Read more!

నిజమైన ప్రేమకు అర్థం చెప్పే కథ!!

ఒక రాజు తను ఎంతగానో ప్రేమించిన భార్య మరణించింది. ఆయన ఆది తట్టుకోలేకపోయాడు. ఆమె తన ప్రాణంగా జీవించేవాడు. ఆమె మరణంతో అతను విలవిలలాడిపోయాడు. ఎన్నో ఏళ్ళు ఆమెనే తల్చుకుంటూ నిరంతర దుఃఖ స్రవంతిలో మునిగిపోయాడు. ప్రజల పాలనను, రాజ్యం యొక్క బాగోగులను మర్చిపోయాడు. ఎందుకంటే తన భార్య కంటే ముఖ్యమైనది, ఈ సృష్టిలో ఏదీ లేదని అతను భావించాడు. తిండి తిప్పలు మానేసి పిచ్చివాడిలా రోధిస్తూ ఉండేవాడు. ప్రజల పరిస్థితి దీనావస్థకు చేరుకుంది. శత్రువులు ఇష్టారాజ్యంగా దోచుకెళ్ళడం ప్రారంభించారు. సరైన సౌకర్యాలు లేక ప్రజలు అస్తవ్యస్తమైపోయారు. ఆ సమయంలో ఓ సాధువు పరిస్థితి గమనించి ఆ రాజు గారిని కలిశాడు. 


"రాజా..... సుభిక్షంగా పాలించాల్సిన నీవే ఇలా అయిపోతే ఎలా?" అని అడిగాడు.


 దానికి రాజు "ఈ రాజ్యం, ఈ ప్రజలు, ఈ సంపదలూ...... ఇవేవీ నా దుఃఖాన్ని దూరం చేయలేవు. నా రాణిని నాకు తిరిగి తెచ్చిపెట్టలేవు. ఆమె లేని ఈ జీవితమే వ్యర్థం. ఆమె కంటే ముఖ్యమైనది నాకేదీ లేదు" అని జవాబిచ్చాడు. 


అందుకు సాధువు నవ్వి ఇలా అన్నాడు "ఓ రాజా.... ఇదంతా చూస్తుంటే.. నీ రాణిని నీవు నిజంగా ప్రేమించడం లేదేమో అనిపిస్తోంది! నీ ప్రేమ స్వచ్ఛమైనది కాదేమోననిపిస్తోంది…"అన్నాడు. 


దానికి రాజు చాలా ఆగ్రహించాడు. "ఏంటీ. నాది స్వచ్ఛమైన ప్రేమ కాదా... ఏమి లేకపోయినా ఆమె జ్ఞాపకాలతో బ్రతికేయగలను. అయినా నాది  అని స్వచ్ఛమైన ప్రేమ కాదని మీరెలా అనగలరు?" అని అడిగాడు.


దానికి సాధువు. "ఓ రాజా మీరు ఓ అందమైన, గుణవతి అయిన స్త్రీని మళ్ళీ వివాహం చేసుకోండి. ఒక  సంవత్సరం తర్వాత కూడా.... మీరిలాగే ఆమె జ్ఞాపకాలతో, దుఃఖంలో జీవిస్తున్నట్లు కన్పిస్తే...  అప్పుడు ఖచ్చితంగా మీ ప్రేమ ప్రపంచంలో కెల్లా స్వచ్చమైనదని అర్థం" అన్నాడు.


రాజు తనది స్వచ్చమైన ప్రేమేననీ, దానిని నిరూపించడం కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమేననీ, మళ్లీ ఓ యువతిని వివాహం చేసుకోవడానికైనా సిద్ధమని సాధువుతో చెప్పి, కొంత కాలంలోనే ఓ అప్సరసలాంటి అనుకూలవతియైన వనితను వివాహమాడాడు.


సంత్సరకాలం గడించింది. ఆ సాధువు మళ్ళీ ఆ రాజ్యంలోకి వచ్చి చూశాడు. ప్రజలంతా సర్వ సుఖాలతో, సుభిక్షంగా ఉండటం గమనించాడు. రాజు గారి దగ్గరికెళ్ళి చూడాలనుకున్నాడు. ఆ సాధువును చూడగానే ఆ రాజు  ఆనాడు తాను చెప్పిన మాటలను తల్చుకొని ఎంతో చిన్నబోయుడు. ఆ రాజు తన క్రొత్త భార్యతో, ఆనందడోలికల్లో మునిగి ఎంతో ఉల్లాసంగా ఉండటం సాధువు గమనించాడు.


సాధువును చూడగానే రాజు ఇలా అన్నాడు. "స్వామీ.. నేను ఓడిపోయాను, నాది స్వచ్ఛమైన ప్రేమకాదని తెల్సుకొన్నాను. నేను మరో స్త్రీని పెళ్ళాడిన తర్వాత క్రమ క్రమంగా నా రాణి జ్ఞాపకాలను మరిచిపోయి ఆనందంగా ఉండగలిగాను...... కనుక నా రాణి పట్ల నాకు అంత స్వచ్ఛమైన ప్రేమలేదని తెలిసింది. నన్ను క్షమించండి" అని వివరణ ఇచ్చాడు. 


దానికి సాధువు నవ్వుతూ "రాజా స్వచ్ఛమైన ప్రేమంటే ఒక వ్యక్తి కోసం కుమిలి కుమిలి రోధించడం కాదు, చనిపోయిన నీ భార్యని తలచుకుంటూ దుఃఖం అనే బానిసత్వంలో బంధీగా ఉండటం కాదు. నీవు నీ ప్రేమని. మరో వ్యక్తికి కూడా నిష్కల్మషంగా పంచగలిగావు. ఈ రాజ్య ప్రజల ప్రేమకు పాత్రుడవగలిగావు. నీ విధిని గుర్తించి మేలుకొని కర్తవ్యపాలన చేశావు. ప్రేమ కంటే బాధ్యత గొప్పది, బాధ్యత లేని ప్రేమ ఓ ఎండమావి లాంటిది. అయినా నీది స్వచ్ఛమైన ప్రేమే. 


ప్రేమ అంటే స్వేచ్ఛ, ప్రేమ అంటే స్వచ్ఛత. ఎప్పుడైతే నీవు దుఃఖం, జ్ఞాపకాలు అనే బానిసత్వంలో ఉండినావో..... సమస్తం నీకు చీకటిగానే కన్పించింది. నీవు మళ్లీ మరో స్త్రీని నీ జీవితంలోకి ఆహ్వానించడంతో  ఆనందంగా గడపగలిగే మరో అవకాశాన్ని పొందగలిగావు. అప్పుడు నీవు దుఃఖంలో ఉండి అందరినీ సంతోషాలకు దూరం చేశావు. మళ్ళీ మరో ఆనందాన్ని వెదికి పట్టుకొని ప్రజలందరి సంతోషాలనూ తిరిగి తెచ్చి పెట్టగలిగావు. నిజమైన ప్రేమంటే ఆనందమే, నిరంతరం దుఃఖంలో ఉండటం నిజమైన ప్రేమకు నిదర్శనం కాదు. ఇతరుల కోసం ఏ త్యాగానికైన సిద్దపడటం, వారి కోసం జీవించడమే ప్రేమ అన్పించుకొంటుంది" అని సాధువు హితబోధ చేశాడు.


                                      ◆నిశ్శబ్ద.