తెలంగాణలో ఈ ఐదు జిల్లాలు సేఫ్!

ఈ రోజు ప్రకటించే మార్గదర్శకాలను బట్టి, తెలంగాణా కు భారీ రిలీఫ్ కలిగే అవకాశం కనిపిస్తోంది. కరోనా వైరస్ తెలంగాణలో ఇప్పటివరకూ ఐదు జిల్లాలను అసలు తాకనేలేదు. మరో ఆరు జిల్లాల్లో కరోనా ప్రభావం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఈ 11 జిల్లాల్లో కరోనా కారణంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ నిబంధనల నుంచి ప్రజలకు కొంతమేరకు ఉపశమనం లభించవచ్చని తెలుస్తోంది. నిబంధనల మినహాయింపుపై రాష్ట్రాల ప్రభుత్వాలదే తుది నిర్ణయమని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో, నిబంధనల తొలగింపుపై కేసీఆర్ ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నారాయణ పేట, వనపర్తి, వరంగల్‌ రూరల్‌, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఇంతవరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో మహబూబాబాద్‌, సిద్దిపేట, ములుగు, నాగర్‌ కర్నూలు, జగిత్యాల తదితర జిల్లాల్లో ఒకటి నుంచి రెండు కేసులు మాత్రమే ఉన్నాయి. అవి కూడా మార్చిలో వెలుగులోకి వచ్చినవే. ఏప్రిల్ లో ఈ జిల్లాల నుంచి ఒక్క కేసు కూడా రాకపోవడంతో ఈ ప్రాంతాలనూ మినహాయింపు జాబితాలో చేర్చేందుకు వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే, మొత్తం 30 సర్కిళ్లు ఉండగా, హయత్ నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో మాత్రమే ఒక్క కేసు కూడా రాలేదు. మిగతా 28 సర్కిళ్లలో కేసులు ఉండటంతో, ఈ ప్రాంతంలో నిబంధనలను సడలిస్తే, ప్రజలను నియంత్రించడం కష్టమవుతుందన్న నేపథ్యంలో, ప్రస్తుతానికి మినహాయింపులు ఉండక పోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇక కరోనా సోకని, ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చినా, అన్ని కార్యకలాపాలనూ జిల్లాల సరిహద్దుల వరకే పరిమితం చేసేలా అధికారులు ప్రణాళికలను రచిస్తున్నారు. జిల్లాల సరిహద్దులను మూసే ఉంచుతారని తెలుస్తోంది. ఇక ఈ ప్రాంతాల్లో వ్యవసాయ పనులను పూర్తి స్థాయిలో చేసుకునేందుకు, చిన్న ఫ్యాక్టరీలు, ఇతర వ్యాపారాలను అనుమతించడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలకు ఊతం ఇచ్చినట్టు అవుతుందని, ప్రభుత్వానికి కొంతయినా ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.  అయితే, ఇవన్నీ కూడా పూర్తిగా షరతులకు లోబడే వర్తిస్తాయి.

ఏమ్మా.. నిర్మలమ్మా....  నువ్వు సెప్పిందేంది.. సేసిందేంది...

* ఆర్ధిక మంత్రి మారటోరియాన్ని లైట్ తీసుకున్న బ్యాంకులు  * ఎప్పటిలానే,  లోన్ కిస్తీలను డిడక్ట్ చేస్తున్న బ్యాంకులు  * ఓ వైపు జీతాల్లో కోత, మరో వైపు ఇన్ స్టాల్ మెంట్ల వాత  * హామీ ఇచ్చిన స్టేట్ బ్యాంక్ కూడా సైలెంట్ గా కిస్తీల కోత మొదలెట్టింది  ఏదో పోన్లే గదా అని మా నాయుడు గారు ( అదేనండీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు) అవకాశమిస్తే, మా రాష్ట్రం నుంచి రాజ్యసభ కు వెళ్లి, మాకే వెన్నుపోటు పొడిచిన నిర్మలమ్మ గారూ...(కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్).. ఇప్పుడు ఇంకోసారి బ్యాంకు ఖాతాదారులను బిచ్చగాళ్ల స్థాయికి తీసుకువస్తున్నావు గదమ్మా.. .. మా ఆంధ్ర బ్యాంకు ను తీసుకెళ్లి, అదేదో నార్త్ బ్యాంక్ లో మెర్జ్ చేశావు...ఇప్పుడేమో, ఆర్ బీ ఐ వాళ్ళ చేత ..మూడు నెలల మారటోరియం అన్ని లోన్స్ మీద ఉంటుందని చెప్పించి, యధావిధిగా లోన్ ఇన్స్టాల్ మెంట్ కట్ చేయించావు... నువ్వు మామూలు మంత్రివి కాదమ్మా.. ..జనాన్ని ఈ స్థాయిలో పిచ్చివాళ్ల ను చేయగల మీ మేధో శక్తి ని చూసే, నరేంద్ర మోడీ మీకు రెండు సార్లు మంత్రి పదవి ఆఫర్ చేసి ఉంటారు. కిందటి నెల నువ్వు ప్రకటన చేసే సమయానికే ఆ నెల కిస్తీ ని డిడక్ట్ చేసుకున్న బ్యాంకులు, ఈ నెల హోమ్ లోన్స్ కిస్తీలు కూడా మినహాయించుకోవటం మొదలెట్టాయి. చివరికి, ప్రభుత్వ రంగం లోని అతి పెద్ద బ్యాంకు అయిన- భారతీయ స్టేట్ బ్యాంక్ ( ఎస్ బీ ఐ) కూడా ఇచ్చిన మాట ను గట్టున పెట్టి మరీ హోమ్ లోన్ కిస్తీలను మినహాయించుకోవటం మొదలెట్టింది.  ఈ కరోనా కంటిన్యూ అవుతోంది గదా, నా లోన్ కిస్తీ ఆపేస్తారా? , నా క్రెడిట్ కార్డు బిల్ క్యాన్సిల్ చేస్తారా? అంటూ పిచ్చి జనం వేసే వెర్రి ప్రశ్నలకు ఒకటే ఆన్సర్ ఇప్పుడు. అవేవీ ప్రాక్టికల్ గా సాధ్యం కావని నిర్మల సీతారామన్ బ్యాంకుల ద్వారా చెప్పించేశారు. కరోనా లాక్ డౌన్ నేపధ్యం లో, అన్ని తరహా లోన్ల మీద మారటోరియం విధించుకునే వెసులుబాటును బ్యాంకులకు కల్పిస్తూ, ఆర్ బీ ఐ కిందటి నెల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మొత్తం అన్ని బ్యాంకులు కూడా అన్ని తరహా టర్మ్ లోన్ల మీద మూడు నెలల మారటోరియం విధించుకునే వెసులుబాటుని ఆర్ బీ ఐ కల్పించింది. ఈ నిర్ణయం వల్ల, బ్యాంకు కస్టమర్లు మూడు నెలల పాటు తమ కిస్తీలను కట్టకుండా ఉండే సదుపాయాన్ని బ్యాంకులు కల్పించవచ్చునన్న మాట.  ఇక్కడే ఆర్ బీ ఐ ఒక పీట ముడి వేసింది. బ్యాంకులకు తాము మారటోరియం  సదుపాయం మాత్రమే కల్పించామని, దీనిపైన తదుపరి నిబంధనలు రూపొందించాలని, ఈ విషయం లో ఒక వేళ వ్యక్తిగత స్థాయిలో ఈ ఎం ఐ లను మూడు నెలలపాటు సస్పెండ్ చేయాలా, లేక బ్యాంక్ లెవెల్ లో నిర్ణయం తీసుకోవాలా అనేది ఇంకా ఒక నిర్ణయం అయితే జరగలేదనేది ఆర్ బీ ఐ సూత్రీకరణ.  ఎస్ బీ ఐ చీఫ్ రజనీష్ కుమార్ అయితే, అన్ని టర్మ్ లోన్లు క్యాన్సిల్ అయినట్లే అని ధృవీకరించారు. కానీ, వాస్తవానికి అది జరగలేదు. లోన్లు తీసుకున్న బ్యాంక్ కస్టమర్ల ఖాతాల నుంచి లోన్లు ఆటొమ్యాటిక్ గా డిడక్ట్ అవుతాయా, లేక, కస్టమర్లు వ్యక్తిగత స్థాయిలో ఆ ఆప్షన్ ను ఎంచుకొవాలా అనే అంశం మీద ఆర్ బీ ఐ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే, ఆ ఇచ్చిన క్లారిటీ లో లొసుగుల కారణంగా, బ్యాంకులు శుభ్రంగా కిస్తీలు డిడక్ట్ చేయటం మొదలెట్టాయి.  అలాగే, ఒక వేళ లోన్ కిస్తీలు చెల్లించకపోతే, ఖాతాదారుల క్రెడిట్ స్కోర్ మీద దాని ప్రభావం పడుతుందా అనే ప్రశ్నకు, ఏ ప్రభావమూ ఉండదు అనే బదులిస్తోంది ఆర్ బీ ఐ. అలాగే, ఆర్ బీ ఐ తీసుకున్న కిస్తీ ల మూడు నెలల వాయిదా నిర్ణయాన్ని, అన్ని కమర్షియల్ బ్యాంకులు, అంటే రీజనల్ రూరల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, అఖిల భారత స్థాయిలో ఉన్న ఆర్ధిక సంస్థలు, NBFC, అంటే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు అన్నీ కూడా ఈ మారటోరియం సదుపాయాన్ని కల్పించవచ్చును.  అయితే, ఆర్ బీ ఐ దీని మీద మరో క్లారిటీ కూడా ఇచ్చింది. ఇది రుణాల రద్దు కిందకి రాదు, కేవలం కిస్తీల చెల్లింపు లో కల్పిస్తున్న వాయిదా సదుపాయమే కానీ, మూడు నెలల పాటు రీ పేమెంట్ షెడ్యూల్ తో పాటు, తదుపరి కిస్తీ చెల్లింపు తేదీలన్నీ కూడా మూడు నెలల తర్వాత ఉండేలా చూడాలనేది బ్యాంకులకు ఆర్ బీ ఐ సూచన. అంటే దానర్ధం, మూడు నెలల రుణ వాయిదాలన్నీ, ఒకే సారి జూన్ నెలలో చెల్లించాలనే అనుమానాల మీద మాత్రం ఆర్ బీ ఐ క్లారిటీ ఇవ్వలేదు. ఆర్ బీ ఐ పూర్తి గైడ్ లైన్స్ వెలువరిస్తే కానీ, దీని మీద స్పష్టత వచ్చే అవకాశం లేదు. అయితే, ఈ మూడు నెలల మారటోరియం -ఖాతాదారుల రుణాల మీద అసలు, ఇంకా వడ్డీ కి కూడా వర్తిస్తుందా అనే దాని మీద మాత్రం, ఆర్ బీ ఐ క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది మార్చ్ 1 నాటికి ఉన్న అన్ని రకాల రుణాల మీద, మూడు నెలల పాటు రుణ కిస్తీల అసలు, ఇంకా వడ్డీ మీద మినహాయింపు ఉంటుందని ఆర్ బీ ఐ వివరించింది. ఇవన్నీ అబద్హం అని తేలిపోయింది.  హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లు, నిశ్చిత కాలపరిమితి ఉన్న ఆటో లోన్లు వంటివి అన్నీ, అంటే- మొబైల్, ఫ్రిజ్, టీ వీ లాంటి -కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్స్ కూడా ఆర్ బీ ఐ ప్రకటించిన మారటోరియం పరిధిలోకి వస్తాయని ఆర్ బీ ఐ స్పష్టం చేసింది.  అయితే క్రెడిట్ కార్డు పేమెంట్స్ మాత్రం దీని పరిధిలోకి రావాలి. అవి రివాల్వింగ్ క్రెడిట్ కిందకు వస్తాయి కాబట్టి, ఆ ప్రసక్తే ఉత్పన్నం కాదని ఆర్ బీ ఐ సూత్రీకరణ. అలాగే, క్రెడిట్ కార్డ్స్ మీద తీసుకున్న రుణాల విషయం లో మారటోరియం వర్తిస్తుందా, లేదా అనే దాని మీద ఆర్ బీ ఐ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఒక వేళ ఎవరైనా ఒక ఫ్యాక్టరీ నెలకొల్పే నిమిత్తం తీసుకున్న రుణాలకు ఇది వర్తిస్తుందా అనే దాని మీద మాత్రం, ఆయా బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుందని ఆర్ బీ ఐ క్లారిటీ ఇచ్చింది.  ఇక వ్యాపారాల గురించి, వాటి మీద తీసుకున్న రుణాల గురించి మాట్లాడుతూ, ఆర్ బీ ఐ చెప్పేదేమిటంటే -వ్యాపారాల నిమిత్తం తీసుకున్న వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ మీద వడ్డీ చెల్లింపుల కు మినహాయింపు ఇప్పటికే ఇచ్చిన విషయాన్ని స్పష్టం చేసింది. మార్చ్ 1 నాటికి ఉన్న లోన్స్ మీద ఈ మూడు నెలల కాలానికి గానూ పేరుకుపోయిన వడ్డీని, ఈ మారటోరియం ముగిసిన తర్వాతనే వాసులు చేస్తారనేది కూడా ఆర్ బీ ఐ మాట. అయితే, రుణ ఒప్పందాలను కానీ, ఆస్తుల విభజన అంశాలను కానీ ఈ మారటోరియం ఏ రకంగానూ ప్రభావితం చేయదనేది ఆర్ బీ ఐ మాట. ఇవన్నీ వినటానికి బావుంటాయి. ఇంకా మీరు ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ మాటలను నమ్ముతూ ఉంటె, మిమ్మల్ని ఆ మోడీ గారే కాపాడాలి.

హైదరాబాద్ లో వీరికెలా కరోనా.. సోకింది? 3వ ద‌శ వ‌చ్చేసిందా?

పాజిటివ్ గా తేలిన హైదరాబాద్ గాంధీనగర్ కు చెందిన 48 ఏళ్ల వ్యక్తి పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. కాళ్లు చేతులు పనిచేయక ఇంటిలోనే ఉంటున్నాడు. వారి కుటుంబ సభ్యులు కూడా ఇంటికే పరిమితమయ్యారు. వీళ్లలో ఎవరికి బయట లింకులు లేవు. అయినా సరే పక్షవాతం సోకిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం వైద్యులను షాక్ కు గురిచేసింది. అలాగే మ‌రో కేసులో....టౌలిచోకీకి చెందిన 8 ఏళ్ల బాలికకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఆ చిన్నారి కుటుంబాలకు సేమ్ ఎవరితోనూ లింక్స్ లేవు. అయినా ఆమెకు కూడా కరోనా సోకింది. ఈ రెండు కేసులకు మర్కజ్ తోకానీ.. విదేశీ ట్రావెల్ హిస్టరీ కానీ లేకపోవడం వైద్యవర్గాలను ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. ఈ కేసుల్లో ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ లేకున్నా కానీ కరోనా సోకడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి వారు ఇంకెంతమంది ఉంటారోనన్న భయం నెలకొంది. కొంతమందిలో లక్షణాలు బయటపడడంలేదు.వారు బయట తిరుగుతూ అంటించేస్తున్నారు. ఇలా ఎవరి ద్వారా వ్యాపిస్తుందో తెలియని కేసులు సామూహిక దశ అని ఇది చాలా డేంజర్ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజురోజుకు సంఖ్య తగ్గకపోగా విపరీతంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో అనూహ్యమైన కరోనా కేసులు వెలుగుచూస్తుండడం వైద్యవర్గాలను సైతం షాక్ కు గురిచేస్తోంది.

కేంద్రం విడుద‌ల చేసిన లాక్‌డౌన్ మార్గదర్శకాలు!

1. అన్ని జాతీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల సర్వీసులు మే 3 వరకు ర‌ద్దు. 2. భద్రత విధులకు తప్ప బస్సు, రైలు మెట్రో సర్వీసులు ర‌ద్దు. 3. అత్యవసర వైద్యానికి మినహా అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా ప్రయాణాలపై నిషేధం. ఎవరూ సరిహద్దులు దాటడానికి వీల్లేదు. 4. ట్యాక్సీ సర్వీసులకు కూడా అనుమతి లేదు. 5. నిత్యావసరాల పంపిణీ మినహా మిగతా అన్ని కార్యక్రమాలకు రద్దు. 6. మాల్స్, థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, జిమ్స్, స్పోర్ట్ కాంప్లెక్స్‌లు, బార్స్, ఆడిటోరియంలు బంద్‌. 7. సామాజిక, రాజకీయ, క్రీడా, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై నిషేధం. 8. మత ప్రదేశాలలో పెద్ద ఎత్తున ప్రార్థనలకు అనుమ‌తి లేదు. 9. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా. 10. హాట్‌స్పాట్స్, కంటెయిన్‌మెంట్ జోన్‌లలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య శాఖ గతంలో సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. హాట్‌స్పాట్స్‌, కంటెయిన్‌మెంట్ జోన్‌లను రాష్ట్ర, కేంద్రపాలిత ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు గుర్తించాలి. ఈ ప్రదేశాలలో సాధారణ కార్యకలాపాలకు అనుమతిలేదు. 11. ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు 20 మందికి అనుమ‌తి. 12. ఆరోగ్య కేంద్రం, ఔషధాల విక్రయాలకు అనుమ‌తి. 13. ఔషధ పరిశ్రమలలో ఉత్పత్తికి అనుమతి. 14. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వరంలోని వ్యవసాయ మార్కెటింగ్ కార్యకలాపాలకు అనుమతి. వ్యవసాయ, ఉద్యానవన విభాగాలకు అనుమతి. 15. వ్యవసాయ పరికరాలను అద్దెకు ఇచ్చే పరిశ్రమలకు అనుమతి. 16. ఆక్వా ఉత్పత్తులు క్రయ విక్రయాలకు, బ్యాంకు కార్యకలాపాలకు అనుమతి. 17. వృద్ధాశ్రమాలు, అనాథశరణాలయాలు నిర్వహణకు ఎలాంటి ఆంక్షలు లేవు. 18. ఉపాధి హామీ పనులు, భవన నిర్మాణ పనులకు షరతులతో కూడిన అనుమతులు మంజూరు. ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తరించరాదని, సమీపంలో ఉన్నవారితోనే పనులు చేపట్టాలి. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, సాగునీటి, పారిశ్రామిక ప్రాజెక్టు నిర్మాణ పనులకు అనుమతి. ఉపాధి కూలీలు మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలి. 19. ఎరువులు, పరుగుల మందులు, విత్తనోత్పత్తి దుకాణాలు తెరిచేందుకు అనుమతి. పాలకు సంబంధించిన వ్యాపారాలు, పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ పరిశ్రమ, టీ, కాఫీ, రబ్బరు సాగును కొనసాగించవచ్చు.

హెచ్1బీ వీసా గ‌డువు పెంపు!

ప్రస్తుతం ఉన్న హెచ్1బీ వీసాల వాలిడిటీని ఆరు వారాల నుంచి ఎనిమిది నెలలకు పొడిగిస్తూ అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సిఐఎస్) తమ వెబ్‌సైట్‌లో కీలక నోటిఫికేషన్ పోస్ట్ చేసింది. కరోనా వైరస్ విస్తరణ నేపథ్యంలో వీసాల గడువు పొడిగింపు నిర్ణయాన్ని వెను వెంటనే పరిష్కరిస్తామని తెలిపింది. అలాగే ప్రతీ దరఖాస్తును పరిశీలించి ప్రాసెస్ చేస్తామని తెలిపింది. అయితే గడువు పొడిగింపునకు సంబంధించి విశ్వసనీయమైన సాక్ష్యాలను దరఖాస్తు దారుడు సమర్పించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వీసాల గడువు ముగిసి అమెరికాలో చిక్కుకున్న భారతీయ పౌరులకు ఈ నిర్ణయం పెద్ద ఊరట నిస్తుందని ఇమ్మిగ్రేషన్ అధికారి ఒకరు పేర్కొన్నారు. కోవిడ్-19 పరిణామాల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయ పౌరులకు హెచ్-1 బీ సహా, వివిధ రకాల వీసాల చెల్లుబాటును పొడిగించాలని లాస్ట్ వీక్ అమెరికాకు భారత ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. కరోనావైరస్ సంక్షోభం నేపథ్యంలో వలసదారులు వీసా గడువు ముగిసిన తరువాత అమెరికాలో ఉండేందుకు గడువు పొడిగింపు (ఈవోఎస్) లేదా స్టేటస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారా బహిష్కరణ వంటి ఇతర పరిణామాలను తప్పించుకోవచ్చు. హెచ్-1 బీ వీసా దారులు ఒకవేళ ఉద్యోగాలు కోల్పోయినట్టయితే అమెరికాలో ఉండే గడువును 60 రోజుల నుంచి 8 నెలలు వరకు పొడిగించినట్టు తెలిపింది.

ఒకే కుటుంబంలో 17 మందికి క‌రోనా!

హైదరాబాద్ లో ఒకే కుటుంబానికి చెందిన 17 మందికి కరోనావైరస్ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధరణ అయిందని అధికారులు ధ్రువీకరించారు. వీరిలో ఒక 10 నెలల శిశువు నుంచి 12 ఏళ్ళ లోపు పిల్లలు ఆరుగురు ఉన్నారు. హైదరాబాద్‌లోని తలాబ్‌కట్టకు చెందిన ఒక మహిళ ఏప్రిల్ 10న ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందారు. ఆమెకు కరోనావైరస్ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఏప్రిల్ 13న ఆమెకు కరోనా పాజిటివ్ అని నిర్ధరణ అయింది. దాంతో, వైద్య అధికారులు అప్రమత్తమై ఆ మహిళ కుటుంబ సభ్యులకు, వారితో కాంటాక్ట్‌లోకి వచ్చిన వారికి కలిపి మొత్తం 41 మందికి పరీక్షలు నిర్వహించారు. వారిలో 17 మందికి కోవిడ్ వ్యాధి ఉన్నట్లు నిర్ధరణ అయింది. వారందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన 24 మందిని కూడా ప్రభుత్వ నిజామియా హాస్పిటల్‌లో క్వారెంటైన్‌కు తరలించారు. అయితే, ఆ మహిళకు వైరస్ ఎలా సోకిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలో ఒకే కుటుంబంలో ఇంత మందికి వైరస్ సోకడం ఇదే మొదటిసారి.

దేశ ప్రజలకు రైల్వే శాఖ ప్రత్యేక విజ్ఞప్తి...

దేశవ్యాప్తంగా మే 3 వరకూ... ప్రయాణికుల రైళ్లేవీ నడపట్లేదనీ... ప్రత్యేక రైళ్లేవీ నడపట్లేదనీ భారతీయ రైల్వే శాఖ ప్రత్యేక ప్రకటన జారీచేసింది. దయచేసి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరింది. ఏ ప్రకటనైనా అధికారికంగా వచ్చేది మాత్రమే నమ్మాలని ప్రజలను కోరింది. ఈ విషయంపై ప్రజలందరికీ అవగాహన కలిగించాలని మీడియా సంస్థలను రైల్వే శాఖ కోరింది. మే 3 వరకూ... ప్రజలెవ్వరూ... రైల్వే స్టేషన్ల దగ్గరకు రావొద్దని కోరింది. ఇండియాలో కరోనా వచ్చిన కొత్తలో... దాదాపు 12 మంది పాజిటివ్ వచ్చిన వారు రైళ్లలో ప్రయాణించారు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా రైల్వే శాఖ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం రైల్వే శాఖ 15,523 రైళ్లను నడుపుతోంది. వీటిలో 9000 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. 3000 మెయిల్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులున్నాయి. ఇవేవీ ఇప్పుడు నడవట్లేదు.

ఏపిలో మ‌రో ఎయిర్‌పోర్ట్! జీఎంఆర్ కు అవ‌కాశం!

ఆంధ్రప్రదేశ్‌లో భోగాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కానుంది. పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానంలో 2019 ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్ట్‌కు వేసిన బిడ్డర్లలో హైయ్యస్ట్ బిడ్డర్‌గా జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ నిలిచింది. ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేసేందుకు, ఆపరేషన్స్ నిర్వహించేందుకు తమ సబ్సిడరీ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లిమిటెడ్(జీఏఎల్)కు అవకాశం దక్కినట్టు జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రకటించింది. గత ఐదేళ్ల నుంచి వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో ప్యాసెంజర్ ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. అంతేకాక కార్గో ట్రాఫిక్‌ కూడా బాగా పెరుగుతోంది. వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో ప్యాసెంజర్ ట్రాఫిక్‌ గత ఐదేళ్లలో సీఏజీఆర్ 21 శాతం నమోదు కాగా.. కార్గో ట్రాఫిక్ విషయంలో ఇండియాలో కస్టమ్స్ ఎయిర్‌పోర్ట్‌ల్లో వైజాగ్ ఎయిర్‌పోర్ట్ ఐదో స్థానంలో నిలిచింది. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వైజాగ్, విజయనగరం జిల్లాలకు సరిహద్దుల్లో ఉంది. ఎన్‌హెచ్ 5 ద్వారా వైజాగ్‌ నుంచి 45 కిలోమీటర్లు, ఎన్‌హెచ్ 43 ద్వారా విజయనగరం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంటుంది. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి లెటర్ ఆఫ్ అవార్డు(ఎల్‌ఓఏ) దక్కించుకున్నట్టు సంస్థ వెల్లడించింది. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈ విషయాన్ని తెలిపింది. తాజా ప్రాజెక్ట్‌లో భాగంగా 40 ఏళ్ల వరకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ డిజైన్, ఫైనాన్స్, కన్‌స్ట్రక్షన్, డెవలప్‌మెంట్, అప్‌గ్రేడెషన్, ఆపరేషన్, మెయింటనెన్స్ వంటి వన్నీ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్సే చూసుకోనుంది. ఇంటర్నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రాసెస్ ద్వారా మరో 20 ఏళ్ల వరకు ఈ ప్రాజెక్ట్‌ను పొడిగించుకోవచ్చు. 'ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను డెవలప్‌, ఆపరేట్, మేనేజ్ చేసే అవకాశం మాకు దక్కడం గర్వకారణం' అని జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్ బిజినెస్ ఛైర్మన్ జీబీఎస్ రాజు చెప్పారు.

దేశంలో క‌రోనా నీడ ప‌డ‌ని ప్రాంతాలున్నాయా?

అవును. మ‌న‌ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఒక్క కరోనా వైరస్ కేసు కూడా నమోదు కాలేదు. లక్షద్వీప్‌, దాద్రానగర్‌ హవేలి, డామన్‌-డయ్యూ, సిక్కింలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఒక్కో కేసు మాత్రమే నమోదైంది. దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. మొత్తం 10,815  నమోదు కాగా 1189 మంది కోలుకున్నారు. కరోనాతో 353 మంది మరణించారు. ప్రస్తుతం 9272 యాక్టివ్‌ కేసులున్నాయి. ఓవైపు లాక్ డౌన్ కొనసాగుతూనే ఉన్నా.. మరోవైపు వేల సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొస్తుండటం కలవరపెడుతోంది.

ఉద్యోగుల్ని తొలగించొద్దు! వేతనాలు తగ్గించవ‌ద్దు! కార్మిక మంత్రిత్వ శాఖ

లాక్ డౌన్ తో ఇప్పటికే భారత ఆర్థిక వ్యవస్థపై, ఉద్యోగాలపై భారీగా ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో కంపెనీలు, సంస్థల యాజమాన్యాలకు ప్రధాని మోడీ ఓ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించవద్దని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. మీ ఉద్యోగుల పట్ల సానుభూతి చూపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించవద్దని సంస్థలకు సూచిస్తున్నాయి. మంగళవారం కర్ణాటక ప్రభుత్వం ఉద్యోగులను తొలగించవద్దని, వేతనాలు తగ్గించవద్దని సూచించింది. అన్ని ఆర్థిక వ్యవస్థలు నిలిచిన ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులను ఇబ్బంది పెట్టవద్దని సూచించింది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ కూడా కంపెనీలకు సూచన చేసింది. ఉద్యోగులను తొలగించవద్దని, వేతనాలు తగ్గించవద్దని మహారాష్ట్ర ప్రభుత్వం కూడా కంపెనీలకు సూచించింది.

మీడియా అంటే.. అది ఒక వస్తువు కాదు. మనుషులే!

ప్రస్తుతం లాక్‌డౌన్‌తో మన అనుకున్నవారి ఇంటికి కూడా మనం వెళ్లలేక పోతున్నాం కదా? మరి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న విషయాలు మనకు ఎలా తెలుస్తున్నాయి? మనం ఓట్లు వేసి గెలిపించిన నాయకుడు కూడా మన ఇంటికి రావడం లేదు. కనీసం మన వీధికి కూడా రావడం లేదు (ఏమో ఒకరిద్దరు వస్తున్నారు!) కదా.. మరి మన సమస్యలు ప్రభుత్వానికి ఎలా చేరుతున్నాయి? వారధి ఎవరు? అంటే తడముకోకుండా చెప్పే మాట మీడియా ఉందికదా!? అని! నిజమే. మీడియా అంటే.. అది ఒక వస్తువు కాదు. మనుషులే! మీడియాలో పనిచేస్తున్నది కూడా మనలాంటివారే! వారికీ కరోనా ఎఫెక్ట్ పొంచే ఉంది. వారిపైనా అనేక నిషేధాజ్ఞలు ఉన్నాయి. పోలీసుల నుంచి బెదిరింపులు ఉన్నాయి. లాఠీల భయం కూడా పొంచే ఉంది. ప‌ని చేసే యాజ‌మాన్యం ఎప్పుడు ఉద్యోగంలో నుంచి పీకివేస్తోందో తెలియ‌దు. అయినా.. వారు ఎంచుకున్న వృత్తి ధర్మానికి పాత్రికేయులు పాటు పడుతున్నారు. అందుకే ప్రజలకు ఇంట్లో ఉన్నా.. ప్రపంచం మొత్తం వారికి చేరువ అవుతోంది. దేశంలో ఏ క్షణాన ఎన్ని కరోనా కేసులు నమోదవుతున్నాయో.. ప్రభుత్వం చెబుతోంది. అయితే, దీనికి కారణాలు ఏంటి? ఎక్కడెక్కడ కరోనా విజృంభించే అవకాశం ఉందనే విషయాలపై సమగ్ర పరిశోధనాత్మకంగా సమాచారం ఇస్తూ.. పాత్రికేయులు ఇంత ఘోర కరోనా కాలంలోనూ తమ వృత్తి ధర్మానికి కట్టుబడ్డారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నిజానికి సమాజంలో ఏం జరుగుతోందో చెబుతున్నప్పటికీ.. ఇంత శ్రమ తీసుకుంటున్నప్పటికీ.. పాత్రికేయులను గుర్తించేవారు.. వారి పేరును స్మరించేవారు ఒక్కరంటే ఒక్కరు ఒక్క ప్రభుత్వం అంటే ఒక్క ప్రభుత్వం కూడా లేదంటే నమ్మితీరాలి. కేంద్ర ప్రభుత్వం వైద్యులకు, వైద్య సిబ్బందికి .. ఆయుష్మాన్ భారత్ కింద 50 లక్షల బీమా ఇచ్చింది. కానీ, అదే వాతావరణంలో అదే ఆసుపత్రుల్లో పనిచేస్తూ.. వార్తలు సేకరిస్తున్న పాత్రికేయుల పరిస్థితి ఏంటి? వారికి కనీస అవసరాలు తీర్చేవారు ఎవరు? మాస్కులు లేవు. సంస్థలు ఇవ్వవు. కనీసం వారికి సమయానికి ఆహారం కూడా లేదంటే.. నమ్ముతారా? అయినా ఇది పచ్చినిజం. మనం ఇంట్లో ఉండి సమయానికి అన్నీ వండుకుని తింటున్నాం. ఉదయాన్ని వెళ్లి మనకు అవసరమైన వాటిని తెచ్చుకుంటున్నాం. మరి జర్నలిస్టు కుటుంబాలు ఇలా చేస్తున్నాయా? ఈ విప‌త్క‌ర ప‌రిస్థితి కొంత మంది మీడియా యాజమాన్యాలకు గొప్ప వరంగా మారింది. దీనిని సాకుగా చూపించి ఎడాపెడా ఉద్యోగాలకు కోత మొదలుపెట్టారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మరియు బిజినెస్ స్టాండర్డ్ జీతాల తగ్గింపు తీసుకోవాలని సిబ్బందిని కోరింది. ఔట్‌లు ముద్రణ ప్రచురణను నిలిపివేసింది. న్యూస్ నేషన్ 16 ఇంగ్లీష్ డిజిటల్ ఉద్యోగులను తొలగించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా మొత్తం ఆదివారం స్పెష‌ల్ టీం ను తొలగించింది. క్వింట్ బృందంలో సగం మంది జీతం లేకుండా సెలవుపై వెళ్ళమని కోరారు. ఇండియా టుడే 46 మంది రిపోర్టర్లు, 6 మంది కెమెరామెన్లు మరియు 17 మంది న్యూస్ ప్రొడ్యూస‌ర్‌ల‌ను తొలగించింది. ఉదయాన్ని పుస్తకం పెన్ను పట్టుకుని ఫీల్డ్ లోకి వెళ్తున్న జర్నలిస్టు.. ఎప్పుడు ఇంటికి వస్తాడో చెప్పలేని పరిస్థితి! ఎలా వస్తాడో కూడా తెలియని పరిస్థితి!! అయినా ఆయనను మ‌నిషిగా చూడ‌డం లేదు. పాత్రికేయుడిని పట్టించుకునేవారు ఎవరు? వారికీ కుటుంబాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేసుకుందాం!

ఈ దేశాల‌పై కరోనా వైర‌స్ దాడి చేయ‌లేద‌ట‌!

కరోనా వైరస్ రిసోర్స్ సెంటర్ కు చెందిన జాన్ హాప్ కిన్స్ యూనివర్శిటీ తన వెబ్ సైబ్ లో ఈ విష‌యాల‌ను వెల్లడించింది. ఇప్పటివరకు ఒక్క కరోనా వైరస్ కేసు కూడా నమోదు కాని దేశాల జాబితాను జాన్ హాప్ కిన్స్ ప్ర‌క‌టించింది. 1. కొమొరోస్ 2. లెసోతో 3. మార్షల్ దీవులు 4. పలావు 5. నౌరు 6. సమోవ 7.కిరిబాటి 8. వనౌటు 9. సోలమన్ దీవులు 10. టోన్గా 11. టువాలు 12. తుర్క్మెనిస్తాన్ 13. తజికిస్తాన్. ఇదిలా వుంటే తమ దేశంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ఉత్తర కొరియా చెబుతోంది. అయితే ఆ దేశం మాటను ఎవరూ నమ్మడం లేదు. కరోనా కేసులు నమోదైనా రహాస్యంగా ఉంచి తమ దేశంలో కరోనా పాకలేదని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ ప్రకటిస్తున్నాడు. అయితే అలాంటిదేమీ లేదని.. చైనా పక్కన ఉన్న ఆ దేశంలో తప్పనిసరిగా కేసులు నమోదయ్యాయని కానీ ఉద్దేశపూర్వకంగా ప్రకటించడం లేదని అంతర్జాతీయ సంస్థలు విశ్లేషకులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విల‌య‌తాండ‌వం. ఏడు ఖండాలకు ఈ వైరస్ పాకింది. అగ్ర దేశాలతో పాటు అట్టడుగున ఉన్న దేశాలకు కూడా ఆ వైరస్ కలవరం సృష్టిస్తోంది. ప్రపంచమంతా ఆ వైరస్ అంత కల్లోలం సృష్టిస్తుండగా ఇలాంటి సమయంలో కూడా కొన్ని దేశాల్లో కరోనా వైరస్ వ్యాపించలేదు.

భ‌య‌పెడుతున్న లెక్క‌లు! పరిస్థితి అదుపులోకి రావ‌డంలేదు!

దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తోంది. లాక్ డౌన్ ప్రారంభం అయిన తొలి రోజున 526 గా ఉన్న కరోనా పాజిటివ్ కేసులు, ఏప్రిల్ 14 నాటికి 11 వేలకు చేరువ అయ్యాయి. కేంద్ర హోంశాఖ అధికారుల కథనం ప్రకారం దేశ వ్యాప్తంగా మూడు లక్షలకు పైగా కరోనా బాధితులు క్వారెంటైన్‌ కేంద్రాల్లో ఉన్నట్లు సమాచారం. అయితే కరోనా వ్యాప్తి కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 3 లక్షల 23 వేల మందిని నిర్బంధ కేంద్రాల్లో (క్వారెంటెన్ లో) ఉంచినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 66వేల మంది, ఉత్తరాఖండ్‌లో 55వేలు, రాజస్తాన్‌ 35,841, ఉత్తరప్రదేశ్‌ 31,158, గుజరాత్‌ 14,204, బిహార్‌లో 11,998 మందిని హోం క్వారెంటైన్‌లో ఉన్నారు. అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా పెద్ద సంఖ్యలోనే కరోనా బాధితులు క్వారెంటైన్‌లో ఉన్నారు. దేశంలోని మొత్తం 718 జిల్లాల్లో దాదాపు 370 జిల్లాకు పైగా కరోనా బారిన పడ్డయని హోంశాఖ నివేదికలో తేలింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. పాజిటివ్‌ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇప్పటి వరకు దేశంలో సుమారు 11 వేలకు చేరుకున్నాయి పాజిటివ్‌ కేసులు. మృతుల సంఖ్య 339కి చేరింది. పరిస్థితి అదుపులోకి రాలేదు.

అత్యవసరమైతే పోలీస్‌ పాస్‌ తీసుకోండి!

*రాష్ట్ర ప్రజలకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సూచన *ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ–పాస్‌ల జారీకి చర్యలు *జిల్లాల వారీగా పాస్‌ల కోసం వాట్సప్‌ నెంబర్లు, మెయిల్‌ ఐడీల వివరాలు విడుదల చేసిన డీజీపీ కార్యాలయం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలవుతున్న తరుణంలో ఎవరైనా అత్యవసర పనులపై ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ఈ–పాస్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. తగిన కారణాలు, ఆధారాలు చూపించి ఈ–పాస్‌కు దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని స్పష్టం చేశారు.దీనికి సంబంధించి డీజీపీ తెలిపిన వివరాలివీ. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న దృష్ట్యా వైద్యం, స్వచ్ఛంద సేవ, ప్రభుత్వ విధులు, అత్యవసర సేవల కోసం వెళ్లే వారు ఇబ్బందులకు గురవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అలాంటి వారికి పోలీస్‌ శాఖ ద్వారా అత్యవసర రవాణా పాస్‌లను జారీ చేస్తాం. జిల్లా పరిధిలో వెళ్లాల్సి వస్తే.. ఆ జిల్లా ఎస్పీకి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. వేరే జిల్లాకు వెళ్లాల్సి వస్తే.. తమ జిల్లా ఎస్పీ ద్వారా ఆ వ్యక్తి వెళ్లాల్సిన జిల్లా ఎస్పీ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. వేరే రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తే.. సదరు వ్యక్తికి సంబంధించిన జిల్లా ఎస్పీ ద్వారా డీఐజీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలి. వివరాలన్నీ పరిశీలించి ఆయా రాష్ట్రాలను సంప్రదించిన అనంతరం డీఐజీ కార్యాలయం అనుమతి మంజూరు చేస్తుంది. పాస్‌ అవసరమైన వారు చిరునామా, ఆధార్, ప్రయాణించే వాహనం నంబర్, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారనే వివరాలు సమర్పించాలి. పాస్‌ కోసం జిల్లా ఎస్పీల వాట్సాప్, ఈ–మెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను పరిశీలించాక వారి మొబైల్‌ నంబర్లకే పోలీసులు అనుమతులు పంపిస్తారు. ఈ–పాస్‌ తీసుకున్న వారు గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. అత్యవసర పనుల కోసం పాస్‌లు తీసుకోదలచినవారు తమ యొక్క వినతిపత్రాలను పైన ఇచ్చిన వాట్సప్‌ మొబైల్ నెంబర్లకు మరియు మెయిల్ ఐడీలకు మాత్రమే పంపగలరు. అంగీకరించిన అనుమతి పత్రాలు మీరిచ్చే మొబైల్ నెంబర్లకు/మెయిల్ కు అనుమతి పంపబడును. మీరు ప్రయాణించేటపుడు జిల్లాల యొక్క  వాట్సప్‌ నెంబర్ మరియు మెయిల్ ఐడీల నుంచి వచ్చిన అనుమతులు మాత్రమే అంగీకరించబడును. ఫార్వర్డ్‌ చేయబడిన అనుమతులు (పాసులు) అంగీకరించబడవు. మీరు ప్రయాణించేటప్పుడు మీతోపాటు మీయొక్క గుర్తింపు కార్డు (ఐడీ కార్డ్‌) తప్పనిసరిగా ఉంచుకోవాలని డీజీపీ కార్యాలయం పేర్కొంది.

మ‌ళ్లీ డాక్టర్లపై కరోనా బాధితుల దాడి!

మొన్న గాంధీలో..నేడు ఉస్మానియాలో మ‌ళ్లీ డాక్టర్ల పై కరోనా భాదితులు దాడికి దిగారు. ఉస్మానియా లోనూ అదే సీన్ రిపీట్ అయింది. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో రెండు పాజిటివ్ కేసులు ఉన్నాయి. అనుమానితులను, రోగులను ఒకే చోట ఉంచడంపై అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఐసోలేషన్ వార్డులో ఉన్న పీజీలపై కరోనా బాధితులు దాడి చేసినట్టు వార్తలు భ‌గ్గుమ‌న్నాయి. కరోనా బాధితులు ఎవరూ సహనం కోల్పోకూడదని - అందరూ సంయమనం పాటించాలని ఎవ‌రు ఎంతగా చెప్పినా బాధితులు స‌హ‌నం కోల్పోయి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దాడుల‌కు దిగుతున్నారు.  డాక్టర్లు దైవంతో సమానమని - వారిని ఇబ్బంది పెట్టవద్దని సీఎం చెప్పినా కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి. డాక్టర్ల పై దాడికి దిగితే ..వారు చేతులెత్తేస్తే మనల్ని కాపాడేవారే లేరు అన్న విషయాన్ని మనసులో పెట్టుకొని మెలిగితే మంచిది. మ‌రో ప్ర‌క్క కరోనావైరస్ హైద‌రాబాద్‌లోనూ విజృంభిస్తుంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు ఆందోళ‌న‌క‌రంగా పెరిగిపోతున్నాయి. దీనితో ప్రజలలో అలజడి మొదలైంది.  డాక్టర్లు - పోలీసులు - అధికారులు ప్రాణాలని పణంగా పెట్టి కరోనా పై యుద్ధం చేస్తున్నారు. అయితే అక్కడక్కడా పోలీసులు - డాక్టర్ల పై కరోనా భాదితులు దాడికి దిగుతున్నారు.గాంధీ హాస్పిటల్ లో కరోనా రోగులు వైద్యులపై దాడికి దిగితే ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ లోనూ అదే సీన్ రిపీట్ అయింది.

నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు త‌ప్ప‌వు!  కేటిఆర్‌

రాష్ట్రంలో కరోన వ్యాధి ప్రబలకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు  కె.టి.రామారావు మరియు ఈటల రాజేందర్ అధికారులను సూచించారు. మంత్రులు ప్రగతిభవన్‌లో కరోనా వైరస్‌పై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.  హైద్రాబాద్ సిటీలో గుర్తించిన ప్రాంతాల్లో100 శాతం లాక్ డౌన్ నిబంధనలు పాటించేలా, పూర్తిగా అన్ని రహదారులను మూసివేసి ఒకటే మార్గం పోలీసుల పహరలో తెరచి ఉంచాలి. ఏ ఒక్కరు బైటికి రాకుండా, వారికి కావలసిన నిత్యావసర వస్తువులు ఇంటికే పంపించే ఏర్పాట్లు చేయాలని కేటిఆర్ సూచించారు. ఆయా ప్రాంతాల్లో ప్రతి ఒక్కరితో ప్రతి రోజు ఆరోగ్య పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకుని, అనుమానితులను హాస్పిటల్ కు తరలించి కావలసిన వైద్య పరీక్షలు చేయించి positive రిపోర్ట్ వస్తే సంబంధిత హాస్పిటల్ కు పంపించడంతో పాటు ట్రావెల్ హిస్టరీ వివరాలతో పాటు, కాంటాక్ట్ వివరాలను వెంటనే సేకరించి తదుపరి చర్యలు తీసుకోవాలని, పోలీస్, జిహెచ్ఎంసి మరియు మెడికల్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని మంత్రి కేటిఆర్ ఆదేశించారు. రాబోయే 10 రోజులు చాలా ముఖ్యమని, ఎవరు కూడా అనవసరంగా రోడ్లపైనే రావొద్దని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. వైద్య పరంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, అధికారులు, డాక్టర్లు సమన్వయంతో వ్యాధి ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఈటెల సూచించారు.  ఈ సమావేశానికి సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి సహా హైదరాబాద్ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, వైద్య ఆరోగ్య, పురపాలక, పోలీసు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఫాంగేట్‌ పద్దతిలో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నాం!

తెలంగాణ నుంచి కూడా ధాన్యం రాష్ట్రంలో రాకుండా నిలిపేశాం. మద్దతు ధర కన్నా తక్కువ ఖరీదుకు ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి రాకుండా ఈ చర్యలన్నీ తీసుకున్నాం. సరిహద్దుల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూసుకోవాలని సంబంధిత కలెక్టర్లను ఆదేశిస్తున్నాని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ రోజు జ‌రిగిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. ముఖ్యంగా కొనుగోళ్లు సవ్యంగా జరుగుతున్నాయా? లేవా? అన్నది చూసుకోండి. ఏ సమస్య ఉన్నా.. వెంటనే సీఎం కార్యాలయం దృష్టికి తీసుకురండి. వెంటనే దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి చెప్పారు. మార్కెటింగ్‌కు సంబంధించి కొన్ని వినూత్న ఆలోచనలు చేస్తున్నాం. ఈ సమయంలో వ్యవసాయం అన్నదాన్ని మనం కాపాడుకోగలిగితే, రైతు అనేవాడిని మనం ఇబ్బంది పడకుండా చూసుకోగలిగితే.. 60శాతం ఆర్థిక వ్యవస్థను మనం నిలబెట్టుకోగలుగుతాం ముఖ్య‌మంత్రి అన్నారు. గ్రామంలో రైతులు ఏమైనా ఇబ్బందులు పడితే.. వెంటనే ఆ సమాచారం పైస్థాయిలో ఉన్నవారికే కాకుండా జిల్లా కలెక్టర్లకూ రావాలి. రైతు ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు? ఏ పంటకు తక్కువ ధర వస్తుంది? ఎక్కడ ఇబ్బందులు వస్తున్నాయన్నదానిపై కలెక్టర్లకు సమాచారం రావాలి. దీని ఆధారంగా మార్కెటింగ్‌శాఖ అధికారులతో మాట్లాడాలి. మన రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకు వెళ్తాయి. ఇతర రాష్ట్రాల్లో మార్కెట్లు నడవడంలేదు. రవాణాకూడా జరగడంలేదు. మధ్యలో ఆపేస్తారనే భయంతో లారీల రవాణా నడవడంలేదు. ఈ సమస్యల పరిష్కారానికి క‌లెక్ట‌ర్లు దృష్టిపెట్టాలని ముఖ్య‌మంత్రి సూచించారు. వైయస్సార్‌ జనతా బజార్లకు బీజం వేస్తున్నాం. ఏ రైతు కూడా ఇబ్బంది పడుతున్నా మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించి, రవాణాను అందుబాటులోకి తీసుకురావడంపై కలెక్టర్లు దృష్టిపెట్టాలని ముఖ్య‌మంత్రి అన్నారు. రైతులు అవస్తలు పడకుండా చర్యలు తీసుకోవాలి. భౌతిక దూరం పాటించేలా వారిలో చైతన్యంకలిగించి... ఆమేరకు వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగేలా చూడాలి కరోనా నివారణా చర్యలు పాటిస్తూ.. కార్యకలాపాలు ఎలా చేపట్టాలన్నదానిపై రైతులకు అవగాహన, చైతన్యం కలిగించాలని సి.ఎం. సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టండి. నిరంతరం ఇది జరగాల్సిన అవసరం ఉంది. మన చుట్టుపక్కల ప్రాంతాలు బాగుంటేనే ఏ వైరస్‌ అయినా, బాక్టీరియా అయినా ప్రబలకుండా ఉంటుంది. రైతు భరోసాకేంద్రాలు, విలేజ్‌ క్లినిక్కులు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతాంశాలు, వీటిపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి.  నిత్యావసర వస్తువుల ధరలపై కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలని సి.ఎం. ఆదేశించారు. ఎవరైనా అధిక ధరకు అమ్మితే వెంటనే కేసులు పెట్టి, జైల్లో పెట్టాలి. కలెక్టర్లు,  ఎస్పీలు బాధ్యత తీసుకోవాలి. నిత్యావసర వస్తువుల ధరలు పూర్తిగా కంట్రోల్‌లో ఉండాలి.

ఫీజు రీయింబర్స్ మెంట్ త‌ల్లి అక్కౌంట్లోకే!

ఫీజు రీయింబర్స్మెంట్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము డైరెక్ట్ గా కాలేజ్ లకి ట్రాన్స్ ఫర్ చేసేవారు.. కానీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల తల్లి బ్యాంక్ ఖాతాలోకే ఫీజు రీయింబర్స్ మెంట్ మొత్తాన్ని జమ చేస్తామని తెలిపారు. త్రైమాసికానికి ఓ విడత చొప్పున రీయింబర్స్మెంట్ సొమ్మును తల్లుల అకౌంట్లో జమ చేయనున్నారు. దీంతో కాలేజీ యాజమన్యాలతోపాటు విద్యార్థులకు కూడా ఊరట చేకూరే అవకాశం ఉంది. 2018-19కి సంబంధించి రూ.1800 కోట్ల బకాయిలను చెల్లించామని ప్రభుత్వం తెలిపింది. 2019-20 సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాలకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించామని సీఎం తెలిపారు.  తల్లిదండ్రుల నుంచి అదనంగా వసూలు చేసిన డబ్బును తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకే ఇచ్చేయాలని కాలేజీలకు సీఎం ఆదేశాలు జారీచేశారు.దీనికి సంబంధించి 191 కాలేజీలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని, ఆదేశాల సక్రమంగా అమలయ్యేలా చూడాలని  కలెక్టర్లకు ముఖ్య‌మంత్రి సూచించారు. అవ‌స‌ర‌మైతే కాలేజీలపై చర్యలు తీసుకుని, బ్లాక్‌ లిస్టులో పెడతామని సి.ఎం. హెచ్చ‌రించారు.