ఫ్యామిలీ సేఫ్
posted on Jun 16, 2023 7:19AM
విశాఖ ఎంపీ తన ఫ్యామిలీ కిడ్నాప్‌నకు గురైన వ్యవహారంపై విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పందించారు. విశాఖ ఎయిర్‌పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన ఫ్యామిలీ, తన స్నేహితుడు సేఫ్‌గా ఉన్నారన్నారు. కిడ్నాప్‌పై ఫిర్యాదు చేసిన మూడు గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారని చెప్పారు. ఈ సందర్భంగా విశాఖ నగర పోలీసులకు ఆయన కృతజ్జతలు తెలిపారు. కిడ్నాపర్ హేమంత్‌తో తనకు ఎలాంటి పరిచయం లేదని స్పష్టం చేశారు. అయితే కేవలం డబ్బు కోసమే అతడు ఈ కిడ్నాప్‌కి పాల్పడ్డాడన్నారు.
అయితే 3 రోజుల క్రితం కిడ్నాపర్ హేమంత్ ఋషికొండలో తన కుమారుడు నివాసంలోకి చొరబడి, అతడ్ని నిర్బంధించాడని.. అనంతరం తన కుమారుడితో ఫోన్ చేయించి.. తనకు ఒంట్లో బాగోలేదంటూ.. తన భార్యను.. కుమారుడి ఇంటికి కిడ్నాపర్ రప్పించాడని.. అలా తన భార్యని కూడా నిర్బంధించాడని చెప్పారు. ఆ తర్వాత తన భార్య, కొడుకు చేత తన స్నేహితుడు గన్నమనేని వెంకటేశ్వరరావుని సైతం ఇంటికి పిలిపించి.. అతడ్ని కూడా కిడ్నాప్ చేశాడని పేర్కొన్నారు. వీరి ముగ్గురిని చిత్రహింసలకు గురి చేస్తూ.. డబ్బులు కోసం డిమాండ్ చేశాడన్నారు. అయితే ఈ కిడ్నాప్ జరిగినప్పుడు తాను హైదరాబాద్‌లో ఉన్నానన్నారు.
మరోవైపు ఆనందపురం పోలీస్ స్టేషన్‌లో కిడ్నాపర్లను పోలీసులు విచారిస్తున్నారు. అలాగే పోలీస్‌స్టేషన్ పరిసర ప్రాంతాల్లోకి ఎవ్వరూ రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మీడియాను కూడా పోలీసులు అనుమతివ్వలేదు. హేమంత్ ఈ కిడ్నాప్ ద్వారా రూ.50 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ వీజారెడ్డి హత్య కేసులో హేమంత్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. హేమంత్ తరచూ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ఘర్షణకు దిగుతూ ఉంటాడని పోలీసులు వెల్లడించారు. అతడిపై ఇప్పటికే పలు కేసులు నమోదు అయి ఉన్నాయని పోలీసులు తెలిపారు.