విచారణకు రాలేను.. కవిత.. వచ్చి తీరాల్సిందే..ఈడీ!
posted on Mar 16, 2023 @ 12:10PM
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నేడు మరోసారి కవిత ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉండగా తాను హాజరు కాలేనని కవిత ఈడీకి సమాచారమిచ్చారు. ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఈడీ షెడ్యూలు ఫిక్స్ చేసింది. అయితే తాజాగా కవిత తన ప్రతినిధి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ ద్వారా తాను హాజరు కాలేనన వర్తమానం పంపిన కవిత ఈడీ అడిగిన సమాచారాన్ని ఆయన ద్వారా పంపారు. అయితే సోమ భరత్ ను ఈడీ కార్యాలయంలోనికి అనుమతించలేదు. విచారణకు రాలేనని కవిత చెప్పడాన్ని ఈడీ అభ్యంతరం చెప్పింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ఆమె విచారణకు హాజరు కాకతప్పని పరిస్థితి ఏర్పడింది. అంతకు ముందు ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో కవిత న్యాయనిపుణులతో కవిత భేటీ అయ్యారు. ఈడీ విచారణకు కవిత హాజరు అంశం తీవ్ర ఉత్కంఠ రేపిన నేపథ్యంలో కవిత అనూహ్యంగా తన ప్రతినిధిని పంపడంతో ఏం జరగబోతోందోనన్న ఆసక్తి నెలకొంది.
మరో వైపు ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా 11 మందిని ఈడీ అరెస్టు చేయడంతో కవిత అరెస్టు కూడా అనివార్యం అన్న భావనతోనే విచారణకు హాజరు కాలేనని వర్తమానం పంపారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అలాగే సుప్రీంకోర్టులో తన పిటిషన్ పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అనారోగ్యంతో పాటు సుప్రీంలో తన పిటిషన్ పెండింగ్ అంశాన్ని కూడా కవిత ఈడీకి పంపినట్లు చెబుతున్నారు. అయితే ఈడీ అధికారులు కవిత విజ్ఞప్తిని అంగీకరించలేదు.