ఇద్దరు సీఎంలను ఓడించిన వైఎస్ అభిమాని!
posted on Dec 4, 2023 6:58AM
కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కాటిపల్లి వెంకటరమణా రెడ్డి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో అందరి నోటా ఆయన పేరే వినిపిస్తోంది. ఒకే సారి ముఖ్యమంత్రిని, కాబోయే ముఖ్యమంత్రిని ఓడించి అందరి దృష్టినీ ఆకర్షించిన వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన వ్యక్తే. గతంలో ఆయన జడ్పీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. చదువు ఇంటర్మీడియేట్. బీఆర్ఎస్ ను వీడి బీజేపీ గూటికి చేరి కామారెడ్డి నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచిన వెంకటరమణారెడ్డి ఆ సందర్భంగా ఒక టీవీ చానల్ కు ఇఛ్చిన ఇంటర్వ్యూలో తాను కేసీఆర్‌ను ఎదుర్కోవడం లేదని, కేసీఆరే తనను ఎదుర్కుంటున్నారని చెప్పారు.
వెంకటరమణారెడ్డి స్థానికుడు. కామారెడ్డిలోనే పుట్టారు. అక్కడే పెరిగారు. అ విషయాన్నే ఆయన తన ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. ఇక్కడే పుట్టాను.. ఇక్కడే పెరిగాను.. ఇక్కడే మరణిస్తాను అని చెబుతూ రంగంలో ఉన్న ఇద్దరు జెయింట్స్ స్థానికేతరులన్న విషయం జనం మనస్సుల్లో బలంగా హత్తుకునేలా చేశారు. స్థానికుడనే కాకుండా.. ప్రజా సేవలో కూడా ముందుండటం వల్లే ఆయన ఇద్దరు దిగ్గజ నేతలను ఓడించి విజయం సాధించగలిగారు.
ఔను వెంకటరమణారెడ్డి తన తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా పాఠశాల భవనాలకు భూములు ఇచ్చారు.అంతే కాకుండా కామారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ఏమి కావాలో గుర్తించి, తాను వాటిని తీరుస్తానని తన ప్రచారంలో హామీ ఇచ్చారు. అందుకే ముఖ్యమంత్రిని, కాబోయే ముఖ్యమంత్రిని కూడా కాదని జనం ఆయనకు ఓటెత్తారు.