పంచమర్తి అనురాధకు జగన్ స్కెచ్
posted on Mar 15, 2023 @ 5:06PM
ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పంచమర్తి అనురాధను.. ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు బరిలో నిలిపారు. అయితే ఆ ఒక్క స్థానం కూడా సైకిల్ పార్టీ ఖాతాలోకి వెళ్లకుండా ఉండేందుకు ఫ్యాన్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ తనదైన శైలిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో ఎమ్మెల్యే కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాల్లో... ఫ్యాన్ పార్టీ అభ్యర్థులే గెలవాలని.. అందుకోసం కృషి చేయాలంటూ.. మార్చి 14న జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులకు సీఎం వైయస్ జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఓ వేళ ఎమ్మెల్సీగా పంచుమర్తి అనురాధ గెలిస్తే మాత్రం పలువురు మంత్రులు ఇంటికి వెళ్లడం ఖాయమనే స్పష్టమైన సంకేతాలు సైతం వారికి ఈ సందర్భంగా సీఎం జగన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అంతేకాదు.. పార్టీ ఉంటేనే పదవులు వస్తాయి.. పదవులు దక్కాలంటే ప్రతి ఒక్కరు శ్రమించాలి.. వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు గెలుపొందేందుకు శ్రమిస్తున్నాం.. ఆ లక్ష్య సాధనలో ఎంపీలు, ఎమ్మెల్యేలు భాగస్వామ్యం కావాలి.. అలాగే అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడంలో మంత్రులు కీలక పాత్ర పోషించాలని.. లేని పక్షంలో మరోవిధంగా ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇక మంత్రుల పనితీరు సైతం గమనిస్తున్నానని ఈ సందర్భంగా వారితో ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీసీ మహిళ పంచుమర్తి అనురాధను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దింపారు. రాష్ట్రంలో ఏ సమస్యపై స్పందించాలన్నా.. జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక పోకడలపై ప్రెస్‌మీట్ పెట్టి.. తనదైన శైలిలో ఎండగడుతోందీ అనురాధ. అలాంటి మహిళ శాసనమండలిలో ఉంటే.. వాయిస్ బలంగా వినిపిస్తుందని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఓ ఎమ్మెల్సీ గెలవాలంటే.. 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు వేయాల్సి ఉంటుంది.
అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. వారిలో నలుగురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరిధర్, వాసుపల్లి గణేష్ కుమార్.. జగన్ పార్టీలో చేరారు. కానీ వీరిని అధికారికంగా.. ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీ స్పీకర్ పరిగణించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారి ఏళ్లు గడుస్తున్నా... ఇప్పటికి సైకిల్ పార్టీ ఎమ్మెల్యేలుగానే అధికారికంగా కొనసాగుతోండమే కాకుండా... ఆ పార్టీ ఎమ్మెల్యేలుగానే జీతభత్యాలు సైతం అందుకొంటున్నారు. ఈ పరిస్థితుల్లో తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయాలని.. ఈ నలుగురు ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత చంద్రబాబు వీప్ జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ ఈ వీప్‌ను ఈ నలుగురు పట్టించుకునే పరిస్థితి అయితే లేదనే తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోందని ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది.
మరోవైపు అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల ఓటు ఎవరి ఖాతాలో పడనుందో అనే ఓ చర్చ సైతం జోరందుకొంది. వీరిద్దరు త్వరలో పసుపు కండువా కప్పుకొని.. సైకిల్ పార్టీలో సవారీ చేయనున్నారనే ఊహగానాలు సైతం కొన..సాగుతోన్నాయి. అలాంటి వేళ... వీరు పంచుమర్తి అనురాధకు ఓటు వేసినా.. ఆమె గెలుపునకు మరో రెండు మూడు ఓట్లు అవసరమ్యే అవకాశం ఉందని.. ఇంకోవైపు జగన్ పార్టీలోని పలువురు అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారని .. వారు సైతం సైకిల్ పార్టీ బరిలో దింపిన ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేసినా .. అందులో ఆశ్చర్యం ఏమి లేదని ఓ వాడి వేడి చర్చ అయితే హల్ చల్ చేస్తోంది.
ఇక ఇప్పటికే ఏపీలో ఇటీవల గ్రాడ్యుయేట్, స్థానిక సంస్థలు, ఉపాధ్యాయుల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. హైస్కూల్ స్థాయిని దాటని వారు సైతం పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకొనేందుకు బరిలో నిలబడడం.. అలాగే ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన పలువురు వ్యక్తులు ఓటర్లకు నగదు పంచుతూ అడ్డంగా ప్రతిపక్ష టీడీపీ శ్రేణులకు దొరికిపోవడం.. ఈ అంశంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.. ఆయా జిల్లాల కలెక్టర్లకు ఫోన్ చేసి.. ఈ అంశంపై ఫిర్యాదు చేసినా వారు సరైన రీతిలో స్పందించక పోవడం.. దీంతో ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత కేంద్ర ఎన్నికల సంఘానికి సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేశారు.
కానీ ఈ పిర్యాదుపై నేటికి స్పందించకపోవడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడు స్థానాలు ఫ్యాన్ పార్టీ ఖాతాలో పడినా సందేహమే లేదని... ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ కలగంటున్న 175కి 175 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం ఏమంత కష్టం కాదని ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో కొన.. సాగుతోంది.