జైల్లో ఏ7ని కలిసిన ఏ8 భేటీ
posted on Jun 16, 2023 6:38AM
కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి గురువారం చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. జైలులో ఉన్న తన తండ్రి వైయస్ భాస్కరరెడ్డిని పరామర్శించారు. తండ్రి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని ఆయనే స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా తండ్రికి ఆరోగ్యంపై అవినాష్ రెడ్డి పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సొంత చిన్నాన్న వైయస్ వివేకా హత్య కేసులో వైయస్ అవినాష్ రెడ్డితోపాటు ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఈ హత్య కేసులో వైయస్ భాస్కరరెడ్డిని సీబీఐ అధికారులు గతంలోనే అరెస్ట్ చేసి.. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆయితే ఇటీవల ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తండ్రిని కలిసేందుకు వైయస్ అవినాష్ రెడ్డికి జైలు అధికారులు అనుమతి ఇచ్చారు.
మరోవైపు వివేకా హత్య కేసులో వైయస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు మరో సారి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇవ్వగా.. తన తల్లి తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని.. ఆ క్రమంలో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్నారని... ఆమెకు సహయంగా ఉండాల్సి ఉందంటూ కారణం చూపుతూ.. సీబీఐ విచారణను వాయిదా వేస్తూ వచ్చారు.
ఆ క్రమంలో సీఎం వైయస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి రావడం.. ఆ తర్వాత వైయస్ అవినాష్ రెడ్డికి కోర్టు నుంచి ముందస్తు బెయిల్ లభించడం చకచకా జరిగిపోయాయి. అయితే వివేకా హత్య కేసులో వైయస్ భాస్కరరెడ్డి ఏ7 ముద్దాయి కాగా, వైయస్ అవినాష్ రెడ్డి ఏ8 ముద్దాయిగా ఉన్న విషయం విదితమే.