పొగడ్త.. ఓ మంచి టానిక్!

  ఈరోజు మీకు నేను ఓ పెద్ద హోమ్ వర్క్ ఇవ్వబోతున్నా. మీ అందరికీ అదేంటో చెప్పేముందు మొన్నీమధ్య జరిగిన ఓ సంఘటన గురించి చెప్పాలి. ఓ నాలుగు రోజుల క్రితం మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఓ ఫంక్షన్ వుంటే వెళ్ళాం మేమంతా. ఒక్కరోజంతా అక్కడ అందరం కలసి వున్నాం. బోల్డన్ని కబుర్లు, నవ్వులు, ఎంత బాగా గడిచిపోయిందో ఆ రోజంతా. ఆ రాత్రి భోజనాలయ్యాక మా కజిన్ సుమ ఓ ప్రశ్న వేసింది. ‘‘సుమ అంటే ఏంటి’’ అని. ఇదేం ప్రశ్న అన్నాం మేము. కాదు చెప్పండి అంది. మేం అందరం సుమ ఎలా వుంటుందో, ఆ లక్షణాలు ఒకటొకటిగా చెప్పాం. ఆ తర్వాత అలా అందరం అందరి గురించి ఒకరి గురించి ఒకరం ఏమనుకుంటున్నామో చెప్పాం. ఆ తరువాత ఇంతకీ ఈ ప్రశ్న ఎందుకడిగావ్ అని మా సుమని అడిగితే ఏం చెప్పిందంటే, మనం చాలాసార్లు మనవాళ్ళలో మనకి నచ్చని విషయాలని కుండ బద్దలు కొట్టి మరీ చెబుతాం. కానీ అదే నచ్చే విషయాలని చెప్పాల్సి వచ్చినప్పుడు ఆలోచిస్తాం. దీనివల్ల ఎదుటి మనిషి నన్ను సరిగా అర్థం చేసుకోలేదు అని ఎవరికి వారు బాధపడుతూ వుంటాం. నిజంగా మన పక్కవాళ్ళు మనల్ని ఎంత అర్థం చేసుకున్నారు అని మనకి తెలియదు. అందుకే ఇలా మనవాళ్ళని మనం నా గురించి నువ్వు ఏం అనుకుంటున్నావని అడిగామనుకోండి-వాళ్ళ మనసులో మనపట్ల ఉన్న అభిప్రాయం తెలుస్తుంది. ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది అంటూ చెప్పింది. చాలాసార్లు నేను ఇలా వుండాలి.. నేనంటే ఇది అని మనపై మనకి కొన్ని అభిప్రాయాలు, నమ్మకాలు వుంటాయి. అయితే మన వ్యక్తిత్వ లక్షణాలు మన ప్రవర్తన ద్వారా నిజంగా ఎంతవరకు ఎదుటి వ్యక్తులకి చేరతాయో మనకి తెలియదు. ఇలా అడిగినప్పుడు వాళ్ళు మనపై వ్యక్తంచేసే భావాలనుబట్టి మన ఆలోచనలకి, ప్రవర్తనకి మధ్య సమన్వయం వుందో లేదో తెలుసుకోవచ్చు. అలాగే ఎదుటి వ్యక్తులు మనల్ని గుర్తించారన్న అంశం మనకి నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే వారితో మన అనుబంధం బలపడుతుంది. అందుకే మనం అంటే ఏమిటి అన్నది మనకి తెలిసినంత స్పష్టంగా ఎదుటివారికి కూడా అర్థమయ్యిందో లేదో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందిట. గుర్తింపు, పొగడ్త ఎవరికైనా ఆనందాన్నిస్తాయి. మరి ఆ గుర్తింపు, పొగడ్త మనం ఎదుటి వ్యక్తికి ఇవ్వగలిగితే! వాళ్ళకి ఆనందం ఇచ్చినట్టేగా! అలాగే వాళ్ళని మనం ఎంత బాగా అర్థం చేసుకున్నామో వాళ్ళకి తెలిపినప్పుడు మనపై ఇష్టం, ప్రేమ, గౌరవం పెరుగుతాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య మంచి అనుబంధం వుండాలంటే ఇది ఎంతో ముఖ్యమని అందరికీ తెలిసిందే. ఇలా ఒకరి గురించి ఒకరు గమనించి పాజిటివ్ అంశాలను చెప్పడం ఎంతో అవసరం. మన కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, తెలిసినవాళ్ళు.. ఇలా మనకి కావలసిన వాళ్ళందరితో చక్కటి అనుబంధం ఏర్పరచుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తుంటాం మనం. ఆ ప్రయత్నంలో ఈ టెక్నిక్ ఎంతో ఉపయోగపడుతుంది. అంతెందుకు, మీ ఇంట్లోవాళ్ళతో మీకు వాళ్ళలో నచ్చే అంశాలను గురించి చెప్పి చూడండి. ఇదే నేను మీకు ఇస్తానన్న హోమ్ వర్క్. రిజల్ట్స్ ఎలా వుంటాయో మీరే చూడండి.   - రమ ఇరగవరపు

నిద్రలేమితో బాధపడుతున్న గర్భవతులకు ప్రమాద హెచ్చరిక

  ఒక కొత్త అధ్యయనం ప్రకారం, నిద్రలేమి వలన గర్భిణీ స్త్రీలకి గెస్టేషనల్ (గర్భధారణ సమయంలో) మధుమేహం  వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గడచిన 20 ఏళ్ళలో దాదాపుగా పావు శాతం స్త్రీలు మరియు 16 శాతం పురుషులు నిద్ర లేమితో బాధపడుతున్నారు.   గర్భిణీ స్త్రీలు తరచుగా గర్భధారణ మధుమేహంతో బాధపడుతుంటారు. సాధారణంగా ఇది రెండవ లేదా మూడవ త్రైమాసికంలో సంభవిస్తుంది. గర్భిణీ స్త్రీలు 24 నుండి 28 వారాల గర్భధారణ సమయంలో రక్తంలో చక్కెర స్థాయి పరీక్షలు జరుపుకుంటున్నారు. ఒకవేళ, షుగర్ లెవెల్స్ మోతాదు కన్నా ఎక్కువ ఉంటే గర్భధారణ మధుమేహం (గెస్టేషనల్ డయాబెటిస్) వచ్చే ప్రమాదం ఉంది.   సాధారణంగా, శిశువు జన్మించిన తర్వాత తల్లికి రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి చేరుకుంటాయి. అమ్మకి గర్భధారణ మధుమేహం ఉన్నట్లయితే, జన్మించిన శిశువులు అధిక బరువు కలిగి ఉంటారు. అమ్మలకి తర్వాత టైప్ -2 మధుమేహం వచ్చే అవకాశాలుంటే, పిల్లలకి కూడా మధుమేహంతో పాటు ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది.   సగటున 6 గంటల కంటే తక్కువ నిద్ర పోతున్నట్లయితే, గర్భధారణ మధుమేహం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ అధ్యయనం చెబుతుంది. కాబట్టి, గర్భిణులు రోజుకి ఖచ్చితంగా 6 గంటలు పైగా నిద్రపోయేలా ప్రణాళిక చేసుకోవాలి లేదా వారికి వారి పిల్లలకి షుగర్ తో పాటు ఊబకాయం కొని తెచ్చుకున్నట్లే!

పాఠశాల త్వరగా మొదలవుతుందా అయితే ఇబ్బందే!

  మీ పిల్లల పాఠశాల త్వరగా ప్రారంభమవుతున్న కారణంగా తగినంత నిద్ర సరిపోవడం లేదా? అయితే, కాస్త జాగ్రత్త వహించండి. ఎందుకంటే, మీ పిల్లలలో డిప్రెషన్ మరియు ఆందోళన వంటివి అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఉదయం 8.30 గంటలకు ముందుగా పాఠశాల మొదలవుతున్న పిల్లలకు, శరీరం సక్రమంగా పనిచేయడం కోసం అవసరం అయిన 8-10 గంటల నిద్ర అవకాశం లేకపోవడం మూలాన రకరకాల సమస్యలు వచ్చి పడుతున్నాయి.   ఒక రీసెర్చ్ ప్రకారం, రాత్రి మంచి నిద్ర పొందడానికి ఒక విద్యార్ధి అన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా, త్వరగా పాఠశాల వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు విపరీతమయిన మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. అయితే, పాఠశాల ఆలస్యంగా మొదలయ్యే యువకులు అన్ని విషయాల్లో చురుగ్గా ఉన్నారని వెల్లడయింది.   పాఠశాల సమయాలు నిద్ర అలవాట్లను మాత్రమే కాకుండా శరీరం యొక్క రోజువారీ పనితీరును కూడా ప్రభావితం చేస్తాయి. ఇది యుక్తవయస్సులో ఊబకాయం, గుండె వ్యాధి మరియు ఇతర ప్రధాన సమస్యలను తీవ్రతరం చేస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం, ఎనిమిది నుండి పది గంటలు నిద్ర పోవడం, కెఫిన్ ని తక్కువగా తీసుకోవడం, టెలివిజన్, సెల్ ఫోన్ మరియు వీడియో గేమ్లను నిద్రకి ఉపక్రమించడానికి ముందు ఆఫ్ చేయడం వలన నాణ్యమయిన నిద్ర పొందడమే కాకుండా తద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.   పరిశోధకులు దేశవ్యాప్తంగా 14 మరియు 17 ఏళ్ల మధ్య 197 విద్యార్ధుల నుండి డేటాను సేకరించేందుకు ఒక ఆన్లైన్ సాధనాన్ని ఉపయోగించారు. వాళ్ళు ఈ పరిశోధనలో గమనించింది ఏంటంటే, మంచి నిద్ర మూలంగా విద్యార్థుల్లో డిప్రెషన్ మరియు ఆందోళన సమస్యలు తక్కువగా వస్తాయి.   ఉదయం 8.30 తర్వాత పాఠశాలకు వెళ్లే విద్యార్థుల్లో ఈ లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు.

మొదటి రోజు పనిలో ఈ 5 విషయాలు చేయకండి....!

  అది మనకి మొట్ట మొదటి ఉద్యోగమా లేక పదవదా అని సంబంధం లేకుండా, ఒక ఆఫీస్ లో మొదటి సారి కాలు పెట్టిన ప్రతి సారి కొంచెం ఒత్తిడికి గురవడం సర్వసాధారణమయిన విషయం. అసలు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నామో కూడా తెలియదు, కానీ చేతులు వణకడం, గొంతు రాకపోవడం, ఇలాంటివి కొన్ని మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. ఇలాంటి సందర్భంలో కొన్ని తప్పులు చేస్తుంటాం. అయితే, మొదటి రోజు ఉద్యోగంలో ఈ పనులు మాత్రం ఖచ్చితంగా చేయకుండా జాగ్రత్త వహించండి.   1 . అల్పాహారం దాటవేయడం: ఒకవేళ మీకు ఉదయం టిఫిన్ చేసే అలవాటు లేకపోయినా, ఇంటిని వదిలే ముందు ఖచ్చితంగా తినేసే బయల్దేరండి, ఎందుకంటే ఆఫీస్ లో పరిస్థితులు ఎలా ఉంటాయో మీకు ఖచ్చితంగా అవగాహన ఉండదు. క్యాంటీన్ కానీ కాఫీ షాప్ గాని ఆఫీస్ ప్రాంగణంలో దొరుకుతుందో లేదో... ఆఫీస్ లో పని ఎలా ఉంటుందో... విరామ సమయం ఎప్పుడో... ఈ విషయాలు తెలియదు కాబట్టి టిఫిన్ చేసి వెళ్లడమే ఉత్తమం.   2 . ఆలస్యం గా రావడం, త్వరగా వెళ్లిపోవడం: ట్రాఫిక్ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది అన్న విషయం మనకి విదితమే. కాబట్టి, ట్రాఫిక్ అనేది ఆలస్యానికి ఒక సాకుగా ఎప్పుడూ చెప్పే పరిస్థితి తెచ్చుకోకండి, మరీ ముఖ్యంగా ఆఫీస్ కి వెళ్లే మొదటి రోజు. కొంచెం ముందుగా వెళ్లడం వల్ల మనకి పోయేది కూడా ఏం లేదు కదా. ఒక రకంగా పరిస్థితులు, వాతావరణం అలవాటు పడటానికి సమయం దొరుకుతుంది. ఇక ఆఫీస్ నుండి ఇంటికి వెళ్లే విషయంలో తొందరపడకండి. బాస్ దగ్గర చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది.   3 . సెలవు తీసుకోవడం: అది మీరు ఆఫీస్ కి వెళ్లే మొదటి రోజు కాబట్టి పొరపాటున కూడా సెలవు తీసుకునే కార్యక్రమాలు ఏం పెట్టుకోకండి. ఒక వేళ డాక్టర్ అపాయింట్మెంట్ ఉంటే, వేరే తేదీకి మార్చే ప్రయత్నం చేయండి. తప్పదు అనుకుంటే అదే రోజు ఆలస్యం గా వెళ్లే వెసులుబాటు చేసుకోండి. ఎందుకంటే, ఒక రోజు మొత్తం సెలవు తీసుకోవడం కన్నా, కొంచెం పని చేసి వెళితే మంచిది కదా.   4 . అసౌకర్యవంతమయిన దుస్తులు ధరించడం: మొదటి రోజు ఆఫీస్ అనగానే సహోద్యోగులకి గొప్పగా కనిపించే ప్రయత్నంలో స్టైలిష్ దుస్తులు ధరిస్తాం. అయితే, వీలయినంత వరకు మెట్లు ఎక్కడం కానీ, ఆఫీస్ లో వేరే ఇతర ఏదయినా పనులకి విఘాతం కలిగించని మరియు మీకు సౌకర్యవంతమయిన బట్టలు వేసుకోండి. కొంచెం అలవాటు అయ్యేవరకు మనం రెగ్యులర్ గా వేసే దుస్తులు ధరిస్తేనే మంచిది.   5 . ఎక్కువగా ఫోన్ వినియోగించడం: మీకు ఎంతయితే ఉత్సాహం ఉంటుందో, మీ కుటుంబ సభ్యులకి గాని సన్నిహితులకు గాని అంతకు మించిన అత్యుత్సాహం ఉంటుంది. మీరు ఆఫీస్ లో ఉన్న సమయంలోనే ఫోన్ చేసి ఎలా ఉంది అని ఒకరి తర్వాత ఒకరు అడిగే ప్రయత్నం చేస్తారు. కొందరు, వేరే విషయాలు ఆలోచించకుండా లేదా ఒత్తిడిని అధిగమించడానికి వచ్చిన అన్ని ఫోన్స్ మాట్లాడుతూ సమయం గడిపేస్తారు. అయితే, ఇలా చేస్తే మీ బాస్ కి మొదటి రోజే అడ్డంగా దొరికిపోతారు. వీలయినంత మటుకు ఫోన్ సైలెంట్ లో పెట్టి బ్రేక్ సమయంలో మాట్లాడండి.    

భయం నిజమై తీరుతుంది

అదో చిన్న ఊరు. అందులో ఒకాయన సమోసాలు అమ్ముకుంటూ ఉండేవాడు. ఉదయం అంతా సమోసాల కోసం కావల్సిన సామగ్రిని తయారుచేయడం. మధ్యాహ్నం నుంచి వేడివేడి సమోసాలు తయారుచేయడం. ఇదే అతనికి తెలిసిన పని. ఇలా చేసిన సమోసాలు... అలా చిటికెలో అమ్ముడుపోయేవి. ఆ సమోసాల కోసం ఊళ్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. పొరుగూరి నుంచి ఎవరు వచ్చినా కూడా ఆ సమోసాల రుచి చూడకుండా వెళ్లేవారు కాదు. రోజురోజుకీ సమోసాల వ్యాపారం పెరుగుతోందే కానీ ఏ రోజూ తగ్గడం అంటూ ఉండేది కాదు. జోరు వానలో అయినా, మండు వేసవిలో అయినా... వేడి వేడి సమోసాలు ఇట్టే అమ్ముడుపోయేవి.   సమోసాల వ్యాపారికి ఒకే ఒక్క పిల్లవాడు ఉండేవాడు. తన వ్యాపారంలో మంచి లాభాలు రావడంతో ఆ పిల్లవాడిని పట్నం పంపించి చదువు చెప్పించాడు. తను మాత్రం ఒంటరిగా ఆ పల్లెటూర్లో జీవితాన్ని గడిపేసేవాడు. ఉదయాన లేవడం దగ్గర నుంచీ, రాత్రికి పడుకోవడం దాకా అతని జీవితం అంతా సమోసాల చుట్టూనే తరిగేది. వార్తాపత్రికలు చదవడానికి కానీ, టీవీ చూడ్డానికి కానీ ఎలాంటి అవకాశమూ చిక్కేది కాదు.   అలా సమోసాల వ్యాపారం అంతకంతకూ పెరగసాగింది. చిన్న బండి కాస్తా ఓ దుకాణంగా మారింది. తనకు సాయంగా ఉండేందుకు మరో మనిషి ఉంటే బాగుండు అనిపించింది వ్యాపారికి. మరో పెద్ద దుకాణం కూడా తీసుకోవాలని తోచింది. తన ఆలోచనలన్నింటినీ కొడుకుతో పంచుకున్నాడు వ్యాపారి. వ్యాపారి మాటలు వింటూనే కొడుకు ఉద్రేకపడిపోయాడు...    ‘అసలు ప్రపంచం ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో నీకు తెలుసా! స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలిపోతున్నాయి. ఉద్యోగాలన్నీ ఊడిపోతున్నాయి. ముడిచమురు ధర కూడా పడిపోయింది. అమెరికాని నాశనం చేయడానికి ఉత్తర కొరియా సిద్ధంగా ఉంది. ఇలాంటి సమయంలో అదనంగా పెట్టుబడి పెట్టడం అవివేకం. ఉన్న వ్యాపారంలోనే ఇంకా ఎక్కువ మిగుల్చుకోవడం ఎలాగా అని ఆలోచించు’ అని ఉపదేశం చేశాడు కొడుకు.   కొడుకు చెప్పిన మాటలు విన్న వ్యాపారి మనసులో భయం మొదలైంది. తన కొడుకు చదువకున్నవాడు, తెలివైనవాడు, అన్నీ తెలిసినవాడు.... అతను చేసిన సూచన నిజమే కాబోసని అనిపించింది. అంతే విస్తరణ సంగతి పక్కన పెట్టి, ఉన్న వ్యాపారంలో మరింత లాభం ఎలా సంపాదించాలా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. నాసిరకం ఉల్లిపాయలతో సమోసాలు చేయడం మొదలుపెట్టాడు. ఒకటే నూనెని పదే పదే వాడసాగాడు. సమోసాని కూరతో కాకుండా కారంతో నింపేశాడు. రేటు కూడా అమాంతంగా పెంచేశాడు.   వ్యాపారి ధోరణి మారిన కొద్దీ జనం కూడా పల్చబడసాగారు. సమోసాలు మిగిలిపోతున్నాయి. వాటిని మర్నాడు అమ్మే ప్రయత్నాలు కూడా మొదలవడంతో జనం అటువైపుగా రావడమే మానేశారు. చూస్తూచూస్తుండగా వ్యాపారం కాస్తా దివాళా తీసింది. ఈలోగా కొడుకు మళ్లీ పట్నం నుంచి వచ్చాడు. ‘నిజమేరా కొడకా! నువ్వు చెప్పినట్లు దేశ ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదు. సమోసాలు కొనడానికి కూడా జనం దగ్గర డబ్బు లేదు. దాంతో నా వ్యాపారం కూడా దివాళా తీసింది!’ అంటూ నిట్టూర్చాడు తండ్రి!!! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)      - నిర్జర.

జీవితాన్ని మార్చేసే - Pareto principle

జీవితంలో అందరికీ అన్నీ ఉండవు. అన్ని చోట్లా ఒకే తరహా ఫలితాలు రావు. ఈ విషయాలు మనకి తెలిసినవే! కానీ ఇలా వేర్వేరు ఫలితాల వెనక ఏదన్నా లెక్క ఉందా అన్న ఆలోచన కలిగింది ‘పేరెటో’ (pareto) అనే ఇటాలియన్‌ ఆర్థికవేత్తకి. మన జీవితంలో కనిపించే 80 శాతం ఫలితాలకు 20 శాతం కారణాలే ఉంటాయని ఆయన ఓ సూత్రం రూపొందించాడు. ఆ తర్వాత కాలంలో ఆయన పేరు మీదగానే ఈ సూత్రం pareto principle పేరుతో ప్రసిద్ధికెక్కింది. ఈ సూత్రాన్ని కాస్త జాగ్రత్తగా పాటిస్తే మన జీవితాలే మారిపోతాయని ఓ నమ్మకం.   Pareto principleకి 80:20 rule అన్న పేరు కూడా ఉంది. ఏ రంగంలో చూసినా ఈ సూత్రం పనిచేస్తూ ఉంటుందని అంటారు. ఉదాహరణకు సంపదనే తీసుకోండి! మన సమాజంలో ఉండే సంపదలో 80 శాతం సంపద 20 శాతం మంది దగ్గరే కనిపిస్తుంది. సాఫ్టవేర్‌ రంగంలో 20 శాతం తప్పుల వల్లే 80 శాతం సమస్యలు తలెత్తుతాయని తేలింది. ఆఖరికి మన చుట్టూ జరిగే 80 శాతం నేరాలకి కారణం 20 శాతం మంది నేరస్తులే అని కూడా వెల్లడయ్యింది.   ఈ 80:20 సిద్ధాంతాన్ని పరిశ్రమలకి కూడా అన్వయించవచ్చు. ఆఫీసుల్లో వచ్చే 80 శాతం ఫలితాలకి అందులో పనిచేసే 20 శాతం మందే కారణం అవుతుంటారట. ఆ 20 శాతం మందినీ గుర్తించి ప్రోత్సహించడం, మిగతా కార్మికులని మరింత జాగ్రత్తగా నియంత్రించడం చేస్తే... మరింత మెరుగైన ఫలితాలు వస్తాయన్నది నిపుణులు సూచిస్తున్నారు.   ఈ pareto principleని తొలిసారిగా ఎప్పుడో 1896లో ప్రతిపాదించారు. ఆ తర్వాత ప్రపంచంలో ఎన్నో మార్పులు జరిగాయి. కంప్యూటర్లు వచ్చాయి, ప్రపంచీకరణ జరిగింది. అయినా ప్రతి కొత్త రంగంలోనూ ఈ సిద్ధాంతం పనిచేయడం ఆశ్చర్యకరమే! అందుకే ఓ అడుగు ముందుకు వేసి అసలు ప్రకృతిలోనే ఈ సూత్రం ఇమిడి ఉందని అంటున్నారు. మన కంటి ముందు కనిపించే 80% పంటలకు కారణం, 20% విత్తనాలే అన్న వాదనా ఉంది.   ఇంత ప్రత్యేకమైన ఈ 80:20 సిద్ధాంతం మన నిజజీవితంలో కూడా ఉపయోగపడుతుందన్నది ఓ వాదన. ఉదయాన్న లేచిన వెంటనే మనం ఆలోచించే తీరు మిగతా రోజునంతా ప్రభావితం చేస్తుందట. ఏదన్నా పనిచేసే ముందు, ఆ పని ఎలా పూర్తిచేయాలా అని కాసేపు ప్రణాళిక వేసుకోవడం వల్ల 80 శాతం పని సులువుగా సాగిపోతుందట. ఏదన్నా నిర్ణయం తీసుకునేముందు అసలు మన ముందు ఉన్న ఎంపికలు (choices/ directions) ఏమిటి అని కాసేపు ఆలోచిస్తే... 80 శాతం సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందట. అంటే ఓ 20 శాతం పరిస్థితులను మనం జాగ్రత్తగా అదుపుచేయగలిగితే, 80 శాతం ఫలితాలు దక్కితీరతాయన్నమాట. ఇదేదో బాగానే ఉంది కదా!   - నిర్జర.

డయాబెటిస్‌ రావాలా వద్దా... మన చేతుల్లోనే!

  ఒకప్పుడు షుగర్‌ అంటే బాగా డబ్బున్నవాళ్లకి వచ్చే జబ్బనుకునేవారు. ఇప్పుడు ప్రతి కుటుంబంలోనూ ఎవరో ఒకరు షుగర్ వ్యాధితో బాధపడుతూ కనిపిస్తున్నారు. వంశపారంపర్యంగా షుగర్ ఉంటే, ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువని అందరికీ తెలిసిందే! ఎలాంటి శారీరిక శ్రమా లేని జీవనశైలి కూడా ఈ వ్యాధి త్వరగా వచ్చేందుకు ప్రేరేపిస్తుందని తెలిసిందే! కానీ మనకి డయాబెటిస్ రావాలా వద్దా అని నిర్ణయించడంలో మన ఆహారానిదే ముఖ్య పాత్ర అని సరికొత్త పరిశోధనలు నిరూపిస్తున్నాయి.   స్వీడన్‌కు చెందిన కొందరు పరిశోధకులు ఆహారపు అలవాట్లకీ, డయాబెటిస్‌కీ మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవాలనుకున్నారు. ఇందుకోసం గోధెన్‌బర్గ్‌ అనే పట్నంలోని 600 మందికి పైగా ఆడవారిని ఎంచుకున్నారు. దాదాపు ఆరు సంవత్సరాల వ్యవధిలో, మూడు దఫాలుగా వీరందరి ఆహారపు అలవాట్లనీ గమనించారు.   సాధారణంగా ఒకరి వ్యక్తిగత ఆహారపు అలవాట్లని నిశితంగా నమోదు చేయడం కష్టమవుతుంది. అందుకని పరిశోధకులు, అభ్యర్థుల రక్తనమూనాలని సేకరించారు. ఈ రక్తనమూనాలలో ఉండే పోషకాలని గమనించడం ద్వారా, వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నారో అంచనా వేసే ప్రయత్నం చేశారు. ఒకరకంగా చెప్పాలంటే ఇలా ఒకొక్కరి నుంచి సేకరించిన నమూనా, వారి ఆహారాన్ని సూచించే వేలిముద్రలా (metabolic fingerprint) పనిచేస్తుందన్నమాట.   చేపలు, వంటనూనెలు, తృణధాన్యాలు, విటమిన్‌ ఈ కలిగిన పదార్థాలు ఎక్కువగా తినేవారిలో డయాబెటిస్ చాలా తక్కువగా వస్తున్నట్లు తేలింది. అదే మాంసం, కొవ్వు పదార్థాలు తినేవారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం మెండుగా ఉన్నట్లు గ్రహించారు. అంటే మనం తినే ఆహారమే, భవిష్యత్తులో మనకి డయాబెటిస్ వస్తుందా రాదా అన్న విషయాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తోందన్నమాట.   ప్రపంచం మొత్తం మీదా డయాబెటిస్‌ ఎక్కువగా ఉండే దేశాలలో మనది రెండో స్థానం. మరో రెండు దశాబ్దాలలో మనదే మొదటి స్థానం అన్న అంచనాలూ వినిపిస్తున్నాయి. ఇప్పటికే మన దేశంలో ఆరుకోట్ల మందికి పైగా జనాభా డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లు తేలింది. సాధారణంగా 40 ఏళ్ల వచ్చేసరకి డయాబెటిస్‌ లక్షణాలు కనిపించడం మొదలుపెడతాయట. కాబట్టి చిన్నవయసు నుంచే పిల్లలకు మంచి ఆహారపు అలవాట్లని నేర్పిస్తే... భవిష్యత్తులో వారు డయాబెటిస్‌కు వీలైనంత దూరంగా ఉంటారు. పైన పేర్కొన్న పరిశోధనే ఇందుకు సాక్ష్యం. - నిర్జర.  

ఈ ఏడు చిట్కాలు పాటిస్తే... నూరేళ్లు బతికేయచ్చు!

  నిండు నూరేళ్లు బతకాలని ఎవరికి మాత్రం ఉండదు. కానీ అలా బతికితే సరిపోదు! వృద్ధాప్యంలో కూడా మెదడు చక్కగా పనిచేయాలి. ఎంతటి కష్టాన్నయినా తట్టుకునేంత గుండెబలం ఉండాలి. చాలామందికి వయసు గడిచేకొద్దీ ఈ రెండు అవయవాలే బలహీనపడిపోతుంటాయి. ఎన్నాళ్లు బతికి ఏం లాభం అన్నట్లుగా కాలాన్ని నెట్టుకొస్తూ ఉంటారు. మరి ఇందుకు ఉపాయం లేదా అంటే లేకేం!   అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌కు చెందిన పరిశోధకులు బలమైన గుండె, మెదడు ఉండటానికి ఎలాంటి జీవనశైలి ఉండాలో తెలుసుకోవాలనుకున్నారు. ఇందుకోసం ఇప్పటివరకూ ఈ దిశగా వచ్చిన 182 పరిశోధనల ఫలితాలను క్రోడీకరించి చూశారు. వాటిని గమనించిన తర్వాత అసలు గుండె, మెదడు ఎందుకు దెబ్బతింటాయో ఒక అవగాహన ఏర్పడింది. దాన్ని అధిగమించే చిట్కాలూ కనిపించాయి.   మన రక్తనాళాలు నిదానంగా కుంచించుకుపోవడమే గుండె, మదడులు దెబ్బతినేందుకు ప్రధాన కారణం అని తేలింది. ఇలా రక్తనాళాలు కుదించుకుపోవడం వల్ల రక్తసరఫరా తగ్గిపోవడమే కాకుండా, కొవ్వులాంటి పదార్థాలు కూడా అక్కడ పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇది క్రమేపీ పక్షవాతం, గుండెపోటు వంటి సమస్యలకి దారితీస్తూ ఉంటుంది. వైద్యపరిభాషలో ఈ పరిస్థితిని atherosclerosis అంటారు.   Atherosclerosis ఒక వ్యాధి కావచ్చు. కానీ చాలా సందర్భాలలో మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కూడా ఈ పరిస్థితికి కారణం అవుతాయి. సరైన శారీరిక వ్యాయామం లేకపోవడం, మంచి ఆహారాన్ని తీసుకోకపోవడం, పొగాకు వంటి వ్యసనాలు... అన్నీ కూడా రక్తనాళాలలు కుదించుకుపోయేలా చేస్తాయి. అల్జీమర్స్, డిమెన్షియా వంటి రోగాలకు కూడా కారణం అవుతాయి.   ఇంతకీ ఈ పరిస్థితిని దాటేందుకు పరిశోధకులు చెబుతున్న ఏడు చిట్కాలు ఇవే....... - రక్తపోటుని అదుపులో ఉంచుకోవడం. - ఒంట్లో కొలెస్ట్రాల్ మోతాదు మించకుండా చూసుకోవడం. - షుగర్‌ని నియంత్రించుకోవడం. - శారీరక శ్రమ చేయడం. - పౌష్టికాహారాన్ని తీసుకోవడం. - బరువుని ఎప్పటికప్పుడు సరిచూసుకోవడం. - పొగాకు జోలికి పోకుండా ఉండటం. వినేందుకు ఈ పద్ధతులన్నీ కాస్త కఠినంగానే ఉండవచ్చు. కానీ అనారోగ్యంతో ఇల్లూ, ఒళ్లూ గుల్ల చేసుకునేకంటే ఇది చాలా సులభం అంటున్నారు. లేకపోతే మున్ముందు కోట్లమంది డిమెన్షియాలాంటి సమస్యలని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. - నిర్జర.  

యువతని వెర్రెత్తిస్తున్న ‘జిమిక్కి కమ్మల్‌’ పాట!

  ఓ ఐదేళ్ల క్రితం వచ్చిన ‘వై దిస్‌ కొలవరి డీ’ పాటను ఎవరు మర్చిపోగలరు. అప్పట్లో ఏ సందులో చూసినా ఈ పాటే వినిపించేది. ప్రతి వేదిక మీదా ఈ పాటకి అడుగులు వేసేవారు. అలా ఓ ఏడాదిపాటు ఈ పాటని పీల్చి పిప్పి చేసి వదిలిపెట్టాం. దేశాన్ని అంతగా వెర్రెత్తించిన పాట మళ్లీ రావడం అసాధ్యం అనుకున్నారంతా. కానీ వచ్చేసింది. అదే జిమిక్కి కమ్మల్‌!   ఆగస్టు నెలాఖరున మలయాళంలో ‘వెలిపండితె పుస్తకం’ అనే సినిమా వచ్చింది. ఇందులో మోహన్‌లాల్ హీరో! ఆయనది కాలేజి కుర్రకారుని అదుపు చేసే లెక్చరర్‌ పాత్ర. నిజానికి ఈ సినిమా ఏమంత గొప్పగా లేదంటూ విమర్శకులు పెదవి విరిచారు. మోహన్‌లాల్‌లోని నటుడిని ఇందులో ఉపయోగించుకోలేకపోయారంటూ దెప్పిపొడిచారు.     మొత్తానికి వెలిపండితె పుస్తకం ఓ మాదిరి విజయాన్ని మాత్రమే సాధిస్తుందనుకున్నారంతా! కానీ అందులోని ఓ పాట కారణంగా ఇప్పుడు సినిమా తెగ వసూళ్లు సాధిస్తోంది. సినిమాలోని ఓ సందర్భంలో కుర్రకారు ‘జిమిక్కి కమ్మల్‌’ అనే సరదా పాటని పాడుకుంటారు. ‘మా అమ్మ కమ్మలు’ అని ఈ పాట అర్థం. పాటలో పెద్దగా సరుకు లేదు. కానీ పాట వెనుక వినిపించే బీట్‌కు చిత్రమైన ఆకర్షణ ఉందని తోచింది నిర్మాతలకు. అంతే! ‘జిమిక్కి కమ్మల్‌ ఛాలెంజ్’ పేరుతో ఒక పోటీని మొదలుపెట్టారు. ఆ పాట బీట్‌కు అనుగుణంగా ఎవరైనా నాట్యం చేయవచ్చంటూ ప్రచారం మొదలుపెట్టారు.   ‘జిమిక్కి కమ్మల్‌ ఛాలెంజ్’ నిజంగానే ఓ ట్రెండ్‌గా మారింది. అదే సమయంలో ఓనమ్‌ పండుగ కూడా రావడంతో కేరళలో జరిగే ప్రతి వేడుకలోనూ జిమిక్కి కమ్మల్‌కు నాట్యం చేయడం మొదలుపెట్టారు. అలా కొచ్చిలోని Indian School of Commerceలో జరిగిన ఓనం కార్యక్రమంలో కూడా ఈ పాటకి డాన్స్ చేశారు. ఇహ అక్కడి నుంచి ఈ కథ మరో మలుపు తీసుకుంది.   Indian School of Commerceలో జరిగిన డాన్స్‌ని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయగానే ఒక్కసారిగా వైరల్‌గా మారిపోయింది. పట్టుమని పది రోజులైనా గడవకముందే ఈ వీడియోని 90 లక్షల మంది చూశారు. ఆ వీడియోలో అందరికన్న హుషారుగా డాన్స్ చేస్తున్న ‘షెరిల్‌ కాదవన్’ అనే టీచరుకి ఫిదా అయిపోయారు. రాత్రికి రాత్రే షెరిల్‌కి లక్షలాది మంది ఫ్యాన్స్ ఏర్పడిపోయారు. ఆమె పేరుతో వందలాది సోషల్‌ మీడియా అకౌంట్లు పుట్టుకు వచ్చాయి. సినిమాల్లో ఆఫర్లూ మొదలైపోయాయి. ఈ పాటతో తన జీవితమే మారిపోయిందనీ, తనకి భయం కలిగేంత పాపులారిటీ వచ్చేసిందని షెరిల్‌ వాపోతున్నారు.   మొత్తానికి జిమిక్కి కమ్మల్‌ పుణ్యమా అని మలయాళ చిత్ర పరిశ్రమ మరోసారి వార్తల్లో నిలిచింది. 2015లో  వచ్చిన ప్రేమమ్, గత ఏడాది వచ్చిన పులిమురుగన్‌ (మన్యం పులి) సినిమాల విజయంతో ఊపు మీదున్న మలయాళ పరిశ్రమకి మరో గౌరవం దక్కింది. ఒకవైపు ఈ పాటకు యువత నాట్యం చేస్తుంటే, మరోవైపు తమ అభిమాన నటులు ఈ పాటకి డాన్స్ చేస్తున్నట్లుగా వీడియోలు వెలువడుతున్నాయి.   కొసమెరుపు: అమెరికాలో Jimmy Kimmel అనే టీవీ వ్యాఖ్యాత ఉన్నాడు. ఈ పాట చరణాలు ఆయన పేరుకి దగ్గరగా ఉండటంతో ఆయన ట్విట్టర్ పేజి కూడా సందడిగా మారిపోయిందట. విషయం తెలుసుకున్న Jimmy Kimmel తాను కూడా ఆ పాటని చూసి షెరిల్‌ అభినయానికి అభిమానిగా మారిపోయాడు.  - నిర్జర.  

ఇది తాగితే నిద్ర పట్టేస్తుంది!

  ఒత్తిడి. ఈ మాట గురించి ప్రత్యేకంగా మళ్లీ చెప్పుకోనవసరం లేదు. ఇది మన జీవితాలలో ఉన్నదే! మారుతున్న జీవనశైలి పుణ్యమా అని అటు ఉద్యోగంలోనూ, ఇటు ఇంట్లోనూ కావల్సినంత ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడితో నిద్ర పట్టని మాటా నిజమే! అలాంటి నిద్రలేమి వల్ల డిప్రెషన్‌, గుండె జబ్బులు, ఊబకాయం లాంటి సమస్యలు సరేసరి. పోనీ నిద్రమాత్రలు వేసుకుందామా అంటే... వాటికి ఉండే దుష్ప్రభావాలూ తక్కువేం కాదు. వెరసి ఇటు నిద్రా పట్టక, అటు ఆరోగ్యమూ చెడిపోయే పరిస్థితి. కానీ ఇందుకో చిట్కా ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.   జపానుకి చెందిన కొందరు శాస్త్రవేత్తలు.. ఒత్తిడి వల్ల కలిగే నిద్రలేమిని దూరం చేసే పదార్థాల మీద ఓ పరిశోధన చేశారు. ఇందుకోసం Octacosanol అనే రసాయనం ఏమేరకు ఉపయోగపడుతుందో చూశారు. ఈ Octacosanolను ఎలుకల మీద ప్రయోగించినప్పుడు ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. ఈ రసాయనం ఎలుకలలోకి చేరగానే వాటిలోని ఒత్తిడి చాలావరకు తగ్గిపోయినట్లు తేలింది. మన రక్తంలోని ఒత్తిడని సూచించే corticosterone అనే పదార్థం చాలా అదుపులో కనిపించింది. Corticosterone అదుపులోకి రాగానే గాఢనిద్ర పడుతున్నట్లు తేలింది.   ఒకే ఒక్క రసాయనంతో మనలోని ఒత్తిడి తగ్గిపోతుందనీ, మంచి నిద్ర పడుతుందనీ తేలిపోయింది. కానీ దీన్ని వాడేదెలా! Octacosanol ఇప్పటికే మందుల రూపంలో దొరుకుతోంది. కొవ్వుని తగ్గించడానికీ, బలాన్ని పెంచడానికీ ఈ మందును వాడుతూ ఉంటారు. గోధుమలు, బియ్యపు పొట్టు నుంచి ఈ పొడిని తయారుచేస్తుంటారు.   మందుగా కాకుండా మనకి కనిపించే ఓ ఆహారపదార్థంలో కూడా ఈ Octacosanol పుష్కలంగా లభిస్తుందని చెబుతారు. అదే చెరుకురసం! తెల్లటి చెరుకుగడల నుంచి తీసిన రసంలో ఈ రసాయనం తగినంత మోతాదులో ఉంటుందట. కాబట్టి ఎప్పుడన్నా ఒత్తిడితో నిద్ర పట్టకపోతుంటే ఓ గ్లాసుడు చెరుకురసం తీసుకుంటే తప్పకుండా ఫలితం దక్కుతుందని సూచిస్తున్నారు. - నిర్జర.  

కుక్కలకీ ఉంది డెమోక్రసీ!

  మనిషి సంఘజీవి! నలుగురితో కలిసిమెలిసి బతకనిదే అతనేం సాధించలేడు. కానీ నలుగురూ కలిసి బతుకుతున్నప్పుడు... అందరి మాటకీ విలువ ఉండాలి, అందరికీ న్యాయం జరగాలి. అందుకే ప్రజాస్వామ్యం అనే విధానం అమల్లోకి వచ్చింది. ఎక్కువమంది ఏది అనుకుంటే, ఆ నిర్ణయానికి కట్టుబడటమే ప్రజాస్వామ్యం. ఇప్పటిదాకా మనుషులకి మాత్రమే పరిమితం అయిన ఈ పద్ధతి, జంతువులలో కూడా ఉందని నిరూపిస్తోంది ఓ పరిశోధన. దక్షిణ ఆఫ్రికాలోని ఓ చిన్న దేశం బోత్స్వానా (Botswana). ఇక్కడి అడవుల్లో అరుదైన ఆఫ్రికన్‌ కుక్కలు నివసిస్తున్నాయి. అంతరించిపోతున్న ఈ జాతిని గమనించేందుకు సిడ్నీ నుంచి కొందరు పరిశోధకులు బోత్స్వానాకు చేరుకున్నారు. అక్కడి వాటి తీరుతెన్నులని గమనిస్తున్న సదరు పరిశోధకులకు ఓ ఆశ్చర్యకరమైన విషయం కనిపించింది. అడవి కుక్కలు వేటకి బయల్దేరేటప్పుడు మాంఛి హడావుడి చేస్తాయి. వాటిలో ఒక బలమైన కుక్క సారథ్యం వహించగా, అన్నీ కలిసి ఓ గుంపుగా వేటకి బయల్దేరతాయి. అంతవరకూ బాగానే ఉంది. కానీ కుక్కలు బయల్దేరే ముందు ఓ నాలుగు తుమ్ములు తుమ్మి బయల్దేరడమే విచిత్రం. కుక్కలు ఎక్కువగా తమ వాసన మీదే వేటని పసిగడతాయన్న విషయం తెలిసిందే! అందుకే తమ ముక్కులని సరిచేసుకునేందుకా అన్నట్లు అవి తుమ్ముతాయి. కానీ సరిగ్గా వేటకి బయల్దేరేముందు అన్నీ ఇలా పనిగట్టుకుని తుమ్మడం వెనుక ఏదన్నా కారణం ఉందేమో అని గమనించే ప్రయత్నం చేశారు పరిశోధకులు. ఇందుకోసం బోత్స్వానాలో ఐదు వేర్వేరు ప్రాంతాలలో నివసించే అడవి కుక్కల గుంపుల తీరుని గమనించడం మొదలుపెట్టారు. ఒకటి కాదు రెండు కాదు... 68 సందర్భాలలో అవి వేటకి బయల్దేరుతున్నప్పుడు, వాటి శబ్దాలని రికార్డు చేశారు. ఎక్కువ తుమ్ములు వినిపించినప్పుడు అవి వేటకి బయల్దేరాయనీ, తుమ్ములు తక్కువగా వినిపించినప్పుడు అవి వేటని విరమించుకున్నాయనీ తేలింది. అంటే తుమ్ముల ద్వారా అవి తమ ఓటుని ప్రకటిస్తున్నాయి! వేటకి వెళ్లడం తమకి ఇష్టం ఉందా లేదా అన్న అభిప్రయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నమాట! పైగా గుంపుకి నాయకత్వం వహించే కుక్క లేకపోతే, మరిన్ని తుమ్ములు అవసరం కావడాన్ని గమనించారు. ఈ పరిశోధన చాలా చిన్నదే! కానీ కలిసి జీవించేటప్పుడు ఎలా మెలగాలో... జంతువులకి కూడా ఓ అవగాహన ఉన్నట్లు బయటపడుతోంది. ఓ పక్క కుక్కలేమో ప్రజాస్వామ్యానికి అలవాటు పడుతున్నాయి. మరి మనుషులేమో ఉన్న ప్రజాస్వామ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. బలవంతుడిదే రాజ్యం అనే జంతుధర్మానికే ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తున్నారు. మరి ఇప్పుడు ఎవరు ఎవరి నుంచి నేర్చుకోవాలి? - నిర్జర.  

ఇవి చేతిలో ఉంటే ఒత్తిడి తగ్గిపోతుంది!

  ‘అ... ఆ’ సినిమా గుర్తుందా! అందులో సమంత చేతిలో ఎప్పుడూ ఓ రబ్బరు బంతి ఉంటుంది. ఇంట్లో దొంగలు పడితే ఏ వస్తువైనా వదులుకుంటుంది కానీ, ఆ ‘స్ట్రెస్ బాల్‌’ని మాత్రం వదులుకోదు. ఇదొక్కటే కాదు.... మనసులో ఉన్న ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఈమధ్య కాలంలో చాలా వస్తువులే అందుబాటులో ఉన్నాయి. వాటిలో స్ట్రెస్ బాల్‌ ఒకటి మాత్రమే. మన కండరాలలో పేరుకున్న ఒత్తిడిని స్ట్రెస బాల్‌ మీద చూపడం వల్ల ఇది ప్రభావం చూపుతుంది. మరి మిగతా వస్తువులు ఏమిటో, అవి ఎలా పని చేస్తాయో…   Fidget Spinner :- ఈమధ్యకాలంలో పిల్లవాడి దగ్గర నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరి చేతిలోనూ ఇది కనిపిస్తోంది. చిన్న ఫ్యాన్‌లాగా ఉండి, మధ్యలో బేరింగ్స్ ఉండే ఈ స్పిన్సర్‌ ఇప్పుడో ట్రెండ్‌. చాలామంది చేతులలో ఏదో ఒకటి కదిలించడం వల్ల రిలాక్స్ అవుతూ ఉంటారు. వేలికి ఉన్న ఉంగరం తిప్పుడూ ఉండటం, పెన్నుని వేళ్ల మధ్య ఆడించడం చేస్తూ ఉంటారు. దీన్నే ఫిడ్గెటింగ్‌ అంటారు. అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే ‘కెలకడం’ అనవచ్చు. Fidget Spinner సరిగ్గా ఇదే పని చేసి పెట్టి ఒత్తిడిని మాయం చేస్తుంది.   Fidget cube :- ఫిడ్గెట్‌ స్పిన్నర్‌ అంత కాకపోయినా, ఫిడ్గెట్‌ క్యూబ్‌ కూడా ఈమధ్యకాలంలో బాగానే ప్రచారంలోకి వచ్చింది. ఒక క్యూబ్‌కి ఆరు వైపులా ఉండే రకరకాల వస్తువులను నొక్కడం వల్ల ఒత్తిడి తగ్గించేసుకోవచ్చునంటున్నారు. స్విచ్‌లు, బటన్లు, జాయ్‌స్టిక్... ఇలా ఎలక్ట్రానిక్‌ పరికరాల మీద ఉండే రకరకాల మీటలన్నీ ఈ క్యూబ్‌ మీద ఉంటాయి. దీంతో ఒత్తిడి తగ్గడంతో పాటు ఏకాగ్రత కూడా మెరుగుపడుతుందన్న వాదనలూ ఉన్నాయి.   Worry beads :- మనసు ఎప్పుడూ పరిపరివిధాలా పోతూ ఉంటుంది. అందుకే దేవుడి మీద దృష్టి పెట్టాలంటే, ఇతరత్రా ఆలోచనలని అదుపు చేసేందుకు చేతిలో జపమాల ఉంచుకోవాలని చెబుతారు పెద్దలు. పెద్దల మాటల్ని కొట్టివేసే కుర్రకారు ఇప్పుడు ఇలాంటి మాలలనే చేతిలో పట్టుకుని తిరుగుతున్నారు. అవే వర్రీ బీడ్స్‌! చేతిలో అటూ ఇటూ ఆడిస్తూనో, వాటిని లెక్కపెట్టుకుంటూనో, పూసలు శబ్దం చేసేలా ఒకదానికి ఒకటి తాటిస్తూనో సమయం గడిపేస్తారు.   Worry stones :- చాలామంది మనసులో ఒత్తిడిన ఎదుర్కొనేందుకు గోళ్లు కొరుక్కుంటూ ఉంటారు. ఇక పెదాలు కొరుక్కోవడం, జుట్టు పీక్కోవడం లాంటి అలవాట్లూ కనిపిస్తుంటాయి. వర్రీ స్టోన్స్ ఇలాంటి అలవాట్ల నుంచి ధ్యాస మళ్లిస్తుంది. అరచేతిలో ఒక రాయిని ఆడిస్తూ ఉండటం వల్ల, ఒత్తిడి తగ్గే అవకాశం ఇస్తుంది. ఇంతే కాదు! ఫోమ్‌తో చేసిన ఆటవస్తువులని బిగిసి పట్టుకోవడం, ప్యాకింగ్‌ కోసం వాడే బబుల్‌ రాప్స్‌ని చిదపడం... లాంటి బోలెడు చిట్కాలతో ఒత్తిడిని ఇట్టే తగ్గించేసుకోవచ్చు. మీరూ ఇందులో ఏదో ఒకదాన్ని ప్రయత్నించి చూడండి. - నిర్జర.  

తిండిపోతుల రహస్యం తెలిసిపోయింది!

కొంతమంది తాము ఎంతగా లావు అయిపోతున్నా సరే... ఆహారం మీద ఎలాంటి నియంత్రణా పాటించలేరు. చూసేవాళ్లకి వాళ్లలో ఏదో లోపం ఉందనిపించక మానదు. ‘నాలుకని ఆ మాత్రం అదుపు చేసుకోలేరా!’ అని ఈసడించడమూ వినిపిస్తుంది. నిజానికి పాపం ఇది వారి స్వభావంలోని లోపం కాదంటున్నారు నిపుణులు. మరి వారు చెప్పేది ఏమిటంటే…   సన్నగా ఉండేవారికీ, లావుగా ఉండేవారికీ మధ్య ఏదో జన్యుపరమైన తేడా ఉండే ఉంటుందని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని తేల్చేందుకు స్విట్జర్లాండ్‌కు చెందిన పరిశోధకులు ఒక పరీక్షను చేపట్టారు. సర్జరీ ద్వారా పొట్ట తగ్గించుకున్నవారిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో గమనించారు. సర్జరీ చేయించుకున్నవారి పేగులలో ‘enteroendocrine cells’ అనే కణాలు గణనీయంగా పెరిగినట్లు గమనించారు.   మనం తినే ఆహారాన్ని నియంత్రించడంలో ఈ enteroendocrine cells చాలా ముఖ్య పాత్రని పోషిస్తాయి. ఉదరంలోని పైభాగంలో ఉండే ఈ కణాలు పేగులలోకి ఎంత ఆహారం చేరుతోందో గమనిస్తూ ఉంటాయి. పేగులలోకి తగినంత ఆహారం ఉందని వీటికి సూచన అందగానే ‘ఇక తిన్నది చాలు’ అంటూ మెదడుకి ఓ సందేశాన్ని అందిస్తాయి. కొందరిలో ఈ కణాలు చాలా తక్కువగా ఉంటాయట. ఫలితం! ‘ఇక చాలు’ అన్న సూచన వారి మెదడుకి అందదు. దాంతో వారు అవసరానికి మించిన ఆహారాన్ని లాగించేస్తూ ఉంటారు. అలా అధికంగా పేరుకున్న ఆహారమంతా కొవ్వుగా మారి ఊబకాయానికి దారితీస్తుంది.   కొవ్వు తగ్గించుకునేందుకు చేయించుకునే బేరియాట్రిక్‌ సర్జరీ వంటి చికిత్సల తర్వాత ఈ enteroendocrine కణాలు పెరగాన్ని గమనించారు. దీంతో... అధికంగా తినడం అనేది మానసికమైన లోపం కాదనీ, అది ఓ శారీరిక రుగ్మత అనీ తేలిపోయింది. అయితే ఈ కణాలను పెంచుకోవడానికి శస్త్రచికిత్సే గతి అనుకోవడానికి లేదు. మున్ముందు మన తిండిని నియంత్రించే ఈ కణాలను కృత్రిమంగా ప్రవేశపెట్టే రోజులు వస్తాయని ఆశిస్తున్నారు. అదే కనుక జరిగితే ఒక చిన్న ఇంజక్షన్‌ ద్వారా మన ఆకలిని హద్దులలో ఉంచుకోవచ్చునేమో!   పై పరిశోధన వెలువడిని సమయంలోనే ఫిన్లాండ్‌లోని కొందరు పరిశోధకులు మరో పరిశోధనను కూడా చేపట్టారు. ఏదన్నా ఆహారాన్ని ఆస్వాదించేటప్పుడు మన మెదడులోని endogenous opioid system అనే వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం ఈ పరిశోధన ఉద్దేశం. మనం కొన్ని రకాల పదార్థాలను తీసుకున్నప్పుడు చాలా తృప్తిగా ఉంటుంది.   అదే పదార్థాన్ని మళ్లీ మళ్లీ తీసుకోవాలని అనిపిస్తుంది. కొన్ని సందర్భాలలో ఇది మనకు సంతోషాన్ని కలిగించినా... మద్యం, డ్రగ్స్‌లాంటి పదార్థాలకు బానిసగా మారడానికి కూడా ఈ వ్యవస్థే కారణం. అతిగా ఆహారం తీసుకునేవారిలో ఈ వ్యవస్థ దెబ్బతింటుందని పరిశోధకులు తేల్చారు. దాంతో ఎంత తిన్నా కూడా మనసుకి తృప్తి కలగదంట. దాంతో ఏదిపడితే అది, ఎంతపడితే అంత లాగించేసి ఊబకాయాన్ని కోరి తెచ్చుకుంటారని తేల్చారు. - నిర్జర.

తెలుగు నేర్చుకోకపోతే జీవితం వృథా!

  ఒకప్పుడు సంస్కృతంలో మాట్లాడితే పండితుడు అనుకునేవారు, అందుకని ప్రాంతీయభాషల వారు కూడా బలవంతంగా సంస్కృతంలోనే మాట్లాడేవారు. దేవభాష అయిన సంస్కృతం రానురాను క్షీణించిపోయింది. కానీ ఆ స్థానంలో ఆంగ్లేయుల పెత్తనం మొదలైంది. మొదట తమ వ్యాపార విస్తరణ కోసం స్థానిక భాషలని నేర్చుకునే ప్రయత్నం చేశారు ఆంగ్లేయులు. కానీ ఎప్పుడైతే వారి వ్యాపారం కాస్తా పెత్తనంగా మారిందో... తమ భాషనే స్థానికుల మీద రుద్దడం మొదలుపెట్టారు. ఇక ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్ల భాష నేర్చకుంటేనే మనుగడ సాధ్యం అన్న వాదన మొదలైపోయింది. ఆంగ్లం తప్పనిసరే! కాదని ఎవరూ అనడం లేదు. కానీ తొలి ప్రాధాన్యత ఎప్పుడూ మాతృభాషదే కావాలంటున్నారు నిపుణులు. అలా ఎందుకు? అనే ప్రశ్నకు చాలా స్పష్టమైన జవాబులు ఉన్నాయి. మన జన్యువులలోనే – తరతరాలుగా మనం ఒక భాషకి అలవాటు పడి ఉన్నాము. కాబట్టి మన మెదడు కూడా సదరు భాషకి అనుగుణంగానే ఏర్పడుతుందని చెబుతున్నారు. అంటే మాతృభాష అనేది మన మెదడులోని సహజసిద్ధమైన హార్డ్‌వేర్ అన్నమాట. దాన్ని పూర్తిగా పక్కన పెట్టేయడం అంటే... మన సహజమైన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించడమే! తల్లి కడుపులోనే – భాష నేర్చుకోవడం తల్లి కడుపులోనే మొదలవుతుందని పరిశోధనలు తేల్చాయి. తల్లి నుంచి వినిపించే శబ్దాలు అతని మెదడులోని భాష నేర్చుకునే భాగాన్ని ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. తల్లులు లాలిపాటలు పాడటం, కడుపులోని బిడ్డతో మాట్లాడటం వృధా కావనీ... ఆ బిడ్డలోని భాషా నైపుణ్యాన్ని పెంచుతాయని అంటున్నారు. అలా అలవోకగా నేర్చుకుంటున్న భాషని వదిలేసి మరో భాష కోసం ఎగబడం ఎంతవరకు సబబు! మాతృభాషలోనే నేర్చుకోగలం – ఏడాది దగ్గర నుంచి పిల్లలు, తమ మాతృభాషలో ఒకో పదాన్ని నేర్చుకుంటారు. ఆ భాషలోనే తమకి తెలియని విషయాలను నేర్చుకోవడం, తమ భావాలను వ్యక్తపరచడం చేస్తుంటారు. అది పక్కన పెట్టేసి ఆంగ్లంలో ఒకేసారి ఓనమాలతో పాటుగా పద్యాలని, వాక్యాలని నేర్చుకోవడం ఎంత కష్టం! ఇది వారి జ్ఞానం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఒక స్థాయి వరకూ చదువుని మాతృభాషలో నేర్చుకుంటేనే ఉపయోగం అని నివేదికలు తేల్చి చెబుతున్నాయి. ఏ భాష నేర్చుకోవాలన్నా – పునాది సరిగా లేకుండా ఎన్ని అంతస్తులు కట్టినా ఉపయోగం ఏముంది? మాతృభాష మీద పట్టు సాధించకుండా ఇతర భాషలు నేర్చుకోవడమూ ఇంతే! ముందు మాతృభాష మీద ఒక అవగాహన వచ్చినవాడే ఇతర భాషలను సులువుగా నేర్చుకోగలడనీ, అందులో పరిపూర్ణతను సాధించగలడనీ పరిశోధనలన్నీ ఏకరవు పెడుతున్నాయి. ఎంత సాధించి ఏం ఉపయోగం – మనిషి ఎప్పుడూ ఒంటరివాడు కాదు. అతనికంటూ ఒక సంస్కృతిక నేపథ్యం ఉంటుంది. కానీ మాతృభాష నుంచి దూరమైనవాడు ఒంటరిగా మారిపోతాడు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్న విషయం అతనికి తోచదు. ఆ ఒంటరితనం తెలియకుండా అతన్ని క్రుంగదీస్తుంది. అందుకే భాషని దూరమైన ఆదిమజాతివారు త్వరగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న పరిశోధన ప్రపంచాన్ని కుదిపేసింది. జ్ఞానానికి దూరం – భాష అంటే తరతరాల జ్ఞానసంపద. భాషకి దూరమైతే ఆ జ్ఞానానికి కూడా దూరమైపోతాం. ఉదాహరణకు మన చుట్టూ ఉండే మొక్కలనే తీసుకోండి. బీపీని తగ్గించే సర్పగంధి, షుగర్‌ని తగ్గించే నేలవేము గురించి ప్రాంతీయ భాషలలో ఉన్నంత తేలికపాటి సమాచారం ఆంగ్లంలో ఉండదు. అంతదాకా ఎందుకు! వినాయక చవితి రోజున పూజించే ఏకవింశతి పత్రాల గురించి మనం అప్పుడే మర్చిపోయాం. అవన్నీ మన గృహవైద్యంలో భాగమే కదా! ఇలా లాలిపాటల దగ్గర నుంచి సామెతల వరకు మాతృభాషలో అద్భుతమైన విజ్ఞానం దాగి ఉంటుంది. దాన్ని మనం చేజేతులారా దూరం చేసుకుంటున్నాం. చివరగా ఒక్క మాట. మనకి కోపం వస్తే ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం ఆంగ్లంలో మాట్లాడటం మొదలుపెడతాం. బాధ కలిగితే అమ్మా అంటూ మనసుకి సర్దిచెప్పుకొంటాం. మన మనసుకి దగ్గరగా ఉన్న మాతృభాష కావాలా, మన అహంకారాన్ని పెంచి పోషించే ఇతర భాషలు కావాలా! తేల్చుకోవాల్సిందే మనమే! - నిర్జర.

సంతోషానికి చిట్కా!

  చాలా రోజుల క్రితం ఓ భార్యాభర్తా ఉండేవారు. వాళ్లిద్దరూ ఉన్నంతలో చాలా సంతోషంగానే ఉండేవారు. కానీ ఆ సంతోషం ఎంత కాలం నిలుస్తుందో అని వాళ్లకి తెగ అనుమానంగా ఉండేది. ఈలోగా వాళ్లుండే ఊరికి ఒక సన్యాసి వచ్చాడని తెలిసింది. ఆయన దగ్గర అన్ని ప్రశ్నలకూ సమాధానాలు ఉంటాయని ప్రచారం జరిగింది. దాంతో తమ సమస్యను ఆ సన్యాసికే విన్నవించుకోవాలని దంపతులిరువురూ బయల్దేరారు. దంపతుల సమస్య విన్న సన్యాసి పెద్దగా ఆశ్చర్యపడలేదు. పైగా ‘‘నా దగ్గరికి అంతా డబ్బు కోసమో, కీర్తి కోసమో వస్తుంటారు. మీరు ఇలా సంతోషాన్ని కోరుతూ రావడం మంచిదే! అయితే ఇదేమంత తేలికగా నెరవేరే కోరిక కాదు. ఈ ప్రపంచంలో ఎవరైతే సంతోషంగా ఉంటారని మీకు అనిపించిందో వారి దగ్గరకు మీరు వెళ్లండి. ఆ వ్యక్తి వేసుకున్న చొక్కాలో ఒక ముక్క చించి మీ చేతికి చుట్టుకోండి. దాంతో మీరు చిరకాలం సంతోషంగా జీవిస్తారు,’’ అని చెప్పుకొచ్చాడు. సన్యాసి మాటలు విన్న దంపతులు ‘ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండేవారు ఎవరా!’ అని వెతుక్కుంటూ బయల్దేరారు. అలా వారు ఒకో ప్రాంతం దాటుకుంటూ ‘దగ్గరలో ఎవరన్నా సంతోషంగా ఉన్నారా!’ అని వాకబు చేసుకుంటూ ఊరూరా తిరగసాగారు. ఒక చోటకి వెళ్లేసరికి ‘ఫలానా జమీందారు దంపతులు చాలా సంతోషంగా ఉంటారని’ అందరూ చెప్పుకోవడం వినిపించింది. వెంటనే దంపతులు ఆ జమీందారు వద్దకు వెళ్లారు. వాళ్ల మాటలు విన్న జమీందారుగారి భార్య ‘‘మేం నిజంగానే చాలా సంతోషంగా ఉన్నాం. కాకపోతే... కాకపోతే ఓ చిన్న లోటు. మాకు పిల్లలు లేరు. ఆ విషయం గుర్తుకువచ్చినప్పుడల్లలా మా మనసులు నిరాశలో మునిగిపోతాయి,’’ అంటూ ఒకింత బాధగా చెప్పుకొచ్చింది. ఆ మాటలు విన్న భార్యాభర్తలు ఉస్సూరుమంటూ తమ యాత్రని కొనసాగించారు. అలా చాలా దూరం ప్రయాణించిన తర్వాత వారికి ‘ఫలానా చోట ఉండే ఓ రైతు చాలా సంతోషంగా ఉంటాడని’ తెలిసింది. వెంటనే ఆ రైతు ఇంట్లోకి ప్రవేశించారు. వారి మాటలు విన్న రైతు ‘నిజంగానే మేం చాలా సంతోషంగా ఉంటాము. కాకపోతే ఒకటే సమస్య. మాకు గంపెడు సంతానం. వారందరినీ సంభాళించలేక ఒకోసారి జీవితం అంటే విరక్తి కలుగుతుంది,’ అంటూ చెప్పుకొచ్చాడు ఆ రైతు. రైతు మాటలు విన్న దంపతులు మరోసారి నిరాశపడ్డారు. ఇక ‘సంతోషంగా ఉండే మనిషిని కనుక్కోవడం అసాధ్యం!’ అనుకొని తిరుగుముఖం పట్టారు. దారిలో వారికి ఒక గొర్రెల కాపరి కనిపించాడు. మైదానంలో గొర్రెలని మేపుకుంటూ, పాటలు పాడుకుంటూ గంతులు వేస్తున్న అతన్ని చూసి దంపతులకి అతను చాలా సంతోషమైన మనిషని తోచింది. వెంటనే అతని దగ్గరకు వెళ్లి- ‘నువ్వు చాలా సంతోషంగా ఉంటావా!’ అని అడిగారు. ‘ఓ! నాకు దుఃఖం అనేదే లేదు. జీవితంలో ఏది లభించినా అది భగవంతుని అనుగ్రహంగా భావించి తృప్తి పడుతూ ఉంటాను. జీవనం ముందుకు సాగేందుకు నా వంతు ప్రయత్నంలో ఎప్పుడూ లోటు రానివ్వను. నాకు అవసరం లేనిదాన్ని ఎప్పుడూ దగ్గర ఉంచుకోను. పక్కవాడిని చూసి నా జీవితం కూడా అలా ఉండాలని పోల్చుకోను,’ అంటూ చెప్పుకొచ్చాడు. ‘మంచిది. మరేమనుకోకుండా నీ చొక్కాలోంచి ఒక ముక్క చించి నాకు ఇవ్వగలవా!’ అని అడిగరు దంపతులు. ఆ మాటలకి గొర్రెలకాపరి నవ్వుతూ ‘నాకు అసలు చొక్కానే లేదు కదా! ఉన్నదల్లా ఓ కంబళి ఒకటే. దాన్ని చించేస్తే ఇక నాకు ఎండావానల నుంచి రక్షణ ఏది,’ అంటూ నవ్వుతూ తన దారిన తను వెళ్లిపోయాడు. గొర్రెలకాపరి మాటలను మననం చేసుకుంటూ దంపతులు తమ గ్రామాన్ని చేరుకున్నారు. ఊళ్లోకి అడుగుపెడుతూనే వారు తమ సన్యాసి దగ్గరకు చేరుకుని జరిగిన వృత్తాంతం అంతా చెప్పుకొచ్చారు. ‘నిత్యం సంతోషంగా ఉండే మనిషిని మేం కనుగొన్నాం. కాకపోతే మీరు సూచించినట్లుగా ఆయన చొక్కాలోంచి ఒక ముక్కని తీసుకుని రాలేకపోయాం,’’ అంటూ నిరాశగా చెప్పారు. ‘‘మీరు ఇలాంటి సందర్భాన్ని ఎదుర్కొంటారని నేను ముందుగానే ఊహించాను. తొడుక్కోవడానికి ఒక చొక్కా కూడా లేనివాడు సైతం సంతోషంగా ఉండగలడు అని నిరూపించడానికే మీకు ఆ లక్ష్యం ఏర్పరిచాను. మీరు నిత్యం మీ చెంత ఉంచుకోవాల్సింది అతని చొక్కా ముక్క కాదు. అతను చెప్పిన మాటలు. అవే మీకు సంతోషానికి మార్గంగా నిలుస్తాయి,’’ అని హితవు పలికాడు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.