ఏపీలో ఒకేరోజు నాలుగు కరోనా మరణాలు 

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీలో 79 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 8,066 శాంపిల్స్ ను పరీక్షించగా 79 మందికి కరోనా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,279కి చేరుకుంది. ఏపీలో 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కర్నూలులో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. మృతుల సంఖ్య మొత్తం 68కి చేరింది. ఇక, 24 గంటల్లో 35 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 2,244 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 967 మంది చికిత్స పొందుతున్నారు.

ఏపీ సర్కార్ కు సుప్రీం కోర్టులో తల బొప్పి కట్టింది!

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగుల పై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు వెళ్లిన ప్రభుత్వానికి తల బొప్పి కట్టే తీర్పు వచ్చింది. కార్యాలయాలకు వేసిన రంగులు పార్టీ రంగులు కాదని ప్రభుత్వం లాయరల్ వాదనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. పంచాయతీ కార్యాలయాలకు మొదట వైసిపి పార్టీకి చెందిన మూడు రంగులు వేసినపుడు హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా వాటిని తొలగించాల్సిందేనని ఆదేశించిన విషయం తెల్సిందే. ఆ తరువాత హైకోర్టు తుది తీర్పు తో మళ్ళీ నాలుగో (మట్టి రంగు అంటూ టెర్రకోట రంగు) రంగు అద్దిన వైసిపి ప్రభుత్వానికి తాజాగా సుప్రీం కోర్టు చెంప పెట్టులాంటి తీర్పును ఈ రోజు ఇచ్చింది.  కొద్ది రోజుల క్రితం హైకోర్టు ధిక్కరణ విషయమై కోర్టుకు హాజరైన సీఎస్, పంచాయత్ రాజ్ ముఖ్య కార్యదర్శి తమకు కోర్టును ధిక్కరించే ఉద్దేశం లేదని సరి చెప్పారు అదే సమయం లో ఈ కేసు పై సుప్రీం కోర్టులో అప్పీల్ చేసినట్లుగా కూడా తెలిపారు. ఐతే ఈ రోజు వచ్చిన తీర్పులో ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ కార్యాలకు వేసిన ఆ నాలుగు రంగులు నాలుగు వారాల్లోగా తొలగించాల్సిందేనని తీర్పు చెప్పింది. మరి ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం కార్యాలయాల రంగులు మారుస్తుందో లేక మరేదైనా మార్గం వెతుకుతుందో వేచి చూడాలి. మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ రంగుల కోసం దాదాపు 1500 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం. అసలే లోటు బడ్జెట్ తో నడుస్తున్న ఏపీ ప్రభుత్వం రంగుల పేరుతో దుబారా చేయడమేమిటని సామాన్య ప్రజలు మొత్తుకుంటున్నారు.

గుంటూరు లో మరో కోయంబేడు

కరోనా వ్యాప్తి ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా భారత్ లో కోవిడ్ 19 కేసులు రెండు లక్షలు దాటేశాయి. కేసులు విపరీతంగా పెరగడానికి కొంత మంది సూపర్ స్ప్రెడర్లు అలాగే కొన్ని ప్రాంతాలు కారణం అవుతున్నాయి. అటువంటి వాటిలో కృష్ణ లంక లోని ఒక లారీ డ్రైవర్ ఫ్యామిలీ, ఒక కోయంబేడు మార్కెట్ లాంటి వ్యక్తులు, ఘటనలు కారణమవుతున్నాయి. తమిళనాడు లోని ఒక వెజిటబుల్ మార్కెట్ ద్వారా అటు తమిళనాడు, కేరళ ఇటు ఏపీలోనూ చాల కరోనా కేసులు నమోదు అయ్యాయి. తాజాగా గుంటూరు లోని వెజిటబుల్ మార్కెట్ ద్వారా ఇదే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల క్రితం గుంటూరు నగరంలో బస్ స్టాండ్ పక్కనే ఉన్న కూరగాయల హోల్ సెల్ మార్కెట్ ను నగర పొలిమేరలో ఉన్న ఏటుకూరు రోడ్ కు తరలించారు. ఇక్కడ మొత్తం 450 మంది వ్యాపారులు పాల్గొంటున్నారు. ఈ మార్కెట్ కు చిన్న వ్యాపారులతో పటు చుట్టూ పక్కల గ్రామాల నుండి కూడా ప్రజలు వచ్చి కొనుగోళ్లు చేస్తూ ఉంటారు. తాజాగా ఇక్కడ కొద్ది రోజుల్లోనే ముందుగా ముగ్గురు, తరువాత ఐదుగురికి, ఆ తరువాత పదహారు మందికి మొత్తం 23 మంది వ్యాపారులకు కరోనా పాజిటివ్ తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీనికి ముఖ్య కారణం వారం క్రితం గుంటూరు నగరం లో రెడ్ జోన్ నుండి వచ్చి వ్యాపారం చేస్తున్న ఒక వ్యక్తికీ కరోనా సోకి అది మరి కొంత మంది వ్యాపారులకు సోకినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు అక్కడ సోషల్ డిస్టెన్స్ పాటించక పోవడం కూడా ఒక కారణంగా చెప్తున్నారు. ఒక్కసారిగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అటు అధికార వర్గాల్లో అలాగే వ్యాపారుల్లో కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ మార్కెట్ ను కొద్ది రోజులు మూసి వేసి ఆ ప్రాంతాన్ని శానిటైజ్ చేస్తున్నారు.

ఏపీ మంత్రి కుటుంబంలో కరోనా కలకలం!

బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ కుటుంబంలో కరోనా కలకలం రేగింది. శంకరనారాయణ సోదరుడి కుటుంబంలో ముగ్గురికి కరోనా సోకింది. దీంతో మంత్రి సోదరుడిని కలిసిన వైసీపీ శ్రేణుల్లో వణుకు మొదలైంది. ఇప్పటికే అనంతపురం జిల్లా పెనుకొండలో 17 మంది వైసీపీ నేతలకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అంతేకాదు, మంత్రి ఇంటి వద్ద మున్సిపల్ సిబ్బంది బ్లీచింగ్, శానిటైజర్ పిచికారి చేశారు.  ఇటీవల మంత్రి శంకరనారాయణ మేనత్త కన్నుమూశారు. ఆమెకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో, కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేయగా.. మంత్రి సోదరుడితో సహా ముగ్గురికి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం మంత్రి, కుటుంబ సభ్యులకు ఓ పాఠశాలలోని క్వారంటైన్ సెంటర్లో ఉంచినట్లు తెలుస్తోంది. మంత్రి సోదరుడి కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ కావడంతో స్థానికుల్లో కూడా భయాందోళన నెలకొంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గ్రామాల్లో బ్లీచింగ్, శానిటైజర్ పిచికారి చేయిస్తున్నారు.

అయ్యా మంత్రి గారు కరోనా టైం లో ఇదేం పని సార్

దేశ వ్యాప్తంగా కరోనా పంజా విసురుతూనే ఉంది. అన్ లాక్ 1 మొదలైన తరువాత అంతకు ముందు లాక్ డౌన్ టైంలో గ్రీన్ జోన్లుగా ఉన్న ప్రాంతాలకు కూడా వైరస్ విస్తరిస్తోంది. భారత్ లో కరోనా కేసులు రెండు లక్షలు దాటేశాయి. ఇటువంటి పరిస్థితుల్లో అధికారం లో ఉన్నవారు మరింత జాగ్రత్త్తగా వ్యవహించవలసిన సమయం ఇది. తాజాగా కర్ణాటక హెల్త్ మినిష్టర్ బి శ్రీరాములు చిత్ర దుర్గ జిల్లా చల్లకేరే తాలూకా పరశురాంపురంలోని దేవాలయాన్ని సందర్శిస్తూ సోషల్ డిస్టెన్స్ అనే మాట మర్చి పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆలయ సందర్శన సందర్బంగా అయన అనుచరులు భారీగా తరలి వచ్చి ఆయనకు ఆపిల్స్ గజమాల తో సత్కరించే ప్రయత్నం చేసారు. ఆ సమయం లో కేరింతలు కొడుతూ ఒకరి మీద ఒకరు పడి పోతూ భౌతిక దూరం అనే మాట మర్చిపోయారు. సామాజిక దూరం పై సామాన్యులను ఎడ్యుకేట్ చేయాల్సిన సాక్షాత్తు ఆరోగ్య శాఖ మంత్రి ఇలా వ్యవహరించటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. దీనికి ఫైనల్ టచ్ ఏంటంటే ఆ ప్రోగ్రాం ముగింపులో మంత్రి గారు మళ్ళీ సోషల్ డిస్టెన్స్ గురించి సుద్దులు చెప్పటమే.

సాక్షాత్తు ట్రంప్ నే నోరు మూసుకోమన్న పోలీస్ చీఫ్

అమెరికాలో నల్ల జాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ ను శ్వేత జాతి పోలీస్ హత్య చేయడం తో వారం రోజులుగా హింసాకాండ చెలరేగి అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఆందోళనకారులు సాక్షాత్తు వైట్ హౌస్ ను చుట్టుముట్టి ఆందోళన చేస్తుండటం తో ప్రెసిడెంట్ ట్రంప్ వైట్ హౌస్ కింద ఉన్న బంకర్లోకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది, దాదాపుగా 40 నగరాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో అల్లర్లు అదుపు లోకి రాకపోతే సైన్యాన్ని దింపుతానని ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసాడు. ఐతే ఈ విషయం పై హ్యూస్టన్ పోలీస్ చీఫ్ ఆర్ట్ అకేవేడో స్పందిస్తూ ట్రంప్ పై తీవ్ర విమర్శలు చేసారు. అమెరికాలోని పోలీస్ చీఫ్ లు అందరి తరుఫున ప్రెసిడెంట్ కు ఒక మాట చెపుతున్నా.. వీలయితే గాయపడిన మనసులను గెలుచుకునేలా మాట్లాడండి లేదా నోరు ముసుకు ఉండాలి అంటే గాని నిరసనకారుల పై జులుం ప్రదర్శించమనడం సరి కాదు అని అయన అన్నారు. దీంతో నెటిజన్లు హ్యూస్టన్ పోలీస్ చీఫ్ వ్యాహ్యాల పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సంఘటన మన దేశంలో జరిగితే ఇలా ఒక పోలీస్ అధికారి మాట్లాడే పరిస్థితిని మనం ఊహించవచ్చా.. !

15 రోజుల్లోనే లక్ష కరోనా కేసులు.. అమెరికాని దాటే దిశగా భారత్ పరుగులు!

రెండు నెలల క్రితం కరోనా దెబ్బకి.. బ్రతికుంటే గంజో గింజో తాగి బ్రతకొచ్చు. పైసలకంటే ప్రాణాలు ముఖ్యం అనుకున్నారంతా. కానీ ఇప్పుడు, ఎవరి బ్రతుకు వాళ్ళది, ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాలి. ఆర్ధిక వ్యవస్థ కుదేలవకుండా చూసుకోవాలి అనుకుంటున్నారు. కానీ కరోనా వైరస్ మాత్రం అప్పుడు ఇప్పుడు ఒకే మాట మీద ఉంది. కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా కంటపడిన అందరికీ సోకుతా అంటుంది. ఇటీవల ఇంకా విశ్వరూపం చూపిస్తోంది. లాక్ డౌన్ లో సడలింపులు పెరిగే కొద్దీ విజృంభిస్తోంది. ఎంతలా అంటే, ఇప్పటివరకు భారత్ లో నమోదైన కరోనా కేసులు రెండు లక్షలైతే.. అందులో లక్ష కేసులు గత రెండు వారాల్లోనే నమోదయ్యాయి. ప్రస్తుతం భారత్ లో రోజుకి 8 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 8,909 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. ఇక దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 207,615 కి చేరుకుంది. దేశ మొత్తం జనాభాతో పోల్చుకుంటే.. రెండు లక్షల కేసులంటే చాలా తక్కువ శాతం కేసులే. కానీ ఇక్కడ ఆందోళన చెందాల్సిన విషయం ఏమిటంటే, తక్కువ రోజుల్లో ఎక్కువ కేసులు నమోదవుతుండటమే. దేశంలో లక్ష కేసులు దాటిన 15 రోజుల్లోనే కేసుల సంఖ్య రెండు లక్షలు దాటిందంటే, వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తోందో అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి ఇలాగే కొనసాగితే, వచ్చే నెల రోజుల్లో పది లక్షల కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని, రెండు మూడు నెలల్లో అమెరికాను దాటేసినా ఆశ్చర్యం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవైపు దేశ ఆర్ధిక వ్యవస్థని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు ప్రజల ఆరోగ్యం పట్ల కూడా మరింత శ్రద్ద పెట్టాలని సూచిస్తున్నారు.

రంగుల పంచాయితీ.. నేడే సుప్రీంకోర్టులో విచారణ

ఏపీలో పంచాయతీ భవనాలకు రంగుల అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది.  గతంలో కూడా పంచాయతీ భవనాలకు పార్టీ రంగులు వేయకూడదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడానికి వీల్లేదంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.  అయినా జగన్ సర్కార్ వెనక్కి తగ్గలేదు. మూడు రంగులకు అదనంగా మరో రంగును కలిపి జీవో తీసుకొచ్చింది. దానిపై కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మరో రంగును కలిపి మళ్లీ పార్టీ రంగులే వేస్తున్నారంటూ పిటిషనర్ పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరో రంగును కలుపుతూ జగన్ సర్కార్ తీసుకువచ్చిన జీవోను రద్దు చేసింది. అయినా జగన్ సర్కార్ పట్టు వీడటం లేదు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ మరోసారి సుప్రీం కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఈరోజ విచారణ జరగనుంది. మరి ఈసారి సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఒక పక్క కరోనా మరో పక్క నిసర్గ

మహారాష్ట్ర లో కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 70,000 దాటింది. ఇందులో ముంబై నగరం లోనే 41,000 కేసులు నమోదయ్యాయి. ఇలా ఒక వైపు కరోనా వణికిస్తుంటే మరో వైపు అరేబియా సముద్రం లో ఏర్పడిన అల్ప పీడనం తుఫాన్ గా మారి రాష్ట్రం పై తన ప్రభావాన్ని చూపబోతోంది. ఈ తుఫాన్ కారణంగా 125 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలుపుతోంది. దీంతో ముంబై లోని ఎంఎంఆర్డీఏ లో చికిత్స పొందుతున్న 150 మంది కరోనా పేషేంట్లను వర్లీ కి షిఫ్ట్ చేసారు. అదే సమయం లో రాష్ట్ర ప్రభుత్వం నిసర్గ తుఫాన్ వల్ల రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు గా తెలిపింది.

తిరుమల శ్రీవారి దర్శనానికి గ్రీన్ సిగ్నల్

తిరుమల శ్రీవారి భక్తులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. స్వామి దర్శనానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు, శ్రీవారి దర్శనానికి అనుమతినిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.  శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వాంటూ టీటీడీ బోర్డు ఈవో అనిల్ సింఘాల్ ఇటీవల లేఖ రాశారు. టీటీడీ బోర్డు ఈవో లేఖపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. శ్రీవారి దర్శనానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. భక్తులను అనుమతించే ముందు టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో స్వామి వారి దర్శన ట్రయల్ నిర్వహించాలని సూచించారు. ఆరు అడుగుల భౌతిక దూరం పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు, మార్గదర్శకాలు వెల్లడికానున్నాయి.

నిమ్మగడ్డ కేసులో అసలేం జరుగుతోంది.. బీజేపీ ఎంట్రీతో మరింత ఉత్కంఠ!

ఏపీ ఎలక్షన్ కమిషనర్ గా నిమ్మగడ్డ కు తిరిగి బాధ్యతలు అప్పగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా ప్రతిష్టంభన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఐతే హైకోర్టు మొన్నటి తీర్పు పై స్టే కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టు లో పిటిషన్ వేసి తాజాగా విచారణ సందర్భంలో దాన్ని ఉపసంహరించుకుంటున్నట్లుగా తెలిపింది. అదే సమయం లో హైకోర్టు తీర్పు పై సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా ఇదే విషయం పై ఎపి బీజేపీ నాయకులు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సుప్రీం కోర్టులో కేవియట్ దాఖలు చేశారు. రమేష్ కుమార్ తొలగింపు పై కామినేని పార్టీ జాతీయ నాయకత్వ అనుమతి తో ఎపి హై కోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఒక పక్క నిమ్మగడ్డను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ పదవిలోకి తీసుకోకూడదని వైసిపి ప్రభుత్వం డిసైడ్ అయిన నేపధ్యం లో మరో పక్క బీజేపీ జాతీయ నాయకత్వ అనుమతి తో కామినేని కేవియట్ దాఖలు చేయటం తో రమేష్ కుమార్ వ్యవహారం ఎటు దారి తీస్తుందోనని అందరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

సింగరేణి ఓపెన్ కాస్ట్‌లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడే.. తెలంగాణ సింగరేణి గనుల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రామగుండంలోని సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌-1లోని ఫేజ్‌-2లో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బ్లాస్టింగ్‌కు సంబంధించిన ముడి పదార్థాలను నింపుతుండగా.. ప్రమాదవశాత్తూ ఈ పేలుడు చోటు చేసుకుంది. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం గోదావరఖనిలోని సింగరేణి హాస్పిటల్‌కు తరలించారు.

కరోనా వైరస్ పవర్ తగ్గిందా... నిజమేనా?

కరోనా వైరస్ లో స్టార్టింగ్ లో ఉన్న శక్తి తగ్గిపోయిందని నిన్న ప్రముఖ ఇటలీ డాక్టర్ ఆల్బర్టో జాంగ్రీల్లో ప్రకటించారు. ఇటలీ లో కరోనా విలయ తాండవం చేసిన విషయం తెలిసిందే. అటువంటి ఇటలీలోనే అత్యధిక కరోనా కేసులను అటెండ్ చేసిన ప్రముఖ హాస్పిటల్ ఐసీయూ కి హెడ్ గా అయన పని చేస్తున్నారు. ప్రపంచంలోని ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఆయన వ్యాఖ్యలను ప్రముఖంగా ప్రచురించాయి. ఐతే ఈ వ్యాఖ్యల పై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం అయన వ్యాఖ్యలను ఖండించింది. ఇటలీ డాక్టర్ వ్యాఖ్యలకు సపోర్ట్ చేసే సైన్టిఫిక్ రీసెర్చ్ ఏది జరగలేదని ఆ ప్రకటన లో పేర్కోంది. ఐతే ఇటలీ డాక్టర్ ఆల్బర్టో జాంగ్రీల్లో వ్యాఖ్యలను కూడా అంత ఆషామాషీగా తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన తో పాటు పని చేస్తున్న మరో వైద్యుడితో కలిసి చేసిన అధ్యయనం ఆధారంగానే ప్రస్తుతం వ్యాపిస్తున్న కరోనా వైరస్ బలహీనపడిందని చెపుతున్నానని, ఈ రీసెర్చ్ గురించి ఈ వారాంతం లోనే పూర్తి డిటైల్స్ ప్రచురిస్తామని ఆ డాక్టర్ వెల్లడించారు. ఇటలీ డాక్టర్ చెపుతున్న విషయాలు నిజమైతే కరోనా విలయ తాండవం తో కుదేలవుతున్న ప్రపంచం మొత్తం కొంత ఊపిరి తీసుకునే అవకాశం ఉంటుంది.

నిమ్మగడ్డ కేసు.. స్టే పిటిషన్ ఉపసంహరించుకున్న జగన్ సర్కార్

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో హైకోర్టులో వేసిన స్టే పిటిషన్‌ను జగన్ సర్కార్ ఉపసంహరించుకుంది. సుప్రీంకోర్టులో లీవ్ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. జస్టిస్ కనగరాజ్ తరఫున వేసిన స్టే పిటిషన్‌ను కూడా వెనక్కి తీసుకుంది.  నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించాల్సిందేనంటూ ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. జగన్ సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను, జీవోలను హైకోర్టు కొట్టివేసింది. అయితే, జగన్ సర్కార్ మాత్రం హైకోర్టు తీర్పు అమలుపై స్టే కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ‌ కేసులో తీర్పుపై స్టే ఇవ్వాలంటూ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్‌ వేసినందున హైకోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు.

సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన వాయిదా.. కారణం?

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా షెడ్యూల్ మారడం వల్ల జగన్ ఢిల్లీ‌ పర్యటన వాయిదాపడినట్లు సమాచారం.  షెడ్యూల్ ప్రకారం‌ ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం జగన్ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితే, మరో రెండు మూడు గంటల్లో ఢిల్లీకి బయల్దేరాల్సి ఉండగా సడన్‌గా ఆ పర్యటన రద్దు అయ్యింది. జగన్‌ పర్యటన రద్దు కావటంతో అమిత్‌ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు రద్దయ్యాయి. షెడ్యూలు ప్రకారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో ఈరోజు జగన్ భేటీ అవుదామని అనుకున్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై అమిత్ షాతో చర్చిద్దామని, అలాగే, పోలవరం నిధుల గురించి కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ తో చర్చించాలని భావించారు. లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని జగన్ కేంద్ర మంత్రులను కలసి కోరాలని భావించారు. అయితే, చివరి నిమిషంలో జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది.

విజృంభిస్తోన్న కరోనా.. ఏపీలో 82, భారత్ లో 8,171

ఇటు రాష్ట్రంలోనూ, అటు దేశంలోనూ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఏపీలో గత 24 గంటల్లో 12,613 శాంపిల్స్ ను పరీక్షించగా.. 82 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 3,200 అని పేర్కొంది. మృతుల సంఖ్య మొత్తం 64కి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 927 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,209 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  ఇక, కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,171 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా, 204 మంది కరోనాతో మరణించారు. ఇక దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,98,706 కి చేరగా, మృతుల సంఖ్య 5,598 కి చేరుకుంది. కరోనా నుంచి ఇప్పటివరకు 95,526 మంది కోలుకోగా.. ప్రస్తుతం 97,581 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.

గన్‌పార్క్ వద్ద సీఎం కేసీఆర్ కారుని అడ్డుకున్న నిరుద్యోగి

నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ ఆరు వసంతాలు పూర్తి చేసుకుని ఏడో వసంతంలోకి అడుగుపెట్టింది. అయితే, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం, ప్రగతిభవన్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఇక, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. కాగా, రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించేందుకు గన్‌పార్క్‌కు వెళ్లిన సీఎం కేసీఆర్‌ కారును ఓ నిరుద్యోగి అడ్డుకున్నారు. సీఎం కార్ డోర్ దగ్గరకు వెళ్లిన నిరుద్యోగి.. తనకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

తార‌క్ పొలిటిక‌ల్ ఎంట్రీపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు!!

ప్రస్తుతం టాలీవుడ్ లోని స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. వరుస విజయాలతో దూసుకెళ్తోన్న ఎన్టీఆర్.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తున్నారు. అయితే, తారక్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, రాజకీయాల్లో తన పేరు బాగానే వినిపిస్తూ ఉంటుంది. ఆయన తాతగారు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరఫున.. 2009 ఎన్నికల సమయంలో ప్రచారం నిర్వహించిన తారక్.. ఆ తరువాత పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. అయితే, కొందరు అభిమానులు, టీడీపీ శ్రేణులు మాత్రం తారక్ పొలిటికల్ ఎంట్రీపై చర్చిస్తూనే ఉంటారు. ఆయన ఫుల్ టైం పాలిటిక్స్ లోకి రావాలని, ఆయనకు తెలంగాణలో టీడీపీ పగ్గాలు అప్పగించాలని ఇలా రకరకాలుగా అభిప్రాయపడుతుంటారు. అయితే, తారక్ మాత్రం తన ఫోకస్ అంతా సినిమాల పైనే పెడుతున్నారు. కాగా, తాజాగా తారక్ పొలిటిక‌ల్ ఎంట్రీ గురించి నంద‌మూరి బాల‌కృష్ణ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో బాల‌కృష్ణకు తారక్ పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రశ్న ఎదురైంది. "జూనియర్ ఎన్టీఆర్‌ లాంటి వ్య‌క్తులు కూడా పూర్తిస్థాయి రాజ‌కీయాల్లోకి వస్తే అటు తెలంగాణ‌, ఇటు ఆంధ్రా‌లో పార్టీకి పూర్వ వైభ‌వం వ‌స్తుంది అనే వాద‌న ఉంది" అంటూ యాంకర్ అడిగారు. దీనిపై స్పందించిన బాలకృష్ణ.. ‘‘అది డేడికేష‌న్‌ను బ‌ట్టి ఆధార‌ప‌డి ఉంటుంది" అన్నారు. "అదీగాక మీరు ఫుల్ టైమ్ పాలిటిక్స్ అంటున్నారు. త‌న‌కు సినిమా యాక్ట‌ర్‌గా చాలా భవిష్య‌త్తు ఉంది. మ‌రి వాడిష్టం. ప్రొఫెష‌న్ వ‌దులుకుని ర‌మ్మ‌నముగా. ఇప్పుడు నేనున్నాను ఎమ్మెల్యేగా ఉన్నాను, సినిమాల్లోనూ యాక్ట్ చేస్తున్నాను. నాన్న‌గారు కూడా సీఎంగా ఉన్న‌ప్పుడు సినిమాల్లో యాక్ట్ చేశారు. కాబ‌ట్టి వారి వారి ఇష్టాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది’’ అని బాలకృష్ణ సమాధానమిచ్చారు.