మాజీలు.. కార్యాలయాల ఖాళీ నెపంతో ప్రభుత్వ ఫర్నీచర్ తరలింపునకు యత్నాలు!?
posted on Dec 8, 2023 7:56AM
ఒక వైపు తెలంగాణ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు జరుగుతుంటే.. ఇదే సందుగా మాజీ మంత్రులు తమ కార్యాలయాల నుంచి ప్రభుత్వ ఫర్నీచర్ ను తరలించుకుపోయేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అది గమనించి కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుపడటంతో రాష్ట్రంలో పలు చోట్ల ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కార్యాలయాలలో ఫర్నీచర్ ప్రభుత్వ సొత్తు. అధికారం ఉన్నంత వరకూ అనుభవించడం మాత్రమే మంత్రుల పని. అధికారం నుంచి తప్పుకోగానే ఆ కార్యాలయాన్ని వీడాలే తప్ప ఫర్నిచర్ ను కూడా తరలించేయడం సరికాదు.
అయితే కొందరు బీఆర్ఎస్ మాజీలు అదే చేస్తున్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనుచరులు రవీంద్ర భారతి సమీపంలో ఉన్న ఆయన కార్యాలయాన్ని ఖాళీ చేసే క్రమంలో ఫర్నీచర్, కంపూటర్లను కూడా ట్రాలీలోకి ఎక్కించేస్తుండగా గమనించిన కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రభుత్వ సొత్తును తరలించడం తగదంటూ వాగ్వాదానికి దిగారు. విషయం పోలీసుల వరకూ వెళ్లింది. ఇక పలువురు ఎమ్మెల్యులు కూడా తమ తమ క్యాపు కార్యాలయాలను ఖాళీ చేసే నెపంతో ఫర్నీచర్ కు కూడా తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఎక్కడికక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలనూ సముదాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలలోని ఫర్నిచర్, ఇతర వస్తువుల పర్యవేక్షణ బాధ్యత వహిస్తున్న రోడ్లు భవనాల శాఖ స్పందించి.. పరాజయం పాలైన కొందరు ఎమ్మెల్యేలు కార్యాలయంలో ఫర్నీచర్ తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలు సరికాదని పేర్కొంది.
బోధన్‌లో మాజీ షకీల్ అమీర్ తన క్యాంపు కార్యాలయంలోని ఫర్నీచర్ తలరించడానికి చేసిన ప్రయత్నం కూడా ఉద్రిక్తతలకు దారి తీసింది. అసలు విషయమేమిటంటే తెలంగాణ ఏర్పాటు అనంతరం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఒక్కో నియోజకవర్గంలో క్యాంపు కార్యాలయాలను కోటి రూపాయల చొప్పున నిధులతో నిర్మించింది. వాటి విద్యుత్ బిల్లులు, పన్నులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ వచ్చింది.
ఇప్పుడు ప్రభుత్వం మారింది. పరాజయం పాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కొందరు తమతమ క్యాంపు కార్యాలయాలను ఖాళీ చేసే నెపంతో ప్రభుత్వ ఫర్నీచర్ ను కూడా తరలించే ప్రయత్నాలు చేస్తుండటంతో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. పరాజయం పాలైన ఎమ్మెల్యేలు తమతమ క్యాంపు కార్యాలయాలను ఖాళీ చేసిన తరువాత వాటికి అవసరమైన మరమ్మతులు చేసి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఆర్అండ్ బీ శాఖ అప్పగించాల్సి ఉంటుంది.