మరణాన్ని తెలుసుకోవడం సాధ్యమేనా?
posted on Aug 19, 2024 @ 9:30AM
ఈ జీవితంలో మనిషిని వేధించే ప్రశ్నలు ఎన్నో ఉంటాయి. వాటిలో చాలా ప్రశ్నలకు మనిషి సమాధానాన్ని కనుక్కుంటాడు. కనుక్కోవడం అంటే కొత్తగా కనిపెట్టడం కాదు, ఎన్నో చూసి, చదివి, చర్చించి తెలుసుకుంటాడు. ఒక మనిషి పుట్టుకకు గర్భంలో నెలల కాలాన్ని నిర్ణయిస్తూ పుట్టుకను లెక్కిస్తారు. అయితే అందరికీ అంతు చిక్కని ప్రశ్నగా నిలబడేది ఒకటి ఉంటుంది. అదే మరణం. ఈ ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా మరణాన్ని జయించడం కుదరదు. కనీసం మరణం ఎప్పుడు సంభవిస్తుంది అనే విషయాలను కూడా ఎవరూ చెప్పలేరు. సైన్స్ పరంగా మనిషి జీవిత కాలాన్ని నిర్ణయిస్తున్నారు కానీ మరణాన్ని మాత్రం ఎవ్వరూ చెప్పలేరు.
అయితే అదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. నాణేనికి మరొకవైపు మన భారతీయ యోగుల జీవితంలోకి వెళితే, వారి జీవనవిధానం, వారి యోగా శక్తి గురించి తెలుసుకుంటే మాత్రం మరణాన్ని కూడా నిర్ణయించగల అద్భుతాలు మన భారతీయ యోగులు అని అర్థమవుతుంది.
మునులు, సన్యాసుల గురించి వదిలేస్తే మన యువతకు ఎంతో ప్రేరణ అయిన స్వామి వివేకానంద కాలినడకన మన దేశం మొత్తం ప్రయాణం చేసారు. మన దేశం మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా పర్యటించి చాలా పేరు తెచ్చుకున్నారు. ఇదంతా మనకు తెలిసిందే. హిందూ ధర్మాన్ని, భారతీయ తత్వాన్ని ప్రపంచదేశాలకు వ్యాప్తం చేసినవారు స్వామి వివేకానంద. ఈయన భారతీయ సనాతన ధర్మాన్ని, ఆధ్యాత్మిక, తాత్విక శాస్త్రాలను తన ఉపన్యాసాలలో ఎంతో గొప్పగా నేటి కాలానికి చాటి చెప్పారు. విదేశాలలో మన భారతీయ ధర్మాన్ని నిస్సంకోచంగా, నిర్భీతిగా చెప్పినవారు ఈయనే. ఈయన తన చివరి రోజుల్లో ఆశ్రమంలో గడిపేవారు.
అయితే స్వామీజీ ఒక రోజు పేపర్ మీద ఒక తేదీని రాసి తనతోపాటు ఆశ్రమంలో ఉన్న ఒక యోగికి ఇచ్చారు. ఆ యోగికి ఆ తేదీ గురించి ఏమి అర్థం కాలేదు కానీ ఆ రోజు రానే వచ్చింది, ఆ రోజున స్వామిజీ ధ్యానంలో కూర్చున్నారు. ఆయన్ను అందరూ ఎంత పిలిచినా పలకకపోవడంతో ఆశ్రమ వాసులు వచ్చి పరిశీలించారు. అంతా పరిశీలించిన తరువాత చివరకు స్వామీజీ పరమపదించారు అని తెలుసుకున్నారు. ఇలా స్వామి వివేకానంద తన మరణ తేదీని ముందుగానే తెలుసుకున్నారని అర్థం చేసుకోవచ్చు.
ఇక స్వామి వివేకానంద ధ్యానం చేస్తూ మరణించడం అనే విషయం వెనుక కారణం చూస్తే యోగులు ఎప్పుడూ తమ ప్రాణాన్ని ధ్యానంలో ఉండి వెన్నుపూస నిటారుగా ఉంచి, సహస్రారం ద్వారా ప్రాణాన్ని విడవాలని అనుకుంటారు.
నిజానికి ఇక్కడ ఒక విషయం అర్ధం చేసుకోవచ్చు. మనిషి ఎప్పుడూ శరీరాన్ని నాది అనే భావనతో ఉంటాడు. కానీ ధ్యానంలో ఒక లెవెల్ దాటిన తర్వాత ఈ శరీరం, నేను ఒకటి కాదని తెలుసుకుంటారు. అలా శరీరం ఆత్మ వేరు వేరు అనే విషయం తెలిసిన తరువాత చనిపోవడం అనే విషయం గురించి పెద్దగా బాధ ఉండదు.
అలాగే గొప్ప తత్వవేత్త అయిన జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా తాను చనిపోయేమదు నేను ఇవ్వబోయే చివరి ఉపన్యాసం ఇదే అని ముందే చెప్పారు. అంటే ఆయనకు కూడా అధ్యాత్మికపరంగా తన శరీరాన్ని, తన ఆత్మను వేరు చేసి చూసే భావన స్పష్టంగా తెలిసింది కాబట్టి ముందుగా తన చివరి ప్రసంగాన్ని గురించి చెప్పారు.
ఎలా తెలుస్తుంది?
మరణం గురించి తెలుసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే కేవలం ధ్యానం ద్వారా మాత్రమే దీన్ని తెలుసుకోగలం ఎందుకంటే ఇక్కడ ధ్యానం ద్వారా జరిగేది అంతర్గత ప్రయాణం. బాహ్య ప్రపంచంలో మనిషి కోతిలాగా ఆలోచించినవాడు అంతర్గత ప్రపంచంలో తనని తాను స్పష్టంగా తెలుసుకోగలుగుతాడు. తనని తాను తెలుసుకున్నప్పుడు తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఎలాంటి ఆలోచన లేకుండా చెప్పగలిగే యోగ శక్తి మనిషికి లభిస్తుంది.
అపనమ్మకం కాదు!
మనిషి మరణాన్ని కూడా చెప్పవలగడం సాధ్యమేనా?? ఇదంతా ఒట్టి పిచ్చితనం అని అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను నేను అని మెలుకువతో ఉన్నప్పుడు మనం అనుకుంటాం కానీ మనం గాఢ నిద్రలో నేను అనేది ఉండదు. నిద్రిస్తున్నామా చనిపోయామా అసలు ఎక్కడున్నామో కూడా మనకు తెలియదు కానీ ప్రపంచం అనేది అక్కడే ఉంటుంది. అక్కడే అంటే స్థిరంగా ఉంటడం. ఇక్కడ ప్రపంచం ఏమి మారదు కేవలం మనుషులు,మనుషులు చేస్తున్న పనుల వల్ల పరిసరాలు మార్పుకు లోనవుతాయి. ఎప్పుడైతే మెలుకువతో ఉన్నపుడు కూడా నేను అనేది ఉండదో అప్పుడు మనకు ఒక కొత్త ప్రపంచం పరిచయం అవుతుంది. ఆ ప్రపంచంలో పుస్తకాలలో చదవని ఎన్నో విషయాలు అర్థం చేసుకోవచ్చు. అంటే ఇది పూర్తిగా చదివి, లేదా సినిమాల ద్వారా చూసి తెలుసుకునేది కాదు. ఇది పూర్తిగా అనుభవపూర్వక ప్రపంచం. అనుభవం ద్వారా ఎవరిది వారికి అర్థమయ్యేది.
పంచభూతాల కలయిక అయిన ఈ ప్రకృతి మనిషిని మాయలో ఉంచినప్పుడు మాత్రమే మనిషి ముందుకు వెళ్తాడు. ఈ ప్రకృతి, బాహ్య జీవితంలో జరిగే విషయలు అన్నీ ఒక నాటకం వంటిది అని తెలిసినప్పుడు మనిషి జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టపడడు, అందుకోసమే యోగులు విరక్తి లో ఉంటారు.
అయితే ధ్యానం ద్వారా మనిషి తన జీవిత పరమార్థం తెలుసుకున్నప్పుడు తన జీవితాన్ని తన చేతుల్లోనే ఎంతో నిరాడంబరంగా ఆధ్యాత్మిక సాధనలో గడిపేసి చివరికి తన మరణాన్ని తాను తెలుసుకుని దాన్ని ప్రశాంతంగా ఆహ్వానిస్తాడు. ఇదీ మరణాన్ని తెలుసుకునే విధానం. అయితే ఇది కేవలం ధ్యానంలో ఎంతో లోతుకు, మెరుగైన స్థాయికి చేరి, ఈ బాహ్య ప్రపంచ వ్యామోహనికి అసలు లోనుకాకుండా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం!!
◆వెంకటేష్ పువ్వాడ.