ఇవేం ఎన్నికలు మాజీ ఐఎఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ధర్మాగ్రహం!
posted on Mar 16, 2023 @ 1:11PM
ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఎన్నికలు ఎంత ‘చక్క’గా, జరుగుతాయో వేరే చెప్పనక్కరలేదు. గడచిన మూడున్నర సంవత్సరాలలో తిరుపతి లోక్ సభ, రెండు మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత సుందర ముదనష్టంగా జరిగాయో గుర్తు చేసుకుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరుగుతాయనే విశ్వాసం సన్నగిల్లడం కాదు, చచ్చి పోతుంది అంటున్నారు ప్రజాస్వామ్య వాదులు. అదే విధంగా 2020లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబందించి ఎన్నికల కమిషనర్ (నిమ్మగడ్డ రమేష్ కుమార్ )తో ప్రభుత్వం వ్యవహరించిన తీరు గుర్తుచేసుకుంటే వైసేపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు, అధికార దుర్వినియోగం జరగని ఎన్నికలు ఆశించను కూడా ఆశించలేమంటే అతిశయోక్తి కాదని కూడా అంటున్నారు. తాజాగా జరిగిన పట్టభద్రులు, ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మేథావులు, ప్రజాస్వామ్య ఉద్యమ కార్యకర్తలు, రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు దిగజారుతున్న తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పడు పెద్దల సభ ఎన్నికలు కూడా, అంతే చక్కగా అదే, ‘అ’క్రమ పద్దతిలో జరిగాయి. ఎన్నికలో గెలవడమే ముఖ్యం, ఎలా .. అన్నది అప్రధానం. అవును రాజకీయ పార్టీలకు ఎన్నికలలో గెలవడం అవసరమే, అలాగే విజయం కోసం అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలు అడ్డదారులు తొక్కడం, కొంతవరకు గీత దాటడం కొత్తేమీ కాదు. కానీ జగన్ రెడ్డి ప్రభుత్వం, జగన్ రెడ్డి పార్టీ పాత రికార్డులు అన్నిటినీ బద్దలు కొట్టేసింది. ఈ మాట రాజకీయ విశ్లేషకులే కాదు, మాజీ ఐఏఎస్ అధికారులు కూడా ఆరోపిస్తున్నారు.
సహజంగా రాజకీయాలకు దూరంగా ఉండే రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం రాష్ట్రంలో ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజక వర్గాలలో పోలింగ్ జరిగిన తీరు, మొత్తం ఎన్నికల ప్రక్రియ పై తీవ్రంగా స్పందించారు. ఇవేమి ఎన్నికలంటూ ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏపీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గాల పోలింగ్ ప్రక్రియ మొత్తం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని విమర్శించారు. 10వ తరగతి కూడా చదవని వారిని పట్టభద్ర ఓటర్లుగా ఓటు హక్కు కల్పించిన విషయం తన దృష్టికి వచ్చిందని అన్నారు. దీనిపై టీవీ ఛానళ్లల్లో కథనాలు కూడా ప్రసారం అయ్యాయని గుర్తు చేశారు. అంతకు ముందే మరో మాజీ ఐఎఎస్ అధికారి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైకృష్ణా రావు కూడా, వైసేపీ పాలనలో ఎన్నికల తీరుపై ఇదే విధంగా వ్యాఖ్యానించారు.
కాగా, రాష్ట్రంలో పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం (మార్చి16) .జరుగుతోంది. పట్టభద్రులు-3, ఉపాధ్యాయులు- 2, స్థానిక సంస్థల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఎన్నుకోనున్నారు ఓటర్లు. ఇప్పటికే అయిదు స్థానిక సంస్థల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పోలింగ్ సందర్భంగా తిరుపతిలో భారీగా బోగస్ ఓట్లు నమోదయ్యాయంటూ ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. నకిలీ ఓట్లు పెద్ద సంఖ్యలో పోల్ అయ్యాయంటూ తెలుగుదేశం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, భారతీయ జనతా పార్టీ చీఫ్ సోము వీర్రాజు, వామపక్ష నేతలు.. విమర్శించారు. కొన్ని కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు.
క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితాలను పరిశీలించినప్పుడు బోగస్ ఓటర్ల వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు ఆరోపించారు. తిరుపతి నెహ్రూ నగర్ లోని వైసీపీ కార్యాలయ అడ్రస్ మీద 30 మంది నకిలీ గ్రాడ్యుయేట్ ఓటర్లు ఓటు వేశారంటూ విమర్శించారు. ఖాళీ స్థలాల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లు నివసిస్తున్నట్లు నకిలీ అడ్రస్ లను వైసీపీ నాయకులు సృష్టించారని మండిపడ్డారు. అనంతపురంలో ఇదే పరిస్థితి తలెత్తినట్లు విమర్శించారు.
దీని పైనే ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ఎల్వీ సుభ్రమణ్యం స్పందించారు. ఏపీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజక వర్గాల పోలింగ్ ప్రక్రియ మొత్తం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని విమర్శించారు. 10వ తరగతి కూడా చదవని వారిని పట్టభద్ర ఓటర్లుగా ఓటు హక్కు కల్పించిన విషయం తన దృష్టికి వచ్చిందని అన్నారు. అయినప్పటికీ.. అలాంటి చోట రీపోలింగ్ కు ఆదేశించకపోవడం తనను ఆశ్చర్యాన్యికి గురి చేసిందని ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. ఆయా పార్టీలు రీపోలింగ్ కు డిమాండ్ చేసినప్పటికీ ఎన్నికల కమిషన్ స్పందించకపోవడం సరికాదని అన్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాకు లేఖ రాశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ఒక ప్రహసనంగా ముగిసిందంటూ ఎల్వీ సుబ్రహ్మణ్యం విమర్శించారు. బోగస్ ఓట్లను నమోదు చేస్తున్నట్టు ఆధారాలు కనిపిస్తున్నా, చర్యలు తీసుకోకుండా ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. బోగస్ ఓట్లు, ఎన్నికల నిర్వహణ అవకతవకలపై తక్షణమే విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అయితే అధికారమే పరమావధిగా, పరుగులు తీస్తున్న వైసీపీ ప్రభుత్వం మంచి మాటలు వింటుందా?