Read more!

శారీరక స్థితి కలలకు కారణం అవుతుందా?

శారీరక ప్రవృత్తికి, అంటే వాత పిత్త శ్లేష్మ ధర్మాలకు, స్వప్నాలకు(కలలకు) సంబంధం  ఉంటుందని అధర్వణవేదం చెప్పింది. అంటే ఈ మూడు ప్రవృత్తులలో ఏదైన ప్రకోపించినప్పుడు అంటే ఎక్కువైనప్పుడు దాని ఫలితం కలలో వ్యక్తం చేయబడుతుంది. అలాగే శరీరంలో ఏవైన అంతర్గతంగా మార్పులు జరిగినప్పుడు ఆ మార్పులు కూడా కలలో కనిపిస్తాయి. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే శరీరంలో జరిగే మార్పులు సరిగ్గా గమనించుకునే మనుషులే తక్కువగా ఉన్నారు ఈ కాలంలో. 

అతిభుక్త సిద్ధాంతం అని ఒకటి ఉంది. అది కూడా ఈ కోవకే చెందుతుంది. ఒక రోజు రాత్రి ఎప్పుడైన అతిగా తినడం వలన కడుపులో సంభవించే మార్పులు ఆరోజు రాత్రి నిద్రపోతున్నప్పుడు వచ్చే కలపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఎక్కువగా తిన్న పదార్థాన్ని అరిగించుకోవడానికి, జీర్ణమండలం ఎక్కువ రక్తాన్ని రప్పించుకుంటుంది. ఇందువల్ల  మెదడుకు పోవలసిన భాగం తగ్గిపోతుంది. ఇది కలల మీద ప్రభావం పడటానికి కారణం అవుతుంది. 

 ఇంతవరకు బాగానే ఉంది, అయితే ఒకే రాత్రి ఒకే ఆహారం తిన్న నలుగురు వ్యక్తులకు నాలుగు రకాల కలలు ఎందుకు వస్తాయో అంటే….. నలుగురు తిన్నది ఒకే పదార్ధం, కలలు మాత్రం వేరు వేరు. దీని గురించి ఆలోచిస్తే ఆ కలలు కనిన రోజు ఉదయం సమయంలో  వారు ఆయా విషయాలను గురించి చర్చించడమో, ఆలోచించడమో, ఆసక్తి చూపడమో జరిగి ఉంటుంది. అందువల్ల అవి వారి వారి స్వప్న విషయాలుగా మారి ఉంటాయి. అయితే శారీరక స్థితి కలకు మూలం ఎలా అవుతుందో తెలుసుకుంటే…... 

ఒక రోజు బాగా తీపి పదార్థాలు తిని నిద్రపోవాలి. పడుకోబోయే ముందు దప్పిక అయినా, మంచినీళ్ళు త్రాగవద్దు. అంటే ఎలాగైనా సరే దప్పికతో నిద్ర పోవాలి. అలా నిద్రపోయినప్పుడు తప్పకుండా కల వస్తుంది. ఆ కలలో మీరు నీటినో, చమురునో, రక్తాన్నో లేక మరొక ద్రవ పదార్థాన్నో త్రాగుతూ ఉంటారు. అంటే మనిషి శరీరానికి అవసరమైన దాహం అనేది కలలో అలా ప్రతిబింబిస్తూ ఉంటుంది. దీనిని బట్టి శారీరక స్థితి, దప్పికగొన్న స్థితి, కలకు మూలమవుతుంది అనే విషయం నిర్ధారిత మవుతుంది.

అలాగే లైంగికంగా దాహంతో ఉన్న వ్యక్తి విషయంలోను, శారీరకంగా ఆరోగ్యవంతుడైన యువకుడు లైంగిక కార్యకలాపాలకు దూరంగా ఉంటే, ఆ విషయాలకు సంబంధించిన  కలలు కంటాడు. యువకులు తరుచు స్థలన స్వప్నాలకు గురి అవుతూ ఉంటారు. ఈ విషయం  తెలియనిదేం కాదు. శారీరక పరిస్థితి కల స్వభావాన్ని నిర్ణయించినా, కల ఎలాంటిది అనే  విషయాన్ని నిర్ణయించదు. కలలు మొత్తం మీద లైంగికాలే అయినా, అవి వేరు వేరు విధాలుగా ఉండవచ్చు.

కలలకు శారీరక స్థితి ఆధారం అనడానికి మరొక కారణం కూడ చెప్పవచ్చు. మెదడులో కొన్ని ప్రదేశాలను ఎలెక్ట్రోడ్ తో గిలిగింతలు పెడితే కొన్నిసార్లు గిలిగింతలకు లోనైన వ్యక్తి కలగంటాడు. ఇది ఆ వ్యక్తి జాగ్రదావస్థలో ఉండగానే జరుగుతుంది. ఈ పద్ధతి ద్వారా పాతజ్ఞాపకాలు కలలో ఎందుకు పునరావృతం అవుతాయో వివరించవచ్చు. కలలు యాదృచ్ఛికాలని వీటికి మనోవైజ్ఞానిక ప్రాముఖ్యం ఏమీ లేదని, మెదడులో ఉద్దీపింపబడిన భాగాన్ని బట్టి ఆయా జ్ఞాపకాలు పునరావృతం  అవుతాయని చెప్పవచ్చు. 

ఇలా మనిషి శారీరక స్థితిని బట్టి కలల ప్రభావం ఉంటుందని పరిశోధనల్లో నిరూపితమైంది కూడా. 

                                         ◆నిశ్శబ్ద.