పేపర్ లీకేజీ బాధ్యుడు కేటీఆర్.. బండి సంజయ్
posted on Mar 17, 2023 @ 10:47AM
టీఎస్పీసీ పేపర్ల లీకేజీ వెనుక ఉన్నది ఐటీ మంత్రి కేటీఆరే అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన సమయమంతా ఢిల్లీ మద్యం కుంభకోణం నుంచి బిడ్డ కవితను, టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీ వ్యవహారం నుంచి కొడుకు కేటీఆర్ ను కాపాడుకేనేందుకే వెచ్చిస్తున్నారన్నారు.
టీఎస్పీఎస్సీ కంప్యూటర్ల నిర్వహణ బాధ్యతంతా ఐటీ శాఖదే అయినందున పేపర్ల లీకేజీకి బాధ్యుడు కేటీఆరే అవుతారని తెలంగాణ బండి సంజయ్ ఆరోపించారు. ఆయనను వెంటనే కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తప్పు ఎవరు చేసినా… చివరకు నా కొడుకు, బిడ్డనైనా ఊరుకునేది లేదని కేసీఆర్ గతంలో అసెంబ్లీ లో చెప్పిన మాటలకు కట్టుబడి ఉండాలన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి నిరసనగా జరిగిన ఆందోళనలో అరెస్టై చంచల్ గూడ జైల్లో ఉంటున్న బీజేవైఎం నాయకులను పరామర్శించిన బండి సంజయ్ ఆ తరువాత పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎస్సీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు ఎస్.కుమార్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ తెలంగాణలోని లక్షలాది యువత తీవ్ర ఆందోళనలోకి నెట్టివేసిందన్నారు. ఈ లీకేజీకి నిరసనగా ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేస్తున్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాశ్ తోపాటు కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసి… జైలుకు పంపడం దుర్మార్గమన్నారు. లీకేజీపై ప్రశ్నించిన వారిని జైళ్లకు పంపి, లీకేజీ నేరస్తులకు రాచ మర్యాదలు చేస్తున్నారని బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
అసలు టీఎస్పీఎస్సీ ఛైర్మన్ కు తెలియకుండా ఎట్లా లీకైందో తెలియాలనీ, ముందు వాళ్లను ప్రాసిక్యూట్ చేయాలని బండి సంజయ్ అన్నారు. నేరస్తులను కాపాడుకునేందుకే సిట్ వేశారని ఆరోపించారు. మియా పూర్ భూములు, డ్రగ్స్, నయీం కేసులపై వేసిన సిట్ లు ఏమయ్యాయి? సిట్ పరిస్థితి కేసీఆర్ సిట్ అంటే సిట్…. స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్లుతా తయారైందని విమర్శించారు. కేసీఆర్ ఫ్యామిలీ తప్పు చేయకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడానికి అభ్యంతరమేంటని ప్రశ్నించారు. .