డబ్బే కాదు... సమయం కూడా కావాలి!

ఈ రోజుల్లో చాలామందిది ఒకటే బాధ! ఖర్చుపెట్టుకోవడానికి కావల్సినంత డబ్బు ఉంది. కానీ గడపడానికి సమయమే ఉండటం లేదు. ఈ మాటలు వింటున్న కొందరు పరిశోధకులకి ఓ అనుమానం వచ్చింది. మనిషి దేనివల్ల సంతోషంగా ఉంటాడు? డబ్బు వల్లా! కాలం వల్లా! ఈ విషయాన్ని తేల్చుకునేందుకు వారు ఒక ఆరు పరిశోధనలు చేశారు. ఇందులో భాగంగా 4,600 మంది అభ్యర్థుల ఆలోచనా తీరుని గమనించారు.   లక్షలకొద్దీ జీతంతో ఎక్కువసేపు ఉద్యోగం చేయడం కంటే, కాస్త తక్కువ జీతంతో తక్కువ పనిగంటలు చేస్తేనే సుఖంగా ఉన్నట్లు ఈ పరిశోధనలో వెల్లడయ్యింది. కుర్రవాళ్లు కాస్త అటూఇటూగా మొగ్గుచూపారు కానీ, వయసు మీరుతూ జీవితం తెలిసొస్తున్న కొద్దీ.... డబ్బుకంటే సమయమే ముఖ్యం అనేవారి సంఖ్యే ఎక్కువగా ఉందట. అంతేకాదు! ఇంటిపని, పెరడు పని చేసేందుకు పనివాళ్లని పెట్టుకున్నప్పుడు కూడా ఇదే తరహా సంతోషం కనిపించింది. ఆ సంతోషం తన పని వేరొకరు చేయడం వల్ల కాదు, జీవితాన్ని ఆస్వాదించే సమయం దక్కినందువల్లే అని తేల్చారు!   పైన చెప్పుకొన్న పరిశోధన జరిగి ఏడాది గడిచిపోయింది. ఇప్పుడు శాస్త్రవేత్తలకి మరో సందేహం వచ్చింది. మన డబ్బుతో వస్తువులు కొనుక్కుంటే ఎంతో కొంత తృప్తి ఉంటుంది. అదే సమయాన్ని కొనుక్కుంటే! అదేనండీ... ఆ డబ్బుతో మన పనిభారం తగ్గించుకుంటే మరింత తృప్తి ఉంటుందా! అన్న ఆలోచన వచ్చింది. వెంటనే కొంతమందికి తలా 40 డాలర్లు ఇచ్చి చూశారు. ఈ డబ్బుని మీకు తోచిన రీతిలో ఏదన్నా కొనుక్కోమని చెప్పారు. సహజంగానే చాలామంది తమకి ఇష్టమైన వస్తువులని కొనేసుకున్నారు. అతికొద్ది మంది మాత్రమే... తమకి కాలం కలిసొచ్చేలా వేరొకరి సేవల కోసం ఈ డబ్బుని వినియోగించుకున్నారు. వస్తువులని కొన్నవారితో పోలిస్తే సమయాన్ని కొనుక్కున్నవారే ఎక్కువ తృప్తి పడినట్లు తేలింది.   ఈ పరిశోధనలతో రెండు విషయాలు స్పష్టం అయిపోతున్నాయి. ఒకటి- జీవితంలో డబ్బు ఎంత అవసరమో, సమయం అంతే అవసరం. ఈ రెండింటి మధ్యా సమన్వయం లేకపోతే మనసుకి లోటు తోచడం ఖాయం. రెండు- ప్రతి పైసా కూడపెట్టాలన్న తపనకి పోకుండా, అవసరం అయినప్పుడు సేవల కోసం కూడా కాస్త డబ్బుని ఉపయోగించుకోవడం మంచిది. అలా కలిసొచ్చే కాలం మనం వదులుకునే డబ్బుకంటే విలువైనది! - నిర్జర.  

సాంబార్ ఇడ్లీ సూత్రంతో సమస్యల పరిష్కారం

కొన్ని సందర్భాల్లో ఒకే సమస్య పదే పదే ఎదురవుతుంది. యాంత్రికమైన జీవితంలో ఆ సమస్యను విశ్లేషించుకొని సరిదిద్దుకునే ఓపిక ఎవరికీ లేదు. అసలు అంత దూరం ఆలోచించే విచక్షణ ఎంతమందికి ఉంటుంది. ముఖ్యంగా యువకులు కొన్ని ఒత్తిడులకు లోనవుతుంటారు. సమస్య పరిస్కారానికి కొన్ని అంశాలను చెప్తాను. 1 మూలం  2  సమస్య పునరావృత్తం 3 నివారణ ఏదైనా సమస్యను విశ్లేషించుకున్నప్పుడు పై మూడింటిని మనం పరిగణలోకి తీసుకోవాలి. దాన్ని చమత్కారంగా సాంబార్ ఇడ్లి అనే సూత్రంతో వివరించడానికి ప్రయత్నిస్తాను. ◆సాంబార్ ఇడ్లి సూత్రం మనం ఒక హోటల్ కి వెళ్ళినప్పుడు అక్కడ సర్వర్ తో మనకి పదే పదే గొడవ అవుతుంది. కారణం ఏంటంటే మనం ఆర్డర్ చేసిన సాంబార్ ఇడ్లి లో సాంబార్ చల్లగా ఉండటంతో ఆ సర్వర్ పై కొపగించుకుంటాము. హోటల్ లో కస్టమర్లు నిండుగా ఉంటారు. అతని పనిలో అతను ఉంటాడు. తిరిగి సర్వర్ ని పిలిచి సాంబార్ తీసుకు రమ్మని చెప్పినప్పుడు అతను మళ్లీ చల్లగా ఉండే సాంబార్ నే తీసుకొస్తాడు. మొదటిసారి జరిగిన పొరపాటే మళ్లీ జరుగుతుంది. తిరిగి ఆ సర్వర్ పై కేకలు వేస్తాము. సఖ్యత చెడి ప్రశాంతంగా తిని వెల్దాము అని వచ్చినవాడివి అనవసర ఆవేశానికి లోనై ప్రశాంత కోల్పోతాము. వాస్తవానికి అక్కడ ఉన్న రద్దీకి ఎన్ని సార్లు సాంబార్ తీసుకు రమ్మని చెప్పినాగానీ చల్లగా నే టేబుల్ పైకి వస్తుంది. ఇందులో సర్వర్ పై కోపడ్డం వలన లాభం లేదు. ఉదాహరణకు ఈ సమస్యనే విశ్లేషించుకుంటే సమస్య మూలం ఇక్కడ సాంబార్. దానివలనే ముందుగా మనం అసహనానికి లోనయ్యాము. తిరిగి అదే సాంబార్ వలన కోప్పడ్డాము. అంటే సమస్య పునరావృత్తం అయింది. ఇది గ్రహించి అంతటితో సాంబార్ ని నిలిపేసి  నివారణ గురించి ఆలోచిస్తే సమస్య తీవ్ర రూపం కాకుండా ఉంటుంది. ఇక్కడ సమస్యకి మూలం సాంబార్, సమస్య పునరావృత్తం కారణం సాంబార్ అలాంటప్పుడు దాన్ని గ్రహించి దాని ప్లేస్ లో మరో ఆప్షన్ ని చూసుకొని ఆర్డర్ చేస్తే సమస్య సాల్వ్ అవుతుంది. తేలికగా తమాషాగా అర్ధమయ్యేలా వివరించడానికి ఈ సాంబార్ ఇడ్లి సూత్రం చెప్పాను అంతే! ముగింపు చిన్న చిన్న సమస్యలకు ఎక్కువ స్పందించి మానసిక అనారోగ్యం తెచ్చుకుంటారు. అలాంటివారు కాస్త వివేకంతో ఆలోచిస్తే సమస్య నివారణ బోధపడుతుంది. యువత ఈ సాంబార్ ఇడ్లి సూత్రం ఫాలో అయితే చాలు. ◆ వెంకటేష్ పువ్వాడ  

కరోనాతో కొత్త లైఫ్ స్టైల్!

మనిషి జీవన గమనాన్నే మార్చేసిన కరోనా వైరస్ ఎప్పుడు, ఎక్కడ,ఎలా పుట్టిందో లేక ఏ ఆధిపత్య విషపు కోరల్లోంచి ఊడిపడిందో కాలమే సమాదానం చెప్తుంది.దాని గురించి మనం ఆలోచించడం కాలం వృదా పనే అవుతుంది. అయితే ఈ మహమ్మారి మనకేం నేర్పించిది. దానినుంచి మనమేమి తెలుసుకోబోతున్నాము అనేదానిమీద మన భవిష్యత్ ఆదునిక జీవన విదానం ఆదారపడబోతుంది. ఆలోచిస్తే మన గత జీవనం, వర్తమాన వైభవం ఒకే స్ట్రైట్ లైన్ లా బాగానే వుంది. కానీ కరోనా గీసిన అడ్డగీతతో వెర్రితలలేస్తున్న మనిషి స్వార్దానికి బ్రేకులుపడ్డాయనేది కాదనలేని వాస్తవం. ఈ స్థితిలో ప్రపంచ జీవన విదానంలో వచ్చే పెను మార్పేమిటి, అందులో బాగంగా మన దేశ జీవన గమనం ఎలా వుండబోతుందనేది ఆశక్తి కలిగించే అంశం . ఇన్ని రోజులూ మన విద్య, వైద్యం, వ్యాపారం, మార్కెటింగ్, సభలూ,సమావేశాలు, వినోదాలూ, వేడుకలూ ఇలా అన్నీ ప్రపంచీకరన నీడలో గ్లోబల్ స్టాండర్డ్స్ లో వుండాలని ఆలోచించాము. అది ఇకనుంచి కొరోనా స్టాండర్డ్స్ లోకి మారబోతుందనేది పచ్చి నిజం. ఒకరకంగా ఇది మనకు మంచి విషయమనే చెప్పాలి.ఎందుకంటే మిడి మిడి జ్ఞానంతో విరుద్ద వాంచలతో ప్రకృతితో మిళితమైన జీవన విదానానికీ, జీవ వైద్యానికీ దూరమైన మనం ఈ కొరొనా తెచ్చిన కొత్త రూల్స్ తో మల్లీ క్రమశిక్షణ కలిగిన కొత్త జీవనానికి స్వాగతం పలకబోతున్నాము. ◆జనగణమన శుభ్రతే మన దేశ సౌభాగ్యం : 130 కోట్ల జనాభా కలిగిన దేశంలో అందునా ఒక చదరపు కిలోమీటర్ కి వేలల్లో జన నివాసముండే మన మెట్రో నగరాల్లో భౌతిక దూరం సాద్యమేనా? అంటే సాద్యమైంది. మన ఉరుకులు పరుగుల జీవనంలో పెద్దగా ప్రాదాన్యమివ్వని వ్యక్తిగత శుభ్రతకి మన ప్రజలు పెద్ద పీట వేస్తున్నారు. కారణం ప్రాణం పై తీపి ఒక్కటే కాదు మనతో పాటు మన చుట్టూ వుండే వాళ్ళకీ మన వలన ఎటువంటి అసౌకర్యం కలగకూడదనే ఆరోగ్యకరమైన సామాజిక స్పృహ కలగడం కూడా ఒక కారణం. ఇది మంచి శుభపరిణామం అనే చెప్పాలి. చేతులను ఒకటికి పది సార్లు శుబ్రం చేసుకోవడం, మాస్కులు దరించడం, తుమ్మినప్పుడు మన తుంపర్లు ఎదుటవారిపై పడకుండా మోచేతిని అడ్డుపెట్టుకోవడం, తరుచూ వేడినీల్లని తీసుకోవడం లాంటి జాగ్రత్తలు కొరొనా కి ముందు మన దేశంలో ఎంతమంది పాటిస్తున్నారు. అసలు ఎంతమందికి తెలుసు అంటే మనదగ్గర సమాదానం లేదు. అయితే ప్రస్తుతం ఈ జాగ్రత్తల గురించి పెద్ద చర్చే జరుగుతుంది. మన దేశంలో కుప్పలు తెప్పలుగా జన సమీకరణాలతో జరిగే పెళ్లిళ్లు, విందులు, వినోదాలు, సమావేశాలకు కరోనా షరతులతో కూడిన కొత్త నియమావళి అమల్లోకి రావాలని ఆశిద్దాం. దీని ప్రకారం చాలా పరిమిత సంఖ్యలో జనాలు ఆయా వేడుకలకు హాజరు కావాల్సి వుంటుంది. ఇది ఒకరకంగా మంచి విషయంగానే చెప్పాలి ఎందుకంటే అనవసరపు ఆర్భాటాలకి పోయి దుబారాగా చేసే ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. అలా ఈ మహమ్మారి వచ్చి, మర్చిపోయిన మన ప్రాదమిక ఆరోగ్య నీయమాలని గుర్తుచేయడమే కాకుండా ఖచ్చితంగా ఆచరించేలా చేసింది. ఏది ఏమైనా ఈ మార్పుని ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్ లో ఆరోగ్యమైన సమాజంతో పాటు వైవిద్యమైన జీవన విదానం మనముందు సాక్షాత్కరిస్తుంది. ◆అగ్రతాంబూలం కాబోతున్న ప్రజా ఆరోగ్యం : తమ స్థూల జాతియోత్పత్తిలో 5 శాతం ప్రజా ఆరోగ్యానికి ఖర్చు పెట్టే అగ్ర దేశాలే ఈ కొరోనా బారిన పడి అతలాకుతలం అవుతున్నది మనం చూస్తున్నాం. కానీ మన దేశం ఎంత ఖర్చు పెడుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు కేవలం 1 శాతం. ఇదంతా గతం. కానీ కొరొనా వలన కలిగిన అనుభవంతో భవిష్యత్ లో ఖచ్చితంగా ఎక్కువ కేటాయింపులు వుంటాయని అందరూ బావిస్తున్నారు. అలా కాకుంటే మాత్రం మల్లీ ఇలాంటి మహమ్మారి పుడితే మనం కూడా ఎవర్ని బ్రతికించుకోవాలి,ఎవర్ని చంపుకోవాలి అంటూ వయసుని బేరీజు వేసుకొని వైద్యం అందించే పరిస్థితి వచ్చే ప్రమాదం వుంది. అంతే కాదు గ్రామాలల్లో ఉణికి లేకుండా వున్న ప్రభుత్వ వైద్యశాలలను అందుబాటులోకి తెచ్చి ప్రతి పేదవాడికీ ఆరోగ్య భద్రత , భరోశా ఇవ్వాల్సిన అవసరముంది. వీలైతే ఇంటింటికీ సాద్యమైతే ప్రతి మనిషికీ హెల్త్ ప్రొఫైల్ వుండేలా చర్యలు తీసుకోగలిగితే సంపూర్ణ ఆరోగ్య భారతావనిని మనం చూడగలం.  ◆కొరోనా స్టాండర్డ్స్ లోకి మారనున్న మన విద్యా విదానం: కొరోనా కండీషన్స్ లో ముఖ్యమైన తప్పక పాటించాల్సిన నియమం భౌతిక దూరం. కానీ అలా విద్యార్దులని దూర దూరంగా వుంచి తరగతులు నిర్వహించే శక్తి నిజంగా మన విద్యా వ్యవస్థకి వుందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. అయితే ఈ పరిస్థితిని అదిగమించడానికి ఆన్ లైన్ క్లాస్ లు కొంత దోహద పడుతున్నాయి . అయితే పూర్తిగా మౌఖిక విద్యాబోధనకి అలవాటైన మన వ్యవస్థలో ఇది సాధ్యమేనా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే 75 శాతం మౌఖికంగాను మరో 25 శాతం ఆన్ లైన్ ద్వారా నిర్వహించాలని యూజీసీ కొన్ని సూచనలు కూడా చేసింది. ఇదిలా ఉంటే గాలి కూడా ఆడని గదుల్లో విద్యార్థులను గుంపులు గుంపులుగా పోగేసి క్లాసులు చెప్పే కోచింగ్ సెంటర్ల స్వరూపం రానున్న రోజుల్లో మారనుంది. కచ్చితంగా భౌతిక దూరం పాటించాల్సిన పరిస్థితుల్లో దానికి అనుగుణంగా తరగతి గదుల్ని పెంచుకోవాల్సి వస్తుంది. దీనితో ఆయా సంస్థలు కోర్సుల  ఫీజులు పెంచే ప్రమాదం లేకపోలేదు. ఇది మధ్యతరగతి విద్యార్థులకు ఆర్థిక శిరోభారం అయ్యే ప్రమాదం కూడా ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా క్లాసులు పెంచి షిఫ్ట్ ల వారీగానైనా బోధన సాగించాల్సి ఉంటుంది. ఇంకో మార్గం 75 శాతం డిజిటల్ అండ్ ఆన్ లైన్ విద్యా విధానం, అయితే ఇది ఇప్పట్లో అమలు సాధ్యం కాదనేది కొంతమంది అభిప్రాయం. కారణం మన దేశంలో చాలా మధ్యతరగతి విద్యార్థులకు అవసరమైన ల్యాప్టాప్ లు, దానికి తగ్గ ఇంటర్ నెట్ సౌకర్యం కలిగినవాళ్ళు చాలా తక్కువమంది వున్నారు. భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటినుంచే ఆ దిశగా సమస్య పరిస్కారానికి ఖచ్చితమైన కసరత్తు జరిగితేనే పూర్తి స్థాయి డిజిటల్ విద్యా విధానం అమలుకి సాధ్యం అవుతుంది. ◆కొరోనా తెచ్చిన ఆర్ధిక క్రమశిక్షణ: అయితే ఈ మహమ్మారి ప్రపంచానికి గొప్ప గుణపాటమే నేర్పిందని చెప్పాలి.  లాక్ డౌన్ వేల దిగువ మద్యతరగతి కుటుంబాల ఆర్ధిక స్థితిగతుల బలహీనతల్ని ప్రపంచానికి అద్దం పట్టి చూపించాయి. ఎవరూ ఊహించని,ఎప్పుడూ ఊహించని ఉపద్రవం ఇది. ఒక అంటు వ్యాధి కారణంగా ప్రపంచమంతా దేశాలకి దేశాలు కంచెలేసుకొని లాక్ డౌన్ లోకి వెళ్ళిపోతుంది అని కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు. అయితే ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్లమంది అసంఘటిత కార్మికులు పనులు కోల్పోయారని ఇంటర్ నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చెపుతుంది. ఈ పరిస్థితుల్లో ఆర్ధికంగా బాగా స్థిరపడినవాడు బాగానే వున్నాడు, అంతో ఇంతో చాలీ చాలని ఆదయాలతో బ్రతుకీడ్చే మధ్యతరగతి వాడు ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు. ఇక వలస కూలీల పరిస్థితి వర్ణనాతీతమనే చెప్పాలి. కాలంతో పాటు జీవన వ్యయం కూడా పెరగడంతో ఇన్నాళ్లూ వీళ్లంతా పొదుపు గురించి పెద్దగా పట్టించుకుంది లేదు. పది రూపాయలు ఆదాయం వస్తే సరిపోక కొంత అప్పు చేసి జీవనం సాగించే పేద ప్రజలు వున్నారు. అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు పొదుపుపై దృష్టి పెట్టబోతున్నారు. ఈ విషయంలో ముఖ్యంగా వలస కూలీల విషయంలో ఈ రకమైన ఆర్ధిక క్రమశిక్షణ గురించి వారికి అవగాహన కల్పించి పొదుపుని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకొని కొంత ఆర్ధిక భరోసా కల్పించాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలపై ఉంది. ఆ దిశగా అడుగులు కూడా పడుతున్నాయి. ఈ కరోనా తర్వాత ప్రతి కుటుంబంలో పరిణితి చెందిన ఆర్ధిక క్రమశిక్షణని చూడబోతున్నాం. ఇది మనిషి బలమైన ఆర్ధిక ప్రగతికి పునాదిగా మనం భావించాలి. ◆కొస మెరుపు : మంచో చెడో ఒక మహమ్మారి కారణంగా మన శక్తేమిటో, మన బలహీనతలేమిటో బేరీజు వేసుకొనే అవకాశం వచ్చిందనే మనమందరం భావించాలి. ఇక మీదట ఇలాంటి మహమ్మారి రాకపోదు అన్న గ్యారంటీ లేదు. అయితే కరోనా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో విద్య, వైద్య ఆర్ధిక రంగాలలో బలపడాల్సిన అవసరముంది. ఆవిధంగా అడుగులు పడాల్సిన అవసరముంది. ఎంత సంక్షోభమైనా అందులోoచే అవకాశాన్ని అందిపుచ్చుకుని ముందుకు వెళ్లడం మనిషికి కొత్తేమీ కాదు, సోదాహరణ గా చూస్తే గత అనుభవాలే దీనికి నిదర్శనం. అంతిమంగా మనిషిదే విజయం. - వెంకటేష్ పువ్వాడ   

మనసే గ్రంధాలయం

ఒక పుస్తకం వందమంది స్నేహితులతో సమానం అంటారు. అలాంటి పుస్తకాలను అమితంగా ప్రేమించే వ్యక్తి వరంగల్ కి చెందిన కాసుల రవి కుమార్. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. రచన ప్రవృత్తి. చదువే మనిషిని వెలిగిస్తుంది. అయితే పుస్తకాలు అందుబాటులో లేక, సరైన మార్గ నిర్దేశం చేసేవారు లేక పుస్తక పఠనం తగ్గిపోతున్న ఈ డిజిటల్ రోజుల్లో చిల్డ్రన్స్ లీడ్ లైబ్రరీని స్థాపించి ఇంటినే గ్రంధాలయంగా చేసి గ్రామీణ విద్యార్థులకు పుస్తక పఠనం పై మక్కువ పెంచుతున్నారు. అదే ధ్యాసగా, శ్వాసగా నిరంతరం లైబ్రరీ కోసం పుస్తకాలు సేకరిస్తూ చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులకు వర్క్ షాప్ లు నిర్వహిస్తూ  లైబ్రరీని మరింత దగ్గర చేస్తున్నారు. ఇప్పటివరకూ 6000 పైగా పుస్తకాలను లైబ్రరీకి సేకరించారు. రవి కుమార్ నేపథ్యం నర్సంపేట టౌన్ లో రవికుమార్ నిరుపేద కుటుంబంలో జన్మించారు.తండ్రి నరేంద్రా చారి ఆటో డ్రైవర్, తల్లి సరళాదేవి బీడీ కార్మికురాలు. అయితే ఆర్ధిక కష్టాలతో చదువుని మధ్యలో ఆగిపోయినా చదువుపై మక్కువతో కష్టపడి చదివి ఎంఏ ఇంగ్లీష్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. తర్వాత ఎడ్ సెట్ లో రెండో ర్యాంక్ సాధించారు. బీఈడీ పూర్తి చేసి  ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. గవర్నమెంట్ మోడల్ స్కూల్ జవహర్ నగర్ లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.     లీడ్ గమనం 2007 లో దీన్ని స్థాపించారు.లీడ్ అంటే  నాయకత్వం, చదువు, లక్ష్యసాధన, గ్రామీణ విద్యార్థుల అభివృద్ధికి దారి చూపే వేదిక. కేవలం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మాత్రమే కాదు, హైస్కూల్ నుంచి కళాశాల విద్యార్థుల వరకు 15 ఏళ్ళ నుండి ప్రతి వేసవిలో ఉచిత ఇంగ్లిష్ తరగతులు నిర్వహిస్తున్నారు. వారికి కావాల్సిన మెటీరియల్ ఉచితంగా అందిస్తున్నారు. ఎవరైతే మారుమూల గ్రామాల్లోని పేద విద్యార్థులకు మార్గనిర్దేశం చేసి తగిన విధంగా పోటీ పరీక్షలకు సిద్ధం చేయడంలో లీడ్ ఎంతో కృషి చేస్తుంది. రవి కుమార్ కేవలం లైబ్రరీని మొదలు పెట్టి కూర్చోలేదు. దానిని విద్యార్థులకు, విజ్ఞులకు మరింత చేరువ చేయడం కోసం మొబైల్ లైబ్రరీని ఏర్పాటు చేసి ఇంటింటికీ గ్రంధాలయాన్ని నడిపిస్తున్న ఋషి అని చెప్పాలి. పుస్తకాన్ని ,సమాజాన్ని ఎంతో ప్రేమిస్తే గానీ  ఇది సాధ్యం కాదు.  రవి కుమార్ పుస్తక యజ్ఞంలో భాగం అవుదాము. మనం కూడా లైబ్రరీకి పుస్తకాలు సమకూర్చుదాము. వీలయితే ఇంకా నాణ్యమైన నిర్వహణకు మనవంతు సహాయం చేద్దాము. రవికుమార్ ఫోన్ నెంబర్ 9908311580 /7981068048 ◆ వెంకటేష్ పువ్వాడ

ఈ చిన్న చిట్కాతో ఆరోగ్యం బాగుపడుతుంది!

  రోజుల్లో మన జీవితాలు ఎలా గడుస్తున్నాయో చెప్పనవసరం లేదు. పొద్దున లేచిన దగ్గర నుంచీ, రాత్రి పడుకునే దాకా అంతా కూర్చునే బతుకుని వెళ్లదీస్తున్నాం (sedentary lifestyle). టీవీ ముందరా, కంప్యూటర్‌ ముందరా, డైనింగ్‌ టేబుల్‌ ముందరా కూర్చుని కూర్చుని ఒంట్లో కొవ్వుని పెంచేసుకుంటున్నాం. రేపటి నుంచి వాకింగ్ చేద్దాం, వచ్చేవారం షటిల్‌ ఆడతాం అనుకోవడమే కానీ... రోజువారీ హడావుడిలో పడి అలాంటి నిర్ణయాలు ఏవీ పాటించలేకపోతున్నాం. అయితే గుడ్డిలో మెల్లగా దీనికో పరిష్కారం ఉందంటున్నారు.   ఫిన్లాండుకి చెందిన కొందరు పరిశోధకులు... కూర్చునీ కూర్చునీ ఉండే జీవిత విధానంలో ఏదన్నా మార్పు తీసుకురావడం సాధ్యమా అని ఆలోచించారు. ఇందుకోసం ఓ 133 మందిని ఎన్నుకొన్నారు. వీరందరికీ, ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వీరి జీవిత విధానాన్ని గమనించిన పరిశోధకులకు... వాళ్లంతా రోజుకి ఇదున్నర గంటలు ఆఫీసులోనూ, నాలుగు గంటలు ఇంట్లోనూ కూర్చునే గడిపేస్తున్నారని అర్థమైంది. ఇలా కూర్చుని ఉండే సమయంతో ఎంతో కొంత మార్పు తీసుకువచ్చే అవకాశం ఉందేమో చూడమని సదరు అభ్యర్థులందరికీ సూచించారు.   పరిశోధకుల సూచన మేరకు అభ్యర్థులంతా తమ జీవనశైలిలో చిన్నపాటి మార్పులు చేసే ప్రయత్నం చేశారు. పని మధ్యలో కాస్త లేచి అటూఇటూ పచార్లు చేయడం, ఇంట్లో చిన్నాచితకా పనులలో పాల్గొనడం, పిల్లలతో కాసేపు ఆడుకోవడం లాంటి ప్రయత్నాలు చేశారు. ఇలా నెలా రెండు నెలలు కాదు.. దాదాపు ఏడాది పాటు ఈ ప్రయత్నం సాగింది.   ఏడాది తర్వాత సదరు అభ్యర్థులు జీవితాలని మరోసారి గమనించారు పరిశోధకులు. ఆ సందర్భంగా వారు కూర్చుని ఉండే సమయం, ఓ 21 నిమిషాల పాటు తగ్గినట్లు గ్రహించారు. ఓస్‌ ఇంతే కదా! 20 నిమిషాల తగ్గుదలతో ఏమంత మార్పు వస్తుంది అనుకునేరు. ఈ కాస్త మార్పుతోనే షుగర్‌ లెవెల్స్ అదుపులోకి రావడం గమనించారు. కాలి కండరాలు కూడా మరింత బలంగా మారాయట. గుండెజబ్బు వచ్చే ప్రమాదం కూడా తగ్గినట్లు బయటపడింది.   అంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఓ పడీపడీ వ్యాయామాలే చేయనవసరం లేదు. ఎప్పుడో అప్పుడు వ్యాయామం చేయవచ్చు కదా అని నిర్లక్ష్యం చేసేలోగా పరిస్థితి అదుపు తప్పిపోతుంది కదా! అందుకని ఉన్నంతలోనే కాస్త కాలుని కదిపే ప్రయత్నం చేయమని ఈ పరిశోధన సూచిస్తోంది. అంతేకాదు! ఇంట్లో పెద్దలు కనుక ఇలా చురుకుగా ఉంటే... వారిని చూసి పిల్లలు కూడా కాస్త చురుకుగా మెదిలే ప్రయత్నం చేస్తారట. - నిర్జర.  

కాళ్లకు చెప్పులు లేకుండా ఫోర్డ్ కంపెనీకి వెళ్లిన కుర్రాడు

రాజస్థాన్,ఉదయపూర్ కి చెందిన "భవేష్ లోహార్" కి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. మహా పురుషులవుతారు. అనే మాట సరిగ్గా సరిపోతుంది. "మనం నిద్రలో కనేది కాదు కల-మనకు నిద్రలేకుండా చేసేది కల" అని అబ్దుల్ కలాం చెప్తారు. భవేష్ జీవితం ఈ మాటలకి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.  తన లక్ష్యం కోసం ఎన్నో నిద్రలేని రాత్రుల్ని జయించాడు.సాధారణమైన గృహ నిర్మాణ పనులకు వెళ్లే కార్మికుడి యొక్క కొడుకు భవేష్. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబ నేపధ్యం. కానీ తన ఆర్ధిక పరిస్థితి కి కుంగిపోలేదు. కష్టపడి చదివాడు. గెలిచాడు. ఫోర్డ్ కంపెనీ లో ఇంజనీర్ గా ఉద్యోగం సాధించాడు. ఈ ప్రయాణంలో  వెన్నంటే ఉండి ప్రోత్సహించి స్నేహితులకు, తన కోసం ఎంతో త్యాగం చేసి కుటుంబ పోషణ కోసం కూలీ పనులకు వెళ్లిన తల్లికి, సోదరిమణులకు కృతజ్ఞతలు తెలుపుతూ భవేష్ "లింక్డ్ ఇన్" అనే సామాజిక మాధ్యమంలో తన విజయనందాన్ని క్లుప్తంగా చెప్తూ పోస్ట్ చేసాడు. ఇది బాగా వైరల్ అవుతుంది.  భవేష్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భోపాల్ లో ఇంజినీరింగ్ విద్యార్థి. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ కష్టపడి కొడుకుని చదివించారు. కరోనా మహమ్మారి కష్టకాలంలో హాస్టల్ మూసేయడంతో భవేష్ చేసేదేమీ లేక ఇంటికొచ్చాడు. ఒకే ఒక గది కలిగిన రూమ్. తనతో చేర్చి ఆరేడుగురు కలిసి ఆ ఇంట్లో ఉండాలి. అయితే అందులోనే తనకి ప్రత్యేకమైన గదిని తనకి అనుకూలంగా తయారు చేసుకొని పట్టుదలగా చదివాడు. ఆ చిన్న గదినుంచే ఆన్లైన్ ఇంటర్వ్యూలు ఎదుర్కొన్నాడు. ఆ చిన్న గదినుంచే ఎన్నో ఆన్లైన్ పరీక్షలు రాసాడు. చివరకి తనకి ఎంతో ఇష్టమైన ఫోర్డ్ కంపెనీ లో ఇంజనీర్ గా ఉద్యోగం సాధించాడు. ◆భవేష్ ఏం చెప్పాడు.. చిన్నపుడ ఎండకు కాలిపోయే హైవే వెంట నడుచుకుంటూ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేవాన్ని. దారి వెంట వెళ్లేటప్పుడు కనిపించే కార్లని చూసి స్నేహితులతో పెద్దయ్యాక గొప్ప ఉద్యోగం సాదించాక  పెద్ద కార్  తీసుకోవాలి అని, అలా కార్లమీద ప్రేమని పెంచుకొన్నాను. అప్పట్లో వార్తా పత్రికల్లో వచ్చే ఫోర్డ్ కంపెనీ కార్ల ప్రకటనలు ఎంతో ఆకర్షించేవి.ఆ రోజులు మర్చిపోను. ఎపుడూ గుర్తుపెట్టుకుంటాను. నా తల్లి ఏరోజు కోసం ఎదురు చూసిందో ఆరోజు వచ్చింది. ఈరోజు నేను ఫోర్డ్ మోటార్ కంపెనీ లో ఇంజనీర్ గా ఉద్యోగం సాధించాను. నా ప్రయాణంలో అనుక్షణం వెన్నంటే ఉండి, తమ సొంత కలల్ని త్యాగం చేసి నేను ఈ స్థాయికి రావడానికి కారకులైన అక్కలకు నా కృతజ్ఞతలు. చిన్నపుడు ఏడు ఎనిమిది వేల జీతంతో కుటుంబ పోషణ కూడా కష్టంగా ఉన్న రోజుల్లో అమ్మ ఇళ్ల పనికి వెళ్లి కుటుంబానికి, నా కళాశాల చదువుకు ఆసరాగా నిలబడింది. పెద్దయ్యాక నేను ఉద్యోగంలో చేరితే నీకు పని చేసే అవసరం ఉండదు అని చెప్పిన మాటలు ఈరోజు నిజమయ్యాయి.  కళాశాల విద్య కోసం కొన్ని రోజులు పార్ట్ టైం ఉద్యోగం చేసాను. ఆ సమయాల్లో కళాశాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. నా జీవితంలో ఈ పోరాటాలన్నీ నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కష్టాలన్నీ నన్ను మరింత రాటు తేల్చాయి అనుకుంటున్నా. ఇంతకన్నా కఠినమైన జీవితాన్ని ఎదుర్కొంటున్న విద్యార్థులు ఉన్నారని నాకు తెలుసు. అయితే మన సంకల్పం గొప్పగా ఉండి నిజాయితీగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనం అనుకున్నది సాదించగలం. గీతలో చెప్పినట్లు "కర్మ కియే జా ఫాల్ కి చింతా నా కర్” దేవుడు ముందుగానే  మనకోసం మంచి జీవిత ప్రణాళికలను అనుకుంటాడు. నా ప్రయాణంలో సహకరించి స్ఫూర్తిదాయకమైన మాటలతో నన్ను ముందుకు నడిపిన బబ్బర్ బయ్యాకి మరియు ఉద్యోగంలో చేరిన మొదటి రోజుని గుర్తుండిపోయేలా చేసిన శ్రీజన ఉపాధ్యాయ, యస్ రతి వైశాలి, ధనుంజయ్ సర్ కి నా కృతజ్ఞతలు. ఇలా "భవేష్ లోహార్" తన స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు.  ◆ వెంకటేష్ పువ్వాడ  

ఆనందానికి మార్గాలివే!

జీవితమనే ప్రయాణాన్ని ఆనందంగా సాగించాలని ఎవరికి మాత్రం అనిపించదు. కానీ ఏం చేస్తాం. నిరంతరం బోలెడు సమస్యలు. నిత్యం బోలెడు స్పర్థలు. ఆరోగ్యంగానూ, ఆర్థికంగానూ అంతా సవ్యంగానే ఉన్నా మనసులో ఏదో తెలియని వేదన. అదిగో అలాంటివారి కోసమే నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఇవి పాటస్తే మీ మనసు ఆనందంతో వెల్లివిరియడం ఖాయమంటున్నారు. ఆనందాన్ని నటించండి- ఈ విషయం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, మనసు ఏదో తెలియన బాధతో నిండిపోయినప్పుడు... ఆ బాధ స్థానంలో ఆనందాన్ని నిలిపి ఉంచే ప్రయత్నం చేస్తే ఉపయోగం ఉంటుందని అంటున్నారు. ఆవేశం, ఆక్రోశంతో చిరాకుగా ఉన్న మనసుని సంతోషంతో నింపేందుకు ప్రయత్నిస్తే మనలోని ప్రతికూలమైన అనుభూతులు తగ్గిపోతాయన్నది చాలామందికి అనుభవమైన విషయమే! ప్రకృతికి దగ్గరగా ఉండండి- మనిషికీ, ప్రకృతికీ మధ్య ఓ అవినాభావ సంబంధం ఉంది. అది ఫలానా అని చెప్పలేం కానీ ప్రకృతికి సంబంధించిన ఏ లక్షణాన్ని చూసినా మనసు ఆనందంతో నిండిపోతుందన్నది విజ్ఞానశాస్త్రం కూడా ఒప్పుకున్న విషయం. కాసేపు నీలాకాశాన్ని చూసినా, వెన్నెలలో గడిపినా, ఎగిరే పక్షుల గుంపుని గమనించినా, చెట్లని తడిమి చూసినా... మనసులో ఏదో తెలియని ప్రశాంతత చోటు చేసుకోవడాన్ని గమనించగలం. వర్తమానంలో జీవించండి- మనిషికి ఉండే అదృష్టమూ, దురదృష్టమూ అతని మెదడే! అది ఎంతగా విశ్లేషించగలదో అంతగా విచారించగలదు కూడా! అలాంటి మెదడుని గతం తాలూకు బాధాతప్తమైన జ్ఞాపకాలలోనో, భవిష్యత్తులో ఏం జరగనుందో అన్న భయాలతోనో కాకుండా... వర్తమానంలో నిలిపి ఉంచగలిగితే చాలావరకు వేదన తగ్గుతుంది. మనం ఎంత కాదనుకున్నా గతం అనుభవాల రూపంలోనూ, భవిష్యత్తు ప్రణాళికల రూపంలో ఎలాగూ మనలో సుడులు తిరుగుతుంటాయి. అంతకుమించి వాటిని పట్టుకు వేళ్లాడితే మిగిలేది వేదనే! జీవితం పట్ల స్పష్టత- జీవితం పట్ల చాలామందికి తమదంటూ ఓ అభిప్రాయం ఉండదు. ఏదో గాలికి సాగిపోయే నావలాగా అలాంటి జీవితాలు గడిచిపోతుంటాయి. సమాజం దృష్టిలో గొప్పవారనిపించుకోవడమో, తమ అహంకారాన్ని చల్లార్చుకోవడమో... వారి ప్రాధాన్యతలుగా ఉంటాయి. అంతేకానీ తన ప్రత్యేకత ఏమిటి? ఏం సాధిస్తే తన జీవితపు చివరిక్షణంలో తృప్తిగా శ్వాసని విడువగలం? అన్న ఆలోచన ఉండదు. కానీ అలాంటి ప్రశ్నలు మొదలైన తరువాత జీవితంలోని ప్రతిక్షణమూ విలువైనదిగా కనిపిస్తుంది. అలాంటి జీవితాన్ని గడుపుతూ, తన లక్ష్యం వైపుగా ఒకో అడుగూ వేస్తున్నప్పుడు తృప్తితో కూడిన ఆనందం లభిస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోండి- ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పిన మాటను పదే పదే ఒప్పచెబుతూ ఉంటాము. కానీ పీకలమీదకు వచ్చేదాకా దాని గురించి పెద్దగా పట్టించుకోం. రొజూ కాసేపు వ్యాయామానికి కేటాయించడం కాలయాపన కాదు. అది మన జీవితకాలాన్ని పెంచుకుంటూ కాలయముడికి దూరంగా ఉండటమే! అనారోగ్యంగా ఉన్న శరీరంతో మనసు కూడా చిన్నబోతుంది. అందుకని వ్యాయామం, శరీర శ్రమ, పోషకాహారం పట్ల ఎప్పుడూ అశ్రద్ధ వహించకూడదు. బంధాలను నిలుపుకోండి- మన దగ్గర డబ్బు ఉండవచ్చు. ఏదన్నా అవసరం వస్తే ఆ డబ్బుతో పని జరగవచ్చు. కానీ మనకోసం బాధపడే  ఓ నలుగురు మనుషులు లేనప్పుడు ఎంత డబ్బున్నా ఉపయోగం ఉండదు. డబ్బు లేకుండా ఈ లోకంలో పని జరగవచ్చు కానీ మనుషుల తోడు లేకుండా జరిగే పనిలో జీవం ఉండదు. టీవీ ముందు ఓ గంట గడిపేబదులు ఇంట్లోవారితే గడపితే ఉండే తృప్తి వేరు. పాతకాలపు మిత్రులని, బంధువులని అప్పుడప్పుడూ పరామర్శిస్తే మిగిలే అనుభూతి వేరు. ఆనందం ఫలానా లక్షణంలో ఉంది. ఫలానా పనిచేస్తే వస్తుంది అని ఐదారు కారణాలు చెప్పడం మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే ఆనందం మన మనసులో ఉంది. మరి ఏం చేస్తే అది వెలికివస్తుందో తెలుసుకోవడం మన చేతుల్లోనే ఉంది. అందుకనే ఆనందానికి సంబంధించి ప్రతి ఒక్కరికీ తమదైన ఓ జాబితా ఉంటుంది. మరి మీ జాబితా ఏమిటో శోధించి చూసుకోండి.   - నిర్జర.

ఎదుటి వాళ్ల స్టార్ మాన చేతుల్లో...

ఉరుకులు పరుగుల జీవితంలో క్షణం తీరిక లేకుండా ఉంటాము. ఎందుకంటే బ్రతుకు అనేది పెద్ద పోరాటం. ఆగితే కుదరదు. ఈ కరోనా పుణ్యమా అని బ్రతకడం ఒక యుద్ధం అయింది. ముఖ్యంగా యువత పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. ప్రైవేట్ స్కూళ్లు ఆన్లైన్ క్లాస్ ల తో వారి ఆదాయాన్ని రెట్టింపు చేసుకున్నాయి గానీ స్వార్థంతో అదనపు ఉద్యోగస్తులకు తొలిగించి ప్రైవేట్ టీచర్స్ ని రోడ్డున పడేసారు. ఇదేంటని అడిగే వ్యవస్థలు లేవు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో బ్రతుకునీడ్చడానికి ఎంతోమంది పట్టాదారులు, కొలువు పోయిన ప్రయివేటు టీచర్లు ఇంకా చాలామంది వివిధ అత్యవసర సేవా రంగాల్లో తక్కువ జీతాలకే ఉద్యోగాలు చేస్తున్నారు. ఓలా, ఉబర్, స్విగ్గీ, జామోటో, ఇంకా కొరియర్ సంబంధిత బడా సంస్థలు వాటి మాతృకతో వెలసిన ఇంకొన్ని సంస్థలు శ్రమను దోచుకుంటున్నాయి గానీ తగిన ప్రతిఫలం ఇవ్వడం లేదు. క్లిష్ట సమయాల్లో  ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా మనకి సేవలు అందించే మన యువతకి చేతనైన సహాయం చేయాలి . వెంటనే "మనం ఏమి చేయగలం " అనే ప్రశ్న అందరికీ కలుగుతుంది. అది ఎలాగో చెప్తాను. వారికి రేటింగ్ ఇవ్వడం ద్వారా ఎంతోకొంత మనం వారికి సపోర్ట్ గా నిలిచినవాళ్ళం అవుతాము. మనం ఇచ్చే స్టార్స్ మరియు కామెంట్స్ ద్వారా వారి జీతం వృద్ధి చెందుతుంది. ఇలా మనం ఇచ్చే రేటింగ్స్ ద్వారా వారియొక్క నిబద్ధతని గౌరవించినట్లు అవుతుంది. ఇది చాలా చిన్న విషయం. చాలామంది స్కిప్ చేయడం చూసాను. అందుకే ప్రత్యేకంగా చెప్తున్నాను. అయితే కొంతమంది పరిపక్వత లేకుండా ఐదునిమిషాలు లేట్ అయిందనో లేక తెచ్చిన ఆర్డర్ మారిపోయిందనో ఇలా రకరకాల కారణాలతో మన అహం చల్లార్చుకోవడానికి వారిని కోపగించుకుంటాము. ఒక అయిదు నిమిషాలు కూర్చొని ప్రశాంతంగా ఆలోచిస్తే "అయ్యో తొందరపడి కోప్పడ్డాము" అని పశ్చాత్తాప పడతాము. అందుకే అలాంటివారితో ప్రేమగా రెండు మాటలు మాట్లాడండి. స్వచ్ఛమైన ఒక చిరునవ్వుతో మిమ్మల్ని పరిచయం చేసుకుంటే అది అవతలవాళ్లకి ఎంతో స్వాంతన గా ఉంటుంది. నిరుత్సాహం దూరమై కొత్త ఉత్సాహం వారిలోకి వస్తుంది. ◆ముగింపు రేటింగ్ ఇవ్వడం మర్చిపోకండి. మీరిచ్చే రేటింగ్ వెనుక ఒక కుటుంబం ఆధారపడివుంటుంది అనేది అర్ధమయుంటుంది. ఇలా రుపాయి ఖర్చు లేకుండా అవతలివాళ్ళకి మనం చేయగలిగే సహాయలు చాలా ఉన్నాయి. ఇలాంటి విషయంలో క్షణం ఆలోచించకుండా సహాయపడండి. అది అవతలవాళ్లకి ఎంతో ఉపయోగపడుతుంది. ◆ వెంకటేష్ పువ్వాడ  

ఆ క్షణం... అడుగు ముందుకి వేస్తే

హరిత, నమిత ఇద్దరూ కవలపిల్లలు. ఇద్దరికీ సంగీతం అంటే ప్రాణం. ఏళ్ల తరబడి ఎంతో కష్టపడి సంగీతాన్ని నేర్చుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఈ ప్రపంచానికి తమ ప్రతిభని చూపించాలా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. ఊళ్లో జరిగే త్యాగరాయ ఉత్సవాలలో వాళ్లకి కూడా పాడే అవకాశం దక్కింది. అది వాళ్ల మొట్టమొదటి ప్రదర్శన కాబోతోంది. కార్యక్రమం ఇంకో నెల రోజులు ఉందనగా ఇద్దరూ విరగబడి అభ్యాసం చేశారు. ఒకరిని మించి ఒకరు రాగం తీశారు. ఇక వేదిక ఎక్కడమే తరువాయి అన్నట్లుగా ప్రదర్శని సిద్ధపడిపోయారు. కార్యక్రమం రోజున తమ కుటుంబంతోనూ, గురువుగారితోనూ కలిసి ఆడిటోరియంకు చేరుకున్నారు. కానీ లోపలకి వెళ్లగానే వాళ్లిద్దరి కాళ్లూచేతులూ వణకడం మొదలుపెట్టాయి. కార్యక్రమంలో భాగంగా ఒకొక్కరే వేదిక మీదకు వచ్చి తమ సంగీతాన్ని వినిపించసాగారు. ఇంతలో హరిత వంతు కూడా వచ్చేసింది. కానీ హరిత కాళ్లూ చేతులూ వణుకుతున్నాయి. భయంతో ఆమె కళ్లు తిరుగుతున్నాయి. అడుగు ముందుకు వేయడం కంటే వెనక్కి తిరిగి పారిపోవడం తేలిక అనిపిస్తోంది. కళ్ల ఎదురుగుండా ఎత్తయిన వేదిక, ఆ వేదికని ఎక్కాక వందల మంది ముందు పాడాలి, ఆ పాటలో తడబడితే నవ్వులపాలు కావాలి.... లాంటి ఆలోచనలన్నీ ఆమె మనసులోని దూసుకువస్తున్నాయి. కాసేపటికి ఏ ఆలోచనా లేకుండా కేవలం భయం మాత్రమే ఆమె మెదడంతా నిండిపోయింది. అంతే! తను ఉన్న కుర్చీలో మరింత వెనక్కి, మరింత లోతుకి దిగబడిపోయింది. హరిత పరిస్థితి చూసిన వాళ్ల గురువుగారు ఆమెని బలవంతం చేయలేదు. తర్వాత నమిత వంతు వచ్చింది. నమిత కూడా హరితలాగానే భయపడిపోయింది. ఆమె ఒళ్లంతా చల్లబడిపోయింది. కానీ తడబడే అడుగులు వేస్తూ వేదిక దిశగా బయల్దేరింది. తాను ఎక్కడ తూలిపోతుందో అన్నంత నిస్తేజం నమితను ఆవహించింది. కానీ ఎలాగొలా వేదికను ఎక్కేసింది. అక్కడ మైకుని చూడగానే ఆమె చేతులు వణికాయి. ముందున్న జనాన్ని చూడగానే ఇక తను పాడలేననుకుంది. అంత భయంలో పాడటంకంటే చచ్చిపోవడం తేలికనిపించింది. అయినా బలవంతంగా పాటని మొదలుపెట్టింది. నమిత ప్రదర్శన ఒక మాదిరిగా సాగింది. మధ్యమధ్యలో కొన్ని అపశృతుల దొర్లాయి. కొన్ని గతులు తప్పాయి, కొన్ని చోట్ల స్వరం పలకలేదు. తన ప్రదర్శన తనకే పేలవంగా తోచింది నమితకి. కానీ ప్రేక్షకులేమీ పగలబడి నవ్వలేదు. బ్రహ్మాండం ఏమీ బద్దలవలేదు. ‘ఈసారి మరికాస్త బాగాపాడు’ అంటూ గురువుగారు ప్రోత్సహించారు. ‘మొదటిసారైనా బాగా పాడావు’ అంటూ తల్లిదండ్రులు మురిసిపోయారు. అన్నింటికీ మించి తాను మరోసారి వేదికని ఎక్కి పాడగలను అన్న నమ్మకం కలిగింది నమితకి. మరోసారి ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో అన్న ఆశ మొదలైంది. హరిత, నమిత ఇద్దరూ కవల పిల్లలు. ఇద్దరిదీ ఒకటే మనస్తత్వం. ఇద్దరిదీ ఒకటే ప్రతిభ. ఇద్దరూ ప్రదర్శన కోసం తగినంత కృషి చేశారు. వేదిక దగ్గరకు చేరుకోగానే ఇద్దరూ విపరీతంగా భయపడిపోయారు. జీవితాన్ని మలుపు తిప్పే సమయంలో హరిత తన భయానికి లోబడిపోయింది. నమిత బలవంతంగా దాని అవతలి ఒడ్డుకి చేరకుని... అంతగా భయపడాల్సినంత ఖర్మ లేదని తెలుసుకుంది. ఆ అవగాహన ఆమెలో ఓ స్థైర్యాన్ని నింపింది. వందలాది ప్రదర్శనలు ఇచ్చే జీవితానికి బాట వేసుకుంది. హరిత కూడా ఆ ఒక్క క్షణం తన భయాన్ని ఓర్చుకోగలిగితే ఎంత బాగుండేది! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.

ప్రతి వస్తువుకీ ఉంటుంది ఓ ఎక్స్పైరీ డేటు

మందులు వేసుకునేటప్పుడు వాటికి ఎక్స్పైరీ దగ్గరపడిందేమో అని ఒకటికి రెండుసార్లు చూసుకుంటాం. బ్రెడ్డు, జాము, సాస్ లాంటి పదార్థాలు తినేటప్పుడు వాటిని తయారుచేసిన తేదీని చూసుకుంటాం. ఆఖరికి గోధుమపిండీ, ఇడ్లీరవ్వా వాడేటప్పుడు కూడా వాటి ఎక్స్పైరీ గమనించుకుంటాం. కానీ రోజూ వాడే వస్తువులకి కూడా ఓ ఎక్స్పైరీ డేట్ ఉంటుందనే విషయం అస్సలు గమనించుకోము. వాటిని ఎందుకు గమనించుకోవాలో ఇప్పుడు చూద్దాం...   దిండు (Expiry రెండేళ్లు)     దిండుని వాడగా వాడగా దాని ఆకారమే మారిపోతుంటుంది. తల పెట్టే చోట దిగబడిపోతుంది. అదే దిండుతో పడుకుంటే మెడకి సంబంధించిన సమస్యలు ఖాయం అంటున్నారు. అంతేకాదు! రోజుల తరబడి దిండుని వాడటం వల్ల దానిలో అణువణువూ దుమ్ముకణాలతో (డస్ట్ మైట్స్) నిండిపోతాయి. ఇవి చర్మవ్యాధుల దగ్గర్నుంచీ ఊపిరితిత్తుల సమస్యల వరకూ అనేక ఇబ్బందులకి దారితీస్తాయి.   టూత్ బ్రష్ (Expiry మూడునెలలు)     ఈ మధ్య ప్రకటనల్లో మనం తరచూ వింటున్న మాటే ఇది. రెండు మూడు నెలలపాటు పళ్లు తోముకున్న తర్వాత బ్రష్ అరిగిపోవడం సహజం. ఒకవేళ అరగకపోయినా కూడా బ్రిసిల్స్ గట్టిపడిపోవడం మాత్రం ఖాయం. అలాంటి బ్రష్తో తోముకోవడం వల్ల పళ్లు దెబ్బతినక మానవు. పైగా జలుబు, దగ్గులాంటి సందర్భాలలో మన ఒంట్లో ఉండే రోగక్రిములు బ్రష్ మీదకు కూడా చేరుకుంటాయి.   అంటుగుడ్డలు (Expiry వారం)     మన ఇంట్లో వాడే అంటుగుడ్డలు ఎంత భయంకరంగా ఉంటాయో.... ఒక్కసారి వంటింట్లోకి తొంగిచేస్తే తెలుస్తుంది. అయినాసరే వీటిని నెలల తరబడి వాడేయడం ఓ వైపరీత్యం. అంటుగుడ్డలో ఉండే మురికి వల్ల నానారకాల బ్యాక్టీరియా దాని మీద ఉంటుందనీ... పైగా తడిగా ఉండటం వల్ల ఆ బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. 89 శాతం అంటుగుడ్డల మీద ఈ.కోలీ లాంటి భయంకరమైన సూక్ష్మజీవులు ఉన్నట్లు తేలింది. అందుకని వీటిని వారం మించి వాడవద్దని నిర్మొహమాటంగా సూచిస్తున్నారు.   చెప్పులు (Expiry ఆరునెలలు)     రన్నింగ్ షూస్ అయితే ఓ 300 కిలోమీటర్లు నడిచాక అరిగిపోవడం సహజం. అలాగే చెప్పులు కూడా ఆ ఆర్నెళ్ల తర్వాత అరిగిపోవడం లేదా గట్టిపడటం జరుగుతుంది. ఇక వాటి మీద ఫంగస్ పేరుకునే ప్రమాదమూ లేకపోలేదు. అలాంటి పాదరక్షలు వాడటం వల్ల నడక మీదా, కాలి కండరాల మీదా ప్రభావం చూపుతుంది.   చాపింగ్ బోర్డు (Expiry ఏడాది)     ఈ రోజుల్లో కూరగాయలు తరిగేందుకు ప్రతి ఇంట్లోనూ చాపింగ్ బోర్డు కనిపిస్తోంది. కొన్నాళ్లకి దీని మీద గాట్లు పడి, మురికిమురికగా కనిపించడమూ సహజమే. ఆ గాళ్లలో సూక్ష్మజీవులు ఉండటమే సహజమే! ఇక మాంసం తరిగితే పరిస్థితి చెప్పనవసరం లేదు. పైగా చెక్కతో చేసిన చాపింగ్ బోర్డులో అయితే సూక్ష్మజీవులు ఉండే అవకాశం మరింత ఎక్కువ. మన టాయిలెట్ సీటు మీద కంటే ఇలాంటి చాపింగ్ బోర్డుల మీదే ఎక్కువ బ్యాక్టీరియా కనిపిస్తుందని ఓ పరిశోధన తేల్చింది.   ఇవే కాదు దువ్వెనలు, పౌడరు అద్దుకునే స్పాంజిలు, కార్పెట్లు, దుప్పట్లు.... ఇలా మన కంటికి కనిపించే ప్రతి వస్తువుకీ ఓ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ విషయాన్ని గమనించకుండా ప్రతి వస్తువునీ నెలలు, సంవత్సరాల తరబడి వాడుతుంటే సమస్యలు తప్పవు. - నిర్జర.  

ఓర్పు జీవితాన్ని శాసిస్తుందా?

‘Patience pays’ అని ఆంగ్లంలో ఒక సూక్తి ఉంది. ఓర్పుగా ఉండాల్సిన అవసరం గురించీ, అసహనం వల్ల కలిగే నష్టాల గురించీ మన ఇతిహాసాలలో లెక్కలేనన్ని కథలు ఉన్నాయి. కానీ ఉరుకులుపరుగులతో సాగే ఈనాటి జీవితంలో ఓర్పు అవసరమేనా? అన్న సందేహం కలుగక మానదు. అవసరమే అని నిరూపిస్తోంది ఓ పరిశోధన. 50 ఏళ్లుగా ఈ ప్రపంచానికి ఓర్పుగా ఉండమని హెచ్చరిస్తోంది. అదే...   Marshmallow experiment   మార్ష్‌మలో అనేది పాశ్చత్య దేశాలలో విరివిగా దొరికే ఒక తీపి పదార్థం. అక్కడి పిల్లలకు ప్రాణం. ముఖ్యంగా, రకరకాల చిరుతిళ్లు అందుబాటులో లేని 1960వ దశకంలో మార్ష్‌మలో కోసం పిల్లలు తెగ పేచీ పెట్టేవారు. పిల్లల్లో ఉండే ఈ బలహీనత ఆధారంగా వారిలో ఏ మేరకు సహనం ఉందో పరీక్షించాలనుకున్నాడు... స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ‘వాల్టర్‌ మిషెల్‌’ అనే మనస్తత్వ శాస్త్రవేత్త. అందుకోసం తన విశ్వవిద్యాలయం ఆవరణలో ఉన్న ఒక బడిని ఎంచుకున్నాడు.   సహనంతో ఉంటే బహుమతి     వాల్టర్‌ మిషెల్‌ తన పరిశోధన కోసం 4-6 సంవత్సరాల మధ్య వయసు ఉన్న కొందరు పిల్లలను ఎంచుకొన్నాడు. వారిని ఒంటరిగా ఒక గదిలో ఉంచి, వారి ముందర ఒక మార్ష్‌మలోని ఉంచారు. ‘నువ్వు కనుక ఈ మార్షమలోని కాసేపు తినకుండా ఉండగలిగితే, నేను తిరిగి వచ్చి ఇంకో మార్షమలోని బహుమతిగా ఇస్తాను’ అని ఆ పిల్ల/పిల్లవాడికి చెప్పారు. ఇక అప్పటి నుంచి చూడాలి ఆ పిల్లల తిప్పలు. కళ్ల ముందు ఊరిస్తున్న మార్ష్‌మలోని తినకుండా ఉండేందుకు వారు రకరకాల విన్యాసాలు చేశారు. కొందరు తలతిప్పుకున్నారు. కొందరు దాన్ని నాకి తిరిగి పెట్టేశారు. కొందరు పాటలు పాడుతూ కూర్చున్నారు. ఇంకొందరు ఇవేవీ చేయకుండా..... గబుక్కున ఆ మార్ష్‌మలోని తీసుకుని నోట్లో వేసేసుకున్నారు. వెధవ బహుమతి పోతే పోయింది అనుకున్నారు.   పిల్లలాట కాదు!     మొత్తానికి ఒక మూడోవంతు మంది పిల్లలు మాత్రమే రెండో మార్ష్‌మలోతో పరిశోధకులు వచ్చేదాకా, ఓపికగా ఎదురుచూసినట్లు తేలింది. అయితే ఇదేదో సరదా కోసం చేసిన పరిశోధన కాదు! చిన్నతనంలోనే ఓర్పుని అలవర్చుకున్న పిల్లల జీవితం పెద్దయ్యాక ఎలా ఉంటుంది అని తెలుసుకునేందుకు సాగిన ఒక ప్రయత్నం. ఒక పదేళ్ల తరువాత, ఇరవై ఏళ్ల తరువాత... ఆఖరికి ఈ మధ్యకాలంలో కూడా వీరందరి జీవితాలను గమనించినప్పుడు, అసాధారణమైన వ్యత్యాసం కనిపించింది. అప్పట్లో ఓర్పుగా ఉన్న పిల్లలు తరువాత రోజుల్లో మంచి మార్కులను సాధించడం కనిపించింది. వ్యసనాలకు లోనవడం, ఒత్తిడికి గురవడం, ఊబకాయం బారిన పడటం.... వీరిలో తక్కువగా బయటపడ్డాయి. అప్పట్లో ఓర్పు లేని పిల్లలతో పోలిస్తే, వీరిలో సామాజిక నైపుణ్యాలు కూడా చాలా మెరుగ్గా ఉన్నట్లు తేలింది. ఆఖరికి ఓర్పు ఉన్నవారు, లేనివారి మధ్య మెదడు పనితీరులో కూడా మార్పులు ఉండటాన్ని గమనించారు.   మార్ష్‌మలో పరిశోధన పిల్లలకే కాదు, పెద్దలకు కూడా ఒక గుణపాఠమే! ఎందుకంటే ఓర్పుని అలవర్చుకోవడం ఎవరికీ అసాధ్యం కాదు. నాలుగేళ్ల పిల్లలే సహనంతో ఉండగలిగితే... 40 ఏళ్ల పెద్దలకు అదేమంత భారం కాబోదు. పైగా ఓర్పుని సాధించేందుకు మన భారతీయుల దగ్గర ధ్యానం, యోగ, గీతాబోధ వంటి సాధనాలు ఉండనే ఉన్నాయి. మరెందుకాలస్యం! మనమూ ఆ ఓర్పుగా ఉన్న పిల్లలని అనుసరిద్దాం! జీవితంలో అమృతఫలాలను బహుమతిగా సాధిద్దాం.   - నిర్జర.

సంతోషం ఎక్కడ ఉంది!

అనగనగా ఓ మంత్రిగారు. ఆయన రోజూ తన భవనం నుంచి రాజుగారి మహలుకి ఓ పల్లకీలో వెళ్తూ ఉండేవాడు. అలా వెళ్తూ ఉండగా, దారిలో కనిపించే ప్రజలను గమనించడం చాలా ఆసక్తిగా ఉండేది. వాళ్ల నడకలో ఉండే హడావుడి, వాళ్ల మొహాల్లో కనిపించే ఆందోళన చూసి ఆయన తెగ తృప్తి పడిపోయేవాడు. వాళ్లందరితో పోల్చుకుంటే తను ఎంత గొప్ప స్థితిలో ఉన్నానో కదా అని మురిసిపోయేవాడు. అలా కాలం గడిచిపోతూ ఉండగా, ఓ రోజు మంత్రిగారికి కొత్తగా వెలసిన గుడారం కనిపించింది.    దాని పక్క నుంచి వెళ్తుంటే ఆ గుడారంలో కూర్చుని టోపీలు కుట్టుకుంటున్న ఓ నడివయసు మనిషి కనిపించాడు. మంత్రిగారికి అలాంటి దృశ్యాలు కొత్తేమీ కాదు. కానీ ఆ మనిషి మొహంలో కనిపించిన ప్రశాంతతే చాలా ఆశ్చర్యం కలిగించింది. ‘ఇవాళ ఏదో మంచి బేరం తగిలినట్లుంది. అందుకనే అంత సంతోషంగా ఉన్నాడు’ అనుకుంటూ ముందుకు సాగిపోయాడు మంత్రిగారు. కానీ చిత్రమేమిటంటే ఒక రోజు తరువాత మరో రోజు… ఆ టోపీల వ్యాపారి మొహంలో అదే రకమైన సంతోషాన్ని గమనించాడు మంత్రిగారు.    ఇక ఉండపట్టలేక కొన్నాళ్లకి తన పల్లకీ దిగి గుడారంలోకి అడుగుపెట్టాడు. ‘ఏం పెద్దాయనా చాలా సంతోషంగా ఉన్నావు! బేరాలు అంత బాగుంటున్నాయా?’ అని పలకరించారు మంత్రిగారు. ‘బేరాలా! ఏదో అప్పుడొకటి అప్పుడొకటి వస్తున్నాయంతే!’ అన్నాడు వ్యాపారి చిరునవ్వుతో. ‘అయితే మీ కుటుంబంలో ఏదో శుభకార్యం ఉండి ఉంటుంది. అందుకనే అంత ఆనందంగా ఉన్నావు’ అని ఊహించాడు మంత్రి.   ‘అలాంటిదేమీ లేదండీ! జీవనోపాధిని వెతుక్కుంటూ మా కుటుంబం అంతా తలో దిక్కున బతుకుతున్నాం. మేమంతా ఎప్పటికి కలుస్తామో కూడా మాకే తెలియదు!’ అని బదులిచ్చాడు వ్యాపారి. ‘ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు కదా పెద్దలు. బహుశా నీ ఆరోగ్యం చాలా బాగుండి ఉంటుంది. అందుకే ఇంత తృప్తిగా కనిపిస్తున్నావు’ అన్నాడు మంత్రి. ‘ఆరోగ్యమా! ఇదిగో ఈ చిల్లుల గుడారాన్ని చూస్తున్నారు కదా! పొద్దున్న పూట ఎండలో సగం నా మీదే పడుతుంది. ఇక రాత్రిళ్లు ఎముకలు కొరికే చలిలో వణుకుతూ పడుకోవల్సిందే. ఆ చలికి పళ్లు పటపట కొరకడం వల్ల సగం పళ్లు ఊడిపోయాయంటే నమ్మండి!’ అంటూ చిరునవ్వుతో బదులిచ్చాడు వ్యాపారి.   వ్యాపారి జవాబులన్నీ విన్న మంత్రికి సహనం నశించిపోయింది. ‘డబ్బులు లేవు, కటుంబానికి దూరంగా దేశదిమ్మరిలా తిరుగుతున్నావు. ఇక ఆరోగ్యమా అంతంత మాత్రం. అలాంటిది ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావయ్యా!’ ‘మీకు తెలియంది ఏముంది మంత్రిగారూ! శారీరకంగానూ, మానసికంగానూ నేను ఎదుర్కొనే ప్రతి కష్టమూ జీవితంలో భాగమే అని నేను నమ్ముతాను. అలాంటి కష్టాలు ఎప్పుడూ నేను ఎదిగేందుకే ఉపయోగపడేవి. అందుకే నేనెప్పుడూ వాటికి భయపడలేదు.    పైగా నాకు కష్టాన్ని ఇచ్చిన భగవంతుడే, దాన్ని సవాలుగా తీసుకుని దాటగల శక్తిని కూడా అనుగ్రహిస్తాడని నా నమ్మకం. కాబట్టి జీవితంలో ఎదురయ్యే ప్రతి ఇబ్బందినీ చిరునవ్వుతో ఎదుర్కొంటాను. ఆ రోజు ప్రశాంతంగా గడిచిపోతే భగవంతునికి కృతజ్ఞత చెప్పుకొంటాను. లేకపోతే, మరింత శక్తిని ఇవ్వమని ఆయనను వేడుకుంటాను… అంతే!’ అంటూ ముగించాడు వ్యాపారి. వ్యాపారి మాటలకి మంత్రిలో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి.

సాఫ్ట్ వేర్ వ్యవసాయం

కరోనాకి ముందు లాక్ డౌన్ అంటే ప్రపంచానికి పెద్దగా తెలీదు. దీని కారణంగా ఎంతోమంది ఉపాధిని కోల్పోయారు. ఆర్ధికంగా చితికిపోయారు. అయితే సాఫ్ట్ వేర్ రంగంలో పని చేస్తున్నవాళ్లపై కరోనా లాక్ డౌన్ ప్రభావం తక్కువనే చెప్పాలి. కారణం ఇంటి వద్దనుంచే పని చేసే వెసులుబాటు ఉండటం. అయితే  పని విధానం కొత్తగా ఉండటం. ఎప్పటికప్పుడు టీం సభ్యులతో ఫోన్ లో అందుబాటులో ఉండి చర్చల్లో పాల్గొనడం ఇలా కంపెనీ లో వెచ్చించే సమయంకన్నా వర్క్ ఫ్రం హోమ్ లో ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. దీనివలన ఎంతోమంది సాఫ్ట్ వేర్ యువత ఒత్తిడికి లోనై మానసిక సమస్యలకు గురవుతున్నారు. దీనిని అదిగమించేందుకు కొంతమంది ధూమపానం, మద్యపానం లాంటి వ్యసనాలకు దగ్గరవుతున్నారు అనేది కాదనలేని వాస్తవం. ప్రకాశం జిల్లా,కనిగిరి ప్రాంతం గార్లపేట గ్రామానికి చెందిన రాంబాబు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. లాక్ డౌన్ కారణంగా తను కూడాఇంటికి వచ్చేసాడు. అందరిలాగే పని ఒత్తిడి వలన ఇతను కూడా మొదట్లో కొంత ఇబ్బంది పడ్డాడు. అయితే దానిని అదిగమించేందుకు రొటీన్ కి భిన్నంగా  స్మార్ట్ వ్యవసాయాన్ని ఎంచుకున్నాడు. ఇంటి ఆవరణలోనే కూరగాయలు పండించాలి అనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవు విషయం తల్లిదండ్రులకు చెప్పాడు. కొంత వారి సహాయం కూడా తీసుకొని ఇంటి ఆవరణలోని మట్టిని తవ్వి  పరిసర ప్రాంతంలోనే ఎరువు తో మిశ్రమం అయిన మట్టిని తెప్పించి సత్తువ కలిగిన నేలను తయారు చేసాడు. నాణ్యమైన విత్తనాలు తెప్పించి నాటి చిన్న కూరగాయల తోటని సృష్టి చేసి స్నేహితులకు మిగతా గ్రామంలో యువతకు ఆదర్శంగా నిలబడ్డాడు రాంబాబు. ఇప్పుడు తనకే కాదు చుట్టుపక్కల వాళ్లకి కూడా తను పండించిన కూరగాయలను అందిస్తూ అందరి మన్ననలను అందుకుంటున్నాడు.  కుటుంబానిది వ్యవసాయ నేపధ్యమే అయినా వాణిజ్యపంటలే గానీ కూరగాయలు పండేవి కాదు. ప్రతి రెండు మూడు రోజులకు ఇంటికి కూరగాయలు అవసరమయ్యేవి. అవి అతనే మార్కెట్ కి వెళ్లి కొనుగోలు చేసుకొని వచ్చేవాడు. ఇలా రెండు నెలలు గడిచాక పని ఒత్తిడి, మరోవైపు తరచూ మార్కెట్ కి వెళ్లి ఇవి కొనుగోలు చేసుకురావడం చికాకుగా అనిపించింది. ఆ సమయంలో ఇంటి ఆవరణలోనే కూరగాయలు పండిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది. అలా తన స్మార్ట్ వ్యవసాయ ప్రయాణం మొదలైందని చెప్పుకొచ్చారు. ఈ పని వలన నిరంతరం ల్యాప్ టాప్ ముందు కూర్చొని ఉండే నాకు ఈ తోట పెంపకం మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని సంతృప్తిని ఇస్తుంది అన్నారు. రెండు అంకెల జీతం రాగానే పాశ్చాత్య పోకడలకు పోయి, అర్థంలేని వ్యాపకాల ప్రభావంతో వ్యసనాలకు అలవాటు పడి మన మూలలను మరిచిపోతున్న కొంతమంది యువతకు రాంబాబు ప్రయాణం ఆదర్శనీయం. ఆచరణీయం. మీరు కూడా కొత్తగా ఒకటి ప్రయత్నించండి. "ప్రతి ఆలోచనా ఒక అగ్నికణం. దానిని సన్మార్గంలో రగిలించి వెలిగించావంటే నీతోపాటు చుట్టూ సమాజాన్ని కూడా వెలిగిస్తుంది." ◆వెంకటేష్ పువ్వాడ  

పాట జీవితం అయిన వేళ

విజయవాడ, ఆటోనగర్ నుంచి ఎన్టిఆర్ సర్కిల్ కి వెళ్లే పంటకాలువ రోడ్ అది. లైఫ్ స్టైల్ సంబంధించి ఎదో కంటెంట్ రాయడానికి ఆలోచిస్తూ బుర్రకి ఏదీ గోచరించక పరధ్యానంగా ఇంటికి వెళ్తున్నా. వర్షం వచ్చేలా ఉందని ఎక్సలేటర్ కొంచెం రేజ్ చేసాను.  నాలుగు రోడ్ల కూడలికి వచ్చేసరికి  "హా.... నా గొంతు శృతిలోనా" అని ఒక రాగం శ్రావ్యంగా వినిపించింది.పాట కచేరీ ఎదో జరుగుతుందని అనుకున్నాను. ఇద్దరు అందకళాకారుల తమకి సహాయం చేయమని ఊరికే డబ్బులు అర్ధించకుండా వెచ్చని సాయంత్రాన్ని వింజామారాలతో చల్లార్చినట్లు మధురమైన గానంతో మత్తెక్కిస్తున్నారు. కాసేపు నిలబడి చూసాను. "పాట జీవితాన్ని అభిషేకిస్తున్నట్లు సుందర దృశ్యం కనిపించింది" నేను తీసిన చిత్రాలకి అపుడు విన్న పాటనే అతికించాను. *"నా గొంతు శృతిలోనా.....! నా గుండె లయలోనా.....! ఆడవే పాడవే కోయిలా...!"* *అవును మీ గొంతు శృతి, మీ గుండె లయ- మనసు ద్యుతితో కలిసిన మీ హృదయం నుంచి ఆ రాగం వస్తుంటే జీవితం తేనె కలిసిన లెమన్ టీ ఫ్లేవర్ లా ఫ్రెష్ గా ఉంది. కోయిలే కాదు ప్రాణం లేని రాళ్లు కూడా ఆడతాయి పాడతాయి* *"ఒక మాట పది మాటలై- అది పాట కావాలని"* *"ఒక జన్మ పది జన్మలై-అనుబంధం అవ్వాలనీ"* *మాట మాత్రమే కాదు మీ ఉచ్వాశ నిస్వాస లోంచి కూడా సంగీతమే వస్తుంది.నిలబడి విన్నోడికి అది తెలుస్తుంది. అలా వింటే ఎక్కడరా బాబూ లేనిపోని ఫిలాసఫీ ని నెత్తినేసుకొని అర్జంట్ గా సత్యం తెలుసుకొని సచ్చీలులం అయిపోతే మన ఘనకార్యాలన్నీ ఆగిపోతాయి అని మనిషికి భయం. మారడానికి మనిషి సిద్ధంగా లేడు అనిపిస్తుంది. అంతెందుకు ఈ సోదంతా రాస్తున్న నేను కూడా ఉన్నపలంగా మారిపోలేను. కానీ కొంచెం అయినా మారాలనిపిస్తుంది. ఒక సెకను ఆలోచిస్తే చాలా స్వల్పం అయిన విషయాలకు అశాంతికి తలుపులు తెరిచి ప్రశాంతతకు తాళాలేసుకొని ద్వేషాన్ని మోసే మన అజ్ఞానంలో కొంచెం మార్పు వస్తుందని చిన్న ఆశ* *ఒక జన్మ కాదు వంద జన్మలైనా సరే మీతోపాటు నా కళ్లు కూడా తీసేసుకొని అనుబంధం పంచుకోవాలని ఉంది.-ఆ కళ్లను సత్యం చూడలేని ఈ ప్రపంచానికి ఇవ్వు అని దేవుణ్ణి కోరాలని ఉంది.* జీవితం అంటే ఏంటి? అందులో జీవన విధానం అంటే ఏంటి? ఎలా బ్రతకాలి? ఎలా నడవాలి? ఎలా మాట్లాడాలి? ఎలా సర్వై కావాలి అని తెగ ఆలోచిస్తుంటాము. ఆ విషయం ఎవరైనా చెప్పాలి లేదా ఎక్కడైనా చూసి నేర్చుకోవాలి. ఎవరో చెప్పడం ఎందుకు? ఎక్కడో చదవడం ఎందుకు? చీకటి తప్ప వెలుతురు తెలీని ఆ అందకళాకారులను చూస్తే సరిపోతుంది కదా అనిపించింది. వారితో కలిసి "జీవితం తనని తాను అన్వేషించుకుంటుంది". "తనని తాను శోధించుకుంటుంది". శ్రీ శ్రీ గారు అంటారు "సాయంత్రం ఆరు అవుతుంది. గదిలో ఒక్కడినే ఉన్నాను. చీకటి చినుకుల్లా కురుస్తుంది" అని. కానీ వీళ్లకి చీకటి నిత్యం కుంభవృష్టిలా కురుస్తుంది. దాని వలన భౌతిక ప్రపంచం మాత్రమే చూడలేరు గానీ తమలోకి తాము సందర్శించుకొని అందమైన ప్రపంచానికి తారల్ని తగిలిస్తూ నిత్యం దేదీప్యమానంగా వెలుగుతుంటారు.  వారినీ, వారి పాటని,మాటని పది నిమిషాలు కదలకుండా వింటే ఈ ఉరుకులు, పరుగులు, అధికారం, హోదా, కష్టం, సుఖం, బాధా, బందీ,ఆధిపత్య,అహం, అహంకారం, పగలు, ప్రతీకరాలు,కక్ష్యలు, కార్పణ్యాలు, పనికిమాలిన ఎంటర్టైన్మెంట్ అంతా నాన్సెన్స్ లా అనిపిస్తుంది. ఇంత conflict లోంచి జీవితాన్ని అనుభవిస్తున్నాం కదా! వాళ్ళని చూస్తే అరే ఇంత మధురమైన, అందమైన, శ్రావ్యమైన, రాగవంతమైన, మనో వికాస ప్రకాశిక జీవితం ఇంత తేలికా? అనిపిస్తుంది.ఒక యూనిట్ జ్ఞానోదయం అయినా కలిగిస్తుంది. ఎందుకంటే పాట అక్కడ జీవితాన్ని అభిషేకిస్తుంది. ◆వెంకటేష్ పువ్వాడ    

జీవితాన్ని తట్టుకొని నిలబడాలంటే!

అది ఒక చిన్న ఊరు. ఆ ఊళ్లో రెండు అందమైన ఇళ్లు పక్కపక్కనే ఉండేవి. వాటి యజమానులు ఇద్దరూ స్నేహితులే. ఆ ఇద్దరు స్నేహితులూ కలిసి ఓ రోజు బజారుకి వెళ్లారు. వస్తూ వస్తూ ఓ రెండు మొక్కలు తెచ్చుకొన్నారు. తీరా ఇంటికి వచ్చాక మొదటి ఇంటి యాజమాని- ‘మనం సరదాగా ఒక పందెం వేసుకుందామా! ఇద్దరం ఒకేరకం మొక్కను తెచ్చుకొన్నాం కదా! వీటిలో ఏది బాగా పెరుగుతుందో చూద్దామా!’ అన్నాడు. ‘ఓ అదెంత భాగ్యం!’ అంటూ సవాలుకి సిద్ధమయ్యాడు రెండో యజమాని. మొదటి ఇంటి యజమాని పందేన్ని సీరియస్‌గా తీసుకున్నాడు. తను తెచ్చిన మొక్కని జాగ్రత్తగా నాటాడు. దాని కోసం ఎక్కడెక్కడి నుంచో ఎరువులు తీసుకువచ్చాడు. మూడుపూటలా మర్చిపోకుండా దానికి నీళ్లు పోసేవాడు. మొక్కలు బాగా పెరగడానికి ఇంటర్నెట్‌లో కనిపించే చిట్కాలన్నీ పాటించేవాడు. రెండో ఇంటి యజమాని మాత్రం తన మొక్క విషయంలో చాలా నిర్లిప్తంగా ఉన్నాడు. రోజూ ఉదయం కాస్త నీళ్లు పోయడం మాత్రమే చేసేవాడు. రోజులు గడిచేకొద్దీ మొదటి ఇంట్లో మొక్క ఏపుగా పెరగసాగింది. దాని ఆకులు నవనవలాడుతున్నాయి. పండ్లు, పూలతో ఆ చెట్టు చూడముచ్చటగా ఉంది. రెండో చెట్టు కూడా బాగానే ఉంది. కానీ మొదటి చెట్టుతో పోలిస్తే అది కాస్త కాంతివిహీనంగా కనిపిస్తోంది. ‘చూశావా! ఒక్క ఆర్నెళ్లలోనే నా చెట్టు ఎలా తయారైందో. ఇక నువ్వు ఓడిపోక తప్పదు,’ అంటూ రెండో ఇంటి యజమానిని రెచ్చగొట్టాడు మొదటి ఇంటి యజమాని. దానికి రెండో యజమాని ఓ చిరునవ్వు నవ్వి ఊరుకుండిపోయాడు. ఈ సంభాషణ జరిగిన రోజు రాత్రి పెద్ద గాలివాన వచ్చింది. ఉదయం లేచి చూసేసరికి ఏముంది? ముందురోజు వరకూ నవనవలాడుతూ కనిపించిన మొదటి ఇంటి చెట్టు కాస్తా వేళ్లతో సహా పక్కకి పడిపోయింది. రెండో చెట్టు మాత్రం ఏం జరగనట్లు నిబ్బరంగా కనిపించింది. ‘అదేంటి! ఇంత జాగ్రత్తగా పెంచిన చెట్టు ఇలా ఒరిగిపోయింది,’ అంటూ ఏడుపుమొహం పెట్టుకున్నాడు ఆ ఇంటి యజమాని. దానికి రెండో యజమాని చిరునవ్వుతో- ‘నువ్వు చెట్టుని అందంగా, ఎత్తుగా పెంచాలని చూశావు. దానికి పళ్లు, పూలు కాయాలని మాత్రమే చూశావు. అందుకే దాని అవసరానికి మించిన నీళ్లు అందించావు. ఎప్పటికప్పుడు కావల్సిన నీరు అందడంతో దాని వేళ్లు భూమి లోపలకి వెళ్లాల్సిన అవసరమే లేకుండా పోయింది. కానీ నేను నాటిని మొక్క ఎలాంటి పరిస్థితినైనా తట్టుకుని సహజంగా ఎదగాలని కోరుకున్నాను. అందుకే దానికి తగినంత సాయం మాత్రమే చేశాను. ఫలితం! నేను నాటిన మొక్క వేళ్లు భూమి లోతుకి వెళ్లాయి. ఎండకి ఎండి, వానకి తడిసి దాని కాండం బలపడింది. గాలివానని సైతం తట్టుకొని నిలబడింది,’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ కథ కేవలం మొక్కలకి సంబంధించింది మాత్రమే కాదు! పిల్లలు కూడా ఇంతే! వారికి ఏ కష్టమూ, లోకజ్ఞానమూ తెలియకుండా అవసరానికి మించిన సౌకర్యాలు అందిస్తుంటే... జీవితంలో అలజడి రేగినప్పుడు తట్టుకోలేరు. అలా కాకుండా వారు స్వతంత్రంగా ఎదిగే అవకాశం ఇస్తూ, ఒక కంట వారి అవసరాలను కనిపెడుతూ ఉంటే... ఎలాంటి తుఫానునైనా తట్టుకొని నిలబడతారు.                                   (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.

నరకమంటే ఏమిటి?

చివరికి ఓ రోజు ‘గురువుగారూ! మీరు ఇవాళ నాకు స్వర్గ నరకాల గురించి చెప్పి తీరాల్సిందే!’ అంటూ పట్టుపట్టాడు శిష్యుడు. దానికి గురువుగారు ‘సరే! నీకు ఓ అనుభూతిని కలిగిస్తాను. దాన్ని బట్టి నీకు స్వర్గం అంటే ఏమిటో, నరకం అంటే ఏమిటో తేలిపోతుంది’ అన్నారు. శిష్యుడు ఆ అనుభూతిని స్వీకరించేందుకు సిద్ధంగా తన కళ్లని మూసుకున్నాడు. శిష్యుడు కళ్లు మూసుకోగానే ఒక వింత దృశ్యం అతనికి కనిపించింది. ఆ దృశ్యంలో ఒక పెద్ద గది, ఆ గది మధ్యలో ఒక పెద్ద బల్ల ఉంది. ఆ బల్ల మీద రకరకాల ఆహార పదార్థాలు కనిపిస్తున్నాయి. తాజా పండ్లు, ఘుమఘుమలాడే కూరలు... ఇలా ఒకటీ రెండూ కాదు... మనిషి జిహ్వను రెచ్చగొట్టే సర్వపదార్థాలూ ఆ బల్ల మీద ఉన్నాయి. కానీ ఏం లాభం! ఆ బల్ల చుట్టూ ఉన్న జనాలకీ, బల్లకీ మధ్య అయిదేసి అడుగుల దూరం ఉంది. మనుషులు ఎంత గింజుకుంటున్నా ఆ బల్లని సమీపించలేకపోతున్నారు. అలాగని ఆ ఆహారపదార్థాలను అందుకునేందుకు ఏ ఉపాయమూ లేదా అంటే లేకనేం! ఒక అయిదు అడుగుల గరిటె వారికి అందుబాటులో ఉంది. కాకపోతే ఉన్న ఒకే ఒక్క గరిటె కోసం గదిలోని జనాలంతా కొట్టుకోవడమే సరిపోతోంది. ఒకవేళ ఎవరన్నా బలవంతుడు ఆ గరిటెను చేజిక్కించుకున్నా, దాంతో ఆహారాన్ని నోటి దాకా తెచ్చుకునేసరికి అందులోని పదార్థాలు నేలపాలై పోతున్నాయి. శిష్యుడు ఆశ్చర్యంగా ఆ దృశ్యాన్ని చూస్తున్నంతలో అది మాయమైపోయి మరో దృశ్యం కనిపించింది. అందులోనూ ఇదే పరిస్థితి. గది మధ్యలో పెద్ద బల్ల. ఆ బల్ల చుట్టూ అయిదేసి అడుగుల దూరంలో జనం. ఆ జనాలందరికీ ఒకటే గరిటె. కానీ వాళ్లంతా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. వారి ఆకలి తీరినట్లే ఉంది. గదిలో ఎలాంటి కొట్లాటలూ లేవు. ఎలాంటి హడావుడీ లేదు. అదెలా సాధ్యమా అని ఆశ్చర్యంగా చూసిన శిష్యుడికి, ఆ ప్రశాంతత వెనుక ఉన్న విషయం బోధపడింది. గదిలో ఉన్న ఒకే ఒక్క గరిటెనీ ఒకరి తరువాత ఒకరు అందుకుంటున్నారు. దాంతో ఆహారాన్ని నింపుకుని అవతలివారికి పెడుతున్నారు. గరిటె తమదాకా వచ్చేదాకా, తమ ఆకలి తీరేదాకా అంతా సహనంతో ఉన్నారు.   ఒక శిష్యుడికి ఏది స్వర్గం? ఏది నరకం? అన్న విషయమై ఎప్పుడూ సందేహంగానే ఉండేది. తన సందేహం గురించి గురువుగారిని ఎప్పుడు అడిగినా కూడా ఆయన ఓ చిరునవ్వు నవ్వేసి ఊరుకునేవారు. చివరికి ఓ రోజు ‘గురువుగారూ! మీరు ఇవాళ నాకు స్వర్గ నరకాల గురించి చెప్పి తీరాల్సిందే!’ అంటూ పట్టుపట్టాడు శిష్యుడు. దానికి గురువుగారు ‘సరే! నీకు ఓ అనుభూతిని కలిగిస్తాను. దాన్ని బట్టి నీకు స్వర్గం అంటే ఏమిటో, నరకం అంటే ఏమిటో తేలిపోతుంది’ అన్నారు. శిష్యుడు ఆ అనుభూతిని స్వీకరించేందుకు సిద్ధంగా తన కళ్లని మూసుకున్నాడు. శిష్యుడు కళ్లు మూసుకోగానే ఒక వింత దృశ్యం అతనికి కనిపించింది. ఆ దృశ్యంలో ఒక పెద్ద గది, ఆ గది మధ్యలో ఒక పెద్ద బల్ల ఉంది. ఆ బల్ల మీద రకరకాల ఆహార పదార్థాలు కనిపిస్తున్నాయి. తాజా పండ్లు, ఘుమఘుమలాడే కూరలు... ఇలా ఒకటీ రెండూ కాదు... మనిషి జిహ్వను రెచ్చగొట్టే సర్వపదార్థాలూ ఆ బల్ల మీద ఉన్నాయి. కానీ ఏం లాభం! ఆ బల్ల చుట్టూ ఉన్న జనాలకీ, బల్లకీ మధ్య అయిదేసి అడుగుల దూరం ఉంది. మనుషులు ఎంత గింజుకుంటున్నా ఆ బల్లని సమీపించలేకపోతున్నారు. అలాగని ఆ ఆహారపదార్థాలను అందుకునేందుకు ఏ ఉపాయమూ లేదా అంటే లేకనేం! ఒక అయిదు అడుగుల గరిటె వారికి అందుబాటులో ఉంది. కాకపోతే ఉన్న ఒకే ఒక్క గరిటె కోసం గదిలోని జనాలంతా కొట్టుకోవడమే సరిపోతోంది. ఒకవేళ ఎవరన్నా బలవంతుడు ఆ గరిటెను చేజిక్కించుకున్నా, దాంతో ఆహారాన్ని నోటి దాకా తెచ్చుకునేసరికి అందులోని పదార్థాలు నేలపాలై పోతున్నాయి. శిష్యుడు ఆశ్చర్యంగా ఆ దృశ్యాన్ని చూస్తున్నంతలో అది మాయమైపోయి మరో దృశ్యం కనిపించింది. అందులోనూ ఇదే పరిస్థితి. గది మధ్యలో పెద్ద బల్ల. ఆ బల్ల చుట్టూ అయిదేసి అడుగుల దూరంలో జనం. ఆ జనాలందరికీ ఒకటే గరిటె. కానీ వాళ్లంతా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. వారి ఆకలి తీరినట్లే ఉంది. గదిలో ఎలాంటి కొట్లాటలూ లేవు. ఎలాంటి హడావుడీ లేదు. అదెలా సాధ్యమా అని ఆశ్చర్యంగా చూసిన శిష్యుడికి, ఆ ప్రశాంతత వెనుక ఉన్న విషయం బోధపడింది. గదిలో ఉన్న ఒకే ఒక్క గరిటెనీ ఒకరి తరువాత ఒకరు అందుకుంటున్నారు. దాంతో ఆహారాన్ని నింపుకుని అవతలివారికి పెడుతున్నారు. గరిటె తమదాకా వచ్చేదాకా, తమ ఆకలి తీరేదాకా అంతా సహనంతో ఉన్నారు. తనకు కనిపించిన రెండు దృశ్యాలనూ తల్చుకుంటూ శిష్యుడు తన కళ్లని తెరిచాడు. కంటి ఎదురుగా గురువుగారు ఎప్పటిలాగే చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. ‘ఇప్పుడు అర్థం అయ్యిందా స్వర్గానికీ, నరకానికీ ఉన్న తేడా ఏమిటో!’ అన్నారు గురువుగారు. శిష్యుడు తలవంచుకున్నాడు. ‘నీకు కనిపించిన రెండు దృశ్యాలలోనూ పరిస్థితి ఒక్కటే! కానీ ఒకదానిలో మనిషి తాను సుఖపడటం లేదు, ఎదుటివాడికీ అవకాశాన్ని ఇవ్వడం లేదు. ఎంతసేపూ తన కడుపే నిండాలనే ఆలోచన ఉన్నప్పుడు ఇలాంటి నరకమే ఏర్పడుతుంది. మనిషి సంఘజీవి అని తెలుసుకుని, ఒకరికొకరు సాయపడినప్పుడు.... ఎదుటివాడి ఆకలీ తీరుతుంది, మన కడుపూ నిండుతుంది. స్వర్గం, నరకం ఎక్కడో కాదు... మన దృక్పథాలలోనే ఉన్నాయని ఇప్పటికైనా బోధపడిందా!’ అన్నారు గురువుగారు.  

మన బతుకుబండి స్టీరింగ్ మనచేతుల్లోని వుంది!

నేనీ మధ్య  నా చిన్నప్పటి ఫ్రెండ్ ని కలవటం జరిగింది.  ఎప్పుడూ చలాకీగా వుండే తాను, ఈమధ్య చాలా డల్ గా తయారైంది. విషయo ఏంటని అడుగుతే, తన భర్త ఉద్యోగ రీత్యా దూరంగా బదిలీ కావటం, పిల్లలు ఎదుగుతున్న, మాట వినకుండా అల్లరి చేయడం , శారీరకమైన మానసికమైన ఒత్తిడి పెరగటం, ఇవన్నీ నా వల్ల కావడం లేదు అని చెప్పుకుంటూ వచ్చింది. మనలో చాలా మంది కి  చాలా సార్లు, పరిస్థితులు గాడి తప్పినపుడల్లా , చీకాకు కలగటం, ఇక నా వల్ల కాదు అన్నట్టు, బాధ , అసహనం కలుగుతూ ఉంటుంది కదా, మరి ఈ పరిస్థితి నుంచి బయటడం ఎలా? మనం హైదరాబాద్ నుంచి బయలుదేరి , వంద కిలోమీటర్ల దూరం లో వున్న ఊళ్లో జరిగే కజిన్ పెళ్ళికి వెళ్లాలనుకున్నామనుకోండి, ఆ ఫీలింగ్  మనకు యెంత ఎగజయిట్మెంట్ ఇస్తుంది. పెళ్ళికి అందరూ వస్తారు , అందరిని కలవచ్చు , చాలా చాలా ఎంజాయ్ చేయచ్చు అని బయలుదేరుతాం. కదా.. ఓ రెండు గంటలు ఎక్స్ప్రెస్  హైవే లో నడిపాక, , పల్లెటూరు కి వెళ్లే చిన్న రోడ్డు లోకి టర్నింగ్ తీసుకుంటాం. అప్పటిదాకా హాయిగా డ్రైవ్ చేసిన మనకు, కుదుపులు వున్న కంకర రోడ్డు, రోడ్డు పై అక్కడక్కడా గుంతలు , మధ్యలో కారుకి అడ్డంగా వచ్చే , ఆవులు, మేకలు ఇవన్నీ ఎదురవుతుంటే, మన కారు స్పీయేడు కూడా తగ్గించాల్సి వస్తుంది. అవునా? ఇది ఎంత అసౌకర్యంగా వున్నా, మన ప్రయాణం కొనసాగిస్తాం. ఎందుకంటె, ఈ చిన్న చిన్న ఇబ్బందులు దాటుకుని గమ్యాన్ని దాటితే అక్కడ యెంత హ్యాపీనెస్ ఉంటుందో మనకు తెలుసు కనుక. అంతే కానీ, రోడ్డు బాగాలేదు, జర్నీ విసుగ్గా వుంది అని వెనక్కి వెళ్లి పోయావాలని ఎన్నడూ అనుకోము.  మన జీవితం కూడా, అచ్చముగా ఇలాగే ఉండాలి. ఇబ్బందులు వచ్చినప్పుడల్లా , ఈ కుదుపుల ప్రయాణం  తరువాత మళ్ళీ మన బతుకు బండి స్పీడు అందుకుంటుందన్న నమ్మకం ఉండాలి. జీవితం లో ప్రతీ ప్రయాణం, ప్రతీ అనుభవం మనకు కొత్త పాఠాలను నేర్పి, ధైర్యాన్ని ఇస్తూ ఉండాలి. అంతే కాదు, ఖాళీ గా, సాఫీ గా వున్నా రోడ్డు మీద నడిపే వాళ్ళు కాదు, ఒడిదొడుకులు వున్న రోడ్డు మీద నడిపేవాళ్ళు అసలు గొప్ప. అంతే కానీ, ఈ గుంతల రోడ్డు లో నడపటం నావల్ల కాదు అని స్టీరింగ్ వదిలేస్తే ఎలా ఉంటుంది? రోడ్డు సాఫీ గ లేనప్పుడే ఇంకాస్త జాగ్రత్తతో , ఒడుపుగా బండి ని నడపాలి. జీవితపు స్టీరింగ్ ని కూడా ఇలాగే ఒడుపుగా తిప్పడం నేర్చుకోవాలి.ఎలాంటి పరిస్థితుల్లోనూ, చేతులెత్తేయకుండా, పరిస్థితుల్ని చక్కదిద్దుకోవటం మన బాధ్యత.  జీవితం లో ఎత్తుపల్లాలు ఉంటేనే, మనం కొత్త విషయాలు నేర్చుకోవడానికి వీలవుతుంది. మన నైపుణ్యం ఏంటో తెలుసుకునే అవకాశం దొరుకుతుంది.  జీవితం లో, సంతోషం  సమస్యలు రెండు కలగలిపి ఉండటం సహజం, అలాంటి పరిస్థుల్లో హాయిగా నెగ్గుకు రావడమే అసలైన విజయం.  అందుకే, సమస్యలు వచ్చినపుడే, అవి మనకు కొత్త విషయాలు నేర్పే మాస్టార్లని , మనలోని ప్రతిభని వెలికి తీసే గురువులని గురుతుంచుకోండి.  -Bhavana  

పాతికేళ్లలోపే డిప్రెషన్‌ వచ్చేస్తోంది!

ఇంటర్నెట్‌ గురించి అవగాహన ఉన్నవారు ‘PRACTO’ అన్నపేరు వినే ఉంటారు. మనకి దగ్గరలో ఉన్న వైద్యుల వివరాలను అందచేస్తూ, అవసరమైతే వారితో ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్‌ లేదా చికిత్సను అందించే సంస్థే practo. వైద్యుల కోసం తమ సైట్‌ను సంప్రదించే వ్యక్తుల వయసు, అవసరాల ఆధారంగా ఈ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికను చూడగానే ఇప్పటి యువత మానసిక సమస్యలతో సతమతం అయిపోతుదని తేలిపోతోంది. ఆ నివేదికలో ముఖ్య అంశాలు ఇవిగో…   - మానసిక సమస్యల కోసం వైద్యులను సంప్రదించేవారిలో 79 శాతం మంది 30 ఏళ్ల లోపువారే! - 25 నుంచి 34 వయసువారితో పోలిస్తే.... 24 ఏళ్లలోపువారే మానసిక వైద్యులని సంప్రదించడం ఆశ్చర్యం కలిగించే విషయం.   - గతంతో పోలిస్తే డిప్రెషన్, ఉద్వేగం వంటి సమస్యలతో మానసిక వైద్యులని సంప్రదించేవారి సంఖ్య ఏకంగా 62 శాతం పెరిగిందట.   - తమ మానసిక సమస్యలకు ఆన్‌లైన్ ద్వారా వైద్యుల పరిష్కారాన్ని కోరాలనుకునేవారి సంఖ్య దాదాపు నాలుగింతలు పెరిగిందట. మానసిక సమస్య అనగానే సమాజం చిన్నచూపు చూడటం వల్లే ఎక్కువమంది ఆన్‌లైన్లోనే వైద్యులను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నారు.   - ముంబై, దిల్లీ, బెంగళూరు నగరాల్లో మానసిక వైద్యులను సంప్రదించేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. అలాగని మిగతా నగరాలు కూడా ఏమంత ప్రశాంతంగా ఉన్నాయని అనుకోవడానికి లేదు. గతంతో పోలిస్తే చెన్నై, కోల్‌కతా వంటి మహానగరాల్లో కూడా మానసిక వైద్యులని ఆశ్రయించేవారి సంఖ్య గణనీయంగానే పెరిగింది.   Practo అందిస్తున్న ఈ నివేదికని పూర్తిగా నమ్మడానికి లేదు. ఎందుకంటే యువత ఎక్కువగా ఆన్‌లైన్ మీద ఆధారపడుతుంది కాబట్టి... 30 ఏళ్లలోపు వారే ఈ సౌకర్యాన్ని ఎక్కువగా వినియోగించుకునే అవకాశం ఉంది. పైగా ఒకప్పుడు మానసిక సమస్య కోసం వైద్యుడి దగ్గరకి వెళ్లడం అంటే ‘నాకేమన్నా మెంటలా!’ అని నొచ్చుకునేవారు. కానీ ఇప్పటి యువత వైద్యుల కౌన్సిలింగ్ తీసుకోవడానికి  జంకడం లేదని తృప్తిపడాలేమో కూడా! కానీ ఇప్పుడిప్పుడే జీవితంలోకి అడుగుపెడుతున్న యువత మానసిక సమస్యలతో ఎందుకు సతమతం కావాల్సి వస్తోంది అన్నదే ఆలోచించాల్సిన విషయం. పిల్లలు ఎదుగుతున్న తీరులోనూ, ఎదిగాక వారు జీవించే విధానంలోనూ ఏదో లోటు ఉందేమో విశ్లేషించి తీరాల్సిందే! - నిర్జర.  

అతను ఇంటర్నెట్ని ముందుగానే ఊహించాడు

‘మార్షల్ మెక్లుహాన్’ – ఈ పేరుని చాలామంది విని ఉండకపోవచ్చు. కానీ ‘గ్లోబల్ విలేజ్’ అన్న పదాన్ని వినే ఉంటారు కదా! ఆ మాటని మొదటిసారి ఉపయోగించిన వ్యక్తే మార్షల్ మెక్లుహాన్. అంతేకాదు... సాంకేతికతకు, మీడియాకు సంబంధించి ఆయన చేసిన అనేక ప్రతిపాదనలు సంచలనం సృష్టించాయి. సరిగ్గా 106 ఏళ్ల క్రితం మార్షల్ కెనడాలో పుట్టాడు. మంచి చదువు చదువుకుని ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డాడు. అప్పుడే ప్రజలు నిదానంగా టీవీకి అలవాటుపడుతున్నారు. అదో అద్భుతం అనుకుని మురిసిపోతున్నారు. మీడియా అన్న పదం అప్పుడప్పుడే ప్రచారంలోకి వస్తోంది. ఆ సమయంలో మార్షల్ మీడియా గురించి ప్రత్యేకించి పుస్తకాలు రాయడం మొదలుపెట్టాడు. వాటిలో అనేక సిద్ధాంతాలు చేశాడు. మార్షల్ 1962లో The Gutenberg Galaxy అనే పుస్తకం రాశాడు. అందులో ఆయన మానవచరిత్రను నాలుగురకాలుగా విభజించాడు. * మొదటి దశ acoustic age- ఈ దశలో కేవలం వినికిడి ద్వారానే సమాచారం ఒకరి నుంచి ఒకరికి చేరుతుంది. * రెండో దశ literary age – ఈ దశలో నిదానంగా రాయడం అలవాటు అవుతుంది. ఆకుల మీదో, కాగితాల మీదో సమాచారాన్ని రాసుకుంటారు. * మూడో దశ print age – ఈ దశలో పుస్తకాలను ముద్రించడం సులువుగా మారిపోతుంది. కావల్సినంత సమాచారం పుస్తకాల రూపంలో దొరుకుతుంది. * నాలుగో దశ electronic age – ఈ దశంలో సమాచారం అంతా కూడా టీవీ, కంప్యూటర్ వంటి పరికరాల ద్వారానే ఒకరి నుంచి ఒకరికి చేరతాయి. మానవుడు మొదటి మూడు దశలనీ దాటేసి నాలుగో దశలోకి చేరిపోయాడనీ, ఇక మున్ముందు అంతా సమాచార విప్లవమే అని తేల్చి చెప్పేశాడు మార్షల్. అంతేకాదు! కంప్యూట్ అనే పరికరం కేవలం లెక్కలు చేయడానికే కాదునీ... పరిశోధనలు చేయడానికీ, ఒకరొకొకరు సమాచారం అందించుకోవడానికి సాయపడుతుందనీ ఊహించాడు. ఆ తర్వాత ఎప్పుడో 25 ఏళ్లకి కానీ జనాలకి ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రాలేదు. దీన్ని బట్టి మార్షల్ ఊహ ఎంత ఖచ్చితమైనదో తెలిసిపోతుంది. మీడియాదే రాజ్యమనీ మున్ముందు ప్రతి విషయాన్నీ మీడియా తనదైన దృష్టిలో ప్రజలకు చేరవేస్తుందనీ ఆనాడే పసిగట్టారు మార్షల్. అందుకే ‘the medium is the message’ అన్న మాటని ఉపయోగించారు. ‘మీడియా ఎంత చెబితే అంత’ అన్న భావం ఇందులో స్ఫురిస్తుంది. మార్షల్ బతికున్నంతకాలమూ ఆయన మాటల్ని ఎవరూ పెద్దగా నమ్మలేదు. తరచూ టీవీలూ, మేధావులూ ఆయనను తల్చుకున్నా... ఆయన మాటలు నిజమవుతాయని ఎవరూ భావించలేదు. కానీ 1980లో మార్షల్ చనిపోయిన పదేళ్ల తర్వాత ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావడం మొదలుపెట్టింది. ఇక ఆ తర్వాత జరిగినదంతా మనకి తెలిసిన చరిత్రే! ఏదన్నా పరిణామం జరిగిన తర్వాత దాని గురించి విశ్లేషించడం, అందులో మనం కూడా పాలుపంచుకోవాలని కోవడం సహజమే! కానీ భవిష్యత్తులో ఇలా జరగబోతోంది అని ముందుగానే ఊహించడం గొప్ప లక్షణం. అందుకే ఇవాళ గూగుల్ సైతం మార్షల్ని గౌరవించుకోవాలని అనుకుంది. ఆయన పేరుతో ఒక డూడుల్ని రూపొందించింది. - నిర్జర.