సెప్టెంబర్ 13, శుక్రవారం వెనక ఉన్న ఈ నమ్మకాల గురించి తెలుసా?
posted on Sep 13, 2024 @ 9:30AM
చరిత్రలో ప్రతి తేదీకి ఏదో ఒక ప్రత్యేకత ఉండనే ఉంటుంది. వీటిలో కొన్ని మంచివి అయితే మరికొన్ని చెడ్డవి. కొన్ని తేదీలు ప్రపంచ వ్యాప్తంగా, మరికొన్ని కొన్ని దేశాలకు ప్రత్యేకంగా ఉంటే.. మరికొన్ని తేదీలు విషాదాన్ని, చెడును సూచిస్తాయి. సెప్టెంబర్ 13, శుక్రవారం కూడా అలాంటిదేనట. సెప్టెంబర్ 13, శుక్రవారం భారతదేశంలోనే కాకుండా విదేశాలలో చెడ్డ దినంగా పేర్కొంటున్నారు. దీని వెనుక ఉన్న కారణాలేంటంటే..
సరిగ్గా గమనిస్తే కొన్ని భవనాలకు అసలు 13 సంఖ్యతో అంతస్తు ఉండదు. ఎందుకంటే 13 వ సంఖ్యను అశుభంగా పరిగణిస్తారు. అందులోనూ 13వ తేదీ వచ్చిన శుక్రవారాన్ని అయితే మరీ అశుభప్రదమైనదిగా భావిస్తారు. భారతదేశంలో కాకుండా విదేశాలలో ఈ సెప్టెంబర్ 13వ తేదీ గురించి నమ్మకం ఎక్కువగా ఉంది. ఇది పవిత్ర గ్రంథం బైబిల్ లో ప్రముఖంగా ప్రస్తావించబడింది.
యేసు క్రీస్తు శుక్రవారం రోజునే సిలువ వేయబడ్డాడనే విషయం అందరికీ తెలిసిందే.. ఇదే విషయం బైబిల్ లో కూడా చెప్పబడింది. ఇది మాత్రమే కాకుండా ఆ నాడు చివరి విందులో 13 మంది ఉన్నారని, ఈ 13మందిలో ఒకరు యేసును అప్పగించారని బైబిల్ గ్రంథంలో ఉంది. ఈ కారణంగా 13 వ తేదీ అన్నా.. ముఖ్యంగా 13వ తేదీ వచ్చే శుక్రవారం అన్నా ఇష్టపడరు.
రచయిత థామస్ విలియం లాసన్ 1907లో రాసిన ఫ్రైడే ది 13త్ నవల కూడా ఈ మూఢనమ్మకం పెరగడానికి కారణంగా మారింది. ఇది మాత్రమే కాకుండా 1980లో విడుదల అయిన ఫ్రైడే ది 13త్ సినిమా కూడా ప్రజల్లో ఈ మూఢనమ్మకాన్ని మరింత బలపరిచింది.
ఇది మాత్రమే కాకుండా ఫిన్లాండ్ లో సెప్టెంబర్ 13న వచ్చే శుక్రవారాన్ని జాతీయ ప్రమాద దినోత్సవంగా జరుపుకుంటారు. తద్వారా ప్రజలు భద్రతా నియమాలను సరిగా పాటిస్తారు. ఇలాంటి అనేక కారణాల వల్ల సెప్టెంబర్ 13 వ తేదీ శుక్రవారం గురించి ప్రజలలో మూఢనమ్మకాలు చాలా ప్రబలంగా వ్యాపించి ఉన్నాయి. సామాన్య జీవితంలో పెద్దగా మార్పులు లేకపోయినా ఇప్పట్లో జరుగుతున్న సంఘటనలు ప్రజలలో ఈ మూఢ నమ్మకాలను మరింత పెంచుతున్నాయి.
*రూపశ్రీ.