నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష.. కేసీఆర్ కు ఆపరేషన్ వికర్ష్!
posted on Dec 4, 2023 @ 10:23AM
నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్న చందంగా తయారైంది కేసీఆర్ పరిస్థితి. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను గంపగుత్తగా తన పార్టీలో చేర్చుకుని విపక్షాలను నిర్వీర్యం చేయడానికి ఆయన అప్పుడు అమలు చేసిన ఆపరేషన్ ఆకర్ష్ వ్యూహం, ఇప్పుడు రివర్స్ లో ఆయనకు ఆపరేషన్ వికర్ష్ గా మారి ఆయన పార్టీ నిర్వీర్యం అయ్యేలా చేస్తున్నది.
తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఓటమి పాలైన బీఆర్ఎస్‌ను వీడేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నట్లు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ చర్చేమీ ఊహాగాన సభ కాదనడానికి తార్కానంగా ఫలితాలు వెలువడిన గంటల వ్యవధిలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ తరఫున ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రేవంత్ కు కలిశారు.
ఔను భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ సమయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అక్కడే ఉన్నారు. కొద్ది రోజుల కిందట కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులు తమతో టచ్‌లో ఉన్నారని, ఫలితాలు వచ్చాక కాంగ్రెస్‌లో చేరతామని చెబుతున్నారనీ పేర్కొన్న సంగతి తెలిసిందే.
విశ్వసనీయ సమాచారం మేరకు భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ మాత్రమే కాదు మరో నలుగురైదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ తో టచ్ లోకి వచ్చారని తెలుస్తోంది.