిర్భయంగా, ఎంత నిస్సిగ్గుగా వైసీపీ నేతలు వ్యవహరించారంటే.. దొంగ ఓట్లు, దొంగ ఓటర్లను మీడియా లైవ్ లో చూపించినా వెనక్కుతగ్గలేదు. పోలీసుల సంపూర్ణ సహకారంతో దొంగ ఓట్లను యథేచ్ఛగా వేయించుకున్నారు.  దొంగ ఓటర్లను గుర్తు పట్టే టీడీపీ నేతలు… పోలింగ్ ఏజెంట్లను పోలీసులు పోలీసు స్టేషన్లకు తరలించేశారు.  ఈ సందర్భంగా తిరుపతి, పులివెందుల సహా పలు చోట్ల ఘర్షణలు జరిగాయి.  ఆటోడ్రైవర్లు, ఆరేడు తరగతులు చదువుకున్న వారు, ఇంటర్మీయట్ కురాళ్లు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోలీసుల అండతో, వైసీపీ దన్నుతో ఓట్లు వేశారు.  ఇక పోలింగ్ బూత్ ల వద్దే కౌంటర్లు పెట్టేసి మరీ సొమ్ములు పంచారు. గెలవడం కావాలి, ఎలా గెలుస్తేం ఏం.. మమ్మల్ని అడ్డుకునే దమ్మెవరికి ఉందన్న ధీమా తప్ప వైసీపీలో కనిపించింది. ఈ మాత్రం అరాచకం లేకపోతే మనకు ఓటేసేదెవరు అన్న భావన కూడా వ్యక్తమైంది.  దొంగ ఓట్లతో గెలిచేయగలమన్న ధైర్యం కనిపించింది. ఇదే పద్ధతిలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా దున్నేస్తామన్న ధీమా వ్యక్తమైంది. మొత్తం మీద వచ్చే ఎన్నికలు ఎలా జరుగుతాయో.. రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో ఒక ట్రయలర్, ఒక టీజర్ చూపించారు ముఖ్యమంత్రి జగన్