కరోనా కేసుల్లో ఆసియాలోనే అగ్రస్థానంలో భారత్

ఒకవైపు ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతుందన్న భయంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ లో సడలింపులు ఇచ్చుకుంటూ పోతుంటే.. మరోవైపు కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతూ ఆందోళన కలిగిస్తున్నాయి. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి భారీగా పెరిగిపోతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,392 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో, దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,90,535కి చేరింది. అంతేకాదు, కరోనా కేసుల్లో ఆసియాలోనే భారత్ అగ్రస్థానంలో నిలిచి మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇక, గత 24 గంటల్లో కరోనాతో 230 మంది మరణించారు. దీంతో, మృతుల సంఖ్య 5,394కి చేరుకుంది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 91,819 మంది డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 93,322 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తెలంగాణకు షాకిచ్చిన ఏపీ.. గోదావరిపై నిర్మిస్తున్న 16 ప్రాజెక్ట్ లకు బ్రేక్

తెలంగాణ సర్కార్ కి గోదావరి నదీ యాజమాన్య బోర్డు షాకిచ్చింది. తెలంగాణలో గోదావరి నదిపై నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టుల నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు మేరకు గోదావరి బోర్డు ఈ ఆదేశాలు ఇచ్చింది. పునర్‌విభజన చట్టం ప్రకారం అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా గోదావరిపై ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నారని ఏపీ ఫిర్యాదు చేసింది. అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా గోదావరిపై ఎలాంటి కొత్త ప్రాజెక్ట్‌లు నిర్మించరాదని గోదావరి బోర్డు స్పష్టం చేసింది. దీంతో  కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలకు బోర్డు బ్రేకులు వేసినట్లైంది. గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు వెబ్ సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం.. గోదావరి నది మీద తెలంగాణలో మొత్తం 16 ప్రాజెక్టులు పనులు జరుగుతున్నాయి. అందులో ప్రాణహిత చేవెళ్ల, దుమ్ముగూడెం, దేవాదుల, కాళేశ్వరం ఎల్ఐఎస్, మిడ్ మానేర్ డ్యామ్ తదితర ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక ఈ ప్రాజెక్టులన్నింటి నిర్మాణ పనులు వెంటనే ఆపేయాలని గోదావరి రివర్ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, కృష్ణా జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదానికి సంబంధించి రెండు రాష్ట్రాలు సమావేశమై చర్చించనున్నాయి. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మీటింగ్ జూన్ 4న జరగనుంది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా రాయలసీమకు తరలించడానికి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో ఆ విషయం మీద తెలంగాణ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. కృష్ణా జలాలపై ఏపీ నిర్ణయాన్ని కార్నర్ చేసి కృష్ణా రివర్ బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేస్తే.. గోదావరిపై నిర్మిస్తున్న తెలంగాణ ప్రాజెక్ట్ లను  ఏపీ టార్గెట్ చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల  రాష్ట్రాల మధ్య జల రాజకీయం రసవత్తరంగా మారింది. మరి ఈ జల జగడానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.

ఆఫ్ట్రాల్ నువ్వేంది? నీ లెక్కేంది?... మంత్రి వైపు దూసుకెళ్లిన ఉత్తమ్!!

అసెంబ్లీలో అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కామన్. కొందరు నేతలైతే ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ.. కొట్టుకున్నంత పని చేస్తారు. ఇప్పుడీ మాటల యుద్ధం సీన్లు బయట కూడా దర్శనమిస్తున్నాయి. తాజాగా, నల్గొండ కలెక్టరేట్‌లో జరిగిన ఓ సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. నువ్వెంత? అంటే నువ్వెంత? అంటూ విరుచుకుపడ్డారు. ఒకానొక దశలో ఒకరిపైకి మరొకరు దూసుకువెళ్లే వరకు వచ్చింది పరిస్థితి. నియంత్రిత సాగు విధానంపై కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, రైతు రుణమాఫీ గురించి వివరిస్తున్నారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నదని, రైతు రుణమాఫీ కూడా చేస్తున్నామని మాట్లాడుతుండగా.. మధ్యలోనే కల్పించుకున్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. ‘నిజంగా రుణ మాఫీ జరిగిందా’ అని ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. వెంటనే స్పందించిన జగదీష్ ‌రెడ్డి.. "మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడానా?.  మీ పాలనలో కరెంటు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మీ పార్టీ పాలిత రాష్ట్రాల్లో క్వింటాల్ ధాన్యాన్ని వెయ్యి రూపాయలకే అమ్ముతున్నారు. నీకెంతకావాలో చెప్పు పంపిస్తా" అని బదులివ్వడంతో వివాదం మరింత ముదిరింది. రూ. 1200 కొంటున్నామని ఉత్తమ్ బదులివ్వగా, మీటింగ్‌లో మర్యాద తప్పింది మీరేనని జగదీష్ విరుచుకుపడ్డారు. "ఇది అసెంబ్లీ కాదని, ఇక్కడ చర్చ జరగడం లేదని అన్నారు. తాను ఏం చెప్పాలనుకున్నానో అదే చెబుతానని, తనకు ఆ హక్కు ఉందని" జగదీష్ తేల్చిచెప్పారు. "గొంతు పెంచుతున్నారు.. గొంతు తగ్గించి మాట్లాడండి" అని ఉత్తమ్ అనడంతో.. "ఆఫ్ట్రాల్ నువ్వేంది? నీ లెక్కేంది?" అంటూ జగదీష్ ఫైర్ అయ్యారు. దీంతో మరింత ఊగిపోయిన ఉత్తమ్.. "నీ లెక్కేంది మరి" అంటూ ఆవేశంగా మంత్రి జగదీష్ వైపు వచ్చారు. ‘‘నువ్వో సీనియర్‌ లీడర్‌వి. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచావ్‌. రుణమాఫీ అందలేదా? మా సీఎం లెక్కలతో వివరిస్తుంటే ప్రిపేర్ అయి రాలేదని సభ నుంచి పారిపోలేదా?’’ అని జగదీష్ ఎద్దేవా చేశారు. దానికి బదులుగా ఉత్తమ్.. "నేను ఎక్కడ పారిపోయా? నువ్వు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావ్‌. నువ్వు మంత్రిగా ఉండటం ఈ జిల్లా దురదృష్టం" అని మండిపడ్డారు. దీనికి జగదీష్.. "నువ్వు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండటం మీ పార్టీ ఎమ్మెల్యేలకే ఇష్టం లేదు.. ఇదే విషయాన్ని వారే చెబుతున్నారు. " అని కౌంటర్ ఇచ్చారు. చివరగా.. నేను మాట్లాడేది వినండి.. సభా మర్యాద పాటించండి అని మంత్రి జగదీష్ కోరటంతో సమావేశం తిరిగి ప్రారంభమైంది. 

వైఎస్ జగన్ ఏడాది పాలనపై ప్రజా తీర్పు

ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. అద్భుతంగా పాలించామని, ఒక్క ఏడాదిలోనే మేనిఫెస్టోలో చెప్పినవి 90 శాతం చేశామని, మేనిఫెస్టోలో చెప్పనవి కూడా ఎన్నో చేసి.. ప్రజా ప్రభుత్వం అనిపించుకున్నామని అధికార పార్టీ చెబుతోంది. అయితే, ప్రతిపక్షాలు మాత్రం.. జగన్ సర్కార్ ఒక్క ఏడాదిలోనే ప్రజలకు చుక్కలు చూపించిందని.. కూల్చివేతలు, కబ్జాలు, కోర్టు మొట్టికాయలు, మంత్రుల బూతులు తప్ప.. ఏడాదిలో జగన్ సర్కార్ సాధించింది ఏమి లేదని విమర్శిస్తున్నాయి. సరే అధికార పార్టీ గొప్పలు చెప్పుకోవడం, ప్రతిపక్షాలు విమర్శలు చేయడం కామన్. అసలు వైఎస్ జగన్ ఏడాది పాలన గురించి సామాన్య జనం ఏమనుకుంటున్నారు?. అది తెలుసుకోవడం కోసమే.. తెలుగు వన్ సంస్థ యూట్యూబ్ లో పోల్ నిర్వహించింది. ఈ పోల్ లో 50 వేల మందికి పైగా పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. "వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి ఏడాది పూర్తయింది. జగన్ ఏడాది పాలనపై మీరు సంతృప్తిగా ఉన్నారా?" అని తెలుగు వన్ పోల్ నిర్వహించగా.. 42 శాతం మంది జగన్ ఏడాది పాలనతో సంతృప్తిగా ఉన్నామన్నారు. అయితే, 58 శాతం మంది మాత్రం సంతృప్తిగా లేమని చెప్పారు. అంటే, జగన్ ఏడాది పాలన బాగుంది అన్నవారికంటే.. బాగాలేదు అన్నవారు 16 శాతం ఎక్కువగా ఉన్నారు. ఇక ఈ పోల్ కి కామెంట్స్ కూడా పెద్ద సంఖ్యలో వచ్చాయి. అందులో జగన్ సర్కార్ ని మెచ్చిన కామెంట్స్ కొన్ని ఉంటే, తీవ్ర విమర్శలు చేసిన కామెంట్స్ ఎన్నో ఉన్నాయి. కొందరు జగన్ సర్కార్ ని ప్రజా ప్రభుత్వమని ప్రశంసించగా, కొందరు మాత్రం ప్రతీకార ప్రభుత్వమని విమర్శించారు. "రాజధాని లేదు, అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, పోలవరం ఆగిపోయింది, ఇసుక కొరత, న్యాయస్థానాలపై గౌరవం లేదు." అంటూ ప్రభుత్వ తీరుపై కొందరు విరుచుకుపడ్డారు. "ఒక్క శాతం కూడా సంతృప్తిగా లేము, త్వరగా జమిలి ఎన్నికలు వచ్చి వీలైనంత త్వరగా ఈ ప్రభుత్వం దిగిపోతే బాగుండు" అంటూ కొందరు కామెంట్స్ చేశారు. వరస్ట్ సీఎం.. తుగ్లక్ చర్యలు.. క్యాస్ట్ ఫీలింగ్ లేని రాజకీయం ఎప్పుడొస్తుందో?.. అంటూ ఇలా రకరకాలుగా కామెంట్స్ దర్శనమిచ్చాయి. మొత్తానికి తెలుగు వన్ నిర్వహించిన పోల్ లో జగన్ ఏడాది పాలనకి లైక్ కొట్టినవారికంటే, డిస్ లైక్ కొట్టినవారే ఎక్కువ ఉన్నారు.

దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్‌డౌన్‌

కరోనా కేసులు పెరుగుతుండటంతో.. దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ మరింత కఠినతరం చేస్తామని ప్రకటించింది. అత్యవసర సేవలకే మాత్రమే అనుమతి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకే కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. జూన్‌ 8 నుంచి ప్రార్థనామందిరాలు, హోటళ్లు, మాల్స్‌ ప్రారంభించుకోవచ్చని తెలిపింది. రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే స్కూళ్లు, కాలేజీల పై నిర్ణయం తీసుకుంటామని కేంద్రం తెలిపింది.

వైసీపీలో నంబర్ టూ మారిపోయారు!!

వైసిపిలో నంబర్ వన్ ఎవరంటే ఎవరైనా ఠక్కున జగన్ అనే చెప్తారు. అలాగే నంబర్ టూ ఎవరు అంటే నిన్నటి వరకు ఎంపీ విజయసాయి రెడ్డి అనే చెప్తారు. అటు కేంద్రం తో, ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ తో మంచి రిలేషన్స్ మెయింటేన్ చేస్తూ పార్టీలో జగన్ కు కుడి భుజంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఏపీలో ఐతే ఆయనను ఉత్తరాంధ్ర సీఎం అని ఆయనంటే గిట్టని వాళ్ళు, అలాగే ప్రతిపక్షాలు ఆడి పోసుకుంటాయి. నిన్నటివరకు పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమమైనా అందులో అయన ప్రజెన్స్ ఉంది తీరాల్సిందే. ఐతే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఎంపీ విజయసాయి రెడ్డి ని మెల్లగా పక్కన పెట్టినట్లేనని తెలుస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ వ్యవహారాలను పూర్తి స్థాయిలో చూసుకోవాలని సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి పవర్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికోసం వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం. ఇక నుండి రోజూ ఆయన కేంద్ర కార్యాలయానికి వచ్చి కొంత టైం పార్టీ వ్యవహారాల కోసం స్పెండ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు ఇక పార్టీ తరపున ఎలాంటి వ్యవహారాలకైనా విజయసాయిరెడ్డిని సంప్రదించరాదనే సంకేతాలు కొంత మంది నేతలకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ రోజుతో ఏడాది పాలన పూర్తైన సందర్భంగా ఈ పరిణామాలు వైసీపీ కేడర్ ను సైతం ఆశ్చర్య పరుస్తోంది.

ఒక్క ఏడాదిలో ఎంత మార్పు.. విజయసాయిని పక్కన పెట్టేశారా?

2019 మే 23. 151 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకొని వైసీపీ ఘన విజయం సాధించిన రోజు. సీఎం కావాలనే వైఎస్ జగన్ కల నిజమైన రోజు. ఆ రోజు వైసీపీ శ్రేణుల ఆనందం అంతాఇంతా కాదు. పక్కనే జగన్ ఉంటే.. ఆయనను కౌగిలించుకుని మనం గెలిచామని గట్టిగా అరిచే అంత ఉత్సాహంలో ఉన్నారు. అయితే ఆ అదృష్టం మాత్రం పార్టీలో ఒక్కరికే దక్కింది. ఆ ఒక్కరు ఎవరో కాదు విజయసాయి రెడ్డి. ఆ రోజు జగన్ ని కౌగిలించుకుని విజయసాయి తన ఆనందాన్ని పంచుకున్నారు. అప్పట్లో ఆ ఫోటో బాగా వైరల్ అయింది. వైసీపీ శ్రేణులు ఆ ఫోటోని చూసి తెగ మురిసిపోయారు. ఎందుకంటే వైసీపీలో జగన్ తరువాత ఎక్కువగా వినిపించే పేరు విజయసాయి. ఆయన వైసీపీలో నెంబర్ 2 గా ఎదిగారు. ఎన్నికలకు ముందు ఎన్నికలకు తరువాత కూడా విజయసాయి పార్టీలో కీలకంగా, చురుకుగా వ్యవహరించారు. అందుకే వైసీపీ శ్రేణులు.. పార్టీలో జగన్ తరువాత విజయ సాయే అన్నట్టు భావించేవారు. జగన్ కూడా విజయసాయి కి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించారు. పార్టీ వ్యవహారాల్లోనూ అంతే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఇప్పుడు వైసీపీలో మునుపటిలా విజయసాయి జోరు కనిపించట్లేదు. ఓ రకంగా, జగన్ విజయసాయిని పక్కన పెడుతున్నారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల, సీఎం జగన్ విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించడానికి వెళ్ళే సమయంలో.. కారెక్కిన విజయసాయిని దించేసి మరీ మంత్రి ఆళ్ళ నానిని ఎక్కించుకుని వెళ్లారు. ఆ వీడియో బయటకు రావడంతో జగన్ విజయసాయిని పక్కన పెడుతున్నారని, మునుపటిలా ప్రాధాన్యత ఇవ్వట్లేదన్న ప్రచారం మొదలైంది. మరోవైపు, కారు నుంచి దించేయడంతో విజయసాయి నొచ్చుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే, విజయసాయి మద్దతు దారులు మాత్రం.. హెలికాప్టర్ లో చోటులేదని, బాధితులను పరామర్శించటానికి వెళుతున్నారు కాబట్టి ఆరోగ్య మంత్రి ఆళ్ళ నానిని తీసుకెళ్ళారని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. అయితే, తాజాగా పరిణామాలు గమనిస్తే మాత్రం.. విజయసాయికి ప్రాధాన్యత తగ్గిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది కావడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వివిధ రంగాలకు సంబంధించిన అంశాలపై సమావేశాలు పెట్టారు. ఆ సమావేశాల్లో పలువురు కీలక నేతలు కనిపించారు.. కానీ ఎక్కడా విజయసాయి కనిపించలేదు. సరే, ఆ సమావేశాలకు విజయసాయి ఎందుకు వస్తారులే అనుకున్నా.. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వార్షికోత్సవ ఉత్సవాల్లో కూడా ఆయన కనిపించకపోవడం పార్టీలో కలకలం రేపుతోంది. విజయసాయి శుక్రవారం సాయంత్రమే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళారని కొందరు అంటున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసి శనివారానికి సరిగ్గా ఏడాది. అలాంటిది ఆ ముందురోజు విజయసాయి హైదరాబాద్ వెళ్లడం ఏంటి?. పార్టీకి ఎంతో ముఖ్యమైన రోజున ఆయన కనిపించకపోవడం.. పలు అనుమానాలకు దారితీస్తోంది. అదీగాక, విజయసాయి ట్విట్టర్ లో బాగా యాక్టీవ్ గా ఉంటారు. ట్విట్టర్ వేదికగా జగన్ ని ప్రశంసిస్తారు, టీడీపీ నేత చంద్రబాబు పై విరుచుకుపడతారు. ఈరోజు కూడా అలవాటు ప్రకారం విజయసాయి చంద్రబాబుపై విమర్శలు చేశారు కానీ.. జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి ఏడాది అయిన సందర్భంగా ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. దీంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. జగన్ నిజంగానే విజయసాయిని దూరం పెడుతున్నారా? అది తెలిసి విజయసాయి కూడా చిన్నగా సైడ్ అవుతున్నారా? అసలు వైసీపీలో ఏం జరుగుతుంది? అంతా ఆ జగన్నాధుడికే తెలియాలి.

డాక్టర్ సుధాకర్ కేసులో రంగంలోకి దిగిన సీబీఐ.. విశాఖ పోలీసులు పై ఎఫ్ఐఆర్ నమోదు

డాక్టర్ సుధాకర్ కేసును ఏపీ హైకోర్టు సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. కేసును సీబీఐకి అప్పగిస్తూ డాక్టర్ సుధాకర్‌ తో దురుసుగా ప్రవర్తించిన పోలీస్ లపై కేసు నమోదు చేయడంతో పాటు.. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి 8 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. సీబీఐ అధికారులు శుక్రవారం పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు. సీబీఐ విశాఖ ఎస్పీ పుట్టా విమలాదిత్య పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐదవ అడిషనల్ సివిల్ జడ్జి మరియు విశాఖ ఐదవ అడిషనల్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్‌లకు డాక్టర్ సుధాకర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సీబీఐ కేసులు నమోదయ్యాయి. డాక్టర్‌ సుధాకర్‌ అభియోగాల మేరకు పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, మరికొందరిపై 120-బీ, 324, 343, 379, 506 సెక్షన్ల కింద కేసు పెట్టారు. నేరపూరిత కుట్ర, కావాలని దూషించడం, మూడు రోజులకు పైగా అక్రమ నిర్బంధం, బెదిరింపులకు పాల్పడ్డారంటూ వీరిపై విశాఖ సీబీఐ ఎస్పీ కేసు నమోదు చేశారు. మరోవైపు, డాక్టర్ సుధాకర్ చికిత్స పొందుతున్న విశాఖ మానసిక వైద్యశాలకు సీబీఐ అధికారులు చేరుకొని, సుధాకర్ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించిన అంశాలు, తాజా పరిణామాలపై ఆరా తీస్తున్నారు.

నిమ్మగడ్డ తీర్పు పై సుప్రీం కోర్టుకు.. కానీ రివర్స్

ఏపీ ఎన్నిక‌ల అధికారిగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తొలగింపు చెల్లదని రాష్ట్ర హైకోర్టు తీర్పు చెప్పిన విషయం తెల్సిందే. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు నిన్న స్పష్టం చేశారు. అయితే దీనిపై ఎపి కాంగ్రెస్ నేత మస్తాన్ వలీ ప్రభుత్వం కంటే ముందుగానే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్టే పొందకుండా ముందస్తు చర్యగా ఆయన తరపున లాయర్ నర్రా శ్రీనివాసరావు సుప్రీంకోర్టులో ఈ రోజు కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విష‌యంలో అప్పీల్ కు వెళ్తే.. త‌మ‌ను సంప్ర‌దించ‌కుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వ‌రాద‌ని ఆ పిటిషన్ లో సుప్రీం కోర్టును కోరినట్లు తెలిపారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు విషయం లో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఈ సందర్బంగా ఆయన వ్యాఖ్యానించారు. మరి జగన్ ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడాలి.

గత ప్రభుత్వ హయాంలో మేనిఫెస్టో పేరుతో బుక్‌లు రిలీజ్‌ చేసేవారు

ఏపీ సీఎంగా‌ బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తయిన సందర్బంగా వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను వైఎస్‌ జగన్ ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి  ఏకకాలంలో 10,641 వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను ఆన్‌లైన్‌ వీడియో ద్వారా వీక్షిస్తూ సీఎం ఆరంభించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో జగన్ రైతులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రైతులతో గడపడం చాలా సంతోషంగా ఉందన్నారు. రైతులకు కావాల్సిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అన్నీ రైతుభరోసా కేంద్రాల్లో లభ్యం అవుతాయని తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం తమదని, రైతు భరోసా ద్వారా 49 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.10,200 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. "కేవలం రెండు పేజీల్లోనే మేనిఫెస్టో పెట్టాం. ఇప్పటికే మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను నెరవేర్చాం. సీఎం కార్యాలయం నుంచి ప్రతి అధికారి దగ్గరా మేనిఫెస్టోను ఉంచాం. మేం ఇచ్చిన 129 హామీల్లో ఇప్పటికే 77 అమలు చేశాం. అమలు కోసం మరో 36 హామీలు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన 16 హామీలను కూడా త్వరలోనే అమలు చేస్తాం. మేనిఫెస్టోలో లేని మరో 40 హామీలను కూడా అమలు చేశాం" అని సీఎం చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో మేనిఫెస్టో పేరుతో బుక్‌లు రిలీజ్‌ చేసేవారని సీఎం ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం 600లకుపైగా హామీలిచ్చి, పది శాతం కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. జన్మభూమి కమిటీల నుంచి రాజధాని భూముల వరకు.. అన్నీ తమ కనుసన్నల్లోనే ఉండాలని గత ప్రభుత్వం కోరుకునేదని విమర్శించారు. ఆంగ్ల మాధ్యమాన్నీ అడ్డుకుంటున్నారు. ప్రభుత్వ భూమిని పేదలకు ఇస్తుంటే.. కోర్టుకెళ్లి అడ్డుకునే ప్రతిపక్షాన్ని ఇప్పుడే చూస్తున్నా అని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో పేదలకు పథకాలు దక్కాలంటే జన్మభూమి మాఫియాకు లంచాలు ఇవ్వాల్సిందే. కానీ, తమ ప్రభుత్వంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటికే వెళ్లి పథకాలు అందిస్తున్నాం అని సీఎం‌ జగన్‌ పేర్కొన్నారు.

ఏపీ సెక్రటేరియట్ లో కరోనా కలకలం

దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా ఇది అమరావతి లోని ఏపీ సెక్రటేరియట్ లోకి కూడా ఎంటర్ అయింది. లాక్ డౌన్ కు ముందు హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఏపీ సచివాలయ ఉద్యోగులు ఎంప్లాయిస్ ఇంటర్ సిటీ ట్రైన్ లో ప్రయాణించి విధులకు హాజరయ్యేవారు. ఐతే దాదాపు రెండు నెలలుగా లాక్ డౌన్ వల్ల హైదరాబాద్ లో చిక్కుకు పోయిన ఉద్యోగులు విధులకు హాజరు కాలేక పోయారు. దీంతో వీరి కోసం ఏపీ ప్రభుత్వం గత బుధవారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల నుండి ఏపీకి కొన్ని ప్రత్యేక బస్సులు నడిపింది. ఇపుడు ఆలా ప్రత్యేక బస్సులో మంగళగిరికి చేర్చి అక్కడ వారి నుండి కరోనా టెస్టుల కోసం సాంపిల్స్ తీసుకొని వారి తాత్కాలిక నివాసాలకు పంపించారు. ఐతే తాజాగా ఆ టెస్టులలో వ్యవసాయ శాఖలో పనిచేసే ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతని తో కలిసి తిరిగిన వ్యక్తులతో పాటు అతని తో పాటు అదే బస్సులో ప్రయాణించిన ఉద్యోగులందరు సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది.

నిమ్మగడ్డ రాకతో సీఎస్‌ నీలం సాహ్ని పదవికి గండం!!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ చీఫ్‌ సెక్రెటరీ గా ఉన్న నీలం సాహ్ని జూన్‌ 30న పదవీ విరమణ చేయనున్నారు. అయితే, ఈ కరోనా కష్టకాలంలో సీఎస్‌ విధులు కీలకమైనందున.. ఆమె పదవీ కాలం మరో ఆరునెలలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై కేంద్రం కూడా సానుకూలంగానే ఉన్నట్టు వార్తలొచ్చాయి. అయితే, ఇప్పుడు ఊహించని విధంగా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ రీఎంట్రీ ఇవ్వడంతో.. సీఎస్ పదవికి గండం ఏర్పడిందని అంటున్నారు. కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిమ్మగడ్డ వాయిదా వేయడం. ప్రభుత్వం పంతానికి పోయి.. ఆయన్ని ప్రత్యేక ఆర్డినెన్స్‌ ద్వారా తొలగించి, ఆయన స్థానంలో కనగరాజ్‌ని నియమించడం. తాజాగా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ ‌ని కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించడం.. ఇవన్నీ తెలిసినవే. అయితే, నిమ్మగడ్డ రీఎంట్రీతో కొంతమంది అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసే సమయంలో కొంతమంది అధికారులపై చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని అప్పట్లో ఆదేశించారు. అయితే ఆదేశాలను చీఫ్‌ సెక్రెటరీ నీలం సాహ్ని అమలు చేయలేదు. నిమ్మగడ్డని తొలగించడంతో ఆయన ఆదేశాలు మరుగునపడ్డాయి. కానీ, ఇప్పుడు ఆయన రాకతో, ఆ ఆదేశాలు అమలవుతాయని అధికారాలు భయపడుతున్నారు. ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ జారీ చేసిన ఆదేశాలను ప్రస్తుతం సీఎస్ పక్కన పెట్టే పరిస్థితి లేదంటున్నారు. ఒకవేళ పక్కన పెడితే, ఆమె పదవికే గండమంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇలానే ఈసీ ఆదేశాలను పక్కన పెట్టినందుకు అప్పటి సీఎస్‌ పునేఠాని ఏకంగా విధుల నుంచి తప్పించి, ఆయన స్థానంలో ఎల్‌వీ సుబ్రహ్మణ్యంని తీసుకొచ్చారు. ఈసీ ఆదేశాలను పక్కన పెడితే, నీలం సాహ్నికి కూడా పునేఠా విషయంలో జరిగినదే పునరావృతమయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో సీఎస్‌ నీలం సాహ్ని.. అధికారులకు సంబంధించి నిమ్మగడ్డ‌ జారీచేసిన ఆదేశాల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

జగన్ గారి ఏడాది పాలన.. కోర్టు మొట్టికాయలు, భూకబ్జాలు, మంత్రుల బూతులు

వైఎస్ జగన్ ఏడాది పాలనపై టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. జగన్ ఏడాది పాలన కోర్టు మొట్టికాయలు, భూకబ్జాలు, స్కాములు, మంత్రుల బూతులు, దౌర్జన్యాలు అంటూ విరుచుకుపడ్డారు. "వైఎస్ జగన్ గారి ఏడాది పాలన గురించి చెప్పాలంటే 65 కోర్టు మొట్టికాయలు, రాజ్యాంగ అతిక్రమణలు,కోర్టు ధిక్కారాలు, జాతీయ స్థాయిలో తుగ్లక్ ప్రభుత్వం,తీవ్రవాద ప్రభుత్వం అంటూ వచ్చిన బిరుదులు,భూకబ్జాలు, స్కాములు, మంత్రుల బూతులు,భజనలు,దౌర్జన్యాలు అని చెప్పుకోవాలి." అని విమర్శించారు. "ఇక ప్రజల బాగు విషయానికి వస్తే 60 మంది నిర్మాణరంగ  కార్మికులు, 65 మంది రాజధాని రైతులు, 750 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు.160 రోజులుగా అమరావతి కోసం మహిళల ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమం కొనసాగుతూనే ఉంది. గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడుతున్నారు." అని పేర్కొన్నారు. "బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ దగాపడ్డారు. ఇంతమందిని నమ్మించి మోసం చేసి బాధపెడుతూ ఏడాది పాలన అంటూ పండగలు చేసుకుంటున్నారంటే శాడిజం కాక ఇంకేంటి? ఇకనైనా పాలకులు పాలన అంటే ఏమిటో తెలుసుకోవాలి. తెలుగువారి పరువుతీయకుండా పాలించాలి." అంటూ లోకేష్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు.

వలంటీరు వేధింపులు భరించలేక.. మాజీ మంత్రి డ్రైవర్ ఆత్మహత్య

విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం నునపర్తిలో దారుణం జరిగింది. మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి కారు డ్రైవర్ సన్యాసినాయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. అంతకుముందు తానెందుకు ఆత్మహత్య చేసుకుంటున్నదీ వివరిస్తూ బంధువులకు నాయుడు ఆడియో మెసేజ్ పంపాడు. వలంటీర్‌ జాగరపు నర్సింగరావు వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అందులో పేర్కొన్నాడు. నాయుడి మృతితో.. కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వలంటీర్‌పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

ఇన్ని విషాదాల్లో వైసీపీ ఏడాది పాలన ఉత్సవాలా?.. ఏం సాధించారని?...

వైఎస్ జగన్ ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి నేటికి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో వైఎస్ ఏడాది పాలనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. "వైసీపీ పాలనకు ఏడాది పూర్తయ్యింది. కొత్త ప్రభుత్వం, అనుభవం లేని ముఖ్యమంత్రి కాబట్టి 6నెలల వరకు ప్రభుత్వానికి సహకరించాలని అనుకున్నాం. కానీ తొలిరోజు నుంచే వైసీపీ పాలకులు అరాచకాలు మొదలుపెట్టారు." అని విమర్శించారు. "ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టిన విధ్వంసాన్ని ఏడాది మొత్తం యధేచ్ఛగా సాగించారు. సమాజానికి చెడు చేసే చర్యలను, ప్రజా వ్యతిరేక పాలనను తెలుగుదేశం సహించదు. అలాగే ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఘోరంగా విఫలం అయ్యారు. అవివేక నిర్ణయాలతో నమ్మిన ప్రజలనే నట్టేట ముంచారు." అని మండిపడ్డారు. "రైతులు, పేదలు, మహిళలు, రైతుకూలీలు, భవన నిర్మాణ కార్మికులు, యువత... ఇలా  అన్నివర్గాల ప్రజలను రోడ్డెక్కించారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది కుటుంబాలు 164 రోజులుగా అమరావతి పరిరక్షణ కోసం చేస్తున్న ఆందోళనలే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం." అని పేర్కొన్నారు. "ఇటు న్యాయం కోసం అమరావతి ప్రజలు, అటు విశాఖలో విషవాయు బాధితులు, మరోవైపు కరోనాతో కర్నూలు వాసులు, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు లేక రైతులు, ఉపాధి కోల్పోయిన నిర్మాణ కార్మికులు, పెట్టుబడులు వెనక్కి పోయి ఉద్యోగాలు లేని యువత. ఇన్ని విషాదాల్లో వైసిపి ఏడాది పాలన ఉత్సవాలా..? ఏం సాధించారని...? ఎవరికేం ఒరగబెట్టారని..?  ఇకనైనా బాధ్యతగా పనిచేయండి." అని చంద్రబాబు హితవు పలికారు.

శ్రామిక్ స్పెషల్ రైళ్లలో 80 మంది వలసకార్మికులు మృతి

లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు ప్రభుత్వం శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. రైల్వేశాఖ మే 1నుంచి 27వతేదీ వరకు దేశంలో 3,840 శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడిపి, దాదాపు 50 లక్షల మంది వలసకార్మికులకు వారి స్వస్థలాలకు చేర్చింది. అయితే ఈ రైళ్లలో ఇప్పటి వరకు 80 మంది మరణించారు. మే 9 నుంచి 27 వరకు నడిపిన శ్రామిక్ స్పెషల్ రైళ్లలో 80 మంది వలసకార్మికులు మరణించినట్టు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సమీక్షలో వెల్లడైంది. ఎక్కువగా, దీర్ఘకాల జబ్బులతో బాధపడుతున్న వలసకార్మికులు రైలు ప్రయాణంలో మరణించారని రైల్వే శాఖ ప్రకటించింది. అయితే, రైళ్లలో భోజనం దొరక్క మాత్రం ఎవరూ మరణించలేదని తెలిపింది. కాగా, రైళ్లలో ప్రయాణించే వలస కార్మికుల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే రైలును ఆపి సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు.

తెలంగాణలో ఒక్కరోజే 169 కరోనా కేసులు నమోదు

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 169 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అలాగే, శుక్రవారం కరోనాతో నలుగురు మృతి చెందారు. దాంతో మరణాల సంఖ్య 71కి చేరింది. ఇక కొత్తగా నమోదైన 169 కేసులలో, స్థానికంగా 100 కేసులు నమోదు కాగా, బయటి నుంచి వచ్చినవారిలో 69 మందికి కరోనా నిర్దారణ అయింది. ముఖ్యంగా, జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కరోజులో 82 మందికి కరోనా నిర్ధారణ కావడం అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో గత మూడు రోజుల్లోనే 400 కు పైగా కేసులు వచ్చాయి. మే 27న 107, మే 28న 158, మే 29న 169 కేసులు.. ఇలా రోజూ 100కు పైగా కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

టీటీడీ ఆస్తులు అమ్మాలని వైవీ సుబ్బారెడ్డిపై జగన్ ఒత్తిడి.. జేసీ సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఏపీకి జగన్ లాంటి సీఎం మళ్లీ దొరకడని, జగన్ ఏడాది పాలనకు వందకు ౧౧౦ మార్కులు వేస్తానని ఎద్దేవాచేశారు. జగన్ నిరంకుశ ధోరణి, పట్టుదల పరాకాష్ఠకు చేరాయని, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పే దీనికి ఉదాహరణ అని అన్నారు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనే నైజాన్ని జగన్ వదులుకోవాలని సూచించారు. రాజ్యాంగం జోలికి వెళ్తే ఇలాంటి తీర్పులే వస్తాయనే విషయం ప్రభుత్వానికి కూడా తెలుసని, అయినా మొండి వైఖరితో ముందుకు సాగుతోందని అన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్ళడం ప్రభుత్వం ఇష్టమన్నారు. టీటీడీ ఆస్తులు అమ్మాలంటూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై జగన్ ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు. జగన్ రాముడో, రావణుడో ప్రజలే తేల్చుకోవాలని జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

హైకోర్టు తీర్పు పై హాట్ కామెంట్స్

ఏపీ ఎలక్షన్ కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి నియమించాలన్న ఏపీ హైకోర్టు తీర్పు పై వివిధ పార్టీల నాయకులు స్పందించారు. ఈ తీర్పు పై బీజేపీ ఎంపీ జివిఎల్ నరసింహారావు స్పందిస్తూ ప్రభుత్వాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి ఎదురుదెబ్బలు తప్పవన్నారు. ఈ విషయాన్ని వైసీపీ ప్రభుత్వం గుర్తిస్తే మంచిదని అయన హితవు పలికారు. రాజ్యాంగ వ్యవస్థలో ప్రభుత్వాలకు పరిమితమైన అధికారాలే ఉంటాయని, అన్నీ తామై వ్యవహరించాలనుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని అయన హెచ్చరించారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఈ తీర్పు పై వ్యాఖ్యానిస్తూ ఇది ముందుగా ఉహించిందేనన్నారు ఎన్నికల కమిషనర్ పదవి కాలాన్ని తగ్గిస్తూ జగన్ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సును హైకోర్టు కొట్టేయడాన్ని అయన స్వాగతించారు. తమిళనాడు హై కోర్ట్ కూడా 2006లో ఇలాంటి తీర్పే ఇచ్చిందని, రాజ్యాంగ బద్ద పదవుల పదవీ కాలాన్ని తగ్గించే ఆర్డినెన్సులు చెల్లవని స్వయంగా వైసీపీ ఎంపీ స్పష్టం చేసారు. కోర్ట్ లకు ఈ ఆర్డినెన్స్ ను కొట్టేయడం మినహా వేరే మార్గం లేదన్నారు ఇప్పటికైనా ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహాలు,సూచనలతో ఆడగు ముందుకు వేయాలని అన్నారు. హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడం జగన్ కి కొత్త కాదని, రోజు వారీ మొట్టికాయల్లో కేవలం ఇది ఒకటని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే అనిత అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి కులాన్ని ఆపాదించడం దారుణమన్న ఆమె ఎన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నా, జగన్ సర్కార్ చలించడం లేదని మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని, అతని మంత్రి వర్గాన్ని పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయాలని ఆమె అన్నారు.