ఫోన్ మార్చేసే జబ్బు - COMPARISION NEGLECT

  మీ ఫోను అద్భుతంగా పనిచేస్తోంది. కానీ అదే సమయానికి ఓ కొత్త మోడల్‌ ఒకటి మార్కెట్లోకి వచ్చింది. అంతే! ఠక్కున ఆ ఫోన్ పక్కన పడేసి upgraded version తీసుకునేందుకు బయల్దేరిపోయారా? అయితే మీరు ఖచ్చితంగా comparision neglect అనే సమస్యతో బాధపడుతున్నట్లే! ఇంతకీ ఆ సమస్య ఏమిటి? అది మన నిర్ణయాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? చాలా కంపెనీలు చూడండి! ఒక ఫోన్‌ మార్కెట్లోకి వచ్చిందో లేదో... మళ్లీ కొన్నాళ్లకి ఓ చిన్న మార్పు చేసి మరో మోడల్‌ని విడుదల చేసేస్తాయి. యాపిల్‌ ఐఫోనునే తీసుకోండి- 5,6,7... ఇలా ఒకదాని తర్వాత ఒకటి upgraded versions పేరుతో వచ్చిపడుతూనే ఉన్నాయి. అవి వచ్చిన వెంటనే జనం వాటిని తలకెత్తుకూనే ఉంటున్నారు. ఈ స్వభావం వెనుక రహస్యం ఏమిటో తెలుసుకోవాలనుకున్నారు వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు పరిశోధకులు. ఈ పరిశోధనలో భాగంగా 18 నుంచి 78 ఏళ్ల లోపు వయసు ఉన్న ఓ వెయ్యిమందిని ఎన్నుకొన్నారు. వీరి దగ్గర ఏ ఫోన్ ఉందో తెలుసుకున్నారు. ఆ ఫోన్‌ తర్వాత వచ్చిన upgraded versionని కూడా చూపించారు. ఆ రెండు ఫోన్లలోనూ ఉన్న ఫీచర్లనీ వివరించారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే.... UPGRADED అన్నమాట కనిపించగానే మిగతా ఫీచర్లన్నింటినీ పక్కన పెట్టేసి కొత్త ఫోనుకే ఓటు వేసేశారట. దాదాపు 78 శాతం మంది UPGRADED అనే మాట తమ నిర్ణయాన్ని ప్రభావితం చేసిందని చెప్పారు. మిగతా ఫీచర్లని కూడా ఓసారి పరిశీలించి చూడమని ఒత్తిడి చేసిన తర్వాత కానీ వారు మరోసారి ఆలోచించే ప్రయత్నం చేయలేదు. అంటే UPGRADED అన్నమాట తెలియకుండానే మన నిర్ణయాన్ని తీవ్రంగా ప్రభావితం చేసేస్తుందన్నమాట. అప్‌గ్రేడెడ్‌ అంటే అందులో ఇంకా అత్యాధునిక ఫీచర్లు, శక్తిమంతమైన పరికరాలు ఉంటాయన్న అభిప్రాయం కలగడం సహజమే! కానీ సరిగ్గా ఇదే బలహీనతని కంపెనీలు క్యాష్‌ చేసుకుంటాయని అంటున్నారు నిపుణులు. కేవలం మొబైల్ ఫోన్లే కాదు... మార్కెట్‌లో ఏ వస్తువుని చూసినా new pack, developed, latest version, updated... లాంటి తోకలు ఏవో ఒకటి కనిపిస్తూనే ఉంటాయి. ఇలాంటి మాటలు చూడగానే జనం కళ్లుమూసుకుని వాటిని బుట్టలో వేసుకుంటారు. ఇకమీదట ఇలాంటి మాటలు మీ నిర్ణయాన్ని ప్రభావితం కాకుండా జాగ్రత్తపడమని హెచ్చరిస్తున్నారు.   - నిర్జర.

ఇవి తింటే పీడకలలు ఖాయం!

  మనిషికి ఏమున్నా లేకపోయినా ఫర్వాలేదు కానీ ఆహారం, నిద్రా లేకపోతే మాత్రం బతకడం కష్టమే. అందుకే ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు అంటారు పెద్దలు. నిజమే! హాయిగా పడుకోవాలనీ, ఆ నిద్రలో ఎలాంటి పీడకలలూ రాకుండా ఉండాలని ఎవరికి మాత్రం తోచదు. కానీ కొన్ని రకాల ఆహారపదార్థాలను తింటే మాత్రం పీడకలలు వస్తాయని అంటున్నారు నిపుణులు. మరి అవి ఏంటో…   మద్యం:- చాలామంది మందు కొడితే హాయిగా నిద్రపట్టేస్తుంది అనుకుంటారు. కానీ మద్యం వల్ల నిద్ర పట్టదు సరికదా! పట్టినా కూడా పీడకలలు ఖాయం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే మనం నిద్రపోయేటప్పుడు REM (rapid eye movement) అనే దశ ఉంటుంది. ఈ దశలోనే మనం కలలను కంటాము. మోతాదు మించిన మద్యం ఈ దశని చెడగొడుతుందట. ఫలితంగా పీడకలలు తప్పవంటున్నారు.   చాక్లెట్‌:- పడుకునే ముందు హాయిగా ఓ చాక్లెట్‌ని ఆస్వాదించి పడుకుందామని చాలామంది అనుకుంటారు. కానీ చాక్లెట్‌లో కెఫిన్‌ అనే పదార్థం చాలా అధికంగా ఉంటుందనీ... ఆ కెఫిన్ మన నిద్రను పాడుచేస్తుందన్న విషయాన్ని మర్చిపోతారు. ఆ మాటకి వస్తే చాక్లెట్‌ మాత్రమే కాదు- కెఫిన్‌ అధికంగా ఉండే టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్ లాంటి పదార్థాలన్నీ కూడా పీడకలలకు దారితీస్తాయి.   మషాళాలు:- ఈ రోజుల్లో చాలామంది మంచిగా పార్టీ చేసుకుని ఓ బిర్యానీ పొట్లాన్నీ పొట్టన వేసుకుని పడుకుంటున్నారు. బిర్యానీనే కాదు వేపుళ్లు, మషాళాలు, బేకరీ పదార్థాలు లాంటివాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే మన జీర్ణవ్యవస్థకీ నిద్రకీ చాలా దగ్గర సంబంధం ఉంది. కష్టమైన ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకు శరీరం ఇబ్బందిపడుతుంటే, మెదడు సుఖంగా ఎలా ఉంటుంది. దాని మానాన అది పీడకలలు కంటుంది కదా!   ఐస్‌క్రీం:- రోజంతా పడ్డ శ్రమకి ప్రతిఫలంగా ఓ కప్పుడు ఐస్‌క్రీంని ఆస్వాదిద్దాం అనుకుంటాం. కానీ చల్లగా కనిపించే ఐస్‌క్రీం మన బుర్రని వేడెక్కించేయగలదు. అందుకు కారణాలు లేకపోలేవు. ఐస్‌క్రీంని పాలతో తయారుచేస్తారు. వయసు పెరిగేకొద్దీ మనలో ఈ పాలపదార్థాలని జీర్ణం చేసుకునే సామర్థ్యం తగ్గిపోతుంటుంది. పైగా ఐస్‌క్రీంలో తీపి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అది మనలోని మెటబాలిజం (జీవక్రియలు) మీద ప్రభావం చూపుతుంది. ఇక చల్లటి ఐస్‌క్రీంని ఒంటికి తగినట్లు వేడిగా మార్చుకునేందుకు కూడా శరీరం ఇబ్బంది పడుతుంది. వీటన్నింటి ఫలితం – పీడకలలే! అదండీ సంగతి! కమ్మటి కలలు కనే నిద్ర పట్టాలంటే మనం పడుకునే ముందు ఏ ఆహారం తీసుకుంటున్నామో కూడా ముఖ్యమే. ఆ ఆహారం కూడా నిద్రపోయేందుకు ఓ రెండు గంటల ముందరే తినేయాలని సూచిస్తున్నారు! - నిర్జర.  

పగటి కలల్లో మునిగి తేలండోయ్

  ఓ చిన్న కథ గుర్తుందా మీకు? ఒకడు బుట్టనిండా గాజు సామాను పెట్టుకుని అమ్మటానికి పట్టణానికి వెళుతూ, దారిలో చెట్టు నీడలో కాసేపు కూర్చుంటాడు. ఆ కాసేపటిలో తాను బుట్టలోని సామాను అంతా అమ్మేసినట్టు, దాని నుంచి వచ్చిన డబ్బుతో మళ్ళీ సామాను కొన్నట్టు, అలా అలా వ్యాపారం పెరిగి పెద్ద ఇల్లు, సేవకులు, మంది మార్బలం, పెళ్ళాంపిల్లలు... అలా ఊహించుకుంటూ, ఆ ఊహలో సేవకుడు ఏదో పని చెబితే చేయలేదని కాలితో ఓ తన్ను తంతాడు. ఊహల్లోని సేవకుడికి ఇతని కాలిదెబ్బ తగిలిందో లేదోగానీ, వాస్తవంలో కాలి దగ్గర వున్న గాజు సామాను కాస్తా నేలపాలై విరిగిపోతాయి. ఇలా గాల్లో మేడలు కడితే వచ్చేదేం లేదు కానీ, ఉన్నది కూడా పోతుందని పెద్దలు నీతి చెబుతారు. అయితే అదే పనిగా గాల్లో మేడలు కడుతూ, పగటి కలలు కంటూ వుంటే ఏమోగానీ, అప్పుడప్పుడు మాత్రం పగటి కలలు మంచివే అంటున్నారు ప్రముఖ మానసిక నిపుణురాలు డాక్టర్ బూత్రా.   సోమరితనం కాదు...   ఎవరైనా తమ స్థాయికి మించి ఏదో సాధిస్తామని చెప్పినప్పుడు పగటి కలలు కంటున్నావా? అంటూ వెక్కిరిస్తాం. ఆ తీరుని సోమరితనమని, కాలం వృధా చేయటమని అనుకుంటాం. కానీ, అవి మంచివే అంటున్నారు మానసిక వైద్య నిపుణులు. వ్యక్తులు తాము సాధించాలని అనుకుంటున్న కోరికలని, ఆశలని, తన ఆలోచనల్లో నింపుకున్నప్పుడు మనసంతా వాటితోనే నిండిపోయే పగటి కలలు కనడం ప్రారంభిస్తారు అంటున్నారు వీరు. మేలుకొని వుండగానే తమకిష్టమైన వాటిని అద్భుతంగా ఊహించుకోవడమే పగటికట అంటూ విశ్లేషిస్తున్నారు కూడా. సాధారణంగా అవి సంతోషకరమైన సందర్భాలు, ఆశలు, ఆశయాలే అయి వుంటాయి.   ఆరోగ్యకరం కూడా...   పగటి కలలు మంచివి మాత్రమే కావు.. ఒకోసారి అవి ఆరోగ్యకరమని కూడా చెబుతున్నారు క్లినికల్ సైకాలజిస్టులు. ముఖ్యంగా సంగీతం, నవలా రచన, దర్శకత్వం వంటి సృజనాత్మక వృత్తుల్లో రాణించడానికి ఈ పగటి కలలు ఎంతో ఉపయోగపడతాయని కూడా చెబుతున్నారు. సృజనాత్మకకి ఊహాశక్తి అవసరం కదా! ఆ ఊహల్లోంచి అద్భుత సృష్టి జరుగుతుంది. కాబట్టే చాలామంది గొప్పగొప్ప కవులు, రచయితలు వాస్తవ ప్రపంచంతో సంబంధం లేనట్టు ఎప్పుడూ ఊహాలోకాల్లో వుంటారంటూ చెబుతున్నారు వీరు. ఇంకా ఈ పగటి కలలు కనని వాళ్ళకి వాటిలో మునిగి తేలండంటూ సలహా కూడా ఇస్తున్నారు.   పగటి కలలకీ హద్దుంది...   నిరాశ ఆవరించినప్పుడు, ధైర్యం కోల్పోయినప్పుడు, కోపం అతలాకుతలం చేస్తున్నప్పుడు.... వెంటనే ఇష్టమైన విషయం కోసం లేదా రేపటి భవిష్యత్తు కోసం, ఉద్యోగం కోసం, పిల్లల కోసం... ఇలా ఎవరికి నచ్చిన ఊహల్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలిట. కాసేపు... అంటే ఓ పది, పదిహేను నిమిషాలసేపు ఆ పగటి కలల్లో విహరిస్తే చాలు అప్పటి వరకు వున్న బాధ, నిరాశ పోయి వాటి స్థానంలో సంతోషం వచ్చి చేరుతుందిట. అదెలా సాధ్యం? అంటూ సందేహం వద్దు. ఎన్నో అధ్యయనాలు చేసి మరీ చెబుతున్నారు ఈ నిపుణులు. నమ్మకం కలగాలంటే మీరూ పగటి కలల్లోకి వెళ్ళి రావాల్సిందే. అయితే ఇక్కడ ఓ విషయం చెప్పాలి. పగటి కలలు అనేవి వాస్తవ పరిస్థితులకు పూర్తి భిన్నంగా వుండాలి. అంతేకానీ, ఆ కలల్లో కూడా కష్టాలు, కన్నీళ్ళు నింపితే ఆనందం బదులు కష్టం రెండింతలవుతుంది. అందులోనూ ఊహలకి హద్దేముంది? అలా హిమాలయాలదాకా వెళ్ళిరండి. లేదా రోడ్డుపై కారు నడపటానికి కూడా భయపడేవాళ్లు ఏకంగా విమానం నడిపేస్తున్నట్టు గాల్లో తేలిపోండి. సాధ్యాసాధ్యాల ప్రసక్తే లేదు. కానీ ఆ కలలకి కూడా హద్దు వుంది.   కమ్మటి కలల్లో విహరించండి...   పగటి కలల్ని పనులు మానుకుని మరీ కనాలనేం లేదుట. హాయిగా రాత్రి పడుకోబోయేముందు ఓ ఐదు నిమిషాలు అలా ఊహాలోకంలోకి వెళ్తే చాలుట. చక్కటి భావన కమ్మటి నిద్రని ఇస్తుందిట. అయితే నిపుణులు మరో విషయం కూడా చెబుతున్నారు. మంచివి అన్నాం కదా అని గంటలు గంటలు పగటి కలల్లోనే మునిగిపోతే మళ్ళీ అదో మానసిక సమస్యగా మారే ప్రమాదం వుందని అంటూ హెచ్చరిస్తున్నారు. నచ్చిన విషయాలని, కావాలనుకుంటున్న వాటిని కలలోనైనా దక్కించుకోవడం మంచిదే అంటున్నారు. మరింకేం... వీలు చిక్కితే కమ్మటి కలల్లో విహరించండి. -రమ ఇరగవరపు

దేశ చరిత్రను మార్చేసిన ముగ్గురి సాహసం

  B.B.D. Bagh. కోల్‌కతాలోని ఒక ప్రముఖ కూడలి. బెంగాల్ సచివాలయం లాంటి ప్రముఖ భవంతులన్నీ ఇక్కడే కనిపిస్తాయి. ఒకప్పుడు ఈ ప్రదేశానికి Dalhousie Square అని పేరు. ఆ డల్హౌసీ స్క్వేర్‌ బి.బి.డి.బాగ్‌గా మారడం వెనుక ఒక అద్భుతమైన కథ వినిపిస్తుంది.   ఒకనాటి బ్రటిష్‌ గవర్నర్‌ ‘లార్డ్‌ డల్హౌసీ’ పేరు మీదుగా బ్రిటిష్‌వారు కోల్‌కతాలో డల్‌హౌసీ స్క్వేర్‌ అనే ప్రాంతానికి రూపకల్పన చేశారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ వ్యాపారాలకీ, అధికారాలకీ ఇది కూడలిగా ఉండేది. 1930 డిసెంబర్‌ 8న ఈ డల్హౌసీ స్క్వేర్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తుపాకీ హోరుతో మోతెక్కిపోయింది. ఇక్కడ బ్రిటిష్‌వారి అధికార దర్పానికి నిలువెత్తు రూపంగా ఉండే రైటర్స్ బిల్డింగ్ వణికిపోయింది. అందుకు కారణం బినయ్‌, బాదల్‌, దినేష్ అనే ముగ్గురు యువకులు.   బినయ్, బాదల్‌, దినేష్‌ ముగ్గురూ మూడు నేపథ్యాల నుంచి వచ్చినవారు. కానీ ఆ ముగ్గురి ఆలోచనా విధానమూ ఒక్కటే! మన దేశాన్ని ఎలాగైనా బ్రటిష్‌వారి చెర నుంచి విడిపించడమే వారి లక్ష్యం. ఆ లక్ష్యంతోనే వారు సుభాష్‌ చంద్రబోస్‌ నెలకొల్పిన ‘బెంగాల్ వాలంటీర్స్’ అనే సంఘంలో చేరారు. భారతీయులు పట్ల కర్కోటకంగా వ్యవహరిస్తున్న బ్రిటిష్‌ అధికారులను గుర్తించి, వారిని ఏరివేయడమే ఈ బెంగాల్‌ వాలంటీర్స్‌ కర్తవ్యం.   అప్పట్లో NS Simpson అనే బ్రటిష్‌ అధికారి ఉండేవాడు. అతను జైళ్లశాఖకి ఇన్స్పెక్టర్‌ జనరల్‌గా విధులు నిర్వర్తించేవాడు. తన చేతికి అందిన స్వాతంత్ర్య సమరయోధులని చిత్రహింసలు చేయడం అంటే అతనికి మహా సరదా! భారతీయులలో నిండిన జైళ్లని నరకకూపాలుగా మార్చడం అంటే అతనికి మహా ఆసక్తి. ఆ NS Simpsonని ఎలాగైనా తుదముట్టించాలని అనుకున్నారు బినయ్‌, బాదల్‌, దినేష్‌లు. అప్పటికే బినయ్‌ Lowman అనే ఓ పోలీసు అధికారిని హతమార్చి బ్రటిష్ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపాడు. తను చదువుతున్న వైద్యవిద్యని మధ్యలోనే ఆపివేసి పూర్తిస్థాయి విప్లవకారునిగా మారిపోయాడు. అతనికి బాదల్‌, దినేష్‌లు కూడా తోడయ్యారు.   1930, డిసెంబరు 8వ తేదీన ఈ ముగ్గురూ NS Simpson ఉండే రైటర్స్ బిల్డింగ్‌ను చేరుకున్నారు. అక్కడ తమని ఎవరూ అనుమానించకుండా యూరోపియన్‌ దుస్తులలో ప్రవేశించారు. నేరుగా Simpson దగ్గరకి వెళ్లి అతని గుండెల మీద తుపాకీగుళ్లని కురిపించారు. ఆ మోతకి బ్రిటిష్ సైనికులు అప్రమత్తమయ్యారు. ముగ్గురు ‘తీవ్రవాదు’లని తుదముట్టించేందుకు ఎదురు కాల్పులు మొదలుపెట్టారు.   బ్రిటిష్‌వారు తమ మీద ఎదురుదాడి చేస్తారని బినయ్, బాదల్‌, దినేష్‌లకు ముందుగానే తెలుసు. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ వారికి ప్రాణాలతో లొంగకూడదని నిశ్చయించుకున్నారు. అందుకే బాదల్ పొటాషియం సైనేడు మాత్ర మింగేశాడు. బినయ్‌, దినేష్‌లు తమని తాము కాల్చేసుకున్నారు. ఆ గాయంతోనే బినయ్‌ ఆసుపత్రిలో చనిపోయాడు. దినేష్‌ కోలుకుని, మరుసటి ఏడు ఉరికంబాన్ని ఎక్కాడు.   బినయ్‌, బాదల్‌, దినేష్‌ల దాడితో బ్రిటిష్ ప్రభుత్వంలో భారతీయుల పట్ల భయం మొదలైంది. దేశంలోని విప్లవకారులకి ఈ చర్య సరికొత్త ఉత్తేజాన్ని అందించింది. - నిర్జర.

సమయాన్ని ఆదా చేసే Eisenhower Method

  చరిత్ర చదువుకున్న చాలామందికి Eisenhower అన్న పేరు పరిచయం ఉండే ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా సైనిక జనరల్‌గా ఐసన్‌హోవర్ ప్రసిద్ధుడు. ఆ ప్రజాదరణతోనే తర్వాతకాలంలో అమెరికా అధ్యక్షునిగా కూడా ఎన్నికయ్యారు. సైన్యాన్ని నడపాలన్నా, దేశాన్ని పాలించాలన్నా ఏమంత తేలికైన విషయం కాదు కదా! ప్రతి క్షణమూ చాలా విలువైనదే. ప్రతి నిర్ణయమూ ప్రాణాంతకమే! అలాంటి సందర్భంలో ఐసన్‌హోవర్ రూపొందించుకున్న ఒక సూత్రానికే Eisenhower Method అని పేరు పెట్టారు.   ‘నా ముందు రెండు రకాల సమస్యలు ఉంటాయి. ఒకటి అత్యవసరంగా (urgent) తేల్చాల్సినవి, రెండు తప్పనిసరిగా (important) తేల్చాల్సినవి. అత్యవసరం అనుకున్నది తప్పనిసరి కాకపోవచ్చు. తప్పనిసరి అనుకున్నది అత్యవసరం కాకపోవచ్చు,’ అని ఐసన్‌హోవర్‌ ఒకానొక సందర్భంలో అన్నారు. ఇదే మాటల్ని ఆధారంగా చేసుకుని వ్యక్తిత్వ వికాస నిపుణులు Eisenhower Methodని రూపొందించారు.   Eisenhower Methodలో మన పనులని నాలుగు రకాలుగా విభజించాలని చెబుతారు... (1) Urgent and important - వీలైనంత త్వరగా, తప్పనిసరిగా చేసితీరాల్సిన పనులు మొదటి జాబితాలోకి వస్తాయి. పై అధికారి ఫోన్ చేస్తున్నారనుకోండి, ఆ ఫోన్‌ తప్పనిసరిగా వెంటనే రిసీవ్ చేసుకోవాల్సిందే కదా! పిల్లవాడు కిందపడిపోతే, వెళ్లి పైకి లేపాల్సిందే! ఈ జాబితాలోకి వచ్చే పనులను సాధారణంగా ఎవరైనా చేసి తీరతారు. ఇవి కూడా చేయడం లేదు అంటే వారంతటి పలాయనవాదులు మరొకరు ఉండరు.   (2) Not urgent but important – త్వరగా ఇంటికి వచ్చేస్తానని భార్యకి చెప్పాం. అది అత్యవసరం కాకపోవచ్చు. కానీ భార్య మనసు నొప్పించకుండా ఉండాలంటే మాటకి కట్టుబడి ఉండాల్సిందే! అలాగే ఒళ్లు తగ్గించుకోవడం కోసం వ్యాయామం చేయాలని అనుకుంటున్నాం. వ్యాయామం చేయకపోతే కొంపలు మునిగిపోవు. కానీ నిదానంగా మన ఆరోగ్యం దెబ్బతింటుంది. చాలామంది ఈ రెండో విభాగంలోని విషయాలను పూర్తిగా అశ్రద్ధ చేస్తుంటారు. అత్యవసరం కాదు కదా అన్న చులకన భావంతో విలువైన బంధాలనీ, లక్ష్యాలనీ, ఆరోగ్యాన్నీ దూరం చేసుకుంటారు. కానీ ఒక ప్రణాళిక ప్రకారం వీటికి కూడా జీవితంలో భాగం ఇవ్వాలి అంటున్నారు నిపుణులు.   (3) Urgent but not important – దూరపు బంధువుల పెళ్లికి వెళ్లాలి. కుటుంబంలో ఎవరో ఒకరు ఆ వేడుకకు వెళ్తే సరిపోతుంది. మీకేమో ఆఫీసులో బోల్డు పని ఉంది. సహజంగానే భార్యనో పిల్లలను పెళ్లకి పంపిస్తారు కదా! మనం సమయం వృధా చేసుకోకుండా, ఇతరుల ద్వారా సాధించగలిగే కార్యాలన్నీ ఈ కోవలోకి వస్తాయి. కొంత డబ్బు కేటాయించో, పలుకుబడిని ఉపయోగించో, సాయాన్ని అర్థించో... ఇతరులతో చేయించగలిగే పనుల కోసం మీ సమయాన్ని వదులుకోవద్దని చెబుతున్నారు నిపుణులు.   (4) Not urgent and not important – కంప్యూటర్‌ ఆన్‌ చేస్తాం.... ఎందుకు ఆన్‌ చేశామో మనకే స్పష్టత లేదు. కాబట్టి ఏదో బ్రౌజ్‌ చేస్తూ సమయాన్ని గడిపేస్తాం. ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తాం... ఏవో పోస్టులు చూస్తూ కాలాన్ని మర్చిపోతాం. వీడియోగేమ్స్, టీవీ, సెల్‌ఫోన్‌లో కబుర్లు, పేకాట, బార్లో పార్టీలు... ఇలా చాలా సందర్భాలలో తెలిసో తెలియకో విలువైన కాలాన్నంతా వృధా చేసేస్తుంటాం. మనం చేసే ఈ పనులు అత్యవసరమూ కాదు, తప్పనిసరి కూడా కాదు. ఉత్త చెత్త! ఇలాంటి పనులను తగ్గించుకుంటే, జీవితంలో ఎంతో విలువైన సమయం ఆదా అవుతుందని చెబుతున్నారు. మరింకేం! మీరు కూడా ఓసారి ఈ Eisenhower Methodని పాటించి చూడండి మరి.   - నిర్జర.  

ఆ ఊరిలో అంతా లక్షాధికారులే

మహారాష్ట్ర-  ఈ పేరు వింటే శివాజీ వంటి వీరులు స్ఫురిస్తారు. గోదావరితో సస్యశ్యామలం అయిన పంటలు కూడా గుర్తుకువస్తాయి. కానీ ఇప్పుడు మహారాష్ట్ర అంటే కరువు. అలాంటి ఇలాంటి కరువు కాదు... తాగేనీరు కూడా రైళ్లలో తెప్పించుకోవాల్సిన దుస్థితి. గత కొద్ది సంవత్సరాలుగా మహారాష్ట్ర కరువు మరీ విలయతాండవం చేస్తోంది. అహ్మద్‌నగర్‌ వంటి జిల్లాలలో అది రైతులని ఆత్మహత్యకి పురికొల్పుతోంది. కానీ అదే అహ్మద్‌నగర్ జిల్లాలోని ఓ ప్రాంతం మాత్రం పచ్చగా కళకళలాడుతోంది. అదే ‘హివారే బజార్‌’ (Hiware Bazar) గ్రామం. హివారే బజార్ ఓ సాధారణ గ్రామం. దానికంటూ ఎలాంటి ప్రత్యేకతా ఉండేది కాదు. పైపెచ్చు 1972లో వచ్చిన కరువుతో ఆ గ్రామం పేదరికంలోకి జారిపోయింది. బీడుపడిన పంటపొలాలని వదలి ఆ గ్రామప్రజలు ఎక్కడెక్కడికో వలస వెళ్లిపోయారు. ఏళ్లు గడిచేకొద్దీ ఆ గ్రామం పేరుకి మాత్రమే ఊరుగా మిగిలింది. అలా సాగిపోతున్న ఆ గ్రామవాసుల జీవితంలోకి 1990లో ఒక మార్పు వచ్చింది. 1990లో జరిగిన గ్రామ సర్పంచి ఎన్నికలలో ‘పోపట్‌రావ్ పవార్‌’ అనే కుర్రవాడు నిలబడ్డాడు. చదువుకున్నవాడు కావడంతో, ఆయననే తమ సర్పంచిగా ఎన్నుకొన్నారు ఆ గ్రామ ప్రజలు. ఆ ఎన్నికే వారి జీవితాన్ని మార్చివేసింది. పవార్ సర్పంచిగా ఎన్నికైన దగ్గర్నుంచీ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాడు. గ్రామంలో మద్యాన్ని నిషేధించాడు. పచ్చని చెట్లని నరకడం కానీ, మేత కోసం వాడటం కానీ చేయకూడదని తీర్మానించాడు. కుటుంబ నియంత్రణ, శ్రమదానం వంటి కార్యక్రమాలకి సిద్ధంగా ఉండాలని సూచించాడు. ఒకపక్క గ్రామంలోని పరిస్థితులను చక్కబెడుతూనే మరోపక్క నీటి వసతి పెరిగే ఏర్పాట్లు చేశాడు పోపట్‌రావ్‌. ఎక్కడికక్కడ కాల్వలు తవ్వించడం, ఆనకట్టలు కట్టించడం, చెరువులు పూడికలు తీయించడం లాంటి పనులతో వర్షపు నీటిని ఒడిసిపట్టే ప్రయత్నం చేశాడు. దాంతోపాటుగా రైతులు పంటలు వేసుకునేందుకు, ఆ పంటలను మార్కెట్‌ చేసుకునేందుకు అవసరమయ్యే రుణాలన్నీ మంజూరయ్యేలా చూశాడు. నీటిని ఎక్కువగా వాడిపారేసే చెరకు, అరటి లాంటి పంటలు మాత్రం వేయకూడదని గ్రామస్తులకు సూచించాడు. ఎప్పటికీ లాభసాటిగా ఉండే పాల ఉత్పత్తి, పూల మొక్కల పెంపకం లాంటి పనులు చేపట్టేలా ప్రోత్సహించాడు. గ్రామస్తుల జీవితాలు మెరుగుపడటానికి పోపట్‌రావ్ చేయని పనంటూ లేదు. బడి దగ్గర నుంచీ స్మశానవాటిక దాకా వారికి కావల్సిన సదుపాయాలన్నీ ఏర్పరిచారు. ఇలాంటి చర్యలతో ఆ గ్రామం రూపురేఖలే మారిపోయాయి. రాష్ట్రం అంతా కరువుతో విలవిల్లాడుతున్నా, అక్కడ మాత్రం పొలాలు విరగపండాయి. 1995లో 830గా ఉన్న నెలసరి ఆదాయం 2012 నాటికి 30 వేలకు చేరుకుంది.  ప్రస్తుతం హివారే బజార్‌లో పదిలక్షల రూపాయలకు పైగా ఆస్తి ఉన్నవారి సంఖ్య 60కు పైగా చేరుకుంది. రెండు వందలకు పైగా కుటుంబాలలో కేవలం మూడు కుటుంబాలే దారిద్ర్య రేఖకు దిగువున ఉన్నాయి. ఒకప్పుడు ఊరు విడిచి వెళ్లిన కుటుంబాలన్నీ తిరిగి వచ్చేశాయి. ‘హివారే బజార్‌’ గ్రామానికి బోలెడు అవార్డులు వచ్చాయని వేరే చెప్పాలా! అలాంటి అవార్డులూ గుర్తింపుల కంటే వారి జీవితాలలో వచ్చిన మార్పే విశిష్టమైనది. అలాంటి మార్పు కేవలం ఒక వ్యక్తి వల్లే రావడం మనందరూ గుర్తుంచుకోదగ్గది.                                         - నిర్జర.  

చెల్లెలు పక్కన ఉంటే ఆ లైఫే వేరబ్బా..

  రాఖీ పండుగ వచ్చిందంటే... మన దేశంలో తెగ సందడి కనిపిస్తుంది. చిట్టి చెల్లెళ్లు, తల్లిలాంటి అక్కయ్యలు కట్టే రాఖీ కోసం అంతా ఎదురుచూస్తుంటారు. ఇంతకీ ఇంట్లో ఒక సోదరి ఉంటే ఆ విలువే వేరనుకోండి. కానీ ఆ విలువకి రుజువు ఏమన్నా ఉందేమో అని తెలుసుకోవాలనుకున్నారు పరిశోధకులు. మరి ఆ పరిశోధన ఏమిటో, అందులో ఏమని బయటపడిందో మీరే చూడండి!   మన జీవితంలో 10 నుంచి 14 ఏళ్లలోపు వయసు చాలా కీలకం అంటూ ఉంటారు. బాల్య దశ నుంచి టీనేజిలోకి అడుగుపెట్టే ఆ క్రమంలో మన వ్యక్తిత్వం ఎంతో మార్పుకి లోనవుతుంది. ఇలాంటి సమయంలో ప్రతి చిన్న విషయమూ మన మనసుని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఒంటరితనానికి లోనుకావడం, భయందోళనలకు గురికావడం, ఆత్మన్యూనతకి లోనుకావడం, లేనిపోని గొడవల్లో తలదూర్చడం.... లాంటి సమస్యలు ఈ వయసు కుర్రకారుని వేధిస్తాయి. ఇలాంటి సమయంలో ఇంట్లో అక్కాచెల్లెళ్లు ఉంటే ఆ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నారు పరిశోధకులు.   తాము ఎంచుకున్న విషయాన్ని పరిశోధించేందుకు 10-14 ఏళ్లలోపు పిల్లలు ఉన్న ఓ 395 కుటుంబాలను ఎంచుకొన్నారు. సదరు పిల్లల మానసిక స్థితి ఎలా ఉంది? వాళ్ల జీవనశైలి ఎలా ఉంది? వాళ్లకి అక్కయ్యలు కానీ చెల్లెళ్లు కానీ ఉన్నారా? లాంటి సవాలక్ష విషయాలన్నింటినీ సేకరించారు. ఓ ఏడాది గడిచిన తర్వాత ఇదే పిల్లలని మరోమారు పరిశీలించి చూశారు.   ఆశ్చర్యకరంగా ఇంట్లో అక్కయ్యకానీ, చెల్లెలు కానీ ఉన్న కుర్రకారు చాలా సంతోషంగా కనిపించారట. ఎలాంటి అడ్డంకులనైనా ఎదుర్కొంటూ, ఎలాంటి ఆందోళననైనా అధిగమిస్తూ ఉన్నారట. ఇంట్లో ఒక అక్కో చెల్లో ఉంటే చాలు! వాళ్లు బాగా చిన్నవారైనా, పెద్దవారైనా కూడా ఇంట్లోని మగపిల్లవాడి మీద వాళ్ల సానుకూల ప్రభావం ఉన్నట్లు తేలింది.   ఇంట్లో అక్కో, చెల్లో ఉంటే మనసు సంతోషంగా ఉండటమే కాదు... వ్యక్తిత్వం కూడా దృఢంగా ఉంటుందని తేలింది. తోటివారికి సాయపడాలని అనుకోవడం, బడిలో పిల్లలతో మంచిగా మెలగడం, మంచి పనులు చేయడంలో ముందు ఉండటం... లాంటి స్వభావాలు అక్కా లేదా చెల్లి ఉన్న పిల్లలలో కనిపించాయట. ఒక్క మాటలో చెప్పాలంటే తల్లిదండ్రుల ప్రభావం కంటే సోదరీమణుల ప్రభావమే ఎక్కువగా ఉన్నట్లు తేలింది.   అయితే ఇంట్లో కేవలం అక్కా లేదా చెల్లి ఉంటే సరిపోదు, వాళ్లతో సఖ్యత కూడా ఉండాలి కదా! అన్న అనుమానం రావచ్చు. నిజమే! అలా ఇంట్లో అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల మధ్య సఖ్యత ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఒకవేళ వారిద్దరూ భిన్నధృవాలలాగా ఉన్నా, కనీసం వారి మధ్య మాటామంతీ ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే మొహమొహాలు చూసుకోని బంధాలకంటే చిన్నాచితకా కొట్లాటలతో సాగే బాంధవ్యమే మున్ముందు నిలిచే అవకాశం ఉందట.   - నిర్జర.

అది తింటే వయసు ఆగిపోతుంది

  మెదడు ఓ గొప్ప అవయవం. ఒక సూపర్ కంప్యూటర్కి ఉండేంత సామర్థ్యం మన మెదడుకి ఉంటుంది. కానీ ఆ మెదడుకి కూడా కష్టాలు వస్తాయి. రోజులు గడిచేకొద్దీ అందులోని కణాలు తగ్గిపోతాయి. ఫలితంగా మతిమరపు రావడం, ఏకాగ్రత తగ్గిపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇది ఒకోసారి అల్జీమర్స్ వంటి సమస్యలకి కూడా దారితీస్తుంది. కానీ మెదడులోని కణాలు నిర్వీర్యం అయిపోకుండా ఇప్పుడు ఓ ఉపాయం దొరికేసింది అంటున్నారు పరిశోధకులు. ల్యూటెన్ (Lutein). ఈ పదార్థం గురించి మనం పెద్దగా విని ఉండం కదా! ఆకుకూరలు, క్యారెట్లు, గుడ్లు వంటి అతికొద్ది పదార్థాలలో కనిపించే ఒక ముఖ్యమైన పోషకం ఈ ల్యూటెన్.   ఇప్పటివరకూ ఈ ల్యూటెన్ మన కళ్లకి చాలా మంచిదని చెబుతూ వస్తున్నారు. క్యారెట్లు తినడం వల్ల కళ్లకి మంచిదని పెద్దలు చెప్పడానికి.... అందులో విటమిన్ Aతో పాటుగా ల్యూటెన్ ఉండటమే కారణం. ఈ ల్యూటెన్ వల్ల మెదడుకి కూడా ఏమన్నా మేలు జరుగుతుందా అన్న ఆలోచన వచ్చింది పరిశోధకులకి. దాంతో 25 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు వారిని ఓ 60 మందిని ఎన్నుకొన్నారు. ల్యూటెన్ మన కంట్లోని కణాలలో పోగవుతూ ఉంటుంది. దాంతో కంట్లో ల్యూటెన్ నిల్వలు అధికంగా ఉండేవారి మెదడు ఏ మేరకు చురుగ్గా ఉంటోందో గమనించే ప్రయత్నం చేశారు.   ఆశ్చర్యంగా ల్యూటెన్ ఎక్కువగా ఉన్నవారి మెదడు చాలా చురుగ్గా పనిచేయడాన్ని గమనించారు. అభ్యర్థుల మెదడుకి ఎలక్ట్రోడ్లను తగిలించి చూసినప్పుడు, ల్యూటెన్ అధికంగా ఉండేవారిలో ఏకాగ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలింది. తక్కువ ల్యూటెన్ ఉన్న పెద్దవాళ్ల మెదడు, వయసులో ఉన్నవారితో సమానంగా స్పందిస్తోందని గ్రహించారు. మెదుడ మీద ల్యూటెన్ ప్రభావం తేలిపోవడంతో.... మెదడుకి సంబంధించి అనేక సమస్యలకు ల్యూటెన్ని మందుగా ఇచ్చే ప్రయత్నాలు మొదలవుతాయని ఆశిస్తున్నారు.   వీలైనంతవరకూ ల్యూటెన్ అధికంగా ఉండే ఆకుకూరలు, గుడ్లు, చిలగడదుంప, టమాటా, క్యారెట్, గుడ్లు, బొప్పాయి, బీన్స్... లాంటి పదార్థాలు మన ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడమని చెబుతున్నారు. మన శరీరానికి స్వతహాగా ల్యూటెన్ని తయారుచేసుకునే సామర్థ్యం ఉండదు కాబట్టి, అది అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదు. ఆ కాస్త జాగ్రత్తా కనుక తీసుకుంటే.... వయసు ఎంతగా మీదపడినా మెదడు మాత్రం భద్రంగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు. - నిర్జర.  

ఆత్మహత్యలకు దారితీస్తున్న సీరియల్

  ఇప్పటి సినిమాలు చూసి కుర్రవాళ్లు చెడిపోతున్నారని అంటారు పెద్దలు. ఇప్పటి సీరియల్స్ ఇంట్లో విషాన్ని నింపేస్తున్నాయి అంటున్నారు పిల్లలు. మనకి రోజూ కనిపించేదే తీస్తున్నాం కదా! అని తప్పుకుంటున్నారు నిర్మాతలు. ఇంతకీ మీడియా ప్రభావం మన మీద ఉందా? అనే ప్రశ్నకి దిమ్మతిరిగిపోయే జవాబు ఒకటి వినిపిస్తోంది. అదే 13 Reasons Why. ఒక టీనేజీ అమ్మాయి తన స్కూళ్లో అనుకోని సమస్యలని ఎదుర్కొంటుంది. ఆ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఆత్మహత్యే సరైన మార్గం అని అనుకుంటుంది. ఆత్మహత్య చేసుకుంటుంది కూడా! కానీ చనిపోబోయే ముందు ఓ 13 వీడియో క్యాసెట్ల ద్వారా తన బాధనంతా వెళ్లగక్కుతుంది. తన మనసుని నొప్పించి తన చావుకి కారణమైనవారికి ఆ 13 క్యాసెట్లనీ పంపుతుంది. ఇదీ క్లుప్తంగా ’13 Reasons Why’ అనే నవలలోని కథ. ఇప్పుడు అదే నవలను Netflix అనే సంస్థ ఒక సీరియల్గా రూపొందించింది. ఈ ఏడాది మార్చిలో సీరియల్ మొదలవగానే విపరీతమైన జనాదరణ లభించింది. సీరియల్ అద్భుతంగా ఉందనీ, కుర్రకారు ప్రవర్తనకు దగ్గరగా ఉందనీ జనం విరగబడి చూడటం మొదలుపెట్టారు. కానీ ఈ సీరియల్ మొదలైన దగ్గర నుంచీ అది కుర్రకారు మీద ప్రతికూల ప్రభావం చూపుతోందన్న ఆరోపణలు మొదలయ్యాయి.   నిజంగానే 13 Reasons Whyతో ఆత్మహత్యలు పెరిగి ఉంటాయా? అన్న అనుమానం వచ్చింది పరిశోధకులకి. దాంతో ఇంటర్నెట్లో ఆత్మహత్యల గురించి వెతికేవారి సంఖ్య పెరిగిందో లేదో గమనించాలనుకున్నారు. ఆశ్చర్యంగా ఈ సీరియల్ మొదలైన దగ్గర్నుంచీ ఆత్మహత్యల గురించి సమాచారం కోరుకునేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందట. ఇలా కాస్తో కూస్తో కాదు, దాదాపు 20 శాతం ఎక్కువ మంది ఆత్మహత్యల గురించి విచారించడం మొదలుపెట్టారట. ఆత్మహత్య ఎలా చేసుకోవాలి? మనల్ని మనం చంపుకోవడం ఎలా? లాంటి ప్రశ్నలు ఇంటర్నెట్లో ఎక్కువయిపోయాయి.   ఆత్మహత్య గురించి సెర్చ్ చేసినవారంతా ఆత్మహత్యకు పాల్పడరు కదా! అన్న వాదన రావచ్చు. కానీ వారిలో అలాంటి ఆలోచన ఒకటి మొదలయినట్లేగా! పైగా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నవారు, అప్పటికే మానసికమైన సమస్యలు ఉన్నవారు.... ఇలాంటి సీరియల్స్ చూస్తే, ఆత్మహత్య చేసుకుంటే దరిద్రం వదలిపోతుంది అన్న నిర్ణయానికి వచ్చేసే ప్రమాదం ఉన్నట్లే. దానికి రుజువుగా, ఈ సీరియల్ మొదలైన దగ్గర నుంచీ... ఆత్మహత్య చేసుకోవాలనే తలపుతో సైక్రియాట్రిస్టుల దగ్గరకి పరుగులు పెట్టేవారి సంఖ్య కూడా పెరిగిపోయిందట.   ఆత్మహత్య అనేది క్షణికావేశంతో తీసుకునే నిర్ణయం. కాబట్టి ఈ నిర్ణయాన్ని ప్రోత్సహించేలా ఎలాంటి దృశ్యాలు కనిపించకుండా మీడియా జాగ్రత్త పడాలని ఐక్యరాజ్యసమితి సూచిస్తోంది. ముఖ్యంగా ఆత్మహత్య చేసుకునే విధానాన్ని చూపించడం, ఆత్మహత్యే ప్రధాన అంశంగా ప్రోగ్రాంలు రూపొందించడం చేయకూడదని చెబుతోంది. కానీ ఇప్పుడు ఆత్మహత్య తప్ప మరో మాట లేకుండా ఏకంగా ఓ సీరియల్నే రూపొందించేశారు. పైగా అది సూపర్హిట్ కావడంతో... దాన్ని పొడిగించేందుకు సిద్ధపడిపోతున్నారు. - నిర్జర.      

మందుతో జ్ఞాపకశక్తి పెరుగుతుందా!

  వీకెండ్ వచ్చిందంటే చాలు... బార్లన్నీ కిటకిటలాడిపోతుంటాయి. లోటాల కొద్దీ మద్యాన్ని జుర్రుకునేందుకు మందుబాబులు సిద్ధపడిపోతుంటారు. అంతవరకూ సరే! ఓ రెండు పెగ్గులు లోపలకి వెళ్లిన తర్వాత వీళ్లు తమ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ తూచా తప్పకుండా నెమరేసుకోవడం చూస్తుంటాం. ‘సుందరం మాస్టార్!’ అంటూ పక్కవాళ్లని చితకబాదేయడమూ చూస్తుంటాం. దీనికి కారణం ఏమిటంటారు!   ఇంగ్లండులోని ఎక్సెటర్ విశ్వవిద్యాలంలోని పరిశోధకులు... మద్యపానానికీ, జ్ఞాపకశక్తికీ మధ్య ఉన్న సంబంధాన్ని పరీక్షించాలని అనుకున్నారు. ఇందుకోసం వారు మద్యం అలవాటు ఉన్న ఓ 88 మందిని ఎన్నుకొన్నారు. వీరందరికీ కొన్ని కొత్త పదాలను నేర్పించారు. ఇలా కొత్త పదాలు నేర్చుకున్న తర్వాత, వారిని రెండు బృందాలుగా విభజించారు. వీరిలో కొందరు, తగిన మోతాదులో మద్యం తాగవచ్చని చెప్పారు. మరికొందరు మద్యానికి దూరంగా ఉండాలని హెచ్చరించారు.   రెండోరోజు కూడా ఇదే తరహాలో ప్రయోగం జరిగింది. కొత్త పదాలను నేర్పించడం. అలా నేర్చుకున్న తర్వాత కొందరు మద్యం తాగేందుకు అనుమతించడం. ఇలా రెండు రోజుల తర్వాత... వారిలో ఎంతమంది కొత్త పదాలను, ఎంత నైపుణ్యంతో నేర్చుకున్నారో పరిశీలించే ప్రయత్నం చేశారు. ఆశ్చర్యంగా మద్యానికి దూరంగా ఉన్నవారికంటే, మద్యం పుచ్చుకున్నవారే ఎక్కువ పదాలను గుర్తుచేసుకున్నారట.   వినడానికి ఇది కాస్త ఆశ్చర్యంగా ఉండవచ్చు! కానీ దీని వెనుక శాస్త్రీయపరమైన కారణాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. మద్యం తాగేటప్పుడు మన మెదడు పనిచేసే తీరు మారిపోతుంది. ఆ సమయంలో ఎలాంటి సమాచారమూ తలకి ఎక్కదు. దాంతో అంతకుముందు నేర్చుకున్న సమాచారాన్నే మరింత పదిలం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు! మెదుడులో జ్ఞాపకశక్తిని నియంత్రించే హిప్పోకేంపస్ కూడా తన దృష్టిని దీర్ఘకాలిక జ్ఞాపకాల మీద కేంద్రీకరిస్తుంది. అలాగని జ్ఞాపకశక్తిని తిరగీతోడేందుకు మద్యం జోలికి పోదామనుకునేవారు... మందుతో పాటుగా వచ్చే అనారోగ్యాలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పైగా మద్యం మోతాదు దాటితే, అసలు మెదడే పూర్తిగా మొద్దుబారి అసలుకే ఎసరు తప్పదు మరి! - నిర్జర.    

ఆడవాళ్లకి నిజంగా ఏం కావాలి?

  అనగనగా ఆర్ధర్ అని ఒక రాజు ఉండేవాడు. యువకుడు, అందగాడు, తెలివైనవాడు అయిన ఆ రాజంటే, రాజ్యంలో అందరికీ ఇష్టమే. అలాంటి ఆర్ధర్కి అనుకోని కష్టం ఎదురైంది. ఆర్థర్కంటే గొప్ప చక్రవర్తి ఒకరు, ఆర్థర్ రాజ్యం మీద దాడిచేశాడు. అతని మహాసైన్యం ముందు ఆర్థర్ పరాక్రమం ఏమాత్రం నిలవలేదు. ఆ చక్రవర్తి సైనికులు ఆర్థర్ని బంధించి తమ చక్రవర్తి ఎదుట ప్రవేశపెట్టారు.   ఆర్థర్ని ఓడించిన చక్రవర్తి కూడా సామాన్యుడు కాడు. సైనికబలంతో పాటుగా అపారమైన మేథస్సు అతని సొంతం. తన ముందు సంకెళ్లతో నిలబడి ఉన్న ఆర్థర్ ప్రతిభ అతనికి తెలియంది కాదు. ‘‘నీ సామర్థ్యం తెలిసినవాడిని కనుక నీకు మరణశిక్ష విధించాలనుకోవడం లేదు. అయితే ఇందుకు ఒక షరతు. నన్ను ఎప్పటి నుంచో ఒక ప్రశ్న వేధిస్తోంది. నువ్వు కనుక ఆ ప్రశ్నకి బదులు చెప్పగలిగితే నీ రాజ్యాన్ని నీకు తిరిగి అప్పగించేస్తాను. మరోసారి ఈ రాజ్యం వంక కన్నెత్తి కూడా చూడను. కానీ ఒక్క ఏడాదిలో కనుక నువ్వు నా ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతే, నీకు మరణదండను తప్పదు.’’ అని ఆర్థర్కి ఒక షరతు పెట్టాడు ఆ చక్రవర్తి.   చక్రవర్తి మాటలు విన్న ఆర్థర్కు చెప్పలేనంత సంతోషం కలిగింది. ‘‘ఇంతకీ మీ ప్రశ్న ఏమిటో చెప్పారు కాదు?’’ అని ఉత్సాహంగా అడిగాడు.   ‘‘ఆడవాళ్లు నిజంగా కోరుకునేది ఏమిటి? అన్నదే నన్ను వేధిస్తున్న ప్రశ్న. దీనికి ఎలాంటి సందేహానికీ తావు లేనటువంటి సమాధానం నాకు కావాలి.’’ అని సెలవిచ్చాడు చక్రవర్తి.   ‘ఓస్ ఇంతే కదా! దీనికి ఏడాది సమయం ఎందుకు. ఒక్క రోజులో సమాధానం చెప్పేయగలను,’ అనుకున్నాడు ఆర్థర్. కానీ తన అంతఃపురానికి వెళ్లి ఎంతగా ఆలోచించినా తగిన సమాధానం తట్టనేలేదు. డబ్బు, హోదా, బంగారం, సంతానం, భవంతులు, ఆరోగ్యం.... ఇలా ఏ ఒక్కదాన్ని ఎంచుకున్నా మిగతావి లోటుగా కనిపిస్తున్నాయి. తనకు దక్కిన ప్రశ్నకు జవాబు కోసం ఆర్థర్ రాజ్యంలో తనకి తెలిసిన ప్రతి ఒక్కరినీ కదిపి చూశాడు. తన మంత్రులను, సామంతులను, స్నేహితులను, పండితులను అందరినీ అడిగి చూశాడు. ప్చ్! ఎవ్వరి దగ్గరా అతనికి తృప్తి కలిగించే జవాబు దక్కనే లేదు. ఇంతలో ‘ఈ రాజధాని శివార్లలో ఒక మంత్రగత్తె ఉంది. ఆమె దగ్గర ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం లభిస్తుందని చెబుతారు. కానీ మన సమస్య పరిష్కారం అయిన తర్వాత ఆమె కోరినంత మూల్యం చెల్లించి తీరాలి,’ అని విన్నాడు ఆర్థర్.   ఆ మంత్రగత్తెను కలవడం ఆర్థర్కు ఇష్టం లేదు. కానీ ఏం చేసేది! అతనికి విధించిన గడువు మరొక్క రోజులో ముగిసిపోనుంది. దాంతో ఇక చివరి అస్త్రంగా మంత్రగత్తె దగ్గరకి వెళ్లక తప్పలేదు. ఆర్థర్ సందేహాన్ని విన్న మంత్రగత్తె తనకి జవాబు తెలిసినట్లుగా ఓ చిరునవ్వు నవ్వింది. ‘‘నీ ప్రశ్నకి నేను జవాబు చెబుతాను. మరి నాకు కావల్సినది నువ్వు ఇస్తావా!’’ అని అడిగింది. ఆర్థర్కి సరే అనక తప్పలేదు.   ‘‘ఆడది తన జీవితం మీద తనకే అధికారం ఉండాలని అనుకుంటుంది. ఆ గౌరవం ఆమెకి దక్కని రోజున, నువ్వు ఆమెకి ఏమిచ్చినా దండగే! తన వ్యక్తిత్వానికి విలువ లేని చోట ఆమెకి ఏమిచ్చినా... తన మనసులో లోటుని పూడ్చలేవు.,’’ అని చెప్పింది మంత్రగత్తె.   మంత్రగత్తె చెప్పిన జవాబు ఆర్థర్కి చాలాబాగా నచ్చింది. ‘‘నీ జవాబు చాలా బాగుంది. ఇది తప్పకుండా ఆ చక్రవర్తిని తృప్తి పరుస్తుంది. మరి ఇందుకు బదులుగా నీకేం కావాలి?’’ అని అడిగాడు ఆర్థర్.   ‘‘మరేం లేదు! నీ జీవితంలో ఎందరో స్త్రీలు ఉంటారు. తల్లి, భార్య, చెల్లి, కూతురు.... ఇలా ఎందరో ఆడవారితో నీ జీవితాన్ని పంచుకుంటావు. నేను ఇందాక చెప్పిన జవాబుని వారికి అన్వయించు చాలు. వారికంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుందని, తనదైన మనసు ఉంటుందని గుర్తించి గౌరవించు. హద్దులు దాటి వారి జీవితాలను కూడా నువ్వే శాసించాలని ప్రయత్నించవద్దు. ఇదే నువ్వు నాకు ఇచ్చే ప్రతిఫలం,’’ అని చెప్పింది. (ప్రచారంలో ఉన్న జానపద కథ ఆధారంగా) - నిర్జర.      

తెలంగాణను కుదిపేస్తున్న కెల్విన్‌ ఎవరు!

  డైరక్టర్‌ – పూరీ జగన్నాథ్‌, హీరో – రవితేజ, హీరోయిన్‌ – చార్మి, విలన్‌ – సుబ్బరాజు, ఆర్ట్‌ డైరక్టర్ – చిన్నా, కెమెరామెన్ – శ్యామ్ కె. నాయుడు, ఇతర నటులు – ముమైత్‌ఖాన్, తరుణ్‌, నవదీప్‌... ఇదంతా ఏదో రాబోయే సినిమా బృందం కాదు. సినిమారంగానికే సినిమా చూపిస్తున్న డ్రగ్స్‌ కేసులో ఇరుక్కున్నవారి పేర్లు. మా బిడ్డ ముత్యం అని తల్లులు చెబుతున్నా, సిగిరెట్‌ కూడా ముట్టుకోనని వారే చెబుతున్నా... మొత్తానికి ఎక్కడో ఏదో గోల్‌మాల్ జరిగిందన్న విషయంలో మాత్రం ఎవ్వరికీ అనుమానాలు లేవు. ఇలా వీరందరూ అడ్డంగా బుక్కయి పోవడానికి కారణం, ఒక వ్యక్తితో వారికి ఉన్న దగ్గర సంబంధాలే. అతనే కాల్విన్‌! ఇంతకీ ఎవరీ కాల్విన్‌?   కెల్విన్ లేదా కాల్విన్‌గా రోజూ వార్తల్లో నిలుస్తున్న సదరు వ్యక్తి పూర్తి పేరు Calvin Mascarenhas. ఓల్డ్‌ బోయినపల్లిలో గుట్టుగా జీవించే కుటుంబం ఇతనిది. తండ్రి ఒక రిటైర్డ్‌ ఉద్యోగి, తల్లి ఇంకా బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఒక తమ్ముడు. చుట్టుపక్కల వారి దృష్టిలో అదో గౌరవప్రదమైన కుటుంబం. ఆ వీధిలోవారికి కెల్విన్‌ అన్నా కూడా మంచి అభిప్రాయమే ఉంది. కొంతమంది స్నేహితులతో రావడం, సందు చివర కాసేపు ఓ దమ్ములాగి తన ఇంటికి వెళ్లిపోవడం.... ఇదే కెల్విన్‌ గురించి వారికి తెలిసింది. అతని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ శబ్దంతోనే, కెల్విన్ వీధిలోకి వస్తున్నట్లు తెలిసేది.   కెల్విన్‌ చాలా నిదానస్తుడని పేరు. అతను ఇంత పెద్ద డ్రగ్స్‌ రాకెట్‌లో ఇరుక్కున్నాడంటే... బోయినపల్లిలో ఎవ్వరూ ఇప్పటికీ నమ్మేందుకు సిద్ధంగా లేరు. అంతదాకా ఎందుకు! కెల్విన్‌ తండ్రి సైతం ‘మా పిల్లవాడు తన పని తాను చేసుకుపోయే మనిషి. బుద్ధిగా చదువుకునే కుర్రాడు,’ అంటూ వాపోయారు. నిజంగానే కెల్విన్ BBM, MBA లాంటి ఉన్నత విద్య చదివినట్లు తెలుస్తోంది. కానీ పరిస్థితులు వేరే విషయాలు కూడా చెబుతున్నాయి.   కెల్విన్‌ను ఇంతకముందే 2013లో ఓసారి డ్రగ్స్‌ కేసులో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ జులై 2న అతన్ని అరెస్టు చేసినప్పుడు కూడా కెల్విన్‌ దగ్గర పెద్ద మోతాదులో నిషేధిత డ్రగ్స్‌ దొరికాయి. అతనికి ఈ దందాలో తోడ్పడుతున్న అబ్దుల్‌ వాహెద్‌, అబ్దుల్‌ ఖుద్దుస్‌ అనే వ్యక్తులు కూడా పట్టుబడిపోయారు. ఏదో రొటీన్‌ విచారణలో భాగంగా వీరి సెల్‌ఫోన్‌ రికార్డులని పరిశీలించిన పోలీసుల దిమ్మ తిరిగిపోయింది   ఈవెంట్‌ మేనేజర్‌ ముసుగులో కెల్విన్ సినిమాతారలు, హై ఫై సొసైటీలోని యువతకు దగ్గరయ్యేవాడని తేలింది. నిదానంగా వారికి డ్రగ్స్ అలవాటు చేసేవాడు. ఇక ఆ తర్వాత ఎంతటివారైనా కెల్విన్‌ వెంటపడాల్సిందే! ప్రస్తుతం సిట్‌ విచారణలో పాల్గొన్న కొందరు తారలతో కెల్విన్‌కు వందలాది ఫోన్ సంభాషణలు జరిగేవంటే.... అతని వెంట వాళ్లు ఎంతగా వెంపర్లాడేవారో తెలుస్తోంది.   సరే! సినిమాతారలకి ఉండే సమస్యలు, వారుండే ప్రపంచం వేరనుకుందాం. కానీ కెల్విన్‌ విషయంలో ప్రభుత్వం ఇంత సీరియస్‌గా ముందుకు వెళ్లడానికి మరో కారణం ఉంది. అదే చిన్నపిల్లలకు సైతం డ్రగ్స్‌ను అలవాటు చేయడం. పట్టుమని 13 ఏళ్లయినా లేని స్కూల్‌ పిల్లలకు కెల్విన్‌ బ్యాచ్‌ డ్రగ్స్ అలవాటు చేసేది. ఆన్‌లైన్లో కావల్సినంత మొత్తంలో డ్రగ్స్ తెప్పించుకొని, వాటిని రిటైల్‌గా అమ్మేవారు. ఈ దందా కోసం, పసిపిల్లలకి ఐస్‌క్రీం మీద డ్రగ్స్ పూసి అలవాటు చేసిన సందర్భాలు కూడా కనిపించాయి.   నిజానికి డ్రగ్స్‌ అనేది ఒక ఊబిలాంటిది. తెలిసో తెలియకో ఒకసారి డ్రగ్స్ రుచి చూసినవారు, మళ్లీమళ్లీ దాని రుచి కోసం తపించిపోతారు. వాళ్ల మెదడు తీరే మారిపోతుంది. డ్రగ్స్‌ కోసం ఏమైనా చేసేందుకు సిద్ధపడిపోతారు. వాటిని సంపాదించేందుకు డబ్బు కావాలయ్యే! ఆ డబ్బు కోసం తామే స్వయంగా డ్రగ్స్ అమ్మే వ్యాపారంలోకి దిగిపోతారు. కెల్విన్‌ కూడా ఇలా ఊబిలోకి దిగబడిపోయాడని జాలిపడేవారు ఉన్నారు. కెల్విన్‌ తలదన్నే ఎందరో డ్రగ్స్ వ్యాపారులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని హెచ్చరించేవారూ ఉన్నారు. కానీ మన సమాజంలోకి డ్రగ్స్‌ ఎంతగా చొచ్చుకుపోయే చెప్పే గాయంగా కెల్విన్ గుర్తుండిపోతాడు. - నిర్జర

చంద్రుడి మీదే అడుగుపెట్టాం... ఇక జీవితం ఒక లెక్కా!

  1969 జులై 21. అప్పటివరకూ మనిషి సాగించిన ప్రగతి ఒక ఎత్తు. ఆనాడు జరిగిన అద్భుతం ఒక ఎత్తు. అవును. ఆ రోజు మనిషి చంద్రుని జయించాడు. అమెరికాకు చెందిన నీల్ ఆర్మస్ట్రాంగ్ ఆ రోజు మనిషి మీద తొలి అడుగు మోపాడు. అపోలో 11 అనే వ్యోమనౌక ద్వారా చంద్రుని మీదకు చేరుకున్న ఆర్మస్ట్రాంగ్ అక్కడ రెండున్నర గంటలు గడిపాడు.   అంతరిక్షంలోకి వెళ్లాలన్న మనిషి కోరిక ఈనాటిది కాదు. అతని ఊహ తెలిసినప్పటి నుంచీ మనిషి దృష్టి ఆకాశం వైపే ఉండేది. అక్కడి నక్షత్రాలని గమనిస్తూ, సూర్యోదయాన్ని చూస్తూ అతను కాలాన్ని లెక్కించడం మొదలుపెట్టాడు. భూమి మీద నాగరికత ఏర్పరుచుకున్న మనిషి, నిదానంగా ఆకాశాన్ని కూడా జయించాలని అనుకున్నాడు. 1957లో రష్యా స్పుత్నిక్ పేరుతో అంతరిక్షంలోకి మొట్టమొదటి ఉపగ్రహాన్ని పంపింది. ఇక అప్పటి నుంచి చంద్రుడి మీదకు ఎప్పుడెప్పుడు చేరుకోవాలా అన్న ఆలోచన మొదలైంది. ఒక రకంగా రష్యా, అమెరికాల మధ్య ఉన్న కోల్డ్ వార్ కూడా, ఎవరు త్వరగా చంద్రుని మీదకు చేరుకుంటారా అన్న పోటీకి కారణం అయ్యింది.   నిజంగా చంద్రుడు చేరుకోగలడా! చేరకుని అక్కడ కాలు మోపగలడా! కాలు మోపాక బతికి బట్టకట్టగలడా! లాంటి సవాలక్ష ప్రశ్నలు మనల్ని వేధించాయి. మనిషి కనుక చంద్రుని చేరుకుంటే మహాప్రళయం జరుగుతుందన్న శాపాలూ వినిపించాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడికి చేరుకోవాలన్న తపనతో 1967లో అపోలో 1 ను అట్టహాసంగా బయల్దేరదీశారు. కానీ ఏం పొరపాటు జరిగిందో ఏమో... ఆ వ్యోమనౌక నేల మీదే కాలిపోయింది. అందులో ఉన్న ముగ్గురు వ్యోమగాములూ కాలిబూడిదైపోయారు. అపోలో 1 వైఫల్యం తర్వాత  చంద్రుడి మీదకి వెళ్లడం అసాధ్యం అన్న వాదనలకు బలం పెరిగిపోయింది. కానీ మనిషి ఊరుకోలేదు. మళ్లీ చనిపోయే ప్రమాదం ఉందని తెలిసినా వెనకడుగు వేయలేదు. నీల్ ఆర్మస్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్, మైఖేల్ కోలిన్స్ అనే ముగ్గురు వ్యోమగాములు చంద్రుని మీదకి కాలు దువ్వేందుకు బయల్దేరారు. నిజానికి అపోలో 11 బయల్దేరే సమయంలో కూడా ఒక పొరపాటు జరిగింది. దాంతో అపోలో 11 కూడా ఆకాశంలో భస్మం అయిపోవడం ఖాయమనీ, ఒకవేళ చంద్రుని మీదకు వెళ్లినా తిరిగి భూమి మీదకు చేరుకోలేదని అంతా భయపడ్డారు. కానీ ఈసారి అదృష్టం మనిషి పట్టుదలకు తలవంచింది. వ్యోమగాములు క్షేమంగా వెళ్లి విజయంతో తిరిగి వచ్చారు. ఆ విజయాన్ని నమ్మడానికి చాలామందికి చాలాకాలమే పట్టింది. కొందరు ఇప్పటికీ మనిషి చంద్రుడి మీదకు చేరుకోలేదనీ, అవన్నీ సినిమా సెట్టింగులనీ వాదించేవారూ ఉన్నారు. నమ్మకం ఎంత బలమైనదో, అనుమానమూ అంతే బలమైనది కదా!   ఏదేమైనా, చాలామంది దృష్టిలో చంద్రుడి మీద మనిషి కాలు మోపిన క్షణం ఓ మైలురాయి మాత్రమే కాదు... మనిషి తల్చుకుంటే ఏదైనా సాధించగలదన్న నమ్మకానికి రుజువు. అందుకే నీల్ ఆర్మస్ట్రాంగ్ సైతం ‘ఇది నాకు చిన్న అడుగే కావచ్చు. కానీ మానవాళికి గొప్ప విజయం,’ అన్నాడు. ఇప్పటికీ ఎవరన్నా నిరాశలో ఉన్నప్పుడు- ‘చంద్రుడి మీదకే అడుగుపెట్టాం, ఈ సమస్య ఒక లెక్కా!’ అన్న సమాధానం కొత్త స్ఫూర్తిని అందిస్తుంది. - నిర్జర.

మందు తాగిన గంట తర్వాత

  మందు తాగాక ఓ పదినిమిషాల్లోనే మనిషికి మత్తు తెలిసిపోతుంది. మనసుకి మత్తు తెలుస్తోంది అంటే, మన రక్తంలో ఆల్కహాల్ నిల్వలు పెరిగిపోయాయని అర్థం. ఇలా ఓ గంటా గంటన్నర గడిచిన తర్వాత శరీరంలోని ప్రతి అవయవమూ ప్రభావితం అవుతుంది. అదెలాగంటే...   కిడ్నీలు   మద్యానికి diuretic అనే స్వభావం ఉంది. అంటే మన ఒంట్లోని నీటిని నిలవ ఉంచకుండా బయటకు పంపేస్తుందన్నమాట. దీనివల్ల నీటిలో పాటుగా శరీరంలోని ముఖ్యమైన ఖనిజాలు కూడా మూత్రం ద్వారా బయటకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా మనిషి నీరసించిపోతాడు. అతని మెదడులోని నీటిశాతం కూడా తగ్గిపోతే ఫిట్స్ వచ్చే ప్రమాదమూ ఉంటుంది.   మెదడు   ఆల్కహాల్ మెదడు మీద చాలా తీవ్రంగా పనిచేస్తుంది. నిర్ణయం తీసుకునే సామర్థ్యం, జ్ఞాపకశక్తి తగ్గిపోతాయి. అలాంటి స్థితిలో మనిషి ఎంతటి ఉన్మాదానికైనా పాల్పడేందుకు సిద్ధంగా ఉంటాడు. మెదడులోని వేర్వేరు వ్యవస్థల మధ్య సమన్వయం కొరవడుతుంది. మందు తాగిన వెంటనే కొందరు వాంతులు చేసుకోవడానికి కారణం ఇదే!   లివర్ (కాలేయం)   లివర్ ఒంట్లోని చెడు పదార్థాలను వేరుచేసే ఫిల్టర్లాగా పనిచేస్తుంది. అందుకే శరీరంలోకి మద్యం చేరగానే లివర్ మీదే ఎక్కువ భారం పడుతుంది. కాబట్టి క్రమేపీదాని పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది. ఫ్యాటీ లివర్, లివర్ సిరోసిస్ లాంటి సమస్యలు ఏర్పడతాయి. ఒకోసారి లివర్ పూర్తిగా దెబ్బతినేదాకా ఈ వ్యాధి ఉందని బయటపడదు. వ్యాధిని గుర్తించే సమయానికి అది చేతులు దాటిపోయి ఉండవచ్చు!   ఊపిరితిత్తులు   మన ఊపిరి తీసుకునేటప్పుడు, ఆహారం తినేటప్పుడు ఊపిరితిత్తులు చాలా జాగ్రత్తగా పనిచేస్తాయి. కానీ రక్తంలోని అల్కహాల్ మోతాదు దాటినప్పుడు ఈ పనితీరు మందగిస్తుంది. ఫలితంగా పొలమారడం, వాంతులు లాంటి సమస్యలు రావచ్చు. ఊపిరితిత్తులలోని కఫం పేరుకుపోయి న్యుమోనియా వంటి రోగాలకు దారితీయవచ్చు.   జీర్ణవ్యవస్థ   మద్యం మన పేగులలోని పైపూతని దెబ్బతీస్తుంది. దాంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఫలితంగా కడుపు ఉబ్బరంగా ఉండటం, గ్యాస్, అల్సర్, విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలు ఏర్పడతాయి. తిన్న ఆహారంలోని పోషకాలు కూడా సరిగ్గా ఒంటికి పట్టవు.   పాంక్రియాస్   మన శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తిని చూసుకునే అవయవం పాంక్రియాస్. మద్యం మోతాదు మించినప్పుడు ఈ పాంక్రియాస్ పనితీరు దెబ్బతింటుంది. ఫలితంగా శరీరంలోని షుగర్ నిల్వలు ఒక్కసారిగా పడిపోతాయి. చేతులు వణకడం, చెమటలు పట్టడం, కళ్లు అదేపనిగా తిరగడం లాంటి సమస్యలు ఇలా వచ్చేవే! ఆలస్యం చేస్తే మెదడు కూడా దెబ్బతింటుంది.   నాడీవ్యవస్థ   మందు పుచ్చుకున్న కాసేపటికి చేతులూకాళ్లూ తిమ్మర్లు ఎక్కడం, మాట తడబడటం, తూలిపోవడం లాంటి లక్షణాలు గ్రహించవచ్చు. ఇదంతా కూడా మన నాడీవ్యవస్థ మీద ఆల్కహాల్ చూపే ప్రభావమే! మందు తాగాక ఎట్టిపరిస్థితుల్లోనూ బండి నడపకూడదని చెప్పేది కూడా ఇందుకే! - నిర్జర.    

ఇంట్లో దుమ్ముతో... లావైపోతారు!

  రోజంతా నానాకష్టాల పడే మధ్యతరగతి జీవులు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లి సేదతీరుదామా అనుకుంటారు. ఇంట్లోకి అడుగుపెట్టి సోఫాలో కూలబడి వేడివేడి టీ తాగుతూ.... ఇల్లే కదా స్వర్గసీమ! అని మురిసిపోతారు. కానీ అజాగ్రత్తగా ఉంటే ఆ ఇల్లే నరకంగా మారిపోతుందని హెచ్చరస్తున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటారా...   ఇల్లన్నాక రకరకాల వస్తువులు, వాటి నుంచి పేరుకునే దుమ్ము సహజమే. కానీ ఈమధ్యకాలంలో మనం వాడే వస్తువులన్నీ ప్రమాదకరమైన రసాయనాలతో తయారవుతున్నవే కదా! దోమల్ని చంపే మందులు, మంటలు వ్యాపించకుండా వాడే పైపూత, నాన్స్టిక్ వంటపాత్రలు... ఒకటేమిటి షాంపూ దగ్గర నుంచి ప్లాస్టిక్ దాకా అన్నీ రసాయనాలే! ఈ రసాయనాలలో Endocrine-disrupting chemicals (EDC) అనే పదార్థాలు ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు.   ఈ EDCలు మనలోని హార్మోనులని దెబ్బతీస్తాయి. ఫలితంగా కేన్సర్, ఎదుగుదలలో లోపాలు, నరాల బలహీనత, అబార్షన్ వంటి సమసస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకనే చాలా సంస్థలు తమ ఉత్పత్తులలో ఈ తరహా రసాయనాలు లేకుండా జాగ్రత్తపడుతున్నాయి. అయితే ఈ EDCలతో మన శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వు కణాలు పెరిగిపోతాయేమో అన్న అనుమానం పరిశోధకులకి మొదలైంది.   EDCలకీ కొవ్వు కణాలకీ మధ్య సంబంధాన్ని తేల్చపారేసేందుకు కొన్ని ఇళ్లలో దుమ్ముని సేకరించారు. ఇలా సేకరించిన శాంపిల్స్లో రసాయనాలు ఏ తీరున ఉన్నాయి, అవి కొవ్వు కణాల మీద ఎంత ప్రభావం చూపుతున్నాయి అని అంచనా వేసే ప్రయత్నం చేశారు. ఆశ్చర్యంగా దాదాపు 90 శాతం ఇళ్లలో కనిపించిన ధూళికణాలు, మన శరీరంలోని కొవ్వుని ప్రభావితం చేస్తున్నాయని తేలింది. కొవ్వు కణాలు త్వరగా వృద్ధి చెందడానికీ, ప్రమాదకరమైన ట్రైగ్లిజరైడ్స్ పెరగడానికీ ఇవి కారణం అవుతున్నాయట!   ఇంట్లో అనవసరమైన సామాను పోగుచేయకూడదనీ, ఒకవేళ తీసుకున్నా వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలనీ ఈ పరిశోధనతో తేలిపోయింది. సామాను కొనేటప్పుడు కూడా చవకగా దొరుకుతోందనో, సులువుగా పని జరిగిపోతోందనో కాకుండా... నాణ్యత ఉన్న వస్తువునే తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వస్తువుల నుంచి వచ్చే EDC మన ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థలలోకి చాలా తేలికగా ప్రవేశిస్తాయట. ఇక ఆ తర్వాత జరిగే కథ ఇప్పటికే తెలిసిపోయింది కదా! - నిర్జర.

యాంటిబయాటిక్స్‌తో గుండెపోటు!

ఒకప్పుడు ఏదన్నా దగ్గో, జ్వరమో వస్తే చిన్నపాటి మందులతో వాటికి చికిత్స చేసే ప్రయత్నం చేసేవారు. మరీ ప్రాణాల మీదకి వస్తోంది అన్న సందర్భంలోనే యాంటిబయాటిక్‌ మందులను ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు అలా కాదు... రోగంతో రెండ్రోజులు కూడా పడుకునే ఓపిక జనానికి లేదు. చిన్నాచితకా అనారోగ్యాలకి యాంటిబయాటిక్స్ వాడేస్తున్నారు. దీంతో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు! బాక్టీరియా అంటే కేవలం చెడు చేసేది మాత్రమే కాదు. పాలని పెరుగుగా మార్చే సూక్ష్మజీవులు కూడా బాక్టీరియా కిందకే వస్తాయి. అలాంటి మంచి బాక్టీరియా మన శరీరంలోనూ ఉంటుంది. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేది ఈ ఇలాంటి మంచి బాక్టీరియానే! దీనినే gut bacteria అంటారు. యాంటీబయాటిక్‌ మందుల వల్ల ఈ మంచి బాక్టీరియా కూడా చనిపోతూ ఉంటుంది. ఇంతకీ దీనికి గుండెపోటుకీ సంబంధం ఏమిటంటారా! జర్మనీకి చెందిన పరిశోధకులు- గుండెజబ్బులు ఉన్నవారిలో ఇతరత్రా లక్షణాలు ఏమన్నా ఉన్నాయేమో కనుగొనే ప్రయత్నం చేశారు. గుండె సమస్యలు ఉన్నవారి పేగులలో gut bacteria ఏమంత బాగోలేదని తేలింది. పైగా ఉన్న కాస్త బాక్టీరియా కూడా పేగులలోంచి బయటకు వెళ్లిపోతోందని బయటపడింది. ఇలా జీర్ణవ్యవస్థలోని బాక్టీరియా తగ్గేకొద్దీ గుండెజబ్బు తీవ్రత కూడా పెరుగుతున్నట్లు గమనించారు. మన పేగులలో ఉండే Blautia, Faecali తరహా బాక్టీరియా కేవలం ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకే కాకుండా... శరీరంలో వాపుని తగ్గించే ప్రయత్నం చేస్తాయట! దాంతో గుండె ధమనులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. తరచూ యాంటీబయాటిక్స్ వాడటం, పొగ తాగడం, తరచూ క్లోరిన్‌ నీళ్లు తాగడం లాంటి అలవాట్లతో పేగులలోని gut bacteria దెబ్బతిని తీవ్ర అనారోగ్యాలకి దారితీస్తుంది. అదీ విషయం! కాబట్టి ఇక మీదట ఆహారాన్ని జీర్ణం చేసుకునే విషయంలో తరచూ సమస్యలు వస్తుంటే... అదేదో చిన్నపాటి ఇబ్బందిగా కొట్టిపారేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. మన జీర్ణశక్తికీ ఆరోగ్యానికి ఖచ్చితమైన సంబంధం ఉంటుందన్న విషయాన్ని గ్రహించమంటున్నారు. పోషకాహారాన్ని తీసుకోవడం, వ్యసనాలకు దూరంగా ఉండటం, అనవరసంగా యాంటీబయాటిక్స్‌ను వాడకపోవడం ద్వారా పొట్టని పదిలంగా కాపాడుకోమంటున్నారు.   - నిర్జర.

ఆత్మ ఉందని శాస్త్రవేత్తలు కనుక్కొన్నారా?

  మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు అన్న విషయం మీదే మతాలన్నీ ఆధారపడి ఉన్నాయంటారు. అందుకనే ఈ విషయం మీద బోల్డు చర్చలు, వాదనలు సాగుతుంటాయి. కొంతమంది మరో అడుగు ముందుకు వేసి ఫలానా దేశంలో ఆత్మ బరువు ఎంత ఉందో లెక్కకట్టారనీ, ఫలానా చోట ఆత్మని ఫొటో తీశారనీ చెబుతూ ఉంటారు. ఇలాగే రెండేళ్ల క్రితం కొందరు జర్మనీ శాస్త్రవేత్తలు ఆత్మ ఉందని నిరూపించారన్న వార్త గుప్పుమంది. ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా ఈ వార్తే కనిపించింది. ఇండియాటుడే లాంటి పత్రికలు సైతం ఈ వార్తని ప్రచురించాయి. ఈ వార్త ప్రకారం జర్మనీలోని టెక్నిసే విశ్వవిద్యాలయంలో Dr Berthold Ackermann అనే శాస్త్రవేత్త పనిచేస్తున్నారు.   ఈయన ఆధ్వర్యంలో నాలుగేళ్లపాటు శరీరం వేరు, ఆత్మ వేరు అని కనుగొనే ప్రయత్నం జరిగింది. ఈ ప్రయోగం కోసం 900 మందికి పైగా కార్యకర్తలను ఎన్నుకొన్నారట. వీరిలో ఆస్తికులు, నాస్తికులు, హిందువులు, ముస్లింలు.. అన్న బేధాలు లేకుండా అన్నిరకాల వారూ ఉన్నారు. పరిశోధన కోసం ఎన్నుకొన్న అభ్యర్థులందరినీ తాత్కాలిక కోమాకి గురిచేశారు. ఒక ఇరవై నిమిషాల తర్వాత వారిలో తిరిగి కదలికలను తీసుకువచ్చారు. మరణానికి దగ్గరగా ఉన్న ఆ పరిస్థితిలో వారు ఎలాంటి అనుభూతికి లోనయ్యారో తెలియచేయమని చెప్పారు. ఆశ్చర్యంగా అభ్యర్థులంతా కూడా తాము ఒకేరకమైన అనుభూతులు పొందామని చెప్పారు.   తాము శరీరం నుంచి వేరైనట్లుగా తోచడం, ఆకాశంలో తేలిపోతూ ఉండటం, అంతులేని ప్రశాంతత, అప్పటిదాకా ఉన్న భయాందోళనలన్నీ చెరిగిపోవడం, గాలిలో కరిగిపోతున్నట్లుగా అనిపించడం... లాంటి అనుభూతులన్నీ అభ్యర్థులకి కలిగాయట. తాము ఒక కాంతిపుంజం ముందు నిలబడిన భావన కూడా కలిగిందట! మతాలకు అతీతంగా, నాస్తికులకు సైతం ఇలాంటి అనుభవాలు కలిగాయట!   ఈ వార్త World News Daily Report అనే వెబ్సైటులో కనిపించగానే సంచలనంగా మారిపోయింది. వెంటనే ప్రపంచంలోని జాతీయ పత్రికలన్నీ ఈ వార్తని ప్రచురించేశాయి. ఈ వార్తలో ఎలాంటి నిజమూ లేదన్నది చాలామంది వాదన. కానీ వార్తలో పేర్కొన్న ‘ఆత్మానుభూతులు’ మనం ఈ మధ్యకాలంలో చదువుతున్న ఆధ్యాత్మిక పుస్తకాలను దగ్గరగా ఉండటంతో... ఈ వార్త నిజమే అని ఒప్పుకునేవారూ ఉన్నారు. పరిశోధన జరిగిందో లేదో కానీ, జరిగితే ఇదే బయటపడుతుందని ఆస్తికుల వాదన! - నిర్జర.    

పేకాట మాన్పించే మందులు వచ్చేస్తున్నాయి!

  కొంతమందిని చూడండి! ఒక పద్ధతి అనుకుని దాని ప్రకారమే జీవించేస్తుంటారు. ఆ పద్ధతికి ఓ అడుగు అటూ ఇటూ ఒక్క అడుగైనా వేసేందుకు సిద్ధపడరు. మరికొందరు ఇందుకు పూర్తిగా భిన్నం. వాళ్ల తీరుని ఊహించడం కష్టం. మనిషి మనిషికీ మధ్య ఈ తేడాలేంటి. ఒకరు దూకుడుగా ఉంటే, మరికొందరు అతిజాగ్రత్తగా ఎందుకు ప్రవర్తిస్తారు? కాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్తలు, ఈ ప్రశ్నకి జవాబు కనుక్కొనే ప్రయత్నం చేశారు. ఈ జవాబు చాలా సమస్యలకి పరిష్కారం చూపుతుందని చెబుతున్నారు.   దూకుడుగానో, పద్ధతిగానో ప్రవర్తించే సమయంలో మన మెదడులో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయో గమనించే ప్రయత్నం చేశారు శాస్త్రవేత్తలు. ఇందుకోసం కొన్ని ఎలుకలకి ల్యాబొరేటరీలో ఓ పరీక్ష పెట్టారు. వాటికి ఐపాడ్ మీద రెండు దృశ్యాలని చూపించారు. మొదటి దృశ్యాన్ని ఎలుక ముట్టుకున్నప్పుడు, దానికి వెంటనే ఓ స్వీట్ ఇచ్చారు. రెండో దృశ్యాన్ని ఎలుక ముట్టుకున్నప్పుడు కూడా దానికి స్వీట్ ఇచ్చేవారు... కాకపోతే అది ఇవ్వడంలో కాస్త అనిశ్చితి ఉండేది. అంటే స్వీట్ దక్కుతుంది కానీ... దాన్ని ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితిలో ఎలుకలు ఉండేవన్నమాట!   సహజంగానే కొన్నిరకాల ఎలుకలు వెంటనే స్వీట్ తినేందుకు ఇష్టపడి ఎప్పుడూ మొదటి దృశ్యాన్నే ఎన్నుకొనేవి. మిగతా ఎలుకలు స్వీట్ ఎప్పుడు దక్కినా ఫర్వాలేదు అనుకుంటూ రెండో దృశ్యాన్ని ఎన్నుకొనేవి. ఇలా అనిశ్చితికి సిద్ధంగా ఉండే ఎలుకలలోని మెదడు పనితీరు భిన్నంగా ఉన్నట్లు గ్రహించారు. వీరి మెదడులోని orbitofrontal cortex అనే వ్యవస్థ పనితీరు కాస్త నిదానంగా ఉంది. దాంతో ఎదుర్కోబోయే అనిశ్చితిని అవి ఊహించ లేకపోయాయి. ఇక అనిశ్చితికి సిద్ధపడే ఎలుకల మెదడులో gephyrin అనే ప్రొటీను కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నట్లు తేలింది.   మనిషికీ మనిషికీ మెదడులో ఉండే తేడాల వల్లే వారి ప్రవర్తనలో మార్పులు ఉంటాయని తేలిపోయింది. దాంతో మున్ముందు ప్రవర్తనకి సంబంధించి ఎలాంటి సమస్యనైనా మందులతో నివారించవచ్చని ఆశిస్తున్నారు. ఆటిజం వంటి అనేక సమస్యలకి ఈ మందుతో నివారణ సాధ్యమంటున్నారు. అంతేకాదు! పేకాట ఆడేవారిలో అనిశ్చితిని ఇష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఇక నిరంతరం పద్ధతిగా ఉండాలనుకునేవారిలో చాదస్తం ఎక్కువగా కనిపిస్తుంది. Gephyrin ప్రొటీనులో మార్పులు తీసుకురావడం వల్ల పేకాట, చాదస్తంలాంటి సమస్యలని కూడా మందులతో నివారించవచ్చునట! - నిర్జర.    

ఉన్నవాడో లేనివాడో... మొహం చూస్తే తెలిసిపోతుంది

‘Face is the index of the mind’ అంటూ ఉంటారు పెద్దలు. మన మొహం చూస్తే, మనసులో ఏముందో చెప్పేయవచ్చన్నది వారి భావన. కానీ ఒకరి మొహం చూసీచూడగానే... ఇతను ఉన్నవాడనో, లేనివాడనో చెప్పేయవచ్చా! మొహంలో ఎలాంటి భావనా కనిపించకపోయినా, అతని అంతస్తుని పసిగట్టవచ్చా! అంటే భేషుగ్గా అంటున్నారు పరిశోధకులు. టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు... మొహాన్ని చూసి మనిషి ఆస్తిపరుడా, కాదా అన్న విషయాన్ని ఎంతవరకు పసిగడతామో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇందుకోసం 60వేల డాలర్ల ఆదాయం ఉన్నవారు కొందరినీ, లక్షకు పైగా డాలర్ల ఆదాయం ఉన్నవారు కొందరినీ ఫొటోలు తీశారు. ఈ ఫొటో తీసే సమయంలో వారి మొహంలో చిరునవ్వూ, బాధా, కోపం లాంటి ఏ భావమూ లేకుండా ఉండేట్లు జాగ్రత్తపడ్డారు.   పరిశోధకులు తాము తీసిన ఫొటోలని కొందరు వాలంటీర్లకు చూపించారు. విచిత్రంగా సగానికి పైగా సందర్భాలలోనే అవతలి మనిషి పేదా, గొప్పా అన్న విషయాన్ని ఇట్టే పసిగట్టేశారట. ఎదుట ఉన్నది ఆడామగా, తెల్లవాడా నల్లవాడా అన్న బేధాలేవీ ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేయలేదు. చూసీ చూడగానే ఠక్కున ఫొటోలోని వ్యక్తి ఆర్థిక పరిస్థితిని తేల్చేశారు. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా... ఇదంతా కూడా మన మెదడుకి ఉన్న సామర్థ్యమే అంటున్నారు. మొహాలని పసిగట్టడంలో మన మెదడు మహా దిట్ట అట. ఆఖరికి మబ్బులని చూసినా కూడా, వాటిని ఏదో ఒక మొహంతో పోల్చుకోగలదు. ఎదుటివారు సంతోషంగా ఉన్నారా, విరక్తిగా ఉన్నారా అన్నది కూడా దానికి తెలిసిపోతుంటుంది. అదే సూత్రంతో వాళ్లు పేదా గొప్పా అన్నది అంచనా వేసేస్తుంది.   అనారోగ్యం, కుటుంబ కష్టాలు దీర్ఘకాలం ఉండకపోవచ్చు. కానీ పేదరికంలో పుట్టినవారు దాని నుంచి బయటపడటానికి చాలా ప్రయత్నమే చేయాల్సి ఉంటుంది. ఆ పేదరికం కలిగించే అసంతృప్తి, బాధ వారిని వేధిస్తుంది. ఒక మనిషి సుదీర్ఘకాలం సంతోషంగా ఉన్నా, బాధగా ఉన్నా... కొన్నాళ్లకి ఆ భావం అతని మొహం మీద స్థిరపడిపోతుందట! అంటే ఓ వయసు వచ్చిన తర్వాత మనం ఏ భావమూ లేకుండా ఉన్నా కూడా, మన పరిస్థితి అన్నది అవతలి మనిషికి తెలిసిపోతుందన్నమాట!   మన ఆర్థిక పరిస్థితి అవతలివారికి తెలియడం వల్ల నష్టం ఏమిటి? అన్న అనుమానం రావచ్చుగాక! ఏ ఉద్యోగానికో, పెళ్లిచూపులకో, అప్పు కోసమో వెళ్లినప్పుడు... సహజంగానే అవతలి వ్యక్తికి మన మీద తెలియకుండానే ఒక దురభిప్రాయం కలిగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మన పేదరికం మరింత శాపంగా పరిగణిస్తుంది. పరిశోధకులు దీనికి నివారణోపాయాన్ని చెప్పలేదు కానీ... జీవితంలో ఎలాంటి సమస్యనయినా చిరునవ్వుతో ఎదిరించే ధైర్యం, ఉన్నదానిలో తృప్తిగా ఉండే తత్వం ఉంటే మన మొహంలో ఎలాంటి పేదరికమూ కనిపించకపోవచ్చు. - నిర్జర.