Read more!

 శ్రీరామ వైభవం!


రాముడు రాఘవుడు రవికులుడితడు అనే పాటను వింటుంటే మనసు ఎంతో హాయిగా ఉంటుంది. చిన్నప్పుడు పుస్తకాల్లో శ్రీరాముడు పితృవాఖ్య పరిపాలకుడు అనే మాటను విని ఉంటాము. ఇంకా చక్కని నడవడిక కలిగిన అబ్బాయిలను చూస్తే రాముడు అనే టాగ్ వేస్తాము. ఇలా మన జీవితాలలో రాముడు ఒక భాగం. అయోధ్యా నగరాన్ని పాలించిన శ్రీరామచంద్రుడు యావత్ భారతదేశానికి కూడా గర్వకారణం అంటారు. కొన్ని విమర్శలు ఉన్నా వాటి వెనుక కూడా సరైన హేతువులతో ఆలోచిస్తే దశావతారాలలో రాముడి అవతారం ప్రజలకు ఏదో చెప్పడానికే ఈ భూమి మీదకు వచ్చిందని ఖచ్చితంగా నమ్ముతారు.


నవమి వైభవం!!


నవమి రోజు రాముడు పుట్టాడు. అయితే అన్నిచోట్లా శ్రీరామ నవమి రోజు సీతారాముల కల్యాణం జరుపుతారు. భారతదేశంలో ఉన్న ఎన్నో ప్రసిద్ధ గుడులలో ఇంకా చిన్న చిన్న రాముడి కోవెలలో కూడా సీతారాముల కల్యాణం ఎంతో గొప్పగా నిర్వహిస్తారు. తెలంగాణలో భద్రాచలంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్ట లోనూ రాముడి కల్యాణం, శ్రీరాముడి పట్టాభిషేకం ఎంతో బాగా చేస్తారు. 


ఏకపత్నీ వ్రతుడు!!


ఒకటే మాట, ఒకటే బాణం అనే క్రమంలో సాగే రాముడు జీవితంలో కూడా ఒక భార్యను మాత్రమే కలిగి ఉండటం చక్కని సందేశం. ఆ కాలానికి ఒకటికి పదిమందిని పెళ్లిళ్లు చేసుకుని వందలకొద్ది పిల్లల్ని కలిగిన రాజుల కాలంలో రాముడు సీతకు మాత్రమే జీవితంలో చోటిచ్చాడు. శివదనస్సును విరిచి మరీ సీతను సొంతం చేసుకున్న ఈ కౌసల్యా కుమారుడు తన జీవితంలో ఏ ఇతర ఆడదాని వైపు కన్నెత్తి చూడలేదంటే ఆశ్చర్యమేస్తుంది. 


రామాయణం!!


భారతీయ సాహిత్య చరిత్రలో ఇదొక అద్భుత గ్రంధం. ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడిన ఈ రామాయణం ఏడు కాండలతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నతనం నుండి పిల్లలకు రామాయణాన్ని చెబుతూ ఉండటం వల్ల పిల్లల్లో గొప్ప వ్యక్తిత్వం అలవడుతుందని అంటారు. ఇదే నిజం కూడా.  ఇంకా ఇందులో రాముడు మాత్రమే కాకుండా సీత, లక్ష్మణుడు, రాముడి ప్రయాణంలో ఎదురయ్యే ఎందరో గొప్ప వ్యక్తిత్వాలుగా మనకు కనబడతారు. 


హనుమంతుడు, జటాయువు, విభీషణుడు, సుగ్రీవుడు, వానర సైన్యం. ఇలా ఎంతోమంది గొప్పవాళ్ళు రామాయణంలో ఉంటారు.  వీళ్ళు మాత్రమే కాకుండా గుహుడు, శబరి లాంటి గొప్ప రామభక్తులు కూడా కనిపిస్తారు. అందుకే రామాయణం అంత గోపోయా గ్రంథమయ్యింది. కాలంతో పాటు నిలిచే ఉంది. దీని మీద ఎన్ని విమర్శలు వచ్చినా సరే!! అవన్నీ పనిగట్టుకుని పుడుతున్నవి కాబట్టి ఈ రామాయణం ఆ రామ నామం ధర్మబద్ధమైన జీవితం మనిషి మనుగడ ఉన్నంతవరకు ఉంటాయి.

రామనామం!!


రాముడు గొప్పవాడా రామ నామం గొప్పదా అంటే రామ నామమే గొప్పది అంటారు. ఒక్కసారి రమానామాన్ని జపిస్తే వెయ్యిసార్లు ఇతర దేవుళ్లను జపించినట్టని సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తుంది.


వారధి కడుతున్న వానరసైన్యం ప్రతి రాయి మీద రామా అని రాసి సముద్రంలో వేస్తే అవి తేలుతున్నాయి. కానీ స్వయంగా రాముడే వాటిని సముద్రంలో వేస్తే అవి మునిగిపోయాయి. దీనిని బట్టి రాముడి కంటే రామ నామమే ఎంతో గొప్పది అని అర్థమవుతుంది.


త్యాగరాజు అంటాడు 

నిధి చాల సుఖమా రాముని స

న్నిధి సేవ సుఖమా నిజముగ బల్కు మనసా అని


రామదాసు అంటాడు

ఓ రామ నీనామ శ్రీరామ నీనామ మేమి రుచిరా అని


ఎన్ని రకాలుగా చూసినా రాముడి వంటి పురుషుడు, రామ నామమంత సులువైన శక్తివంతమైన అద్భుత మార్గం మరొకటి ఉండదు అని నిక్కచ్చిగా చెప్పచ్చు.


ఈ శ్రీరామ నవమి నాడు ఆ రామచంద్రుడిని పలుకే బంగారయాయేనా కోదండపాణి అంటూ లాలనగా ప్రార్థిస్తూ పునీతులవుదాం.


ఇంకా గుడిలో వడపప్పు, పానకం వేసవిలో కమ్మగా తినేసొద్దాం. 

◆వెంకటేష్ పువ్వాడ.