రక్తపు మరకకు నాలుగేళ్లు
posted on Mar 15, 2023 @ 11:42AM
మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురై... మార్చి15వ తేదీకి సరిగ్గా నాలుగేళ్లు పూర్తయింది. ఈ హత్య జరిగిన తర్వాత.. వివేకా మృతదేహం తాలుక రక్తపు మరకలు అప్పటికప్పుడు ఆగంతకులు చేరిపేసి.... కడిగేసినా.. ఆ హత్య తాలుక ఏర్పడిన మరక మాత్రం పలువురిని నేటికి.. నీను వీడని నీడను నేనే.. అన్నట్లుగా ఓ నీడలా వెంటాడుతూనే ఉంది. మరీ ముఖ్యంగా అందరి వేళ్లు పులివెందుల్లోని వైయస్ ఫ్యామిలీలోని పలువురు కుటుంబ సభ్యుల వైపే చూపిస్తున్నాయన్నది సుస్పష్టం. ఈ హత్య కేసులో సూత్రదారులు ఎవరో.. ఈ హత్యకు సూపారీ ఎంతకు ఫిక్స్ చేశారో.. ఈ హత్యలో పాత్రదారుల్లో ఒకరైన వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారి సీబీఐ ఎదుట వెల్లడించినా.. ఈ కేసు నేటికి ఓ కొలిక్కి రాకపోవడం గమనార్హం.
మరోవైపు ఈ కేసులో వరుసగా సీబీఐ విచారణకు హాజరవుతోన్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి.. సీబీఐ తనపై తీవ్ర చర్యలు తీసుకోవలదంటూ... తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం.. ఆ వెంటనే వైయస్ వివేకా కుమార్తె వైయస్ సునీత.. ఇంప్లీడ్ పిటిషన్ వేయడం చకచకా జరిగిపోయాయి. ఆ క్రమంలో తన ఇంప్లీడ్ పిటిషన్‌లో పలు కీలక అంశాలను వైయస్ సునీత క్లియర్‌కట్‌గా ప్రస్తావించారు. అవి ఏమిటంటే.. ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ద్వారానే దస్తగిరితోపాటు మిగిలిన నిందితులకు నగదు చేరిందని...వివేకా హత్యకు ముందు వైయస్ అవినాష్ రెడ్డి ఇంట్లోనే సునీల్ యాదవ్ ఉన్నారని... 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన తండ్రి వైయస్ వివేకాను కావాలనే ఓడించారని పేర్కొన్నారు.
అలాగే 2019 ఎన్నికల్లో వైయస్ వివేకాకు కడప లోక్‌సభ టికెట్ ఇస్తారనే ఆయన్ని హత్య చేశారని భావిస్తున్నట్లు వైయస్ సునీత.. తన ఇంప్లిడ్ పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి... వివేకా హత్యకు గురయ్యారని చెప్పినప్పటి కంటే ముందే తన తండ్రి హత్యకు గురయ్యారనే విషయం అవినాష్ రెడ్డికి తెలుసునని... ఈ హత్య చేశాక అందరినీ కాపాడుకుంటాడని.. ఎర్రగంగిరెడ్డి మిగిలిన నిందితులకు అవినాష్ రెడ్డి చెప్పారని.. మా నాన్న మరణంపై అవినాష్‌కు శివప్రకాశ్ రెడ్డి సమాచారం ఇచ్చాడని.. వివేకా ఇంటికి వచ్చిన మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శశికళకి గుండెపోటుతో చనిపోయినట్లు చెప్పారని.. పోలీసులు కూడా వివేకా గుండెపోటుతో పాటు రక్తపు వాంతులతో చనిపోయినట్లు అబద్దం చెప్పారని.. ఇది హత్య కాదు.. సాధారణ మరణమని చిత్రీకరించే ప్రయత్నం చేశారని.. వివేకాను తానే హత్య చేసినట్లు ఒప్పుకొంటే... 10 కోట్ల రూపాయిలు ఇస్తానని అవినాష్ రెడ్డి చెప్పినట్లు గంగాధర్ స్టేట్‌మెంట్ సైతం ఇచ్చారని.. తన ఇంప్లిడ్ పిటిషన్‌లో వైయస్ సునీత వివరించారు. తన తండ్రి హత్య కేసులో విచారణకు సహకరించకుండా.. కోర్టుల్లో వైయస్ అవినాష్ రెడ్డి తప్పుడు కేసులు వేస్తున్నాడని.. నాపై, నా కుటుంబంపైనే కాదు.. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని.... అలాగే ఏపీ ప్రభుత్వ అధికారులు అవినాష్‌ను కాపాడాలని చూస్తున్నారని.. ఆ క్రమంలో పలువురితో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. చేయిస్తున్నారని వైయస్ సునీత తన ఇంప్లీడ్ పిటిషన్‌లో పేర్కొన్నారు.
మరోవైపు.. 2019, మార్చి 14వ తేదీ అర్థరాత్రి వైయస్ వివేకా దారుణ హత్యకు గురైనట్లు వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఘటన జరిగిన దాదాపు ఏడాదికి ఈ హత్య కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టినా... ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకొంటున్నాయి. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. ఈ హత్య కేసు.. బుల్లి తెరలో ప్రసారమవుతోన్న డైలీ సీరియల్‌ను తలపించేలా.... కొ..న..సా..గుతోంది. దీంతో వివేకా హత్య వెనుక ఉన్న అసలు సిసలు సూత్రధారులు ఎవరు.. ఈ హత్యకు గల కారణాలు ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్నవేనా? లేకుంటే.. ఇతరత్రా ఇంకేమైనా ఉన్నాయా? అని అటు వైయస్ ఫ్యామిలీ అభిమానులే కాదు.. ఇటు ప్రపంచంలోని తెలుగు ప్రజలంతా ఓ విధమైన ఆతృతతో ఎదురు చూస్తున్నారు.