కాంగ్రెస్ కి.. క్షవరం అయితే కానీ వివరం రాలేదు!!
posted on Jun 6, 2020 @ 1:06PM
క్షవరం అయితే కానీ వివరం రాదు.. ఈ సామెత ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి కరెక్ట్ గా సరిపోతుంది. అసలే కేంద్రంలో అధికారంలో లేదు. సర్లే, ఒకటి అరా రాష్ట్రాలలో అధికారంలో ఉందని అధిష్టానం సంతోషించే లోపే.. పలువురు నేతలు కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చి.. ఉన్న ఆ కొన్ని రాష్ట్రాలలో కూడా అధికారం దూరం చేస్తున్నారు.
ఇక, తాజాగా రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మరి ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎంత జాగ్రత్తగా ఉండాలి. పార్టీ రాష్ట్ర నాయకత్వాలు ప్రతి నాయకుడి మీద కన్నేసి ఉంచాలి. కానీ, గుజరాత్ కాంగ్రెస్ కి ఆ ఆలోచనే లేనట్టుంది. ఆదమరిచి ఉన్న సమయంలో గట్టి దెబ్బ తగిలింది. రెండు రోజుల వ్యవధిలో కాంగ్రెస్‌కు ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం మొదలైంది. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం అలర్ట్ అయ్యింది. రిసార్టు రాజకీయాలకు తెరలేపింది. 65 మంది ఎమ్మెల్యేలను గుజరాత్‌లోని రిసార్టులకు తరలించేసి.. ఎవరూ జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. రాజ్యసభ ఎన్నికల వేళ.. ఆదమరిస్తే రాజ్యసభలో సీటు మిస్సవుతుంది. దీంతో ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించేసి.. ఎవరూ హ్యాండ్ ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది కాంగ్రెస్. ముగ్గురు ఎమ్మెల్యేలు హ్యాండ్ ఇస్తేనే కానీ, కాంగ్రెస్ కి జ్ఞానోదయం కాలేదన్నమాట.