లాలిపాటలే తొలి జీవితపాఠాలు

  బిడ్డ పుట్టగానే బాధ్యత తీరిపోయిందని ఏ తల్లీ అనుకోదు. ఆ పిల్లవాడిని గొప్ప మనిషిగా తీర్చిదిద్ది, ఈ లోకానికి అందించేవరకూ ఆమె విశ్రమించదు. ఆ ప్రయాణంలో ప్రతి అడుగూ ఓ అద్భుతమే! అందుకే తల్లీబిడ్డల మధ్య బంధం పరిశోధకులకి ఓ హాట్టాపిక్! అలా ఈమధ్య జరిగిన ఓ పరిశోధనలో, తల్లి లాలిపాట కూడా పిల్లవాడి ఎదుగుదల మీద గొప్ప ప్రభావం చూపుతుందని తేలింది.   ప్రాంతానికీ, భాషకీ అతీతంగా ప్రపంచంలోని ప్రతి తల్లీ పిల్లవాడిని తన పాటతో లాలిస్తుంది. అసలు సంగీతం లాలిపాటతోనే మొదలైందని అంటారు. ప్రపంచంలో బెస్ట్ సింగర్ తల్లే అని ఒప్పుకుంటారు. అందుకే మియామీ యూనివర్సిటీ పరిశోధకులు పిల్లవాడి మీద తల్లి లాలిపాట ప్రభావం గురించి పరిశోధించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం వారు 70 మంది పసిపిల్లలని గమనించారు. తల్లి లాలిపాట పాడుతున్నప్పుడు వారి మానసిక స్థితినీ, వేరే సంగీతం వింటున్నప్పుడు వారి ఉద్వేగాలనీ పరిశీలించారు.   లయబద్ధంగా, ప్రేమగా సాగే లాలిపాటని వినగానే పిల్లవాడిలో అలజడి సద్దుమణిగిపోతున్నట్లు తేలింది. లాలిపాట పాడుతున్నప్పుడు పిల్లవాడు తల్లి వంకే చూస్తుంటాడు. పిల్లవాడి స్పందనలకు అనుగుణంగా తల్లి కూడా, పాటలోని లయని మారుస్తూ ఉంటుంది. దీంతో ఇద్దరి మధ్యా గొప్ప అనుబంధం ఏర్పడుతున్నట్లు గమనించారు. లాలిపాటతో పిల్లలు శబ్దాలను కూడా సులువుగా గ్రహించగలుగుతున్నారట. అలా లాలిపాట పిల్లవాడికి భాషని కూడా పరిచయం చేస్తోందన్నమాట.   లాలిపాట పాడుతూ పిల్లవాడితో గడపడం వల్ల తల్లి మనసు కూడా ప్రశాంతత పొందుతున్నట్లు తేలింది. చాలామంది తల్లులు డెలివరీ తర్వాత, శరీరంలోని హార్మోనుల మార్పులతో డిప్రెషన్కు లోనవుతారు. దీన్నే postpartum depression అంటాము. తల్లిలో ఏర్పడే ఈ నిరాశ నుంచి దృష్టి మళ్లించేందుకు లాలిపాట మందులా పనిచేస్తుందట. అంటే అమ్మ తనని తాను సంభాలించుకుంటూ, పిల్లవాడికి ప్రపంచాన్ని పరిచయం చేస్తుందన్నమాట. - నిర్జర.  

అమ్మ వయసు రెండు లక్షల సంవత్సరాలు

  ఎన్నో జన్మలెత్తితే కానీ మనిషిగా పుట్టడం సాధ్యం కాదు అంటాయి శాస్త్రాలు. అందులో వాస్తవాన్ని నిరూపించడం కష్టమే! కానీ ఎన్నో లక్షల సంవత్సరాల పరిణామక్రమం తర్వాత ఇప్పటి మనిషికి ఆ ఆకారం, జ్ఞానం వచ్చాయంటోంది విజ్ఞానశాస్త్రం. ఇప్పుడు ఆ చిక్కుముడి కూడా వీడిపోయింది. సరిగ్గా రెండు లక్షల సంవత్సరాల క్రితం తొలి మనిషి ఈ భూమ్మీద పుట్టాడని తేల్చారు.   అమెరికా, పోలండ్‌ దేశాలకు చెందిన పరిశోధకులు... మానవజాతికి తొలి మాతృమూర్తి ఎవరై ఉంటారా అన్న పరిశోధన మొదలుపెట్టారు. అందుకోసం ఇప్పటి మనిషిలోని జన్యువులని పరిశీలించసాగారు. తరం మారేకొద్దీ తల్లిదండ్రుల జన్యువులు కలిసి బిడ్డకు చేరుతూ ఉంటాయి. ఈ కలయికల వల్ల ఏ ఇద్దరి వ్యక్తులలోని జన్యువులూ ఒకేలా ఉండవు. ఇలా మారుతూ వస్తున్న జన్యువుల మూలాన్ని కనుక ఛేదించగలిగితే తొలి మానవుడు బయటపడినట్లే!   కానీ ఇదేమంత తేలికైన విషయం కాదు. ఒక మనిషిలో దాదాపు 20,000 రకాల జన్యువులు ఉంటాయి. వీటన్నింటిలో వస్తున్న మార్పుని పరిశీలించాలంటే మహా మహా కంప్యూటర్ల వల్ల కూడా కాదు. పైగా మిగతా జీవులతో పోలిస్తే మానవజాతి విశృంఖలంగా పెరిగిపోయింది. భూమ్మీద అతని సంచారమూ, వేర్వేరు తెగల మధ్య సంతానమూ పరిమితులు లేకుండా సాగాయి. శాస్త్రవేత్తలు ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే కానీ లెక్క తేలదు. అందుకని శాస్త్రవేత్తలు ఒక ఉపాయాన్ని ఆలోచించారు.   మనలో కేవలం తల్లి నుంచి మాత్రమే వచ్చే జన్యువు ఒకటి ఉంది. అదే mitochondrial Eve (mtEve). ఈ ఒక్క జన్యువునీ విశ్లేషిస్తే సరిపోతుందనుకున్నారు. రకరకాల mathematical models ద్వారా దీని వయసుని కనుగొనే ప్రయత్నం చేశారు. mitochondrial Eve (mtEve)లో మార్పు ఎన్నేళ్లకు ఓసారి వస్తోంది? అలా ఎన్ని మార్పులు వచ్చాయో అంచనా వేసి చిక్కుముడిని విప్పారు. తొలి బిడ్డకు జన్మనిచ్చిన రెండు లక్షల సంవత్సరాలు గడిచినట్లు తేల్చారు. అంటే రెండు లక్షల సంవత్సరాలుగా ఆడది, అమ్మ బాధ్యతను మోస్తూ ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తోందన్నమాట! - నిర్జర.

లోపం నీలోనే ఉంటే....

  అతను ఓ కోపధారి మనిషి. ఎదుటి మనిషి మాటలో కానీ, కదలికలో కానీ ఏమాత్రం తేడా తోచినా తెగ విరుచుకుపడిపోయేవాడు. అలా రోజూ ఏదో ఒక గొడవ పెట్టుకొని కానీ ఇంటికి చేరుకునేవాడు కాదు.  వయసు గడిచేకొద్దీ ఆ కోపధారి మనిషిలో పశ్చాత్తాపం మొదలైంది. ‘రోజూ అసహ్యంగా ఏమిటీ గొడవలు’ అనుకున్నాడు. అంతే! కొన్నాళ్లపాటు ఎటూ వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోవాలని అనుకున్నాడు. తన కోపం తగ్గేదాకా ఇంట్లో ఉండి ఆ తరువాత సమాజంలోనికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అంతవరకూ బాగానే ఉంది. కానీ...   ఓ నాలుగు రోజులు గడిచిన తరువాత అతనిలో సహనం నశించింది. ఇంట్లో భార్యాబిడ్డలతో ఏదో ఒక విషయం మీద వాదన మొదలుపెట్టసాగాడు. ‘మీరు బయటకి వెళ్తేనే మా బతుకులు ప్రశాంతంగా ఉండేవి,’ అని వారి చేత ఛీ కొట్టించుకున్నాడు. దాంతో ఆ కోపధారి మనిషికి తన కోపం మీదే మా చెడ్డ కోపం వచ్చింది. అంతే! వెంటనే ఇల్లూ వాకిలీ విడిచిపెట్టేసి ఓ ఆశ్రమంలో చేరిపోయాడు.   కోపధారి మనిషికి ఆశ్రమంలో అంతా బాగున్నట్లుగా తోచింది. వేళకి భోజనం, వేళకి నిద్ర.... ప్రతి ఒక్కరికీ స్థిరమైన బాధ్యతలు. ఆ బాధ్యతలను పర్యవేక్షించేందుకు పెద్దస్వాములు. అంతా ఓ పద్ధతి ప్రకారం సాగిపోతున్నట్లుగా అనిపించింది. తను కూడా ఆశ్రమ అధికారులు అప్పగించిన బాధ్యతలను బుద్ధిగా నెరవేచ్చసాగాడు. నియమం తప్పకుండా ధ్యానం చేసేవాడు. మనసులో ఒకటే ప్రశాంతత! కొన్నాళ్లకి అతనికి వంటింటి బాధ్యతల అప్పగించారు ఆశ్రమంవారు. ఇక అక్కడి నుంచీ కథ అడ్డం తిరిగింది. తోట వంటవారితో ఉప్పులు, పప్పులు దగ్గర గొడవలు మొదలయ్యాయి. ఎసరు ఎక్కువైందనీ, తాలింపు మాడిపోయిందనీ కొట్లాటకు దిగసాగాడు. ఇప్పుడు అతనిలోని కోపధారి మళ్లీ బయటకి వచ్చేసాడు.   ‘ఉహూ! ఇదంతా లాభం లేదు. అసలు మనుషులే లేని చోటకి వెళ్లిపోతాను. నరమానవుడు కనిపించని చోట తపస్సు చేసుకుని నా మనసుని మార్చుకుంటాను,’ అనుకున్నాడు కోపధారి. అందుకోసం ఎవరూ లేని ఓ దుర్గమ అరణ్యంలోకి చొచ్చుకుపోయాడు. అక్కడ అతనికి ఎటుచూసినా ప్రశాంతతే కనిపించింది. పక్షుల కిలకలారావాలు, కుందేళ్ల పరుగుల మధ్య అదో భూతల స్వర్గాన్ని తలపించింది.   ఆ అడవిలో నిజంగానే అతని మనసు ప్రశాంతతలో మునిగిపోయింది. ఓపిక ఉన్నంతసేపూ ఓ చెట్టు కింద కూర్చుని గంటల తరబడి ధ్యానం చేసుకునేవాడు. ఆకలి వేస్తే ఏవో పండ్లు తినేవాడు. భయం వేస్తే చెట్టు మీదకి ఎక్కి దాక్కొనేవాడు. దాహం వేస్తే దగ్గరలో ఉన్న సెలయేరు దగ్గరకి ఒక చిన్న కుండ తీసుకువెళ్లి నీళ్లు తెచ్చుకునేవాడు. అలా ఓ రోజూ కుండ తీసుకుని సెలయేటి దగ్గరకి వెళ్లాడు కోపధారి. కుండలో నీరు నింపి దాన్ని పక్కన పెట్టి, తాను స్నానానికి ఉపక్రమించాడు. ఆ కుండ తటాలున పక్కకి ఒరిగిపోయింది. అందులో నీళ్లన్నీ ఒలికిపోయాయి. దాంతో మళ్లీ కుండని నింపి గట్టు మీద పెట్టాడు. అదేం దరిద్రమో... మళ్లీ కుండ కాస్తా పక్కకి ఒరిగిపోయింది.   ఆ రోజు విపరీతమైన గాలి వీస్తున్నట్లుంది. ఎందుకంటే ఇంకో నాలుగైదు సార్లు అలా కుండని నింపి పెట్టినా కానీ... అతను నీటిలోకి దిగేసరికి అది పక్కకి ఒరిగిపోయేది. దాంతో కోపధారి మనసు ఒక్కసారిగా కుతకుతలాడిపోయింది. ఆ కుండని తీసుకుని నేలకేసి కొట్టాడు. తన కసితీరా దానిని కాలితో తొక్కాడు. ఇన్ని రోజులుగా అతని మనసులో అణచుకున్న ఉద్వేగాలన్నింటినీ ఆ కుండపెంకుల మీద చూపాడు. అలా వాటిని ముక్కలు ముక్కలుగా చేసి, ఆ తరువాత పొడిపొడిగా నలిపేసిన తరువాత కానీ అతనిలోని కోపం చల్లారలేదు. ఆ కోపం తగ్గిన తరువాత అతనిలో ఎందుకో ఓ ఆలోచన మొదలైంది...’లోపం నా చుట్టూ లేదు, నాలోనే ఉంది. అందుకని నా చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి తప్పించుకుని ఉపయోగం లేదు. నా నుంచి నేను పారిపోలేను కదా! కాబట్టి నన్ను నేనే మార్చుకోవాలి,’ అనుకుంటూ ఇంటిబాట పట్టాడు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.  

పిల్లలు వివక్షను పసిగట్టేస్తారు

  మనం పిల్లల ముందు చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నాం అనుకుంటాం. అసభ్యపదజాలం వాడకుండా, గొడవలు పడకుండా వీలైనంత సహనాన్ని పాటించే ప్రయత్నం చేస్తుంటాం. కానీ అక్కడే మనం పిల్లల్ని తక్కువగా అంచనా వేస్తున్నాం అంటున్నారు పరిశోధకులు. మన మాటలో తేడాని బట్టి, ప్రవర్తనలో మార్పులని బట్టి వారు మనలోని వివక్షని పసిగట్టేస్తారని హెచ్చరిస్తున్నారు.   ఒకే సన్నివేశం- రెండు వీడియోలు పిల్లలు మనల్ని ఎంతవరకు అంచనా వేయగలరో తెలుసుకునేందుకు వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఓ ప్రయోగాన్ని చేశారు. ఇందుకోసం వారు 4 లేదా 5 ఏళ్ల వయసు ఉన్న ఓ 67 మంది పిల్లలను ఎంచుకున్నారు. వారిలో ప్రతి ఒక్కరికీ రెండు వీడియోలు చూపించారు. మొదటి వీడియోలోనూ, రెండో వీడియోలోనూ ఒకటేతరహా దృశ్యం ఉంది. ఒకావిడి మరొకావిడకి ఏదో వస్తువు అందించడమే ఆ వీడియోలలోని సారం. కాకపోతే ఒక వీడియోలోని వ్యక్తి వస్తువుని నవ్వుతూ, ఆవిడ వైపుగా చేయిని చాస్తూ సంతోషంగా ఇస్తే... మరో వీడియోలోని వ్యక్తి చిరాకుగా, వస్తువుని ఇవ్వడం ఇష్టం లేనట్లుగా ప్రవర్తిస్తుంది.   తేలిపోయింది రెండు వీడియోలలోని సారం ఒకటే అయినా అందులోని వ్యక్తుల హావభావాలను బట్టి పిల్లలు ఓ అభిప్రాయానికి వచ్చేసినట్లు గ్రహించారు. తమకు సానుకూలంగా ప్రవర్తించిన మనిషి నచ్చిందనీ, వారితో బొమ్మలు పంచుకోవడం ఇష్టమనీ కుండబద్దలు కొట్టేశారు. ఏకంగా 67 శాతం మంది పిల్లలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అంటే పిల్లలు తమపట్ల సానుకూలంగా ప్రవర్తించేవారిని గుర్తించడమే కాకుండా, వారితో మున్ముందు ఎలా ఉండాలన్న అభిప్రాయాన్ని కూడా చేరుకుంటారన్నమాట.   మరికాస్త ముందుకి ప్రయోగం ఇక్కడితో ఆగిపోలేదు. ఈసారి ఇవే వీడియోలను మరో 81 మంది పిల్లలకు చూపించారు. వీరు కూడా 4 లేదా 5 ఏళ్ల వయసువారే! అయితే ఈసారి వీడియోలను చూపించిన తరువాత, ఆ వీడియోలలో ఉన్న వ్యక్తుల తాలూకు స్నేహితులు అంటూ కొందరిని పరిచయం చేశారు. వారిలో మీకు ఎవరు నచ్చారో చెప్పమన్నారు. ఆశ్చర్యంగా... వీడియోలో స్నేహపూర్వకంగా మెలిగినవారి స్నేహితులు తమకి ఎక్కువగా నచ్చారని పేర్కొన్నారు పిల్లలు. అంటే సానుకూలంగా ప్రవర్తించేవారే కాదు, వారికి సన్నిహితంగా ఎవరైతే ఉంటారో వారి పట్ల కూడా పిల్లలు మంచి అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నారన్నమాట.   సమాజంలో తమకు కనిపించే వివక్షను పిల్లలు ఎలా స్వీకరిస్తారో ఈ ప్రయోగంతో తేలిపోయిందంటున్నారు నిపుణులు. ఓ వర్గానికి చెందిన వ్యక్తులు తమతో ప్రతికూలంగా ప్రవర్తిస్తే, దానిని గ్రహించి మనసులో నిలుపుకుంటారని హెచ్చరిస్తున్నారు. అవడానికి ఇది అమెరికాలో జరిగిన పరిశోధనే అయినా... భిన్న కులాలు, వర్గాలుగా విడిపోయిన మన భారతీయ సమాజానికి కూడా ఈ ఫలితాలు అన్వయిస్తాయేమో!   - నిర్జర.

భయాలను ప్రభావితం చేసే స్నేహితులు

  అభంశుభం ఎరుగని పసిమనసు ఓ తెల్ల కాగితంలాగా ఉంటుంది. దాని మీద ఎవరు ఎలాంటి ముద్ర వేసినా అది జీవితకాలం ఉండిపోతుంది. అయితే ఇంతవరకూ జన్మతః వచ్చిన జన్యువులో లేకపోతే తల్లిదండ్రుల ప్రభావమో పిల్లల భయాందోళనలకు కారణాలు అనుకునేవారు. కానీ చిన్ననాటి స్నేహితులు కూడా మనలోని భయాల తీరుని ప్రభావితం చేస్తారంటూ ఓ పరిశోధన వెలువడింది.   బాల్యం భయాలమయం : బాల్యంలో ఉండేవారిని లెక్కలేనన్ని భయాలు చుట్టుముడుతూ ఉంటాయి. వారు కొత్త జంతువుని చూసినా భయపడతారు, కొత్త శబ్దాన్ని విన్నా భయపడతారు... ఏమీ కనిపించని చీకటన్నా భయపడుతుంటారు. క్రమేపీ ఒంట్లో బలం, మనసులో స్థైర్యం, పరిసరాల పట్ల అవగాహన ఏర్పడేకొద్దీ ఈ భయాలు చెదిరిపోతుంటాయి. మరికొందరిలో మాత్రం ఇవి జీవితాంతం ఉండిపోయి, వారి బతుకుని చిన్నాభిన్నం చేసి పారేస్తాయి.   స్నేహితులూ కారణమే : పిల్లలలో మెదిలే భయాలను వారి స్నేహితులు కూడా ప్రభావితం చేస్తారనే కొత్త అంశం ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. ఇందులో నిజానిజాలు తెలుసుకునేందుకు ఇంగ్లండుకి చెందిన కొందరు నిపుణులు ఓ ప్రయోగాన్ని నిర్వహించారు. దీనికోసం వారు 242 మంది పిల్లలను ఎంచుకున్నారు. వీరంతా కూడా 7 నుంచి 10 ఏళ్ల లోపువారే. వీరందరికీ కూడా గతంలో ఎప్పుడూ చూడని ఓ రెండు జంతువుల చిత్రాలను చూపించారు. సగం మంది పిల్లలకి ఈ కొత్త జంతువుల గురించి మంచిగా చెబితే, మరికొందరికి వీటి గురించి భయం కలిగించే వివరాలను అందించారు.   భావాలు బదిలీ అయ్యాయి : ప్రయోగంలో రెండోదశలో భాగంగా పిల్లలందరినీ ఇద్దరిద్దరుగా జతచేశారు. కాసేపటి తరువాత వారిని మళ్లీ పరీక్షించారు. కొత్త జంతువు గురించి భయపడుతున్న పిల్లలు, తోటివారిలో కూడా తమ భయాన్ని చొప్పించినట్లు తేలింది. ఆ జంతువు పట్ల భయాన్నీ, ఆ భయాన్ని ఎదుర్కొనేందుకు ఎలా ప్రవర్తించాలి అన్న విషయాన్నీ కూడా వీరు ఇతరులకు బదలాయించేశారు.   ఇదీ ఉపయోగం : పైకి సాధారణంగా కనిపించే ఈ పరిశోధన మనలోని అనేక సమస్యలకు పరిష్కారాన్ని చూపవచ్చునంటున్నారు నిపుణులు. తీవ్రమైన భయాందోళనలతో బాధపడుతున్న పిల్లలు, ధైర్యంగా మెలిగే పిల్లలతో స్నేహం చేస్తే... వారిలోని భయాందోళనలు తగ్గే అవకాశం ఉందంటున్నారు. విపరీతమైన భయాలతో బాధపడుతున్న పిల్లలకు చికిత్సను అందిస్తున్నప్పుడు, వారిలో అలాంటి భయాలను ప్రోత్సహిస్తున్న మిత్రులు ఎవరన్నా ఉన్నారేమో గమనించుకోవాలి అని కూడా సూచిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే- పిల్లలలో అనవసరమైన భయాలను నివారించాలన్నా, పరిమితి దాటిన ఆందోళనకు చికిత్సను అందించాలన్నా... వారి స్నేహితులను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నమాట. బహుశా ఇది పెద్దలకు కూడా వర్తిస్తుందేమో!   - నిర్జర.

ప్రయత్నమే పెద్ద విజయం

  ‘మార్పు’ అనగానే భయపడతాం. అది ఎప్పుడైనా, ఎలా అయినా, ఎవరినైనా కాస్త ఇబ్బంది పెట్టే పదం. కొత్తగా స్కూల్లో వేసిన కుర్రాడు భోరుభోరున ఏడుస్తూ స్కూలుకి వెళ్ళనని మారాం చేస్తుంటాడు. ఇంటిని, అమ్మని వదిలి కొత్త చోటుకి వెళ్ళటం అంటే వాడికి భయం. ఆ ‘మార్పు’ని ఎలా ఎదుర్కోవాలో ఆ చిన్న బుర్రకి తెలీక పేచీ పెడతాడు. కొన్ని రోజులకి ఆ మార్పుకి అలవాటు పడి, హాయిగా స్కూలుకి ఏ పేచీ లేకుండా వెళ్ళిపోతాడు. కాస్త సమయం పడుతుంది అంతే. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ, పెద్దయినా ‘మార్పు’కి భయపడుతూనే వుంటాం. రొటీన్ జీవితానికి పురోగతి నిల్:- నిజానికి అలవాటైన పరిస్థితులకు అంటిపెట్టుకున్నంతసేపూ ఎవరి జీవితంలోనూ పురోగతి వుండదు. వాటికి దూరమైనప్పుడు సహజంగానే అనిశ్చితి, అసౌకర్యం ఎదురవుతాయి. అలా ఎదురైన అసౌకర్యం సౌకర్యవంతంగా మారటానికి ‘కొద్దిగా’  సమయం పడుతుంది. అప్పుడే ఎదుగుదల సాధ్యపడుతుంది. ఉదాహరణకి కొత్తగా ఏదైనా చేయాలనే తపన ఎందరిలోనో వుంటుంది. కానీ, ధైర్యంగా ముందుకు అడుగు వేసి ఓ ప్రయత్నం చేసే సాహసం కొందరే చేయగలరు. వారు విజేతలుగా జేజేలు అందుకుంటారు కూడా. అందుకే అంటారు ‘ప్రయత్నమే పెద్ద విజయం’ అని. మనమూ పిల్లలమే:- మనమందరం కొద్దో గొప్పో స్కూలుకు వెళ్ళనని మారాం చేసే పిల్లాడితో సమానమే. కొత్త పరిసరాలు, పరిస్థితులు, వ్యక్తులు ఎదురవుతుంటే భయంతో బిగుసుకుపోతాం. ఒకోసారి అలా కొత్తవాటిని ఎదుర్కొనే ధైర్యం లేక ఏ మార్పుకి ఇష్టపడం కూడా. మన పరిస్థితి పట్ల అసంతృప్తి, మన జీవితం పట్ల నిరాశ వున్నా కూడా, కచ్చితమైన ప్రయత్నం చేస్తే జీవితం మెరుగుపడుతుందని తెలిసి కూడా ఆ దిశగా ప్రయత్నం చేయం. అందుకు రకరకాల కారణాలు చెపుతుంటాం. కానీ, ఒక్కసారి ఆ భయంలోంచి బయటకి రావాలని గట్టిగా అనుకుంటే అది ఏమాత్రం కష్టం కాదు అంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. గిరి గీసుకోకండి:- ఎవరికివారు తమ శక్తియుక్తులని సరిగ్గా అంచనా వేసుకోగలగాలి. చాలాసార్లు తమ గురించి, తమ శక్తియుక్తుల గురించి సరైన అంచనా వేసుకోలేక చాలామంది గిరిగీసుకుని  ఉండిపోతుంటారు. ఇతరులతో పోల్చుకుని బాదపడుతుంటారు.  అదే ఎలాంటి భేషజాలు లేకుండా తమ గురించి, తమ బలం, బలహీనతల గురించి అంచనా వేసుకోగలిగితే కొత్త ప్రయత్నం చేయడానికి అంతగా భయపడరు. ‘మార్పు’ వారిని వణికించదు. అందరూ శక్తిమంతులే:- ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు చెప్పే మాట ఒక్కటే. ‘‘ఈ ప్రపంచంలో తక్కువ శక్తి కలవారు ఎవరూ లేరు. తక్కువ శక్తి కలవాళ్ళమని నమ్మేవాళ్ళే ఉన్నారు. అంతే... దాని వల్లనే జీవితంలో ఎక్కడివారు అక్కడే మిగిలిపోతారు’’ ఈమాట ఎంతో నిజం. అలాగే కోరిన రీతిలో జీవితాన్ని తీర్చిదిద్దుకోగల శక్తి అందరికీ ఉంటుందన్నదే వాస్తవం. శక్తి సామర్థ్యాలను ఆశించిన రీతిలో ఎవరైనా పెంపొందించుకోగలరు. ఏదైనా ఇట్టే సాధించగలమననుకునే చిన్నపాటి ధీమాయే ‘మార్పు’ని ధైర్యంగా ఎదుర్కోగల ఆయుధం. ఆ ఆయుధం ఆధారంగా ముందుకు వెళితే అంతా విజయమే. -రమ ఇరగవరపు

ఫోన్ పక్కనుంటే చాలు.. మైండ్ పనిచేయదు!

  స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చి పాతికేళ్లు కూడా నిండి ఉండదు. కానీ వచ్చీరాగానే అవి మన జీవితాలని ఆక్రమించేసుకున్నాయి. దానికి తోడు ఇంటర్నెట్ కూడా చవకగా మారిపోవడంతో... చేతిలో ఓ స్మార్ట్ఫోన్ ఉంటే చాలు, ప్రపంచం మనల్ని వెలివేసినా ఫర్వాలేదు అనే ధైర్యం మనది. కానీ అదే స్మార్ట్ ఫోన్ కొంపలు ముంచుతోంది. కంటిజబ్బులు, నిద్రలేమిలాంటి సమస్యలని తెచ్చిపెడుతోంది. అసలు స్మార్ట్ఫోన్ పక్కన ఉంటే మన మెదడు కూడా సరిగా పనిచేయదంటూ ఓ పరిశోధన వెలుగులోకి వచ్చింది. అదేమిటో మీరే చూడండి...   టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు, మన మెదడు మీద స్మార్ట్ఫోన్ పనితీరుని విశ్లేషించాలనుకున్నారు. అందుకోసం వారు ఓ 800 మంది ఫోన్ వాడకందారులను పిలిపించారు. వీరిని ఓ కంప్యూటర్ ముందు కూర్చోబెట్టి కొన్ని చిన్న చిన్న సమస్యలకు జవాబులను అందించమని చెప్పారు. అప్పటికప్పుడు కాస్త మెదడుని పెడితే... ఎవరైనా సులువుగా జవాబు చెప్పగలిగే ప్రశ్నలే అవన్నీ!   అభ్యర్థుల స్మార్ట్ఫోన్ పక్కగదిలో ఉండటమో, టేబుల్ మీదే ఉండటమో, జేబులోనే ఉండటమో బట్టి వారు జవాబులని ఇచ్చే సామర్థ్యంలో తేడా ఉందేమో గమనించారు. ఈ పరిశీలనలో ఖచ్చితమైన తేడాలు కనిపించాయి. పక్కగదిలో ఫోన్ పెట్టేసినవారు ఇతరులకంటే చక్కగా జవాబులు రాశారట. ఫోన్ అభ్యర్థికి ఎంత దగ్గరగా ఉంటే, సమస్య మీద అతని ఏకాగ్రత అంతగా బలహీనపడినట్లు గ్రహించారు. ఫోన్ సైలెంటులో ఉందా, తిరగేసి ఉందా లాంటి పరిస్థితులతో సంబంధం లేకుండా ఈ ఫలితాలు కనిపించాయి.   ఈ ప్రయోగానికి పొడిగింపుగా మరో సందర్భాన్ని సృష్టించారు పరిశోధకులు. ఈసారి అభ్యర్థులను- ‘ఫోన్తో మీ అనుబంధం ఎలా ఉంటుంది?’ అని ప్రశ్నించారు. కొందరు అభ్యర్థులు ‘అబ్బే మేము ఫోన్ లేకుండా నిమిషం కూడా బతకలేము,’ అని చెప్పారు. మరికొందరు ‘ఫోన్ కేవలం అవసరం కోసమే! అదే మా సర్వస్వం కాదు. దానికి పెద్దగా సమయాన్ని కేటాయించం,’ అని తేల్చారు. వీళ్లందరి మీదా పైన పేర్కొన్ని ప్రయోగాన్నే అమలుచేశారు. ఎవరైతే ఫోన్ లేకుండా గడపలేమని అన్నారో... వారు కంప్యూటర్లో కనిపించిని చిన్నిపాటి సమస్యలకి కూడా జవాబుని అందించలేకపోయారట.   ఏతావాతా తేలిందేమిటంటే, ఫోన్ దగ్గరలో ఉంటే చాలు- ఏదన్నా కాల్ వస్తుందేమో, వాట్సప్ మెసేజి వచ్చిందేమో, చార్జింగ్ ఉదో లేదో, భార్యకి కాల్ చేయాలి కదా, ఆన్లైన్లో డబ్బులు పంపించాలిగా లాంటి సవాలక్ష సందేశాలు మనసుని గిలిపెడుతూ ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా పనిచేసుకోవాలి అని మనసుని బలవంతపెట్టిన కొద్దీ మన ఏకాగ్రత మరింతగా చెదిరిపోతుంది. ఫలితం! మన అవసరం కోసం కనిపెట్టిన స్మార్ట్ఫోన్, జీవితాలను కమ్ముకుని ఉంటోంది. - నిర్జర.          

రాముడు గెలిచింది అందుకనే!

  ఒక మనిషి మంచివాడు అని చెప్పడానికి అతణ్ని రాముడితో పోలుస్తారు. ఒక మనిషి అహంకారి అని సూచించడానికి అతణ్ని రావణాసురునితో పోలుస్తారు. రాముని దేవునిగా మనం పూజించవచ్చేమో! కానీ అతణ్ని ఆభిమానించేది మాత్రం ఆయన వ్యక్తిత్వాన్ని చూసే! రావణాసురుడు అసురుడు అన్న విషయాన్ని మనం గమనించకపోవచ్చు. కానీ ఆయనకు భయపడేది, అతనిలోని అహంకారాన్ని చూసే. రాముడు విజేతగా నిలిచినా, రావణుడు పరాజయం పాలైనా వారివారి గుణాలను బట్టే కానీ అంశను అనుసరించి కాదు.     ఆచార్యులను అనుసరిస్తూ... రాముడికి చిన్ననాటి నుంచే పరీక్షలు మొదలయ్యాయి. వశిష్టులవారి వద్ద ఇలా రామలక్ష్మణులు తమ విద్యను పూర్తిచేసుకున్నారో లేదో, అలా విశ్వామిత్రుడు వచ్చి వారిని తన వెంట అడవులకు పంపమని అడిగాడు. తాను చేస్తున్న యాగాలకు రక్షణగా రాముని తోడు కావాలంటూ పట్టుపట్టాడు విశ్వామిత్రుడు. గురువుల మాట మీద గౌరవంతో ముక్కుపచ్చలారని రాముడు అలా మొదటిసారి అడవుల బాట పట్టాడు. అడవిలో రామునికి తనకు తెలిసిన అస్త్ర రహస్యాలన్నింటినీ అందించాడు విశ్వామిత్రుడు. గురువుని అనుసరించినందుకు రామునికి దక్కిన ప్రతిఫలం అది! అలా విశ్వామిత్రుని యాగశాలలకు కిమ్మనకుండా కాపలాగా వచ్చినందుకు, రామునిలో అటు జ్ఞానమూ, ఇటు అనుభవమూ రెండూ కూడా బలపడ్డాయి.     పెద్దలను గౌరవిస్తూ... విశ్వామిత్రుని యాగం ముగిసిన తరువాత అయోధ్యకు తిరిగివచ్చే దారిలో రామునికి సీతాస్వయంవరం తటస్థించింది. అక్కడ మహామహులను కాదని శివధనస్సుని ఎక్కుపెట్టి సీతమ్మ చేయి పట్టాడు రాముడు. తన గురువైన శివుని ధనుస్సుని విరిచిన రాముని మీద కోపంతో ఊగిపోతూ అక్కడికి చేరుకుంటాడు పరశురాముడు. పరశురాముడు పరుషంగా ఎన్నిమాటలన్నా పరమశాంతంగా వాటిని భరిస్తాడు రాముడు. పరశురాముని కోపంలో కారణం ఉంది కాబట్టే, మారు మాటలాడకుండా నిల్చుంటాడు రాముడు. చివరికి చేతనైతే తనవద్దనున్న విష్ణుచాపాన్ని కూడా ఎక్కుపెట్టి చూపమని అడుగుతాడు పరశురాముడు. ఆ ధనుస్సుని కూడా రాముడు ఎక్కుపెట్టిన తరువాతే, అతను విష్ణుమూర్తి అవతారమన్న విషయం అర్థమవుతుంది పరశురామునికి. ఇలా పెద్దవారి పట్ల అణకువ, సందర్భోచితమైన ప్రవర్తన రాముని అవతారంలో అడుగడుగునా కనిపిస్తాయి.     తల్లిదండ్రుల మాట జవదాటక... సీతా స్వయంవరం ముగిసి, సతీసమేతంగా అయోధ్యకు చేరుకున్న రాముడు కొన్నాళ్లైనా సుఖంగా ఉన్నాడో లేడో... రాముని అడవులకు పంపమంటూ అతని సవతి తల్లి కైకేయి దశరథుని శాసించింది. మరికొద్ది రోజులలో తనకు పట్టాభిషేకం జరగబోతుండగా, ఏకంగా అడవులకు వెళ్లాల్సి రావడం ఏమిటని రాముడు సంకోచించలేదు. తండ్రిని ఎదిరించలేదు, సవతి తల్లి కదా అని దూషించలేదు. మారుమాట్లాడకుండా నార వస్త్రాలతో అడవులకేగాడు. ఎందుకంటే రాముడు ధర్మాన్ని నమ్మాడు. సమాజం ఒక రీతిలో సాగేందుకు ఏర్పరుచుకున్న నియమమే ధర్మం. అది కాలాన్ని బట్టి ఎంతోకొంత మారుతూ ఉండవచ్చు. తన కాలంలో ఉన్న ధర్మాన్ని రాముడు మనసావాచా అనుసరించాడు. ధర్మాన్ని తాను పరిరక్షిస్తే, ధర్మం తనను కాపాడుతుందని విశ్వసించాడు. ఆ నమ్మకమే ఆయన విజయానికి కారణమైంది. ప్రకృతిలో ప్రతి జీవి ఆయన నమ్మకానికి తోడునిచ్చేందుకు సిద్ధపడింది. అల్లరికి మారుపేరైన కోతుల దగ్గర్నుంచీ, అల్పజీవులైన ఉడతల దాకా రామునికి సాయపడ్డాయి. లంకను దాటేందుకు సముద్రంలో రాళ్లు తేలాయి, రాముని మీద సంధించిన మోయాపాయాలన్నీ చిన్నబోయాయి. దీనికంతటికీ ధర్మం పట్ల రాముడు చూపిన నమ్మకమే అని వేరే చెప్పాలా. అందుకే ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అన్నారు. అంటే రూపం దాల్చిన ధర్మమే రాముడు అని అర్థం. అదే అతని విజయ రహస్యం.     మరి రావణుడో! రామునికంటే రావణుడు  పెద్దవాడు, అనుభవజ్ఞుడు. మానవుల చేతిలో తప్ప మృత్యువు రాదన్న వరం ఉన్నవాడు. కుబేరుడు నిర్మించిన లంకా నగరంలో సకలవైభోగాలూ అనుభవిస్తున్నవాడు. అందుకే గొప్ప ఇంటిని చూస్తే దాన్ని ‘లంకంత కొంప’తో పోలుస్తాము. మండోదరిలాంటి మహాపతివ్రత రావణుని భార్య; విశ్వజిత్తు వంటి చేతికందిన ఏడుగురు సమర్థులు అతని కొడుకులు; విభీషణుడు, కుంభకర్ణుడులాంటి పరాక్రమవంతులు అతని సోదరులు; శివుని ఆశీస్సులు; వేదాలను అభ్యసించి సాధించిన అపార జ్ఞానం... ఇవేవీ రావణుని రక్షించలేకపోయాయి. పరస్త్రీ వ్యామోహం, ఆ వ్యామోహాన్ని సమర్థించుకునే అహంకారం అతని వినాశనానికి దారితీశాయి. అడవుల బాట పట్టిన రాముడు, కోతిమూక సాయంతో రావణుని ఓడించాడు. రాముడు తన జీవితకాలంలో స్నేహితులను పోగేసుకుంటే వెళ్తే, రావణుడు తన సోదరుడైన విభీషణుని సైతం శత్రువుగా మార్చుకున్నాడు. రాముని దర్శించిన అహల్యవంటివారంతా శాపవిమోచనం పొందితే, రావణుడు మాత్రం ఒక్కొక్కొరి నుంచి శాపాలను పోగుచేసుకుంటూ సాగాడు. ఆ శాపాలు, శతృత్వాలే చివరికి రావణుడి కొంప ముంచాయి. ధర్మం దాటి పరస్త్రీని చేపట్టిన రావణుని అంతమొందించేందుకు సాయపడ్డాయి.   - నిర్జర.

పిల్లలు తప్పులు ఒప్పుకోవాలంటే

తల్లిదండ్రులు తిడతారేమో అన్న అనుమానంతో ప్రోగ్రెస్‌ రిపోర్టు కార్డులలో దొంగ సంతకాలు చేసే పిల్లల సంగతి వినే ఉంటాము. ఏదన్నా వస్తువుని పాడుచేస్తే, తండ్రి చేతిలో దెబ్బలు తప్పవన్న భయంతో తనకేమీ తెలియనట్లు నటించే పిల్లల గురించీ మనకి తెలుసు. అంతదాకా ఎందుకు! మన బాల్యంలో కూడా తల్లిదండ్రుల దండననీ, చీవాట్లనీ తప్పించుకునేందుకు ఇలాంటి పనులేవో చేసే ఉంటాము.   పిల్లవాడు ఎప్పుడో ఒకసారి అబద్ధం చెప్పడం సహజమే కావచ్చు. కానీ ప్రతిసారీ ఇదే తీరు కనుక కొనసాగితే, అది పిల్లవాడి జీవితం మీదే ప్రభావం చూపక మానదు. అబద్ధం అనేది ఒక అలవాటుగానో, ఒక విషవలయంగానో మారిపోయి అతని భవిష్యత్తులనే నాశనం చేసే ప్రమాదం లేకపోలేదు. తప్పు చేసినప్పుడు నిజాయితీగా దానిని ఒప్పుకోవడమా, లేకపోతే తల్లిదండ్రుల దగ్గర వెల్లడించడమా అనే సంశయం ఏర్పడినప్పుడు పిల్లలో ఎలాంటి భావాలు కలుగుతాయి? అన్న సందేహం వచ్చింది ఓ ప్రొఫెసరుగారికి. దాంతో ఆయన చేసిన పరిశోధన ఇలాంటి పరిస్థితులలో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలో ఒక సూచనను అందిస్తోంది.   పిల్లల అంతరాత్మ సంఘర్షణని తెలుసుకునే ఈ ప్రయోగం కోసం పరిశోధకులు 4 నుంచి 9 ఏళ్ల వయసు లోపల ఉన్న కొందరు పిల్లలను ఎంచుకున్నారు. వీరికి కొన్ని సందర్భాలను ఊహించుకోమని ప్రోత్సహించారు. అలాంటి సందర్భాలలో మీరు ఏదన్నా పొరపాటు చేస్తే, చేసిన తప్పు గురించి తల్లిదండ్రులకు చెబుతారా లేదా? ఒకవేళ చేసిన పొరపాటుని ఒప్పుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అదే పొరపాటుని ఒప్పుకోకుండా ఏదో అబద్ధంతో కప్పిపుచ్చుకుంటే మీ మనసుకి ఎలా తోస్తుంది? అంటూ రకరకాల ప్రశ్నలతో వారి భావాలను గ్రహించే ప్రయత్నం చేశారు.   పరిశోధనలో తేలిందేమిటంటే 4,5 ఏళ్ల పిల్లలు తమ తప్పుని కప్పిపుచ్చున్నప్పుడు పెద్దగా పశ్చాత్తాపపడలేదట. పైగా చేసిన తప్పుని ఒప్పుకునేందుకే వారు చాలా ఇబ్బంది పడ్డారట. దీనికి విరుద్ధంగా 7,8 ఏళ్ల పిల్లలు తాము చేసిన తప్పుని ఒప్పుకోవడంలోనే మనశ్శాంతిని పొందారు. ఆ తప్పుని కప్పిపుచ్చుకునేందుకు వారు చాలా ఇబ్బందిపడ్డారు. అలాగని 4,5 ఏళ్ల పిల్లలలో ఫలానా పని తప్పు అనే విచక్షణ లేకపోలేదు. కానీ బహుశా వారు పెద్దలు దండిస్తారనే భయంతో తప్పుని కప్పిపుచ్చుకునేందుకే ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చి ఉంటారు.   ఏతావాతా ఈ పరిశోధన తరువాత నిపుణులు చెబుతోందేమిటంటే- ‘పిల్లవాడు తప్పుచేయగానే ముందు విరుచుకుపడిపోవద్దు. అసలు అతను ఏం చెబుతున్నాడో వినండి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా తన వాదన వినేందుకు సిద్ధంగా ఉండండి. తద్వారా చేసిన తప్పుని ఒప్పుకోవడం అనే లక్షణం మీకు సంతోషాన్ని కలిగిస్తుందనే అభిప్రాయం అతనిలో కలిగేలా చేయండి. జరిగిన సంఘటననీ, దానికి అతను చెప్పిన మాటనీ విన్న తర్వాత ప్రశాంతంగా ఓ నిర్ణయానికి రండి. పిల్లవాడిలో ఇలాంటి భరోసా కలగడం వల్ల, అతను మున్ముందు ఎలాంటి పొరపాటు చేసినా మీకు సరిదిద్దే అవకాశం వస్తుంది. మద్యం మత్తులో మునిగిపోయినా, పొరపాటున డ్రగ్స్‌ అలవాటైనా కూడా అతను మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంటుంది.’ – నిజమే కదా! - నిర్జర.

వీళ్లు ఖర్చుపెట్టకుండా ఉండలేరు!

  ‘అప్పుచేసి పప్పు కూడు’ అని మన పెద్దలు ఓ సామెతని చెబుతూ ఉంటారు. కొంతమందిని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఒంటి మీద వేసుకోవడానికి సరైన బట్టలు లేకపోయినా, పిల్లలకి తిండి పెట్టే స్తోమత రాకపోయినా... విలాసవంతమైన వస్తువులు కొనడంలో వీళ్లు ముందే ఉంటారు. ఇలాంటి మనస్తత్వం వెనుక ఏదన్నా కిటుకు ఉందేమో గమనించే ప్రయత్నం చేశారు. ఈ పరిశోధన కోసం లండన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఓ బ్యాంకుని ఎన్నుకొన్నారు. ఆ బ్యాంకులోని 718 వినియోగదారుల చెంతకి వెళ్లారు. మీ ఖాతాలను ఓ ఏడాదిపాటు గమనించే అవకాశం ఇవ్వండి అని వారిని ఒప్పించారు. ఆ తర్వాత వారి వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకునేందుకు కొన్ని ప్రశ్నల జాబితాను వారి ముందు ఉంచారు. ఏడాదిపాటు వీరంతా డబ్బుని ఖర్చుచేసిన విధానాన్ని బట్టి ఐదు క్యాటగిరీలుగా విభజించారు. బాగా తక్కువ ఖర్చు చేసే వారు తొలి క్యాటగిరీలోకి రాగా... విపరీతంగా ఖర్చుపెట్టేవారిని ఐదో క్యాటగిరీలోకి చేర్చారు. తక్కువ ఆదాయం ఉన్నవారు కూడా కొందరు బాగా ఖర్చు చేయడాన్ని గమనించారు. వ్యక్తిత్వాలలోని తేడా వల్లే ఇలా జరుగుతున్నట్లు తేలింది. బహిర్ముఖంగా (extroverts) ఉండేవారు, నలుగురిలోనూ తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ఇలా ఖర్చు పెట్టేస్తూ ఉంటారట. అంతర్ముఖంగా (introverts)గా ఉండేవారు తమ social status (అంతస్తు) ఎలా ఉన్నా పెద్దగా పట్టించుకోరు. కానీ బహిర్ముఖులు అలా కాదు. వాళ్లు నలుగురిలో కలివిడిగా తిరగడానికి ఇష్టపడతారు. ఇతరుల ముందు తమ పేదరికం ఎక్కడ బయటపడుతుందో అని అప్పు చేసి మరీ విలాస వస్తువులని కొనుగోలు చేస్తారట. కొందరి ఆదాయం నేల చూపులు చూసినా, విలాస వస్తువులకి ప్రాధాన్యత ఇవ్వడానికి ఇదే కారణం అని తేల్చి చెబుతున్నారు. కావాలంటే మీ చుట్టూ ఓసారి తరచి చూసుకోండి! - నిర్జర. 

ఐస్‌క్రీంని బట్టి మనస్తత్వం

  మీకు ఏ ఐస్‌క్రీం అంటే ఇష్టం? అని అడిగితే ఠక్కున వెనీలా అనో స్ట్రాబెర్రీ అనో జవాబు చెప్పేస్తాం. కానీ సరదాగా ఇష్టపడిన ఆ రుచి వెనక మన మనస్తత్వం దాగి ఉందంటే నమ్మగలరా! కొన్ని రుచులను మనం ప్రత్యేకంగా ఇష్టపడటానికి కారణం మన మెదడులో ఉండే limbic lobe అనే భాగమే కారణం. ఇదే భాగం మన మనస్తత్వాన్ని కూడా నిర్దేశిస్తుందని చెబుతారు. కాబట్టి మనం ఎలాంటి పదార్థాలను ఇష్టపడతామో అన్న విషయం ద్వారా మన వనస్తత్వం ఎలాంటిదో కూడా పసిగట్టేయవచ్చునట! కావాలంటే మీరే పోల్చి చూసుకోండి… వెనీలా వెనీలా అతి సాధారణమైన ఫ్లేవర్‌. మీరు కూడా అంతే నిరాడంబరంగా ఉంటారు. జీవితంలో ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తారు. ప్రేమకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కష్టకాలంలో నమ్మదగిన మనిషిగా గుర్తింపు పొందుతారు. ఎంత నిదానంగా కనిపించినా... అవసరం అయినప్పుడు మీ మనసులో మాటని నిర్మోహమాటంగా చెప్పేయగలరు. ఆపదని ఎదుర్కొనేందుకు ఎంతటి సాహసానికైనా సిద్ధపడగలరు. చాక్లెట్‌ మనుషులని గెల్చుకోవడంలో మిమ్మల్ని మించినవారు ఉండదరు. పార్టీలన్నా, ప్రయాణాలన్నా మీకు మహా సరదా! ప్రపంచంలో ప్రతి ఒక్కరినీ ప్రేమించేందుకు మీరు సిద్ధంగా ఉంటారు. అదే సమయంలో మిమ్మల్ని మీరూ ప్రేమించుకుంటారు. జీవితాన్ని అనుభవిస్తూనే, కెరీర్‌లో దూసుకుపోతారు. మీ జీవితంలో అటు విలాసాలకీ, ఇటు వినోదాలకీ కొదవే ఉండదు. స్ట్రాబెర్రీ మీలో సహనం చాలా ఎక్కువ. ఒక బంధాన్ని నిలుపుకొనేందుకు, జీవితంలో నిరంతరం ముందుకు వెళ్లేందుకైనా ఆ సహనమే మీకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. అంతర్ముఖులుగా (introvert) మీరు నిత్యం ఏదో ఒక ఆలోచనలో మునిగిపోయి ఉంటారు. ఒకోసారి ఆ ఆలోచనలే మీలో లేనిపోని భయాలను రేకెత్తిస్తాయి. ఆత్మన్యూనతో కుంగిపోయేలా చేస్తాయి. పిస్తా మీది నలుగురూ నడిచే బాట కాదు. నలుగురూ మాట్లాడే మాట కాదు. మీకంటూ ఒక భిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది. ఎవరి వైపూ మొగ్గు చూపని, ఎవరి ప్రభావానికీ లొంగని ప్రత్యేకత మీది. అదే భిన్నత్వం వల్ల స్నేహితులు మీరంటే ఇష్టపడతారు. ఆ భిన్నత్వం ఒకోసారి మిమ్మల్ని కొరకరాని కొయ్యగా మారుస్తుంది. ఇతరుల కంటే వైవిధ్యంగా ఉండాలనే తపన ఒకోసారి అసహనానికి దారితీస్తుంది. బటర్‌ స్కాచ్‌ మీరు ఏదన్నా పని చేస్తే, వేలెత్తి చూపించేందుకు ఏమీ ఉండదు. మీ జీవితం కూడా అలాగే ఉండాలనుకుంటారు. సంప్రదాయాలను అనుసరిస్తూ గౌరవాన్ని పొందుతారు. మీ గమ్యాన్ని చేరుకునేందుకు ఒక ప్రణాళికను ఏర్పరుచుకుని, దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని నష్టాలు ఎదురైనా... మీరు ఏర్పరుచుకున్న విలువలని అంగుళం కూడా సడలించరు. ఇవే కాదండోయ్‌! బనానా, మింట్, ఆల్మండ్, కాఫీ- ఇలా రకరకాల ఐస్‌ క్రీం ఫ్లేవర్లు ఉన్నాయి కానీ... మనకి ఎక్కువగా దొరికే రుచుల గురించే పైన చెప్పుకొన్నాం. వాటిలో ఎంతవరకు నిజం ఉందో మీరే చెప్పాలి.  - నిర్జర.

పతంజలి

  మన భారతదేశం లో యోగసూత్రాల ద్వారా యోగశాస్త్రాన్ని మానవాళికి అందించిన గొప్పయోగి పతంజలిగారు. ఈయన శ్రీ క్రిష్ణుడు జీవించిన కాలానికి కొద్దిగా అటుయిటుగా జీవించినవాడు అంటారు.. అంటే దాదాపు 5000 సంవత్సరాలకు పైమాటే. పతంజలి గారు రచించిన యోగసూత్రములు 195. అందులో అష్టాంగయోగము ప్రధానమైనది. యమము, నియమము, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానము, సమాధి అని చెప్పారు. అలాగే ఈ ఆసనం వేసుకుంటే ఈ యోగం మనకి కలుగుతుందన్నది ఏ రోగం తగ్గుతుందన్నది కూడా పతంజలి గారు వివరించి మరీ చెప్పారు. అనేక యోగరహస్యాలను పతంజలి గారు యోగ సూత్రాలలో పొందుపరిచారు. ఆయన చెప్పిన ఆసనాలు అన్నీ ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తాయి.. ప్రశాంతతని ఇస్తాయి... ఆయన సూచించిన ఆసనాలెన్నో వాటిలోకొన్నిటి పేర్లు తెలుసుకుందాం.... 1. నాడీశుద్ది ప్రాణాయామం 2. బద్దపద్మాసనం 3. పద్మాసనం 4. భుజంగాసనం 5. శలభాసనం 6. పశ్చిమోత్తాసనం 7. హలాసనం 8. విపరీతకరణిముద్రాసనం 9. సర్వాంగాసనం 10. వజ్రాసనం 11. సింహాసనం 12. గోముఖాసనం 13. లోలాసనం 14. హస్తపాదాసనం 15. త్రికోణాసనం 16. చక్రాసనం 17. యోగముద్ర 18. మత్య్యాసనం 19. ధనురాసనం 20. మయూరాసనం 21. అర్ధమత్స్యేంద్రాసనం 22. ఉద్యాణబంధము 23. నౌళిక్రియ 24. శీర్షాసనం 25. శవాసనం ఇలా ఏ ఆసనం వేసుకుంటే ఏ ప్రయోజనం ఉంటుంది అన్నది కూడా తెలియజేసిన మహాను భావుడు పతంజలి గారు.... ఆయన మన అందరి యోగం బాగుండాలనే యోగశాస్త్రమన్నదాన్ని స్రుష్టించారన్నది అక్షరసత్యం.

ఇలా చేస్తే కోపం మాయం

సంతోషం, బాధ ఎలాగో కోపం కూడా సహజమైన లక్షణమే! కోపంతోనే మన అసంతృప్తిని, అసహనాన్నీ వ్యక్తం చేయగలం. కానీ మనిషి కోపాన్ని కాకుండా కోపమే మనిషిని అదుపుచేస్తే బంధాలు ఛిద్రమైపోతాయి. అదే కోపాన్ని మనసులో దాచిపెట్టుకుంటే మన అంతరంగాన్ని దహించివేస్తుంది. అందుకనే కోపాన్ని జయించే మార్గాలు ఇవిగో...   విశ్లేషణ తప్పదు - మనలో హద్దుల మీరి కోపం ఏర్పడినప్పుడు, దానికి కారణం ఏమిటా అని విశ్లేషించుకోక తప్పదు. నిజంగా అవతలివారి తప్పుందా? ఉంటే ఆ తప్ప పట్ల మీ అసమ్మతిని తెలియచేస్తే ఉపయోగం ఉంటుందా! మీ కోపాన్ని వ్యక్తపరిచి తీరాలి అనుకున్నప్పుడు... కర్ర విరగకుండా, పాము చావకుండా మీ మాటలను ఎలా ప్రయోగించాలో నిర్ణయించుకోవాలి. ఒక్క క్షణం కోపాన్ని పక్కన పెట్టి విచక్షణకు పనిపెడితే ఇంత విశ్లేషణా కూడా నిమిషంలో తేలిపోతుంది.   కోపాన్ని గ్రహించండి – కోపమనేది ఒక భావన మాత్రమే కాదు... దాని వెనుక చాలా శారీరిక స్పందనలు కనిపిస్తాయి. కోపం వల్ల పెరిగిపోయే అడ్రినల్ ప్రభావంతో హృదయవేగం పెరగడం, కండరాలు బిగుసుకోవడం వంటి స్పందనలు కనిపిస్తాయి. ఈ మార్పులను కనుక గ్రహించగలిగితే మరింత విచక్షణతో మెలుగుతాం. లేకపోతే మనకి తెలియకుండా ఒక్కసారిగా విరుచుకుపడిపోయే పరిస్థితులు ఏర్పడతాయి.   శారీరిక శ్రమలో ఇమిడిపొండి – కోపం వచ్చిన తరువాత దానిని అదుపు చేసుకునేందుకు ఓ అత్యుత్తమ మార్గం ఉంది. శరీరం ఏదన్నా వ్యాయామంలో నిమగ్నమయ్యేలా చేస్తే మనసుని కాసేపు దారిమళ్లించినట్లు అవుతుంది. వ్యాయామం వల్ల ఎండోమార్ఫిన్స్ అనే పదార్థాలు విడుదల అవుతాయి. ఈ ఎండోమార్ఫిన్స్ వల్ల కోపం తగ్గి మనసుకి ప్రశాంతత చేకూరుతుంది.   వాతావరణాన్ని మార్చండి – కోపం కలిగిస్తున్న సందర్భం నుంచి తప్పుకోవడం వల్ల కూడా మేలు జరుగుతుంది. ఏదన్నా పుస్తకం చదవడమో, అలా వ్యాహ్యాళికి వెళ్లడమో, సంగీతం వినడమో... చేయడం వల్ల మనసుని కాస్త బుజ్జగించినట్లు అవుతుంది.   అంకెలు పనిచేస్తాయి – కోపం వచ్చినప్పుడు అంకెలు లెక్కపెట్టమని చెబుతూ ఉంటారు. ఇది ఉపయోగపడే చిట్కానే! ఒకటి నుంచి పది వరకు అంకెలను లెక్కపెట్టడం వల్ల మనసులోని కోపం ఉపశమిస్తుంది. ఈ అంకెలు లెక్కపెట్టడంతో పాటుగా, ఒకో అంకెతో పాటుగా శ్వాసని కూడా నిదానంగా పీల్చుకుంటే మనసులో కోపం స్థానంలో ప్రశాంతత ఆవహిస్తుంది.   ఊహకి పదును పెట్టండి – మనసంతా కోపంతో నిండిపోయినప్పుడు... నవ్వు తెప్పించుకునే సన్నివేశాన్ని గుర్తుచేసుకున్నా, ప్రశాంతమైన ప్రకృతిని తల్చుకున్నా మేలే జరుగుతుంది. ఆఖరికి మీకు కోపాన్ని కలిగిస్తున్న వ్యక్తిని చిత్రమైన వేషంలో ఊహించుకున్నా మనసులోని కోపం పటాపంచలైపోతుంది.   పంచుకోండి – మీ కోపాన్ని ఎవరన్నా సన్నిహితులతో పంచుకోవడం కూడా మంచిదే! దాని వల్ల వారు ఏదన్నా పరిష్కారాన్ని చూపించవచ్చు. మీకు కూడా మనసులోని భారం తగ్గవచ్చు. - నిర్జర.    

Plan an early Retirement

      Gone are those days when retirement was something which was given importance only after children, their education, house loans and health benefits and their marriages. The new-age thought trend is to plan your retirement as you reach your 30s. This is when you need to get serious about your financial plan and focus your retirement goals. Taking the time to think about your most important priorities means you're better able to target your spending and saving in accordance with what you want to achieve, now and in the future. John Lopez, who teaches personal finance at the University of Houston’s Bauer College of Business, says that your age gives you a significant advantage and setting goals while you’re younger gives you a lot of time and flexibility to reach those goals..   The following steps can help you start: Identify specific goals: “Be specific,” Lopez says. “Saying you want to retire at 60 is too broad. It’s more effective to specify the amount of money you need in the bank to reach that goal.” Your financial goals need specific components: what you want to achieve, and the amount of money you need to achieve them and for how long. Set your priorities: When you have defined your goals, including how much money you need to reach each one and the time in which you’d like to achieve them, you can determine which get top priority. “Your goals are competing for limited resources - your money - so you have to think about which to save for first,” Lopez says. At the top of your list should be goals for basic financial preparedness, including establishing an emergency fund, paying down high-interest debt and saving for retirement.  Self payments: “Pay yourself first” by automating your savings. You also can set up automatic transfers among your checking, savings and investment accounts so you can work toward your goals hassle-free. Annual reviews: Evaluate your goals each year to adjust for any changes such as a new job or the birth of a child. Talk to a financial advisor or your consultant who can help you evaluate your personal finance goals and your progress.  

నైట్ షిఫ్టులతో కేన్సర్?

  రాత్రిళ్లు నిద్రపోకుండా ఉద్యోగాలు చేసే పురుషులకు రకరకాల కేన్సర్లొచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని తాజా అధ్యయనాల్లో తేలింది. రాత్రిళ్లు ఉద్యోగాలకు వెళ్లే పురుషులపై వైద్య పరిశోధనలు జరిపినప్పుడు వాళ్లకి ప్రొస్టేట్. పెద్దపేగు, ఊపిరి తిత్తులు, మూత్రకోశ, పురీషనాళ, క్లో కేన్సర్, నాన్ హడ్గ్కిన్స్ కణతి లాంటి కేన్సర్లొచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని తేలింది. రాత్రివేళల్లో కరెంట్ లైట్ల కింద పనిచేయడంవల్ల నిద్రకి ఉపకరించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి బాగా తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ హార్మోన్ రోగ నిరోధక వ్యవస్థని పటిష్టం చేయడానికి కూడా పనికొస్తుందని ధృవీకరించారు కూడా.. నిద్రలేమివల్ల కేన్సర్లు మాత్రమే కాక రకరకాలైన మానసిక జబ్బులొచ్చే అవకాశంకూడా ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

నేషనల్ సైన్స్ డే

ఫిబ్రవరి 28వ తేదీ మన జాతీయ విజ్ఞాన దినోత్సవం.. నేషనల్ సైన్స్ డే... నా మాత్రుభూమిలో నిజమైన సైన్స్ నిర్మాణం చేయగలననుకున్నాను అంటూ చివరి వరకూ భారత దేశంలో సైన్స్ అభివ్రుద్దికి పాటుపడ్డ మహనీయుడు చంద్రశేఖర్ వెంకట్రామన్ సి.వి.రామన్ గారి పరిశోధనా ఫలితాల్ని ధ్రువీకరించిన  రోజు ఫిబ్రవరి 28 కనక ఈరోజుని జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా సి.వి.రామన్ గారికి వందనాలు అర్పిస్తూ..ఒక్కసారి ఆయన గురించి మన దేశ శాస్త్రవేత్తల గురించి ఒక్కసారి మననం చేసుకుందాం.   1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్టు అంటే పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది. ఈ దృగ్విషయాన్ని 1928 మార్చి 16 న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞులసదస్సులో చూపించారు. అందుకే బ్రిటీష్ ప్రభుత్వం 1929లో నైట్‌హుడ్ బిరుదుతో సత్కరించింది. ఈ రామన్ ఎఫెక్టు అసామాన్యమైనదని, అందులో 200 రూపాయలు కూడా ధరచేయని పరికరాలతో ఆ దృగ్విషయ నిరూపణ జరగడం అద్భుతమైనదని ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ రామన్‌ను అభినందించారు. ఈయన పరిశోధన యొక్క విలువను గుర్తించి 1930లో నోబెల్ బహుమతి ప్రదానం చేశారు. ఆ మహనీయుని సేవలను భారత ప్రభుత్వం గుర్తించి 1954లో 'భారతరత్న' అవార్డు బహుకరించిన సమయంలో సందేశాత్మక ఉపన్యాసం ఇస్తూ 'విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగశాలల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన, స్వంతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధించి వేస్తాయి' అన్న మాటలు నేటికి ఆలోచింపచేసేవి. ఆయన నాజీవితంలో ఒక విఫల ప్రయోగం. ఎందుకంటే నేను నా మాతృభూమిలో నిజమైన సైన్స్ నిర్మాణం చేయగలననుకున్నాను. అంటూ చివరి వరకు భారతదేశంలో సైన్స్ అభివృద్ధికై పాటుపడ్డ ఆ మహనీయుడు 1970 నవంబర్ 20 న భౌతికంగా కన్నుమూసినా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించుకొని ఆయనను చిరంజీవిగా మనమధ్యే నిలిపేలా కొన్ని సంస్థలు ఆయన పేరు మీద టాలెంట్ టెస్ట్‌లు, సైన్స్‌కు సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్నాయి. విద్యార్థినీ, విద్యార్థుల్లో ఆయన స్ఫూర్తిని నింపుతూ సైన్స్ అంటే మక్కువ కలిగేలా చేస్తున్నాయి. 1928లో ఫిబ్రవరి 28న ఈయన రామన్ ఎఫెక్టును కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని భారతదేశంలో ఫిబ్రవరి 28వ తారీఖును జాతీయ విజ్ఞాన దినోత్సవంగా (నేషనల్ సైన్స్ డే) జరుపుకొంటారు. సి.వి.రామన్ గారి గురించి తలుచుకున్నాం కద... జాతీయ విజ్ఞాన దినోత్సవ సందర్భంగా మన భారతదేశంలో మిగిలిన ప్రముఖ శాస్త్రవేత్తల పేర్లు కూడా ఒక్కసారి తలుచుకుందాం....   శ్రీనివాస రామానుజన్ గారు.. శ్రీనివాస రామానుజన్ అనే భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు స్వతంత్రంగా గాస్, కుమ్మేర్ మరియు హైపర్ రేఖాగణిత సిరీస్ లను కనుకోనేను. అంతేకాక అయన సంఖ్య సిద్ధాంతం మీద ప్రసిద్ధ రచనలు చేసారు. భిన్నాలు మరియు అపరిమిత సిరీస్ లను కొనసాగించారు. 20 వ శతాబ్దపు అత్యుత్తమ గణిత శాస్త్రవేత్తగా గుర్తించబడ్డారు. శ్రీనివాస రామానుజన్ అనే భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు స్వతంత్రంగా గాస్, కుమ్మేర్ మరియు హైపర్ రేఖాగణిత సిరీస్ లను కనుకోనేను. అంతేకాక అయన సంఖ్య సిద్ధాంతం మీద ప్రసిద్ధ రచనలు చేసారు. భిన్నాలు మరియు అపరిమిత సిరీస్ లను కొనసాగించారు. మరో ప్రసిద్ధ విద్యావేత్త,రసాయన శాస్త్రవేత్త,ఉపాధ్యాయుడు అయిన ప్రఫుల్ల చంద్ర రాయ్ మొదటి భారతీయ ఔషధ సంస్థ,బెంగాల్ కెమికల్స్ & ఫార్మాస్యూటికల్స్ ఏర్పాటు చేసారు. భారతీయ రసాయన శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్తగా అయన చాలా ప్రసిద్ధి చెందారు. అంతేకాక కెమిస్ట్రీ రాయల్ సొసైటీ వారిచే జీవిత పురస్కారాన్ని పొందారు. మొట్ట మొదటగా యూరోప్ బయట నుండి ఒక రసాయన ల్యాండ్ మార్క్ ప్లాక్ గా గుర్తింపు పొందారు.    మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు.. కర్నాటక చెందిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య,మైసూర్ లో కావేరి నదిపై కృష్ణ రాజ సాగర్ ఆనకట్టను నిర్మించిన ఒక ఇంజనీరు. ఆయన గౌరవార్ధం, భారతదేశం ప్రతి సంవత్సరం అయన పుట్టినరోజు సెప్టెంబర్ 15 న ఇంజినీర్స్ డే గా జరుపుకుంటున్నారు. ఆయన ప్రజా మరియు ఆధునిక నిర్మాణ భారతదేశం గురించి చేసిన వివిధ రచనలకు 1955 వ సంవత్సరంలో భారతరత్న అవార్డు లభించింది. మరో భౌతిక శాస్త్రవేత్త  హోమీ జహంగీర్ భాభా.. హోమీ భాభా ఒక సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త మరియు ఒక ప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్త. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ మరియు భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ స్థాపించడంలో ప్రముఖమైన పాత్రను పోషించారు. అయన భారతీయ అణు శక్తి చీఫ్ ఆర్కిటెక్ట్ గా ఉన్నారు. అయన భారతదేశంలో అత్యంత ప్రఖ్యాత శాస్త్రవేత్తలలో ఒకరుగా ఉన్నారు.   మరో మహానుభావుడు జగదీష్ చంద్ర బోస్ గారు.. బెంగాలీ భౌతిక శాస్త్రవేత్త,జీవశాస్త్రజ్ఞుడు,వృక్షశాస్త్రజ్ఞుడు మరియు పురాతత్వవేత్త అయిన JC బోస్ రేడియో మరియు మైక్రోవేవ్ ఆప్టిక్స్ రంగంలో వివిధ అధ్యయనాలను కనుగొన్నారు. అయన జంతువులు మరియు మొక్కలు వివిధ పరిస్థితుల్లో ఎలా ఉంటాయో తెలుసుకోవటానికి 'క్రెస్కోగ్రాఫ్' అనే పరికరాన్ని కనుగొన్నారు.    మనమంతా సలాం చేయాల్సిన మరో మహానుభావులు సలీం ఆలీ గారు... సలీం ఆలీ పక్షుల అధ్యయనం మరియు వాటిని వర్గీకరించడంలో అపారమైన ఆసక్తి కలిగిన ఒక భారతీయ పక్షి శాస్త్రవేత్త .ఆయన భారతదేశం అంతటా క్రమబద్ధమైన పక్షి సర్వేలు నిర్వహించిన మొదటి భారతీయుడు. అలాగే అయన అన్ని సమయాల్లోనూ విస్తృతంగా గొప్ప శాస్త్రవేత్తగా ఆమోదించబడ్డారు. అంతేకాక సలీం ఆలీని "భారతదేశం యొక్క బర్డ్ మెన్ " గా పిలిచేవారు.   కంప్యూటర్ సైన్స్ లో వండర్స్ స్రుష్టిస్తాను బిరెడీ...అన్న మహానుభావులు రాజ్ రెడ్డి గారు... రాజ్ రెడ్డి కృత్రిమ ఇంటలిజెన్స్ [AI] సిస్టమ్స్ రంగంలో పెద్ద స్థాయిలో మార్గదర్శకులుగా ఉన్నారు. అయన కృత్రిమ ఇంటలిజెన్స్ [AI] సిస్టమ్స్ కనుకోనుట వలన,1994 వ సంవత్సరంలో కంప్యూటర్ సైన్స్ రంగంలో అత్యున్నత పురస్కారం అయిన అలన్ ట్యూరింగ్ అవార్డు ను గెలుచుకున్నారు.   మన భారతదేశానికి ఆయన పేరే తెచ్చింది విజానబలం.. ఆయన వేరెవరో కాదు... A.P.J. అబ్దుల్ కలాం.... అందరం పెడదాం...ఆయనకి సలాం... APJ అబ్దుల్ కలాంను భారతదేశం యొక్క మిస్సైల్ మాన్ అని అంటారు. అయన విస్తృతంగా భారతదేశం యొక్క బాలిస్టిక్ క్షిపణి మరియు అణు యుద్ధ క్షిపణి కార్యక్రమం అభివృద్ధిలో కీలక పాత్రను పోషించారు. భారతదేశంలో ఉత్తమ రాష్ట్రపతులలో ఒకరిగా చేశారు.   మరో మహానుభావులు సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్.. సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ భారత ఖగోళభౌతిక శాస్త్రవేత్తగా పేరు గాంచారు. అయన నక్షత్రాలు మరియు బ్లాక్ హోల్స్ యొక్క పరిణామ దశలను కనుగొనుట వలన 1983 వ సంవత్సరంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. అయన కనుగొన్న సిద్దాంతం 'చంద్రశేఖర లిమిట్' గా పేరు పొందింది. ఇలా ఎందరో మన భారతీయ శాస్త్రవేత్తలు అందరికీ... తలవంచి మరీ దాసోహం చేద్దాం.... ఎందుకంటే ఇవాళ సమాజంలో మనకి అవసరమైన శాస్త్రసాంకేతిక పరికరాలు, వైద్యసదుపాయాలు అన్నీ మనకి ఉన్నాయంటే ఇదంతా వారి చలువ... అందుకే మనమంతా వారందరికీ ఒకసారి... వందనాలు చేసుకుందాం...