అరకు కాఫీ తాగిన సీఎం చంద్రబాబు
posted on Aug 9, 2025 @ 3:14PM
అల్లూరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. పాడేరులోని లగిశపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా సీఎం జీసీసీ ఉత్పత్తులను పరిశీలించి ఆయన గిరిజన డ్వాక్రా మహిళలు తయారు చేసిన అరకు కాఫీని ఆస్వాదించారు. అరకు కాఫీకి మరింత బ్రాండింగ్, మార్కెటింగ్ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ‘‘ఏజెన్సీ ప్రాంతాల్లో స్వచ్ఛమైన, అందమైన కొండలు దర్శనమిస్తాయి. మంచి మనసు ఉండే ప్రజలు ఇక్కడ ఉంటారు. ఆదివాసీలంటే గుర్తొచ్చేది సహజ నైపుణ్యం, సామర్థ్యం. గిరిజనులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై మొదట దృష్టి సారించింది ఎన్టీఆర్’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామని... చెప్పినట్లే సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామని తెలిపారు. సంపద సృష్టించి పేదలకు పంచాలనేదే తన లక్ష్యమని ఉద్ఘాటించారు. ఆర్థికంగా అభివృద్ధి చెందినవారు సమాజానికి తిరిగి ఇవ్వాలని సూచించారు. గత ఐదేళ్లు వైసీపీ హయాంలో విధ్వంసం జరిగిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలను సర్వనాశనం చేయడానికే వైసీపీ పుట్టిందని ఆక్షేపించారు. తాను చెప్పినట్లే పెన్షన్లు పెంచి ఇచ్చానని, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నామని సీఎం తెలిపారు.
గంజాయి సాగు నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అధికారులను ముఖ్యమంత్రి అడిగారు. డ్రోన్ల వినియోగం ద్వారా గంజాయి సాగును నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. గంజాయి సాగు వినియోగాన్ని నివారించేలా చర్యలు తీసుకుంటే.. టూరిజం కూడా అభివృద్ధి చెందుతోందని స్పష్టం చేశారు. జీరో గంజా కల్టివేషన్, జీరో క్రైమ్ దిశగా పోలీసులు ప్రణాళికాబద్దంగా పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. ఏజెన్సీ ప్రాంతంలో సెరీకల్చర్ సాగును 10 వేల ఎకరాల్లో చేపడుతున్నట్లు అధికారులు వివరించారు.
సెరీకల్చర్ ద్వారా వచ్చిన పట్టుదారాలతో నేసిన వస్త్రాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. నిఫ్ట్ వంటి సంస్థలతో కలిసి పని చేయడం ద్వారా ఏజెన్సీలో నేసిన వస్త్రాలకు మంచి డిమాండ్ వచ్చేలా చేయొచ్చని సూచించారు. ఏజెన్సీలో నేసిన వస్త్రాల మార్కెటింగ్ కోసం మంచి భాగస్వాములను అన్వేషించాలని ఆదేశించారు. డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన అరకు కాఫీ స్టాల్‌ని సందర్శించి కాఫీ తాగారు. కూకీస్, మిల్లెట్ బిస్కట్లు, స్థానికంగా లభించే ముడిసరుకులనే ఉపయోగించి చాక్లెట్ల తయారీ మీద దృష్టి సారించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు