కవిత, కేటీఆర్.. రక్షాబంధన్ రోజూ ఎడబాటే!
posted on Aug 9, 2025 @ 3:34PM
దేశ మంతా రాఖీ పౌర్ణమిని ఘనంగా వేడుకగా జరుపుకుంటున్నారు. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు తన అనుబంధాన్ని చాటుకుంటున్నారు. అయితే కేసీఆర్ కుటుంబంలో మాత్రం రాఖీ పండుగ వెలతెలబోయింది. ప్రతిఏటా రాఖీ పండుగ సందర్భంగా తమ అనుబంధాన్ని చాటుకుంటూ వస్తున్న కేటీఆర్, కవితలు మాత్రం ఈ ఏడాది ఎడముఖం, పెడముఖంగా దూరంగా ఉండిపోయారు. రాఖీ సందడి కేసీఆర్ కుటుంబంలో ఇసుమంతైనా కనిపించలేదు. బీఆర్ఎస్ లో కేటీఆర్, కవితల మధ్య ఆధిపత్య పోరు కారణంగా గత కొద్ది కాలంగా కల్వకుంట్ల కవిత కల్వకుంట్ల కుటుంబానికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
అయినా రాజకీయం రాజకీయమే, అనుబంధం అనుబంధమే అని భావించిన కవిత రాఖీ కట్టేందుకు వస్తానని కేటీఆర్ కు ఫోన్ చేశారు. అయితే ఆయన మాత్రం తాను బిజీగా ఉన్నాననీ, అసలు హైదరాబాద్ లోనే లేననీ తప్పించుకున్నారు. ఈ విషయాన్ని కవిత స్వయంగా చెప్పారు. తాను రాఖీ కట్టేందుకు అన్న కేటీఆర్ వద్దకు వెడదామని భావించినా ఆయన హైదరాబాద్ లో లేరనీ, బేంగళూరులో ఉన్నారనీ అందుకే రాఖీ రోజు కూడా అన్నకు దూరంగా ఉండాల్సి వచ్చిందని చెప్పారు.
అయితే రాఖీ పౌర్ణమి రోజునే కేటీఆర్ బేంగళూరు టూర్ పెట్టుకోవడం.. కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న అంతర్గత పోరులో భాగమే అయి ఉంటుందంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజకీయంగా ఎంతగా విభేదించినా.. అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ రోజున వీరు తమ మధ్య విబేదాలను పక్కన పెటతారని అంతా భావించారు. ఏటా జరిగే విధంగానే కవిత స్వయంగా కేటీఆర్ నివాసానికి వెళ్లి రాఖీ కడతారని అనుకున్నారు. అందుకు అనుగుణంగానే కవిత కేటీఆర్ నివాసానికి వెళ్లడానికి సిద్ధపడినా.. కేటీఆర్ మాత్రం అందుబాటులో లేను బేంగళూరులో ఉన్నానంటూ సమాచారం ఇవ్వడంతో కవిత అన్నకు రాఖీ కట్టే అవకాశం లేకుండా పోయింది.
గత ఏడాది కూడా కవిత కేటీఆర్ కు రాఖీ కట్టలేకపోయారు. అందుకు కారణం అప్పట్లో ఆమె లిక్కర్ స్కాంలో అరెస్టై తీహార్ జైలులో ఉన్నారు. బెయిలుపై విడుదలై వచ్చిన తరువాత ఆమె ప్రత్యేకంగా కేటీఆర్ నివాసానికి వెళ్లి అన్నకు రాఖీ కట్టారు. అయితే ఇప్పుడు మాత్రం అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కవితను తప్పించుకోవడానికే కేటీఆర్ బేంగళూరు పర్యటన పెట్టుకున్నారన్న చర్చ బీఆర్ఎస్ వర్గాలలోనే గట్టిగా వినిపిస్తోంది.