మార్చిలోనే మాడ్చేస్తున్నాయ్.. ముందు ముందు ఎలా ఉంటుందో?

రాష్ట్రంలో ఎండలు మార్చి లోనే మాడ్చేస్తున్నాయి. మార్చి మొదటి వారంలోనే తెలంగాణలోని పలు ప్రాంతాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కు చేరుకున్నాయి. ఎల్ నినా ప్రభావంతో ఈ ఏడాది ఎండలు అధికం అని వాతావరణ శాఖ ముందుగానే ప్రకటించినా ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలను మాత్రం ఎవరూ ఊహించలేదు. నడి వేసవిలో ఏర్పడే తుపానుల కారణంగా కొద్ది పాటి ఉపశమనం ఉంటుందన్న ఆశలను కూడా ప్రతి తుపాను (యాంటీ సైక్లోన్ ) పరిస్థితులు కలిగే అవకాశం లేకుండా చేస్తాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. మార్చి మొదటి వారంలోనే 40 డిగ్రీలకు చేరిన ఎండలు.. నడి వేసవి వచ్చే సరికి 50 డిగ్రీల సెల్సియస్ లకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఏప్రిల్ మధ్య నాటికి జోరందుకోవలసిన శీతల పానియాల విక్రయాలు ఇప్పటికే పీక్స్ కు చేరుకున్నాయంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు.  మార్చి మొదటి వారంలోనే ఎండలిలా మాడ్చేస్తుంటే.. ఇక ఏప్రిల్, మే నెలలలో, రోహిణీ కార్తెలో రోళ్లే పగులుతాయా అన్నంత ఆందోళన వ్యక్తమౌతోంది. ఇక ఎండలకు తోడు యాంటీ తుపాన్ (ప్రతి తుపాన్) పరిస్థితుల కారణంగా వాతావరణంలో తేమ తగ్గిపోయి, వడగాలులు వీసే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ ఏడాది ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదౌతాయి.  ఇప్పటికే ఉదయం 8 గంటలకే ఎండ చుర్రుమంటోది.. మధ్యాహ్నం అయ్యేసరికి రోడ్లు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి.  మండే ఎండల కారణంగా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 

ఐక్యంగా ఉంటే నిలుస్తాయి.. లేకుంటే అంతే సంగతులు?

జాతీయ స్థాయిలో బీజేపీకి దీటుగా నిలవాలంటే.. ఐక్యంగా ఉండట మొక్కటే ప్రతిపక్షాలకు ఉన్న ఏకైక ఆప్షన్ ఐక్యంగా 2024 ఎన్నికలను ఎదుర్కోవడమే. అలా కాకుండా ఐక్యత సాధించడంలో విపక్షాలు విఫలమైతే మాత్రం అంతే సంగతులు. ఈశాన్య రాష్ట్రాల ఫలితాలు తేల్చి చెప్పిన నిజమిదే. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ పై ప్రభుత్వ వ్యతిరేకత ఓ రేంజ్ లో ఉన్నా జాతీయ స్థాయిలో విపక్షాలు ఐక్యంగా లేకపోతే మాత్రం ప్రజా వ్యతిరేకత వల్ల బీజేపీకి ఇసుమంతైనా నష్టం లేకపోగా, మరింత బలపడటం ఖాయమని ఈ సాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిర్ద్వంద్వంగా తేల్చేశాయి. ఈ ఫలితాలను బట్టి చూస్తే.. విపక్షాల అనైక్యత బీజేపీని నీటిలో మొసలిగా ఎవరూ ఢీ కొట్టలేని బలశాలిగా మార్చేసిందని విస్పష్టంగా తేల్చేసింది. ఆ ఫలితాలు విపక్షాలకు జ్ణానోదయం కలిగిస్తే.. వాటి ఐక్యతా యత్నాలు.. ఫలించే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా ఎవరికి వారేగా రంగంలోనికి దిగితే.. మరో సారి కేంద్రంలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టడం నల్లేరు మీద బండి నడకే అవుతుందని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు. అదే జరిగితే 2024 ఎన్నికల తరువాత విపక్షం అనేదే ఉండని పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. 2019 ఎన్నికలలో ప్రధాన విపక్ష హోదాను కాంగ్రెస్ అతికష్టం మీద నిలుపుకోగలిగింది. విపక్షాల ఐక్యత విషయంలో ఇదే పరిస్థితి కొనసాగితే.. 2024 సార్వత్రిక ఎన్నికల తరువాత ఏ పార్టీకీ కూడా విపక్ష హోదా దక్కే పరిస్థితి ఉండే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నారు.  నాగాలాండ్‌లో బీజేపీ విజయం నల్లేరు మీది బండి నడకే అయ్యిందంటే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో విపక్షమనేదే లేదు. ఇక త్రిపుర విషానికి వస్తే అక్కడ విజయం కోసం బీజేపీ చెమటోడ్చింది.  అందుకు కారణం ఆ రాష్ట్రంలో  కాంగ్రెస్‌, వామపక్షాల మధ్య పొత్తు ఉండటమే.  పొత్తులు లేకుండా బీజేపీని నిలువరించడం అసాధ్యం అన్న విషయాన్ని ఇప్పటికే గుర్తించిన ఏకైక పార్టీ గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రమే. పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్సే.. పొత్తులు లేకుండా బీజేపీని నిలువరించడం అసాధ్యమన్న నిర్ణయానికి వచ్చేసింది. అయితే ఆ పొత్తుల కోసం ఒక మెట్టు దిగడానికి  ఆ పార్టీ ఇసుమంతైనా సిద్ధంగా లేదు. బీజేపీయేతర కూటమి తన నాయకత్వంలోనే ఏర్పాటు అవ్వాలన్న పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇందుకు తాజా తార్కానమే.. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాయ్ పూర్ వేదికగా జరిగిన ప్లీనరీలో చేసిన ప్రకటనే. అయితే కాంగ్రెస్ తో కలిసేందుకు ఇప్పటి వరకూ తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వంటి వారు సిద్ధంగా లేరు. అసలు పొత్తులు, ఎత్తులు, వ్యూహాల విషయంలో విపక్షాలు వేటికవిగా వేర్వేరుగా అడుగులు వేయడం చూస్తుంటే... ఏ పార్టీకి ఆ పార్టీ తాము అధికారంలోకి రాకున్నా పర్వాలేదు కానీ.. మరో విపక్షానికి ఆ అవకాశం రాకూడదని అంటున్నారు.  అందుకే 2024 సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గరపడుతున్నా విపక్షాల ఐక్యతా యత్నాలు ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతున్నాయి. స్వయంగా విపక్షాల ఐక్యతా యత్నాలను ముందుండి నడిపించాల్సిన కాంగ్రెస్ పార్టీయే ఆ ప్రయత్నాలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తోంది.  వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ పార్టీల ఐక్యతే లక్ష్యంగా జరుగుతున్న ప్రయత్నాలకు రాయ్ పూర్ లో జరిగిన పార్టీ  ప్లీనరీ వేదికగా గండి కాంగ్రెస్ గండి కొట్టింది? విభేదాలను పక్కన పెట్టి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నిటినీ కలుపుకు పోయే దిశగా అడుగులు వేయాల్సిన కాంగ్రెస్.. అతి విశ్వాసంతో కొన్ని పార్టీలను ఐక్యత విషయంలో తమతో కలిసి అడుగువేయాలన్న ఆలోచన కూడా చేయకుండా నిరోధించింది.   భారత్ జోడో యాత్రకు దేశ వ్యాప్తంగా వచ్చిన సానుకూల స్పందన.. పార్టీ కీలక నేత రాహుల్ గాంధీకి పెరిగిన జనాదరణ కారణంగా కాంగ్రెస్ మళ్లీ తన సహజ లక్ష్యమైన ఒంటెత్తు పోకడలకు శ్రీకారం చుట్టిందని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో కూడా పలు మార్లు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి ఉప సంహరించుకున్న చరిత్ర కాంగ్రెస్ ఉంది. అయితే మన్మోహన్ సారథ్యంలో  రెండు పర్యాయాలు అంటే పదేళ్ల పాటు కాంగ్రెస్ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపింది. అయితే అప్పట్లో ఆ పార్టీ మిత్ర ధర్మాన్ని పాటించిందా అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పుడు అంటే దాదాపు పదేళ్ల పాటు కేంద్రంలో ప్రధాన విపక్ష పాత్రను పోషిస్తున్న కాంగ్రెస్.. ఈ పదేళ్ల కాలంలోనూ ఉమ్మడి పోరాటాలకు నేతృత్వం వహించిన సందర్భాలు బహుస్వల్పం అనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ వైఖరి కారణంగానే మమతా బెనర్జీ వంటి బలమైన నేతలు ఆ పార్టీతో కలిసేందుకు ముందుకు రావడం లేదు.  మొత్తంగా పార్టీ అధ్యక్ష పదవి నుంచి 2019 ఎన్నికల తరువాత రాహుల్ గాంధీ వైదొలగిన తరువాత ఆ పార్టీలో నాయకత్వ లేమి కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇప్పటికీ కనిపిస్తోంది. జాతీయ పార్టీగా శతాధిక వత్సరాల అనుభవం ఉన్న గ్రాండ్ ఓల్డ్ పొలిటికల్ పార్టీ విపక్ష పాత్రను పోషించడంలో సందేహాలకు అతీతంగా విఫలమైంది. అయితే జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యత విషయంలో ఇప్పటికీ కాంగ్రెస్  లేకుండా కూటమిని ఊహించడం అసాధ్యం. ఈ ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో ఈ విషయం పలుమార్లు నిరూపితమైంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్సేతర, బీజేపీ యేతర ప్రత్యామ్నాయ కూటమి కోసం కేసీఆర్, మమత, నితీష్ వంటి నేతలు చేసిన ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్లుగానే సాగాయి. అసలు విపక్ష ఐక్యతకు ప్రధాన అవరోధం కాంగ్రెస్సే అని చెప్పాలి. అదే సమయంలో తమ తమ రాష్ట్రాలలో కొద్ది పాటి బలం ఉన్న ప్రాంతీయ పార్టీలు.. ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ బలోపేతం కాకుండా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని పొత్తుల విషయంలో తమ డిమాండ్లకు అనుగుణంగా తగ్గేలా చేయాలని భావిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ తో సహా విపక్షాలన్నీ తమ గోతిని తామే తవ్వుకుంటున్న చందంగా ఐక్యతను పక్కన పెట్టి ఆధిపత్యం కోసం పాకులాడుతున్నాయి. ఈ పరిస్థితి మారనంత వరకూ కేంద్రంలో తమ అధికారానికి వచ్చిన ఢోకా ఏం లేదన్న ధీమాతో బీజేపీ ఉంది.  

ముగింపు దశకు వివేకా హత్య కేసు.. అవినాష్ అరెస్ట్?

వైఎఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కడప ఎంపీ వైఎస్ అవినాష్ కు మరో మారు నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఈ కేసులో రెండు సార్లు అవినాష్ రెడ్డిని విచారించిన సీబీఐ తాజాగా మరో సారి విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇవ్వడం ఈ కేసులో ఆయన అరెస్టు తప్పదన్న చర్చకు మరో మారు తెరతీసింది. రెండో సారి సీబీఐ విచారణకుహాజరైన అనంతరం వైఎస్ అవినాష్ రెడ్డిలో ఆందోళన కనిపించింది. అయినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. సీబీఐ విచారణ సవ్య దిశలో సాగటం లేదని విమర్శించారు. తనను మూడో సిరి విచారణకు రావాలని సీబీఐ చెప్పలేదనీ, సీబీఐ ప్రశ్నలన్నిటికీ తాను సమాధానాలు చెప్పానని అప్పట్లో స్పష్టం చేశారు.  మరో సారి విచారణకు రావాల్సి ఉంటుందని సీబీఐ తనకు చెప్పలేదని అవినాష్ ప్రకటించినా.. ఇప్పుడు తాజాగా ముచ్చటగా మూడో సారి కూడా విచారణకు రావాల్సిందేనని స్పష్టం చేస్తూ సీబీఐ నోటీసు ఇచ్చింది. రెండో సారి విచారణ తరువాత మూడో సారి విచారణకు పిలవడానికి మధ్య సీబీఐ ఎక్కువ రోఝుల వ్యవధి కూడా అవినాష్ కు ఇవ్వలేదు. అయితే సీబీఐ మూడో సారి విచారణకు రావాల్సిందిగా ఇచ్చిన నోటీసుకు అవినాష్ రెడ్డి స్పందించిన తీరు, ఇచ్చిన సమాధానమే ఆయన అరెస్టు అనివార్యమన్నది తేటతెల్లం చేస్తున్నది. సీబీఐ సోమవారం (మార్చి 6)విచారణకురావాల్సిందిగా ఇచ్చిన నోటీసుకు అవినాష్ రెడ్డి ఆ రోజు విచారణకు హాజరు కావడం వీలుపడదని సమాధానం ఇచ్చారు. తొలిసారి విచారణకు నోటీసు ఇచ్చిన సమయంలోనూ  ఆయన ఇదే సమాధానం ఇచ్చిన సంగతి విదితమే. దీంతో పెద్దగా కారణాలు వివరించాల్సిన అవసరం లేకుండా విచారణకు సహకరించడం లేదన్న ఒకే ఒక్క కారణంతో సీబీఐ అవినాష్  రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉంది. అయినా కూడా అవినాష్ రెడ్డి విజ్ణప్తి మేరకు సీబీఐ అధికారులు  ఈ  నెల 10న హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి హాజరు కావాల్సింది ఆదేశిస్తూ ఆదివారం (మార్చి 5)న పులివెందులలోని ఆయన నివాసానికి వెళ్లి మరీ నోటీసు ఇచ్చి వచ్చారు.  ఆ  రోజు  మాత్రం  ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందేనని సీబీఐ అధికారులు అల్టిమేటం ఇచ్చినట్లుగా  కూడా చెబుతున్నారు. వరుస పరిణామాలను గమనిస్తే   వివాక్ హత్య కేసులో సీబీఐ దర్యాప్తు  తుదిదశకు చేరుకున్నట్లేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు.   ఇక వరుస అరెస్టులు ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారు. పైగా వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పటి వరకూ రెండు సార్లు సీబీఐ ఎదుట విచారణకుహాజరయ్యారు.  అలాగే  సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి  పీఏ నవీన్ ను కూడా మరోసారి విచారణకు పిలిచేందుకు సీబీఐ రంగం సిద్ధం చేసింది. అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రిని కూడా సీబీఐ కడపలోనే విచారించనుంది.   వీటన్నిటికీ మించి ఈ కేసులో నిందితుడు సునీల్ యావద్ బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలను గమనిస్తే.. ఆయనను అరెస్టు చేయడమే తరువాయి అన్నట్లుగా కనిపిస్తోందని పరిశీలకులువిశ్లేషిస్తున్నారు. 

తెలుగుదేశం నాయకుడు వరుపుల రాజా కన్నుమూత

తెలుగుదేశం నాయకుడు వరుపుల రాజా గుండెపోటుతో కన్నుమూశారు. ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన వరుపుల రాజా శనివారం (మార్చి 4) రాత్రి ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో ఆయనను వెంటనే కుటుంబ సభ్యులు కాకినాడలోని సూర్య గ్లోబల్ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో కన్నుమూశారు. ఆయన వయసు 47 సంవత్సరాలు. ప్రస్తుతం బొబ్బిలి, సాలూరు నియోజకవర్గాల తెలుగుదేవం ఇన్ చార్జ్ గా ఉన్న వరుపుల రాజా గత కొన్ని రోజులుగా  ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ఆయన శనివారం మార్చి 3) సాయంత్రమే స్వగ్రామమైన ప్రత్తిపాడుకు చేరుకున్నారు.  తన నివాసంలో పార్టీ నేతలతో రాత్రి వరకూ మాట్లాడుతూనే ఉన్నారు. ఆ తరువాత ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు.   ప్రత్తిపాడు మండల అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వరుపుల రాజా ప్రారంభించిన రాజా.. డీసీసీబీ చైర్మన్‌గా, ఆప్కాబ్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. గత ఎన్నికలలో  ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి  ఓటమి పాలయ్యారు. వరుపుల రాజా మృతితో టీడీపీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజా మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆత్మీయ స్నేహితుడైన రాజా ఆకస్మిక మృతి తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యానికి సంజీవని లాంటి తీర్పు!

పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా మన ప్రజాస్వామ్యం వర్దిల్లుతోందన్న విమర్శలు విపక్షాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఏకంగా విదేశీ గడ్డ మీద నుంచే భారత్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని విమర్శించారు. మోడీ హయాంలో రాజ్యాంగ వ్యవస్థలు కేంద్రం చెప్పుచేతల్లో కీలుబొమ్మలుగా మారిపోయాయన్నారు. పెగాసన్ స్పై వేర్ తో తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు. ఒక్క రాహుల్ గాంధీయే అని కాదు... బీజేపీయేతర పార్టీలన్నీ దాదాపుగా ఇవే ఆరోపణలు చేస్తున్నాయి. కేంద్ర ద్యర్యాప్తు సంస్థల తీరు కూడా వారి ఆరోణలకు అనుగుణంగానే ఉన్నాయి. ఇక ప్రజాస్వామ్య వవస్థకు మూల స్తంభం లాంటి కేంద్ర ఎన్నికల సంఘంపై కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉండే వారినే ఈ రాజ్యంగ బద్ధ సంస్థకు కమిషనర్లుగా నియమించి ఎన్నికలలో లబ్ధి పొందేలా వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం విషయంలో ఒక పద్ధతి ప్రకారం జరగాలని విస్పష్టంగా చెప్పడం కచ్చితంగా ఒక శుభ పరిణామంగానే చెప్పుకోవాలి.  సుప్రీం చెప్పిన విధంగా అత్యున్నత స్థాయి త్రిసభ్య కమిటీ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, కమిషనర్లను నియమిస్తే.. ఇక ఆ రాజ్యాంగ సంస్థపై  ఆరోపణలు వచ్చేందుకు ఆస్కారం ఉండదు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలను సందేహించే పరిస్థితి ఉండదు. ప్రధాని, విపక్ష నేత, సుప్రీం ప్రధాన న్యాయమూర్తితో కూడిన త్రిసభ్య ప్యానల్ కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల పేర్లను సిఫారసు చేస్తుందనీ, అలా ఆ ప్యానల్ సిఫారసు చేసిన వారినే నియమించాలని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది. ఇప్పటి వరకూ కేంద్ర కేబినెట్ సిఫారసల మేరకే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, కమిషనర్ల నియామకాలు జరుగుతూ వస్తున్నాయి. ఇక ఈ పద్ధతికి సుప్రీం తీర్పుతో చెక్ పడినట్లే.  కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకానికి సంబంధించి స్పష్టమైన మార్గ దర్శకాలతో కొత్త చట్టం తీసుకు వచ్చే వరకూ ముగ్గురు సభ్యుల ప్యానల్ ద్వారానే ఈ నియమకాలు జరగాలని కూడా కేంద్రం ఆదేశించింది.  ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకంలో ప్రధానితో పాటు విపక్ష నేతకు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికీ కూడా భాగస్వామ్యం కల్పించడం వల్ల కేంద్ర ఎన్నికల సంఘం స్వేచ్ఛగా, స్వతంత్రంగా వ్యవహరించడానికి అవకాశం కలుగుతుందనడంలో సందేహానికి తావుండదు.  2024లో లోక్‌సభకు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌పై ఆరోపణలు, విమర్శలు  వెల్లువెత్తుతున్న తరుణంలో  ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన నియామకాలకు సరైన చట్టమంటూ ఉండాలని రాజకీయ పార్టీలు పట్టుబట్టకుండా ఉండడంపై  కూడా సుప్రీంకోర్టు   విమర్శించింది. అడుగులకు మడుగులెత్తే ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకుని చిరకాలం, కలకాలం పదవుల్లో, అధికారంలో కొనసాగాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి  అని కూడా సుప్రీం ధర్యాసనం పేర్కొంది.  దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం తప్పనిసరిగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలను శిరసావహించాల్సి ఉంటుంది. రాజ్యాంగ సూత్రాలకు తగ్గట్టుగా ఎన్నికల కమిషన్‌ స్వేచ్ఛగా, స్వతంత్రంగా, పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్నట్లుగా  ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం మారకపోతే   ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల దేశ ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుందనడంలో సందేహం లేదు. . ఎన్నికల కమిషన్‌ ఎంత స్వేచ్ఛగా ఉంటే, ఎంత స్వతంత్రంగా వ్యవహరిస్తే అంత ఉన్నతంగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.   

‘వసంత’రాగంలో అమరావతి పాట.. సైకిలెక్కేయడానికేనా?

విశాఖ పరిపాలన రాజధానిగా చేసుకొని.. త్వరలోనే  ఇక్కడి నుంచే పాలన  ప్రారంభిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్  శుక్రవారం (మార్చి 3)  విశాఖపట్నం వేదికగా ప్రారంభమైన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు సాక్షిగా ప్రకటించారు.  అయితే  ఉమ్మడి కృష్ణాజిల్లా  మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాత్రం మూడు రాజధానులనేది వైసీపీ విధానమైతే కావచ్చు కానీ తాను మాత్రం  ఏకైక రాజధాని అమరావతికే మద్దతిస్తానని విస్ఫష్టంగా చెప్పేశారు. అదీ విశాఖ పరిపాలనా రాజధాని అని జగన్ ప్రకటించడానికి సరిగ్గా ఒకే ఒక్క రోజు ముందు అంటే గురువారం (మార్చి 2)న వసంత కృష్ణ ప్రసాద్ ఈ విషయం చెప్పారు. ఆయనేం జగన్ విశాఖ పరిపాలనా రాజధాని అని ప్రకటిస్తారని తెలియక  చెప్పిన మాట కాద. విశాఖ రాజధానిగా తాను త్వరలో పాలన ప్రారంభిస్తానని జగన్ గతంలో కూడా విస్పష్టంగా ప్రకటించారు. మూడు రాజధానులే తమ విధానమని గత మూడున్నరేళ్లుగా చెబుతూనే ఉన్నారు. అయినా వైసీపీ ఎమ్మెల్యే నిన్నగాక మొన్న తన మద్దతు అమరావతికేనని విస్పష్టంగా చెప్పారు. అది కూడా జగన్ మానస పుత్రిక లాంటి గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన గురువారం ( మార్చి 3)   కవులూరులో  పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన్ని గ్రామస్థులు అడ్డుకొని.. రాజధానిపై మీరు ఇలా సైలెంట్‌గా ఉంటే ఎలా? రాజధాని అమరావతిపై మీ అభిప్రాయం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధానిపై గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో భూముల రేట్లు పడిపోయాయని వారు ఎమ్మెల్యే ఎదుటే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల ఆందోళనతో ఆయన ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయి.. అమరావతికే నా ఓటు అంటు క్లియర్ కట్‌గా వారికి స్పష్టం చేసినట్లు సమాచారం. వసంత ఇలా అమరావతికి మద్దతుగా మాట్లాడటంతో ఆయన తెలుగుదేశం గూటికి చేరే యోచనలో ఉన్నారన్న ప్రచారం ఒక్క సారిగా జోరందుకుంది. ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా వసంత కృష్ణ ప్రసాద్ ఇలా అమరావతికే నా మద్దతు అంటే చెప్పారో లేదో.. అలా పార్టీలో వసంత కృష్ణ ప్రసాద్ ప్రత్యర్థి వర్గం, అంటే  మంత్రి జోగి రమేష్ వర్గం వెంటనే రంగంలోకి దిగి విమర్శలు గుప్పించింది. సామాజిక మాధ్యమం వేదికగా ఈ విమర్శల పర్వం కొనసాగుతోంది. వీరికి దీటుగా వసంత వర్గం కూడా సామాజిక మాధ్యమంలో రిటార్డులు సంధిస్తోంది. ఒక విధంగా ఇరువురి వర్గాల మధ్యా సోషల్ మీడియా వేదికగా యుద్ధం జరుగుతోంది.   కాగా వసంత వైసీపీతో బంధం తెంచుకుంటారన్న ప్రచారం జోరందుకోవడానికి ఆయన తండ్రి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు వైసీపీపై ఇటీవల బహిరంగంగానే విమర్శలు గుప్పించడం, విజయవాడ ఎంపీ, తెలుగుదేశం నాయకుడు కేశినేని నానితో భేటీ కావడం కూడా కారణమేనని చెబుతున్నారు. ఇక వసంత కృష్ణ ప్రసాద్ కూడా పార్టీ లైన్ కు భిన్నంగా ఉయ్యూరు శ్రీనివాస్ కు మద్దతుగా మాట్లాడడాన్ని కూడా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అదెప్పుడంటే.. కొద్ది రోజుల కిందట  ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గుంటూరులో చంద్రన్న కానుక కార్యక్రమంలో   జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మరణించారు..  దీంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశంపై వైపీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్  ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్ తనకు చాలా కాలంగా తెలుసునని.. మంచి వ్యక్తి అని.. తనకు స్నేహితుడు అంటూ మీడియా ముందుకు వచ్చి  చెప్పడమే కాదు.. ఇలా జన్మభూమికి ఎంతో కొంత సేవ చేస్తూన్న ఇలాంటి ఎన్నారైలపై కేసులు పెడితే.. భవిష్యత్తులో మరే ఎన్నారై జన్మభూమికి సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు రారని అన్నారు. ఇది కూడా ఆయన వైసీపీ లైన్ కు భిన్నంగా వెళుతున్నారనడానికి తార్కానంగా పరిశీలకులు చెబుతున్నారు. ఇక ఇటీవలి కాలంలో వసంత కృష్ణ ప్రసాద్, పెడన ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్ ల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వసంత కృష్ణ ప్రసాద్ సైకిల్ ఎక్కేస్తారన్న ప్రచారం జోరందుకుంది. అయితే వీరిద్దరి పంచాయతీ జగన్ వరకూ వెళ్లింది. దీంతో జగన్ వీరిద్దరినీ కూర్చో బెట్టి సమన్వయం కుదిర్చారు. మైలవరం టికెట్ వసంతకృష్ణ ప్రసాద్ కే అని స్పష్టం చేయడమే కాకుండా.. నియోజకవర్గాలలో జోక్యం వద్దని జోగి రమేష్ కు విస్పష్టంగా చేప్పారని అప్పట్లో పార్టీ శ్రేణులే చెప్పాయి. దీంతో ఇరువురి మధ్యా సమన్వయం కుదిరిందని అంతా అనుకుంటున్న సమయంలోనే రాజధాని విషయంలో వసంత కృష్ణ ప్రసాద్ ఇచ్చిన క్లారిటీ మళ్లీ ఆయన పార్టీ మార్పు చర్చను తెరమీదకు తెచ్చింది.  ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎపిసోడ్ ను ప్రస్తావనకు తీసుకు వస్తున్నారు. ఆయన కూడా అమరావతి రైతుల న్యాయస్థానం టు దేవస్థానం పాదయాద్ర నెల్లూరులో ప్రవేశించిన సందర్భంగా వారిని కలిసి యోగక్షేమాలు తెలుసుకున్న తరువాతే జగన్ తో గ్యాప్ పెరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ అమరావతికి మద్దతుగా మాట్లాడటంతో ఆయనకు ఇక పార్టీలో కొనసాగే అవకాశాలు మృగ్యమైనట్లేనని అంటున్నారు.  

పేరులో నేముంది.. మారిస్తే ఒరిగేదేముంది?

మోడీ సర్కార్ కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన ఈ ఎనిమిదేళ్ల కాలంలో దేశంలో నగరాలు పట్టణాలు, వీధులు, ప్రాంతాల పేర్లు మార్చడానికి ప్రయత్నాలు ఎక్కవ అయ్యాయి. అయితే ఈ పేర్ల మార్పు ప్రక్రియపై దేశ సర్వోన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది.  గతంలో భారత్ పై దాడులు చేసి, దేశాన్ని దోచుకోవడం ఆలయాలను ధ్వంసం చేయడం వంటి దారుణా లకు పాల్పడిన రాజుల పేర్లు ఇప్పటికీ ఢిల్లీతో సహా అనేక ప్రదేశాలలోని రోడ్లకు, వీధులకు కొనసాగడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన ఒక ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై సుప్రీంకోర్టు స్పందించింది. దాడులకు పాల్పడినవారు పెట్టిన పేర్లను మార్చాలని కోరిన ఈ వ్యాజ్యాన్ని సుప్రీం కొట్టివేసింది. భారతదేశం  ఈ ఆధునిక యుగంలో కూడా గత కాలపు సేతు బంధనాలను తవ్వుకోవడానికే పరిమితం అవ్వడం సరి కాదని ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.  దేశంలోని అనేక రోడ్లు, వీధులు, ప్రదేశాలు, పట్ట ణాలు, నగరాలకు ఇప్పటికీ ఒకప్పటి    పేర్లే కొనసాగడం ఏమిటని ప్రశ్నిస్తూ,  పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ వంటి   దేశాలలో హిందూ మతానికి చెందిన వ్యక్తుల పేర్లను తొలగించిన విషయాన్ని తన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంలో పిటిషనర్ ప్రస్తావించారు. అయితే ఈ పిటిషన్ ఏ విధంగా చూసినా ప్రజాప్రయోజన వ్యాజ్యం కిందకి రాదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. సమాజంలో విద్వేషాలు పెచ్చరిల్లడానికి కొందరు చేస్తున్న ప్రయత్నాలకు వంత పాడేలా ఈ పిటిషన్ ఉందని వ్యాఖ్యానించింది. దేశంలో మత విద్వేషాలు పెచ్చరిల్లాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నిస్తూ పిటిషనర్ ను మందలించింది. ఇటువంటి పిటిషన్లు వేయడం భావ్యం కాదని విస్పష్టంగా పేర్కొంది.  అనివార్యం అనుకుంటే తప్ప పేర్ల మార్పు ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఈ రీతిలో పేర్ల మార్పు అన్నది స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాలు కలుగుతాయేమో తప్ప దీర్ఘ కాలంలో ఇది సమాజంలో చీలికలకు, అశాంతికి దారి తీస్తుందని  అభిప్రాయపడింది.  భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో మతోన్మాదానికి స్థానం లేదని అ  ప్రజలంతా సౌభ్రాతృత్వంతో మెలగాలని రాజ్యాంగ ఉపోద్ఘాతంలోనే ఉందని కోర్టు స్పష్టం చేసింది.  

బాలినేనికి గుప్తా దెబ్బ.. మామూలుగా లేదుగా?!

నిజం నిష్టూరంగానే ఉంటుంది. అందుకే యాదార్థవాది లోక విరోధి అన్నారు పెద్దలు. వైసీపీలో అసమ్మతి నేత సుబ్బారావు గుప్తా విషయంలో దాదాపుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నది పరిశీలకుల విశ్లేషణ.  తాజాగా గుప్తాను రెండు రోజుల కిందట ఒంగోలులో పోలీసులు అరెస్ట్ చేశారు. తమ సోదాల్లో ఆయన వద్ద గంజాయి దొరికిందని అందుకే అరెస్ట్ చేశామని చెబుతున్నారు. అయితే దీనితో తనకేం సంబంధం లేదని సుబ్బారావు గుప్తా చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాపు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు   ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు.   మరోవైపు ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడు సుబానీ అండ్ గ్యాంగ్..  ఇటీవల ఒక మహిళా హాస్టల్‌పై చేసిన దాడిపై  సుబ్బారావు గుప్తా సీరియస్‌గా స్పందించడమే కాకుండా.... బాలినేని తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.  సుబ్బారావు గుప్తా ఇలా స్పందించిన రెండంటే రెండు రోజులకే   ఆయనను  అరెస్ట్ చేయడం  తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరో వైపు  బాలినేని శ్రీనివాసరెడ్డితోపాటు ఆయన కుమారుడు  ప్రణీత్‌ రెడ్డీపై   సుబ్బారావు గుప్తా చేస్తున్న విమర్శలు కూడా ఈ అరెస్టుకు ఒక కారణమా అన్న అనుమానం ఒంగోలు వాసులు వ్యక్తం చేస్తున్నారు.  పోలీసుల సమక్షంలోనే తన తడాఖా ఏమిటో... అబ్బా కొడుకులకు టన్నులు టన్నుల కొద్ది చూపిస్తానంటూ సుబ్బారావు గుప్తా చేసిన వ్యాఖ్యల  వీడియో సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది. ఇక  2021, డిసెంబర్‌లో నాటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు  ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్బంగా స్థానిక ఫ్యాన్ పార్టీ నాయకుడు సుబ్బారావు గుప్తా మాట్లాడుతూ.. ప్రస్తుతం అధికారంలో ఉన్న మన పార్టీ చర్యల వల్ల ఇతర పార్టీల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని... భవిష్యత్తలో మరో పార్టీ అధికారంలోకి వస్తే.. మన పార్టీ శ్రేణులు పరిస్థితి ఏమిటనేది ఓ సారి ఆలోచించాలంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.  అయితే ఈ వ్యాఖ్యలపై స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితోపాటు పార్టీలోని ఇతర నేతలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. దీంతో  సుబ్బారావు గుప్తా  ప్రాణ భయంతో గుంటూరులోని ఓ లాడ్జిలో దాక్కుంటే.. బాలినేని ప్రధాన అనుచరుడు సుభానీ తన గ్యాంగ్‌తో కలసి..  లాడ్జిలో దాక్కొన్న గుప్తా పట్టుకొని బండ బూతులు తిడుతూ.. తీవ్రంగా దాడి చేసి.. మోకాళ్లపై కూర్చొబెట్టి...  వాసన్నకు  సారీ చెప్పించారు. ఇందుకు సంబంధించిన  వీడియో  నాడు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేసింది. ఆ  తర్వాత బాలినేని శాంతించి.. సుబ్బారావు గుప్తాను తన ఇంటికి పిలిపించుకొని.. అతడికి కేకును మంత్రిగారే స్వయంగా  తినిపించినా.. అప్పటికే బాలినేనికి వ్యక్తిగతంగా ఎంత నష్టం జరగాలో అంతా నష్టం జరిగిపోయిందని ప్రచారం సైతం సాగింది. ఆ తర్వాత సుబ్బారావు గుప్తాపై దాడిని పలు ప్రజా సంఘాలు బహిరంగంగా ప్రశ్నించడంతో.. చేసేది లేక.. సుభానీపై పోలీసులు కేసు నమోదు చేసి.. ఆ వెంటనే స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. ఇక సుబ్బారావు గుప్తా.. వివిధ పార్టీల నాయకులనే కాదు... పలు సంఘాల నేతలను సైతం స్వయంగా కలిసి.. తనపై జరిగిన దాడిని వివరించారు. అంతేకాదు తనపై దాడికి నిరసనగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద   ఆందోళనకు కూడా దిగారు. మరోవైపు కేంద్ర హోం శాఖ మంత్రిని కలిసి ఫిర్యాదు  చేస్తానని అప్పట్లోనే  ప్రకటించారు. మరో వైపు ప్రెస్‌మీ‌ట్ పెట్టి... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగుతానని ప్రకటించమే కాదు.. ప్రెస్ మీట్ పెట్టి బండబూతులు తిట్టకుండా.. మా ఎమ్మెల్యే బాలినేని లాగా చాలా సాప్ట్‌గా కనిపిస్తూ.. చేయాల్సిన వ్యవహారమంతా కామ్‌గా చేసుకుపోవాలంటూ అప్పటి మంత్రి కొడాలి నానికి హిత బోధ చేయడమే కాకుండా, ఈ విషయంలో  మా ఎమ్మెల్యే వాసన్న వద్ద ట్రైనింగ్ తీసుకోవాలంటూ కొడాలి నానికి ఉచిత సలహా కూడా ఇచ్చేశారు.   అయితే సుబ్బారావు గుప్తాపై బాలినేని ప్రధాన అనుచరుడు సుభానీ దాడి చేసిన వీడియో కారణంగా.. బాలినేనిపై  ప్రజల్లో  ఓ విధమైన వ్యతిరేకత వచ్చిందనే ఓ ప్రచారం అయితే అప్పట్లో  చాలా గట్టిగానే జరింగింది. ఆ కారణంగానే పా  బాలినేనికి అప్పటి కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి ఊడిందన్న ప్రచారం కూడా అప్పట్లో జోరుగా సాగింది.   మరోవైపు జగన్ ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని పలు సర్వేలు సైతం స్పష్టం చేస్తున్నాయని  సమాచారం. ఇక ఒంగోలులో సైతం బాలినేనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలుస్తోంది. ఇది ఇటీవల బాలినేని నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో స్పష్టంగా కనిపించిందని ఆయన వర్గమే స్పష్టం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బాలినేనికి వచ్చే ఎన్నికల్లో సుబ్బారావు గుప్తా ఎపిసోడ్ వల్ల చాలా గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉందనే ఓ ప్రచారం అయితే ఒంగోలు నియోజకవర్గంలో వాడి వేడిగా సాగుతోంది.

గ్లోబల్ సమ్మిట్ వేళ ఏపీ పరువు తీసిన తెలంగాణ మంత్రి హరీష్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి ఏమిటన్నది ఆయనకు పట్టదు. కానీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను తెలుసుకునేందుకు వచ్చిన వారు కచ్చితంగా రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం అంశం నుంచి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ రంగం పరిస్థితి, వ్యవసాయ రంగం ఎలా ఉంది, జనం సంతోషంగా ఉన్నారా, లేదా ప్రభుత్వ వ్యతిరేకతతో రగిలిపోతూ ఆందోళనల బాట పడుతున్నారా.. ఇలా ప్రతి విషయాన్నీ వారు పరిగణనలోనికి తీసుకుంటారు. అన్నీ బాగున్నాయని వారు భావిస్తేనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం వెలిగిపోతోందా? లేక మసకబారిపోయి.. ఇక్కడ ఉన్న పరిశ్రమలే పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయా? అలా తరలిపోతుంటే అందుకు కారణాలేమిటి వంటి విషయాలనూ పరిశీలిస్తారు. అన్నిటికీ మించి రాష్ట్రంపై పొరుగు రాష్ట్రాలలో ఉన్న అభిప్రపాయమేమిటి అన్న విషయాలను కూడా తాము ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలా వద్దా అన్న నిర్ణయానికి వచ్చేందుకు పరిగణనలోనికి తీసుకుంటారు. ఇప్పుడు ఒక్కొక్క అంశంలో రాష్ట్రంలో పరిస్థితులను గురించి మాట్లాడుకుంటే.. జగన్ హయాంలో ఈ  నాలుగేళ్ల కాలంలో ఏ రంగం కూడా అభివృద్ధి చెందలేదు. సంక్షేమ పథకాల పేరుతో ఎంపిక చేసిన లబ్ధిదారుల ఖాతాలలో జగన్ బటన్లు నొక్కి మరీ సొమ్ములుపందేరం చేసుకుంటున్నానని చెప్పుకుంటున్నా.. రాష్ట్రంలోని ఏ వర్గమూ సంతోషంగా ఉన్న దాఖలాలు కనిపించవు. ఒకప్పుడు దేశానికే తలమానికంగాఉన్న విద్యుత్ రంగం ఇప్పుడు కుదేలైపోయింది. విద్యుత్ కోతలతో పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. ఇక ప్రభుత్వోద్యోగులు జీతాలో రామచంద్రా అంటూ ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమౌతున్నారు. ప్రజలకు మా ప్రభుత్వం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది. ఇంత సొమ్ము పందేరం చేసింది అంటూ జనంలోకి వెళుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు  వారి నుంచి ఛీత్కారాలే ఎదురౌతున్నాయి. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బయటకు వెళ్లాలంటేనే అధికార పార్టీ ప్రజా ప్రతినిథులు భయపడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇక కాంట్రాక్టర్లు కొత్త పనులు చేపట్టడానికి ముందుకు రావడం లేదు. చేసిన పనులకు బిల్లుల కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అన్నిటికీ మించి ఇటీవలి కాలంలో పొరుగు రాష్ట్రం తెలంగాణ మంత్రులు తమ రాష్ట్ర అభివృద్ధిని చాటుకోవడానికి ఏపీలోని వెనుకబాటు తనాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితి, విద్యుత్ కోతల పరిస్థితి, ఆ రాష్ట్రంలో ఉండలేక తమ రాష్ట్రానికి తరలివస్తున్న పరిశ్రమల గురించి పదే పదే ప్రస్తావించి ఏపీ అన్ని రంగాలలోనే వెనుకబడి ఉందని చాటుతున్నారు.  తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి   కేటీఆర్ తమ రాష్ట్ర ప్రగతిని చాటుకోవడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి గతంలో క్రెడాయ్ సమావేశం వేదికగా ఏపీ దుస్థితిని కళ్లకు కట్టారు. ఆంధ్రప్రదేశ్ పరువును గంగలో కలిపేశారు.   క్రెడాయ్ స‌మావేశంలో ఏపీ బండారం బ‌ట్ట‌బ‌య‌లు చేయ‌డంతో.. ఇక‌పై రాష్ట్రానికి పెట్టుబ‌డులు వ‌స్తాయో రావో అనే ఆందోళ‌న. జ‌గ‌న్ పాల‌న‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ దుస్థితిని, దౌర్భాగ్యాన్ని క‌ళ్ల‌కు క‌ట్టేలా వివ‌రించారు. ఏపీలో విప‌రీత క‌రెంట్ కోత‌లు, ఊరూరా గుంత‌ల మ‌య‌మైన రోడ్లు, తాగు-సాగు నీటి క‌ష్టాలను ప్ర‌పంచానికి తెలిసేలా..  జ‌గ‌న్‌కు తెలిసొచ్చేలా( తెలిసొచ్చినా ఏపీ సీఎంగా వాటిని పట్టించుకోరనుకోండి) కీల‌క‌మైన క్రెడాయ్ వేదిక‌గా గొంతెత్తి చాటారు కేటీఆర్‌.  అక్కడితో ఊరుకోకుండా తెలంగాణ గొప్పతనం ఏమిటో తెలుసుకోవాలంటే ఒక్కసారి ఏపీ వెళ్లి చూ డండి మీకే తెలుస్తుందని ముక్తాయించారు.  ఆ తరువాత కూడా పలువురు తెలంగాణ మంత్రులు ఏపీ విషయంలో అక్కడి అభివృద్ధి లేమి విషయంలో చులకనగా వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఏపీలో గ్లోబల్ఇన్వెస్టర్ల సదస్సు జరుగుతున్న తరుణంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఏపీలో వ్యవసాయ రంగం ఎంతగా కుదేలైందో ఉదాహరణతో చెప్పి ఏపీ పరువును మూసీ నదిలో కలిపేశారు. ఆయనేమన్నారంటే.. ఏపీని అన్నపూర్ణగా అంటారు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్రవాదులు రాష్ట్రం విడిపోతే తెలంగాణ ఏడారి అయిపోతుందంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లయ్యింది. ఇప్పుడు తెలంగాణలో వ్యవసాయ రంగం ఎలా పురోగమించిందో తెలియాలంటే ఏపీలో ఆ రంగం దుస్థితిని గురించి తెలుసుకుంటే సరిపోతుందన్నారు. ఈ యాసంగిలో తెలంగాణలో 56లక్షల ఎకరాలలో వరి సాగుచేస్తుంటే.. ఏపీలో కేవలం 16లక్షల ఎకరాలలో వరి సాగు అవుతోందన్నారు. విద్యుత్, జలవనరుల విషయంలో ఏపీ అధ్వాన్న స్థితికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలన్నారు. ఏ రంగాలలో అయితే రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ అట్టడుగున ఉందో.. ఆ రెండు రంగాలలో తెలంగాణ ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని హరీష్ రావు చెప్పారు.  

ఇన్వెస్టర్ల సమ్మిట్ జగన్మాయేనా?.. విద్యుత్ రంగంలో లక్షల కోట్ల పెట్టుబడులు అంటే నమ్మేదెలా?

పేక మేడలు కట్టేసి వాటినే అద్భుత కట్టడాలుగా నమ్మమంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. తాను సర్వ నాశనం చేసిన విద్యుత్ రంగంలోనే భారీ పెట్టుబడులు వచ్చాయని చెబుతూ.. ఇక రాష్ట్రం వెలుగుల మయం అయిపోతుందంటున్నారు. ఔను జగన్  రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని తన అవినీతి సామ్రాజ్య విస్తరణకు ఒక పావుగా మార్చుకున్నారు.  జగన్ విద్యుత్  ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయల కాంట్రాక్టులను అస్మదీయులు, బినామీలకు కట్టపెట్టారు. ఇందు కోసం విద్యుత్ వినియోగదారులను నిలువుదోపిడీ చేయడానికి కూడా వెనుకాడలేదు. సర్దుబాటు పేరుతో విద్యుత్ వినియోగ దారుల మీద మూయలేని భారాన్ని మోపుతున్నారు.  2021-22 వార్షిక సంవవత్సరంలో డిస్కంలు కొనుగోలు చేసిన విద్యుత్ కొనుగోళ్ల సర్దుబాటును 2023-24 లో వసూలు చేసుకునేందుకు ఏపీ ఈఆర్సీ డిస్కంలకు అనుమతి ఇవ్వడం ఇందుకు తార్కానం.  రూ.3,082 కోట్ల సర్ధుబాటు ఛార్జీలతో కలిపి మరో రూ.456 కోట్ల సరఫరా నష్టాలను కూడా వినియోగదారుల నుంచి వసూలు చేయాలు చేయ డానికి రెడీ అయిపోయింది జగన్ సర్కార్. అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో ఇప్పటికే 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన సర్కార్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అప్పులు తెచ్చి మరీ అవసరం లేకుండా   హిందుజాకు చెల్లించేందుకు వినియోగదారులపై రూ.49,106 కోట్ల భారం మోపారు. అంతే కాకుండా తన బినామి కంపెనీ అయిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కు రూ.2,629 కోట్లు విలువైన బిల్లులు చెల్లించారు. దీంతో జగన్ రెడ్డి నాలుగేళ్లలో ప్రజలపై మోపిన మొత్తం భారం అక్షరాలా  55,273 కోట్ల రూపాయలు.  జగన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యుత్ డిస్కంలు తిరిగి లేవలేని అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. 2019 లో అధికారంలోకి వచ్చే నాటికి   18,022 కోట్ల రూపాయలుగా ఉన్న డిస్కంల అప్పు.   2022 డిసెంబర్ నాటికి   .50,004 కోట్ల రూపాయలకు చేరుకుంది.   అంటే, జగన్  మూడున్నరేళ్లలో డిస్కంల పేరుతో   31,981 కోట్ల రూపాయలు అప్పు చేశారు.   ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సిన సబ్సిడీ బకాయిలు రూ.31,277 కోట్లు. 2019-22 మధ్య కాలంలో బహిరంగ మార్కెట్ లో  రూ. 12,200 కోట్ల విలువైన విద్యుత్ కొనుగోలు చేశారు. కొనుగోళ్లలో కమిషన్ల కోసం రూ.60 వేలు ఖరీదు ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను రూ.1.30 వేలు పెట్టి షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ నుంచి కొన్నారు. మూడున్నరేళ్లలో కేవలం షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కు రూ.2,629 కోట్లు రూపాయల బిల్లులు చెల్లించారు.  వాస్తవ పరిస్థితి ఇదైతే.. విశాఖ లో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ లో రాష్ట్ర విత్త మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అవాస్తవాలు వినిపించి జనాలను నమ్మించే విఫల యత్నం చేశారు. వాస్తవానికి గ్లోబల్ సమ్మిట్ లో తొలి రోజు జగన్ సర్కార్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పలు ఎంవోయూలు కుదుర్చుకుంది. ఆ ఒప్పందాల డొల్ల తనం గురించి తరువాత చెప్పుకుందా.. మొదలు  అసలు  గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి ఇసుమంతైనా లేదనడానికి, చంద్రబాబునాయుడి హయాంలో  ఐదేళ్లలో 14,655 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను నెలకొల్పి ఇతర రాష్ట్రాలకు అమ్మే స్థాయి రాష్ట్ర విద్యుత్ రంగం ఎదిగింది. ఆ 14, 655 మెగావాట్ల విద్యుత్ లో 7 వేల మెగావాట్ల సోలార్, విండ్ విద్యుత్ ప్లాంట్లే. అదే జగన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లను నిర్వీర్యం చేశారు. పరిశ్రమలకు పవర్ హాలిడేలు ప్రకటించారు. సోలార్, విండ్ పీపీఏలను రద్దు చేశాడు.  వారు సరఫరా చేసిన విద్యుత్ కు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలు కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చింది. చంద్రబాబు హయాంలో రెన్యువబుల్ ఎనర్జీలో రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉంటే  నేడు అట్టడుగు స్థానానికి పడిపోయింది.  జగన్ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్క యూనిట్ అదనపు విద్యుత్ ఉత్పత్తి జరిగిన దాఖలాలు లేవు. బాబు హయాంలో మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా ఉన్న ఏపీ జగన్ నాలుగేళ్ల పాలనలో విద్యుత్ కోతల రాష్ట్రంగా మారిపోయింది.  ఇప్పుడు తగుదునమ్మా అని విశాఖ గ్లోబల్ సమ్మిట్ లో విద్యుత్ రంగంలో 8.35 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని ప్రకటిస్తున్నారు.  అంటే లక్షా 50 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందాలు కుదుర్చుకున్నామని జగన్ సర్కార్ ప్రకటిస్తోంది. వాస్తవానికి రాష్ట్రంలో పీక్ డిమాండ్ అందులో సగానికి సగం కూడా ఉండదు. మరి డిమాండ్ లేని రంగంలో ఇన్వెస్టర్లు భారీగా ఒప్పందాలు ఎందుకు కుదుర్చుకున్నారంటే జగన్మాయ అనే చెప్పాలి. భారీగా ఒప్పందాలు కుదుర్చుకున్నామని ప్రకటనలు గుప్పించుకోవడానికే తప్ప ఈ ఒప్పందాలలో ఏవి గ్రౌండ్ అవుతాయంటే ఎవరూ నోరు మెదపరు. రైతు భరోసా అంటూ తెనాలిలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కుడు లాంటివే ఈ ఒప్పందాలు కూడా అనుకోవాలి. ఇక ఇన్వెస్టర్ల సదస్సుకు వచ్చిన డిలిగేడ్స్ ఇన్ని వేల మంది అన్ని వేల మంది అంటూ చేసుకున్న ప్రచారంలోని డొల్లతనం ఏమిటో ఐ ప్యాక్ సాక్షిగా నిన్ననే బయటపడింది. 

ప్రముఖ రచయిత్రి కే.రామలక్ష్మి ఇక లేరు

ప్రముఖ రచయిత్రి, కె.రామలక్ష్మి కన్నుమూశారు. సుప్రసిద్ధ కవి అరుద్ర సతీమణి కే.రామలక్ష్మి గత కొంత కాలంగా అస్వస్థతతో తీసుకుంటున్నారు.ఆమె శుక్రవారం (మార్చి 3)న  తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 93 ఏళ్లు.  ప్రముఖ కవి ఆరుద్ర సతీమణి.. కూచి రామలక్ష్మి (93) ఇకలేరు. వయోభారం, అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమె.. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మలక్‌పేటలోని తన పెద్ద కుమార్తె కవిత ఇంట్లో తుదిశ్వాస విడిచారు. కే.రామలక్ష్మి స్వస్థలం కాకినాడ సమీపంలోని కోటనందూరు. ఆమె కొంత కాలం పాత్రికేయురాలిగా కూడా పని చేశారు. కే.రామలక్ష్మి పలు కథలు, నవలలు, విమర్శనా వ్యాసాలు, సినిమా సమీక్షలు రాశారు. అంతే కాకుండా ఆమె పలు సినిమాలకు కథ, మాటలు అందించారు.  జీవన జ్యోతి ,  చిన్నారి పాపలు, గోరింటాకు వంటి సినిమాలకు కథ, మాటలు అందించారు.   

నిర్వాహణా లోపంతో ఏపీ గ్లోబల్ సమ్మిట్ అభాసుపాలు

జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠత్మకంగా విశాఖలో  నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ లోపం కారణంగా అభాసుపాలైంది. గత రెండు రోజులుగా గ్లోబల్ సమ్మిట్ లో రుచికరమైన భోజనం, అద్భుతమైన మెనూ అంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకుంది. తీరా మొదటి రోజే కనీసం సగం మంది  కూడా భోజనాలు  చేయకుండానే మెనూ ఖాళీ అయిపోయింది. దీంతో డిలిగేట్స్ నిర్వాహకులతో గొడవ పడ్డారు. అలాగే సమ్మిట్ కిట్ల పంపిణీ కూడా గందరగోళంగా తయారైంది. అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. కిట్ల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన స్టాల్ ధ్వంసమైపోయింది. అసలు గ్లోబల్ సమ్మిట్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిలో ఎవరు ఇన్వెస్టర్లు, ఎవరు కాదు అన్న విషయమే తెలియని పరిస్థితి నెలకొంది.  దాదాపు 15 నుంచి 16 వేల మందికి వరకూ గ్లోబల్ సమ్మిట్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే వారిలో అత్యధికులుఇన్వెస్టర్లు కాదని అంటున్నారు. సరదాగా చూడటానికో ఉచిత రిజిస్ట్రేషనే కదా చేయించుకుని వెళితే ఏం పోయింది అనుకుని వచ్చిన వారే అధికం. ఇక ప్రభుత్వం కూడా సమ్మిట్ కు పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు వచ్చారని చాటుకునేందుకు ఎవరు వస్తే వారిని అనుమతించేసింది.  ఆ విషయం పక్కన పెడితే.. భోజన విరామం సమయంలో ముందుగా విదేశీ ఇన్వెస్టర్లను అనుమతించి, ఆ తరువాతే మిగిలిన వారికి అని ప్రకటించడంతో సమ్మిట్ కు వచ్చిన వారు చాలా సేపు భోజనాల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. తీరా విదేశీ ఇన్వెస్టర్ల తరువాత మిగిలిన వారిని అనుమతించేసరికి అక్కడా తొక్కిసలాట చోటు చేసుకుంది. సగం మందికి సర్వ్ చేసే సరికే భోజనాలు అయిపోయాయి. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఘర్షణ జరిగే పరిస్థితి ఏర్పడింది. సమ్మిట్ కు వచ్చిన వారు నిర్వాహకులతో గొడవ పడ్డారు. ఆగ్రహంతో బయటకు వెళ్లిపోవడం కూడా కనిపించింది. అదే పరిస్థితి సమ్మిట్ కిట్ల పంపిణీ వద్ద కూడా చోటు చేసుకుంది. టెంట్ లో ఏర్పాటు చేసిన కిట్ల పంపిణీ కౌంటర్ ధ్వంసమైపోయింది. మొత్తం మీద ఏపీ గ్లోబల్ సమ్మిట్ తొలి రోజు పెట్టుబడులు ఏ మేరకు వచ్చాయన్నది పక్కన పెడితే.. భోజనాల దగ్గర, కిట్ల పంపిణీ వద్ద జరిగిన తొక్కిసలాట, తోపులాటతో అభాసుపాలైందని సదస్సుకు వచ్చిన వారే చెబుతున్నారు. 

మంత్రి గుడివాడ అమర్నాథ్ కు నాన్ బెయిలబుల్ వారంట్

రాష్ట్రపరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. గతంలో రైల్ రోకో లో పాల్గొన్న సందర్భంగా ఆయనపై నమోదైన ఒక కేసుకు సంబంధించి ఈ వారెంట్ జారీ అయ్యింది.   2018లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ డిమాండ్ తో చేపట్టిన రైల్ రోకో కార్యక్రమంలో అప్పటికి విపక్షంలో ఉన్న గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన అక్రమంగా రైల్వే స్టేషన్ లోకి ప్రవేశించి విశాఖ, పలాస ప్యాసంజర్ రైలును నిలిపివేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్బంగా ఆయనపై కేసు నమోదైంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఆయన గత నెల 27న కోర్టులో హాజరు కావాల్సి ఉండగా హాజరు కాలేదు. దీంతో రైల్వే న్యాయస్థానం గుడివాడ అమర్నాథ్ పై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది.  రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‎నాథ్ కు విశాఖ  రైల్వే న్యాయస్థానం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.  రైల్వే స్టేషన్‎లోకి అనధికారికంగా ప్రవేశించారని ఐదేళ్ల కిందట ఆయనపై నమోదైన కేసులో కోర్టు ఈ వారంట్ జారీ చేసింది.  2018లో ప్రత్యేక హోదా, రైల్వే జోన్ డిమాండ్ చేస్తూ స్టేషన్‎లోకి ప్రవేశించి విశాఖ-పలాస ప్యాసింజర్ రైలును నిలిపేసి రైల్‌రోకో నిర్వహించారు. దీంతో గుడివాడ అమర్ తో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదైంది. ఈ కేసులో గత నెల 27న న్యాయ స్థానంలో హాజరు  కావాల్సి ఉండగా హాజరు కాకపోవడంతో  నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది.

బచ్చుల అర్జునుడు పాడె మోసిన చంద్రబాబు

తెలుగుదేశం సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడి అంత్యక్రియలు పూర్తయ్యాయి. తీవ్ర గుండెపోటుకు గురై నెల రోజులుగావిజయవాడ డాక్టర్ రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బచ్చుల అర్జునుడు గురువారం ( మార్చి 2) సాయంత్రం కన్నుమూసిన సంగతి విదితమే. ఆయన మృతితో తెలుగుదేశం శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది. మంచి నాయకుడిని కోల్పోయామన్న బాధ తెలుగుదేశం వర్గాల్లో వ్యక్తమౌతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు, పలువురు సీనియర్ నాయకులు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా ఆయనను కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఆయన అంత్యక్రియలకు పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన బచ్చుల అర్జునుడు అంతిమ యాత్రలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన అర్జునుడి పాడె మోశారు. కాగా బచ్చుల అర్జునుడి అంత్యక్రియలు  అధికార లాంఛనాలతో నిర్వహించారు.

అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె డిల్లీలోని గంగారం ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. గురువారం ( మార్చి 2) నుంచి సోనియాగాంధీ జ్వరంలో బాధపడుతుండటంతో ఆమెను ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. ప్రస్తతం ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. ఇలా ఉండగా ఇటీవలి కాలంలో ఆమె తరచూ అస్వస్థతకు గురి కావడం పార్టీ శ్రేణులలో ఆందోళకు కారణమౌతోంది. కొద్ది కాలం కిందట ఆమె శ్వాస కోశ సంబంధిత ఇబ్బందితో ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందిన సంగతి విదితమే. అలాగే గతంలో కూడా ఆమె ఇదే ఆసుపత్రిలో ఉదర సంబంధ ఇబ్బందులతో చికిత్స చేయించుకున్నారు.  

రాజ్ భవన్, ప్రగతి భవన్ సయోధ్య మూన్నాళ్ల ముచ్చటేనా?

తెలంగాణలో ప్రభుత్వం, గవర్నర్ మధ్య సయోధ్య మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కోర్టు సూచనలతో అనివార్యంగా రాజ్ భవన్, ప్రగతి భవన్ ల మధ్య కుదిరిన సయోధ్య కొనసాగుతుందా అంటూ అప్పట్లోనే తెలుగువన్ ఇది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుందని విస్పష్టంగా చెప్పింది. ఇప్పుడు తెలంగాణ సర్కార్ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలని ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా కనిపంచిన సుహృద్భావం అక్కడితోనే మాయమైపోయిందని తేటతెల్లమైంది. అయితే ఒక్కటి మాత్రం నిజం అసలు గవర్నర్  శాసన సభకు వచ్చి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడం, నిజంగా... నిజమా, అనే అనుమానం అప్పట్లో అందరిలో కలిగింది.  నిజం  తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్  సాదరంగా ఆహ్వానించి అసెంబ్లీలోకి తోడ్కొని వెళ్లడం కూడా అప్పట్లో సంభ్రమాశ్చర్యాలను కలిగింది. అదే విధంగా  ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని గవర్నర్    అక్షరం పొల్లు పోకుండా ఉన్నది ఉన్నట్లు చదవడం కూడా విభేదాలన్నీ గతించిన గతమేనా అన్న భావన కూడా కలిగించింది. ఎందుకంటే అప్పటికి రెండున్నర సంవత్సరాలకు పైగా ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య జరుగుతన్న ప్రచ్ఛన్న పోరు, రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముందు చోటు చేసుకున్నపరిణామాలు, రాజ్యాంగ సంక్షోభం తప్పదా అనిపించేలా తలెత్తిన పరిస్థితులు గమనిస్తే..  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారని కానీ, ఆమెను ముఖ్యమంత్రి కేసీఆర్ సాదరంగా ఆహ్వానిస్తారని కానీ ఎవరూ కనీసం ఊహించలేదు.  నిజానికి   తెలంగాణ  హై కోర్టు జోక్యం చేసుకోవడం వలన కానీ  లేదంటే  నిజంగానే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడేదే అన్న అభిప్రాయం ఇప్పటికీ పరిశీలకులలో వ్యక్తమౌతోంది.  అయితే హైకోర్టు జోక్యంతో అనివార్యంగానైనా ముఖ్యమంత్రి కేసీఆర్,  గవర్నర్ తమిళి సై  చాలా చక్కగా వారి వారి పాత్రలను వారు పోషించారు. ‘సయోధ్య’ చిత్రాన్ని రక్తి కట్టించారు.   అఫ్కోర్స్ అప్పట్లో ముఖ్యమంత్రి బాడీ లాంగ్వేజ్ లో కొద్దిపాటి అవమాన ఛాయలు, గవర్నర్ అడుగుల్లో కొద్దిపాటి విజయ దరహాసం కనిపించాయనుకోండి అది వేరే విషయం.  అయినా  రెండు వ్యవస్థల మధ్య సయోధ్య అవసరాన్ని ఇద్దరూ ఎంతో కొంత గ్రహించినట్లే అప్పట్లో కనిపించారు.  అయితే, ఈ సయోధ్య ఇంత వరకేనా   ముందు ముందు కూడా కొనసాగుతుందా? అంటే, రాజకీయ విశ్లేషకులు అనుమానమే అంటున్నారు. కానీ  ఇక ముందు గతంలోలాగా తెగే వరకూ లాగే పరిస్థితి అయితే రాకపోవచ్చనీ, ఇరు వర్గాల నుంచి ఎంతో కొంత విజ్ఞత, వివేచనా, సంయమనం ఆశించ వచ్చననే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. కానీ ఆ అభిప్రాయం పూర్తిగా తప్పని తదననంతర పరిణామాలు రుజువు చేశాయి. పెండింగ్ లో ఉన్న ఐదారు బిల్లుల విషయంలో గవర్నర్ ఎలాంటి  నిర్ణయం ఇప్పటి వరకూ అయితే తీసుకోలేదు. వాటికి ఆమోదముద్ర వేయలేదు.  ప్రధానంగా  మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలలో అవిశ్వాసం తీర్మానం గడువును ప్రస్తుతమున్న మూడేళ్ళ నుంచి నాలుగేళ్ళకు పొడిగిస్తూ  గత అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన సవరణ బిల్లు విషయంలోనూ గవర్నర్ నిర్ణయం తీసుకోలేదు. అలాగని తిప్పి పంపనూ లేదు. పరిశీలనలో ఉంది (అండర్ కన్సిడరేషన్) అని మాత్రమే చెబుతూ ఉన్నారు.   ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సర్కార్ ఇక లాభం లేదన్న నిర్ణయానికి వచ్చేసి ఏకంగా బిల్లులపై గవర్నర్ సంతకాలు చేసేలా ఆదేశించాలని కోర్టును ఆశ్రయించింది.  ఆమోదం కోసం ప్రభుత్వం పంపించిన 10 బిల్లులను  గవర్నర్ పెండింగ్ లో పెట్టారని.. ఆమోదించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ.. తెలంగాణ ప్రభుత్వమే సుప్రీంకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేయటం సంచలనం సృష్టించింది.   ఆరు నెలలుగా 10 బిల్లులను ఆమోదించకుండా తొక్కిపెడుతున్నారని,  గవర్నర్ పరిధి ఏమిటి?  ఎందుకు బిల్లులు ఆమోదించటం లేదనే విషయాన్ని సుప్రీం కోర్టులోనే తేల్చుకోవాలని  నిర్ణయించుకున్న బీఆర్ఎస్ సర్కార్  బిల్లులను  గవర్నర్ ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో రాష్ట్రంలో ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గతంలో కనిపించిన సయోధ్య అంతా పైపై మెరుగేనని తేటతెల్లమైపోయింది. 

విడదల రజనీ కోసం..!

చిలకలూరిపేటకు చెందిన వైసీపీ నేత మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ పదవి దక్కింది కానీ.. మంత్రి పదవి చాన్స్ అయితే లేదని పార్టీ వర్గాల్లోనే అంటున్నారు. ఈ పరిస్థితే ఆయన అనుచరులలో తీవ్ర అసంతృప్తికి కారణమౌతోంది.  జగన్ అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగేళ్ల తర్వాత తమ నాయకుడికి  ఎమ్మెల్సీ మరో ఏడాదిలో ఎన్నికలు రానున్నాయి. అలాంటి వేళ కేబినెట్ కూర్పు అంటే.. తేనెతుట్టెను కదిలించినట్లే అవుతోందని.. ఆ క్రమంలో ఆ ఆలోచన చేయకుండా ఉండడమే మేలనే ఓ భావనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్లు ఓ ప్రచారం అయితే ఆ పార్టీలో జరుగుతోందని వారు పేర్కొంటున్నారు. దీంతో తమ నేత మర్రి రాజశేఖర్‌కు మంత్రి అయ్యే యోగం లేదని వారు పెట్టుకొన్న ఆశలను సైతం వదులుకొంటున్నట్లు తెలుస్తోంది.   2019 ఎన్నికల ప్రచారంలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా విడదల రజినీని గెలిపిస్తే.. మర్రి రాజశేఖర్‌ను ఎమ్మెల్సీగా ఎన్నిక చేసి.. . తన కేబినెట్‌లో మంత్రిగా తీసుకొంటానని.. సదరు నియోజకవర్గ ప్రజలకు  జగన్.. మాట ఇచ్చారని.. అలా ఆ ఎన్నికల్లో రజినీ అయితే గెలిచింది.. ఆమె మంత్రి పదవి సైతం చేపట్టిందని.. అలాగే ఈ నాలుగేళ్లలో  పలుమార్లు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినా.. ముఖ్యమంత్రి  జగన్ మాత్రం.. పలువురికి ఎమ్మెల్సీ పదవులు కేటాయించి... శాసనమండలికి పంపారని మర్రి రాజశేఖర్ అనుచర వర్గం ఈ సందర్భంగా గుర్తు చేస్తోంది.    మరోవైపు ఈ నాలుగేళ్లలో తమ నాయకుడు మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ ఇవ్వకుంటే.. ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి కానీ.. మరేదైనా పదవి కానీ కట్టబెడతారని ఆయన అనుచరగణం కళ్లలో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూసిందని..  కానీ అవేమీ లేకుండా.. ఊరించి.. ఊరించి..  ఎన్నికలు  ఎన్నికలు సమీపిస్తున్నాయనగా ఇలా ఎమ్మెల్సీ పదవి కేటాయించడం పట్ల.. ఆయన కేడర్ ఒకింత నిరాశ నిస్పృహాకు గురైనట్లు ఓ ప్రచారం అయితే జరుగుతోంది. ఇంకోవైపు.. కొద్ది మాసాల ముందే.. కృష్ణా జిల్లా పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ పదవిని మర్రి రాజశేఖర్‌కు జగన్ కట్టబెట్టారని వారు పేర్కొంటున్నారు.  అదీకాక.. వచ్చే ఎన్నికల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ దేవుడికే ఎరుక.. ఆ తర్వాత ప్రభుత్వం మారితే.. తమ నేత పరిస్థితి ఏమిటని ఆయన వర్గం ఆందోళనతో ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు.. మర్రి రాజశేఖర్ సామాజిక వర్గం కారణంగానే ఆయనకు ఇప్పటి వరకు ఎమ్మెల్సీ పదవి దక్కలేదనే ఓ ప్రచారం సైతం చిలకలూరిపేట నియోజకవర్గంలో జోరందుకొందని తెలుస్తోంది.   ఇక వచ్చే ఎన్నికల్లో మళ్లీ చిలకలూరిపేట నుంచి  వైసీపీ అభ్యర్థిగా విడదల రజినీ బరిలోకి దిగనున్నారని.. ఆమె అభ్యర్థిత్వానికి అసమ్మతి సెగ తలగకుండా... ఆమె గెలుపు నల్లేరు మీద నడకలా సాగడం కోసమే.. మర్రి రాజశేఖర్‌కు ఈ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సంతృప్తి పరిచారనే ప్రచారం సైతం ఆయన వర్గంలో చాలా బలంగా సాగుతోంది.   వచ్చే ఎన్నికల ప్రచారం వేళ.. ముఖ్యమంత్రి, ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్.. మళ్లీ ఈ నియోజకవర్గానికి వచ్చి.. మర్రి రాజశేఖర్‌ను ఇప్పటికే ఎమ్మెల్సీ చేశామని.. మళ్లీ అదికారంలోకి వస్తే.. ఆయనకు మంత్రి పదవి కేటాయిస్తానని.. అది కూడా కీలక శాఖ కట్టబెడతానంటూ హామీ ఇచ్చే అవకాశం ఉందని మర్రి రాజశేఖర్ వర్గం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఓ వేళ వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైయస్ జగన్ పార్టీ విజయం సాధించినా.... గతంలో లాగే తమ నేత మర్రి రాజశేఖర్‌ను మరిచిపోతే.. పరిస్థితి ఏమిటని ఆయన వర్గం సూటిగా ప్రశ్నిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తమ నేత రాజశేఖర్ సూచనలకు అనుగుణంగా నచుకొంటామని ఆయన వర్గం స్పష్టం చేస్తోంది. మరి మర్రి రాజశేఖర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనేది  వేచి చూడాల్సిందే.     మరోవైపు గతంలో మాజీ మఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య సంతాప సభను నియోజకవర్గంలో నిర్వహించిన సమయంలో మర్రి రాజశేఖర్ బావమరిది మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వంలో మర్రి రాజశేఖర్‌కు గుర్తింపు లేకుండా పోయిందని ఆరోపించారు. మరో పార్టీలో మర్రి రాజశేఖర్ ఉంటే.. ఆయన పరిస్థితి మరోలా  ఉండేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారని ఆయన వర్గం ఈ సందర్భంగా గుర్తు చేస్తోండడం గమనార్హం.