ప్రారంభమైన ప్రజా దర్బార్.. భారీగా తరలి వచ్చిన ప్రజలు
posted on Dec 8, 2023 @ 12:07PM
పదేళ్ల కెసీఆర్ పాలనలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే సంస్కృతి లేదు. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి మరుసటి రోజే చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమం జ్యోతిరావు పూలే ప్రజాభవన్ (ప్రగతిభవన్)లో ప్రారంభమయింది. ప్రభుత్వానికి తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వారి నుంచి ముఖ్యమంత్రి వినతులను స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ హెల్ప్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేశారు. హెల్ప్ డెస్క్ లో ప్రజల అర్జీల వివరాలను అధికారులు నమోదు చేసుకుని, క్యూలైన్లలో లోపలకు పంపిస్తున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి సెక్రటేరియట్ కు వెళ్లనున్నారు. విద్యుత్ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు.
జడ్పిటిసి స్థాయి నుంచి సీఎం స్థాయికి వచ్చిన రేవంత్ రెడ్డికి ప్రజల నాడీ బాగా తెలుసు. సమస్యలకు పరిష్కారాలు వెతకడం ఆయనకు పెద్ద టాస్క్ కాదు. ఎమ్మెల్యేల స్థాయిలో ప్రజా దర్బార్ నిర్వహించాలని పరిశీలకులు అంటున్నారు. అత్యధిక మెజార్టీతో గెలుపొందిన గడ్డం వివేక్ వెంకటస్వామి ఎన్నికల ప్రచారంలోనే తాను గెలిస్తే ప్రజా దర్బార్ నిర్వహిస్తానని హామి ఇచ్చారు. ఆయన బాటలోనే మిగతా ఎమ్మెల్యేలు ప్రజా దర్బార్ నిర్వహించాలని ఆశిద్దాం.