ఏపీ సచివాలయంలో పది కరోనా కేసులు!!
posted on Jun 6, 2020 @ 3:30PM
ఏపీ సచివాలయంలో కరోనా కలకలం రేపింది. తాజాగా సీఎం పేషీలో పనిచేసే అధికారికి చెందిన డ్రైవర్ సహా ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో సచివాలయంలో కరోనా బారిన పడ్డ ఉద్యోగుల సంఖ్య పదికి చేరింది. కరోనా కలకలంతో, అప్రమత్తమైన అధికారులు ఉద్యోగులతో సన్నిహితంగా ఉన్న వారి వివరాలను సేకరిస్తున్నారు.
ఇటీవల హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్‌రావడంతో.. సచివాలయంలో పని చేస్తున్న వారందరికీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఉద్యోగితో సన్నిహితంగా ఉన్నవారంతా, బస్‌లో వచ్చిన ఉద్యోగులంతా సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లాలని అధికారులు సూచించారు. అయినప్పటికీ ఇప్పటివరకు పది కేసులు నమోదయ్యాయి.
మరోవైపు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో పనిచేసే ఉద్యోగులను ఆరోగ్యసేతు యాప్ ఉంటేనే ఇకపై కార్యాలయంలోకి అనుమతించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధానకార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. కరోనా విజృంభిస్తున్న కారణంగా ఉద్యోగులు తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని, యాప్ ఉన్న ఉద్యోగులకు మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. అలాగే, థర్మల్ స్క్రీనింగ్, మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలని ఆదేశాలు జారీ చేశారు.