ఫాంగేట్‌ పద్దతిలో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నాం!

తెలంగాణ నుంచి కూడా ధాన్యం రాష్ట్రంలో రాకుండా నిలిపేశాం. మద్దతు ధర కన్నా తక్కువ ఖరీదుకు ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి రాకుండా ఈ చర్యలన్నీ తీసుకున్నాం. సరిహద్దుల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూసుకోవాలని సంబంధిత కలెక్టర్లను ఆదేశిస్తున్నాని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ రోజు జ‌రిగిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. ముఖ్యంగా కొనుగోళ్లు సవ్యంగా జరుగుతున్నాయా? లేవా? అన్నది చూసుకోండి. ఏ సమస్య ఉన్నా.. వెంటనే సీఎం కార్యాలయం దృష్టికి తీసుకురండి. వెంటనే దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి చెప్పారు. మార్కెటింగ్‌కు సంబంధించి కొన్ని వినూత్న ఆలోచనలు చేస్తున్నాం. ఈ సమయంలో వ్యవసాయం అన్నదాన్ని మనం కాపాడుకోగలిగితే, రైతు అనేవాడిని మనం ఇబ్బంది పడకుండా చూసుకోగలిగితే.. 60శాతం ఆర్థిక వ్యవస్థను మనం నిలబెట్టుకోగలుగుతాం ముఖ్య‌మంత్రి అన్నారు. గ్రామంలో రైతులు ఏమైనా ఇబ్బందులు పడితే.. వెంటనే ఆ సమాచారం పైస్థాయిలో ఉన్నవారికే కాకుండా జిల్లా కలెక్టర్లకూ రావాలి. రైతు ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు? ఏ పంటకు తక్కువ ధర వస్తుంది? ఎక్కడ ఇబ్బందులు వస్తున్నాయన్నదానిపై కలెక్టర్లకు సమాచారం రావాలి. దీని ఆధారంగా మార్కెటింగ్‌శాఖ అధికారులతో మాట్లాడాలి. మన రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకు వెళ్తాయి. ఇతర రాష్ట్రాల్లో మార్కెట్లు నడవడంలేదు. రవాణాకూడా జరగడంలేదు. మధ్యలో ఆపేస్తారనే భయంతో లారీల రవాణా నడవడంలేదు. ఈ సమస్యల పరిష్కారానికి క‌లెక్ట‌ర్లు దృష్టిపెట్టాలని ముఖ్య‌మంత్రి సూచించారు. వైయస్సార్‌ జనతా బజార్లకు బీజం వేస్తున్నాం. ఏ రైతు కూడా ఇబ్బంది పడుతున్నా మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించి, రవాణాను అందుబాటులోకి తీసుకురావడంపై కలెక్టర్లు దృష్టిపెట్టాలని ముఖ్య‌మంత్రి అన్నారు. రైతులు అవస్తలు పడకుండా చర్యలు తీసుకోవాలి. భౌతిక దూరం పాటించేలా వారిలో చైతన్యంకలిగించి... ఆమేరకు వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగేలా చూడాలి కరోనా నివారణా చర్యలు పాటిస్తూ.. కార్యకలాపాలు ఎలా చేపట్టాలన్నదానిపై రైతులకు అవగాహన, చైతన్యం కలిగించాలని సి.ఎం. సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టండి. నిరంతరం ఇది జరగాల్సిన అవసరం ఉంది. మన చుట్టుపక్కల ప్రాంతాలు బాగుంటేనే ఏ వైరస్‌ అయినా, బాక్టీరియా అయినా ప్రబలకుండా ఉంటుంది. రైతు భరోసాకేంద్రాలు, విలేజ్‌ క్లినిక్కులు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతాంశాలు, వీటిపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి.  నిత్యావసర వస్తువుల ధరలపై కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలని సి.ఎం. ఆదేశించారు. ఎవరైనా అధిక ధరకు అమ్మితే వెంటనే కేసులు పెట్టి, జైల్లో పెట్టాలి. కలెక్టర్లు,  ఎస్పీలు బాధ్యత తీసుకోవాలి. నిత్యావసర వస్తువుల ధరలు పూర్తిగా కంట్రోల్‌లో ఉండాలి.

ఫీజు రీయింబర్స్ మెంట్ త‌ల్లి అక్కౌంట్లోకే!

ఫీజు రీయింబర్స్మెంట్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము డైరెక్ట్ గా కాలేజ్ లకి ట్రాన్స్ ఫర్ చేసేవారు.. కానీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల తల్లి బ్యాంక్ ఖాతాలోకే ఫీజు రీయింబర్స్ మెంట్ మొత్తాన్ని జమ చేస్తామని తెలిపారు. త్రైమాసికానికి ఓ విడత చొప్పున రీయింబర్స్మెంట్ సొమ్మును తల్లుల అకౌంట్లో జమ చేయనున్నారు. దీంతో కాలేజీ యాజమన్యాలతోపాటు విద్యార్థులకు కూడా ఊరట చేకూరే అవకాశం ఉంది. 2018-19కి సంబంధించి రూ.1800 కోట్ల బకాయిలను చెల్లించామని ప్రభుత్వం తెలిపింది. 2019-20 సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాలకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించామని సీఎం తెలిపారు.  తల్లిదండ్రుల నుంచి అదనంగా వసూలు చేసిన డబ్బును తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకే ఇచ్చేయాలని కాలేజీలకు సీఎం ఆదేశాలు జారీచేశారు.దీనికి సంబంధించి 191 కాలేజీలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని, ఆదేశాల సక్రమంగా అమలయ్యేలా చూడాలని  కలెక్టర్లకు ముఖ్య‌మంత్రి సూచించారు. అవ‌స‌ర‌మైతే కాలేజీలపై చర్యలు తీసుకుని, బ్లాక్‌ లిస్టులో పెడతామని సి.ఎం. హెచ్చ‌రించారు.

ఏ మనిషి కూడా పస్తు ఉండే పరిస్థితి రాకూడదు!

ఏప్రిల్‌ 16 నుంచి రేషన్‌ పంపిణీ సందర్భంగా తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై ఉన్న‌తాధికారుల‌తో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వీడియోకాన్ఫ‌రెన్స్‌లో చ‌ర్చించారు.  ఒకే దుకాణం పరిధిలో రెండు మూడు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రజలు గుమిగూడకుండా ముందే టోకెన్లు ఇస్తున్నారు. ఎవరు ఏ రోజు రేషన్‌కోసం రావాలో, ఏ కౌంటర్‌ వద్దకు రావాలో స్లిప్పులో పేర్కొంటున్నారు.  ఎవరికి కార్డు లేకపోయినా అర్హతలు గ్రామ, వార్డు సచివాలయాల్లో పెట్టామ‌ని అధికారులు ముఖ్య‌మంత్రికి వివ‌రించారు.  ఇలాంటి సమయంలో ఆహారంలేని పరిస్థితి ఉండకూడదు కాబట్టి.. ఎవరు రేషన్‌ అడిగినా ఇవ్వండి. ఏ మనిషి కూడా పస్తు ఉండే పరిస్థితి రాకూడదని ముఖ్య‌మంత్రి సూచించారు. గతంలో ప్రకటించిన విధంగా కరోనా సహాయం కింద రేషన్‌ తీసుకున్న ప్రతి ఒక్కరికీ కూడా రూ.1000లు ఇవ్వండని సి.ఎం. ఆదేశించారు.

జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోండి! సీఎం ఆదేశం!

*కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ *కోవిడ్‌నివారణా చర్యలు, రైతులను ఆదుకునే చర్యలు, రేషన్‌ పంపిణీ తదితర అంశాలపై కలెక్టర్లతో చ‌ర్చించారు. రద్దీని తగ్గించాలంటే ప్రతిరోజూ నిత్యావసరాలను అందుబాటులో ఉంచాలి. జోన్లలోకూడా రోజూ నిత్యావసరాలను అందుబాటులో ఉంచడం వల్ల జనం గుమిగూడకుండా చూసుకోవచ్చు. లేకపోతే రద్దీ ఉండి మళ్లీ లాక్‌డౌన్‌ ఉద్దేశాలు నెరవేరవు. కాబ‌ట్టి జనం గుమిగూడకుండా ఏం చేయాలన్నదానిపై ఆలోచనలు చేయాలని ముఖ్య‌మంత్రి ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. మనం ఇచ్చిన పరిమిత సమయంలోనే భౌతిక దూరం పాటిస్తూ, మార్కెట్లను, బజార్లను వికేంద్రీకరిస్తూ, ఆంక్షలను అమలు చేస్తూ రోజూ నిత్యావసరాలను సరఫరాచేయండి. ప్రజల మూవ్‌మెంట్‌ను తగ్గిస్తూ.. వారికి అందుబాటులో అన్నీ ఉండేలా చేయాలి.  అలాగే హాట్‌స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో హోండెలివరీ లాంటి మార్గాలను ఎంచుకంటే మంచిందని ముఖ్య‌మంత్రి సూచించారు. హాట్‌స్పాట్లలో ప్రజల మూవ్‌ మెంట్‌ తగ్గించేలా, ప్రతిరోజూ నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచేలా, ప్రజలకు అత్యంత సమీపంలో  నిత్యావసరాలు ఉండేలా చూడండి. వీలైతే డోర్‌  డెలివరీ లాంటి మార్గాలపై ఆలోచన చేయమ‌ని క‌లెక్ట‌ర్ల‌కు ముఖ్య‌మంత్రి ఆదేశాలు జారీ చేశారు. క్వారంటైన్‌ సెంటర్లలో నాణ్యతమైన సేవలు, సదుపాయాలు అందుబాటులో ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అలాగే జిల్లాల్లో ఉన్న షెల్టర్లు జోన్ల అన్నింటికీ కూడా ఒక రెసిడెంట్‌ ఆఫీసర్‌ను నియ‌మించి ప్రతిరోజూ భోజనం, మెనూ మార్చారా? లేదా? బాత్‌రూమ్స్‌ పరిశుభ్రంగా ఉన్నాయా? లేవా? పారిశుద్ధ్యం సరిగ్గా ఉందా? లేదా? అన్నదానిపై ప్రతిరోజూ ఫీడ్‌ బ్యాక్‌ తెప్పించుకోవాలని సి.ఎం. వీడియోకాన్ఫ‌రెన్స్‌లో సూచించారు. కుటుంబ సర్వే ద్వారా జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం, సహా బీపీ, సుగర్, ఆస్తమా లాంటి లక్షణాలు ఉన్నవారందరికీ పరీక్షలు చేయించాలని అధికారుల‌కు ఆదేశించారు.  కరోనా ఎవరికి వచ్చింది? వారి వయస్సు ఎంత? వారు ఇప్పటికే ఏ వ్యాధులతో బాధపడుతున్నారు? అన్నదాన్ని గుర్తించి.. వెంటనే వారికి అత్యుత్తమ వైద్యం అందించాలి. హైరిస్కుగా ఉన్న కేసులను గుర్తించి వారిని పూర్తిస్థాయిలో ఉత్తమ వైద్యం అందించాలి. వారిని వెంటనే కోవిడ్‌ క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రులకు తరలించి మంచి వైద్యం ఇస్తే... మరణాలను అరికట్టగలమ‌ని ముఖ్య‌మంత్రి ఈ సంద‌ర్భంగా అభిప్రాయ‌ప‌డ్డారు.

ప‌ద‌వ‌త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఆన్‌లైన్ లోనే బోధ‌న‌! 

ఏపీలో టెన్త్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ గడువు మే 3 వరకు పొడగించడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ కారణంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించలేకపోతున్నామని  విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్ర‌క‌టించారు. పరీక్షలు జరిగేంత వరకు వారికి సీఎం ఆదేశాలు మేరకు ఆన్ లైన్ సప్తగిరి ఛానల్ ద్వారా క్లాస్ తీసుకుంటారు. ఉదయం 10-11, సాయంత్రం 4-5 ఇవి ప్రసారం అవుతాయి. అవే క్లాసులను యూట్యూబ్ సప్తగిరి ఛానల్ లో కూడా అందుబాటులో ఉంచుతామ‌ని మంత్రి తెలిపారు. విద్యామృతం పేరుతో కార్యక్రమం రూపొందించాం అన్ని శాఖల పరిధిలోని స్కూల్స్ నుంచి అధ్యాపకుల ఎంపిక చేస్తున్నాం. ఇప్పటికే ట్రయిల్ రన్ చేసామని మంత్రి తెలిపారు.  విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా ఈ క్లాసులను వినియోగించుకోవాల‌ని మంత్రి పిలుపునిచ్చారు. ఛానల్ లో వచ్చే ఈ క్లాసులకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావాలని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాదు విద్యార్థుల హాజరుకు సంబంధించి గ్రామ సచివాలయ సిబ్బంది విద్యా శాఖకు సమాచారం అందిస్తారు. ఉపాధ్యాయులు కూడా హాజరును పరిశీలించనున్నారని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.

ఎవ‌రు ఎలాంటి మాస్కులు ధ‌రించాలి?

జలుబు, దగ్గు, తుమ్ముల వంటి లక్షణాలు గలవారికి.. మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు గలవారికి సర్జికల్‌ మాస్కులు అవసరం. అలాగే రోగులకు సేవలు చేసేవారు కూడా  సర్జికల్‌ మాస్కులే వాడాలి.  అందుబాటులో ఉంటే ఎన్‌-95 మాస్కులు ధరిస్తే ఇంకా మంచిది. కొవిడ్‌-19కు చికిత్స చేసేవారికి: కరోనా ఇన్‌ఫెక్షన్‌ బాధితులకు చికిత్స చేసే డాక్టర్లు, నర్సులు, అనుబంధ వైద్య సిబ్బంది విధిగా ఎన్‌-95 మాస్కులు ధరించాలి. సీపీఆర్‌, వెంటిలేషన్‌, బ్రాంకోస్కోపీ, శ్వాసనాళంలోకి గొట్టాన్ని పంపించే చికిత్సల వంటివి చేసే గదుల్లో ఉండేవారికీ ఇవి అవసరమే. మరణించినవారిని తరలించేవారు ఎన్‌-95 మాస్కులతో పాటు శరీరాన్ని కప్పి ఉంచే రక్షణ పరికరాలు కూడా ధరించాలి. అయితే మాస్కు ధరించటానికి ముందు చేతులను సబ్బుతో కడుక్కోవాలి. లేదా ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్‌ను చేతులకు రాసుకోవాలి.  నోరు, ముక్కు ఏమాత్రం కనిపించకుండా మాస్కు ధరించాలి. ముఖానికి, మాస్కుకు మధ్య ఎలాంటి ఖాళీ లేకుండా చూసుకోవాలి. మాస్కు తడిగా అయితే వెంటనే తీసేసి కొత్తది పెట్టుకోవాలి. ఒక మాస్కును ఒకసారే వాడాలి. మాస్కు పెట్టుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ముందు భాగాన్ని చేతులతో తాకరాదు. ఒకవేళ తాకితే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.  మాస్కును తీసేటప్పుడు చెవుల చుట్టూ ఉండే పట్టీలను పట్టుకునే తీయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందు భాగాన్ని తాకరాదు. తీసిన మాస్కును సంచీలో పెట్టి బిగించి చెత్త బుట్టలో వేయాలి. లేదంటే మూత ఉన్న చెత్తబుట్టలో వేయాలి.  మాస్కును తీసిన తర్వాత చేతులను సబ్బుతో రుద్దుకొని శుభ్రంగా కడుక్కోవాలి. వీలుంటే శానిటైజర్‌ రాసుకోవచ్ఛు.  ఎత్తయిన భవనాల్లో లిఫ్ట్‌లు, మెట్ల వంటి చోట్ల వైరస్‌ అంటుకొని ఉండొచ్ఛు కాబట్టి అపార్ట్‌మెంట్లలో నివసించేవారు ఇంట్లోనే మాస్కును పెట్టుకొని బయటకు రావాలి. ఇంట్లోకి వచ్చాకే తీసెయ్యాలి. గుడ్డ మాస్కులను రోజూ శుభ్రంగా ఉతికి, ఆరెయ్యాలి.

నలుగురికీ నచ్చిందీ నాకసలే నచ్చదులే...

తెగించినోడికి తెడ్డే లింగం అన్నచందంగా ఏపీ ప్రభుత్వం వ్యహారం ఉందని ప్రతిపక్షాలు ఘాటు విమర్శలు చేస్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వం తీసుకొనే ఏకపక్ష కక్ష్యపూరిత నిర్ణయాలను తప్పుబడుతూ కోర్టులు చివాట్లు పెడుతున్నా ప్రభుత్వం మాత్రం దున్నపోతు మీద వాన పడ్డట్టు..తనను కాదన్నట్లే ముందుకు వెళ్తుందని.. సాక్షాత్తు ప్రభుత్వమే కోర్టు బోనులో నిలబడాల్సి వస్తున్నా మూర్ఖపు నిర్ణయాలనే సమర్థిస్తుందని తీవ్రవ్యాఖ్యలే చేస్తున్నారు. ఇంతకు ముందు ఘటనలను పక్కనపెడితే ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ తొలగింపు.. కొత్త కమిషనర్ నియామకం హాట్ టాపిక్ గా నడుస్తుంది. ప్రభుత్వం రాత్రికి రాత్రి అనేకన్నా కేవలం గంటల వ్యవధిలో ఆర్డినెన్స్ ద్వారా ఈ ప్రక్రియ ముందుకు తీసుకెళ్లడం వివాదాలకు దారితీసింది. దీనిపై ఇప్పటికే పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన వ్యక్తుల నుండి సామాన్య పౌరుల వరకు ఈ పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. ఎస్ఈసీ తొలగింపు చెల్లదంటూ యోగేష్ అనే లాయర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయగా శుక్రవారం స్వయంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, కామినేని శ్రీనివాస్, బీజేపీ తరపున పిటిషన్స్ దాఖలు చేయగా టీడీపీ నేత వర్ల రామయ్య కూడా ఇదే అంశంపై మరో పిటిషన్ దాఖలు చేశారు. మరో సామాన్య పౌరుడు కూడా ఇంకో పిటిషన్ దాఖలు చేశారు. వీటన్నిటినీ కలిపి హైకోర్టు సోమవారం విచారణ ప్రారంభించగా ప్రభుత్వ తరపు అడ్వకేట్ జనరల్ కౌంటర్ దాఖలు చేసేందుకు నెల రోజుల సమయం కావాలని కోరారు. అయితే, బీజేపీ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది జంధ్యాల రవిశంకర్ కేసు తీవ్రతను.. మాజీ మంత్రులు స్వయంగా పిటిషన్లు దాఖలు చేయడంను కోర్టుకు గుర్తుచేయడంతో హై కోర్టు ప్రభుత్వానికి కేవలం మూడే రోజుల సమయం ఇచ్చింది. దాఖలైన అన్ని పిటిషన్లు ప్రభుత్వానికి అందించి మూడు రోజులలో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. ఒకపక్క రాష్ట్రంలో కరోనా ప్రభావంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తుండగా ఉపాధి కోల్పోయిన ఎందరో ప్రభుత్వం వంక ఆశగా చూస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎస్ఈసీ తొలగింపుతో రాజకీయ చిచ్చురేపి వినోదం చూస్తోంది. ఒకవైపు కరోనా విలయం.. మరోవైపు ఎస్ఈసీ తొలగింపుపై హైకోర్టులో వాదనలు జరుగుతున్నా రాష్ట్రంలో ఎన్నికలకు మాత్రం రంగం సిద్దమవుతున్నట్టు కనిపిస్తోంది. కొత్త ఎన్నికల కమిషనర్ గా నియమించిన గంటలలోనే.. లాక్ డౌన్ సమయంలో ఇతర రాష్ట్రాల నుండి కొత్త వ్యక్తులకు అనుమతి లేదన్న నిబంధనకు నీళ్ళొదిలేసి విధులలో ప్రత్యక్షమైన కనగరాజన్ సోమవారం రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపై అధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో సోమవారం రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించిన కనగరాజన్ ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల వాయిదా.. ప్రస్తుత లాక్ డౌన్ తదితర పరిస్థితులపై చర్చించారు. ఎన్నికలకు ఏ క్షణమైనా సిద్ధంగా ఉండాలని అందుకు తగిన కార్యాచరణ మొదలుపెట్టాలని ఆదేశించారు. అయితే.. ఒకపక్క రాష్ట్రంలో కరోనా కష్టాలు వెంటాడుతుండగా.. మరోవైపు తన నియామకంపైనే హైకోర్టులో వాదనలు జరుగుతుండగానే రాష్ట్రంలో ఎన్నికలపై సమీక్ష చేయడం.. ప్రభుత్వం పనితీరు.. ఎన్నికలపై ఉన్న వ్యామోహమే తప్ప ప్రజా శ్రేయస్సు ఎక్కడా కనిపించనట్లుగా ఉందని విమర్శలొస్తున్నాయి. మరో వైపు నేడు ప్రధాని మే 3 తేదీ వరకూ లాక్ డౌన్ పొడిగిస్తూ ప్రకటన చెయ్యడం, 20 తేదీన రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తొలగింపు విషయంలో హైకోర్టు తీర్పు రానుండడంతో ఏం జరగనుందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

22 కేజీల పండ్లు రూ.300లకే! ఫోన్ కొట్టు పండ్లు ప‌ట్టు!

ఉద్యానవన రైతులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ వినూత్న కార్యక్రమం అమలు చేస్తోంది. జంటనగరాల్లో ప్రజల ఇంటి వద్దకే పండ్ల సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించింది. కాలనీలు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లోని ప్రజలు 30 ప్యాక్‌లు ఆర్డర్‌ ఇస్తే నేరుగా సరఫరా చేస్తామని ప్రకటించింది.  73307 33212కు ఫోన్‌ చేస్తే డోర్‌ డెలివరీ అందిస్తారని మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్యాక్ లో ఉండే పండ్ల రకాల్ని చూస్తే.. మామిడికాయలు 3.5కేజీలు.. బొప్పాయి 3 కేజీలు.. సపోటా కేజీ..బత్తాయి 2.5కేజీలు.. నిమ్మకాయలు 12.. పుచ్చకాయలు నాలుగు కేజీలు ఉంటాయి. అంటే..మొత్తం 22 కేజీల పండ్లు రూ.300లకే ఇంటికి తెచ్చేలా మార్కెటింగ్ శాఖ ప్లాన్ చేసింది. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ఉత్తరాదికి పండ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. స్థానికంగా అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం రైతులకు ఆదాయాన్ని, ప్రజలకు ఇంటివద్దనే  తాజా పండ్లను అందిస్తుందని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి తెలిపారు.

ఉదయం ప్రధాని నాకు ఫోన్‌ చేశారు: చంద్రబాబు

లాక్‌డౌన్‌ను మే 3 వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈరోజు ఉదయం ప్రధానితో ఫోన్ లో కరోనా కట్టడి గురించి మాట్లాడానని తెలిపారు.  హైదరాబాద్‌లో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నిన్న ప్రధాని కార్యాలయానికి ఫోన్‌ చేశా.. ఆయనతో మాట్లాడాలని అడిగాను. అయితే, ఈ రోజు ఉదయం 8.30 గంటలకు ప్రధాని నాకు ఫోన్‌ చేశారు.  ఆయనతో నా ఆలోచనలు పంచుకున్నా’’ అని చంద్రబాబు తెలిపారు. కరోనా నియంత్రణ చర్యలపై ప్రధానికి ఇటీవల రాసిన లేఖలో కొన్ని సూచనలు చేశానని చంద్రబాబు అన్నారు. జోన్ల వారీగా కరోనా వ్యాప్తి ప్రాంతాలను విభజించమని ఆ లేఖలో కోరానన్నారు. ఇలాంటి సున్నితమైన అంశాలపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.

వైసీపీ ఎమ్మెల్యేతో సమావేశమైన ఎమ్మార్వోకు కరోనా!!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటి వరకూ 473 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఓ తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన సన్నిహితులు, తోటి ఉద్యోగులు, ఆయనను కలిసిన రాజకీయ నేతల్లో కలవరం మొదలైంది. ఇప్పటికే ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. ప్రస్తుతం వారందరూ వైద్యుల సమక్షంలో క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఈ తహసీల్దార్ మడకశిర వైసీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామితో పలుసార్లు సమావేశమయ్యారని తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే అనుచరుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, ఈ వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే ఇంతవరకూ స్పందించలేదు.

ప్రజలందరికీ ఉచితంగా ఆహారం అందించాలి!

కరోనా వైరస్‌ మహమ్మారి భారత్‌లో కూడా శరవేగంగా విస్తరిస్తుంది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జాతిని ఉద్దేశించి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భాగమైన "నా ప్రియమైన దేశ ప్రజలారా.." అంటూ ప్రారంభమైన ఆమె సందేశంలో, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చూసేందుకు ప్రతి పౌరుడూ సహకరించాలని ఆమె కోరారు. వైరస్ భయాందోళనలు తగ్గేంతవరకు ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని కోరారు. ఇటువంటి సమయంలో ప్రజలంతా శాంతి, సహనం, సంయమనం పాటిస్తున్నారని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిచాలని, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని అభ్యర్థించారు. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు తమ భార్యా పిల్లలనూ, తల్లిదండ్రులనూ వదిలి కరోనాపై పోరాడుతున్నారని, వారందరికీ థ్యాంక్స్ అని చెప్పారు. జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని గుర్తు చేసిన కాంగ్రెస్ అధ్యక్షురాలు, ప్రజలందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు అందించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించిన సోనియా గాంధీ.. ముందస్తు సన్నాహాలు లేకుండా దేశంలో లాక్‌ డౌన్ అమలు చేస్తుండడం వల్ల దేశం నష్టపోతోందని అన్నారు.

భారత్ లోనే ఉంటాం! స్వదేశం వెళ్లేందుకు అమెరిక‌న్‌ల విముఖత!

విదేశాల్లో ఉన్న 50 వేల మంది అమెరికా పౌరులను స్వదేశానికి వచ్చేయాల్సిందిగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు.  ట్రంప్ ఆదేశాలతో అమెరికా యంత్రాంగం అనేక విమానాలను నడుపుతోంది. విదేశాల్లో నిలిచిపోయిన అమెరికన్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. భారత్ లో తమకు అందుబాటులో వున్న 800 మందిని అమెరికా అధికార్లు ఒకరోజున సంప్రదించి విమానం రెడీగా వుంది వస్తారా? అని కోరితే, వారిలో 10 మంది మాత్రమే ముందుకొచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా భారత్ లో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా సాగుతుండడం కూడా అమెరికన్లలో ఇక్కడుండడమే మంచిదన్న అభిప్రాయం కలిగిస్తోంది. కాగా, భారత్ లోని వివిధ ప్రాంతాల్లో 24 వేల మంది అమెరికా పౌరులు ఉన్నట్టు అధికార వర్గాల అంచనా. ప్రపంచవ్యాప్తంగా రవాణా నిలిచిపోవ‌డంతో అనేక దేశాల ప్రజలు ఇతర దేశాల్లో చిక్కుకుపోయారు. అయితే ఆయా దేశాలు విదేశీయులను తమ భూభాగంపై ఉండేందుకు అనుమతించడంలేదు. అయితే కొంత మంది విదేశీయులు ఈ స‌మ‌యంలో భారత్ ను వీడి తమ సొంత దేశాలకు వెళ్లేందుకు ఇష్టపడడంలేదు. ముఖ్యంగా అమెరికన్లు భారత్ లోనే ఉంటామని, అమెరికా వెళ్లబోమని అంటున్నారు. అక్క‌డ పరిస్థితి అత్యంత దారుణంగా ఉండడమే అందుకు కారణం.

గిఫ్ట్ ఏమోకానీ! శానిటరీ కార్మికులకు జీతాల్లేవట!!

"మున్సిపల్ పారిశ్యుద్ద కార్మికుల గురించి సీఎం కేసీఆర్ చెప్పే మాటలు చేతల్లో లేవు. వారికి పరిశుభ్రత కోసం సబ్బులు లేవు. గ్లౌజ్లు శానిటైజేషన్ వంటివి లేదు. వారికి అదనపు గిఫ్ట్ సంగతి పక్కకు పెడితే.. రెండు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదు" అని తెలంగాణా పిసిసి అధ్య‌క్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. శానిటైజేషన్ వర్కర్లు పోలీసులు హెల్త్ సిబ్బందితో పాటు అత్యవసర సేవల్లో ఉన్న వారికి 30శాతం అదనంగా జీతాలు ఇవ్వాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అర కిలోమీటర్ కు ఒక అన్నదాన కేంద్రమని సీఎం కేసీఆర్ ప్రకటించారని, అయితే అవి ఎక్కడా కన్పించడం లేదని ఆయ‌న ఆరోపించారు. కరోనా వైరస్ అరికట్టడం కోసం ప్రభుత్వం పెట్టిన ఖర్చులు నామమాత్రమేనని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ప్రకటనలకు వాస్తవానికి మధ్య ఎంతో తేడా ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మండిపడ్డారు.  తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు ఆగిపోయాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కరోనా కంటే ముందు నుంచే 7500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మెలో ఉన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోమని వారు కోరుతున్నా. కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. లాక్ డౌన్ తో ఆదాయం తగ్గింది అంటున్న సీఎం కేసీఆర్ గతంలో బాండ్ల ద్వారా సేకరించిన 3500 కోట్ల రూపాయలు ఏమీ చేశారో సమాధానం చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో అధికార ప్రతిపక్ష మధ్య కరోనా కేంద్రంగా విమర్శలు-ప్రతి విమర్శలు హాట్హాట్గా కొన సాగుతున్నాయి.

రంజాన్ నెల‌లో లాక్‌డౌన్ నిబంధ‌న‌లు క‌ఠినంగా పాటించాల్సిందే! అబ్బాస్ నఖ్వీ

కరోనా మహమ్మారి విసురుతున్న ప్ర‌మాద‌క‌ర‌మైన‌ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు సామాజిక దూరం మార్గదర్శకాలను నిజాయితీతో క‌చ్చితంగా పాటించాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పిలుపునిచ్చారు. ఈ నెల 24 నుంచి ప‌విత్ర రంజాన్ మాస‌ము ప్రారంభం కానుంది. ముస్లింలు ఇంటిలోనే మతపరమైన ఆచారాల‌ను నిర్వ‌హించుకోవాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి వ్యాప్తి నేప‌థ్యంలో ప్ర‌పంచ‌ వ్యాప్తంగా సౌదీ అరేబియాతో సహా చాలా ముస్లిం దేశాలు రంజాన్ సంద‌ర్భంగా మతపరమైన ప్రదేశాలలో ప్ర‌వేశాల‌ను నిలిపివేసిన విష‌యాన్ని ముస్లింలు గమనించాల‌ని మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర వక్ఫ్ బోర్డుల పరిధిలో దాదాపు 7 లక్షలకు పైగా రిజిస్టర్డ్ మసీదులు, ఈద్గా, ఇమాంబాడా, దర్గాలు మరియు ఇతర మత సంస్థలు ఉన్నాయ‌ని ఆయ‌న తెలియ జేశారు. ప్రజలు గుమిగూడకుండా చూసేందుకు సమర్థవంతమైన విధానాన్ని తీసుకోవాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డులను సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ద్వారా సూచించినట్లు మంత్రి నఖ్వీ తెలిపారు. ఈ విషమై అవ‌స‌ర‌మైతే వివిధ మత, సామాజిక సంస్థలు, ప్రజలు, స్థానిక యంత్రాంగ‌పు యొక్క సాయం తీసుకోవలసిన అవసరం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. సామాజిక దూరం నిబంధ‌న‌లు కఠినంగా సమర్థవంతంగా అమల‌య్యేలా ముస్లింలు సహకరించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని ఆయ‌న అన్నారు. “ఇఫ్తార్”తో సహా ఇతర మతపరమైన ఆచారాల విష‌యంలో ప్ర‌భుత్వం సూచిస్తున్న అన్ని మార్గదర్శకాలను పాటించాలని ఆయన కోరారు.

ఎకాన‌మీ కంటే జీవితం గొప్ప‌ది!

ప‌రిస్థితి తీవ్ర‌త దృష్ట్యా మ‌రో 19 రోజులు లాక్‌డౌన్ పెంచుతున్నాం. మే 3వ తేదీ వ‌ర‌కు లాక్ డౌన్ కొన‌సాగుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌క‌టించారు. ఇదే ఐక్య‌మ‌త్యం, స్పూర్తిని ప్ర‌జ‌లు చూపించి ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని పి.ఎం. విజ్ఞ‌ప్తి చేశారు. ఏప్రిల్ 20 వ‌ర‌కు ప‌రిస్థితి తీవ్రంగా వుంటుంది. ఈ వారం రోజులు భార‌త్‌కు గ‌డ్డు కాలం. ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా వుండాలి. ఇంట్లో త‌యారు చేసిన మాస్క్‌ల‌ను ఉప‌యోగించండి. రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచ‌డానికి చ‌ర్య‌లు తీసుకోండి. ఆరోగ్య శేతు మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. పేద ప్ర‌జ‌ల గురించి ప‌ట్టించుకోండి. వీలైనంత మందికి భోజ‌నం పెట్టండి. ఎవ‌రినీ ఉద్యోగాల నుంచి తీయ‌కండి. మే 3వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ నిబంధ‌న‌ల్ని పాటించి సుర‌క్షితంగా ఉండండి.

లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వ‌ర‌కు పొడ‌గింపు

ఎన్ని ఆటంకాలు క‌ష్టాలు వ‌చ్చినా ధైర్యంగా దేశం కోసం నిల‌బ‌డ్డారంటూ ప్ర‌జ‌ల‌నుద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగించారు. తిన‌డానికి, ప్ర‌యాణానికి తీవ్ర ఇబ్బందులు ఎదురైనా క‌రోనాపై పోరాటానికి దేశ ప్ర‌జ‌లు మ‌ద్ద‌తుగా నిలిచార‌ని ప్ర‌ధాని కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. క‌రోనాపై భార‌త్ యుద్ధం కొన‌సాగుతోంది. క‌రోనాను త‌ర‌మ‌డం కోసం  ప్ర‌జ‌లు త్యాగాలు చేస్తున్నారు. లాక్ డౌన్ సంతృప్తికరంగా అమ‌లౌతోంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో సామాజిక దూరం పాటించ‌డ‌మే స‌రైన ప‌ద్ధ‌తి. దీనితో ఎంతో ప్ర‌యోజ‌నం దేశానికి క‌లిగింది. ఆర్థిక‌ప‌రంగా చూస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వ‌చ్చింది. కానీ భార‌తీయుల జీవితాల్ని కాప‌డ‌డానికి ఆర్థికంగా ఎంత న‌ష్టం వ‌చ్చినా ప‌ర్వాలేదు.  క‌రోనా విజృంభిస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌భుత్వాల‌ను వైద్యుల‌ను మొప్ప‌తిప్ప‌లు పెడుతోంది. భార‌త్‌లో కూడా క‌రోనాపై విజ‌యం ఎలా సాధించాలి. న‌ష్టాన్ని ఎలా త‌గ్గించాలి. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల్ని ఎలా త‌గ్గించాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని నిరంత‌రం చ‌ర్చ‌లు చేశాను. అంద‌రూ లాక్ డౌన్ పెంచాల‌నే సూచ‌న‌లు వ‌చ్చాయి. లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వ‌ర‌కు లాక్ డౌన్ పెంచుతున్న‌ట్లు ప్ర‌ధాని ప్ర‌క‌టించారు.

శంకర్ పల్లి టూ దేవరకొండ! చిన్నారులతో కాలినడక!

వారంతా పొట్ట చేతపట్టుకొని కడుపునింపుకోడానికి పని నిమిత్తం శంకర్ పల్లి వెళ్లారు. అక్కడే ఒక రియ‌ల్ ఎస్టేట్ వెంచర్లో పనిచేసుకుంటున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో వారికి పనికరువైంది. ఈ నెల 14న లాక్ డౌన్ ముగుస్తుందని ఆశతో అక్కడే ఉండిపోయిన వారికి లాక్ డౌన్ పొదగించడం తో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. దీంతో 5గురు చిన్నారులతో పాటు 3కుటుంబాలు తమ సొంత గ్రామమైన దేవర కొండకు వెళ్లేందుకు కాలినడకన బయలు దేరారు. కేశంపేట మీదుగా వెళుతున్న వీరిని గమనించిన స్థానిక ఎస్.ఐ కోన వెంకటేశ్వర్లు ఆపి వివరాలు తెలుసుకున్నారు.లాక్ డౌన్ నేపద్యంలో పంపించడానికి వీలుకాదని మీరు ఉండటానికి వసతి కల్పిస్తామని వారికి వివరించారు. కేశంపేట సర్పంచ్ తలసాని వెంకట్ రెడ్డి వారికి భోజన వసతి కల్పించారు.మండుటెండలో 5 గురు చిన్నారులతో కాలినడకన వెళుతున్న వారి పరిస్థితి చూసిన పలువురు చలించిపోయారు.

ఖాళీ అయిన తెలంగాణ క్వారంటైన్ సెంటర్లు!

మార్చిలో విమాన సర్వీసులు నిలిచిపోవడానికి ముందు తెలంగాణకు సుమారు 74 వేల మంది వివిధ దేశాల నుంచి రాగా, వారిలో 25,973 మందిని ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్లకు తరలించారు. వీరిలో అత్యధికులు క్వారంటైన్ సమయాన్ని ముగించుకుని ఇళ్లకు చేరారు. వీరిలో 30 మందికి ప్రైమరీ కాంటాక్టు ద్వారా, వారి కుటుంబీకులకు మరో 20 మందికి వైరస్ సోకింది. వీరిలోనూ చాలా మంది చికిత్స అనంతరం కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. వీరిలో కరోనా లేదని, వీరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం లేదని నిర్ధారణ అయిన తరువాతే వారిని ఇళ్లకు పంపించి, మరో రెండు వారాలు జాగ్రత్తగా ఉండాలని కోరామని అధికారులు వెల్లడించారు. క్వారంటైన్ చికిత్స నిమిత్తం కేటాయించిన సరోజినీదేవి కంటి ఆసుపత్రి, నేచర్‌ క్యూర్, చార్మినార్ లోని నిజామియా ఆసుపత్రి సెంటర్లు ఇప్పుడు ఖాళీ అయ్యాయి. రాజేంద్రనగర్ లోని సెంటర్ లో 160 మంది ఉండగా, మేడ్చల్ జిల్లాలో 152 మంది, రంగారెడ్డి జిల్లాలో 135 మంది క్వారంటైన్ లో ఉన్నారు. వీరి క్వారంటైన్ సమయం ఈ వారంలో ముగియనుంది. ఇక ఢిల్లీలో జరిగిన ప్రార్థనలకు వెళ్లి వచ్చిన 1089 మందిలో 603 మంది జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నారని గుర్తించిన అధికారులు, వారికి సంబంధించిన వారితో కలిపి మొత్తం 3,015 మందిని క్వారంటైన్ కు తరలించారు. మరో రెండు మూడు రోజుల్లో వీరి క్వారంటైన్ ముగియనుండగా, వీరున్న ప్రాంతాల్లో కొత్తగా ఎవరికీ వైరస్ సోకకుంటే, కమ్యూనిటీ వ్యాప్తి లేనట్టేనని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక, కరోనా చికిత్సకు ప్రధాన ఆసుపత్రిగా ఉన్న గాంధీ హాస్పిటల్ లో 295 పాజిటివ్ కేసులుండగా, ఐసొలేషన్ లో మరో 250 మంది వరకూ ఉన్నారు. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ లో 29 పాజిటివ్ కేసులు, 10 మంది ఐసొలేషన్ లో ఉన్నారు. కింగ్ కోఠి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లో 12 కేసులు ఉండగా, 74 మంది ఐసొలేషన్ లో ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఐసొలేషన్ లో ఉన్నవారి రక్త పరీక్షల ఫలితాలు వచ్చిన తరువాత వారిని ఇంటికి పంపించే విషయమై నిర్ణయం తీసుకుంటామన్నారు.

రాజకీయాలు చేస్తూ శవాల పైన ప్యాలాలు వేరుతున్నారు! ప్రజలు ఐసో లేషన్ లో పెట్టినా బుద్ధి లేదు!

ఈ సమయంలో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు, అలంటీ వారిని ఇప్పటికే ప్రజలు  ఐసో లేషన్ లో పెట్టారు. అయిన వారికి బుద్ధి రాలేదంటూ  రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఘాటుగా విమ‌ర్శించారు.  ఊరంతా ఒకదారి అయితే ఉలికి కట్టది ఒక దారి అన్నట్టు... కొంతమంది రాజకీయ పార్టీల తీరు ఉంది. వలస కార్మికులను ఆదుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఒక్క వలస కార్మికునునైన అదుకున్నారా...? అని  రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్ర‌శ్నించారు. కరోన విషయంలో దేశములో ఏ రాష్ట్రం చేయని విధముగ తెలంగాణ బాగా పని చేస్తుంది అని ఉప రాష్ట్రపతి వెంకయ్య, కేంద్ర మంత్రి అర్జున్ ముండ మెచ్చుకొన్నారు. ఇప్పటికే రాష్ర్టంలో 87% మందికి 12 కిలోల బియ్యం ఇచ్చాం. రాష్ట్రంలోని రేషన్ కార్డ్ దారులకు  87లక్షల 55వేల మందికి 13వందల 14 కోట్ల డబ్బులు వేయబోతున్నాం. గతంలో ఎప్పుడు లేనివిధంగా ఈ రబీలో అత్య అధికంగా ధాన్యం వచ్చింది. ఆర్థికమాంద్యం దెబ్బతిన్న కూడా రైతులకు ఇబ్బంది లేకుండా కేసీఆర్ చేస్తుంటే... ప్రతిపక్షలకు ఇవి కనబడడం లేదా...? 24 గంటలు సీఎం కేసీఆర్ రాష్ట్రం కోసం పనిచేస్తున్నాడు. నేను ఇప్పుడు ప్రతిపక్షల మీద విమర్శలు కావాలని చేయడం లేదు... వారు అనే మాటలు విని బాధతో మాట్లాడుతున్న. రాష్ట్ర ప్రభుత్వం కరోన కోసం ఇప్పటివరకు 3వేల 147 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఇక్కనైన ప్రతిపక్షలు చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని హరీశ్‌రావు సూచించారు.