తెలంగాణలో ఒక్కరోజులో 500 కేసులు.. ప్రతి ఐదు శాంపిళ్లలో ఒకటి పాజిటివ్
posted on Jun 20, 2020 @ 10:08AM
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ఒక్కరోజులో దాదాపు 500 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 499 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు మొత్తం 2,477 శాంపిల్స్ ను పరీక్షించగా 499 మందికి కరోనా నిర్దారణయింది. అంటే, ప్రతి ఐదు శాంపిళ్లలో ఒకటి పాజిటివ్ గా వచ్చింది. ఇదే మరింత ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో 15,000 శాంపిల్స్ కి 400 కేసులు అలా నమోదవుతున్నాయి. కానీ, తెలంగాణలో 2,477 శాంపిల్స్ కే 499 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కరోనా తీవ్రత మరింత కలవరపెడుతోంది. గత 24 గంటల్లో నమోదైన 499 కేసుల్లో.. గ్రేటర్ హైదరాబాద్‌లో 329, రంగారెడ్డి జిల్లాలో 129 ఉన్నాయి. గత 24 గంటల్లో ఈ రెండు జిల్లాల్లోనే 458 కేసులు నమోదయ్యాయి.