సడన్‌గా పవన్‌పై కోమటిరెడ్డి దాడి వెనక మర్మం ఏంటో?
posted on Dec 2, 2025 @ 8:43PM
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటు ఏపీలోని వైసీపీ ఆపై తెలంగాణలోని బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్ల పాలిట పంచ్ బ్యాగ్ అయ్యారా? అంటే అవుననే తెలుస్తోంది. అప్పుడెప్పుడో పవన్ రాజోలు పర్యటన చేసినపుడు.. అన్యాపదేశంగా ఒక మాట అనేశారు. అదేంటంటే ఏపీ, తెలంగాణ విడిపోవడానికి కారణం కోనసీమలోని పచ్చదనమే అనేశారు. అందుకే ఇక్కడి కొబ్బరి చెట్లు మోడువారిపోయాయని అనాలోచితంగా అనేశారాయన.
తన చేతిలో మైకు ఉన్నదన్న ఆలోచనలో పవన్ ఉన్నట్టు లేరు. ఆపై అక్కడి జనాన్ని ఏదో ఊరడించడానికి కూడా ఆయనిలా అని ఉంటారేమో తెలీదు. తాను ఉప ముఖ్యమంత్రిననీ.. ఇలాంటి మాటలు అనాలీ, అనకూడదన్న సోయ కూడా పవన్ కి ఆ టైంలో లేక పోయి ఉండొచ్చు. విచిత్రమైన విషయమేంటంటే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన పవన్ అన్న విషయం ఒక్కోసారి మరచి పోయే పవన్ ఇంట్లో వాళ్ల ముందు మాట్లాడినట్టు ఆ ప్రాంత ప్రజల ముందు మాట్లాడేశారు. మన కోనసీమకు తెలంగాణ వాళ్ల నరదిష్టి తగిలి ఉంటుందని.. అనేశారు. అందుకే ఆ చెట్లు అలా మోడు వారి పోయాయని తేల్చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
అయితే ఈ వియంలో ఫస్ట్ రియాక్టయ్యింది మాత్రం బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. ఆపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. అటు పిమ్మట వైసీపీ మాజీ మంత్రి అంబటి సైతం ఈ విషయంపై తనవైన సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఇక ఎమ్మెల్సీ బల్మూరి, మంత్రి వాకిటి శ్రీహరి తదితర మంత్రులు కూడా పవన్ని తిట్టడంలో తలో నాలుక వేశారు. ఇక అందరూ అయిపోయారు. ఇక్కడితో ఈ మొత్తం వ్యవహారం సద్దుమణిగినట్టేనని భావించినపుడు సడెన్ సర్ ప్రైజ్ గా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి రియాక్టయ్యారు. దొంగలు పడ్డ ఆర్నెల్ల తర్వాత ఏంటీ మోత.. అన్న ప్రశ్నకు ఆస్కారమేర్పడింది.
ఈ మధ్య కాలంలో కోమటిరెడ్డికి మంత్రిమండలిలో తగిన ప్రయారిటీ ఇస్తున్నట్టు కూడా కనిపించడం లేదు. ఇందుకు రిలవెంట్ గా ఒక ఎగ్జాంపుల్ ని బట్టీ చూస్తే.. సీఎం రేవంత్ సినిమాటోగ్రఫీ మంత్రి అయిన కోమటిరెడ్డికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే జూబ్లీ ప్రచారంలో.. సినిమా వారిపై వరాల జల్లు కురిపించారు. .సంబంధిత మంత్రి అయిన కోమటిరెడ్డి తో సంబంధం లేకుండా సినిమా వారందరితో భేటీ అయ్యారు కూడా. ఇంకా ఎన్నెన్నో వరాలను సినీ కార్మికులపై కుమ్మరించారు.
దీంతో అందరిలోనూ ఒక అనుమానం.. సంబంధిత మంత్రి. కోమటిరెడ్డి ఆఫ్ ప్రెజన్స్ లో.. సీఎం ఈ తరహా వ్యవహారశైలి ఏంటన్న ప్రశ్న తలెత్తింది. దీనంతటికీ కారణం కోమటిరెడ్డి మంత్రి పదవి ఊడిపోనుందన్న మాట వినిపించింది. మరి వీటన్నిటి నడుమ కోమటిరెడ్డి తన ఉనికి కాపాడుకోవడంలో భాగంగానే పవన్ పై ఈ కామెంట్లు చేశారా? అన్న అనుమానం వస్తోంది.
తన మంత్రిత్వానికి ప్రమాదం ఉందనో ఏమో ఇటీవల రేవంత్ రెడ్డి కోసం ప్రత్యేక పూజలు చేయించారు కోమటిరెడ్డి. వీటన్నిటిని బట్టీ చూస్తుంటే కోమటిరెడ్డి ఏదో ట్రబుల్లో ఉన్నట్టు కనిపిస్తోందని అంటున్నారు కొందరు. అన్న వెంకటరెడ్డి పరిస్థితి ఇలా ఉందంటే తమ్ముడు రాజగోపాల్ రెడ్డి వ్యవహారం చూస్తే.. మంత్రి పదవి ఇవ్వలేదని ఎప్పటి నుంచో బుంగమూతి పెట్టుకుని కూర్చున్నారు. మరి ఈ నల్గొండ బ్రదర్స్ ఫ్యూచరేంటి? తెలియాల్సి ఉంది.