డిసెంబర్ 12లోగా బాబు క్వాష్ పై సుప్రీం తీర్పు
posted on Nov 30, 2023 @ 2:15PM
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు వచ్చే నెల 12లోగా తీర్పు వెలువరించే అవకాశాలు ఉన్నాయి. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబునాయుడు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ విచారణను వాయిదా వేస్తూ గతంలోనే సుప్రీం ధర్మాసనం ఈ కేసును రిజర్వ్ లో ఉన్న క్వాష్ పిటిషన్ తీర్పు వెలువరించిన తరువాత టేకప్ చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే ఆ లోగా చంద్రబాబు బెయిలు పిటిషన్ విచారణ గురువారం బెంచ్ ముందుకు వచ్చింది. దీంతో ఈ రోజు ఫైబర్ నెట్ కేసులో బాబు ముందస్తు విచారణను సుప్రీం కోర్టు ధర్మాసనం డిసెంబర్ 12కు వాయిదా వేసింది. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదీలతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుపై డిసెంబర్ 12 వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని ఏపీ సీఐడీని ఆదేశించింది.
ఈ సందర్భంగా స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై తీర్పు రిజర్వ్ లో ఉందని న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ద బోస్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 12లోపు స్కిల్ కేసులో బాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.