Read more!

ఆకాశమే హద్దురా!! 

మనిషి ఆత్మవిశ్వాసాన్ని గురించి మాట్లాడేటప్పుడు, జీవితంలో సాధించాల్సిన లక్ష్యాల గురించి చర్చిస్తున్నపుడు చాలామంది చెప్పే మాట ఆకాశమే హద్దుగా సాగిపో అని. అంటే అంత ఆత్మవిశ్వాసంతో ఉండాలని. ఆకాశం ఒక అనంత దృశ్యం. నింగికి ఎగరడం ఒక అపురూప విజయ బావుటా ఎగరేసినంత సంతోషం. అయితే ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ప్రతి సంవత్సరం డిసెంబర్ 7వ తేదిన పౌర విమానయాన దినోత్సవం జరుపుకోబడుతుంది. గ్రామాలు, రాష్ట్రాలు, దేశాలకు సరిహద్దులు చేరిపి మనిషి ప్రయాణం సాగిస్తున్నాడు. అయితే దేశాలను దాటి ఖండాంతరాలు దాటి ప్రతిభను పెంచుకుంటూనో, జీవితాన్ని మెరుగుపరుచుకుంటూనో సాగుతున్నాడు. రెక్కలు కట్టుకుని ఏమీ ఎగిరిపోవడం లేదు కానీ, రెక్కల కృత్రిమ విహంగాలలో గాల్లో తేలినట్టుందే అని పాడుకుంటూ ప్రయాణాలు సాగిస్తున్నాడు. ఇదంతా పౌర విమానయాన శాఖ కల్పిస్తున్న సౌకర్యమే.

రైట్ బ్రదర్స్!! రైట్ రైట్ బ్రదర్స్!!

విమానాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు వైట్ బ్రదర్స్. వీళ్ళ పుణ్యమా అని గాల్లో ఎగురుతూ తిరుగుతోంది కోట్ల ప్రజానీకం. దాని ద్వారా ఎంతో మందికి ఉపాధి. ఫైలట్ లు, ఎయిర్ హోస్ట్ లు మాత్రమే మనకు తెలుసు. దాని వెనుక బోలెడు యంత్రాంగం, యంత్రాల తయారీకి బోలెడు ఇంజనీరింగ్ సైన్యం ఉంటుంది. ఇదంతా ఒక వైపు విషయం అయితే  మనుషుల ఆర్థిక స్థాయిల కొద్దీ వారి కోరికలు ఉంటాయి. స్థాయి పెరిగేకొద్దీ అవి కూడా పెరుగుతాయి. చిన్నతనంలో ఆకాశంలో విమానం ఎగురుతూ పోతుంటే దాన్ని చూసి చేతులు ఊపుతూ గంతులు వేసిన బాల్యానికి అదే విధంగా తాము విమానంలో ప్రయాణించి రెక్కల చాచుకున్న పక్షిలా  మనసును ఎగరేస్తూ దేశం దాటాలని, విదేశాలలో విద్య, ఉద్యోగం, విశిష్ట సందర్భాలు, విహారయాత్రలు వగైరాల వంకతో ఆకాశాన్ని ముద్దాడుతూ ప్రయాణించాలని అనుకుంటారు.  

కల మీద సంతకం!!

అలా కలలు కన్న వాళ్లకు, కన్నవాళ్ళ తోడ్పాటు చుట్టాలు, స్నేహితులు ఇలా అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉండనే  ఉంటుంది. అయితే చాలామంది మధ్యతరగతి వారికి ఇలాంటి కలలు కలలుగానే మిగిలిపోతుంటాయి. నిజానికి విమనప్రయణం మరీ అంత ఆర్థిక భారం ఏమీ కాదు. సాధారణ జీవితంలో ఖర్చులలో  కొన్ని సేవింగ్స్ వల్ల హాయిగా ఏరోప్లేన్ ఎక్కేయచ్చు.  ఆశించదగ్గ చదువు,తెలివి తేటలు ఉంటే విదేశాలలో ఎంచక్కా ఉద్యోగాలు కూడా చేయచ్చు. కాబట్టి మొదట మనిషి విద్య పరంగా మంచి స్థాయిని చేరుకుంటే ఆకాశంలో ఎగరావచ్చు, మేఘాలలో తేలావచ్చు. సగటు మనిషి కూడా కలను తీర్చుకోనూవచ్చు. 

యువత కల!! 

చాలామంది యూత్ కల ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం సంపాదించడం. పెద్దోళ్ళు ఏమో రిస్క్ జాబ్ వద్దంటారు. కానీ రిస్క్ లేని ఉద్యోగం అంటూ ఏదీ ఉండదు. నిజానికి నైపుణ్యం సంపాదిస్తే అన్ని ఉద్యోగాలు సహజంగానే ఉంటాయి. అలాగే ఈ ఎయిర్ ఫోర్స్ జాబ్స్ కు ఇండియన్ ఆర్మీ లెవల్ లో సెలెక్షన్స్ ఉంటాయి. నైపుణ్యం నుండి శరీర దారుడ్యం వరకు, అన్ని రకాలుగా సంసిద్ధతగా ఉన్నవాళ్లకే పట్టం కడతారు.  కాబట్టి ఆకాశంలో ఆ కృత్రిమ రెక్కల విహంగాన్ని నడపడంలోనూ, ఆ రెక్కల విహంగంలో ఎగరడంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తున్నది, ప్రస్తుత మన భారతం నుండి విదేశాలలో ఉద్యోగాలు, చదువుల దృష్ట్యా వెళ్లివస్తున్నది,  స్థిరపడుతున్నది ఎక్కువగా యువతనే. కాబట్టి యువత ఆకాశమే హద్దుగా సాగిపోవాలి. అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోవాలి. కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బు బిళ్ళా కాదేదీ కవితకనర్హం అని శ్రీశ్రీ అన్నట్టు, విమానయానం, నౌకాయానం, అంతరిక్షయానం కాదేదీ యువత మేధస్సుకు అనర్హం. అందుకే కలాం చెప్పినట్టు, కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి!!


◆ వెంకటేష్ పువ్వాడ