లోక్ సభ ఎన్నికల కోసమేనా కవిత హిందుత్వ అజెండా?
posted on Dec 27, 2023 7:53AM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత బీఆర్ఎస్ లో ఒక నిస్తేజం కనిపిస్తోంది. ఆ పార్టీ అధికారంలో ఉండగా ఇష్టారీతిగా ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించిన నేతల నోళ్లు ఇప్పుడు మూతపడిపోయాయి. మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు జంకుతున్నారు. ఇక అలా వచ్చి మాట్లాడే ఇద్దరు ముగ్గురు నేతలు కూడా తమ పార్టీ ఓటమిని అంగీకరించి హుందాగా మాట్లాడకుండా, తామింకా అధికారంలోనే ఉన్నామన్న చందంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత బీజేపీ వాణి వినిపించారు.
అసలు బీఆర్ఎస్ ఓటమిలో ప్రధాన భాగం ఆ పార్టీ బీజేపీ మధ్య రహస్య అవగాహన ఉందన్న భావనే అనడంలో సందేహం లేదు. జనాలు బీజేపీ బీ టీమ్ బీఆర్ఎస్ అని గట్టిగా నమ్మడానికి కారణం కూడా లిక్కర్ కుంభకోణం కేసులో కవిత అరెస్టు కాకపోవడమేనని రాజకీయవర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ఇక కాంగ్రెస్ కూడా ఢల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవిత అరెస్టు కాకపోవడానికి బిజెపితో కేసీఆర్ అవగాహనకు రావడమే ఆరోపిస్తూ వచ్చింది. కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత కూడా ఇదే విషయాన్ని ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బహిరంగంగానే చెప్పారు.
ఇప్పుడు కవిత తన వ్యాఖ్యల ద్వారా, కాంగ్రెస్ పై చేసిన విమర్శల ద్వారా అవి ఉట్టి ఆరోపణలు కావని తేల్చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంతకీ కవిత ఏమన్నారంటే.. కాంగ్రెస్ డిఎన్‌ఎలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందనీ, సనాతన ధర్మాన్ని అవమానిస్తే రాహుల్ గాంధీ స్పందించలేదని విమర్శించారు. డిఎంకే నేతలు దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా మాట్లాడుతుంటే కాంగ్రెస్ మౌనం అందుకు అంగీకారం తెలపడంలాగే కనిపిస్తోందని దుయ్యబట్టారు. అయితే కవిత మాటలను నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. బీజేపీతో ఉన్న రహస్య బంధాన్ని కవిత మాటలు సందేహాలకు అతీతంగా రుజువు చేశాయని అంటున్నారు.
అకస్మాత్తుగా సనాతన ధర్మం, హిందూ మతం కవిత కాంగ్రెస్ ను విమర్శించడానికి అస్త్రాలుగా భావించడం విస్తుగొలుపుతోందని అంటున్నారు. కానీ, ఇప్పుడే ఆమె ఆ మాటలు ఎందుకున్నారంటే మూడు నాలుగు నెలల్లో లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో బిజెపి తో బహిరంగ స్నేహం బీఆర్ఎస్ తహతహ కవిత మాటల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. లోకసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కాంగ్రెస్‌ను ఢీకొంటుందా, సమరం కాంగ్రెస్‌కు, బిజెపికి మధ్య జరిగి బీఆర్‌ఎస్ మూడో స్థానానికి పడిపోతుందా అనే చర్చ జరుగుతున్న సమయంలో కవిత మాటలు ఆ పార్టీ రాజకీయ ఎత్తుగడ ఏమిటన్నది తేటతెల్లమౌతోంది.
అయితే గతంలోలా బీజేపీ ఇప్పుడు బీజేపీతో రహస్య బంధం, మైత్రికి సుముఖంగా ఉంటుందా అన్నదే ప్రశ్న. పరిశీలకులు మాత్రం బీజేపీకి ఇప్పుడా అవసరం ఇసుమంతైనా లేదని అంటున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి మెరుగైన ఫలితాలే వచ్చాయి. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగింది. స్థానాలూ పెరిగాయి. గెలిచిన స్థానాలు కాకుండా దాదాపు 19 స్థానాల్లో రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు ఇక ఆ పార్టీ లోక్ సభ ఎన్నికలలో ఒంటరిగా బరిలోకి దిగి.. తన బలాన్ని మరింత పెంచుకుందుకే ప్రయత్నిస్తుంది. అన్నిటికీ మించి లోకసభ ఎన్నికలలో జాతీయ అంశాలకే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఆ కారణంగా ప్రాంతీయ పార్టీ(పేరులో భారత్ అని ఉన్నంత మాత్రాన బీఆర్ఎస్ జాతీయ పార్టీ కాజాలదు)తో రహస్య మైత్రి అవసరం బీజేపీకి పెద్దగా ఉండదు. బీఆర్‌ఎస్ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తే అది వేరే విషయం.. అప్పుడు బీఆర్ఎస్ అవసరం బీజేపీకి ఉండి ఉండేది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అవసరం బీజేపీకి ఇసుమంతైనా లేదు, ఉండదు అని పరిశీలకులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు బీజేపీ ప్రథమ లక్ష్యం తెలంగాణలో విపక్ష స్థానానికి చేరడం. అంటే ఆ పార్టీ తన ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ ను భావిస్తుంది. ఆ పార్టీ దృష్టి అంతా రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగడంగానే ఉంటుంది. అందుకు అవసరమైన వ్యూహాలు ఎత్తుగడలతోనే బీజేపీ లోక్ సభ ఎన్నికలకు సమాయత్తమౌతుంది. అవుతోంది కూడా. గతంలో అంటే బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ లు అనుసరించిన వ్యూహం కూడా ఇదే. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని జనంలోకి తీసుకువెళ్లేందుకు ఈ రెండు పార్టీలూ శతథా ప్రయత్నించాయి.
ఇప్పుడు బీజేపీ అదే వ్యూహాన్ని బీఆర్ఎస్ విషయంలో అదే ఎత్తుగడతో ముందుకు సాగనుంది. బీఆర్‌ఎస్‌ను వెనక్కి నెట్టి కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా మారడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు అదే చేస్తున్నది. దీని కోసం శాసనసభ ఎన్నికల్లో బిజెపి, బీఆర్‌ఎస్ రహస్య అవగాహనతో పనిచేశాయనే ప్రచారాన్ని ప్రజలు గట్టిగానే నమ్మారు. ఇప్పుడు ప్రజలలో ఆ నమ్మకాన్ని పోగొట్టే పనిలో బీజేపీ ఉంది. అందుకే కవిత హిందుత్వ అజెండాను అందిపుచ్చుకున్నారు. అలా చేయడం వల్ల బీజేపీతో పాటు హిందుత్వ ఓట్లలో ఏంతో కొంత భాగాన్ని తమ ఖాతాలో వేసుకుంటే లోక్ సభ ఎన్నికలలో ఏదో మేరకు లబ్ధి పొందొచ్చన్నది ఆమె వ్యూహంగా కనిపిస్తోంద. మాజీ మంత్రి కేటీఆర్ కూడా అందుకే రాహుల్ ఇటాలియన్ వంటి పాత విమర్శలకు బూజులు దులిపి తెరపైకి తీసుకువస్తున్నారు.
అయితే బీఆర్ఎస్ రాష్ట్రంలో పుంజుకోవాలంటే చేయాల్సింది అడ్డదారులలో ప్రజలను మభ్యపెట్టి పబ్బంగడుపుకునే ఎత్తుగడలు కాకుండా.. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమికి కారణాలను సమీక్షించుకుని, తప్పులను సరిదిద్దుకుని మళ్లీ ప్రజాభిమానం కోసం క్షేత్ర స్థాయిలో పని చేయాల్సి ఉంది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే మరో భంగపాటుకు ఆ పార్టీ రెడీ కావాల్సిందే.