మిస్టరీ : కదిలే రాళ్లు

  కాలిఫోర్నియాలో ఉన్న ఓ ఎడారి పేరు మృత్యు లోయ. ఆ ప్రాంతాన్ని దాటే ప్రయత్నంలో కొందరు చనిపోవడంతో దానికా పేరు వచ్చింది. అక్కడ శాశ్వతంగా నివసించే ప్రజలు తక్కువే అయినా... అక్కడ ఉండే కొండలు, లోయలను చూసేందుకు ఏటా లక్షలాది మంది మృత్యులోయను చేరుకుంటారు. అలా మృత్యులోయకి చేరుకునేవారికి ఓ విచిత్రం కనిపిస్తూ ఉంటుంది. అవే sailing stones.   అంతా మాయ   మృత్యులోయలోని ప్లేయా అనే ప్రాంతంలోకి చేరుకోగానే ఒక ఎండిపోయిన సరస్సు కనిపిస్తుంది. దీని మీద వందలాది రాళ్లూ కనిపిస్తాయి. అసలు వింత అది కాదు. ఈ రాళ్లన్నీ కూడా ఎవరో పనిగట్టుకుని లాగినట్లుగా స్థానం మారుతూ ఉంటాయి. శీతకాలం వస్తే చాలు కొన్ని వందల అడుగుల దూరానికి నిదానంగా జరుగుతుంటాయి. అలా రాళ్లు జరిగాయి అన్నదానికి సాక్ష్యంగా నేల మీద గీతలు ఉంటాయి.   వందేళ్ల రహస్యం   మృత్యులోయలోని రాళ్లు కదులుతున్నట్లు దాదాపు వందేళ్ల క్రితమే గమనించారు. కానీ దానికి కారణం ఏమిటన్నది ఎవరికీ తట్టనేలేదు. దాంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. గ్రహాంతర వాసులే వీటిని కదిపి వెళ్తున్నారనీ, ఏదో అయస్కాంత శక్తి ఉండటం వల్లే ఇలా జరుగుతోందనీ, ఆకతాయిల పని అనీ... ప్రచారాలు జరిగాయి. దాంతో కదిలే రాళ్ల వెనక ఉన్న రహస్యాన్ని ఛేదించేందుకు శాస్త్రవేత్తలంతా రంగంలోకి దిగారు.   తేలనే లేదు   300 కిలోలకు పైగా బరువున్న రాళ్లు ఒక్క ఏడాదిలోనే 800 అడుగులకు పైగా జరగడం, పరిశోధకులని సైతం ఆశ్చర్యపరచింది. ఎంత గాలి వీచినా కూడా ఇది అసాధ్యమే కదా! పైగా ఒకో రాయి ఒకోతీరున కదలడం మరో విశేషం. మృత్యులోయలో తరచూ కనిపించే గాలి దుమారాల వల్లే ఈ రాళ్లు కదులుతున్నాయని కొందరు శాస్త్రవేత్తలు భావించారు. అప్పుడప్పుడూ ఈ సరస్సులోకి నీరు రావడం వల్ల రాళ్లు కదులుతున్నాయని మరికొందరు నిర్ధరించారు. కానీ ఈ ఊహలేవీ పరీక్షకి నిలబడలేదు. దాంతో కదిలే రాళ్ల మీద ఓ కన్ను వేసి ఉంచేందుకు సరస్సులో చిన్నపాటి వాతావరణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ రాళ్ల కదలికలని నిశితంగా గమనించేందుకు, వాటికి బెజ్జాలు చేసి అందులో జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) యంత్రాలను అమర్చారు.   ఇంట్లోనే తేలిపోయింది   విజ్ఞాన ప్రపంచాన్ని ఇంతగా వేధించిన ఈ ప్రశ్నకి ఓ శాస్త్రవేత్త తన ఇంట్లోనే జవాబు కనుక్కోవడం ఆశ్చర్యం. రాల్ప్ లోరెంజ్ అనే శాస్త్రవేత్త ఈ ఘనత సాధించారు. ఒక గిన్నెలో నీరు పోసిన లోరెంజ్ అందులో ఓ రాయిని ముంచి ఫ్రిజ్లో ఉంచారు. ఆ నీరు గడ్డకట్టిన తరువాత, రాయి ఉన్న మంచు గడ్డని ఇసుక మీద బోర్లించారు. మంచుగడ్డ కదిలినప్పుడు దాంతో పాటుగా రాయి కూడా కదలడాన్ని లోరెంజ్ గమనించారు.   రాళ్ల చుట్టూ మంచు పేరుకోవడం ద్వారా, అవి నీటి మీద కాస్త ముందుకు సాగుతున్నాయని తేలిపోయింది. అలా కదిలేటప్పుడు ఒకోసారి అవి పక్కకి ఒరగడం వల్ల గతి మారే అవకాశం ఉందని అర్థమైంది. ఏడాదిలో చాలావరకు ఎండిపోయి ఉండే ఈ సరస్సులో వర్షం పడటం, శీతకాలంలో నీటి ఉపరితలం గడ్డకట్టడం, అలా గడ్డకట్టిన మంచు పలకల మధ్య ఉన్న రాళ్లు ముందుకు కదలడం..... అంతా కూడా చాలా నిశ్శబ్దంగా జరిగిపోతుంది కాబట్టి, ఇంతకాలం ఎవరూ వాటిని ప్రత్యక్షంగా గమనించలేకపోయారు. దాంతో అదేదో గొప్ప రహస్యంగా భావించేవారు. కానీ ఇప్పుడు అసలు విషయం తేలిపోయింది కదా! అయినా ఇప్పటికీ చాలామంది ఈ కదిలే రాళ్ల వెనుక ఏదో మాయ ఉందనే నమ్ముతున్నారట. మరి మీరో!!! - నిర్జర.      

కళ్ల ముందు హత్య జరిగితే పట్టించుకోం. ఎందుకంటే!

1964 మార్చి 13: న్యూయార్కులో Catherine Genovese అనే 28 ఏళ్ల అమ్మాయి రోడ్డు దాటుకుని తన ఇంట్లోకి వెళ్లబోతోంది. ఇంతలో ఓ సీరియల్‌ కిల్లర్ ఆమె మీద దాడి చేశాడు. దారినపోయేవారు చూస్తుండగా Catherineని దారుణంగా హతమార్చాడు. తనని రక్షించమంటూ కేథరీన్‌ ఎంత అరిచినా, ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అక్కడ దాడి జరుగుతోందన్న విషయం పోలీసులకు చెప్పేందుకు కూడా ఎవరూ ప్రయత్నించలేదు. దీంతో Bystander Effect అనే తత్వం గురించి చర్చ మొదలైంది. ఏమిటీ ఎఫెక్ట్‌? అమెరికా పోలీసు శాఖ ప్రకారం 70 శాతం దాడులు నలుగురూ చూస్తుండగానే జరుగుతాయి. 52 శాతం దొంగతనాలు జరిగేటప్పుడు కూడా చుట్టుపక్కలవారు చూసీ చూడనట్లుగా సాగిపోతుంటారు. ఇలా తమ పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోకపోవడాన్ని Bystander Effect అంటారు. గొడవలోకి దిగితే తనకి ఏదన్నా జరుగుతుందనే సహజమైన భయం ఎలాగూ ఉంటుంది అంతకు మించిన కారణాలు కూడా ఉన్నాయంటున్నారు సైకాలజిస్టులు.   - నలుగురూ ఉండటం వల్ల... నేరాన్ని అడ్డుకునే బాధ్యత ఎవరో ఒకరు తీసుకుంటారులే అన్న నిర్లిప్తత ఏర్పడుతుంది. దీనిని Diffusion of responsibility అంటారు. - సంఘటనాస్థలంలో ఉన్నవారంతా ఏం చేయకపోవడంతో... అలా ఏం చేయకుండా ఉండటమే మంచిదేమో అన్న అపోహ ఏర్పడుతుంది. - హత్య, దాడిలాంటి సంఘటనలకి మనం సిద్ధంగా ఉండం. దాంతో అలాంటివి చూసినప్పుడు మెదడు అయోమయానికి లోనవుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతోందో, దానికి ఎలా ప్రతిస్పందించాలో తెలియని సందిగ్థంలో గుడ్లప్పగించి చూస్తుండిపోతాము. ఏం చేయాలి? Bystander Effect వినడానికి బాగానే ఉంది. కానీ మనం కూడా దానికి లొంగిపోతే ఎలా! అందుకని కళ్ల ముందు ఏదన్నా ఘోరం జరుగుతున్నప్పుడు ఈ Bystander Effectని అధిగమించేందుకు కొన్ని ఉపాయాలు కూడా సూచిస్తున్నారు. - అయోమయంగా చూస్తూ ఉండిపోకుండా... అక్కడేం జరుగుతుందో అంచనా వేసే ప్రయత్నం చేయాలి. - మీ వంతుగా అందులో పాలుపంచుకునే అవకాశం ఏమేరకు ఉందో ఆలోచించాలి. - దాడి చేస్తున్న వ్యక్తిని మాటల్లోకి దింపితే హింసకి పాల్పడే అవకాశం కూడా తగ్గుతుంది. - ఈ సందర్భంలో చుట్టూ మూగేవారిని కలిసికట్టుగా ఉసిగొల్పే ప్రయత్నం చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. - ఇదివరకు నేరం గురించి సమాచారం ఇచ్చేవారినీ, గాయపడిన వ్యక్తులని హాస్పిటల్‌కు తీసుకువెళ్లేవారినీ విచారణ పేరుతో తెగ వేధించేవారు. ఈ విచారణ భయంతోనే చాలామంది వెనకడుగు వేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు చట్టాలు మారాయి. సాయపడేవారికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి తర్వాత ఏం జరుగుతుందో అన్న భయం వదిలి ప్రమాదంలో ఉన్నవాడికి సాయపడే ప్రయత్నం చేయాలి. అన్నింటికీ మించి, అసలు ఈ Bystander Effect గురించి అవగాహన ఉంటే చాలు... మనం దానికి లొంగకుండా ఉంటామంటున్నారు సైకాలజిస్టులు.   - నిర్జర.

మీరూ స్పైడర్‌మేన్ కావచ్చు

స్పైడర్‌మేన్ పాత్రంటే ఎవరికైనా ఇష్టమే! ఆ స్పైడర్‌మేన్ ఇలా చేయిచాచగానే అతని చేతి నుంచి దారాలు రావడం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ దారాలను పట్టుకుని అతను ఎక్కడికైనా వెళ్లిపోవడం చూసి అసూయా కలుగుతుంది. మనం కూడా చేతికి ఓ యంత్రాన్ని తగిలించుకుని అలా దారాలు వదిలే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. సాలెపురుగు దారానికి ఉన్న ప్రత్యేకత గురించి కొత్తగా చెప్పుకోనవసరం లేదు. అంతే మందమున్న ఇనప తీగతో పోలిస్తే, సాలెదారం చాలా బలంగా ఉంటుంది. ఎటుపడితే అటు వంగుతుంది, సాగుతుంది కూడా! ఇన్ని బలాలు ఉన్నా పట్టులాగా మెత్తగా ఉండటం మరో విచిత్రం. సాలెపురుగు దారానికి ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి... దీనిని మనిషికి అనువుగా మార్చే ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. దాదాపు 50 ఏళ్ల క్రితమే సాలెపురుగు దారం మీద పరిశోధనలు మొదలయ్యాయి. ఆ పరిశోధనలు ఇప్పుడు కీలక దశ చేరుకున్నాయి.   పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు golden orb-weaver spider అనే సాలెపురుగులో ఉండే జన్యువులన్నింటినీ కనుక్కోగలిగారు. ఈ సాలెపురుగుని Genome mapping చేయడం ద్వారా వీరు దాని 14000 జన్యువులనీ గుర్తించారు. వీటిలో 400 జన్యువుల గురించి ఇప్పటివరకూ ప్రపంచానికి తెలియనే తెలియదు. అంతేకాదు! సాలెపురుగు దారాన్ని అల్లేందుకు అవసరమయ్యే 28 రకాల ప్రొటీన్లని కూడా వీరు కనుగొన్నారు. వీటిని spidroins అంటారు.   ఈ పరిశోధనలో-  సాలెపురుగు ఒకో సందర్భంలో ఒకో తరహా దారాన్ని వాడుతోందని కూడా తెలిసింది. ఉదాహరణకు సాలెగూడుని అల్లేందుకు ఒక తరహా దారాన్ని వాడితే, సాలెగూడులో చిక్కుకున్న ఆహారాన్ని చుట్టేందుకు మరో తరహా దారాన్ని వాడుతోందట! ఇలా ఒకటే సాలెపురుగు ఏడు సందర్భాల కోసం ఏడు రకాల దారాన్ని వాడుతున్నట్లు గ్రహించారు. సాలెపురుగు దారం రహస్యమంతా ఇప్పుడు శాస్త్రవేత్తల గుప్పిట్లోకి వచ్చేసింది. కాబ్టటి ఇక కృత్రిమంగా సాలెపురుగు దారాన్ని తయారుచేయడమే తరువాయి! పరిశ్రమల్లోనూ, దుస్తుల్లోనూ, భవన నిర్మాణాలలోనూ... ఇలా రోజువారీ జీవితంలో వేల సందర్భాలలో ఈ దారాన్ని ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు! సాలెపురుగు దారానికి సూక్ష్మక్రిములను ఎదుర్కొనే సత్తా ఉంటుంది. కాబ్టటి గాయాలకు కుట్లు వేసేటప్పుడు, ఎముకలు విరిగినప్పుడు నిరభ్యంతరంగా ఈ దారాన్ని చికిత్సలో వాడవచ్చు.   సాలెపురుగు దారాన్ని కనుక కృత్రిమంగా ఉత్పత్తి చేయడం మొదలుపెడితే... ఓ చిన్న యంత్రాన్ని చేతికి బిగించుకుని మనం కూడా స్పైడర్‌మేన్‌గా మారిపోవచ్చునంటున్నారు.   - నిర్జర.

మిస్టరీ - ఈ ఊళ్లో అందరూ కవలలే!

మనకి పరిచయం ఉన్నవారిలో ఎంతమంది కవల పిల్లలు ఉండి ఉంటారు? మహా అయితే ఓ నలుగురో, ఐదుగురో ఉంటారు. కానీ ఆ ఊరిలోకి అడుగుపెడితే వీధికో కవల జంట కనిపిస్తుంది. శాస్త్రవేత్తలకి కూడా సవాలు విసురుతున్న ఆ ఊరి పేరు ‘కొడింహి’. కేరళలోని మలప్పురం జిల్లాలోని ఈ మారుమూల ప్రాంతం, తన ప్రత్యేకత కారణంగా ప్రపంచంలోని పరిశోధకులందరినీ ఆకర్షిస్తోంది.   మిగతా ప్రపంచంతో పోలిస్తే మన దేశంలో కవల పిల్లలు పుట్టడం తక్కువే! ప్రతి వెయ్యి మంది పిల్లలలో మహా అయితే ఓ ఇరవై మంది, కవల పిల్లలు ఉంటారు. కానీ కొడింహి పట్నంలో మాత్రం దాదాపు పది శాతం పిల్లలు కవలలే కనిపిస్తున్నారు. ఆ ఊళ్లో మొత్తం జనాభా ఇరవైవేల మంది ఉంటే అందులో 500 మంది కవల పిల్లలే! ఇలా కొడింహిలో పుట్టిన కవలలందరూ కలిసి ఏకంగా ఓ ‘కవలల సంఘాన్నే’ ఏర్పాటుచేసుకున్నారు.   ‘కొడింహి’లో దాదాపు ఓ 70 ఏళ్ల నుంచి ఇలా కవలపిల్లలు పుట్టడం మొదలైందట. అది రోజురోజుకీ పెరిగిపోతోందనీ... కొన్నాళ్లు పోతే ప్రతి కాన్పులోనూ కవల పిల్లలే పుట్టే పరిస్థితి వచ్చేస్తుందని అంటున్నారు. ఇంతాచేసి మహామహా శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ కవలపిల్లల తాకిడి వెనక ఉన్న రహస్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. కొడింహిలో ఉండే నీరు తాగడం వల్ల ఇలా కవల పిల్లలు పుడుతున్నారేమో అని కొందరు, ఇక్కడి ఆహారంలో ఉండే కొన్ని ప్రొటీన్ల వల్లే ఇలా కవలలు పుడుతున్నారని మరికొందరు ఊహిస్తున్నారు. కానీ ఏ కారణాన్నీ ఇప్పటివరకూ శాస్త్రీయంగా రుజువుచేయలేకపోయారు. కొడింహిలో ఉండే ఈ విచిత్రమైన లక్షణాన్ని తప్పించుకునేందుకు కొందరు చాలా దూర సంబంధాలను చేసుకున్నారు. కానీ కొడింహిలో పుట్టి పెరిగినవారు, ఎంత దూరం వెళ్లినా.... అక్కడ కూడా వారికి కవలపిల్లలు పుట్టడం విచిత్రం.   ఈమధ్యనే జర్మనీ, ఇంగ్లండ్‌కు చెందిన పరిశోధకులు కూడా ఈ ఊరికి వచ్చారు. ఇక్కడి కవల పిల్లల DNAను సేకరించారు. ఆ DNAని విశ్లేషించాకైనా కవలపిల్లల రహస్యం తెలుస్తుందని ఆశిస్తున్నారు. అప్పటిదాకా కొడింహి ఓ మిస్టరీనే!   - నిర్జర.

టెన్షన్ పడుతున్నారా? మంచిదే!

  ఇప్పటి యువతది అంతా ప్రాక్టికల్‌ మార్గం. టెన్షన్‌ పడటం వల్ల పని జరుగుతుందా? టెన్షన్‌ పడితే మూడ్‌ పాడవటం వల్ల ఉపయోగం ఉందా? అందుకే టెన్షన్ పడకుండా కూల్‌గా ఉండాలన్నది చాలామంది దృక్పథం. వ్యక్తిత్వ వికాస నిపుణులు, పుస్తకాలు ఇదే మాటని పదే పదే చెబుతూ ఉంటాయి. టెన్షన్‌ పడేవాడు జీవితంలో పైకి ఎదగలేడు అని నూరిపోస్తుంటాయి. కానీ టెన్షన్‌ వల్ల ఉపయోగం ఉందంటున్నారు నిపుణులు.   ఆరోగ్యం బాగుంటుంది   ఈ విషయం చెప్పుకొనేందుకు ఆడవారినే ఉదాహరణగా తీసుకుందాం. ఒక వయసు దాటిన ఆడవారు బ్రెస్ట్ కేన్సర్‌కి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు చెబుతూ ఉంటారు.  ఏ విషయానికీ పెద్దగా టెన్షన్ పడనివారు, ఈ సలహాని కూడా పట్టించుకోరు. దాంతో ఒకోసారి పరిస్థితులు చేజారిపోయే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం గురించి కంగారు పడేవారు మాత్రం ఠంచనుగా సమయానికి తగిన పరీక్షలు చేయించుకుంటారు. ఇలా ఆరోగ్యసూత్రాలు ఠంచనుగా పాటించేలా ప్రోత్సహించే టెన్షన్ మంచిదేగా!   సిద్ధంగా ఉంటారు   టెన్షన పడేవారు ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆలోచనలో ఉంటారు. తాము భయపడినట్లు జరిగితే ఏం చేయాలి అన్న ఉపాయం కూడా వారిదగ్గర సిద్ధంగా ఉంటుంది. కాబట్టి నిజంగానే ఏదన్నా అనుకోని ఆపద జరిగినప్పుడు ఠక్కున రంగంలోకి దూకేస్తారు. తమ ఉపాయాన్ని అమలుచేస్తారు. టెన్షన్ లేకుండా నిర్లప్తంగా ఉండేవారిలో ఇంతటి సంసిద్ధత ఉండకపోవచ్చునంటున్నారు.   సంతోషం రెట్టింపు   టెన్షన్‌తో ఉండేవారిలో సానుకూల దృక్పథం తక్కువగా ఉంటుంది. తాము తలపెట్టిన కార్యం పూర్తవుతుందో లేదో, పరిస్థితులు తమకి అనుకూలంగా ఉంటాయో లేదో అన్న అనుమానంలో ఉంటారు. అలాంటి సమయంలో విజయం వరించిందనుకోండి... ఇక వారి సంతోషానికి అవధులు ఉండవు. జీవితంలో టెన్షన్ పడనివారేమో- ‘ఆ జరగక చస్తుందా! జరిగితే మాత్రం అంత సంతోషించాల్సిన పని ఏముంది,’ అన్న స్తబ్దతలో ఉండిపోతారు.   నిబంధనలు పాటిస్తారు   టెన్షన్ పడేవారు ఎందుకొచ్చిన తంటా అనుకుంటూ అన్ని నిబంధనలూ ఖచ్చితంగా పాటిస్తారు. ఇవి వారికీ, సమాజానికీ కూడా మేలు చేయవచ్చు. ఉదాహరణకు సీట్‌ బెల్టు పెట్టుకోవడం, ఇన్‌ష్యూరెన్స్ పాలసీలు తీసుకోవడం, పన్నులు కట్టడం... లాంటి పనులన్నమాట!   అన్నింటా ముందుంటారు   టెన్షన్ పడేవారిలో తాము ఎక్కడ వెనకబడిపోతామో అన్న భయం ఉంటుంది, తమకి తెలియని విషయం ఏదన్నా ఉందేమో అన్న అనుమానం ఉంటుంది. అందుకే చదువులోనూ, ఉద్యోగంలోనూ... తలపెట్టే ప్రతి పనిలోనూ పరిపూర్ణతని సాధించే ప్రయత్నం చేస్తారు. అలా అన్నింటా ముందుంటారు.   ఇదంతా చదివాక లేనిపోని టెన్షన్‌ని అలవాటు చేసుకోమని ఎవ్వరూ చెప్పడం లేదు. కాకపోతే కాస్త టెన్షన్ ఉండటం సహజమే అనీ... అది అదుపులో ఉన్నంతవరకూ మంచిదేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. - నిర్జర.

FBS - పిల్లల్ని కారులో మర్చిపోయే జబ్బు

  అది ఒక పెద్ద షాపింగ్‌ మాల్‌. ఆ మాల్‌ బయట ఓ కారు పార్క్‌ చేసి ఉంది. ఎవరో ఆ కారు పక్క నుంచి వెళ్తూ అందులోని పిల్లవాడిని గమనించారు. ఆ పిల్లవాడు ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. వెంటనే నలుగురూ ఆ కారు చుట్టూ చేరి, దాని అద్దాలు పగలకొట్టి పిల్లవాడిని బయటకు తీశారు. కాసేపటికి అక్కడికి చేరుకున్న పిల్లవాడి తల్లిని నానాతిట్లూ తిట్టారు. పిల్లవాడిని ఇలా వదిలేసి వెళ్లడానికి నీకు మనసెలా వచ్చిందంటూ కొట్టినంత పని చేశారు. కానీ ఈ పొరపాటు ఎవరైనా చేయవచ్చు అంటున్నారు సైకాలజిస్టులు. కారణం...   తల్లిదండ్రులు పిల్లలను మర్చిపోయే సందర్భాన్ని Forgotten Baby Syndrome (FBS) అంటారు. పిల్లవాడిని ఏ పార్కులోనన్నా మర్చిపోతే తిరిగి తెచ్చుకోవచ్చు. కానీ పైన చెప్పుకొన్నట్లు కారులో మర్చిపోతే మాత్రం అది ఆ పసి ప్రాణానికే ప్రమాదం. తలుపులు వేసి ఉన్న కారులో ఉష్ణోగ్రతలు ఎప్పటికప్పుడు పెరిగిపోతూ ఉంటాయి. ఒక్క 20 నిమిషాలలోనే కారులో భరించలేనంత ఉక్కపోత మొదలైపోతుంది.   కారులోని వేడి 42 డిగ్రీలు దాటిన దగ్గర్నుంచీ పిల్లవాడి శరీరం అల్లాడిపోతుంది. పెద్దవారితో పోలిస్తే పిల్లల శరీరం అంత సమర్థంగా వేడిని తట్టుకోలేదు. 3 నుంచి 5 రెట్లు త్వరగా వాళ్లలో వేడి పెరుగుతుంటుంది. ఇంతాచేసి ఆ పిల్లవాడు కారు అద్దాలు బద్దలుకొట్టలేడు. అతను ఎంత ఏడ్చినా చుట్టుపక్కల జనాలకి వినపడదు. ఫలితం... మృత్యువు! ఒక్క అమెరికాలోనే ఇలా FBS వల్ల దాదాపు 40 మంది పిల్లలు చనిపోతున్నారంటే ఇదెంత ప్రమాదమో అర్థం చేసుకోవచ్చు. ఆ దేశంలో 1998 నుంచి ఇప్పటివరకు దాదాపు 700 మంది పిల్లలు FBS కారణంగా చనిపోయారట.   ఎవరన్నా పిల్లవాడు కారులో చనిపోయాడంటే గుండె తరుక్కుపోతుంది. ఆ తల్లిదండ్రులది ఎంత నిర్లక్ష్యమో అనిపిస్తుంది. కానీ మన మెదడు పనితీరులోని ఓ చిన్న లోపమే ఇందుకు కారణం అంటున్నారు. మన రోజువారీ పనులన్నింటినీ మెదడులోని motor cortex అనే భాగం నియంత్రిస్తుంది. రోజూ లేవడం, స్నానం చేయడం, బట్టలు వేసుకోవడం, ఆఫీసుకి చేరుకోవడం.... ఇలాంటి రోజువారీ పనులన్నీ యాంత్రికంగా జరిగిపోయేందుకు motor cortex సాయపడుతుంది.   అదే ఎప్పటికప్పుడు ప్రత్యేకించి చేయవలసిన పనులను మాత్రం hippocampus అనే భాగం నియంత్రిస్తుంది. రోజూ ఆఫీసు నుంచి ఇంటికి తిన్నగా వచ్చేసే మనం దారిలో ఆగి ఏమన్నా తీసుకోవాలంటే hippocampus చొరవ తీసుకోవాల్సిందే. మనం ఒకోసారి చేయాలనుకున్న పని మర్చిపోయి తిన్నగా ఇంటికి చేరుకోవడానికి hippocampusను motor cortex అతిక్రమించేయడమే కారణం. ఇది చాలా సహజమైన లక్షణం. ఈ పొరపాటు ఎవరైనా ఎప్పుడైనా చేయవచ్చు. కారు వెనక సీట్లో పిల్లవాడు ఉన్నా మతిమరపు సంభవిచవచ్చు! మనసు బాగోలేనప్పుడు, పని ఒత్తిడిలో ఉన్నప్పుడు, నిద్ర సరిగాలేనప్పుడు... ఈ FBSకి లోనయ్యే ప్రమాదం ఎక్కువ.   FBS కారణంగా ఎప్పటికప్పుడు పసిపిల్లలు మృత్యువాత పడటంతో కొన్ని దేశాలు Unattended Child పేరిట చట్టాలను రూపొందించాయి. కానీ అనుకోకుండా జరిగే పొరపాటుని ఏ చట్టం మాత్రం ఆపగలదు? కాబట్టి తల్లిదండ్రులే మరికాస్త అప్రమత్తంగా ఉండాలి. పిల్లవాడి పక్కన పర్సు లేదా సెల్‌ఫోన్‌ వంటి అత్యవసరమైన వస్తువుని ఉంచేస్తే... కారు నుంచి బయటకు వచ్చిన కొద్ది నిమిషాల కోసమే వాటిని వెతుక్కుంటూ వెనక్కి వెళ్లాల్సి వస్తుందని సలహా ఇస్తున్నారు!!! - నిర్జర

చర్మం ఒలిచే వ్యాపారం..

  ప్లాస్టిక్‌ సర్జరీ గురించి మొట్టమొదటిసారి ప్రయత్నం జరిగింది మన దేశంలోనే అని గర్వంగా చెబుతూ ఉంటారు. క్రీ.పూ ఎనిమిదో శతాబ్దంలో శుశ్రుతుడనే భారతీయుడు దీనికి నాంది పలికాడని నమ్ముతారు. ఇదే నేల మీద ఇప్పుడు వికృతమైన వ్యాపారం మొదలైంది. ప్లాస్టిక్‌ సర్జరీ కోసం అమాయకుల చర్మాన్ని ఒలుచుకునే సంస్కృతి సాగుతోంది.   సోమా బసు అనే ఒక జర్నలిస్ట్‌ తన వెబ్‌సైట్‌ కోసం చర్మాన్ని అమ్ముకునే వ్యక్తుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇందుకోసం నేపాల్‌లో ఆమె సాగించిన పరిశోధన దేశంలోనే సంచలనం సృష్టించింది. సోమా బసు కథనం ప్రకారం ప్రపంచంలో ప్లాస్టిక్‌ సర్జరీ అవసరాలు నానాటికీ రెట్టింపైపోతున్నాయి. బాగా కాలిపోయిన, గాయపడిన చర్మానికి కొత్త చర్మాన్ని అందించే ప్రయత్నం ఎలాగూ తప్పదు. ఇవి కాకుండా హైఫై సొసైటి వ్యక్తులు, తమ అందాన్ని మెరుగుపరుచుకునేందుకు ఎంత ఖర్చయినా పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. మరి వీళ్ల అవసరాలు తీర్చేందుకు కావల్సినంత చర్మం ఎక్కడినుంచి వస్తుంది? ఈ ప్రశ్నకి జవాబు నేపాల్‌లో వినిపిస్తుంది.   నేపాల్ ఆడవారు తెల్లగా ఉంటారు. పైగా వాళ్లకి పెద్దగా దురలవాట్లు ఉండవు. అందుకని చర్మపు బ్రోకర్లు నిదానంగా వాళ్లని వలలో దింపుతారు. 20 చదరపు అంగుళాల చర్మానికి పదివేల రూపాయలు ఇస్తామని చెబుతారు. ఆ కాస్త సొమ్ముకీ పేద యువతులు తలలూపుతారు. వారి చర్మాన్ని బ్రోకర్లు ‘ప్రతిష్టాత్మక లేబరేటరీ’ల్లో ఒలిపిస్తారు. ఆ లేబొరేటరీలు ఒలిచిన చర్మాన్ని శుద్ధిచేసి, వాటిని అమెరికాకు పంపుతాయి. ఆ చర్మంతో అమెరికా సంస్థలు ప్లాస్టిక్‌ సర్జరీ కోసం ఉపయోగించే Acellular dermis అనే పొరను తయారుచేస్తాయి. వాటిని ‘Alloderm’ వంటి పేర్లతో ప్రపంచమంతా విక్రయిస్తుంటారు.   ప్లాస్టిక్‌ సర్జరీల కోసం చర్మాన్ని విక్రయించే అమెరికన్‌ కంపెనీల మీద సవాలక్ష ఆరోపణలు ఉన్నాయి. వీళ్లు శవాల నుంచి కూడా చర్మాన్ని సేకరించారంటూ కేసులు నడిచాయి. కానీ డబ్బుబలంతో ఎన్ని కేసులనైనా ఎదుర్కొని ఈ కంపెనీలు ముందుకు సాగుతున్నాయి. అమెరికాలోని అత్యున్నత వైద్య సంస్థ FDA సైతం వీటిని నియంత్రించలేక చేతులెత్తేసింది. దాంతో తమకు కావల్సిన చర్మం కోసం ఈ కంపెనీలు ఇండియా, నేపాల్‌ దేశాలను కుటీర పరిశ్రమలుగా మార్చిపారేశాయి.   జనం ఓ నాలుగు డబ్బుల కోసం చర్మాన్ని అమ్ముకోవడం వేరు. ఇంతకంటే దారుణంగా చర్మాన్ని సేకరించే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి. వేశ్యావృత్తిలో ఉన్నవారికి మత్తుమందు ఇచ్చి, వారికి మెలకువ వచ్చేలోగా శరీరం మీద ఎక్కడపడితే అక్కడ చర్మాన్ని ఒలిచేసే క్రూరత్వం కనిపిస్తుంది. ఇంత జరుగుతున్నా అక్కడ ఎవరూ నోరు మెదపడానికి వీల్లేదు. పొరపాటున ఎవరన్నా నోరెత్తే ప్రయత్నం చేస్తే... వాళ్లు ఏ మురుగుకాల్వలోనో కలిసిపోక తప్పదు. తమకు ఎదురుతిరిగిన వాళ్లనీ, వారి కుటుంబాలనీ... వేటాడి వెంటాడేంత భయంకరమైన మాఫియా అక్కడ రాజ్యమేలుతూ ఉంటుంది.   జరుగుతున్న తతంగమంతా ప్రభుత్వాలకి తెలుసు, ప్రజలకూ తెలుసు, పోలీసులకూ తెలుసు. కానీ ఎవరూ ఏమీ ఎరగనట్లుగా ఈ అందమైన ప్రపంచం గురించే మాట్లాడుతుంటారు. అదే సుఖం కదా!!!

జీవితంలో ఏడు వింతలు...!

  ఆ అమ్మాయి పేరు సరిత. తను ఉండే చిన్న పల్లెటూరిలో ఆరో తరగతి వరకే చదువుకునే అవకాశం ఉంది. అందుకే మిగతా చదువు కోసం పక్కనే ఉన్న పట్నానికి బయల్దేరింది. పట్నం బడిలో అడుగుపెట్టిన ఆ పల్లెటూరి పిల్లని చూడగానే అందరూ ఒక్కసారిగా ఫక్కున నవ్వారు. దూరం దూరం జరిగారు. కొత్త వాతావరణం, భయపెట్టే వాతావరణం... అందుకనే సరిత తల ఎత్తి కూడా చూడకుండా నేరుగా తరగతిలోకి వెళ్లి కూర్చుండిపోయింది.   బెల్లు కొట్టిన ఓ రెండు నిమిషాలకి తరగతిలోకి టీచర్‌ ప్రవేశించారు. సరిత వాలకం చూసి ఆమె కూడా నొసలు చిట్లించారు. ఆపై క్లాసులో పిల్లలందరినీ చూస్తూ- ‘ఇప్పటివరకూ మీకు ఏమాత్రం చదువు అబ్బిందో తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకనే ఓ కాగితం తీసుకుని దాని మీద ఈ ప్రపంచంలోని ఏడు వింతలు ఏమిటో రాసి చూపించండి,’ అంటూ హుకుం జారీ చేసింది.   టీచరుగారు చెప్పడమే ఆలస్యం... క్లాసులో పిల్లలంతా హడావుడిగా తలో కాగితం చింపి దాని మీద ప్రపంచంలోని ఏడు వింతలనీ రాయడం మొదలుపెట్టారు. ఓ పది నిమిషాలు గడిచేసరికి అందరూ తమకు తెలిసిన ఏడు వింతల్నీ రాయడం పూర్తిచేసేశారు. కానీ సరిత మాత్రం ఇంకా రాస్తూనే ఉంది. ‘అదేంటీ! నువ్వు ఇన్నాళ్లూ చదువుకున్న బడిలో ఈ మాత్రం కూడా చెప్పలేదా!’ అంటూ చిరాగ్గా అడిగింది టీచర్. ‘చెప్పారు టీచర్‌. కానీ నాకు తోచిన సమాధానం రాసే ప్రయత్నం చేస్తున్నాను. ఆ ఆలోచనలతో కాస్త ఆలస్యం అయ్యింది,’ అని సంజాయిషీ చెబుతూ తన కాగితాన్ని టీచరుగారి చేతిలో పెట్టింది సరిత.   టీచర్ నిదానంగా ఒకొక్కరి జవాబులనీ చదువుతూ కూర్చుంది. విద్యార్థులంతా తాము సరైన జవాబులు రాశామో లేదో అని మిగతావారితో గుసగుసలాడుకోసాగారు. వాళ్లలో చాలామంది ఏడు వింతలు అనగానే తాజ్‌మహల్‌, పిరమిడ్స్‌, గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా... లాంటి కట్టడాల గురించి రాశారు.   టీచర్‌ ఒకో కాగితం చూసుకుంటూ సరిత రాసిన జవాబు పత్రాన్ని చేతిలోకి తీసుకుంది. అందులో ఉన్నది చదవగానే నమ్మలేకపోతున్నట్లుగా కళ్లు చికిలించి మరీ చూసింది. ఆపై సరిత వంకా చూసింది. సరిత మొహంలో ఆమెకు ఏ భావమూ ప్రస్ఫుటం కాలేదు... ఒక్క అమాయకత్వం తప్ప! ఏడు వింతలనగానే సరిత తన జవాబులుగా ఈ వింతలను పేర్కొంది- ‘చూడగలగడం, వినగలగడం, అనుభూతి చెందగలగడం, నవ్వగలగడం, ఆలోచించగలగడం, ఆలోచనలని వ్యక్తం చేయగలగడం, కరుణతో మెలగడం’. ఆ జవాబులని చదివిన టీచర్ కళ్లు ఒక్కసారిగా చెమ్మగిల్లాయి. ఒక పేద పల్లెటూరి పిల్ల జీవితంలోని నిజమైన ఏడు వింతలలూ ఏమిటో తెలుసుకోగలిగింది కదా! అనుకుంది. తన విద్యార్థులందరికీ ఆ ఏడు వింతల విలువా తెలియచేసినప్పుడే వారి చదువుకి అర్థం అనుకుంది. అందుకే సరిత జవాబులని బిగ్గరగా చదివి వినిపించింది. ఆ జవాబులని విన్న విద్యార్థులంతా ఒక్క క్షణం అబ్బురంగా సరిత వైపు చూశారు. వారి కళ్లలో ఇప్పుడు సరిత పట్ల చులకన లేదు. అలాంటి మనిషి తమ తరగతిలో ఉందన్న సంతోషం కనిపించింది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.  

ఇదీ ఎర్త్‌ డే కథ

    1969 జనవరి 28: అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో ఒక చమురుబావి నుంచి ముడిచమురు పొంగి పొర్లడం మొదలైంది. పదిరోజుల పాటు జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు లక్ష బ్యారెల్స్ చమురు నీటిపాలైంది. నీటిలో చమురు కలవడం వల్ల వేలాది సముద్ర పక్షులు చనిపోయాయి. ఇక నీటిలో ఉన్న ప్రాణులకి జరిగిన నష్టానికైతే లెక్కే లేదు. సహజంగానే ఈ వార్త సంచలనం సృష్టించింది. ‘ఇంధనం కోసం చేసే ప్రయత్నాలలో ఇవన్నీ మామూలే!’ అంటూ జనం ఎవరి పని వాళ్లు చూసుకున్నారు. కానీ కొంతమందిలో మాత్రం ఈ ఘటన భయం కలిగించింది. పర్యావరణం పట్ల మనం ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నమా! అన్న ఆలోచన రేకెత్తించింది. ఆ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ ఓ ఉద్యమం నిర్మించే ప్రయత్నం జరిగింది. అదే ‘ఎర్త్‌ డే’.   1970లో అప్పటి అమెరికన్‌ సెనెటర్‌ Gaylord Nelson నేతృత్వంలో ఈ ఎర్త్‌ డే అనే ఉద్యమం మొదలైంది. ఆ ఏడాది ఏప్రిల్‌ 22న దాదాపు రెండుకోట్ల మంది ఊరేగింపులలోపాల్గొని పర్యావరణం పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు. అప్పటి నుంచి ఏటా ఎర్త్‌ డేను నిర్వహిస్తూనే ఉన్నారు.   అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశంలో పర్యావరణం గురించి పోరాడటం ఏమంత తేలిక కాదు. ఎందుకంటే పర్యావరణానికి హాని కలగకుండా భౌతికమైన అభివృద్ధి సాధ్యంకాదు. అందుకే అక్కడి ప్రభుత్వాలు కూడా గ్లోబల్‌ వార్మింగ్‌ వంటి సమస్యలకి, పారిశ్రామిక అభివృద్ధి కారణం కాదంటూ వాదించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. పర్యావరణం గురించి చిన్నాచితకా ఉద్యమాలు మొదలైనా... వాటి మాట ప్రభుత్వం ముందు నిలబడదు. కానీ అలాంటి చిన్నా చితకా ఉద్యమాలన్నీ ఏకమయ్యే అవకాశం కల్పించింది ‘ఎర్త్‌ డే’. ఫలితంగా ప్రభుత్వం సైతం తల వంచి పర్యావరణాన్నీ, వన్య ప్రాణులనీ కాపాడేందుకు చట్టాలు చేయక తప్పలేదు.   ఒక చిన్న ఆందోళనగా మొదలైన ‘ఎర్త్‌ డే’ ఉద్యమం ఇప్పుడు వందకు పైగా దేశాల్లో ప్రభావం చూపుతోంది. క్రితం ఏడాది ఎర్త్‌ డే రోజున ఇండియా సహా 120 దేశాలు Paris Climate Agreement మీద సంతకం చేశాయంటే... ఉద్యమం ఫలిస్తున్నట్లేగా! గ్లోబల్‌ వార్మింగ్‌ను అదుపు చేస్తూ కనీసం రెండు డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గించడమే ఈ Paris Climate Agreement ఉద్దేశం.   ఎర్త్‌ డే రోజున ఉద్యమకారులు ఎలాగూ ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడతారు. కోట్ల కొద్దీ చెట్లని నాటుతూ ఉంటారు. కానీ ఈ ఉద్యమంతో సంబంధం లేనివారు కూడా ఎంతోకొంత పర్యావరణం మీద శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు. ‘ఒక్కడినే ఏం చేయగలను?’ అనుకోవడానికి లేదనీ... పర్యావరణం మీద ప్రతి ఒక్కరి చర్యా ఎంతోకొంత ప్రభావం చూపుతుందని అంటున్నారు. చిన్నచిన్న దూరాలకి సైకిల్‌ లేదా నడక మీద ఆధారపడటం, చెట్లు నాటడం, రీసైకిల్డ్‌ వస్తువులని ప్రోత్సహించడం, విద్యుత్తుని వృధా చేయకపోవడం, అనవసరమైన ప్రింట్‌ఔట్స్‌ తీసుకోకపోవడం, శాకాహారం వైపు మొగ్గు చూపడం... లాంటి సవాలక్ష ఉపాయాలన్నీ పర్యావరణాన్ని ఎంతోకొంత కాపాడేవే! ఇవే కనుక పాటిస్తే ప్రతిరోజూ ఎర్త్‌ డేనే!   - నిర్జర.  

శామ్ గురించి వింటే... జీవితం మారిపోతుంది!

  కష్టాలు మనుషులకి కాకపోతే మానులకి వస్తాయా! అంటాం. కానీ చిన్నపాటి కష్టం వస్తే చాలు తల్లడిల్లిపోతాం. మనసుని ఎలా సముదాయించుకోవాలో, జీవితాన్ని ఎలా ముందుకు సాగించాలో తెలియక తలకిందులైపోతాం. కానీ కొందరుంటారు. ఎంతటి కష్టం వచ్చినా, నిబ్బరంగా అడుగు ముందుకు వేస్తారు. తమకి తాము ధైర్యం చెప్పుకొంటూనే... తోటివారికి కూడా ఆదర్శంగా నిలుస్తారు. అలాంటివాడే ‘శామ్ బెర్స్స్’ (Sam Berns).   శామ్ పుట్టగానే అతను మిగతా పిల్లల్లాగే సాధారణమైనవాడని అనుకున్నారు తల్లిదండ్రులు. ఒకవేళ చిన్నాచితకా ఆరోగ్య సమస్య వచ్చినా తాము తీర్చేయవచ్చనుకున్నారు. ఎందుకంటే శామ్ తల్లిదండ్రులు ఇద్దరూ పిల్లల వైద్యులే! కానీ జీవితంలో వచ్చే ప్రతి సమస్యకీ సమాధానం ఉంటుందనుకోవడం అత్యాశే కదా! శామ్కి రెండేళ్లు వచ్చేసరికి అతను progeria అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడని తేలింది.   Progeria చాలా అసాధారణమైన వ్యాధి. ప్రతి 40 లక్షలమందిలో ఒకరికి మాత్రమే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. జన్యువులలో కలిగే ఒక అసాధారణ మార్పు వల్ల ఈ వ్యాధి ఏర్పడుతుంది. ఈ వ్యాధి సోకినవారు పదేళ్లకే ముసలివాడిలా మారిపోతారు. పసివయసులోనే బట్టతల వచ్చేస్తుంది, చర్మం ముడతలు పడుతుంది, ఎముకలు పెళుసుబారిపోతాయి, శరీరం వంగిపోతుంది, గుండె వంటి అవయవాలన్నీ బలహీనపడిపోతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే Progeriaతో 90 ఏళ్ల ముసలివారు పడే బాధలన్నీ పసివయసులోనే అనుభవిస్తారు.   శామ్కి ఊహ తెలిసేసరికి తన కష్టమేమిటో అర్థమైపోయింది. కానీ ఆ కష్టంతో జీవించడం ఎలాగో అలవాటు చేసుకునే ప్రయత్నం చేశాడు. ‘progeria వల్ల నేను చాలా పనులు చేయలేకపోవచ్చు. కానీ వాటి గురించే ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా! చేయలేని విషయాల గురించే పట్టుకుని వేళ్లాడుతూ ఉంటే... చేరుకోదగిన లక్ష్యాలని కూడా మనం కోల్పోతాం,’ అంటాడు శామ్. అందుకనే తనేం చేయగలడో, వాటన్నింటినీ సాధించే ప్రయత్నం చేశాడు. చదువుకోవడం, సంగీతం నేర్చుకోవడం, డాన్స్ చేయడం, యాత్రలకి వెళ్లడం.. ఇలా తన జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించే ప్రయత్నం చేశాడు.   శామ్ సానుకూల దృక్పథం అతనివరకే పరిమితం కాలేదు. తనకి ఉన్న అరుదైన వ్యాధి గురించి ప్రపంచం మొత్తానికీ చాటాలని అనుకున్నాడు. ఆ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కలిగించడం, ఆ వ్యాధి కలిగినవారిలో ఆశని నింపడం కోసం తన వంతు ప్రయత్నం చేశాడు. శామ్ తల్లిదండ్రులు అప్పటికే Progeria Research Foundation అనే సంస్థని ఏర్పాటే చేశారు. ఆ సంస్థకి ఒక బ్రాండ్ అంబాసిడర్లా మారిపోయాడు శామ్.   శామ్ పుణ్యమా అని Progeria అనే వ్యాధి గురించి ప్రపంచానికి తెలియడం మొదలైంది. కేవలం Progeriaనే కాదు, ఎలాంటి కష్టంతో అయినా కలిసి జీవించడం ఎలాగో శామ్ని చూసి జనం ప్రేరణ పొందసాగారు. 2013లో HBO శామ్ వ్యక్తిత్వం గురించి Life According to Sam పేరుతో ఒక డాక్యుమెంటరీని రూపొందించింది. అదే ఏడాది TED అనే సంస్థ శామ్తో ఒక ఆన్లైన్ ఉపన్యాసం ఇప్పించింది. ఈ వీడియోని రెండుకోట్ల మందికి పైగా చూశారంటే శామ్ ప్రభావం ఏపాటిదో అర్థమైపోతుంది.   TED ఉపన్యాసంలో జీవితం గురించి తన అభిప్రాయాన్ని మూడు ముక్కల్లో చెప్పే ప్రయత్నం చేశాడు శామ్. ఒకటి – మన గురించి మనం తక్కువగా ఆలోచించుకుంటూ జీవితాన్ని వృధా చేసుకోకుండా, చేయదగిన పనుల మీద దృష్టి పెట్టడం, రెండు – మనల్ని అర్థం చేసుకునే ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులని మన చుట్టూ ఉంచుకోవడం, మూడు – ఎట్టిపరిస్థితుల్లోనూ జీవితాన్ని ముందుకు సాగించడం. అది ఒకో అడుగే కావచ్చు, చిన్నపాటి అడుగే కావచ్చు. కానీ ముందుకు సాగుతూ ఉండటమే!   TED ఉపన్యాసంలో శామ్ తను ఓ గొప్ప శాస్త్రవేత్తని కావాలనుకుంటున్నానని చెప్పాడు. కానీ కొద్ది నెలలకే అతను చనిపోయాడు. బహుశా తను ఎక్కువకాలం బతకనని శామ్కి కూడా తెలుసేమో! ఎందుకంటే Progeria వచ్చినవారు సాధారణంగా 13 ఏళ్లకి మించి బతకరు. కానీ ఆ తలపుకి శామ్ లొంగలేదు. 17 ఏళ్ల వరకు నిబ్బరంగా బతికేశాడు. ప్రతి రోజునీ తనదిగా చేసుకుంటూ సాగిపోయాడు. అందుకే శామ్ ఈ లోకంలో లేకపోయినా... తన గురించి విన్నవారందరికీ స్ఫూర్తినిచ్చే జీవితాన్నిచ్చి వెళ్లాడు. - నిర్జర.

మనుషులు నాలుగు రకాలు – మీరే రకం!

దేవుడు భూలోకం మీద సృష్టిని ఇంచుమించుగా పూర్తిచేశాడు. ఇక అక్కడిని మనిషిని పంపాల్సి ఉంది. మనిషంటే పరిపూర్ణుడై ఉండాలి. భూమిని కాపాడుకుంటూ, నాగరికతను ముందుకు తీసుకువెళ్లేవాడై ఉండాలి. అందుకోసం తన దగ్గర ఉండే కొంతమంది దేవదూతలనే మనుషులుగా పుట్టించాలనుకున్నాడు.   ఇలా దేవుడు సుదీర్ఘమైన ఆలోచనలో మునిగిపోవడం చూసి ఓ దేవదూత నిదానంగా ఆయన దగ్గరకు చేరుకున్నాడు. ‘చాలా రోజులుగా మీరేదో పనిలో నిమగ్నమవ్వడాన్ని గమనిస్తున్నాను. అదేమిటో తెలుసుకోవచ్చా!’ అని అడిగాడు దేవదూత. అప్పుడు దేవుడు ఓపికగా తన మనసులోని మాటను చెప్పాడు, భూమి గురించి నిదానంగా వివరించాడు. ‘వినడానికి ఆశ్చర్యంగా ఉంది. మీరు భూమిని ఎలా సృష్టిస్తున్నారు? అందులో ఎలాంటి జీవుల ఉంటాయి? భూమి లోపలికి తవ్వితే ఏం కనిపిస్తుంది? భూమి మీదకి నేను కూడా వెళ్లగలనా?’ అంటూ రకరకాల ప్రశ్నలతో దేవుడిని ముంచెత్తాడు దేవదూత.   దేవదూత మాటలకు దేవుడు చిరునవ్వుతో...’ఇంత ఆసక్తిగా అడుగుతున్నావు కాబట్టి, నిన్నే మనిషిగా మార్చి భూమి మీదకు పంపుతాను. తెలియని ప్రతి విషయం గురించి ఆసక్తిగా తెలుసుకునే అలవాటు నీలో కనిపిస్తోంది. కాబట్టి నువ్వు శాస్త్రవేత్తగా మారతావు. నీ తరహా మనుషులంతా భూమిని కొత్తకొత్త ఆవిష్కరణలతో సుఖమయం చేస్తారు,’ అంటూ అతగాడిని భూమి మీదకు పంపాడు.   ఇదంతా పక్కనే ఉన్న మరో దేవదూత గమనించాడు...’అతణ్ని మీరు భూమి మీదకు ఎందుకు పంపారు? దేవదూత ఓ సాధారణ జీవిగా మారిపోతే అతని ప్రవర్తన ఎలా ఉంటుంది? అసలు భూమిని సృష్టించడంలో మీ ఉద్దేశం ఏమిటి?’ అంటూ ఊదరగొట్టేశాడు.   రెండో దేవదూత మాటలకు దేవుడు చిరునవ్వుతో...’నీకు మనిషి బయట ఏం జరుగుతుందో అన్న ఆసక్తి కంటే, మనసులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉంది. నీలోకి నువ్వు తొంగిచూసుకునే గుణం కనిపిస్తోంది. కాబట్టి నువ్వు గొప్ప వేదాంతిగా మారతావు. నీ తరహా మనుషులు రకరకాల సిద్ధాంతాలతో సమాజాన్ని నిర్మిస్తారు,’ అంటూ అతగాడిని భూమి మీదకు పంపాడు.   భూమి గురించి తెలిసి ఒక దేవదూత, ఎవరూ లేని సమయం చూసి దేవుడి దగ్గరకు చేరుకున్నాడు. ‘భగవాన్‌! మీరేదో కొత్త లోకాన్ని సృష్టించారని తెలిసింది. ఇన్ని రోజులుగా నేను మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాను. కానీ ఏమీ దక్కలేదు. నాకు ఆ భూలోకం ఇప్పించండి. నా దర్పం ఏమిటో చూపిస్తా!’ అని వేడుకున్నాడు.   మూడో దేవదూత మాటలకు దేవుడు కాసేపు ఆలోచించాడు. ఆవిష్కరణలను చేసేవాడు, ఆధ్మాత్మిక లోతుని చూసేవాడు భూలోకానికి చేరిపోయారు. కానీ అధికారం చలాయించేవారు కూడా ఒకరుండాలి కదా! అందుకని తన దగ్గరకు వచ్చిన మూడో దేవదూతని భూమి మీదకు పంపాడు. అతనూ, అతని తరహా మనుషులూ నాయకులుగా, రాజకీయవేత్తలుగా సాటివారి మీద ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తారని వరమిచ్చాడు.   దేవుడు భూమిని సృష్టించాడనీ, దాని మీదకు దేవదూతలను పంపుతున్నాడనే వార్త దేవలోకంమంతా పాకిపోయింది. ఎవరికివారు తమని ఆ కొత్త, అందమైన లోకం మీదకు పంపమని దేవుని చుట్టూ చేరసాగారు. వారి తాకిడితో దేవునికి సైతం చిరాకేసింది. ఇంతలో ఓ దేవదూత ఆయన దగ్గరకి చేరి ‘ప్రభూ! మీరు వీరందరి కోరికలతో విసిగిపోతున్నట్లున్నారు. నేను మీకు ఏమన్నా సాయం చేయగలనా? మీ చిరాకు తగ్గేందుకు ఏమన్నా సేవ చేయగలనా?’ అంటూ అడిగాడు.   నాలుగో దేవదూత మాటలు విన్న దేవునికి ముచ్చటవేసింది. ‘నేను భౌతికమైన అభివృద్ధి కోసం శాస్త్రవేత్తలని పంపాను. మనసుని శోధించేందుకు వేదాంతులని పంపాను. పెత్తనం చెలాయించేందుకు నాయకులను పంపాను. కానీ తోటివారి గురించి ఆలోచించి... వారి బాధలో సాయపడి, వారి కన్నీటిని తుడిచే మనుషులు కూడా ఉండాలి కదా! అందుకు ఇతనే సరైనవాడు’ అనుకున్నాడు. వెంటనే ఆ దైవదూతని భూమ్మీదకు పంపాడు. మరి! పైన పేర్కొన్న నాలుగు రకాలవారిలో మనం ఏ కోవకి చెందుతామో! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.

LEARN TO BE HAPPY

  A happy life is what all of us are looking for. Psychologists claim that they can help us lead one. Let’s see what they have in store for us. They recommend some simple changes to our lives that will bring happiness to us. The first thing they suggest is to find something to flow into. Flow is a concept in Psychology that is described as involving in an activity that makes one forget the world around him or her. It could be anything. Dancing, swimming, creative writing or simply reading a book.   In the modern world where there is a severe lack of time for anything, we have forgotten to smile. Psychologists remind us of this simple gesture and recommend smiling often. Smile even when you don’t feel like it. Research reveals that even a fake smile has the potential to make you feel good instantly. Scientists go further ahead and explain the scientific connection between smiling and happiness.   It is said that when you smile, your facial muscles flex releasing more blood to the frontal lobes of your brain. This triggers the release of dopamine – a chemical that is responsible for feeling pleasure.   Psychology says an easy way of staying happy is accepting your mistakes. As humans we are bound to make mistakes and its okay. Accepting your mistakes will help you forgive yourself and also improve your image with other people. People will like you for owning up and being honest.   Knowing when to say no is the key to a happy life. People who lead a happy life will tell you that the secret lies in rejecting people things and behaviours that stress you out. If you try to oblige to every situation and person, you will end up being very unhappy. Give yourself the importance you deserve and don’t be afraid to say no to toxic people and situations. Life is as happy as you make it.  - KRUTI BEESAM    

ఈ ఫొటోలో మీకు ఏ రంగులు కనిపిస్తున్నాయి?

  ఇంగ్లండుకి చెందిన ‘రోమన్ ఒరిజినల్స్’ సంస్థ 2015లో ఒక ఫ్రాక్ను విడుదల చేసింది. ఎవరో ఆ ఫ్రాక్ను తొడుక్కొని సరదాగా ఫొటో దిగి ఫేస్బుక్లో పెట్టారు. అప్పటి నుంచీ మొదలైంది రచ్చ! ఆ ఫ్రాక్ బంగారం, తెలుపు చారల్లో ఉందని కొందరంటే... కాదు కాదు! అది నలుపు, నీలం రంగుల్లో ఉందని మరికొందరు వాదించారు. నిజానికి ఈ ఫ్రాక్ను నలుపు, నీలం రంగుల్లోనే తయారుచేశారని తర్వాత కాలంలో తేలింది.   The Dress పేరుతో సదరు ఫ్రాక్ సంచలనం సృష్టించింది. ఈ ప్రచారం పుణ్యమా అని ‘రోమన్ ఒరిజినల్స్’ ఈ తరహా దుస్తులను తెగ అమ్ముకొని విపరీతంగా లాభాలను సంపాదించింది. కానీ ఒకే తరహా డ్రస్ ఇద్దరు మనుషులకు రెండు రకాలుగా ఎందుకు కనిపిస్తుందన్న ప్రశ్న గత రెండేళ్లుగా శాస్త్రవేత్తలను కదిలించింది. దీని గురించి రకరకాల చర్చలు నడిచాయి. కానీ ఆ ప్రశ్నకి ఇప్పుడు జవాబు తెలిసిపోయిందంటున్నారు.   న్యూయార్కుకి చెందిన ‘వాలిస్’ అనే సైకాలజిస్టు The Dress వెనుక ఉన్న రహస్యాన్ని ఛేధించానని చెబుతున్నారు. మనం నిద్రపోయే తీరుకీ, the dressలో కనిపిస్తున్న రంగులకీ మధ్య పొంతన ఉందని వాలిస్ అంటున్నారు. మనలో కొందరు ఉదయాన్నే లేచి రాత్రిళ్లు త్వరగా పడుకుంటారు. మరికొందరేమో బారెడు పొద్దెక్కాక లేచి మళ్లీ తెల్లవారేదాకా మెలకువగా ఉంటారు. పగటి వేళలు చురుగ్గా ఉండేవారేమో సూర్యకాంతికి ఎక్కువగా అలవాటుపడుతుంటారు. రాత్రివేళ మెలకువగా ఉండేవారేమో కృత్రిమమైన కాంతికి అలవాటుపడతారు. పగటివేళ కాంతి బంగారు వర్ణంలో ఉంటుంది. రాత్రివేళ కృత్రిమమైన వెలుతురు ఎక్కువగా నీలం రంగుని వెదజల్లుతుంది.   The Dress నిజానికి నీలం, నలుపు రంగుల్లోనే కనిపిస్తుంది. కానీ పగటి కాంతికి అలవాటుపడినవారు... అది చీకట్లో తీసిన ఫొటోగా భావించి, దానికి పగటికాంతిని (బంగారు రంగుని) జోడిస్తారట. ఇదంతా మనకి తెలియకుండానే మన మెదడు చేసే సర్దుబాటు! దీనివల్ల The Dress బంగారు, తెలుపు వర్ణంలో కనిపించేస్తుంది. దాదాపు 13 వేలమందికి ఈ ఫొటోను చూపించి, నిద్రకు సంబంధించి వారి అలవాట్లను గమనించి తేల్చిన విషయమిది! అంటే మన కంటికి కనిపించేదంతా నిజమేనని ‘గుడ్డి’గా వాదించేయడానికి లేదన్నమాట! - నిర్జర.  

THE WAY TO A HAPPY LIFE

  Who doesn’t want to live a happy life? Does everyone know the secret to one? Today, let us discover the countless ways of making life happy. It could be simple things that we are missing out on because of our busy schedules. Sometimes it feels as if a happy life is lost between meetings, deadlines and endless traffic jams. To find it, you just have to change your life a little. You may not have realized, but there is a strong connection between your food, sleep and mood. To be in a good mood you must ensure that you eat well and sleep enough. Starving for long hours and sleeping too less can make you irritable.   Anger management is obviously a crucial aspect of being and staying happy. The secret is to never go to bed with anger in your mind. It has been proven bottled up anger can make you frustrated and then one thing may lead to another. To avoid stagnant bad mood just ensure you vent it out before you go to bed.   A lot of things work in your favour even if you fake a feeling. If you are feeling low, for instance, force yourself to act cheerful and see how your mood changes in a few minutes. Make yourself believe that you are happy and nothing is bothering you.   Eating something to improve your mood is not a good idea. This will only add to your calories. Besides, the effect the food has is only temporary. Look for a method that is healthy and whose effects are long lasting. Always remember that being happy has less to do with your personality type and more to with your desire. So, next time you feel low you know how to cheer yourself up. - KRUTI BEESAM  

పిల్లలు అబద్ధం చెబుతుంటే!

  ప్రపంచంలో పిల్లల్ని పెంచడం అంత నైపుణ్యమైన పని మరొకటి ఉండదేమో! ఒక పక్క వారి ఆలనాపాలనా చూసుకుంటూ... మరో పక్క వారి వ్యక్తిత్వాన్ని గమనిస్తూ సాగే ఈ ప్రయాణం ఏమంత సులువైంది కాదు. అలాంటి సమయంలో పిల్లలు అబద్ధం చెబుతున్నారని తేలిందనుకోండి... అంతే! తల్లిదండ్రుల ప్రతిస్పందన అసాధారణంగా ఉంటుంది. తమ పెంపకంలో ఏదో లోటు జరిగిపోయిందనో, పిల్లలు సరిగా ఎదగడం లేదనో తెగ బాధపడిపోతారు. శాశ్వతంగా పిల్లల పట్ల అనుమానపు దృక్పథాన్ని అలవర్చుకుంటారు. కానీ అంత అంతర్మధనం అవసరం లేదంటున్నారు నిపుణులు. ఈ విషయంలో వారేం చెబుతున్నారంటే... విశ్వాసం పెరిగితే   నిజం చెబితే తల్లిదండ్రుల ప్రతిస్పందన ఎలా ఉంటుందో అన్న భయమే చాలా అబద్ధాలకి కారణం అవుతుంది. ఈ భయాన్ని పోగొట్టాలంటే మనపట్ల వారికి తగిన నమ్మకాన్ని కలిగించాల్సిందే! మనతో వారు ఎలాంటి సమస్యని అయినా చెప్పుకోవచ్చుననీ... దానికి తగిన పరిష్కారం, సాంత్వన లభిస్తాయనీ నమ్మకం కలిగిన రోజున అబద్ధం చెప్పాల్సిన అవసరమే రాదు.   కారణాన్ని గ్రహించండి   ప్రతీ అబద్ధం వెనుకా ఏదో ఒక కారణం ఉండవచ్చు. దాన్ని గ్రహించే ప్రయత్నం చేయమంటున్నారు. పిల్లలు సిగ్గుతోనో, భయంతోనో, అలవాటుగానో, ఎవరూ తెలుసుకోలేరనే ధీమాతోనో అబద్ధం చెప్పి ఉండవచ్చు. కారణం ఏమిటని కనుక గ్రహిస్తే వారి ఎదుగుదల గురించి విలువైన విషయాలు తెలుస్తాయి. మున్ముందు వారితో ఎలా మెలగాలో సూచన వినిపిస్తుంది.   వయసుని బట్టి అబద్ధం   ‘మా ఇంట్లో రివాల్వర్ ఉంది!’ అని ఓ పసిపిల్లవాడు అబద్ధం చెప్పాడే అనుకోండి. అది కేవలం గొప్ప కోసం చెప్పిన విషయం కావచ్చు. ‘మా కుక్క మాట్లాడుతుంది!’ అని ఓ 18 ఏళ్ల కుర్రవాడు చెబితే అతను సరదా కోసం చెప్పిన సంగతి కావచ్చు. పిల్లల వయసుని బట్టి వారు చెప్పే సందర్భాన్ని బట్టి ఒక విషయం అబద్ధమా కాదా అని తేల్చుకోవాల్సిందే కానీ ప్రతి విషయానికీ చిందులు వేయడం తగదు.   విలువలు తెలిస్తే సరి   నిజాయితీగా ఉండటం, చేసిన పనికి బాధ్యతని స్వీకరించడం, ఎలాంటి సవాలుకైనా సిద్ధంగా ఉండటం... వంటి విలువలు పిల్లలకి తెలిస్తే వారి వ్యక్తిత్వం దృఢపడుతుంది. అబద్ధాలు చెప్పడం, పుకార్లు సృష్టించడంలాంటి పనులకు పాల్పడరు. మన ప్రవర్తన, వ్యక్తిత్వం ద్వారానే పిల్లలకి ఇలాంటి విలువలు తెలుస్తాయి. మనమే వారి ముందు అబద్ధాలు చెబుతూ ఉంటే వారి ప్రవర్తన మరో రకంగా ఎలా ఉంటుంది?   సమయం కేటాయించాలి   పిల్లలు ఏం చెప్పినా ఓపికగా వినేందుకు సిద్ధంగా ఉండాలి. వారితో గడిపేందుకు, వాళ్లు చెప్పే విషయాలు వినేందుకు తగిన సమయాన్ని కేటాయించాలి. వారి మాటల్ని ఏవో పిల్ల మాటలుగా సరిపెట్టేయకుండా... ఓపికగా వారి ప్రశ్నలకు తిరిగి జవాబు చెప్పాలి. అప్పుడే వారికి మనం విలువనిస్తున్న విషయం అర్థమవుతుంది. తమకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకునేందుకు తగిన స్వేచ్ఛ లభిస్తుంది.   అన్నింటికీ మించి అబద్ధం చెప్పడం సహజమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అబద్ధం చెప్పకుండా ఏ మనిషీ ఎదగడు. అది తప్పని తెలుసుకోకపోవడమే అసలు సమస్య! పై జాగ్రత్తలు పాటిస్తే ఆ సమస్య రానే రాదని భరోసా ఇస్తున్నారు నిపుణులు. - నిర్జర.

నాయకుడంటే రాముడిలా ఉండాలి

  రామాయణం జరిగి వేల సంవత్సరాలు గడుస్తున్నాయి. ఈలోగా మనిషి మారాడు. అతని నాగరికత మారింది. కానీ రామాయణంలో కనిపించే మౌలిక సూత్రాలు తరతరాలని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. రాముడు సీతను వదిలేయకుండా ఉండాల్సిందా? వాలిని చెట్టుచాటు నుంచి ఎందుకు చంపాడు? అన్న అంశాలలో వాదులాటలని పక్కన పెడితే, మంచి విషయాలు నేర్చుకునేందుకే రామాయణంలో చాలా సందర్భాలే కనిపిస్తాయి. సమర్ధుడైన నాయకత్వం అవని విభుండు నేరుపరియై చరియించిన గొల్పువార లె ట్లవగుణలైన నేమి పనులన్నియుఁజేకుఱు వారిచేతనే ప్రవిమల నీతిశాలియగు రాముని కార్యము మర్కటంబులే దవిలి యొనర్పవే? జలధి దాటి సూరారులద్రుంచి భాస్కరా! రాజు నేర్పరి అయితే ఎలాంటివారితో అయినా పనులని చక్కపెట్టుకోగలడు. రాముడు తన కార్యాన్ని వానరులతోనే సాధించగలిగాడు కదా అంటాడు మారయ కవి భాస్కర శతకంలో! నాయకుడు సమర్థుడైతే ఎవరితో అయినా, ఎంతటి లక్ష్యాన్నయినా సాధించగలడు అనేందుకు రాముడే గొప్ప ఉదాహరణ. విద్యను ఆచరణలో పెట్టాలి విద్యని నేర్చుకోవడం కష్టమే... కానీ ఆచరణలో ఉపయోగపడాలి కదా! రాజ్యాన్ని పాలించేవాడు యుద్ధవిద్యలు నేర్చుకోవడమే కాదు... అవసరం అయినప్పుడు రణరంగంలో తన సత్తా చూపించేందుకూ సిద్ధంగా ఉండాలి. అందుకే రాముడు తన కులగురువైన వశిష్టుని వద్ద సకల విద్యలనూ నేర్చుకోగానే... ఆతణ్ని యుద్ధానికి తీసుకువెళ్లేందుకు విశ్వామిత్రుడు తొందరపడ్డాడు. తనతోపాటుగా రాముని అడవులకు తీసుకువెళ్లి... అక్కడ ఒక పక్కన అతనితో రాక్షసుల మీద యుద్ధం చేయిస్తూనే, మరో పక్క యుద్ధంలో తనకు తెలిసిన మెళకువలు కూడా నేర్పాడు. ఇంతకు మించిన field trip ఉంటుందా! అనువుగాని చోట ఎక్కడ నెగ్గాలో కాదు... ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు అన్న మాట ఈమధ్య కాలంలో బాగా వినిపిస్తోంది. అనువుగాని చోట అధికులమనరాదు అంటూ ఇదే విషయాన్ని వేమన ఎప్పుడోనే చెప్పాడు. ఇందుకు గొప్ప ఉదాహరణ రాముడు శివధనుస్సుని విరిచిన సందర్భమే! తనకు వరప్రసాదంగా లభించిన శివధనుస్సుని రాముడు పాడుచేశాడన్న కోపంతో పరశురాముడు, రాముని మీద కాలు దువ్వుతాడు. అతణ్ని రెచ్చగొడుతూ పరుషంగా మాట్లాడతాడు. కానీ రాముడు కూడా అవతార పురుషుడే అని పరశురాముడు తనంతట తానుగా గ్రహించేవరకూ... రాముడు తన సహనాన్ని కోల్పోలేదు. కలుపుకొంటూ పోవాలి సీతమ్మ జాడ కనిపించకపోయాక... రాముడు ఆమెను వెతుక్కుంటూ బయల్దేరారు. దారిలో సుగ్రీవుడనే వానరరాజుతో స్నేహం చేశాడు. చివరికి వారిసాయంతోనే సీతమ్మను సాధించాడు. తను దేవుడు కదా, వానరుల సాయం కోరడం ఏమిటి అని రాముడు ఆలోచించలేదు. దారిలో తన కార్యసాధనకు తోడుగా నిలిచేవారందరినీ కలుపుకొంటూ పోయాడంతే! మరి రావణాసురుడో... తనకు మంచి చెప్పినందుకు తమ్ముడైన విభీషణుని సైతం దూరం చేసుకున్నాడు. చివరికి అతను అందించిన రహస్యం కారణంగానే చావుని కొనితెచ్చుకొన్నాడు. ధర్మాన్ని పాటించాడు సమాజంలోని ప్రజలంతా కలిసి జీవించేందుకు కొన్ని నిబంధనలను ఏర్పరుచుకుంటారు. దానినే ధర్మం అని పిలుచుకుంటాము. ధర్మం కాలానుగుణంగా మారుతూ ఉండవచ్చు. ఉదాహరణకు తండ్రి మాటను జవదాటకపోవడం రాముని కాలంలోని ధర్మం! అది ఈ కాలంలో వర్తిస్తుందా అంటే చెప్పడం కష్టం. రాముడు తన ధర్మాన్ని నూటికి నూరుపాళ్లూ పాటించాడంటారు పెద్దలు. అందుకే ఆయన పాలనను రామరాజ్యంగా కలకాలం గుర్తుంచుకున్నారు. రామాయణాన్ని కేవలం ఒక ఇతిహాసంగా కాకుండా, మంచిచెడులను తెలిపే గ్రంథంగా మరోసారి చదివితే ఇలాంటి విషయాలు ఎన్నో తటస్థపడతాయి. మన నిత్య జీవితంలో ఉపయోగపడతాయి. - నిర్జర.

యువతకి ఆదర్శం... ఈ రేవంత్‌

ఎల్‌.వి. రేవంత్‌... నిన్నటి దాకా ఈ పేరు వినని వారు కూడా ‘ఎవరా ఈ కుర్రవాడు’ అంటూ గూగుల్‌ చేస్తున్న పేరు. దేశంలోని ప్రతి పత్రికలోనూ ఇప్పుడు రేవంత్ ఒక న్యూస్‌ ఐటం. ఎందుకంటే తెలుగువారికి దుర్బేధ్యం అనుకునే ఇండియన్‌ ఐడిల్‌ కోటను తన పాటతో బద్దలుకొట్టిన విజేత రేవంత్‌. కేవలం తెలుగువాడన్న కారణంగా రేవంత్‌ను మనం అభిమానించడం లేదు.... అందుకు చాలా కారణాలే ఉన్నాయి.   ఊహించని నేపథ్యం హీరో కడుపులో ఉండగానే తండ్రి చనిపోతాడు. మేనమామల ఆసరాతో అతను పెరుగుతాడు. ఎవరి మీదా ఆధారపకుండా విజయాలను సాధిస్తాడు. ఇదీ మనం తరచూ వినే సినిమా కథ. కానీ రేవంత్‌ జీవితంలో ఆ సినిమా కష్టాలే నిజమయ్యాయి! కాకపోతే అతని ఉమ్మడి కుటుంబం రక్షగా ఉండటం ఓ అనుకోని అదృష్టం.   ఎంతటి శ్రమకైనా సిద్ధం రేవంత్‌కి చిన్నప్పటి నుంచే పాటలంటే ఇష్టం. పాటలపోటీల్లో పాల్గొని తనని తాను మెరుగుపర్చుకోవాలనీ, తనేమిటో నిరూపించుకోవాలనీ తపించేవాడు. కానీ అందుకోసం డబ్బులు ఖర్చవుతాయిగా! ఆ డబ్బుల కోసం రేవంత్‌ పగలు పేపర్‌బాయ్‌లా పనిచేశాడు, సాయంత్రం హోటల్‌ సర్వర్‌గా ఒళ్లు వంచాడు. అలా తన కాళ్ల మీద తనే పాటల ప్రపంచంలోకి అడుగుపెట్టాడు.   అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు రేవంత్‌ కోరుకున్నట్లుగా పాటల పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఆ అవకాశం వచ్చిన ప్రతిసారీ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. మాటీవీ ‘సూపర్‌ సింగర్స్’, ఈటీవీ ‘సప్తస్వరాలు’ లాంటి ప్రతి కార్యక్రమంలోనూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపుతోనే మర్యాదరామన్న సినిమాలో తొలిసారిగా పాడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఇక తిరిగి చూసుకోలేదు. చేతికి అంది వస్తున్న ఒకో సినిమాతోనూ గాయకుడిగా స్థిరమైన స్థానం సాధించాడు. బాహుబలిలో పాడిన ‘మనోహరీ’ పాటతో ప్రేక్షకులని దాసోహం చేసుకున్నాడు.   ప్చ్‌ తృప్తి లేదు! రేవంత్‌కు పాటంటే ఎంత ఇష్టమో... పాటల పోటీలంటే అంతే ఇష్టం. వాటిలో సోనీ టీవీ నిర్వహించే ‘ఇండియన్‌ ఐడిల్’ గురించి చెప్పేదేముంది! మన దేశంలోనే అది అత్యున్నత పోటీ. కొడితే ఆ కుంభస్థలాన్నే కొట్టాలనుకున్నాడు రేవంత్‌. అందుకోసం ముంబైకి మకాం మార్చాలి. ఇప్పుడిప్పుడే వస్తున్న అవకాశాలని కొన్నాళ్లు వదులుకోవాలి. కానీ తన కలను నెరవేర్చుకునేందుకు రేవంత్‌ ఎంతటి రిస్క్‌ అయినా తీసుకునేందుకు సిద్ధపడిపోయాడు.   బలహీనతలు ఉంటాయి, కానీ... ఒకో మనిషికీ ఒకో బలహీనత ఉంటుంది. ఆ బలహీనత ఉంది కదా అని అసలు ప్రయత్నమే విరమించుకుంటే ఇక విజయం దక్కే అవకాశం ఏముంటుంది? రేవంత్‌కి హిందీ పెద్దగా రాదు. ఆ కారణంగానే ఇండియన్ ఐడిల్స్ పోటీలో తోటి అభ్యర్థుల అతణ్ని హేళన చేసేవారు. కానీ రేవంత్ వెనక్కి తగ్గలేదు. తనకు హిందీ రాదని నిజాయితీగా ఒప్పుకొంటూనే... సంగీతమే తన శ్వాస, భాష అని చెప్పుకొచ్చాడు. రేవంత్‌లోని ఆ నిజాయితీ న్యాయనిర్ణేతలని సైతం మెప్పించింది. చిట్టి చివరికి సింహాసనాన్ని దక్కించింది!!   రేవంత్‌కు అహం తక్కువని అతని స్నేహితులు చెబుతుంటారు. నిరంతరం శ్రమించే తత్వం ఎక్కువని అతని సన్నిహితులు పేర్కొంటారు. మొత్తానికి రేవంత్‌ పాటలకే కాదు యువతకు కూడా ఒక ఐడల్‌గా (ఆదర్శం) చెప్పుకోవచ్చన్నమాట!   - నిర్జర.

ఏప్రిల్‌ ఫూల్స్‌ డే రోజు సందడే!

  ఏప్రిల్‌ 1వ తేదీ వచ్చిందంటే ఏప్రిల్‌ ఫూల్స్‌ డేనే గుర్తుకువస్తుంది. ఏదో ఆడతూ పాడుతూ అవతలివారిని ఏడిపించే ఈ రోజు వెనక బోలెడు కథ ఉంది. వేర్వేరు దేశాలలో ఆ వేడుకలని జరుపుకొనే తీరులోనూ వైవిధ్యం కనిపిస్తుంది.   పసలేని వాదన ఒకప్పుడు ఆంగ్ల సంవత్సరం మార్చి 25న మొదలయ్యేది. ఆ సంవత్సర వేడుకలు వారం పాటు, అంటే ఏప్రిల్‌ 1 వరకూ జరిగేవి. కానీ 1582లో గ్రెగోరియన్‌ కేలెండర్‌ అమలులోకి రావడంతో కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి అమలులోకి వచ్చింది. ఈ మార్పుని అనుసరించకుండా ఏప్రిల్‌ 1న కొత్త సంవత్సరాన్ని ఆచరించేవారిని ఏప్రిల్‌ ఫూల్‌ అని పిలుస్తారనేది చాలా పాత వాదన. కానీ 15వ శతాబ్దానికి ముందే ఇలాంటి ఆచారాలు ఉండేవని తెలుస్తోంది. 13వ శతాబ్దంలో వచ్చిన పుస్తకాలలో కూడా ఏప్రిల్‌ ఫూల్‌ ప్రస్తావన కనిపిస్తుంది. కాబట్టి ఇది అనాదిగా వస్తున్న ఆచారమే అనుకోవచ్చు.   ఒకో దేశంలో ఒకోలా ఏప్రిల్‌ ఫూల్‌ రోజున అవతలివారిని ఏదో ఒక విషయంలో దారిమళ్లించి వెధవాయిలని చేయడం సహజమే! కాకపోతే కొన్ని దేశాలలో ఇదే ఆచారాన్ని కాస్త విభిన్నంగా పాటిస్తారు.   - ఫ్రాన్స్‌లో చేప ఆకారంలో ఉన్న ఒక కాగితాన్ని అవతలివారికి తెలియకుండా వీపు మీద అంటిస్తారు. దీనిని ఏప్రిల్‌ ఫిష్‌ అంటారు. - పోర్చుగల్‌ దేశంలో ఒకరి మీద ఒకరు పిండి చల్లుకుంటారు. - డెన్మార్కులో ఏప్రిల్‌ 1వతో పాటు మే 1న కూడా అవతలివారిని వెర్రివెంగళాయిలను చేసే ప్రయత్నం చేస్తారు. - ఐర్లాండులో ‘ఏప్రిల్‌ ఫూల్‌’ కోసం అనే ఉత్తరాన్ని కవరులో ఉంచి ఒకరి నుంచి వేరొకరికి అందిస్తూ ఉంటారు. - ఇంగ్లండులో ఏప్రిల్‌ 1 మధ్యాహ్నం వరకే ఫూల్‌ చేయవచ్చు. ఆ తరువాత ఎవరినన్నా ఫూల్‌ చేయాలని ప్రయత్నిస్తే మనల్నే ఫూల్స్‌గా జమకడతారు.   మీడియా హడావుడి:  ఏప్రిల్‌ ఫూల్‌ రోజున జరిగే సందడిని జనాలకి చేరవేడమే కాదు.... ఆ రోజు తామే స్వయంగా జనాల్ని ఏప్రిల్‌ ఫూల్‌ చేసే ప్రయత్నం చేస్తుంటాయి కొన్ని మీడియా సంస్థలు. లేని వార్తను ఉన్నట్లుగా, జరగనిదానిని జరిగినట్లుగా ప్రచురించి జనాల్ని ఫూల్స్ చేస్తుంటాయి. ఇవి ఒకోసారి వివాదాస్పదం అవుతుంటాయి కూడా! ఉదాహరణకి 1957లో బీబీసీ టీవీ ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. పూల తీగలను పెంచినట్లే తినే నూడిల్స్‌ (spaghetti) కాసే చెట్లని కూడా పెంచవచ్చని ఆ కథనంలోని సారాంశం. అప్పట్లో నూడిల్స్ తయారీ గురించి అంతగా అవగాహన లేని బ్రిటన్‌వాసులు ఈ వార్త నిజమేనని నమ్మి... సదరు చెట్లను ఎలా పెంచాలా అని పరిశోధన మొదలుపెట్టేశారు. మీడియా ద్వారా అతి పెద్ద ఏప్రిల్‌ ఫూల్‌ జోక్‌ అని ఇప్పటికీ ఆ ఘటనను తల్చుకుంటారు.   ఇవీ ఏప్రిల్‌ ఫూల్స్ విశేషాలు! ఏప్రిల్‌ ఫూల్‌ హద్దులో ఉంటే ఆరోగ్యకరమైన హాస్యానికి దారితీస్తుందనీ, హద్దులు దాటితే అవతలివారి మనోభావాలని దెబ్బతీస్తుందనీ పెద్దలు చెబుతున్నారు. ఆ హద్దులేవో పాటిస్తే పోలా! - నిర్జర.

5 లక్షల తలరాతలు మార్చేసిన మహిళ

  డా॥ కిరణ్ మార్టిన్ పిల్లల వైద్యురాలు. ఓసారి ఆమె దక్షిణ దిల్లీలోని ఓ మురికివాడలోకి వెళ్లాల్సి వచ్చింది. అంతకు ముందు ఎప్పుడూ ఆమె మురికివాడల్లోకీ, అందులోని పూరిగుడిసెలలోకీ అడుగుపెట్టనే లేదు. దాంతో అక్కడ తనకి కనిపించిన దృశ్యానికి కిరణ్కు మతిపోయినంత పనయ్యింది. మురికివాడల్లోని పిల్లలు ఎక్కడ పడితే అక్కడ మలవిసర్జన చేస్తున్నారు. గుడిసెలలో ఇంతెత్తున చెత్త పేరుకుపోయి ఉంది. ఆ చెత్తలోనే పసిపిల్లలు ఆడుకుంటున్నారు. వారు తాగే నీరు పరమ మురికిగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యం సంగతి చెప్పేదేముంది? వాడవాడంతా కలరాతో బాధపడుతోంది. ఆ మహమ్మారిని తప్పించుకునే పరిస్థితి కానీ, కలరా సోకిన తరువాత వైద్యం చేయించుకునే స్తోమత కానీ వారికి లేవు.     మురికివాడలో పరిస్థితిని చూసి కిరణ్ చలించిపోయారు. తను వారికి ఉచితంగా వైద్యం చేయాలని అనుకున్నారు. వెంటనే ఓ చెట్టు కింద కలరా రోగులకు ఉచితంగా వైద్యం చేయడం మొదలుపెట్టారు. ఆ తరువాత ఒకరిద్దరి సహకారంతో ఆ మురికివాడలోనే ఒక చిన్న ఇంట్లో క్లినిక్ను తెరిచారు. మరో అడుగు ముందుకు వేసి ఆ మురికివాడలోని జీవితాలను బాగుచేసేందుకు ‘ఆశా’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఇదంతా 1990 నాటి పరిస్థితి. ఆ తరువాత ‘ఆశా’ దిల్లీ మురికివాడల తీరునే మార్చివేసింది. అదంతా మరో కథ!       ఆశా ప్రారంభంలోనే డా॥ కిరణ్ మురికివాడల్లోని ఆడవారిని భాగస్వాములుగా చేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటివరకూ ఎంతోమంది తియ్యటి మాటలు విని మోసపోయిన వారు... ఆమెను అంతగా నమ్మలేదు. క్రమేపీ కిరణ్ అంకితభావం, నిస్వార్థంగా వైద్యం చేస్తున్న విధానం చూసి దగ్గరయ్యారు. తాగే నీరు అన్న మాటే ఎరగని ఆ వాడలో కిరణ్ మంచినీటిని ఏర్పాటు చేయడంతో ఆమెకు అనుసరించేంత నమ్మకం ఏర్పడింది. ఆడవారి సంగతి అలా ఉంచితే మగవారు మాత్రం కిరణ్కు సహకరించలేదు సరికదా... ఆమెను వేధించే ప్రయత్నం చేశారు. కిరణ్ వారిని పట్టించుకోకుండా తన పని తను చేసుకుపోయేవారు. పైగా మగవారిలోని అభద్రతా భావాన్ని తొలగించేందుకు,  ‘ఆశా’ సమావేశాలకి వారిని కూడా ఆహ్వానించేవారు. అలాంటి వ్యక్తిత్వానికి లొంగనివారుంటారా! ఇప్పుడు దిల్లీలోని మురికివాడల్లో ‘ఆశా’ గురించి తెలియనివారు ఉండరు. ఆశాలో శిక్షణ పొందిన కార్యకర్తలు సాధారణ అనారోగ్యాలన్నింటికీ చికిత్స చేసేందుకు సన్నద్ధంగా ఉంటారు. వాడవాడలా క్వాలిఫైడ్ వైద్యులు, నర్సులతో ఏర్పాటు చేసిన వైద్య కేంద్రాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఆశా కేవలం దక్షిణ దిల్లీలోని ఒక మురికివాడకే పరిమితమైన సంస్థ కాదు! దిల్లీ అంతటా 60 మురికివాడల్లో ఉన్న ఐదు లక్షలమంది జనాలని ప్రభావితం చేసే ఓ ఉద్యమం. అందుకే ఆశా ఆవిర్భవించిన తరువాత దిల్లీ మురికివాడల్లో శిశు మరణాలు, అంటువ్యాధులు, పోషకాహార లోపాలు వంటి సవాలక్ష ఆరోగ్య సమస్యలు గణనీయంగా తగ్గిపోయాయి.     ఆశా కేవలం పేదల అనారోగ్యాన్ని దూరం చేసేందుకే ప్రయత్నించదు. ఆ అనారోగ్యానికి కారణమైన నిరక్షరాస్యత, పేదరికాలను కూడా రూపుమాపే ప్రయత్నం చేస్తుంది. సేవింగ్స్ ఖాతాలను ఎలా తెరవాలి? బ్యాంకుల నుంచి రుణాలు పొందడం ఎలా? వ్యాపారం కోసం ఎలాంటి రణాలు లభిస్తాయి? లాంటి విషయాల మీద అవగాహన కల్పించడం ద్వారా కొందరి ఆదాయం అమాంతం పదిరెట్లు పెరిగిపోయిందట! ఇక మురికివాడల్లోని తెలివైన కుర్రకారుకి ఉన్నత విద్యావకాశాలు కల్పించడం మరో ఎత్తు. ఇలా దాదాపు 1200 మంది మురికివాడ విద్యార్థులు దిల్లీ యూనివర్శిటీ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలలో అడుగుపెట్టగలిగారు. ఇదీ కిరణ్ కథ! ‘నేను ఒక్కదాన్ని. ఆడమనిషిని. మురికవాడల్లో అంతా మొరటుజనాలు, మురికి మనుషులు.’ అని కిరణ్ అనుకొని ఉంటే..... - నిర్జర.