అడ్డంగా దొరికిపోయారా?!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి   జగన్   చిన్నాన్న, మాజీ మంత్రి వైయస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి.. ఎట్టకేలకు శుక్రవారం (మార్చి 10) సీబీఐ విచారణకు హాజరయ్యారు. అయితే అంతకు ముందు రోజు  ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి.. రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ హత్య కేసులో సీబీఐ తనను విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని... అదేవిధంగా 160 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారని.. ఈ నేపథ్యంలో ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని వైయస్ అవినాష్ రెడ్డి కోరారు.  దీనిని బట్టి చూస్తుంటే.. ఈ హత్య కేసులో   అవినాష్‌రెడ్డి ప్రమేయం ఉందా?   అడ్డంగా దొరికిపోయారా? అనే సందేహాలు వ్యక్తమవుతోన్నట్లుగా ఉందని..  ఆ క్రమంలో ఆయనలో భయం వ్యక్తమవుతోన్నట్లు స్పష్టంగా  అర్థమవుతోందనే ఓ చర్చ  పోలిటికల్ సర్కిల్‌లో జోరందుకుంది. మరోవైపు...   వివేకా కుమార్తె  సునీత సైతం తెలంగాణ హైకోర్టుకు ఆశ్రయించారు.  అవినాష్ రెడ్డి పిటిషన్‌లో తనను ఇంప్లిడ్ చేయాలని కోరారు. దీంతో  అవినాష్ రెడ్డిని సీబీఐ ఏం విచారిస్తుందో ఏమో కానీ.. ఈ అంశంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చే ఆదేశాలపైనే అందరు తీవ్ర ఆతృతతో ఎదురు చూస్తున్నారు.  అసలు వైయస్ వివేకా హత్య జరిగిన సమయంలో నాటి ప్రతిపక్ష నేత  జగన్ పులివెందుల్లో వివేకా కుమార్తె వైయస్ సునీత సమక్షంలో చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత రాష్ట్రంలో   జగన్ ప్రభుత్వం ఏర్పడడం.. దీంతో తన తండ్రి హత్య కేసులో నిందితులు ఎవరో తెల్చే విధంగా చర్యలు తీసుకోవాలంటూ సోదరి వైయస్ సునీత, సోదరుడు ప్లస్ ముఖ్యమంత్రి జగన్ వద్దకు వెళ్లి.. కోరడం.. ఆ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలతో ఖిన్నురాలై  ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవడంతోపాటు ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించడం...  అలా ఈ కేసు సీబీఐ చేత్లులోకి వెళ్లడం.. ఆ తర్వాత వైయస్ వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారి... ఈ హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారుల పేర్లు సీబీఐకి వెల్లడించడంతోపాటు ఈ కేసుకు సూపారీ కింద 40 కోట్ల రూపాయిలు చేతులు మారినట్లు పేర్కొనడం..  అనంతరం ఈ హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోవడం.. అలాంటి ఒకానొక సమయంలోవైఎస్ వివేకా కుమార్తె  సునీత, అల్లుడు ఎన్ రాజశేఖరరెడ్డిలే ఈ హత్య చేయించారంటూ ఆరోపణలు ఎదుర్కోవడం.. అలాగే సీబీఐ అధికారులపై ఎదురు కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు జరగడం.. అదే విధంగా సీబీఐ అధికారుల కారు డ్రైవర్‌ను కడప వదిలి వెళ్లాలంటూ ఆగంతకులు బెదిరించడం.. మరోవైపు ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న వారు ఒక్కొక్కరుగా మరణిస్తూ ఉండడం.. సరిగ్గా ఆ సమయంలోనే కడప సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ మారడం... అదే సెంట్రల్ జైల్‌లో ఉన్న వైయస్ వివేకా హత్య కేసులో నిందితులకు ప్రాణానికి హాని ఉందంటూ ... ప్రతిపక్ష టీడీపీ రంగంలోకి దిగి.. వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు గుప్పించడం..  దీంతో జగన్ ప్రభుత్వం సదరు జైలు సూపరింటెండెంట్‌ను బదిలీ చేయడం.. ఆ తర్వాత వివేకా హత్య కేసు దర్యాప్తు ఒకానొక దశలో ఆగిపోవడం.. దాంతో  వివేకా కుమార్తె సునీత మళ్లీ రంగంలోకి వచ్చి.. తన తండ్రి హత్య కేసు దర్యాప్తు.. మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం.. అలా ఈ కేసు... తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయడం.. ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తు ముమ్మరం కావడం... ఆ క్రమంలో   అవినాష్‌ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడం.. అలా విచారణకు హాజరైన   అవినాష్ కాల్ డేటాపై సీబీఐ దృష్టి సారించి..   వివేకా హత్య జరిగిన సమయంలో.. అంతకు ముందు.. ఆ తర్వాత పోన్ కాల్స్ వెళ్లిన జాబితాలో ఉన్న వారి పేర్లను పరిశీలించడం.. ఆ క్రమంలో రెండు నెంబర్లకు పలుమార్లు ఫోన్ కాల్స్ వెళ్లినట్టు గుర్తించిన సీబీఐ అధికారులు ఆ నెంబర్లపై ప్రశ్నల వర్షం కురిపించడం.. అలా నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితోపాటు వైయస్ జగన్ భార్య వైయస్ భారతీ పీఏ నవీన్‌ పేర్లు బయటకు రావడం..  వారిద్దరికి వెంటనే సీబీఐ నోటీసులు ఇవ్వడం..  ఈ ఇద్దరిని కడపలో సీబీఐ అధికారులు ప్రశ్నించడం.. ఆ తర్వాత  అవినాష్ రెడ్డిని మళ్లీ సీబీఐ విచారణకు రావాలని పిలువడం.. అలా పిలిచిన 10 రోజులకే మరోసారి ఈ కేసు విచారణకు రావాలంటూ వైయస్ అవినాష్ రెడ్డితోపాటు ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డికి నోటీసులు జారీ చేయడం.. అలా వైయస్ భాస్కర్ రెడ్డి కడప జైలుల్లో మార్చి 12న విచారణకు హాజరుకానున్నారు. ఈ వివేకా హత్య కేసులో ఈ మొత్తం ఎపిసోడ్‌లో తెరచాటు సూత్రదారులు ఎవరు అనేది ఇప్పటికే సీబీఐకి క్లియర్ కట్‌గా అర్థమైందని.. ఈ విషయం కడప ఎంపీ వైయస్ అవినాష్ ‌రెడ్డికి కూడా అర్థమైందని అందుకే తెలంగాణ హైకోర్టును అంత కంగారుగా ఆశ్రయించారనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కల్‌లో దూసుకుపోతోంది.

ఏపీలో కొత్త కూటమి ?

మనం ప్రేమించేవారి కంటే, మనల్ని ప్రేమించే వారితో కలిసి ప్రయాణం చేయడం మంచింది. ఇది ప్రేమ పెళ్లి  విషయంలో సినిమా పెద్దలు చెప్పే మాట. అయితే, సినిమా ప్రేమకే కాదు, రాజకీయ ప్రేమలకూ  ఇది వర్తిస్తుంది.ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు,  తద్వారా వైసీపీ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు, తెలుగు దేశం, జనసేన పార్టీలు బేషజాలు మరిచి జట్టు కట్టేందుకు సిద్ధమయ్యాయి. అదే సమయంలో బీజేపీ కూడా కలసిరావాలని ఇటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్  కోరుకుంటున్నారు. అయితే బీజేపీ నాయకత్వం టీడీపీతో పొత్తుకు ససేమిరా అంటోంది.  నిజానికిమ ఏపీలో బీజేపీకి నిండా ఒక శాతం ఓటు కూడా లేదు. అయినా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా కమల దళాన్ని కలుపుకు పోవడం వలన  వైసేపీ  ఎన్నికల అరాచకాలకు కొంత వరకు చెక్ పెట్టవచ్చనే ఉద్దేశంతో కావచ్చు  టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో పొత్తును కోరుకుంటున్నాయి.  అయితే  బీజేపీ కలిసి రాకపోవడంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్   వామపక్ష పార్టీలతో కలిసి కొత్త కూటమి ఏర్పాటు  దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీని వదిలేసి  వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎంలతో  జట్టుకట్టే  ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. జనసేన వామపక్షాలతో కలిసి పోటీచేస్తే, 2014 కంటే మంచి ఫలితాలు సాధించవచ్చని రాజకీయ పరిశీలకులు కూడా భావిస్తున్నారని అంటున్నారు. నిజానికి బీజేపీతో జట్టు కట్టడం వలన మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో ఎదుర్కుంటున్న వ్యతిరేకతను మోయవలసి వస్తుంది. అదే  కమల దళంతో పొత్తు లేకుండా టీడీపీ, జనసేన, వామ పక్ష పార్టీలు జట్టుకడితే అటు మోడీ ప్రభుత్వ వ్యతిరేకత, ఇటు జగన్ రెడ్డి  ప్రభుత్వ వ్యతిరేకత కొత్త కూటమికి  కలిసొస్తాయని విశ్లేషిస్తున్నారు.  నిజానికి ఇటు టీడీపీకి అటు జనసేనకు కూడా  గతంలో వామపపక్ష పార్టీలతో కలిసి పనిచేసిన అనుభవం  వుంది.  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో లెఫ్ట్ పార్టీలు, టీడీపీ పొత్తు పెట్టుకుని పోటీచేసిన సందర్భాలు లేక పోలేదు. ఆ సమయంలో లెఫ్ట్ పార్టీలకు సీట్ల పరంగా గౌరవమైన ప్రాతినిధ్యమే దక్కేది. అయితే గత కొన్నేళ్లుగా వామపక్షాలు ప్రాభవాన్ని కోల్పోయినా ఇప్పటికీ,  కొన్ని కొన్ని పాకెట్స్ లో ఎర్ర జెండాను నమ్ముకున్న జనమున్నారు. మంగళగిరి వంటి కొన్ని కీలక నియోజక వర్గాల్లో వామ పక్షాలకు నిర్దిష్టమైన ఓటు బ్యాంకుంది. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు,పవన్ కళ్యాణ్  చూపు లెఫ్ట్ పార్టీల వైపుకు తిరిగిందని అంటున్నారు. ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు పట్టభద్రుల స్థానాలతో పాటు రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 23న పోలింగ్ జరగనుంది.  తెలుగుదేశం పార్టీ పట్టభద్రుల స్థానాల్లో మాత్రమే బరిలో దిగింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయడం లేదు. అయితే వామపక్షాల అనుబంధ కమిటీలు సంయుక్తంగా పీడీఎఫ్ కూటమిగా అటు పట్టభద్రులు, ఇటు ఉపాధ్యాయ స్థానాల్లో పోటీకి దిగారు. వాస్తవానికి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో వామపక్షాలదే పట్టు. కానీ గత కొన్నేళ్లుగా వామపక్షాలు వెనుకబడ్డాయి. మళ్లీ తమ ప్రాభవాన్ని పెంచుకోవాలన్న యోచనలో ఉన్న లెఫ్ట్ పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సహకారం కోరినట్టు వార్తలు వస్తున్నాయి. రెండు పార్టీల మధ్య పరస్పర సహకార పద్దతిలో ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుదిరిన ఒప్పందం ప్రాతిపదికన రానున్న రోజుల్లో, టీడీపీ, జనసేన, వామ పక్ష పార్టీలు కూటమి ఏర్పడుతుందని పరిశీలకులు అంటున్నారు.

షేక్ ‘హ్యాండ్’ కు బీఆర్ఎస్ రెడీ కానీ..?!

తానే మారెనా.. తీరే మారెనా.. దారీ తెన్ను లేనే లేక ఈ తీరాయెనా.. అన్నట్లుగా ఉంది కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ పరిస్థితి. నిన్న మొన్నటి దాకా ఇష్టారీతిన నోరు పారేసుకుని విమర్శించిన కాంగ్రెస్ తోనే చేతులు కలిపేందుకు తహతహలాడాల్సి వస్తోంది. ఔను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు?  రాష్ట్రంలో అధికారం నిలుపుకునే వ్యూహంలో భాగంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో చెలిమి  కోరుకుంటుటున్నారు? ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ శాసన సభలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కాంగ్రెస్ పార్టీని పొగుడుతూ చేసిన ప్రసంగం,  అలాగే, అంతకు ముందు విలేకరుల సమవేశంలో  కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కితాబునిస్తూ చేసిన వాఖ్యాలను గమనిస్తే  కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో చెలిమి కోరుకుంటున్నారనే అనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. నిజమే...  రాజకీయాలలో తాత్కాలిక ప్రయోజనాలే కానీ, శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఇప్పుడు తెలంగాణలో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నిన్న మొన్నటిదాకా అనధికార మిత్ర పక్షాలుగా చెలామణి అయ్యాయి. మోడీ ప్రభుత్వం తెచ్చిన వివాదస్పద వ్యవసాయ చట్టాలు మొదలు పెద్ద నోట్ల రద్దు చట్టం వరకు,  కాంగ్రెస్ సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ  వ్యతిరేకించిన అనేక చట్టాలకు  బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. మోడీకి జై కొట్టింది. పెద్దల సభలో  స్నేహ ధర్మాన్ని చక్కగా పోషించింది.  సరే ఆ తర్వాత ఇద్దరి మధ్య సంబంధాలు చెడిన తర్వాత అవే వ్యవసాయ చట్టాలను బీఆర్ఎస్ వ్యతిరేకించింది. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళన చేసింది. అది వేరే విషయం.  అదలా ఉంటే, ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత వరకు గులాబి పార్టీ ముఖ్య నాయకులు చేస్తున్న ప్రకటనలు గమనిస్తే  బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.   రాష్ట్రంలో రాజకీయ అవసరాలతో పాటుగా, జాతీయ స్థాయిలో కేంద్ర  దర్యాప్తు సంస్థల దాడి నుంచి రక్షణ పొందేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని కూటమికి దగ్గరయ్యే ప్రయత్నాలకు బీఆర్ఎస్ నాయకత్వం సుముఖంగా ఉందనే సంకేతాలు స్పష్ట మవుతున్నాయని అంటున్నారు.  కాగా తాజగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణ, అరెస్ట్ కు సిద్దమవుతున్న ముఖ్యమంత్రి కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత   గురువారం(మార్చి 9) ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసిన వాఖ్యలు బీఆర్ఎస్ కాంగ్రెస్ తో చెలిమి కోరుకుంటున్న సంకేతాలను మరింత స్పష్టం చేశాయని అంటున్నారు.  ఈ సందర్భంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ జంతర్‌ మంతర్‌లో నిర్వహించదలచిన దీక్షకు సోనియా గాంధీని ఆహ్వానించారా అన్న విలేకరుల ప్రశ్నకు కవిత..  సోనియా గాంధీ చాలా పెద్ద నాయకురాలు.. నేను చాలా చిన్న నాయకురాలిని.  అంతే కాదు,   సోనియా మెడలో ఒక మెచ్చుకోలు హారం కూడా వేశారు. 2010లో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఎ సంకీర్ణ ప్రభుత్వం రాజ్యసభలో మహిళా బిల్లు పెట్టడంలో సోనియా కీలక పాత్ర పోషించారని,  ఆమె ధైర్యానికి దేశ మహిళల తరఫున ‘సెల్యూట్‌ ’ చేస్తున్నానని కవిత వ్యాఖ్యానించారు. అలాగే,  బీజేపీకి బీఆర్‌ఎస్‌ బీ-టీమ్‌ అని కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణల్పి స్పందిస్తూ, ప్రస్తుతం దేశంలో ఒక పెద్ద ప్రాంతీయ పార్టీగా మాత్రమే మిగిలిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీలతో కలవాలని సూచించారు. సరే ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్ పార్టీ భ్రమల్లోంచి బయటకు రావాలని అంటూ ఒకటి రెండు చిన్న చిన్న చురకలు కూడా అంటించినా,  మొత్తంగా చూస్తే,  బీఆర్ఎస్ నాయకత్వం హస్తంతో దోస్తీనే కోరుకుంటోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.  అయితే  కొసమెరుపు ఏమంటే, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో తలపెట్టిన దీక్షకు కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధులు హాజరయ్యే అవకాశాలు లేవని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ తెలిపారు. దీక్షకు ప్రతినిధులను పంపాలంటూ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను ఆహ్వానించినట్లు కవిత ప్రకటించినా..  ఉద్దేశపూర్వకంగానే ఈ దీక్షకు దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ నిర్ణయించిందని  ఆయన తెలిపారు.  ఒక పార్టీ ఎమ్మెల్సీ చేసే దీక్షకు తాము వెళితే తప్పుడు సంకేతాలు వెళతాయని ఆయన పేర్కొన్నారు.  జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే..  కాలం కలిసి రానప్పుడు తాడే పామై కాటేస్తుందన్న సామెత  ప్రస్తుతం బీఆర్ఎస్ ఉన్న పరిస్థితికి అద్దం పట్టినట్లుగా సరిపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

అమరావతికి రైల్ కనెక్టివిటీ దేనికి సంకేతం?

అమరావతి.. ఆంధ్రుల కలల రాజధాని. 2015లో అమరావతి నగర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఏపీ రాజధానిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 217 చ.కి.మీ.ల విస్తీర్ణంలో అన్ని హంగులతో అభివృద్ధి చేయడానికి విజన్ తయారు చేశారు. రైతులను ఒప్పించి 30 వేల ఎకరాలకు పైగా భూ సమీకరణ చేశారు.  అమరావతిలో రూ.40 వేల కోట్లకుపైగా అంచనాలతో టెండర్లు పిలిచారు. దాదాపు రూ.10వేల కోట్లు ఖర్చుపెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం రూపొందించిన అమరావతి నగర డిజైన్లు ఆహా అనిపించాయి.  దేశంలోని ఏ మహానగరానికీ తీసిపోని విధంగా ప్రజారాజధాని అమరావతి వస్తుందని రాష్ట్ర ప్రజలు భావించారు. తమ కలల రాజధాని కల సాకారం అవుతున్న దన్న ఆనందం రాష్ట్ర ప్రజలలో వ్యక్తమైంది. అయితే ఎప్పుడైతే 2019 ఎన్నికల అనంతరం జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిందో.. అప్పటి నుంచి అమరావతి ప్రభ మసకబారింది. అప్పటి వరకూ  కళకళలాడిన అమరావతి బోసిపోయింది. జగన్ సర్కార్ అక్కడ  కొనసాగుతున్న నిర్మాణాలను ఆపేసింది.  జగన్ సర్కార్ తీసుకొచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి రాజధాని నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. భూ సమీకరణ, రూ.10 వేల కోట్లతో చేసిన పనులు.. వేలమంది శ్రామికుల నిరంతర శ్రమ.. నిష్ఫలంగా మిగిలిపోయాయి.   రోడ్ల పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో.. అవి  పూర్తిగా పాడైపోయాయి. రోడ్లను తవ్వి కంకర కూడా దోచుకెళ్లారు దుండగులు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుందా అన్న పరిస్థితి కనిపిస్తోంది. జగన్ సర్కార్ విశాఖ రాజధాని అంటూ అమరావతికి కనెక్టివిటీకి ప్రతిపాదించిన  రైల్వే ప్రాజెక్టులను పట్టించుకో కపోయినా.. ఇప్పుడు రైల్వే శాఖ  ఆ ప్రాజెక్టులను సొంతంగానే చేపట్టాలని నిర్ణయించింది.   అమరావతి నూతన రైల్వే లైన్‌ ప్రాజెక్టును   తెరపైకి తెచ్చింది. విజయవాడ బైపాస్‌ రైల్వేలైన్‌ కింద దీన్ని రైల్వే శాఖ నిర్మించనుంది. తెలుగుదేశం హయాంలో కేంద్ర బడ్జెట్‌లో అమరావతి నూతన రైలు మార్గం సర్వేకు బడ్జెట్‌ కేటాయించారు. సర్వే ప్రక్రియను కూడా పూర్తిచేశారు.  విజయవాడ -గుంటూరులను అమరావతి మీదుగా అనుసంధానంగా చేసేందుకు రూ.2800 కోట్ల అంచనా వ్యయంతో నూతన రైలు మార్గాన్ని ప్రతిపాదించారు.  2017-18 బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. అయితే అదంతా జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత మూలన పడిపోయింది.  ఇప్పుడు ఏమైందో ఏమో కానీ అమరావతికి  కనెక్టివిటీని పెంచేందుకు రైల్వే శాఖ నడుంబిగించింది. అమరావతి విషయంలో కేంద్రం ఇటీవల పార్లమెంటులో, కోర్టుకు ఇచ్చిన నివేదికలో  అమరావతికి అనుకూలంగా కేంద్ర స్పందించడం, ఇప్పుడు రైల్వే శాఖ అమరావతి కనెక్టివిటీ విషయంలో అడుగు ముందుకు వేయడంతో రాష్ట్ర ప్రజలలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ఇప్పటికీ జగన్ అమరావతి కాదు అనే అంటున్నారు. ఇటీవల విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ వేదికగా త్వరలో తాను విశాఖ నుంచి పాలన సాగించబోతున్నట్లుగా విస్పష్టంగా ప్రకటించారు. ఒక వైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉండగా జగన్ ఇలా ప్రకటించడంలోని ఔచిత్యమేమిటన్న ప్రశ్న, మరో వైపు జగన్ ఇలా ప్రకటించడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందన్న వాదన ఉన్నాయి. అయినా వాటిని వేటినీ ఇసుమంతైనా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి, మంత్రులు విశాఖ రాజధాని అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనూ ఇటీవల పార్లమెంటు వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి ప్రశ్నకు కేంద్ర మంత్రి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఏపీ రాజధాని అమరావతేనని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారమే ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించడం జరిగిందనీ, దానిని మార్చాలంటే మళ్లీ పార్లమెంటులో చట్టం చేయాల్సిందేనన్న క్లారిటీ ఇచ్చారు. దీంతో జగన్ చెబుతున్నట్లుగా మూడు రాజధానులు, అమరావతి నుంచే పాలన సాధ్యమయ్యే అవకాశాలు లేవు. కేంద్రం ఇదే విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకువెళ్లింది. ఈ నేపథ్యంలోనే అమరావతికి రైల్వే కనెక్టివిటీ విషయంలో రైల్వే శాఖ ఒక అడుగు ముందుకు వేయడం శుభపరిణామంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఫైర్ సర్వీసెస్ డీజీగా ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ డాక్టర్ సునీల్ కుమార్ లాంగ్ లీవ్ నుంచి తిరిగి  వచ్చారు.  ఆయనను ఏపీ సీఐడీ చీఫ్ గా బదలీ చేసే సమయంలో ఆయనను ఏపీ డీజీపీగా నియమించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. ఏమో జరగవచ్చేమో అని కూడా అంతా అనుకున్నారు. ఎందుకంటే సీఐడీ చీఫ్ గా  ఆయన తీరు జగన్ పాలన అంత వివాదాస్పదంగానే ఉంది. ప్రభుత్వ వ్యతిరేక భావన ఉందన్న అనుమానం కలిగితే చాలు సీఐడీ వాలిపోయి.. కేసులు, అరెస్టులూ అంటూ హడావుడి చేసేది.  విపక్ష నేతలపై ఇష్టారీతిగా కేసులు బనాయించి, అరెస్టులతో వేధించి విమర్శలు ఎదుర్కొన్న చరిత్ర సీఐడీ మాజీ చీఫ్ డాక్టర్ సునీల్ కుమార్ ది. అటువంటి సునీల్ కుమార్ ను ఏపీ సర్కార్ అకస్మాత్తుగా బదలీ చేసింది. వెంటనే ఆయనకు మరో పోస్టింగ్ ఇవ్వలేదు.  బదలీ చేయడానికి కొద్ది ముందే ఆయనకు డీజీగా పదోన్నతి కూడా కల్పించింది.  అలా   డీజీ హోదాలో ఉన్న సునీల్ కుమార్ కు  మరో పోస్టింగ్‌ కూడా ఇవ్వకుండా  జీఏడీలో రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఆదేశించింది. సునీల్ కుమార్ స్థానంలో  ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న సంజయ్ కుమార్  ఏపీ సీఐడీ  చీఫ్ గా నియమించింది.  జగన్ సర్కార్ ఏర్పడినప్పటి నుండి సీఐడీ చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ ను ఇప్పుడు ఆయన లాంగ్ లీవ్ నుంచి వచ్చిన తరువాత ఫైర్ సర్వీసెస్ డీజీగా అత్యంత అప్రాధాన్యమైన పోస్టులో నియమించింది. వాస్తవానికి ఏపీలో జగన్ సర్కార్ కొలువుదీరినప్పటి నుంచీ ఇటీవల అకస్మాత్తుగా బదలీ అయ్యే వరకూ సునీల్ కుమారే ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ గా ఉన్నారు. జగన్ మనసెరిగి ప్రవర్తిస్తున్నారన్న కితాబులు(?) అందుకున్నారు.  ఆయన హయాంలో ఏపీ సీఐడీ ఒక  ప్రైవేటు సైన్యంలా, విపక్ష నేతలను వేధించడం కోసమే  ఉందా అన్నట్లుగా వ్యవహరించిందన్న ఆరోపణలను ఎదుర్కొంది.  రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టడమే ఏపీ సీఐడి పనిగా పెట్టుకుందని, అందుకోసమే  పని చేస్తున్నదన్న ఆరోపణలూ వెల్లువెత్తాయి. స్వయంగా సీఐడీ చీఫ్   సునీల్ కుమార్ పై కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి.  అయినా ఆయన పని తీరును మెచ్చి జగన్ సర్కార్ సునీల్ కుమార్ కు డీజీగా పదోన్నతి ఇచ్చింది. అలా పదోన్నతి ఇచ్చి  నిండా నెలరోజులు అయ్యిందో లేదో అదే జగన్ సర్కార్ ఆయనపై   బదలీ వేటు వేసింది. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. అంతే కాదు డీజీ స్థాయిలో ఉన్న ఆయనకు  పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టు, మ్యాన్ హ్యాండలింగ్,  ఐటీడీపీ చీఫ్ చింతకాయల విజయ్ నివాసంపై సీఐడీ పోలీసుల దాడి వంటి ఘటనలన్నీ ఈయన హయాంలోనే జరిగాయి. జర్నలిస్టు అంకబాబును అర్ధరాత్రి అరెస్టు చేయడం కూడా సీఐడీ చీఫ్ గా సునీల్ కుమార్ ఉన్న సమయంలోనే జరిగింది.  ఏపీ సీఐడీ చీఫ్ గా సునీల్ ఉన్న కాలంలో ఆ దర్యాప్తు సంస్థ డీల్ చేసిన కేసులన్నీ వివాదాస్పదమైనవే. విపక్ష నేతలనే కాదు.. సామాన్యులను  సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న నెపంతో వేధించారన్న ఆరోపణలు సైతం ఆయనపై ఉన్నాయి. అయితే సునీల్ కుమార్ కు ప్రభుత్వం నుంచి పూర్తిగా దన్ను, ప్రోత్సాహం ఉండటంతోనే అలా వ్యవహరించారని అప్పట్లో పరిశీలకులు సైతం విశ్లేషణలు చేశారు. అలాంటి సునీల్ కుమార్ కు హఠాత్తుగా ఏపీ సీఐడీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పించి ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా  జీఏడీలో రిపోర్టు చేయమనడం వెనుక ఏం జరిగి ఉంటుందా అన్న అనుమానాలు వెల్లువెత్తాయి.  అయితే ఆయనను ఏపీ డీజీపీగా నియమించేందుకే సీఐడీ చీఫ్ పోస్టు నుంచి తప్పించారని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది.  అటువంటిది   ఆయన హఠాత్తుగా లాంగ్ లీవ్ పెట్టడం, ఆయన లాంగ్ లీవ్ లో ఉన్న సమయంలోనే.. గతంలో ఆయనపై   హై కోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ  చేసిన ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర హోంశాఖ ఆయనపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ డీజీపీ  రాజేంద్రనాథ్ రెడ్డి,  సీఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించింది. అదలా ఉంటే ఇప్పుడు ఏపీ సీఐడీ మాజీ చీఫ్ లాంగ్ లీవ్ నుంచి తిరిగి వచ్చారు. ఇంత కాలం విదేశాలలో ఉన్న ఆయన స్వరాష్ట్రానికి తిరిగి రాగానే జగన్ సర్కార్ ఆయనను అప్రాధాన్య శాఖలో అత్యున్నత హోదాలో నియమించింది.   తద్వారా ఆయన సీఐడీ చీఫ్ గా ఉన్న సమయంలో ఏర్పడిన వివాదాలతోనూ, విపక్షాలపై అక్రమ కేసుల వ్యవహారంలోనే ప్రభుత్వానికి ప్రమేయం లేదని చెప్పుకుంటోంది.  మరో వైపు సునీల్ కుమార్ పై  చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశాలు ఎటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో  సునీల్ కుమార్ ను ప్రభుత్వం సమర్ధించే అవకాశాలు దాదాపు మృగ్యమనే పరిశీలకులు అంటున్నారు.  

వారాహిలో బందరు కు జనసేనాని

జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఈ నెల 14న మచిలీపట్నం వేదికగా జరగనుంది. ఇందుకు సన్నాహాలు, ఏర్పాట్లూ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. బందర్ సభను జనసేన అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గత ఏడాది   గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో ఆ పార్టీ ఆవిర్భావ సభ కు స్థలం ఇవ్వడమే నేరంగా భావించిన అధికార పార్టీ ఇప్పటంలో జనసేన సభకు ఇచ్చిన వారి గృహాలను రోడ్డు విస్తరణ  పేరుతో కూల్చేవేతలకు పాల్పడటం,   జనసేనానికి సామాజిక వర్గానికే చెందిన మాజీ మంత్రి పేర్ని నాని వ్యూహం ప్రకారం జనసేనానిపై విమర్శలు గుప్పించడం తో జనసేనాని ఈ సారి పార్టీ ఆవిర్భావ సభ ను బందర్ వేదికగా నిర్వహించి అన్ని విమర్శలకూ దీటుగా బదులివ్వాలని నిర్ణయానికి వచ్చారు.   అయితే  సభా వేదికపై  నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ ఏం మాట్లాడతారు.. ఎవరిని టార్గెట్ చేస్తారన్న చర్చ మీడియాలో విస్తృతంగా సాగుతోంది.  ఈ నెల 14న బందర్ వేదికగా జరగనున్న జనసేన ఆవిర్భావ సభలో అధికార పార్టీ నేతలు, ముఖ్యంగా పేర్నినాని తదితరుల విమర్శలకు దీటుగా బదులివ్వడమే కాకుండా.. వచ్చే ఎన్నికలలో పొత్తు విషయంలో కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక క్లారిటీ ఇస్తారని పరిశీలకులు అంటున్నారు.   సరైన సమయంలో సరైన వేదిక మీద నుంచి  తన మాటల తూటాలను ప్రత్యర్థులపై గురి చూసి  వదలడంలో పవన్ కల్యాణ్ ముందుంటారని ఆయన అభిమానులకే కాదు, రాజకీయ ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తారు. ఈ నాలుగేళ్ల కాలంలో జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలోనూ వెనుకబడిందన్న భావన సర్వత్రా  నెలకొని ఉంది. ఇప్పటికే పలు వేదికల మీదనుంచి జనసేనాని కూడా ఇదే విషయాన్ని విస్పష్టంగా చెప్పారు. మరో సారి జగన్ ను అధికారంలోకి రానివ్వను, అందు కోసం విపక్ష ఓట్లు చీలకుండా చూస్తాను అని పవన్ కల్యాణ్ గతంలోనే చెప్పారు. అప్పటి  నుంచి ఆయన అడుగులు ఓట్లు చీలకుండా చూడటం దిశగానే సాగాయి. ఈ నేపథ్యంలోనే వచ్చేఅసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకుంటాయన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. పరిశీలకుల విశ్లేషణల ప్రకారంఇప్పటికే క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం, జనసేన శ్రేణులకు కలిసే పని చేస్తున్నాయి. పొత్త వార్తలను ఇటు జనసేన కానీ, అటు తెలుగుదేశం కానీ ఖండించ లేదు.   ఇక బందర్ వేదికగా జరగనున్న జనసేన ఆవిర్భావ సభ కోసం పవన్ షెడ్యూల్ కూడా ఖరారైంది.  ఆ షెడ్యూల్ ప్రకారం పవన్ కల్యాన్ ఈ నెల 11న మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగే బీసీ సదస్సులో పాల్గొంటారు. అనంతరం 12వతేదీన కాపు ఉద్యమ నేత హరిరామజోగయ్య, అలాగే ఆ సమాజిక వర్గానికి చెందిన ఇతర నేతలతో భేటీ అవుతారు. ఆ మరుసటి రోజు అంటే జనవరి 13న పవన్ కల్యాణ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్  నజీర్ తో భేటీ అవుతారు. ఇక బందర్ లో జరిగే జనసేన ఆవిర్భావ సభకు జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి వాహనంలో రానున్నారు.  అవసరం ఉన్నా లేకున్నా సందర్భం ఉన్నా లేకున్నా మీడియా సమావేశం పెట్టి మరీ  పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించే మాజీ మంత్రి పేర్ని నాని ఇలాకాలో జనసేన సభ జరుగుతుండడం, అలాగే పవన్ వారాహి వాహనంతో మచిలీపట్నంలో ప్రవేశించనుండడం తో జనసేన ఆవిర్భావ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

తెరపైకి మళ్ళీ ముందస్తు ముచ్చట!

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయాలలో రాటు తేలిన నాయకుడు. సందేహం లేదు. రాజకీయ వ్యూహ రచనలో ఆయనకు ఆయనే సాటి, సమకాలీన రాజకీయ నాయకుల్లో  ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఆయనకు సమ ఉజ్జీగా నిలిచే నాయకుడు రాష్ట్ర నేతలలో మరొకరు లేరు.  నిజానికి  కేసీఆర్ విజయ రహస్యం కూడా అదే. ఆయన రాజీయ చాణిక్యమే ఆయన విజయ రహస్యం. ప్రత్యర్ధులను చిత్తు చేసే ఎత్తుగడలే ఆయన ప్రధాన రాజకీయ అస్త్రాలు అంటారు రాజకీయ విశ్లేషకులు.  కేసీఆర్ గత కొంత కాలంగా చాలా మౌనంగా ఉంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్  మార్కు సందడి కనిపించడం లేదు. ఆయన ఎక్కడా వినిపించడం లేదు. కనిపించడం లేదు. అయితే, ఒక పక్షం రోజుల క్రితం కావచ్చును, ఆయన వరసగా మూడు నాలుగు రోజులు, బీఆర్ఎస్  ముఖ్యనేతలు, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో సీరియస్ గా చర్చలు జరుపుతున్నట్లు వార్తలొచ్చాయి. అయితే, ఆ చర్చలు ఎందుకు జరుపుతున్నారు? ఏమిటి చర్చిస్తున్నారు? అనేది ఎవరికీ తెలియక పోయినా, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ముఖ్యమంత్రి మళ్ళీ మరోమారు ముందస్తు ఎన్నికలపై దృష్టిని కేద్రీకరించినట్లు తెలుస్తోందని కథనాలు వెలువడ్డాయి. అందులో భాగంగానే అభ్యర్ధుల ఎంపిక కసరత్తు చేస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. నిజానిజాలు ఎలా ఉన్నా ఆ తర్వాతనే,  అంతకు ముందు చెప్పినట్లుగా సిట్టింగులు అందరికీ మళ్ళీ టికెట్  రాక పోవచ్చని , కొందరికి మొండి చేయి తప్పదనే ప్రచారం జరిగింది.  అదలా ఉంటే ఇప్పుడు మళ్ళీ ముందస్తు  ఊహాగానాలు తెరపైకొచ్చాయి.  ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో  ముఖ్యమంత్రి కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ సమన్లు జారీ చేయడం, ఆమె అరెస్ట్ తప్పదనే సంకేతాలు వస్తున్న నేపధ్యంలో విపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహంతో ముఖ్యమంత్రి కేసేఅర్ మళ్ళీ ముందస్తు ఎన్నికల చర్చను తెరపైకి తెచ్చారు. నిజానికి  2018లో ఆరు నెలలు ముందు ముందస్తు ఎన్నికలకు వెళ్లి రెండవసారి అధికారంలోకి వచ్చిన నేపధ్యంలో సెంటిమెంట్స్  కు పెద్దపీట వేసే కేసీఆర్, మూడవసారి మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు.. మళ్ళీ ముందస్తు ఎన్నికలకు వెళతారనే ఊహాగానాలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హుజురాబాద్ ఓటమి తర్వాత ముఖ్యమంత్రి ముందస్తు ఆలోచనలు చేస్తున్నారనే కధనాలు   వస్తూనే ఉన్నాయి.  బీఆర్ఎస్ కీలక విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించిన ప్రతిసారి ఈ తరహా ఊహాగానాలను వినవస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో తొలి భారీ బహిరంగ సభగా పేర్కొన్న ‘ఖమ్మం సభ’ ముందూ వెనకా కొంత కాలం ఇదే ప్రచారం నడిచింది.  తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత ఈడీ విచారణ , అరెస్ట్ ఊహాగానాల మధ్య మరోసారి ఆ చర్చ తెరపైకి వచ్చింది. సీఎం కేసీఆర్  గురువారం(మార్చి9)   క్యాబినెట్ భేటీ నిర్వహించడం, మరుసటి  రోజు శుక్రవారం(మార్చి10) బీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశానికి పిలుపునివ్వడంతో మరో మారు ముందస్తు ఊహాగానాలు జోరుగా షికారు చేస్తున్నాయి. కవితను అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందని బీఆర్ఎస్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయని, అందుకే ముఖ్యమంత్రి ముందస్తు చర్చను మరో మారు తెరపైకి తెచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇక్కడితో ఆగకుండా కాళేశ్వరం అవినీతి ఆరోపణల నిగ్గు తేల్చేందుకు కాగ్ ను రంగలోకి దించినట్లు తెలుస్తున్న నేపధ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి, హ్యాట్రిక్ సాదించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.  అయితే  ఏదైనా  అంతిమ నిర్ణయం ఇప్పటిప్పుడు రాదని  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్టయితే  ఆ తర్వాత  ప్రజల్లో ముఖ్య్మగా మహిళలలో ఏ మేరకు సానుభూతి వస్తుందనేది అంచనా వేసుకుని ఆ తర్వాతనే ముఖ్యమంత్రి కేసీఆర్ అంతిమ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.   అదలా ఉంటే.. శనివారం(మార్చి 11) కవిత ఈడీ ఎదుట విచారణకు హాజరవుతున్నారు. అయితే ఈవిచారణ ఎన్ని రోజులు జరుగుతుంది .. అంతిమ నిర్ణయం ఎప్పుడు వస్తుంది  అనేది ఎవరి ఊహకు అందని విషయం. సో .. ముందస్తు వ్యూహాగానాలు ఎంతవరకు నిజమవుతాయి .. అనేది ఈడీ నిర్ణయం పై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. మరోవైపు కవిత అరెస్టయితే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక ఉద్యమాన్ని తీసుకురావాలని బీఆర్ఎస్ భావిస్తోందనే ప్రచారమూ ఉంది. మరి ఈ ఊహాగానాలు ఎంతవరకు నిజమవుతాయనేది వేచిచూడాల్సిందే.

పోటాపోటీ దీక్షలు.. అక్కడ కవిత.. ఇక్కడ కమలం!

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ఢిల్లీలో కంటే తెలంగాణలోనే ఎక్కువగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న  ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది  అయన రాజీనామా చేశారు. ఆయనతో పాటుగా మరో అవినీతి కేసులో అరెస్టయిన మరో మంత్రి సత్యేంద్ర జైన్ కూడా రాజీనామా చేశారు. ఆ ఇద్దరి స్థానంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు సౌరభ్‌ భరద్వాజ్‌, అతిషీ  సీఎం కేజ్రీవాల్‌  కేబినెట్‌లో కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.  ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా వీరిద్దరితో  సీఎం కేజ్రీవాల్‌ సమక్షంలో ప్రమాణస్వీకారం చేయించారు. సిసోడియా నిర్వహించిన విద్యాశాఖతో పాటు  పబ్లిక్‌ వర్క్స్‌ విద్యుత్‌, పర్యాటక శాఖలను అతిషీ చూడనున్నారు. అలాగే, గతంలో జైన్‌ చూసిన వైద్య ఆరోగ్య శాఖతో పాటు పట్టణాభివృద్ధి, జలవనరులు, పరిశ్రమల శాఖలను ఇక నుంచి భరద్వాజ్‌ నిర్వహించనున్నారు.  అంటే,ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ప్రకంపనలు ఢిల్లీలో  పెద్దగా కనిపించడం లేదు. ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈ కేసులు, ఆరోపణలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  చట్టం తనపని తాను చేసుకుపోతుందనే విధంగా  నింపాదిగా, తమ పని తాము చేసుకుంటున్నారు. ఒక విధంగా కేజ్రీవాల్ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు అని చెప్పవచ్చు. ఇప్పట్లో ఎన్నికలు లేక పోవడం ఒకటైతే, స్కామ్  లో చిక్కున్న మాజీ మంత్రి సిసోడియా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుడు కాకపోవడం వలన మద్యం మరక గురించి ఆయన అంత పెద్దగా పట్టించుకున్నట్లు లేదని అంటున్నారు.    కానీ, తెలంగాణలో మాత్రం రాజకీయం మొత్తం ఢిల్లీ మద్యం కేసు, అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత పాత్ర చుట్టూనే తిరుగుతోంది.  మరో వంక శనివారం(మార్చి10) అధికార బీఆర్ఎస్ విస్త్రుత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే విషయంలో ఉత్కంఠ చోటు చేసుకుంది.  ఆలాగే  బీఆరేస్ ఎమ్మెల్సీ కవిత,  ఢిల్లీలో నిర్వహించనున్న దీక్షకు పోటీగా హైదరాబాద్‌లో దీక్ష చేపట్టేందుకు బీజేపీ  సిద్ధమైంది. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద మహిళా బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత దీక్ష చేపడుతుండగా.. ఆమెకు దీటుగా హైదరాబాద్‌లో బీజేపీ మహిళా మోర్చా నేతలు రాష్ట్రంలోని బెల్టు షాపులు, మహిళలపై హత్యలు, అత్యాచారాలను నిరసిస్తూ దీక్ష చేయనున్నారు. ఈ దీక్షలో బీజేపీ  జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు పలువురు సీనియర్‌ నేతలు పాల్గొననున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. వీధుల కెక్కాయి.

కవితకు అండగా తెరపైకి కేటీఆర్

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం పై ఇంతవరకు పెదవి విప్పని మంత్రి కల్వకుట్ల తారక రామా రావు, ఎట్టకేలకు పెదవి విప్పారు. నిజానికి, ఇంచు మించుగా ఆరేడు నెలలుగా ఢిల్లీ మద్యం కుంభ కోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ, ఈడీ దాఖలు చేసిన ప్రతి చార్జి షీట్ లోనూ ఆమె పేరు ఒకటికి పది సార్లు ప్రస్తావనకు వస్తూనే వుంది. ముద్దాయిగా ఆమె పేరు చేర్చలేదు అనే గానీ, కేసు మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతోంది. ఉచ్చులు బిగుస్తున్నాయి. అయినా  ఇంతవరకు ఒక్క కేటీఆర్ మాత్రమే కాదు, ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు కల్వకుట్ల కుటుంబంలో ఎవరూ  ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు గురించి ఒక్క మాట మాటలాడలేదు. ఇప్పుడు ఈడీ సమాన్లు జారీ చేసి, ఆమె అరెస్ట్ కు రంగం సిద్దం చేస్తున్న సంకేతాలు అందుతున్న సమయంలో కేటీఆర్ చెల్లెలికి మద్దతుగా తెర మీదకు వచ్చారు.  అయితే ఢిల్లీ మద్యం కుంభకోణం గురించో, అందులో కవిత పాత్రకు సంబంధించి వస్తున్న ఆరోపణల గురించో కాకుండా, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ టార్గెట్ గా విమర్శలు చేశారు. కవితకు సమన్లు జారీ చేసింది ఈడీ  కాదు మోడీ అంటూ విరుచుకు పట్టారు. దేశంలో జుమ్లా లేదంటే హమ్లా అన్నట్లు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఇప్పటివరకు తమ పార్టీ నేతలపై  ఈడీ, ఐటీ, సీబీఐ సంస్థలను ఉసిగొల్పారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు ఇచ్చారన్నారు. అవి ఈడీ సమన్లు కాదు.. మోడీ సమన్లు అని విమర్శించారు. కేంద్రం చేతిలో  దర్యాప్తు  సంస్థలు కీలక బొమ్మలుగా మారాయని  కేటీఆర్ ఆరోపించారు. కేంద్రం ప్రతిపక్షాల మీద కేసుల దాడి, ప్రజల మీద ధరల దాడి చేస్తోందని మండిపడ్డారు.  దేశమంతా అవినీతిపరులు తాము మాత్రం సత్యహరిశ్చంద్రుని కజిన్ బ్రదర్స్ అన్నట్లు  బీజేపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. మరి బీజేపీ నేతలు మీద ఉన్న కేసులు ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు.   గురువారం(మార్చి 9) మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన లిక్కర్ స్కాంలో కవితకు.. ఈడీ నోటీసులు ఇవ్వటాన్ని ప్రస్తావించారు. మా ఎమ్మెల్సీ విచారణను ఎదుర్కొంటారని.. విచారణకు హాజరవుతారని స్పష్టం చేశారు కేటీఆర్. ఇది రాజకీయ వేధింపులుగానే చూస్తున్నామని.. అంతా డ్రామా నడుస్తుందన్నారు. రాజకీయంగా ప్రజాకోర్టులో తేల్చుకుంటామని.. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. అంతిమంగా న్యాయం గెలుస్తుందన్నారు మంత్రి కేటీఆర్. ఒక్క కవితకే కాదని.. 10, 12 మంది బీఆర్ఎస్ నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు చేశాయన్నారు. కవిత మొదటిది కాదు.. చివరిది కాదని.. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నేతలకు దాడులు చాలా జరుగుతాయన్నారు కేటీఆర్. రాజకీయ వేధింపులను రాజకీయంగానే ఎదుర్కొంటామన్నారు కేటీఆర్.  అయితే, కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీని విమర్శించడం వలన రాజకీయంగా కేటీఆర్ కు ఏదైనా మేలు జరిగితే జరగవచ్చును కానీ, మోడీపై కేటీఆర్ చేసిన విమర్శలు  విచారణ ఎదుర్కుంటున్న కవితకు ఏ విధంగాను మేలు చేయక పోగా, సమస్యను మరింత జటిలం చేసే ప్రమాదముందని, అంటున్నారు.

ఉద్యోగులను జగన్ ప్రభుత్వం మోసం చేసింది.. బొప్పరాజు

కొంచం ఆలస్యంగానైనా ఉద్యోగ సంఘం నాయకులు, అందరూ కాకపోయినా కొందరు జగన్ సర్కార్ ఉద్యోగులను మోసం చేసిందని అంగీకరిస్తున్నారు. ఉద్యోగుల ఆగ్రహానికి జడిసి వారిలా చెబుతున్నారా? లేక వారిలో నిజంగానే జ్ణానోదయం అయ్యిందా అన్న విషయం పక్కన పెడితే.. ఇప్పటికైనా ప్రభుత్వం మోసం చేసిందని బహిరంగంగా ప్రకటించడం ఉద్యోగులలో జగన్ ప్రభుత్వం పట్ల ఆగ్రహం, వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అందరికీ అర్ధం అయ్యేలా చేసింది.   ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు    మీడియా సమావేశంలో ఉద్యోగుల డబ్బును ప్రభుత్వంఇతర అవసరాలకు వాడుకుందని, ఆ సొమ్మును ఈ నెలాఖరులోగా చెల్లిస్తామని చెబుతోందదన్నారు. ఉద్యమ కార్యాచరణలోకి వెళ్లిన ఉద్యోగులను మభ్యపెట్టడానికి ప్రభుత్వం చెప్పే కల్లబొల్లి కబుర్లను తాము విశ్వసించబోమని స్పష్టం చేశారు. పీఆర్సీ ఒప్పందాలను పూర్తిగా అమలు చేయాలన్నారు.   మొక్కుబడికి చర్చలకు పిలిచారనీ, ఏ ఒక్క విషయంలోనూ స్పష్టత ఇవ్వలేదనీ బొప్పరాజు ఆరోపించారు. పదవీ విరమణ చేసిన వారికి బెనిఫిట్స్ అందే పరిస్థితి లేదని అన్నారు. ప్రతి నెలా మొదటి తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి లేదనీ, అది సాధ్యపడదనీ ప్రభుత్వం చెబుతోందన్నారు. మరి మంత్రులకూ, సలహాదారులకూ ఠంచనుగా మొదటి తేదీన జీతాలెలా చెల్లిస్తోందంటూ ఆయన నిలదీశారు.  సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించి 2,600 కోట్ల రూపాయలు చెల్లించలేదన్నారు. సీపీఎస్ వినా మరే ప్రత్యామ్నాయాన్నీ తాము అంగీకరించే ప్రశక్తే లేదని బొప్పరాజు తేల్చి చెప్పారు.  కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణను జగన్ సర్కార్ గాలికొదిలేసిందన్నారు. ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులనూమోసం చేసిందన్నారు.  ప్రభుత్వం మొక్కుబడిగా హామీలు ఇస్తుందని అందుకే తమ కార్యాచరణ అమలుకు తీర్మానించామని బొప్పరాజు ప్రకటించారు

వివేకా హత్య కేసులో అవినాష్ కు అరెస్టు భయం.. అందుకేనా కోర్టుకు?

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ తనను అరెస్టు చేయడం ఖాయమన్న నిర్ణయానికి కడప ఎంపీ, వైసీపీ నేత అవినాష్ రెడ్డి వచ్చేశారా? అరెస్టును తప్పించుకోవడానికి దారులు వెతుకుతున్నారా? అంటే ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడాన్ని బట్టి చూస్తే ఔననే అనిపిస్తుంది. ఈ కేసులో  తనను అరెస్టు చేయకుండా సీబీఐని ఆదేశించాలంటూ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.  ఈ మేరకు ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ తనను విచారించే సమయంలో వీడియో రికార్డింగ్ చేయాలని ఆ పిటిషన్ లో అవినాష్ రెడ్డి కోరారు. అంతే కాకుండా తన న్యాయవాది సమక్షంలోనే తనను విచారించేలా సీబీఐని ఆదేశించాలని కోరారు. వివేకా హత్య కేసులో ఏ4గా ఉన్న దస్తగిరిని సీబీఐ విచారించలేదని తన పిటిషన్ లో అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే దస్తగిరి ముందస్తు బెయిలు పిటిషన్ ను కూడా సీబీఐ వ్యతిరేకించలేదనీ, అప్రూవర్ గా మారానంటూ దస్తగిరి చెప్పిన మాటల ఆధారంగానే విచారణ చేస్తోందని ఆ పిటిషన్ లో అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో తనకు వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలూ, ఆధారాలూ ల లేకపోయినప్పటికీ తనను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు.  వివేకా హత్య కేసులో దర్యాప్తు అధికారి పనితీరు పాదర్శకంగా లేదని అవినాష్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు.  తనకు 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చారు కనుక  అరెస్టు చేయకుండాసీబీఐని ఆదేశించాలని ఆ పిటిషన్ లో అవినాష్ రెడ్డి కోరారు. ఇలా ఉండగా ఈ నెల 10న అవినాష్ రెడ్డి హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ రెండు సార్లు విచారించింది. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి విచారణకు పిలిచింది.   తొలి సారి విచారణ అనంతరం అవినాష్ రెడ్డి నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా సీఎం జగన్ ఓఎస్ డీని, అలాగే జగన్ సతీమణి వ్యక్తిగత కార్యదర్శి నవీన్ ను సీబీఐ విచారించింది. నవీన్ కు అయితే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందన్న సమాచారం ఇచ్చింది. ఇక అవినాష్ రెడ్డి రెండో సారి సీబీఐ విచారణను ఎదుర్కొని బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన సమయంలో ఆయనలో ఆందోళన కనిపించింది.  సీబీఐ విచారణ సవ్య దిశలో సాగటం లేదని అప్పట్లో విమర్శించారు. అంతే కాకుండా తనను మూడో సిరి విచారణకు రావాలని సీబీఐ చెప్పలేదనీ, సీబీఐ ప్రశ్నలన్నిటికీ తాను సమాధానాలు చెప్పానని అప్పట్లో స్పష్టం చేశారు.  అయితే ఇప్పుడు  ముచ్చటగా మూడో సారి కూడా ఆయనను సీబీఐ విచారణకు పిలిచింది.   సీబీఐ సోమవారం (మార్చి 6)విచారణకురావాల్సిందిగా ఇచ్చిన నోటీసుకు అవినాష్ రెడ్డి ఆ రోజు విచారణకు హాజరు కావడం వీలుపడదని సమాధానం ఇచ్చారు.   తొలిసారి విచారణకు నోటీసు ఇచ్చిన సమయంలోనూ  ఆయన ఇదే సమాధానం ఇచ్చిన సంగతి విదితమే. దీంతో పెద్దగా కారణాలు వివరించాల్సిన అవసరం లేకుండా విచారణకు సహకరించడం లేదన్న ఒకే ఒక్క కారణంతో సీబీఐ అవినాష్  రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉంది. అయినా కూడా అవినాష్ రెడ్డి విజ్ణప్తి మేరకు సీబీఐ అధికారులు  ఈ  నెల 10న హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి హాజరు కావాల్సింది ఆదేశిస్తూ ఆదివారం (మార్చి 5)న పులివెందులలోని ఆయన నివాసానికి వెళ్లి మరీ నోటీసు ఇచ్చి వచ్చారు.  ఆ  రోజు  మాత్రం  ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందేనని సీబీఐ అధికారులు అల్టిమేటం ఇచ్చినట్లుగా  కూడా చెబుతున్నారు.  వరుస పరిణామాలను గమనిస్తే   వివాక్ హత్య కేసులో సీబీఐ దర్యాప్తు  తుదిదశకు చేరుకున్నట్లేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు.   ఇక వరుస అరెస్టులు ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి అరెస్టు చేయకుండా సీబీఐని ఆదేశించాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఇన్ఫ్లూయెంజా ఎఫెక్ట్.. కర్నాటకలో మాస్క్ మస్ట్

ఇటీవలి కాలంలో దేశంలో ఆందోళన రేకెత్తిస్తున్న ఇన్ ఫ్లుయెంజా వైరస్ (హెచ్3ఎన్2) ప్రభావంతో కర్నాటక ప్రభుత్వం తమ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బయటకు రావాలంటే మాస్క్ ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం కర్నాటకలో ఇన్ ఫ్లూయెంజా విశ్వరూపం చూపుతోంది. శరవేగంగా వ్యాపిస్తున్న   వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు మాస్కును తప్పనిసరి చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. బెంగళూరు నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పని సరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  అలాగే  గుంపులు గుంపులుగా చేరవద్దని,  భౌతిక దూరం పాటించాలని  ప్రజలకు హెచ్చరికలు  జారీ చేసింది. ఇన్ఫుయెంజాను కట్టడి చేసేందుకు ప్రజలు చొరవ తీసుకుని సురక్షితంగా ఉండాలని సూచించింది.  ఇన్ఫుయెంజా లక్షణాలు చాలా వరకూ కోవిడ్ లక్షణాలను పోలి ఉంటాయనీ, అందుకే లక్షణాలు కనిపించిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించింది. ఇన్ఫ్లుయెంజాను అరికట్టాలంటే  కఠిన ఆంక్షలు తప్పవని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.

కవిత అరెస్ట్ అయితే?

ఒకరోజు అటూ ఇటూ కావచ్చునేమో కానీ ఢిల్లీ మద్యం కేసులో  బీఆర్ఎస్ అధినేత,  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు కుమార్తె, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ, భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుట్ల కవిత, అరెస్ట్  ఖాయంగా కనిపిస్తోందనే అభిప్రాయమే సర్వత్రా వినిపిస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్  సమన్లు అందుకుని ఢిల్లీ వెళ్ళిన  కవితకు  ముఖ్యమంత్రి కేసేఆర్ ధైర్యం చెప్పి పంపించారనీ,  ఒక తండ్రిగానే కాకుండా, పార్టీ అధినేతగా కూడా కేసీఆర్ కుమార్తె కవితకు  నేనున్నానన్న ధైర్యాన్ని ఇచ్చారనీ చెబుతున్నా.. ఆమె హస్తినకుబయలుదేరి వెళ్లే ముందు   కసీఆర్ ను కలవకుండానే బయలుదేరడం చూస్తే ఆ భరోసా ఆమెకు లభించినట్లు లేదని  అయితే, జరుగతున్న పరిణామాలను గమనిస్తే మాత్రం  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెరాస రోజుల్లో కేసీఆర్ తెరపైకి తెచ్చిన రాజకీయ, న్యాయ పోరాటాన్ని, బీఆర్ఎస్ సుదీర్ఘ కాలం కొనసాగించక తప్పదని అంటున్నారు.   నిజానికి, ఈ కుంభకోణం నుంచి ఒక్క కవిత మాత్రమే కాదు, ఇప్పటికే అరెస్ట్ అయి విచారణ ఎదుర్కుంటున్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా, ఎవరికీ కూడా ఇప్పట్లో ఉపశమనం దొరికే అవకాశాలు పెద్దగా లేవని కూడా అంటున్నారు. అందుకే మనీష్ సిసోడియా అరెస్ట్ అయిన వెంటనే ఆయన తన  మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటుగా మరో కేసులో ఎప్పడో కొన్ని నెలల క్రితం అరెస్ట్ అయిన మరో ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్  కూడా రాజీనామా చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, వారి రాజీనామాలను తక్షణం ఆమోదించారు. అంటే, ఈకేసు ఇప్పట్లో తేలేది కాదని, సుదీర్ఘ కాలం పాటు రాజకీయ, న్యాయ పోరాటం తప్పదనే ఉద్దేశంతోనే, కేజ్రీవాల్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారని అంటన్నారు.  అదలా ఉంచితే కవిత విషయానికి వస్తే, భూత, భవిష్యత్, వర్తమాన రాజకీయలను అవపోసన పట్టిన ముఖ్యమంత్రి కేసేఆర్ ,నిజంగా కవిత అరెస్ట్  అయితే  ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంలో తన వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తలుస్తోంది. నిజానికి ఆరు నెలలకు పైగా ఢిల్లీ లిక్కర్ స్కాం కథ  నడుస్తున్నా, అందులో కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తున్నా, చివరకు కవిత అరెస్ట్ అనివార్యమని తెలిసినా, విపక్షాలు, ముఖ్యంగా బీజేపీ కవిత అరెస్ట్ కథలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా కేసీఆర్ ఏనాడూ ఢిల్లీ కుంభకోణం గురించి ఒక్క మాటైనా మాట్లాడలేదు. చివరకు ఈడీ సమాన్లు అందుకుని ఢిల్లీ వెళ్ళే ముందు కవిత ప్రగతి భవన్ కు వెళ్లి కేసీఆర్ ను కలుస్తారని ప్రచారం జరిగినా,  ఆమె ప్రగతి భవన్ కు వెళ్ళ కుండా నేరుగా  శంషాబాద్ విమానాశ్రయానికి  అక్కడి నుంచి ఢిల్లీకి ఒంటరిగానే వెళ్లారు.  ఇదంతా కూడా కేసీఆర్ వ్యూహంలో భాగంగా జరిగిందన్న వాదన కూడా ఉంది. అది పక్కన పెడితే..  కవితను  అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి..?  ఈ విషయంలో కేసీఆర్ నెక్స్ట్  స్టెప్ట్ ఏంటి..?  ఎప్పటి నుంచో కేంద్రాన్ని ఢీకొంటున్న కేసీఆర్..  మరింత రెచ్చిపోతారా..? ప్రతిపక్ష పార్టీల అధినేతలను,  బీజేపీని వ్యతిరేకిస్తున్న నాయకులను కలుపుకొని వెళ్తారా..?  ఇప్పటికే పలు కేసుల్లో అరెస్ట్ అయిన వారితో,  విచారణను ఎదుర్కొంటున్న వారితో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారా..?  ఏది ఏమైనా   ప్రస్తుతానికి ఆయన వ్యూహం ఏమిటన్నది  గోప్యంగానే వుంది. అలాగే,ఇతర  పార్టీలు కూడా ఈ విషయాన్ని చాలా నిశితంగా గమనిస్తున్నాయి.   మీడియా సమావేశాలలో కూడా ఈ అంశంపై  ఒకటికి, పది సార్లు చర్చించిన తర్వాతే  స్పందించనున్నారని తెలుస్తోంది. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూలో ఏది పడితే అది మాట్లాడి పరువు పొగొట్టుకోవడం కంటే అన్ని తెలుసుకున్న తర్వాతే స్పందించాలని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి, అందరి దృష్టీ మత్రం కవిత అరెస్ట్ అయితే ... కేసీఆర్ ఏం చేస్తారన్నదానిపైనే కేంద్రీకృతం అయ్యిందని మాత్రం పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. .

కేటీఆర్ పట్టాభిషేకానికి ముహూర్తం సిద్ధమైందా?

ఈ ప్రశ్న బీఆర్ఎస్ వర్గాలలోనే కాదు.. సర్వత్రా వినిపిస్తోంది. ఇందుకు కారణం ఆ పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి కనబరచకపోవడమే కారణం అని చెప్పవచ్చు. ఆ కారణంగానే ఇప్పుడు బీఆర్ఎస్ లో సీనియర్లు కూడా తరచుగా కాబోయే సీఎం కేటీఆర్ అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అయితే వారి ఈ ప్రకటనల వెనుక కేసీఆర్ అనుమతి కచ్చితంగా ఉండే ఉంటుంది. ఎందుకంటే ఇకపై తన ఫుల్ కాన్ సన్ ట్రేషన్  అంతా జాతీయ రాజకీయాలపైనే అని అయన స్వయంగా ప్రకటించేశారు కూడా. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ పట్టాభిషేకం ఎప్పుడు? ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తరువాత పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చిన తరువాతనా, లేక ఎన్నికలకు ముందుగానే ఆ తంతు పూర్తి చేసి.. వచ్చే ఎన్నికలను కేటీఆర్ సారథ్యంలోనే పార్టీ ఎదుర్కొటుందా అన్న చర్చ ఇప్పుడు పార్టీ వర్గాలతో పాటు, పొలిటికల్ సర్కిల్స్ లో కూడా జోరుగా సాగుతోంది.  ఏది ఏమైనా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో సమయం లేదు. అయినా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయన్న వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ అధినేత మాత్రం నోరు మెదపడం లేదు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెడదాం అన్న దోరణినే ప్రదర్శిస్తున్నారు. అలాగే 2024 సార్వత్రిక ఎన్నికలకు బీఆర్ఎస్ ను సన్నద్ధం చేయాల్సిన బృహత్తర బాధ్యత కూడా ఆయన భుజస్కంధాలపై ఉంది. ఉంది అనడం కంటే ఆయనంతట ఆయనే ఈ బాధ్యతను తలకెత్తుకున్నారు. ఈ పరిస్థితుల్లో ముందస్తుకు వెళ్లి జాతీయ స్థాయిలో పార్టీ విస్తరణపై దృష్టి పెట్టలేని పరిస్థితిని స్వయంగా కొని తెచ్చుకుంటారని భావించలేమని పరిశీలకులు అంటున్నారు. అలాగని ముందస్తుకు వెళ్లకుండా ఎన్నికలలో రాష్ట్రంలో బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకు వచ్చే బాధ్యతను తనయుడికి అప్పగించి తాను జాతీయ స్థాయిలో పార్టీ విస్తరణ బాధ్యతలను చేపట్టాలన్నది కేసీఆర్ ఉద్దేశంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా అదే చెబుతున్నారు.  ఇందుకు కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలు నెలల వ్యవధిలోకి వచ్చేసినా కూడా జాతీయ రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తుండటాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. నిజానికి బీఆర్ఎస్ విస్తరణ ఇంకా తొలి అడుగులోనే ఉంది.. అక్కడక్కడా ఒకటి రెండు రాష్ట్రాలలో బీఆర్ఎస్ లోకి చేరికలు జరిగినప్పటికీ.. ఏపీ మినమా మరే రాష్ట్రంలోనే బీఆర్ఎస్ అధ్యక్షుల నియామకం జరగలేదు. ఇందుకు తెలంగాణ కూడా మినహాయింపు కాదు. కేటీఆర్ పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నా, అది పార్టీ రాష్ట్ర శాఖ కు ఆయన పూర్తి స్థాయి అధ్యక్షుడి హోదాలో ఉన్నట్లు ఎంతమాత్రం కాదు.  మరి బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో విస్తరణ పనులు ఆరంభించాల్సిన తరుణంలో రాష్ట్ర పార్టీలో అసంతృప్తులు, అలకలను పరిష్కరిస్తూ సమయం వృధా చేసే సాహసం కేసీఆర్ చేస్తారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి.   అందుకే జాతీయ రాజకీయాల పేరిట కేసీఆర్ కావాలనే తన ప్రాధాన్యతను ఉద్దేశపూర్వకంగా తగ్గించుకుంటున్నారంటున్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే తాను సీఎం బాధ్యతల నుంచి తప్పించుకుని రాష్ట్ర పగ్గాలను తనయుడు, మంత్రి కేటీఆర్ కు అప్పగించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కవితకు ఈడీ నోటీసులపై కేసీఆర్ కాకుండా కేటీఆర్ గురువారం ( మార్చి 9)న మీడియా ముందుకు కేటీఆర్ వచ్చి మాట్లాడారని అంటున్నారు. ఈ మీడియా సమావేశంలో కూడా కవితకు నోటీసులపై కంటే.. గత కొద్ది కాలంగా తెరాస నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు పంపిన నోటీసులు, చేసిన దాడులన్నిటినీ వివరించారు. అదే సమయంలో గతంలో తెలుగుదేశంలో ఉన్న సుజనా చౌదరి వంటి వారపై ఈడీ కేసులు వారు బీజేపీలో చేరిన వెంటనే వాటి ప్రస్తావనే లేని విషయాన్ని ప్రస్తావించారు. మోడీ సర్కార్ తీరంతా హమ్లా, జుమ్లా వ్యవహారమని విమర్శించారు. మొత్తంగా కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ మోడీ కనుసన్నలలోనే పని చేస్తున్నది అని ఎస్టాబ్లిష్ చేయడానికే ప్రయత్నించారు. ఇదే సమయంలో ఆయన అదానీ, మోడీ వ్యవహారంపై కూడా విమర్శలు గుప్పించారు. మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత మొత్తంగా కేంద్ర దర్యాప్తు సంస్థల కేసులన్నీ విపక్షాలపైనేనని కేసీఆర్ విమర్శించారు. మోడీ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఇప్పటి వరకూ విపక్షాలపై 5వేలకు పైగా కేసులు నమోదయ్యాయని ఆయన గణాంకాలతో సహా వివరించారు. ఈ నేపథ్యంలోనే ఇక రాష్ట్ర పార్టీ వ్యవహారాలన్నీ కేటీఆర్ చేతుల మీదుగానే జరుగుతాయన్న సంకేతాన్ని ఇచ్చారని అన్నారు. మొత్తంగా కవితను మద్యం కుంభకోణం కేసులో వెనకేసుకురావడం కంటే.. మొత్తంగా కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ మోడీ ఆదేశాలపై విపక్షాల నేతలను వేధించడమే పనిగా పెట్టుకున్నాయని ఎస్టాబ్లిష్ చేయడమే పొలిటికల్ మైలేజీ ఇస్తుందని కేటీఆర్ భావిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. 

ఉద్యోగుల జీతాలకేనా కరోనా కష్టాలు.. మంత్రుల జీతాలకు లేవా?

ఏపీలో ప్రభుత్వోద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. మూడో వారంలో కూడా వారు వేతనాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సిందే. అయితే వేతనాల జాప్యానికి ప్రభుత్వం కరోనా  కారణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు సాకుగా చూపుతోంది. అయితే రాష్ట్ర మంత్రులకు మాత్రం ఠంచనుగా ఒకటో తేదీకల్లా వేతనాలు అందేస్తున్నాయి. మరి వారికి వేతనాలు చెల్లించడానికి సర్కార్ చెబుతున్న ఆర్థిక ఇబ్బందులు అడ్డురావా అని ఉద్యోగులే కాదు.. చేసిన పనులకు బిల్లులు రాని కాంట్రాక్టర్లు కూడా నిలదీస్తున్నారు. ఎదుటి వారికి నీతులు చెప్పే వారు ముందుగా దానిని పాటించాలని ఎవరైనా సరే భావిస్తారు. కానీ జగన్ సర్కార్ మాత్రం తాము చెప్పే కష్టాలూ, బాధలూ అన్ని ప్రజలకే కానీ మంత్రులకూ, ప్రభుత్వానికీ కాదని తన చేతల ద్వారా కళ్లకు కట్టినట్లు చూపుతోంది.    కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురై  ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు, డీఏలు ఇవ్వలేకపోతున్నామనీ, అంతే కాకుండా వారి న్యాయమైన సమస్యలను కూడా పరిష్కరించలేకపోతున్నామనీ బీద అరుపులు అరుస్తున్న జగన్ సర్కార్  తమ బీద అరుపులన్నీ ఉద్యోగుల జీతాల విషయంలోనే తప్ప మంత్రుల వేతనాల విషయంలో కాదని తేటతెల్లమైంది. ఈ విషయాన్ని ప్రభుత్వమే వెల్లడించింది. సమాచార హక్కు చట్టం కంద ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ కోరిన మేరకు  ప్రభుత్వ సహాయ కార్యదర్శి  పబ్లిక్ ఇన్ఫర్మేషన్ హోదాలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో..  కరోనా కాలంలోనూ మంత్రులకు వేలనాలలో పైసా కోత లేకుండా ఠంచనుగా ఒకటో తేదీకల్లా వేతనాలు జమ అయ్యయని పేర్కొన్నారు.   ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల ఇంత వివక్ష,  మంత్రుల పట్ల అంత అపేక్ష ఏమిటని సమాజిక మాధ్యమం సాక్షిగా నెటిజన్లు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులంటూ తమకు సకాలంలో వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వం మంత్రులకు మాత్రం ఠంచనుగా వేతనాలు ఎలా చెల్లించగలుగుతోందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   ఏపీ మంత్రులకు ఏ తేదీలో జీతాలు చెల్లిస్తున్నారంటూ.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ గత నెల 2న సమాచార హక్కు చట్టం కింద సాధారణ పరిపాల శాఖకు దరఖాస్తు చేశారు. దానికి  పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ హోదా ఉన్న ప్రభుత్వ సహాయ కార్యదర్శి ఈ  నెల 1న సుంకర పద్మశ్రీకి లిఖిత పూర్వక సమాధానం పంపించారు. ఆ సమాధానం మేరకు  ఏపీ మంత్రులందరికీ ప్రతి నెల ఠంచనుగా ఒకటవ తేదీనే ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోంది.  గత ఏడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకూ ఒకటవ తేదీనే మంత్రులకు జీతాలు చెల్లించామన్నది, అధికారి ఇచ్చిన లేఖ సారాంశం. ప్రభుత్వ అధికారి ఇచ్చిన లిఖిత పూర్వక వివరణను సుంకర పద్మశ్రీ మీడియాముఖంగా వెల్లడించడంతో ఈ విషయం బట్టబయలైంది. ఓ వైపు తమకు న్యాయబద్ధంగా రావలసిన డీఏలు, అరియర్సుతో పాటు.. ఒకటవ తేదీన జీతాలు, పెన్షన్ల కోసం   ఆందోళన చేస్తుంటే.. మంత్రులు మాత్రం ఒకటో తేదీనే జీతాలు తీసుకుంటూ దర్జాగా ఏసీ కా కార్లలో తిరుగుతున్నారని, పైగా వారే తమతో చర్చల సందర్భంగా ప్రభుత్వం కష్టాల్లో ఉందంటూ బీద అరుపులు అరుస్తున్నారని ఉద్యోగులు విరుచుకు పడుతున్నారు. కరోనా కష్టాలు-ఆర్ధిక నష్టాలు మంత్రులకు వర్తించవా అని నిలదీస్తున్నారు.  ఈ ప్రభుత్వం ఉన్నంతవరకూ కరోనా కష్టాలుంటాయని ఓ ఉద్యోగ నేత తాజా చర్చల్లో చేసిన వ్యాఖ్య అబద్ధమేనని, తాజా ఆర్టీఐ లేఖతో రుజువయిందంటూ ఉద్యోగులు మండిపడుతున్నారు. తమకు ఒకటవ తేదీన జీతాలు-పెన్షన్లు ఇచ్చేందుకు సినిమా కష్టాలు చెబుతున్న సర్కారు.. అదే సినిమా కష్టాలు సచివులకు ఎందుకు వర్తింపచేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. తమది  ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటూ చెబుతున్న  ‘సలహాదారులు’ ఈ  వివక్షకు ఏం సమాధానం చెబుతారని నిలదీస్తున్నారు. 

కవితకు కల్వకుంట్ల ఫ్యామిలీ అండ కరవైందా?

కల్వకుంట్ల కవిత మాజీ అయినా, ప్రస్తుతం ఎమ్మెల్సీ అయినా,  తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు అయినా,  ఏమైనా ఆమెకు ఆ స్థాయి రావడానికీ, రాజకీయంగా ఒక గుర్తింపు పొందడానికి ప్రధాన కారణం మాత్రం ఆమె కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కావడమే. రాజకీయంగా ఆమె ఎదుగుదలకు, ఆమెకు పదవులు దక్కడానికి తొలి కారణం ఆమె కేసీఆర్ కుమార్తె కావడమే.   ఔను ఇప్పుడు ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలను ఎదుర్కొంటూ, ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉన్న కవిత తెలంగాణ ముఖ్యమంత్రి,  భారాస అధ్యక్షుడు కల్వకుట్ల చంద్రశేఖర రావు కుమార్తె. రాష్ట్ర మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుట్ల తారకరామా రావు సోదరి. కల్వకుట్ల కుటుంబ సభ్యురాలు.  వాస్తవానికి ఆమె రాజకీయానికి పునాది  ఆమె కుటుంబం.  కేసీఆర్ లేనిదే తెలంగాణ వచ్చేదో లేదో కానీ, కేసీఆర్ లేకుంటే కవిత రాజకీయ జీవితం ఇన్ని ఎత్తుపల్లాలను చూసేదే కాదు. ఆమె రాజకీయ గుర్తింపునకు ఎలా చూసుకున్నా కేసీఆరే కర్త, కర్మ, క్రియ.కేసీఆర్ కుమార్తె అన్న గుర్తింపుతోనే ఆమె రాజకీయంగా ఎదిగారు. ఇప్పుడు ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమె చిక్కులు ఎదుర్కోవడానికి ఆమె కేసీఆర్ కుమార్తె కావడమే కారణం అనడంలో సందేహం లేదు. మద్యం కుంభకోణంలో ఆమె ప్రమేయం ఉండటం, లేకపోవడం పక్కన పెడితే..  కేసీఆర్ అనే మూడక్షరాలు కవిత రాజకీయంగా ఎదగడానికీ, ఇప్పుడు చిక్కుల్లో ఉండటానికి కూడా  కారణం అనడంలో సందేహం లేదు. అదలా ఉంటే.. ఇప్పుడు ఆ కేసీఆర్ కవితకు అండగా నిలుస్తున్నారా? నిలవగలుగుతారా? ఆమెను చిక్కుల్లోంచి బయటపడేయగలుగుతారా అంటూ మాత్రం ఔనన్న సమాధానం మాత్రం రావడం లేదు. తెలంగాణ రాజకీయాల్లో ఫస్ట్ ఫ్యామిలీగా, రాజకీయంగా తిరుగులేదని భావించే కల్వకుంట్ల కుటుంబం  ఢిల్లీ మద్యం  కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న కల్వకుంట్ల కవితను దూరం పెట్టిందా? ఆ కుంభకోణంలో కవిత పాత్ర ఉందా లేదా అన్న సంగతి పక్కన పెడితే.. ఆ కుంభకోణం మచ్చ ఇటు పార్టీకి, అటు కుటుంబానికి అంటకుండా ఉండేందుకు  కల్వకుంట్ల కవితతో పార్టీ పరంగా లేదా కుటుంబ పరంగా ప్రత్యక్ష సంబంధాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోందా? అంటే పరిశీలకులు ఔననే విశ్లేషిస్తున్నారు. అందుకే తెలంగాణ జాగృతి  అండ కోసం ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.   ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొన్న మరుసటి రోజే  కవిత తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం? ఇప్పుడు ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు ఆమె వాయిదా కోరడానికి భారత జాగృతి ధర్నాకారణంగా చెప్పడాన్ని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. ఆమె ఈ కుంభకోణంలో సీబీఐ విచారణను ఎదుర్కొనడానికి ముందు న్యాయసలహా తీసుకోవడం దగ్గర నుంచి సలహా సంప్రదింపుల వరకూ ప్రగతి భవన్ వేదికగా కేసీఆర్ సమక్షంలో జరిగాయి. అదే ఈడీ విచారణ దగ్గరకు వచ్చేసరికి ఆమె ఢిల్లీ బయలుదేరి వెళ్లే ముందు కనీసం ప్రగతి భవన్ కు వెళ్లి తండ్రి కేసీఆర్ తో భేటీ కూడా కాలేదు. తన నివాసం నుంచి నేరుగా విమానాశ్రయానికి వెళ్లారు. ఆమెకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే ఈడీ నోటీసులు ఇచ్చినా.. తండ్రి కేసీఆర్ కానీ, సోదరుడు కేటీఆర్ కానీ కనీసం ఖండించలేదు. సంఘీభావంగా ఆమె నివాసానికి వెళ్ల లేదు. ఈ ఆరోపణలను కవిత ఒంటరిగానే ఎదుర్కొంటుందన్న సంకేతాలు ఇచ్చేలా వ్యవహరించారు. సరే కేసీఆర్ అయితే పార్టీ అండగా ఉంటుందన్న ఒక్క ముక్కతో ముక్తాయించేశారు. కొందరు నాయకులు, మంత్రులు మీడియా సమావేశాలు పెట్టి కవితకు నోటీసులు ఇవ్వడాన్ని ఖండించారు. ఇక ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శుక్రవారం (మార్చి 10) జరిగే ధర్నాలో పాల్గొనేందుకు పలువురు బీఆర్ఎస్ నేతలు గురువారం హస్తినకు బయలుదేరుతున్నారు. అంతే పార్టీ పరంగా కవితకు దక్కిన మద్దతు, అండ ఇంతే. ఈ విషయాన్ని గుర్తించడం వల్లనే ఆమె గత కొన్ని రోజులుగా తనపై కేసు, విచారణ అంతా రాజకీయ ప్రేరేపితమే అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ జాగృతి, భారత్ జాగృతిల అండతో మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారని పరిశీలకులు అంటున్నారు.  

విచారణకు సహకరించకుంటే అరెస్టే!?

ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత అరెస్టయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న భావనను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వ్యక్తం చేశారు. మద్యం కుంభకోణం వ్యవహారంలో   ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గురువారం హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు ఆమెకు ఈడీ నోటీసులు పంపింది. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటం వల్ల, ముఖ్యంగా శుక్రవారం (మార్చి 10) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాలో పాల్గొనాల్సి ఉంది కనుక తాను శుక్రవారం (మార్చి 9) విచారణకు హాజరు కాలేనని, 15వ తేదీ హాజరవుతానని కవిత ఈడీకి సమాచారం పంపారు. అయితే ఆమె విజ్ణప్తిపై ఈడీ అధికారుల నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. హోలీ కారణంగా ఈడీ అధికారులు ఎవరూ లేకపోవడం వల్ల ఆమె పంపిన సమాచారానికి బదులు రాలేదన్న వాదన వినిపిస్తున్నప్పటికీ, ఆమె హస్తినకు బయలుదేరి వెళ్లారు.  మహిళా రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద శుక్రవారం (మార్చ 10)ధర్నా చేయడం కోసమే ఆమె హఃస్తిన వెళ్లారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నా.. ఫర్ సపోజ్ ఆమె వినతి పై ఈడీ నుంచి ఎటువంటి స్పందనా గురువారం ఉదయానికి కూడా రాకపోతే కవిత అనివార్యంగా ఈడీ విచారణకు హాజరై తీరాల్సిందేనని న్యాయనిపుణులు చెబుతున్నారు. అందుకోసమే.. ఎటుపోయి ఎటువచ్చినా ఈడీకి అందుబాటులో ఉండేందుకే ఆమె బుధవారమే హస్తిన బయలు దేరి వెళ్లారని అంటున్నారు. అయితే ఆమె ఈడీ ముందు హాజరవుతారా, లేదా అనే విషయంలో అనుమానాలు వ్యక్తమౌతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే.. మనీలాండరింగ్ ప్రొవిజన్స్ (పీఎంఎల్ఏ) కింద ఈడీ నోటీసులు జారీ అయ్యాయని... విచారణకు సహకరించకపోతే సంబంధిత వ్యక్తిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అంటున్నారు.  అయితే, ముందస్తు బెయిల్ కోసం  హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించే వెసులుబాటు ఉందని తెలిపారు.

కోమటిరెడ్డి కొత్త రాగం!

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భువగిరి ఎంపీ కొంటి రెడ్డి వెంకట రెడ్డి పార్టీ మారుతున్నారా? మారే ఆలోచన చేస్తున్నారా? అంటే, అవునని చెప్పలేము.  కాదనీ అనలేము. అయన పార్టీ మార వచ్చు, మారక పోనూ వచ్చు. నిజానికి ఈ చర్చ ఈ రోజుది కాదు. పీసీసీ రేసులో రేవంత్ రెడ్డి చేతిలో ఓటమి చవిచూసిన నాటి నుంచి, కోమటి రెడ్డి అసంతృప్తితో రగిలిపోతూనే ఉన్నారు. అలాగే,  అనేక సందర్భాలలో అసంతృప్తి బాహాటంగా వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. పార్టీ మారే అలోచన చేస్తున్నారనే వదంతులు వినిపిస్తూనే ఉన్నాయి.  మరోవంక ఆయన సోదరుడు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి, బీజేపీలో చేరిన తర్వాత అయితే ఆ వదంతులు ఇంకా బలంగా వినిపించాయి. అయినా, వెంకట రెడ్డి పార్టీ మారలేదు. చేయి వదల లేదు. హస్తం పార్టీలోనే కొనసాగుతున్నారు. రాజగోపాల రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగినా, వెంకట రెడ్డి తమ్ముడి తరపున ప్రత్యక్షంగా ప్రచారం చేయలేదు. అలాగే, కాంగ్రెస్ స్టార్  క్యాంపైనర్ పదవిలో ఉండి కూడా కాంగ్రెస్ అభ్యర్ది పాల్వాయి స్రవంతి పక్షాన ప్రచారంలో పాల్గొన లేదు. ఆస్ట్రేలియా  వెళ్లి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తిరిగొచ్చారు. అయినా  ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాంటే ఉన్నారు అన్నట్లుగానే ఉన్నారు. అప్పుడప్పుడు సంచలన ప్రకటనలు, వివాదస్పద వ్యాఖ్యలు  చేయడం మినహా పెద్దగా రాజకీయ వేదికల మీద కనిపించడం లేదు.   మరో వంక రేవత్ రెడ్డి వర్గం కూడా ఏదో విధంగా  కోమటి రెడ్డిని బయటకు పంపేందుకు ప్రయత్నిస్తూనే వస్తోంది. రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ వంటి నాయకులు వెంకట రెడ్డిని రెచ్చగొడుతున్నారు. అయితే,ఆయన ఒకసారి రెచ్చిపోయినా, మళ్ళీ అంతలోనే సర్దుకు పోతున్నారు. తెగే దాకా లాగకుండా ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఒక విధంగా కోమటి రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య   టామ్ అండ్ జెర్రీ ఫైట్ నడుస్తోంది. అయితే, ఇప్పటికిప్పుడు కాకపోయినా కోమటిరెడ్డి వెంకట రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని,  అదే సమయంలో ఆయన బీజేపీలో చేరే విషయంలోనూ ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోరని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆశిస్తున్న లేదా అంచనా వేస్తున్న విధంగా హంగ్ అసెంబ్లీ వచ్చి, కాంగ్రెస్, బీఆర్ఎస్ చేతులు కలిపితే  కోమటి రెడ్డి కాంగ్రెస్ లో కొనసాగుతారు. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే  అప్పుడు ఆయన కాంగ్రెస్ లో కొనసాగడమా, బీజేపీ తీర్ధం పుచ్చుకోవడమా అనే విషయంలో ఓక నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.  ఈ నేపధ్యంలో కోమటి రెడ్డి పార్టీ మార్పుపై ఎన్నికలకు నెల ముందు మాట్లాడతా.. అంటూ చేసిన ప్రకటన సంచలనంగా మారింది.

మళ్ళీ అవే చర్చలు.. నేతల తీరుఫై ఉద్యోగుల ఆగ్రహం!

గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్ని సార్లు మోసపోయినా మళ్ళీ, మోసం చేసిన ప్రభుత్వాన్నే నమ్ముతున్నారు. అయితే, ఇలా మోస పోతోంది, ప్రభుత్వ ఉద్యోగులు కాదు, చర్చలకు రమ్మనగానే చంకలు గుద్దుకుంటూ వెళ్లి, ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టు పెట్టి వస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులు. అవును, కంచే చేను మేసింది అన్న చందంగా  ఉద్యోగ సంఘాల నాయకులే సర్కార్ తో కుమ్ముక్కై ఉద్యోగులను మోసం చేస్తున్నారనేది ఎవరో చేసిన ఆరోపణ కాదు. ఉద్యోగులే వ్యక్తం చేస్తున్నఆవేదన. గతంలో ఉద్యోగులే కాదు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు కొందరు బహిరంగంగా ఉద్యోగ సంఘాల నేతలపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకూ సిద్దమయ్యారు. ఇప్పడు కూడా మళ్ళీ అదే పరిస్థితి పునరావృతం అవుతోందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   నిజానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నాయకులను తమ గుప్పిట్లో పెట్టుకుని ఆట బొమ్మల్లా  వాడుకుంటోంది. ఇది ఆరోపణ కాదు, రుజువైన వాస్తవం. పీఆర్సీ వివాదం తలెత్తిన సమయంలో ప్రభుత్వం ఇదే విధంగా ఉహ్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపింది. హామీలు ఇచ్చింది. కానీ, ఇంతవరకు కనీసం   ఉదాహరణగా చెప్పుకునేందుకు అయినా ఏ ఒక్క హామీనీ  పక్కాగా నూటికి నూరు శాతం అమలు చేయలేదు. కానీ, ఉద్యోగులు అడగని, పదవీ విరమణ వయోపరిమితిని పెంచి, అదే మహా ప్రసాదం అన్నరీతిన ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. నిజానికి వయోపరిమితి పెంపు నిర్ణయం, ఉద్యోగులకు మేలు చేసేందుకు తీసుకున్న నిర్ణయం కాదు. 2019 తర్వాత పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించవలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ పూర్తిగా చెల్లించలేని స్థితిలో.. రిటైర్మెంట్ వయసును పెంచారు.  ఇలా ప్రభుత్వం ఒకటికి పదిసార్లు ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసినా, ఉద్యోగ సంఘాల నాయకులు  మాత్రం ఏమి ఆశిస్తున్నారో, ఎలాంటి ప్రయోజనాలు పొందుతున్నారో  కానీ, ఉద్యోగుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి  ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.  నిజానికి, ఉద్యోగ సంఘాలు గొంతెమ్మ కోరికలు ఏవీ కోరడం లేదు. వారు అడుగుతున్న దల్లా గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చమనే. అవసరాల కోసం  ప్రభుత్వం వద్ద దాచుకున్న పీఎఫ్ సొమ్ములను జాప్యం లేకుండా నిబంధనల ప్రకారం సకాలంలో ఇవ్వాలని కోరుతున్నారు. అన్నిటినీ మించి వేతన జీవులు కోరుతున్నది  నెల జీతాలు సకాలంలో ఇవ్వాలని కోరుతున్నారు. ప్రధానంగా పదేళ్ల సర్వీసు పూర్తయిన కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ , పెండింగ్‌ డీఏల చెల్లింపు, సీపీఎస్‌ రద్దు , గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు, పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలు, సీపీఎస్‌ ఉద్యోగులపై నమోదు చేసిన 1,600 కేసుల మాఫీ వంటివే వారి డిమాండ్లు. అసలు ఉద్యోగుల సొమ్ములు వారికి తెలియకుండా తీసుకోవడం తప్పు. కాదు నేరం. నిజానికి  నేరం చేసిన సర్కార్ ను ఉద్యోగ సంఘాలు నిలదీయాలి. కానీ  ఉద్యోగ సంఘాల నాయకులు, తగుదునమ్మా అని, చేతులు కట్టుకుని మంత్రి వర్గ ఉప సంఘంతో చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వం ఏమో  ఉద్యోగులకు ఏదో గొప్ప మేలు చేస్తున్నట్లు  ప్రవర్తిస్తోంది. ఈ ( మార్చి) నెలాఖరులోపు  మూడు వేల కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చెబుతున్నారు.  కానీ ప్రభుత్వం ఇస్తుందన్న నమ్మకం అయితే ఎవరికీ లేదు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, టీచర్లు ఓట్లు కావాలి కాబట్టి, చర్చల పేరున మరో మారు ఉద్యోగులను మోసం చేసేందుకు సర్కార్ ప్రయత్నిస్తోందనే ఉద్యోగులు అనుమానిస్తున్నారు.   ఉద్యోగుల జీతాలకే దిక్కులేని ప్రభుత్వం రూ. 3000 కోట్లు చెల్లించడం అయ్యే పని కాదు. అందుకేమ ఉద్యోగులు  అంత మొత్తాన్ని  ఎక్కడ నుంచి తెస్తుందో చెప్పాలని అంటున్నారు. నిజానికి  గత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వస్తే,  సీపీఎస్ రద్దు అవుతుందని.. ఊహించనంత ఫిట్ మెంట్‌తో పీఆర్సీ ఇస్తారని డీఏలు ఆపరని.. ఇలా రకరకాలుగా ఉద్యోగులు ఊహించుకున్నారు. కానీ, అనుకున్నదొకటి అయితే అయింది మరొకటి అన్నట్లుగా  జగన్ రెడ్డి పాలనలో  చివరకు జీతాలకే దిక్కులేని పరిస్థితి వచ్చిందని అంటున్నారు. మరోవంక ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఐఆర్ కంటే ఫిట్ మెంట్ తగ్గించారు. అయినా నేతలు కిమ్మనలేదు. అందుకే అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగ సంఘాల నేతలు తమను మోసం చేస్తున్నారని,   తాము మోసపోయామని ఉద్యోగులుఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం సర్కార్ ను  సేవ్ చేందుకు అవసరం వచ్చినప్పుడు ఉద్యమం అంటున్నారు, అంతలోనే చల్లబడి పోతున్నారని  ఉద్యోగులు అంటున్నారు. అలాగే, ఈ సమస్యలు అన్నిటికీ  ఒకటే సమాధానం అంటున్నారు. మోసం చేసిన  ప్రభుత్వాన్ని సాగనంపడం ఒక్కటే మార్గమనే నిర్ణయానికి వారు వచ్చారు. ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు.