హమ్మయ్య ఓ పనైపోయింది
posted on Mar 16, 2023 @ 4:31PM
ఓ పనై పోయింది. ఒక క్రతువు ముగిసింది. ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2023- 24 వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టేశారు. మొత్తం రెండు లక్షల 79 వేల 279.27 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను మంత్రి సభ ముందు ఉంచారు. ముందుగా పోతన పద్యంతో బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి మొదలుపెట్టారు. బడ్జెట్ రూపకల్పనలో భాగ్యస్వాములకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. అటు శాసనమండలిలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి సిదిరి అప్పలరాజు మండలి ముందు ఉంచారు.
అంతకు ముందు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం 2023 - 24 వార్షిక బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసింది. అలాగే 2023–24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రిమండలి ఆమోదించింది. అంతుకుముందు 2023 - 24 వార్షిక బడ్జెట్‌తో గురునానక్ కాలనీలోని తన నివాసం నుంచి సెక్రటేరియట్‌కు ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి బయల్దేరి వెళ్లారు. ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ సహా పలువురు అధికారులతో కలిసి బుగ్గన సచివాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్‌లోని తన ఛాంబర్‌లో బడ్జెట్ ప్రతులకు బుగ్గన, అధికారులు ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ...పేద ప్రజలు, బలహీన వర్గాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. పరిపాలనా పరమైన మార్పులు చేసిన వాటికి కేటాయింపులు ఉంటాయన్నారు. ప్రస్తుత పధకాలను బలపరిచేలా మరింత మందికి లబ్ది చేకురేలా బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.నిజానికి, కేటాయింపుల విషయంలో ఆర్థిక మంత్రి ఎక్కడా చిన్న చూపు చూడలేదు. చేతికి ఎముక లేదన్న విధంగా, కేటాయింపులు జరిపారు.
ముఖ్యంగా సంక్షేమం పేరిట గత మూడు సంవత్సరాలుగా సాగిస్తున్న పందారాం కార్యక్రమం కొనసాగించేందుకు ఆయా శాఖలకు నిధులు దాడిగానే కేటాయించారు. అయితే, ఇందు కు అవసరమైన నిధులు ఎక్కడి నుంచి వస్తాయి.. అనే ప్రశ్నకు విత్త మంత్రి సమాధానం ఇవ్వలేదు, ఇటు ప్రతిపక్ష పార్టీలు, అటు ఆర్థిక రంగ నిపుణులు కూడా అదే చెబుతున్నారు.