మాజీ సీఎంకు సీఎం పరామర్శ.. కేసీఆర్ కు రేవంత్ కు ఇదే తేడా!
posted on Dec 11, 2023 5:12AM
శస్త్ర చికిత్స చేయించుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును సీఎం రేవంత్ పరామర్శించారు. మామూలుగా అయితే ఇదేమంత చెప్పుకోవలసిన.. కాదు కాదు ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం కాదు. కానీ గత తొమ్మిదేళ్లుగా తెలంగాణ రాజకీయాలలో ఇటువంటి వాతావరణంలేదు. రాజకీయ ప్రత్యర్థుల మధ్య వైరం, యుద్ధం అన్నట్లుగానే పరిస్థితులు కనిపించాయి. తెలంగాణ ఆవిర్భావం తరువాత వరుసగా రెండు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్.. విపక్షాల నిర్వీర్యమే లక్ష్యంగా పని చేశారు. ప్రత్యర్థి పార్టీల నుంచి గంపగుత్తగా ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోని వలస వచ్చేలా చేశారు. అలా రాని వారిని వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ క్రమంలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీఎంగా ఉన్న సమయంలో పలు అవమానాలకు గురి చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ ను ట్రాప్ చేసి మరీ జైలుకు పంపారు.
రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ నేతలను, వారి పార్టీని, అధిష్టానాన్ని, చివరికి దివంగత ప్రధానులు నెహ్రూ, ఇందిరా గాంధీల గురించి కూడా కేసీఆర్ ఇష్టారీతిన విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి రానీయకుండా చేయాలన్న ఉద్దేశంతో ఆయనను సభ నుంచి బహిష్కరింపజేసేవారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ ఇలా వ్యవహరిస్తే.. ఆయన ఎంతగా అవమానించినా, రాజకీయంగా దెబ్బ తీసినా, గెలిచిన తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు రాజకీయ పరిణితిని నిదర్శనంగా నిలుస్తోంది. గెలిచిన తరువాత ఆయన కేసీఆర్ పై కానీ, బీఆర్ఎస్ పై కానీ ఒక్క రాజకీయ విమర్శ చేయలేదు. అధికారంలో ఉండగా కేసీఆర్ చేసిన విధంగా రేవంత్ ఎక్కడా కేసీఆర్ ను ఎద్దేవా చేయలేదు. పరుషంగా మాట్లాడలేదు. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ను స్వయంగా పరామర్శిచారు. సహచర మంత్రులు సీతక్క, జూపల్లిలతో కలిసి ఆయన యశోదా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వ పరంగా ఎలాంటి సాయం అవసరమైనా అందిస్తామన్నారు. కేసీఆర్ బాత్ రూంలో జారి పడిన రోజున ఆస్పత్రిలో చేరినట్లు తెలిసిన తర్వాత ఆరోగ్య శాఖ ఉన్నతాధికారిని ఆస్పత్రికి పంపి ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందించాలని ఆదేశించారు. ఆ తర్వాత నేరుగా వెళ్లి పరామర్శించారు.
రేవంత్ వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాలలో హుందాగా ఉండటం ఎలాగో కేసీఆర్ కు ఇప్పుడు అవగతమై ఉంటుందని పరిశీలకులు సైతం అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన కాంగ్రెస్ ను, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ ను కనీసం అభినందించి, శుభాకాంక్షలు కూడా తెలియజేయని కేసీఆర్ ను రేవంత్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి మరీ పరామర్శించడం ద్వారా వ్యక్తిత్వం విషయంలో ఇరువురి మధ్యా ఉన్న తేడా ఏమిటన్నది ప్రజలను స్పష్టంగా తెలిసిందని పరిశీలకులు చెబుతున్నారు.